top of page

నీవు లేక నిముషమైన నిలువజాలనే..


'Nivu Leka Nimushamaina Niluvajalane' - New Telugu Story Written By Parupalli Ajay Kumar

'నీవు లేక నిముషమైన నిలువజాలనే' తెలుగు కథ

రచన: పారుపల్లి అజయ్ కుమార్

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

"నీకౌగిలిలో తలదాచి

నీచేతులలో కనుమూసి

జన్మజన్మకు జతగా మసలే

వరమే నన్ను పొందనీ"


సీడీ ప్లేయర్ నుండి పాట వస్తున్నది మంద్ర స్వరాన.


ఆగదిలో డబుల్ కాట్ మీద కృష్ణారావు ఎదపై తలపెట్టి పడుకొని వున్నది శాంత.


"రాణీ" పిలిచాడు కృష్ణారావు.


శాంత పలకలేదు.


"రాణీ"మరోసారి మృదువుగా పిలిచాడు.


" వూ " అంది కళ్లు తెరవకుండానే.


"మీ ఆడవాళ్లు ఎంత స్వార్ధపరులో !"


" దేనికో ?"


"ఆపాట వింటున్నావా? "


"వూ"


"మా కన్నా ముందుగా వెళ్లిపోవాలన్న ఆరాటం, మమ్ములను ఒంటరి చేసి మీరు సుఖంగా పోవడం స్వార్థం కాదా మరి. "


శాంత కృష్ణారావు యెదపై ఉంచిన తలను ఎత్తి అతని కళ్లల్లోకి సూటిగా చూసింది.


ప్రేమానురాగాలను చిలుకరిస్తున్న ఆ కళ్ళను చూసి రెండు కళ్లపై ముద్దులు పెట్టింది శాంత.


"పెళ్లయిన ప్రతి ఆడది సుమంగళిగానే పోవాలని కలలు కంటుంది. ఆ భాగ్యం అందరికీ లభించదు. ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అనేది నేను చిన్నప్పటినుండి విన్న మాటలు. "


కృష్ణారావు శాంతను సుతిమెత్తగా రెండు చేతులతో కౌగిట బంధించి శాంత పాపిట్లో ఎర్రగా మెరుస్తున్న కుంకుమను చూస్తూ నుదిటిపై ముద్దు పెట్టాడు.


శాంత సిగ్గుపడుతూ రెండు చేతులతో ముఖాన్ని దాచుకుంది.


"రాణీ, నువ్వలా సిగ్గుపడుతుంటే.. " ఆమె చేతులను తొలగిస్తూ అన్నాడు.


"వూ" అంటూ ప్రశ్నార్ధకంగా చూసింది.


కిటికీలో నుండి లోపలికి వస్తున్న వెన్నెలను, శాంతను మార్చి మార్చి చూస్తూ జాబిల్లిలా చల్లగా నవ్వాడు.


అతని నవ్వులను చూస్తూ మైమరచిపోయింది శాంత.


"మన మొదటిరాత్రి జ్ఞాపకముందా రాణీ?"


"అది మరచిపోతే కదా ఙ్ఞాపకం తెచ్చుకోటానికి. ప్రతి నిమిషం, ప్రతీ క్షణం అది నామనసులో కదలాడుతూనే వుంటుంది " అంటూనే సిగ్గు ముంచుకు రాగా కృష్ణారావు గుండెలపై తల దాచేసింది.


"ఆ రోజు కూడా ఇలాగే వెన్నెల మనకోసం విరబూసింది. ఆ రోజు, ఈ రోజూ కాకతాళీయంగా నిండుపున్నమి రాత్రులే. " అన్నాడు.


శాంత తల ఎత్తకుండానే "వలపుల వెన్నెల.. జతకలిపే వెన్నెల.. " చిన్నగా హమ్మింగ్ చేసింది,

అతని ఎదపై వెంట్రుకలను మెలిపెడుతూ.


"అవును మనిద్దరిని జతకలిపిన వెన్నెల ఇది. ఆరోజు నెమలికంఠం రంగుచీర కట్టుకొని, సంపంగి పూలజడతో పాలగ్లాసు తీసుకుని నువ్వు గదిలోకి రాగానే వెన్నెల చిన్నబోయింది నీవొంటి మెరుపులు చూసి.


నిన్ను చూసిన ఆనందంతో నా మనసు మూగబోయింది. నువు మెల్లగా నడిచి వస్తుంటే నీ పదద్వనులు నా గుండెల్లో సరిగమలై పలకరించాయి. నీ కాలి మువ్వల రవళులు వేణుగానంలా వినిపించాయి. నిన్ను అలా చూస్తుండి పోయాను ఒక నిమిషం పాటు.


నిన్ను దరిచేరి నీ భుజాలపై చేయి వేయగానే విద్యుత్ తరంగాలు ప్రవహించాయి మేనంతా.

ప్రకంపనలతో కంపించి పోయాను. నిను సందిట పొదుపుకొని పందిరి మంచం దగ్గరికి నడిపించుకుని వెళ్లాను. నీవు ఒక్కసారిగా నా సందిట నుండి క్రిందికి జారి నా పాదాలపై పడి ఏడ్చేసావు.

నేను కంగారుగా నిను లేవనెత్తి 'ఏమయింది రాణీ' అన్నాను.


మూడు నిమిషాలపాటు నువ్వు ఏడుపును ఆపనేలేదు.

నా భుజంపై తలవాల్చి వెక్కుతూనే వున్నావు. "


కృష్ణారావు మాటలను ఆపుతూ శాంత అంది

"అది ఏడుపు కాదు. నా హృదయంలో ఉవ్వెత్తున ఎగిసిన సంతోష తరంగాలు కన్నీరై జాలువారాయి.

నువ్వెక్కడ ? నేనెక్కడ? కులం, గోత్రం లేకుండా అనాధగా శరణాలయంలో పెరిగిన నన్ను ప్రేమించి మీ వారినందరినీ ఒప్పించి నన్ను నీ దానిగా చేసుకున్నావ్. కలలో కూడా ఊహించని వరాలను ప్రసాదించిన నీవు దేవదేవుడి కన్నా ఎక్కువ నాకు. "


"రాణీ, అటువంటి మాటలు మాట్లాడవద్దని ఎన్నోసార్లు చెప్పాను. ఈ కులాలు, మతాలు మనం సృష్టించుకొన్నవే. కొంతమంది తమ స్వార్థం కోసం వీటినివాడుకుంటున్నారు. నన్ను పెళ్లిచేసుకోమని అడిగినప్పుడు నువ్వు ఒకేఒక మాట అన్నావు గుర్తుందా? మా వారందరు ఒప్పుకుంటేనే పెళ్లికి సిద్ధం అని. అదిగో అక్కడే పడిపోయాను నీ ప్రేమ వాహినిలో.

అప్పుడే అనుకున్నాను, నా జీవితంలో నీకు తప్ప వేరెవరికీ చోటు ఇవ్వకూడదని.

మా అమ్మా నాన్నలను బ్రతిమిలాడి ఒప్పించి నీ చేతిని అందుకున్నాను.

నా జీవితంలోకి నవవసంతంలా అడుగు పెట్టావు.


ఆనాటి రాత్రి నిన్ను ఓదార్చటంలోనే తెలవారుతుందేమోనని ఇంచుక భయపడ్డాను కూడా.

కొంతసేపటికి నువ్వు తేరుకున్నావు. ఆరిపోయి చల్లగా అయిన పాలనే అమృతంలా సేవించాము చెరిసగం. గడపబోయే జీవితమంతా వేయి తీపి రాత్రులు గా సాగాలని తియ్యటి లడ్డు నా చేత తినిపించావు. సగంకొరికి మిగిలిన సగం నీనోటికి అందించాను. " అంటూ ఆగి

కృష్ణారావు మంచినీళ్ల బాటిల్ తీసుకుని తాగాడు.


శాంత అందుకొంది

"నాపెదవులపై నీచేతి వేళ్ళు తాకగానే నన్ను నేను మరచిపోయాను. తమకంతో, తన్మయత్వంతో మిమ్ములను అల్లుకుపోయాను. నా మనసు ఏనాడో మీ వశమైంది. ఆ రోజు నా తనువంతా మీకర్పణ చేసాను. మీ చేతి వేళ్ళు నామేనును వీణగా చేసి మీటాయి. శరీరమంతా రక్తం ఉరుకులు, పరుగులు పెడుతున్నది. నా పెదవులపై నీ పెదవులు దాడి చేసాయి. నా జీవితంలో నేనందుకున్న తొలిముద్దు ఇప్పటికీ మరచిపోలేను. నుదిటినుండి మొదలెట్టి కాలిబొటన వేలుదాకా ముద్దులతో ముంచెత్తావు. "

మనసులో ఆనాటి మధురస్ర్ముతులు గుర్తుకురాగా శాంత తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది.


కృష్ణారావు కొనసాగించాడు.

"నా మనసు ఆనందడోలికలలో తేలిపోయింది. నిన్ను మరొకసారి గట్టిగా కౌగిలించుకున్నాను.

ఆ రేయంతా నా కౌగిలిలోనే నిను పొదుపుకున్నాను. ఒకరి కౌగిలిలొ ఒకరం ఒదిగిపోయి ఎన్నెన్నో ఊసులు చెప్పుకున్నాం. మన రసరమ్య శృంగార రాజ్యానికి నువు రాణివి. నేను రాజును. మనం ఏకాంతంగా ఉన్నప్పుడు నీవు రాజా అనే పిలవాలి. నిన్ను నేను రాణీ అని పిలుస్తాను అని అన్నాను. ఆ రాత్రంతా మనం నిదురే పోలేదు.


ఎన్ని కబుర్లు, ఎన్ని ముచ్చట్లు.. భావి జీవితాన్ని గురించి ఎన్నో కలలు కన్నాము. పుట్టబోయే పిల్లల గురించిన మాటలు, మనవళ్ల గురించిన మాటలు.. అవన్నీ నిన్నో, మొన్నో జరిగినట్లు అనిపిస్తున్నాయి. కాలం ఎంత తొందరగా ముందుకు పోతుంది. నువ్వు నా ప్రక్కన ఉంటే కాలమెలా గడిచిందో తెలియనంత యిదిగా గడిచిపోయింది. కాలం వెనకకు నడచి మనల్ని మళ్ళీ మొదటి రాత్రి దగ్గర నిలబెడితే బాగుండునని అనిపిస్తుంది నాకు"


కృష్ణమూర్తి మాటలకు చిన్నగా నవ్వింది శాంత.

"పాలుతేనెలా కలసిపోయి అనురాగ జలధిలో ఓలలాడాం. ఎంతో సంతృప్తి కరమైన జీవితాన్ని గడిపాం. మెదటిరాత్రి మనం కన్నకలలన్నీ నెరవేర్చుకున్నాం. ఇంకా ఏంకావాలి రాజా మన జీవితాలకు?ఎందరికో గాని దక్కని సుఖసంతోషాలు, అనురాగాలు, ఆప్యాయతలు మన ఇంట సిరులై కురిశాయి. చూడముచ్చటగా వున్న కుటుంబం మనది.


ఎన్ని జన్మల నోము ఫలమో దైవం లాంటి మీరు భర్తగా లభించారు. రత్నాల లాంటి పిల్లలు కలిగారు. మంచి నడవడిక తో పిల్లలు పెరిగి పెద్దవారు అయ్యారు. మంచి చదువులు చదివి పెద్దపెద్ద ఉద్యోగాలు సంపాదించి జీవితంలో ఘనంగా స్థిరపడ్డారు. మనవళ్ళ, మనుమరాళ్ళ ముద్దుముచ్చట్లు చవిచూశాము. ముది మనవళ్ళను కూడా ఎత్తుకొని ఆనందించాం.


జీవిత చరమాంకం లోకి చేరుకున్నాము. నిర్మలంగా, నిశ్శబ్దంగా మృతుదేవత

కోసం ఎదురుచూడటమే ఇక. నీ వొడిలో సునాయాస మరణాన్ని ప్రసాదించమని ఆ దేవదేవుడిని ప్రార్ధించటంకన్నా నేను చేసేది చేయగలిగేది ఏదీ లేదు. " సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించిన ఆనందంతో శాంత అంది.


శాంత మాటలకు కలవరపడుతూ కృష్ణమూర్తి "అలా అనొద్దు" అంటూ శాంత నోటికి అరచేయి అడ్డుంచాడు.


శాంత ఆ అరచేతిని తన చేతులతో పట్టుకుని

"మీరు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఈ భూమ్మీద బ్రతకలేను. నా చిన్నప్పుడు తెలుగు మాష్టారు చెప్పిన కథ నా మనసులో నాటుకు పోయింది. 'గీత గోవిందం రచించిన జయదేవుడు భార్య పద్మావతి. జయదేవ కవి, లక్ష్మణశేన మహారాజ ఆస్థానంలో కవిగా వుండేవాడు.


ఒకనాడు పద్మావతి, రాణిగారి అంతఃపురంలో ఉండగా, ఒక సేవకుడు వచ్చి 'మహారాణీ! మీ సోదరుడు చనిపోయాడు. అతని భార్య సహగమనం చేసింది' అనే వార్తను వినిపించాడు.

రాణి చాలా దుఃఖించింది. పద్మావతి మౌనం చూసి, రాణి ఆమెను కారణం అడిగింది.

అప్పుడు పద్మావతి, 'మహారాణీ! పతిని ప్రాణంగా ప్రేమించే స్త్రీ తన భర్త మరణవార్త వినగానే ప్రాణం విడుస్తుంది. అంతేకానీ బలవంతాన సహగమనం చేసి ప్రాణాలు తీసుకోనవసరం లేదు' అంటుంది.


మహారాణికి అది విని చాలా కోపం వచ్చింది. తగిన సమయం వచ్చినప్పుడు ఆమె పతిభక్తిని పరీక్షించాలి అని భావించింది.


ఒక రోజు రాజుగారు జయదేవుడితో కలసి వేటకు వెళ్ళిన సమయంలో పద్మావతి, రాణిగారి అంతఃపురంలో ఉంది. వారిరువురూ మాటల్లో మునిగి ఉన్న సమయంలో,

ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ఒక చెలికత్తె వచ్చి,

'అమ్మా! మహారాణీ! రాజుగారు, కవిగారు వేటలో ఉన్న సమయంలో ఒక పులి వచ్చి మీద పడి కవిగారిని చంపివేసింది' అని చెప్పింది.


ఆ మాటలు చెవిన పడిన మరుక్షణమే. పద్మావతి ప్రాణాలను విడిచింది. '


అంతటి అదృష్టం ఎవరికి దక్కుతుంది? మనసా, వాచా, కర్మణా ఏకమైనా రెండు హృదయాల్లో ఒకటి ఆగిపోతే వెంటనే రొండవ గుండె కూడా ఆగిపోతుంది.


నేనూ అంతే. కాకపొతే చిన్న స్వార్థం. ముందుగా నేనే సుమంగళిగా

మీ ఒడిలో పోవాలని." అంది.


కృష్ణమూర్తి మరలా తన చేతులతో ఆమె నోరు మూసి

"నీవు లేకుండా ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను. బ్రతుకైనా చావైనా నీతోనే

నేనుంటా.'' అన్నాడు.


శాంత ఆ చేతిని పట్టుకొని చెంపలకు ఆనించుకుని "రాజా కాసేపు నీ వొడిలో పడుకుంటా" అంటూ కృష్ణమూర్తి ఒడిలోకి తలను చేర్చి మునగదీసుకొని పడుకొంది.


"రాణీ నన్ను నీ అవ్యాజమైన ప్రేమానురాగాలతోముంచెత్తావు. రత్నంలాంటి కొడుకుని, ముత్యంలాంటి కూతురిని ఇచ్చావు. ఈనాడు మన ఇల్లు మనవడు, మనవరాళ్లే కాదు, ముది మనమళ్లతో కూడా కళకళలాడుతున్నది" శాంత ముంగురులను నిమురుతూ కొనసాగించాడు.


" నువ్వూ నేనూ వేరు వేరు కాదు. నేనే నువ్వు, నువ్వే నేను. మనిద్దరం ఒకరికోసం ఒకరం పుట్టాము.

ఈ అదృష్టం ఎంతమందికి దక్కుతుంది. ఈ రోజు కార్యక్రమం నేను అసలు ఉహించనేలేదు.


' సహస్ర పూర్ణ చంద్రదర్శనం' నా జీవితంలో ఒక పండుగ లాగా జరుపబడుతుందని కలలో కూడా అనుకోలేదు. మనవరాలు చైత్ర నెట్ లో వివరాలన్నీ చూసి మనకు తప్ప మిగిలిన వారందరకీ చెప్పింది. ( సహస్ర పూర్ణ చంద్ర దర్శనం అనేది ఒక వ్యక్తి జీవితంలో 1000 పౌర్ణమిలను చూడటాన్ని సూచిస్తుంది. ప్రతి నెలలో ఒక పౌర్ణమితో, ప్రతి సంవత్సరం 12 పూర్తి నెలలు మరియు అధిక మాసం లెక్కల ప్రకారం షుమారు 82 సంవత్సరాలలో 1000 పౌర్ణమిలు వస్తాయి. )


అందరితో కలసి దీన్ని ఒక వేడుకలా, పెద్ద పండుగలా చేయాలనీ

మన కొడుకు, కూతురు మనకు చివరి నిమిషం వరకూ మనకు చెప్పకుండానే అన్ని ఏర్పాట్లు చేసారు. స్నేహితులకు, బంధువులకు తెలియచేసారు.


'ఏంటీ హడావిడి' అని నువ్వడిగావు.


అప్పుడే మనకు అసలు విషయం చెప్పారు. నువ్వు ఎంతో పొంగిపోయి చైత్రను మనసారా ముద్దిడి ఆశీర్వదించావు. అప్పటినుండి మొదలయింది పండుగ వాతావరణం మన యింట్లో..


తలంట్లు, క్రొత్తబట్టలు, వేదపండితుల మంత్రాల నడుమ మనకు జరిగిన వివాహక్రతువు, సత్యన్నారాయణ స్వామి వారి వ్రతము చేసుకోవటం, పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు పాదపూజలు చేయటం, ఆశీస్సులు పొందటం, గుడిలో అభిషేకాలు, హోమాలు, పూజలు, బ్రాహ్మణులకు

దశదానములు దానమివ్వటం, బంధుమిత్ర సకుటుంబసపరివారంగా విందు భోజనాలు..

వీటన్నింటితో బాగా అలసిపోయావు కదూ..


అయినా అలసటలోనే ఒకరకమయిన సుఖముంటుంది అని అంటావుగా అప్పుడప్పుడు.

ఈ రోజును తలుచుకుంటుంటేనే మనసు పులకరించిపోతున్నది.

రాణీ ఒక్కసారి ముద్దుగా 'రాజా' అని పిలవ్వా? నువ్వెన్ని సార్లు పిలిచినా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది నాకు. రాణీ నిద్రపోయావా " అంటూ శాంత బుగ్గలను తడిమాడు.


చేతికి చల్లగా అనిపించడంతో ఆదుర్దాతో "రాణీ " అని పిలుస్తూ శాంతను వొడిలో నుండి లేవదీసి ముఖంలో ముఖం పెట్టి చూశాడు.


ప్రశాంతమైన చిరునవ్వు పెదవులపైనిలిచిపోయింది.. చేతులలో వొదగలేక శరీరం జారిపోతున్నది."రాణీ, రాణీ" అని కృష్ణమూర్తి పిలుస్తున్నాడు..

దిగ్భ్రాంతిగా చూస్తున్నాడు.., వొణికిపోతున్నాడు.., పలవరించిపోతున్నాడు..


కర్తవ్యం స్ఫురించి పక్కనే ఉన్న సెల్ తీసి కొడుకుకు డైల్ చేసాడు.


"చిన్నా మీ అమ్మ.. మీ అమ్మ.. " అంటూ చెప్పలేక సెల్ ప్రక్కకు పెట్టి ఒక్కసారిగా బోరుమని విలపించాడు.


రాణీ " అంటూ శాంతను కౌగిలించుకున్నాడు అతృతగా.


నన్ను విడిచి నువ్వెక్కడికీ వెళ్లొద్దు అన్నట్లుగా శాంతను బిగియారా తన కౌగిట్లో బంధించేసాడు.


పిల్లలంతా అదుర్దాగా వచ్చి తలుపులు నెట్టి లోపలికి వచ్చేసరికే,


ఒకే ప్రాణమై

ఒకే ధ్యానమై

ఒకే దేహమై

ఒకరికి ఒకరై బ్రతకిన ఇద్దరూ

మమ్మల్ని మృత్యువు కూడా విడదీయలేదు అన్నట్లుగా

ఒకే కౌగిలిలో

విగత జీవులై కనిపించారు..


****************************

పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...

పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...

ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...

సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,

నవలలు చదవటం మరీ ఇష్టం ...

పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో

"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..

షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .

నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..

రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...

ఉచిత లైబ్రరీ ....

మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...

ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న

మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.

30 views0 comments
bottom of page