పగటింతల కల

'Pagatinthala Kala' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally
'పగటింతల కల' తెలుగు కథ
రచన: సుదర్శన రావు పోచంపల్లి
ఇందు శేఖర్, శివానిల ఏకైక పుత్రుడు సామీరి.
సామీరి చిన్నప్పటి నుండి తల్లి దండ్రి గారువముతో పెరుగుచూ అయినా చదువులో మెరుగే. పదహారు ఏండ్లు వచ్చేదాక చదువు మీదనే ధ్యాస తప్ప ఏ ఆలోచన లేకుండెడిది. పెరుగుచున్న కొద్ది తల్లిదండ్రులకు దూరమై తన అర్రలో ఒక్కడే కూర్చొని విద్యకు సంబంధించిన పుస్తకాలకు తోడు ఇతర నవలలు మున్నగునవి కూడా చదువనారంభించాడు-
విద్యకు సంబంధించిన పుస్తకాలైతె మనసుకెక్కించుకొని జ్ఞాపకమున నుంచుకోవలసినవి - కాని ఇతర రకరకాల నవలలో హాస్యము కాని, వింతలు గాని ఎవరితో నైన చర్చించుకుంటూ చదివితె అందులో ఆనందమే వేరు. ఒంటరి బ్రతుకుతో ఒక్కడే అర్రలో కూర్చొని చదువుకొనుటచే సామీరి దినదినము కృంగి పోతుంటాడు - అది తల్లి దండ్రులు గమనించినా కొడుకుకు పదహారేండ్లే కదా ఐనా చదువూ పూర్తికావాలె అని వాళ్ళూ వ్యాకుల పడుతుంటారు.
సామీరికి తమ్ముణ్ణో చెల్లెలినో కనే వయసూ దాటి పోయింది- వాళ్ళు చేసిన తప్పల్ల ఒక్క కొడుకు పుట్టగానే చాలనుకొని కుటుంబ నియంత్రణ పాటించడమే.
మానసికోల్లాసానికి చలన చిత్రములు చూతామన్నా ఇంటివారు ఎవరూ తోడు లేక అదీ నిస్పృహే - సామీరి ఎటూ తోచక చదివినంత సేపు చదివినా ఇక నిద్రే శరణ్యమని తలుస్తాడు- పుస్తకము చదువుచున్నా మనసుకెక్కక కూర్పాట్లు పడుచు అట్లనే నిద్రిస్తుంటాడు- నిండు నిదుర కాక.
మగత నిదుర అగుటచే ఏవేవో కలలు కంటూ ఉంటాడు. తోడు ఎవరూ లేనందున నిదురే శరణ్య మనుకుంటాడు సామీరి.
ఒకనాడు పుస్తకము చదువుచూ చదువుచూ నిద్రలోకి జారుకుంటాడు- ఆ నిదురలోనే ఒక కల కంటుంటాడు- అందమైన ప్రకృతి, ఆహ్లాదకర మైన వాతావరణము, పక్షుల కిలకిలరావాలు ఎంతో సంతృప్తి నిస్తుంది సామీరికి.
అప్పటికే సాయంత్రము ఐదు దాటిపోతుంది తల్లి వచ్చి సామీరీ ఇక లేచి ముఖము కాళ్ళు చేతులు కడుక్కో ఫలహారము చేసిన తిందువుగాని అంటుంది. నిద్రాభంగమై చక్కటి కల చెదిరిపోయినందుకు మనసులో బాధ పడుతాడు సామీరి. కలలోనైనా సంతృప్తి కలుగదాయె అనుకుంటాడు.
తల్లి చెప్పినట్టే కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని ఫలహారము తిని కాసేపు బజారుకు పోయి వస్తా అని వెళ్ళి పోతాడు సామీరి. అసలు ఎటని పోవాలి. ఎవరితో పోవాలి, ఎవరింటికి పోవాలి ఛీ ఒంటరి బ్రతుకంత దురదృష్టము వేరొకటుందదు అనుకుంటూ గమ్యమెరుగని మార్గములో నడుస్తుంటాడు సామీరి.
తలువని తలంపుగా దారిలో వసంత్ అనే తోటి విద్యార్థి కలుస్తాడు. ఎక్కడికి పోతున్నావు అని అడుగుతాడు వసంత్ సామీరిని-మీ యింటికే వస్తున్నాను అని అది వాస్తవము కాకున్నా చెబుతాడు సామీరి అనాలోచితంగా దారివెంట నడుస్తున్నాను అంటె బాగుండదు కనుక. వసంత్ కు నళిని అనే చెల్లెలుంటుంది-నేను మాచెల్లెలు కొరకు నోట్ పుస్తకాలు తేవడానికి పోతున్నా మధ్యలో నీవు కలిశావు అని అడుగకుండానే చెబుతాడు వసంత్.
పుస్తకాలు తీసుకొని పద మాయింటికి పోదాము అంటడు వసంత్- సరె అని వసంత్ వెంట నడుస్తాడు సామీరి.
ఇంటికి పోగానే మా తోటి విద్యార్థి పేరు సామీరి అని తలిదండ్రులకు పరిచయము చేస్తాడు వసంత్.
పరిచయము అయినందుకు తల్లి పేరు, తండ్రి పేరు తోబుట్టువులెందరు అని అడుగుతాడు వసంత్ తండ్రి దిలీప్.
తోబుట్టువులు లేరని చెప్పగానే ఒక్కనికి పొద్దెట్లు గడుస్తది అప్పుడప్పుడు మా యింటికి వస్తూపోతూ ఉండమని అంటుంది వసంత్ తల్లి జానకి. సరె పోయివస్తాను అంటాడు సామీరి-చాయ త్రాగిపొమ్మని బలవంతము చేస్తె విధిలేక కొంచెమే ఈయండి అని చాయ త్రాగి ఇంటికి బయలుదేరుతాడు సామీరి.
త్రోవలో అనుకుంటాడుసామీరి వసంత్ చెల్లెలు నళిని ఎంత చక్కగుంది. ఆ అందము ఆమె గొంతులోని మాధుర్యము ఆ చూపు -అసలు నేను కవిత్వము నేర్చుకుంటే ఎంత అందంగా వర్ణించే వాడినొ ప్ల్చ్ అనుకుంటూ ఇల్లు జేరుతాడు సామీరి.
ఆ అమ్మాయిని మరీ మరి చూడాలినిపిస్తుంది వసంత్ కు-వాళ్ళ అమ్మ రమ్మన్నది గదా ఆ మిషతో వాళ్ళింటికి పోతె ఏమనుకుంటరో మనసులో కించతో సతమతమౌతుంటాడు సామీరి..
ఇంటికొస్తె షరా మామూలె తన అర్రలో తాను తల్లి దండ్రి వ్యవహారములో వాళ్ళు- మళ్ళీ ప్ల్చ్ అనుకుంటాడు సామీరి.
రాత్రి భోజనము చేసి కాస్త చదువుకోవాలంటె మనసొప్పదు- ధ్యాస అంతా నళిని పైననే ఆమె అందమే కాక పేరులోనూ అందమే. అయినా నా పిచ్చిగాని నాకు కేవలము పదహారేళ్ళే మరీ మరీ చూసి పంచాంగమంత తిరిగేసినా ఒకటి రెండు నెలలు అటో ఇటో- గ్రాజువేషన్ కూడా పూర్తి కాకపాయె పిచ్చికి వయసుతో సంబంధము ఉండదు కదా అనుకుంటాడు సామీరి.
వయసును మించిన ఆలోచనలు పెట్టుకుంటూ సామీరి చదువుకు మాత్రం స్వస్తి చెప్పకుండా ఇంకా పట్టుదలతో చదువుతుంటాడు -భవిష్యత్తులో నళినే తనకు కాబోయే జీవిత భాగస్వామి కాగలదను ఆశతో-ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు గోవిందం అను సామెతలాగ.
పగటి వేళ నిదుర పోయిన నాడు కలలు పడడము సహజము- ఆ కలల గాలి సామీరికిపుడు నళిని వైపు మళ్ళింది. నళిని గురించి ఏవేవో కలలు కంటుంటాడు పగటింతల-రాత్రి వేళ కోరినా కలలు రావు సామీరికి.
ఒకనాడు పగటింతల కలలో తనకూ నళినికి పెళ్ళి జరిగినట్టు- ఏకాంత యాత్రకు పోయినట్టు కలగంటాడు సామీరి.
అదిగో ఇదిగో అని ఏవేవో నళినికి చూపుతూ నవ్వుతున్నట్లు నిద్రలోనే ఇతరులకు వినబడేలా ప్రవర్తిస్తాడు సామీరి.
ఎందుకో కలువరిస్తున్నాడు అనుకొని తల్లి నిదురనుండి లేపుతుంది సామీరిని. పైగా ఏమి కలగన్నావురా అని అడుగుతుంది తల్లి.
కమ్మని కల చెదిరెనమ్మా అంటూ సిగ్గుతో తలదించుకొని కాళ్ళూ చేతులూ ముఖము కడుక్కొని ముఖము తుడుచుకుంటూ ఫలహారము పెట్టమంటాడు తల్లిని. నేను అందుకే నిన్ను నిద్రనుండి లేపుదాము అనుకొని వచ్చిన నీవేమో గాఢ నిదురలో ఉండి కలువరిస్తున్నావు అనుకుంటూ వంటింట్లోకి పోయి ఫలహారం తెస్తుంది తల్లి శివాని.
పగటి కలలు నిజము కావు కాని తెల్లవారుఝామున కలలొస్తె నిజమౌతాయని ఎక్కడో విన్నాడు సామీరి- ఇక ఆ విశ్వాసం తో తెల్లవారుదనుక గాఢ నిదురకై ప్రయత్నిస్తాడు సామీరి-
ఎప్పుడైతె నళిని కంటపడ్డదో అప్పుడే తనకు ఒంటరినను దుగ్ధ తగ్గినట్టుగా భావిస్తాడు తనకు తెలియకుండానే సామీరి.
మొత్తము మీద ఆరేండ్లు గడిచిపోతాయి -తన చదువు కూడా ముగుస్తుంది -ఈ లోపల ఎన్నో సార్లు వసంత్ ఇంటికి పోయిరావడము- వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించడము చేస్తుంటాడు- నళినికి తనకు మాటలు కూడా కలిశాయి.
చివరకు పగటింతల కల నిజము కాదు అన్నట్టు నళిని వివాహము బెంగలూర్ లో ఉద్యోగము చేసే ప్రభాకర్ తో జరిగిపోగా నిచ్చేష్టునిగా ఉండిపోతాడు సామీరి.
తరువాత రెండేళ్ళకు సామీరి పెళ్ళి అంబుజ అను అమ్మాయితో జరిగి ఒంటరితనము దూరమౌతుంది సామీరికి.
***
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
https://www.manatelugukathalu.com/profile/psr
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.