top of page

పాపభీతి


'PapaBheethi' - New Telugu Story Written By Surekha Puli

'పాపభీతి' తెలుగు కథ

రచన: సురేఖ పులి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

ప్రఖ్యాతి గాంచిన వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉమకు రెండో తరగతి అడ్మిషన్ దొరికింది. వివిధ రకాల ఫీజులు, గేమ్స్, యాక్టివిటీస్, స్కూల్ బస్ అంతా మొత్తం రెండున్నర లక్షలు. స్కూల్ యాజమాన్యం మూడు వాయిదాల్లోని మొదటి వాయిదా కట్టించుకున్నారు. తెలుగు నేర్పని, తెలుగు రాష్ట్రంలోని పేరున్న పాఠశాల అది!


ఏదీ ఏమైనా, పన్నెండవ తరగతి వరకు సి. బి. యస్. సిలబస్; కోరుకున్నదీ, దొరకినదీ ఒకటే అయినందుకు మహాదానందం పొందారు సరళారమణలు, ఉమ తల్లిదండ్రులు.


“రమా, మారయ్య ఆవు పాలు కల్తీ పోస్తున్నాడు. ఫస్ట్ తారీకున రాతం పైసలు ఇచ్చేప్పుడు వార్నింగ్ యివ్వాలి.” సరళ భర్తతో ఫిర్యాదు చేసింది.


“ఫస్ట్ తారీకు వరకు ఎందుకు సరూ, ఈ రోజే అడుగుతాను. అడిగిన రేటు ఇస్తున్నప్పుడు కాంప్రొమైస్ ఎందుకు?” రమణ జవాబిచ్చాడు.


ఆవు, బర్రెల పాలమ్ముకుంటున్న మారయ్యను నిలదీశాడు.... చిక్కటి ఆవు పాలు పోస్తే సరి, లేకుంటే మేము వేరే చోట పాలు తీసుకుంటామని.

మారయ్య తల గోక్కున్నాడు.... గిరాకీ పోతే ఎన్నో నష్టాలు. ఎనిమిది మంది సంతానం, పశువులు వున్న దొడ్లోనే చిన్నపెంకుటిల్లు. ఇరుకుల బ్రతుకయినా, ఏదో కాలం గడుస్తున్నది. అడిగినప్పుడల్లా కప్పెడు నిల్వ తొక్కు, వడియాలు, చల్ల మిరపకాయలు, రెండు నెలలు మాత్రమే వాడిన (పాత) బట్టలు, పండగలకు పిండి వంటలు యిచ్చే ఇంటిని వదులు కోవటము సరి కాదు.


అందుకే, “అయ్యా, మన ఇంటికాడికి పాలు తెచ్చి పోయాలంటే ఐత లేదు. పొద్దుగాల ఐదుకైనా, పొద్దుగూకంగా ఐదుకైనా ఇంటికాడికి వస్తే, మీ ముంగటనే పిండిన పాలు పోస్తా. నేను పాలల్ల నీల్లు కలపనయ్య, ఏమో మా పోరగాండ్లు దార్ల నీల్లు కల్పి, పైసలు కొన్క బుక్కుతరేమో. ”


“పొద్దున పూట టైమ్ దొరకదు, సాయంత్రం మేమేవరమైనా వస్తాము. ఈ సారి కంప్లయింట్ వస్తే మాత్రం, మేము నీ వద్ద పాలు మానేస్తాము. ”


“సరూ, ప్రతీ రోజు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఉమను పాలక్యాన్ యిచ్చి మారయ్య వద్దకు పంపించు, నేను ఇంటికి వచ్చేసరికే ఆలస్యం అవుతుంది కదా.”


“చిన్న పిల్ల, అదేందుకు, నేనే వెళ్ళడానికి ట్రై చేస్తాను.”


“మూడ్నెళ్ల ఉష నెత్తుకుకొని వెళ్ళడం కరెక్ట్ కాదేమో, కిటికీ నుండి నువ్వు ఓ కంట కనిపెడుతూ వుండు, ఉమ పాలకు వెళ్లి-రావడం. మరేం ఫరవాలేదు. ధైర్యం గలదే ఉమ.” తండ్రికి బిడ్డపై భరోసా!


వంటింటి కిటికీ నుండి రోడ్డున వెళ్లే దారి వైపు చూస్తే పశువుల కొట్టం కనబడుతుంది. అనుకున్న ప్రకారం ప్రతీ దినమూ ఆవు పాలు తెచ్చే డ్యూటి సక్రమంగా సాగుతుంది.


మారయ్య పెద్ద కొడుకు ఇరవై ఏళ్ళ ఈరయ్య ఉమ చేతికి పాలు భద్రంగా అందిచే వాడు. మారయ్య రెండో కొడుకు కిష్టయ్య పశువుల దాణ కలుపుతాడు. మారయ్య భార్య రాములమ్మ పిల్లల్ని జన్మనిచ్చే యంత్రంగా మారి, పుట్టే పిల్లల సంరక్షణలో నియుక్తురాలైనది. ఈరయ్య భార్య లచ్చిమి ఇంటి కోడలిగా ఇంటిల్లిపాదికి వంట పనితో పాటు పశువుల శుచి- శుభ్రత క్కూడా యిన్చార్జ్.


లేగదూడను ఓ వైపు కట్టేసే ఆవుకు దాణ పెట్టి పాలు తీసే వైఖరి ఉమకు నచ్చలేదు. అదే విషయం వారితో అంటే, నవ్వి వూరకున్నారు.


“అమ్మా, ఆకలేస్తే ఉష నీ పాలు తాగుతుంది. పాపం లేగదూడకు ఆకలేస్తే, దాని మూతికి చిన్న నెట్ కట్టి, ఆవు పాలను మనము తీసుకోవటం రాంగ్ కదా?”


“మెల్లిగా లేగదూడకు దాణా అలవాటు చేస్తారు, లేకుంటే మరి మనకు పాలు వుండవు కదమ్మా. ”


“పోతే పోనీ, షాప్లో పాకెట్ పాలు కొనుక్కుందాం. ”


నవ్వుకుంది సరళ. "తరువాత మాట్లాడదామా, ముందు చదువు కోవాలి. ” అని స్కూల్ డైరీ తీసింది.


“హోమ్ వర్క్ ఏమీ లేదు. అంతా స్కూల్ లోనే కంప్లీట్ చేశాను.”


“వెరీ గుడ్. మరి తెలుగు నేర్చుకుందాం. అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ…. ఈ పదాలు నువ్వు ఈ రోజు నేర్చు కోవాలి.” ఇంట్లో తెలుగు అక్షరాల వరకు నేర్పిన సరళ అన్నది.


“తెలుగు మామ్ గారూ... మీరు నాకు ఓన్లీ తెలుగు అక్షరాలు చెప్పారు, వాటితో వచ్చే వర్డ్స్ చెప్పండి.” చిలిపిగా అంది ఉమ.

“స్టూడెంట్ గారూ, అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ.. ఇదే విధంగా నేర్చుకుంటారు.” అదే ఫక్కీలో సమాధానం వచ్చింది.


“మా ఇంగ్షీషు మామ్ వర్డ్ డ్రిల్లింగ్ ఈసీగా చెబుతారు. నాకు అలాగే యిష్టం.”


“సరే, నువ్వు నేర్చుకున్న తెలుగు అక్షరాల నుండి రెండేసి, మూడేసి అక్షరాలతో కొన్ని పదాలను రాసి చూపించు.”


ఉమ ముందుగా తెలుగు అక్షరాలను రాసి, అమ్మ చెప్పిన పరీక్ష జవాబును రాసింది: అల, ఆశ, ఇల, ఈత, ఉష, ఓడ, కల, జడ, తల, క్షమ; ఊయల, కమల, గడప, జలజ, పనస, నడక, మమత, రమణ, వనజ, సరళ.


కూతురు రాసిన మాటలన్నీ కరెక్ట్, తనలో తానే నవ్వుకుంది. “గుణింతాలు, వత్తులు నేర్పుతాను.”


“అమ్మా, ప్లీజ్, నేను షో కేసులోని ‘ఆవు-దూడ’ బొమ్మ డ్రాయింగ్ వేస్తాను.”


“సరే.” కూతురిని కాదనలేక పోయింది.


*****


రెండు రోజుల నుండి ఉషకు జ్వరము. డాక్టర్ సలహా మేరకు సరళ మందులు వేస్తూనే వుంది. ఎందుకో ఉమ కూడా ముభావంగా, డల్గా వుంది. ఇంట్లో ఒకరకి జ్వరం వస్తే చాలు, అందరూ జాగ్రత్తగా వుండాలి. ఎంత అప్రమత్తంగా వున్నా సూక్ష్మజీవి వైరస్ బాక్టీరియాకు తల ఒగ్గాల్సిందే!


"అమ్మా, ఆవులు మేతకు వెళ్ళి, ఇంకా రాలేదు. కొంచెం ఆగి రమ్మన్నారు. నేను చదువు కోవాలి, ఉషను నేను చూస్తాను. నువ్వే వెళ్ళు." ఉమ బదులు సరళ పాలకు వెళ్ళింది.


ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన రమణ అనుమానంగా పెద్ద పాప నుదురు చూసి థెర్మమీటర్తో జ్వర లక్షణాలను పరిశీలించాడు. అంతా బాగానే వుంది. మరి ఉమలో నిస్సత్తువ ఏమిటి?


“డాక్టర్ వద్దకు వెళ్దాము.” అన్నాడు.


“నేను రాను నాన్నా.” తండ్రి పట్ల గౌరవంగా వుండే ఉమ చిరాగ్గా చెప్పింది. మొదటిసారి కూతురి తిరస్కార స్వరానికి చకితుడయ్యాడు రమణ.


తెలివి తేటలున్న పసిపిల్లలను దండిస్తే దండుగ. అందుకే, “ఉమా, నా పండూ, ఏమైందీ రోజు, ఎందుకు ఇంత చిరాకు, అందులోనూ నీ డియర్ నాన్న మీద ఎందుకీ అలక?” అని కూతుర్ని దగ్గరగా తీసుకున్నాడు. విశాలమైన నాన్న ఛాతీపైన ఒదిగి, బుజం పైన తల ఆన్చి కొద్ది సేపు వరకు అలాగే సేద తీర్చుకుంది. వున్నట్టుండి వెక్కి వెక్కి కన్నీరు పెట్టుకుంది చిన్నారి ఉమ.


టెంపరేచర్ పాపకు కాదు, పెద్దలకు మొదలైంది. కళ్ళు తుడిచాడు, “ఏడుపు మానేసి, ఏం జరిగిందో చెప్పు తల్లీ.” లాలనగా అడిగాడు తండ్రి. ఒక చేతిలో జ్యూస్ గ్లాస్, మరో చేతిలో మంచి నీళ్ళ గ్లాస్తో ఉమకు చేరువైంది తల్లి.


“ఉమా, ముందు నీకు కావాల్సిన గ్లాస్ తీసుకో…తరువాత నీ ప్రాబ్లం చెప్పు.” కూతురు కన్నీటికి తల్లి మనసు తల్లడిల్లినది.


కళ్ళ తుడుచుకొని, మంచి నీళ్ళు తాగి, “నేను పాలకు వెళ్ళే చోట నాకు ‘బ్యాడ్ టచ్’ జరిగింది.”


గుండె చప్పుడును అదుపులో పెట్టుకొని అమ్మానాన్నలు ఒకే సారి “బ్యాడ్ టచ్ అంటే క్లియర్గా చెప్పమ్మా …” అతి చిన్న స్వరంతో నిలదీశారు.


“నేను పాలకోసం మారయ్య అంకుల్ వాళ్ళ అరగు మీద కూర్చుంటాను. మేత కెళ్ళి ఆవులు రాలేదని అనిమల్స్ ఫుడ్ కలుపుతున్న క్రిష్ణయ్య నా ప్రక్కలోనే కూర్చోని చాక్లెట్ ఇస్తే, వద్దన్నా. నన్ను గట్టిగా పట్టుకొని తన మీద కూర్చో బెట్టుకొని నా ఫ్రాక్ లోపల చేతులు పెట్టి బ్యాడ్ టచ్ చేస్తూ, నాకు ముద్దులు పెట్టాలని ట్రై చేస్తే, నాకు వామిట్ ఫీలింగ్ వచ్చి, ఛీ, అని తోసేసి ప్రక్కనే వున్న గురువైయ్య షాపులోకి పరిగెత్తాను.” గుక్క తిప్పు కోకుండా చెప్పింది.


శ్రోతలిద్దరి వూపిరి బిగుసుకుంది. అమ్మానాన్నల ముఖాలు మామూలుగానే వుండడంతో ధైర్యం వచ్చింది.


కుదురుగా కూర్చోని కంఠ స్వరంలోని దుఃఖాన్ని దిగమింగి, “ఇది ఫస్ట్ డే, ఓకే. ఇంకా సెకండ్ డే; మళ్లీ అలాగే ఆవులు, బర్రెలు ఇంటికి రాలేదు. మారయ్య అంకుల్ అని గట్టిగా పిల్చినా, ఎవ్వరూ పలుక లేదు. సడన్గా క్రిష్ణయ్య నా వెనుకగా వచ్చి మళ్లీ అలాగే, యింకా గట్టిగా నొక్కి బాడి పార్ట్స్ ని బ్యాడ్ టచ్ చేశాడు. వాడికి చాలా బలం వుంది. అయినా నేను గట్టిగా అరిచే సరికి లచ్చిమి ఆంటీ రాగానే, నన్ను వదిలి పారిపోయాడు. నాన్నా, ప్లీజ్; నేనిక యెప్పుడూ పాలకు వెళ్ళను."


భూగోళభ్రమణ వేగానుభవం తల్లిదండ్రులకు విదితమైనది. కొద్దిసేపు మౌనంగా వున్నారు.


ఉమ అంది: “బ్యాడ్ టచ్ గురించి మా ఇ. వి. ఎస్. మామ్ చెప్పారు.”


“సరళా, మన కిటికీ నుండి మారయ్య ఇల్లు కనబడే దూరంలోనే వుంది కదా, మరి పాప బయట కాలు పెట్టగానే నువ్వెందుకు నిఘా పెట్టలేదు?” కోపాన్ని గొంతులోనే అదిమిపట్టి అన్నాడు.


“ప్రతీ రోజు గమనిస్తూనే వున్నాను, చిన్న పాప జ్వరంతో దిక్కు తోచక నా ఒళ్ళోనే పడుకో బెట్టుకొని, తడిబట్ట వేస్తూ ఉమపై ధ్యాస పెట్టలేదు. నా తప్పే.” సంజాయిషీ ఇచ్చుకుంది.


కూతురి తల నిమురుతూ “ఉమా, నువ్వు ఎలాటి బట్టలు వేసుకున్నావ్?”


“మామూలే; ఫ్రాక్, లోపల షిమ్మి; ఫుల్ లేగ్గీ; లోపల అండర్వేర్. స్లిప్పర్స్ అంతే. ఎందుకు నాన్నా?”


"మనం వేసే బట్టల వలన మన నేచర్, మన ప్రవర్తన అంచనా వేసుకుంటారు. శరీరాన్ని కప్పుకొని మన అవయవాలు కాపాడు కోవాలి. నువ్వు కరెక్ట్ గానే వేసుకున్నావు."


రమణ వంట్లో రక్తం సలసల కాగుతున్నది. “నేను ఇప్పుడే వస్తాను..”


ఆయుధాలు లేకుండా రాజు దండయాత్రకు బయలు దేరాడు.


క్రిష్ణయ్య షర్ట్ కాలర్ పట్టుకొని ఈడ్చు కుంటూ ఇంటికి వచ్చాడు రమణ. అతని వెంటే మారయ్య, ఈరయ్య, రాములమ్మ వున్నారు. రమణ కోపాగ్ని చవి చూశారు కాని విషయమేంటో అర్థం కాలేదు.


చిన్న పాప పడుకున్న బెడ్రూమ్ తలుపు దగ్గరగా వేసి, పెద్ద పాపను తన ఒళ్ళో కూర్చో బెట్టుకొని సరళ సోఫాలో కూర్చుంది. రమణ అన్నాడు, “ఇప్పుడు చెప్పు కిష్టిగా, ఏం జరిగింది?”


తాపీగా చెప్పాడు, “ఎవలకు.. ఏంమైందో నాకేం ఎరుక? వూకేనే నన్ను తోల్కొచ్చిన్డృ..”


రాములమ్మ కడుపు తీపి కలుక్కు మన్నది.


బ్యాడ్ టచ్ కథనాన్ని క్లుప్తంగా వివరించాడు రమణ. ఒక్క సారిగా మారయ్య, ఈరయ్య, క్రిష్ణయ్యపై ఎడాపెడా చేయి చేసుకున్నారు.


“వద్దు, మీరేమీ అనొద్దు. దయచేసి నోరు మూసుకొని చూడండి. నేను చేయాల్సిన పనిని మీరు చేయటము సబబు కాదు. "


“అయ్యా, నీ కాల్ మొక్కుతా, కిష్టిగాన్ని కొట్టకుండి, నాజూకు పోరడు.” రాములమ్మ రిక్వేస్ట్ అర్జీ.


“నేను కొట్టను, అసలు ముట్టుకోను సరేనా, కానీ మీరు నోరు మూసుకోండి, లేదా బయటకు నడవండి.” ఆజ్ఞ యిచ్చాడు న్యాయవాది.


ఉమ కళ్ళు పెద్దవి చేసి, పళ్ళు బిగ పట్టుకొని చూస్తుంది. రమణ వేసే శిక్ష వూహకంద లేదు, కానీ క్రిష్ణయ్యకు తగు రీత్యా శిక్ష పడాలని సరళ కోరిక.


“కిష్టిగా ఇక్కడ నావైపు రా..”


వచ్చాడు దోషి.


అంతలో మారయ్య “అయ్యా, పాప బుగులు పడతదేమో, ఈ సారికి కిష్టిగాన్ని ఏమనకుండ్రి..”


“నా పాపకు భయం లేదు, నీ కొడుక్కె పాపభీతి లేదు.” కటువుగా అన్నాడు రమణ.


“కిష్టిగా, ఇదిగో ఇట్లా కప్పలా కూర్చున్నట్లు కూర్చో." కూర్చున్నాడు.

“కాళ్ళ వేళ్ళను నేల పైన ఆన్చి, నీ చీలమండను పైకి లేపి కూర్చో.”


కూర్చున్నాడు.


“చేతులు నేలను తగలొద్దు.” రమణ చెప్పిన భంగిమలో సులభంగా కూర్చున్నాడు క్రిష్ణయ్య.


ఇదేనా శిక్ష? అందరి మనస్సుల్లోని ప్రశ్న.


"నేను అంకెలు లెక్క పెడతాను. నా లెక్క ఆగిన తరువాత నువ్వు లేచి ఇంటికి వెళ్డువు గాని…ఈ మద్యలో లేచావంటే నిన్ను పోలీసులకు అప్పచెప్పి జైల్లో కూర్చో పెడతా....”


ఇట్టి సుతిమెత్తని శిక్ష క్రిష్ణయ్యకే కాదు, వాడి ఇంటి వాళ్ళందరికీ సమ్మతమే!


ఒకటీ, రెండు, మూడూ.... ఇరవై ఐదు దాటాయి. కాళ్ళు భూమ్మీద నిలువలేక తిమ్మిర్లు! చేతులు నేల సాయం కొరకు అవస్థ పడుతున్నాయి. ఫ్యాన్ జోరుగా తిరుగుతున్నా చెమటలతో బట్టలు తడుస్తున్నాయి.


రమణ సోఫాలో కూర్చొని లెక్కని కొనసాగిస్తూనే వున్నాడు. యాభై చేరుకోగానే, క్రిష్ణయ్య కళ్ళు బైర్లు కమ్మి, ఠపీమని కింద కూల బడ్డాడు.


“కిష్టిగా, లే, గెటప్! నా లెక్క పూర్తి కాలేదు.. ఊ.. లే..”

నరాల బిగుతుకు ముఖాన కళ తప్పింది.


ప్రక్కనే వున్న చన్నీళ్లు ముఖం మీద చల్లాడు రమణ. కష్టంగా రెండు చేతులు జోడించి ధీనంగా “సారు, నాది తప్పే. మీ కాల్లకు మొక్కుతా, నన్ను ఇంటికి వదులు…” వాలి పోతున్నాడు.


“నేను నిన్ను ముట్టుకొనేలేదు, అప్పుడే అంత నొప్పిగా వుందా? నా బిడ్డను ఎక్కడ బడితే అక్కడ బలంగా ముట్టుకున్నావ్, నా బిడ్డకు లేని నొప్పి, నీకు తెలుస్తున్నదా? నీ బలం యిప్పుడు బైటికి తీయీ.. ఊ.. చూపెట్టు"


చుట్టు ప్రక్కల ఇళ్లు కూడా దద్దరిల్లు తున్నాయి.


"అయ్యా…" ఏడ్పు మొదలైంది.


“వంద లెక్క పూర్తి కాలేదు, కూర్చో.. ” అరిచాడు రమణ. పడుతూ, లేస్తూ కూర్చున్నాడు క్రిష్ణయ్య.


"భయాన్ని భీతి అంటారు. నా పాప దేనికి భయపడదు. అందుకే ధైర్యంగా నీ పాడు చేష్టలన్ని మాతో చెప్పుకో గల్గినది. కానీ నీకు పాపభీతి లేదు!”


"నూరు. " లెక్కింపు ఆగింది.


"ఎవ్వరితోనైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా చెడు పనులు చేస్తే 'పాపం' అంటారు. చెడు పనులకు భయపడాలి. అన్నిటికీ తెగిస్తే; ఎక్కడో నరకంలో కాదు, ఇక్కడే ఈ భూమ్మీద శిక్ష పడుతుంది." ఎద ఎగిసి పడుతున్నది.


"పాపభీతి లేని వారికి శిక్షలు తప్పవు. " తీర్పు ఖరారు అయింది. “ఇకనైనా పాపభీతితో బతుకు.. ”


కడుపునిండా పిల్లల్ని కన్నతల్లి శపించింది. “థూ... నా కడుపుల చెడ పుడతివి. నాకు, మీ నైనకు మోకమ్ లేకుండ జేస్తివి. ఏడన్నా పడి సావు.. ”


ఇంటి వాళ్ల భుజాల మీద ఒరిగి ఇంటికి దారి తీశాడు పాపాత్ముడు.


*****

సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

పేరు :సురేఖ

ఇంటి పేరు: పులి

వయసు: 68 సంవత్సరాలు

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.

పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.

మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.

స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత

ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.

చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.

మీ ప్రోత్సాహమే నా బలం 🤝

మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.

సురేఖ పులి


83 views5 comments
bottom of page