'Pattu Panupu' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally
'పట్టు పానుపు' తెలుగు కథ
రచన : సుదర్శన రావు పోచంపల్లి
ఆనంద సాగర్ ఒక్కడే కొడుకు సాకేతరాం వైదేహిలకు. అల్లారుముద్దుగా పెంచి పోషించారు కొడుకును ఏలోటు రానీయకుండా. కటిక దరిద్రము అనుభవించుచున్నా కొడుకుకు కాలికి మట్టి అంటకుండా పెంచాలని తలిదండ్రుల ధ్యేయము. అట్లనే పెంచిన్రు కూడా. తలిదం డ్రు ల పోషణలో ఆనంద సాగర్ కు బ్రతుకంతా ఆనంద సాగరమే. ఎంతో కష్టపడి బాగానే చదివించారు కొడుకును.
యుక్త వయసు రాగానే తలిదండ్రులను వీడి అన్య దేశానికి పయనమౌతాడు ఆనంద సాగర్ ఇంకా చదివి మంచి ఉద్యోగము సంపాదించి తలిదండ్రులను కష్టాలనుండి దూరము చేయాలను తలంపుతో.
పాపం సాకేత రాం వైదేహిలు కూడా ఉన్న అర ఎకరము పొలము, కొంత బంగారము అమ్మి కొడుకును విదేశాలకు పంపుతారు. పొరుగు దేశములో స్నేహితుల అండతో చదువు సాగించుచూ ఏదో చిన్న ఉద్యోగము చూసుకుంటాడు ఆనంద సాగర్, తనకు నిత్యభత్యం కాలేజీ రుసుము ఇంటి అద్దె కు సరిపోయేటంత.
రెండు ఏండ్లు గడువగానే ఒక మంచి ఉద్యోగము దొరుకుతుంది. ఇక సంపాదనలో పడి వచ్చిన జీతమంతా విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ తల్లిదండ్రులను మరిచి పోయే స్థితికి చేరుకుంటాడు.
స్నేహితుడు దయానిధి బోధనలతో తేరుకొని తలిదండ్రులకు కొంత డబ్బులు పంప పూనుకుంటాడు ఆనంద సాగర్.
ఊళ్ళో ఉన్న తలిదండ్రులు కొడుకు ప్రయోజకుడైండని మురుస్తూనే ఒక్కడు ఎంతకష్టపడుతున్నడో ఏమో అని మదనన పడుతుంటరు సాకేతరాం, వైదేహిలు.
అక్కడ సుఖంగనే ఉంటడు. మీకే దిగులు అవసరము లేదు నిశ్చింతగా ఉండండి అంటుంటరు ఇరుగు పొరుగు వారు. అదీగాక పరదేశము పోయి వచ్చిన ప్రదీప్ కూడా వీళ్ళకు నచ్చజెబుతుంటాడు.
అందరి మాటలు వింటున్న సాకేత్, వైదేహి లు కొంత మనో నిబ్బరంతో బ్రతుకసాగారు. కొడుకుపంపే డబ్బులతో మళ్ళీ అరెకరము పొలము బంగారము కొనుక్కుంటారు.
ఆనంద సాగర్ దయానిధి ఇంటి ప్రక్కనే అద్దె ఇంట్లో ఉంటున్నా అవసరానికి కారు మాత్రం కొనుక్కుంటాడు.
జీతము బాగనే వస్తున్నది తల్లిదండ్రులకు కూడా పంప గలుగుతున్నాను నాకూ ఒక తోడుంటే బాగుంటుందను ఆలోచనలో పడుతాడు ఆనంద సాగర్.
దయానిధికి పెండ్లయి ఇద్దరు పిల్లలు కూడ.
ఎప్పటికి ఏదో ఆలోచనలో పడుతున్నట్లు గుర్తించిన ఆనంద్ సాగర్ ను అడుగుతాడు దయానిధి విశేషమేమిటని.
నేను ఒక్కడినే ఒంటరిగా ఉండలేక పోతున్న రోజూ ఏవేవో కలలు పడుతున్నాయి అంటాడు ఆనందసాగర్.
ఆనంద సాగర్ కు 25 ఏండ్ల వయసొచ్చింది. ఇక పెండ్లి గురించి ఆలోచిస్తున్నాడో ఏమో అని పసిగట్టిన దయానిధి “పెళ్ళి చేసుకో! అన్నీ సమస్యలు తీరిపోతాయి” అంటాడు.
‘అమ్మ.. చెప్పుకోవడానికి ఒక అవకాశమొచ్చింది’ అని తనలో తానే అనుకుంటు బిడియము వదులలేక “అదేమి లేదు” అని ముక్తసరిగా అంటాడు ఆనందసాగర్.
“అయ్యా! మేమూ పెండ్లికంటె ముందు ఇటువంటి చిలుక పలుకులు పలికినవాండ్లమే. మా ఊరి ప్రక్క ఊరిలో మాకు కావలసిన చుట్టాల అమ్మాయి ఉన్నది. బాగా చదువుకున్నది కూడా. అందానికేమీ తీసిపోదు” అంటాడు దయానిధి.
“అంటే మనము మన దేశము పోవాలన్నమాట” అంటాడు ఆనందసాగర్.
“ఓహో నన్ను కూడా కలుపుతున్నవా.. నేను పోయిన సంవత్సరమే మా ఊరికి పోయి వచ్చిన. ఐన మా కుటుంబ యుక్తము పోయి రావాలంటె ఖర్చుతో కూడుకున్న పని” అంటాడు దయానిధి..
ఆ మాట అనుకుంటూనే “నీవు వచ్చి రెండు యేండ్లకంటె ఎక్కువ కాలమే అయ్యింది కదా. స్వామి కార్యము తన కార్యము అను సామెత ప్రకారము మీ తలిదండ్రుల చూడా వచ్చు మా ఊరి పక్కూరికిపోయి రావచ్చు” అని ముగిస్తాడు దయానిధి.
దయానిధి మాటలకు కొంత తటపటాయించి “సరేలే మిమ్ముల నేనెందుకు ఇబ్బంది పెట్టాలె” అని ఊరుకుంటాడు ఆనందసాగర్.
ఇంతలో దయానిధి కి ఫోన్ వస్తుంది అతని మరదలుకు పెళ్ళి కుదిరింది త్వరలో పెళ్ళి నిశ్చయించడము జరిగిందని. ఇక తమ దేశము పోక తప్పదు అనుకుంటూ “సరె.. వచ్చే వారము అందరము టికెట్ బుక్ చేతాము. నీవు నెల రోజులు సెలవు తీసుకో” అంటాడు దయానిధి ఆనంద్ సాగర్తో.
ఆనంద్ సాగర్ ముఖము వికసిస్తుంది. తన ఇంటికి పోయి ఉన్నదేదో తిని కార్యాలయానికి బయలుదేరుతాడు. కార్యాలయములో పనికంటె తన ఊరి ప్రయాణము, చూడబోయె అమ్మాయి ఎట్లుంటదో.. అమ్మా నాన్న ఏమంటరో.. అనే ఆలోచనలోనే మునిగి పోతాడు ఆనందసాగర్.
దయానిధి బార్య వాగ్దేవి కి తనకు ఫోన్ వచ్చిన విషయము వారంలో స్వదేశము పోయే విషయము వివరంగా చెబుతాడు. వాగ్దేవి సంతసిస్తుంది.
వారము రోజులు ఇటు వాగ్దేవికి అటు ఆనంద్ సాగర్ కు ఎంతో భారంగా గడుస్తయి.
ప్రొద్దున్నే అన్ని సర్దుకొని ఏర్ పోర్ట్ కు బయలు దేరుతారు దయానిధి కుటుంబము తోడుగా ఆనంద్ సాగర్.
విమాన మెక్కిన దే తడవు ఇంకెంత సమయము పడుతుంది గమ్యము చేరడానికి అని పదే పదే చూస్తుంటాడు ఆనంద్ సాగర్. ఇంతకు ముందు వచ్చినప్పుడు విమానములో పెట్టే తిండి ఇష్టంగా తిన్నవాడు ఇప్పుడు అయిష్టత కనబరుస్తూ చాయ మాత్రము త్రాగసాగాడు ఆనందసాగర్.
వాగ్దేవి తన ఇంట్లో చేసుక వచ్చిన పలహారము మాత్రము మొహమాటానికి తింటాడు రుచి చూసినట్లుగా.
స్వదేశము చేరగానే ఎవరి ఇంటిదారి వారు పడుతారు అద్దె కార్లలో.
ఇంటికి చేరగానే ఏమిటి ఆనందా చెప్పకుండా వచ్చినవు అంతా మంచే గదా అని అడుగుతాడు తండ్రి సాకేతరాం.
నాయినా ఎప్పుడు తిన్నవో ఏమో ముందు స్నానము చేసిరా తిన్నాక మాట్లాడుదామంటుంది తల్లి వైదేహి.
అంతా బాగే అమ్మా అనుకుంటూ స్నానాకి నీళ్ళర్రలకు పోతాడు ఆనంద సాగర్.
అరగంటలో స్నానము ముగించుకొని తల్లి పెట్టిన అన్నమే పరమాన్నంగా భుజిస్తాడు ఆనంద సాగర్. కళ్ళనీళ్ళు తుడుచుకుంటు. రెండేళ్ళకెక్కువాయెనమ్మా నీ చేతి భోజనము తినక అనుకుంటూ. తల్లి వైదేహి కూడా కొడుకు కంట నీరు చూసి తనూ కొంగుతో కండ్లు తుడుచుకుంటుంది. సాకేతరాం కూడా కొంత బాధ పడుతూ ధోతితో కళ్ళు తుడుచుకుంటాడు.
అన్నము తిన్నంక విదేశమునుండి తెచ్చిన కొన్ని వస్తువులు తలిదండ్రులకిస్తాడు.
కొంచెం విశ్రాంతి తీసుకో తండ్రీ అంత దూరము ప్రయాణమాయె నిద్ర లేక అంటుంది తల్లి. సరెనమ్మా తరువాత తీరికగా మాట్లాడుతాను అని నిద్రకుపక్రమిస్తాడు ఆనంద సాగర్.
పడుకుంటడే గాని నిద్ర రాదు స్నేహితుడు దయానిధి బంధువమ్మాయినే తలుస్తూ ఉంటాడు.
రెండు గంటలు ఇటు నుసిలి అటు నుసిలి ఇక లేచి తల్లి దండ్రులతో తాను ఒంటరిగా ఉండలేక పోతున్నాను తోడు కావాలి అని అంటుంటుంటెనే “అదేమిర నీవేమి చిన్న పిల్లగాడివి కావాయె” అంటుంది తల్లి వైదేహి.
“మా అన్న కూతురు ఉన్నది. మొన్ననే మీ మామ వచ్చిపోయిండు. ఐనా నిన్ను తెలుసుకొని చెబుతామన్నము” అంటుంది వైదేహి.
“లేదమ్మా! మా స్నేహితుడు దయానిధి వాళ్ళ ప్రక్క ఊళ్ళో వాండ్ల బంధువమ్మాయి ఉన్నదట. రేపు దయానిధి వస్తడు. కలిసిపోయి చూసివచ్చినంక మీకు మామయ్య కూతురు విషయము చెబుత” అంటాడు ఆనంద సాగర్.
“ఒక మాట చెబుతా విను. మన యింటి పద్ధతి ఆనాటినుండి వస్తున్న దేమంటె ఒక పర ఇంటి అమ్మాయిని చూసి వచ్చి మనము వంకలు పెట్టకూడదు. ముందుగానే అన్నీ విషయాలు తెలుసుకొని పోవాలి” అంటుంది వైదేహి.
“అదీ గాక మనకు వాళ్ళతో సంబంధము కుదిరినా ఏలాంటి కట్ణ కానుకలు. లాంఛనాలు. వాళ్ళను ఇబ్బంది పెట్టే ఇతరేతర ఇచ్చి పుచ్చుకొనుడు ఏవీ మనము కోరవద్దు. వాళ్ళింటి దీపము మన ఇంట్లో వెలుగనున్నది. వాళ్ళు పెంచిన పూల మొక్క మన ఇంటిలో విరియనున్నది. కనుక నాయనా వాళ్ళిచ్చిన బంగారమే మనము తెచ్చుకుందాము” అని కొడుకుకు హితబోధ చేస్తుంది వైదేహి.
“ఇంత చెప్పినంక నీ మాట కాదంటానా అమ్మా. సరె పోనులే. మీరే పోయి మీకు నచ్చితే సంబంధము ఖాయము చేసుకరండి” అంటాడు ఆనంద సాగర్.
“రేపు మా స్నేహితుడు దయానిధి రానున్నాడు. మీరు రెండు మూడు రోజులు ఆగి పోయివద్దురు” అని, “మీరు కొన్న కొత్తపొలము చూసివద్దాము రా నాన్నా” అని తండ్రితో పొలము దగ్గరకు పోతారు.
పొలమంతా చూసి “ఇది చాలా తక్కువ అనిపిస్తున్నది. ఇంకా నాలుగైదు ఎకరాలు కొందాము. డబ్బులు నా దగ్గర ఉన్నవి” అంటాడు ఆనంద సాగర్.
“సరె లేరా! ముందు నీ పెండ్లి కుదిరి పెండ్లయిన తరువాత ఆలోచిస్తాము” అంటడు సాకేతరాం.
“సరె నాన్నా మీ ఇష్టం”అని ఇంటిదారి పడుతారు.
చాలా రోజులకు వచ్చిండని కొడుకుకు ఘుమ ఘుమ లాడే వంటకాలు చేసి పెడుతుంది వైదేహి.
ఆ రోజు రాత్రి అందరూ తృప్తిగా భోంచేసి పడుకుంటారు.
మర్నాడు ఉదయము చాయ త్రాగి పలహారానికి తయ్యారయ్యే సమయానికి దయానిధి రానే వస్తాడు కాని అతని ముఖములో ఏదో వ్యాకులత ద్యోతకమైతది ఆనంద సాగర్ కు.
లోనికి రమ్మంటూ కూర్చొమ్మని “ఈ రోజు సాయంత్రముగద నీవు వస్తనన్నది? ఇంత పొద్దున్నే రావడానికి కారణమేమి” అని అడుగుతాడు ఆనంద సాగర్ దయానిధిని.
“ఏమీ లేదు. మా అత్తవారింట వ్యవహారమంతా కిందమీదైంది” అంటాడు పెదవి విరుస్తూ దయానిధి.
“అదేమిటి? మనము తయారయ్యేనాటికి అంతా సవ్యంగనే ఉండెగద! ఇప్పుడు అసలు జరిగిందేమిటి?” అని అడుగుతాడు ఆనంద సాగర్.
“మా మరదలు పెళ్ళి ఎత్తిపోయింది. పిల్లవాని తరఫు వాళ్ళు పెట్టే పేచీలకు మా వాళ్ళు తట్టుకోలేక పోతున్నారు. ఇక అది నిలువని వ్యవహారము” అంటాడు దయానిధి.
“ఏమంటరేమిటి?” అని ఆనంద సాగర్ అడుగుతుంటేనే “వాళ్ళు చాంతాడంత కోరికల చిట్టా చదివినారట. కట్ణము మొదలు అడిగిన దానికంటె రెట్టింపు.. ఐదు రోజుల పెళ్ళి, బంగారము, వెండి, ఇత్తడి, ఇంకా ఇంకా వాళ్ళ పిండా కూడు.. నాకే చెప్పడానికి అసహ్యమేస్తున్నది. మా అత్త మామలు ఏడ్చుకుంటు కూర్చుంటె చూడలేక ఇక్కడికి వచ్చిన” అంటడు దయానిధి.
“ముందు చాయ ఐతె త్రాగు. ప్రతి దానికి ఒక పరిష్కారముంటది” అంటాడు ఆనందసాగర్.
వీళ్ళు మాట్లాడుతుండగానే అన్నీ విన్న సాకేతరం, వైదేహి ఆనంద సాగర్ను లోనికి పిలిచి “నాయనా! నువ్వు రేపు చూడ బోతనంటున్న అమ్మాయిని చూడకుండానే నామాట మన్నించి ఒప్పుకున్నవు గద” అంటుంది తల్లి వైదేహి.
“ఐతె?” అని ప్రశ్నార్థకంగా తల్లి ముఖము చూస్తాడు ఆనంద సాగర్.
“ఏమీ లేదురా! నువ్వు ఇప్పుడు ఈ పిల్లను ఒప్పుకో. వాళ్ళ కష్టాలనుండి గట్టెక్కించినట్టైతది. నువ్వుగూడ పెళ్ళి త్వరలో చేసుకొని వచ్చెటప్పుడు ఐదుగురైతే పోయేటప్పుడు ఆరుగురౌతారు” అంటుంది వైదేహి.
“మీ అమ్మ చెప్పిన దాంట్లో తప్పేమి లేదురా” అంటాడు సాకేతరాం..
దయానిధి నన్ను వక్ర మార్గాన్నుంచి తప్పించి సరైన మార్గాన నడువ హిత బోధ చేసిన గొప్పవ్యక్తి. అతనికి కృతజ్ఞతా భావంగనన్న అతని మరదలును పెండ్లి చేసుకోవడము నా విద్యుక్త ధర్మం. అని మనసులోనే అనుకుంటాడు ఆనంద సాగర్. తలువని తలంపుగా మా అమ్మా నాన్నలకు కూడా ఇంత తొందరగా దయా నిధి కుటుంబము పై సానుభూతి కలుగడము విశేషము అనుకుంటాడు ఆనందసాగర్.
అందుకొరకే తన తలిదండ్రులు ఏమి మాట్లాడినా తన శ్రేయస్సు కొరే కదా అని తలుస్తాడు ఆనంద సాగర్.. నువ్వు ఊ అంటే మేమే మీ స్నేహితుడు దయానిధితో మాట్లాడుతము అంటారు తలిదండ్రులు.
ఏమీ ఆలోచించకుండా “సరే కాని మీ ప్రతిపాదనకు వాళ్ళొప్పుకోవద్దా” అని సందేహము వెలిబుచ్చుతడు ఆనంద సాగర్.
ఈ మాటతో ముగ్గురూ బయటకు పోయి వీళ్ళ ప్రతిపాదన తెలియజేస్తారు దయానిధికి.
దయానిధి ముఖము కొంత వికసిస్తుంది. “నేను ఇప్పుడే పోయి సాయంత్రానికి శుభవార్త తీసుకొస్తాను” అని వెళ్ళి పోతాడు దయానిధి.
సాయంత్రము వస్తూనే ఇక అడ్డేమి లేదు కాబోయే సడ్డకా అంటూ ఆనంద సాగర్ను కౌగలించుకొని సాకేతరాం కు వైదేహికి దండం పెడుతాడు దయానిధి.
రెండు రోజులలోనే ఆనందసాగర్ దయానిధి మరదలు విజయశ్రీ తో వివాహం జరిగిపోతుంది ఏలాంటి హంగు ఆర్భాటము, కట్ణ కానుకలు, ఇచ్చి పుచ్చుకొనుడు, ఇన్ని రోజులు అన్ని రోజులు పెండ్లి వేడుకలు జరుపాలను పట్టుదల లేకుండా సాఫీగా..
మూడవనాడు విజయశ్రీ ఆనందసాగర్ ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఇల్లంతా సందడే సందడి. విజయశ్రీకి వారము రోజులలోనే పాస్ పోర్ట్ వీసా కూడా సంపాదిస్తాడు ఆనంద సాగర్.
తల్లి నోటివాక్కు ప్రకారం విద్యానిధి కుటుంబముతో పాటే ఆనంద సాగర్ విజయశ్రీ లు విదేశ పయనమౌతారు. తాను చెప్పినట్టు నాలుగెకరాల మంచి భూమి కొనిపెట్టమని డబ్బులు ఇచ్చిపోతాడు తండ్రికి ఆనంద సాగర్.
విదేశము చేరి ఎవరింట్లో వాళ్ళు ఉండాసాగారు. ఒకరికొకరు తోడుగ.
అప్పుడప్పుడు కవితలు కూడా వ్రసే ఆనంద సాగర్ కు తల్లిదండ్రి గుర్తుకొచ్చి వాళ్ళు తనను పెంచిన తీరు ప్రకటించిన ప్రేమ పై ఒక కవిత వ్రాయ డానికి మనసు ప్రేరేపిస్తుంది.
(పట్టు పానుపు మా అమ్మ ఒడి)
..
పట్టు పానుపు మా అమ్మ ఒడై
పట్టుబట్టి నను లాలించి బుజ్జగించి
పరవసించి పాడుకుంటూ
నే పడుకొను వరకు తా నిద్రించక
లాలి పాటలు జోల పాటలు పాడుచు నా
నిద్రభంగము కానీదమ్మ అలికిడి కొంచెం
కానీకుండా తాను మాత్రము తనివిదీరా
నిద్రించకనా నిండు నిదురకై నిరీక్షించు
అమ్మ చేతి వంటకమే వెన్నకన్న
కమ్మదనం ఆరున్నొక రుచియది
ఆ ప్రేమకు అర్థం చెప్పేదెవరు
నాన్న వీపే నాకందలమై నేనే ఇక
ఎదురే లేని రారాజుగ బ్రతికాను
చేయి పట్టినను నడిపించి నడువలేని
నను భుజముననెత్తుకొని బుజ్జగించి
ఊరూ వాడా త్రిప్పి వచ్చే ఆ
ప్రేమను మించిన పెన్నిధి ఎక్కడ
అమ్మకు నాన్నకు శతకోటి వందనాలు
తల్లి దండ్రుల మించిన దైవం
తలువగ లేము ఇలలో కలలో
అని వ్రాసి ముగిస్తాడు ఆనంద సాగర్.
స్నేహము బంధుత్వముగా మారి దయానిధి. ఆనంద సాగర్.. వాగ్దేవి విజయశ్రీ అన్య దేశమైనా ఆనందంగా గడుపుతూ తలిదండ్రుల మరువక తరచు యోగ క్షేమాలు తెలుసుకుంటూ ఆదర్శంగా జీవనము కొనసాగిస్తుంటారు.
సమాప్తం.
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Comments