top of page

పెద్దలు - పిన్నలు


'Peddalu Pinnalu' New Telugu Story

Written By Ch. C. S. Sarma

'పెద్దలు - పిన్నలు' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


“మిస్టర్ మాధవ్ !..” పిలిచాడు ప్రక్క ఇంటి గోపాల్.. ఇరువురూ వీధిలో ఒకరి వెనుక ఒకరు నడుస్తున్నారు.. ఒకరు ఆఫీస్ నుండి ఇంటికి.. మరొకరు ఆఫీసు నుండి రైల్వే స్టేషను.. మాధవ్ గోపాల్.. ఇరువురూ ఒకే ఆఫీసులో ఇంజనీర్లు. గోపాల్ సీనియర్.. ఇరువురూ యం.టెక్ సివిల్.. మాధవ్.. వెనుతిరిగి చూచాడు. గోపాల్.. మాధవరావును సమీపించాడు.. “ఏం సార్ పిలిచారు ?..” అడిగాడు మాధవ్ “మీరు ఇంటికేనా !..” “అవును..” “నేను స్టేషన్ వరకు వెళుతున్నాను. మా అమ్మగారు ఫోన్ చేశారు. వస్తున్నారు.. ఇంటికి ఫోన్ చేశాను. నా మిసెస్ ఎత్తలేదు. మీరు.. నేను స్టేషన్కు వెళ్లినట్టుగా మా ఆవిడకు చెప్పండి..” “ఓస్ !.. ఇంతేనా..” తల ఆడించాడు మాధవ్. “అవును..” గోపాల్ బదులు.. “నేను ఇంకా ఏమిటో అనుకున్నాను..” నవ్వాడు మాధవ్ వ్యంగ్యంగా.. ఉద్యోగ నిర్వహణలో ఆ ఇరువురి మనస్తత్వాలు వేరు. మాధవ్ అందివచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసికొంటూ.. తక్కువ కాలంలో గొప్పవారు కావాలనే ఆశ.. ఆచరణం.. గోపాల్.. నీతి నిజాయితీ.. ధర్మం న్యాయం.. శాంతం సహనం.. అతని సొత్తు. ముక్కుకు సూటిగా నడిచే వ్యక్తి.. ఇరువురికి.. ఒకరిని గురించి మరొకరికి బాగా తెలుసు. ఆ కారణంగానే మాధవ్ అలా వ్యంగ్యంగా గోపాల్ తన్ను డబ్బు అడుగుతాడేమోనని నవ్వాడు.. ఇరువురూ మూడురోడ్ల జంక్షన్కు వచ్చారు. గోపాల్ మరోసారి భార్యతో చెప్పమని మాధవ్కు చెప్పి.. స్టేషన్ వైపుకు నడిచాడు. మాధవరావు తన ఇంటివైపుకు నడిచాడు. గోపాల్ భార్య మాలతి.. మేనమామ కూతురు.. ఇరువరికి చిన్నతనంనుంచి ఒకరిపైన ఒకరికి అభిమానం.. ప్రేమ. మాలతి గోపాలకన్నా ఐదు సంవత్సరాలు చిన్న. ఇరువురిది అన్యోన్య దాంపత్యం. ఇరువురూ.. వెనక చూపుతో.. ముందుకు నడిచే రకం.. మేనకోడలిని.. అభిమానంతో గోపాల్కిచ్చి పెండ్లి చేశారు సుశీల రాజారావు గార్లు. ఐదేళ్ల పాప శాంతి.. మూడేళ్ల బాబు ముకుంద.. చక్కటి సంసారం. మాధవ్.. దాదాపు డెబ్భైఐదు లక్షలు కట్నంతో కుమారిని, కలవారి అమ్మాయిని.. వివాహం చేసుకొన్నాడు. కుమారి.. తల్లిదండ్రులకు అందరూ ఆడపిల్లలే.. మరో ఇద్దరు పెండ్లి కావాల్సినవారు వున్నారు.. చదువుతున్నారు. మామగారు శరభేశ్వరరావుగారు.. బ్రాందీ.. విస్కీ వ్యాపారం.. ఆ ఊర్లో నాలుగైదు షాపులు వారివే. ఓనర్ పేరులో మాత్రం మార్పు. రాజకీయ పరపతి గల మనిషి.. ఊసరవెల్లి రకం.. భార్య ఆదిలక్ష్మి.. దైవభక్తి.. పూజలు.. పునస్కారాలు.. వ్రతాలు.. నోములు.. క్రమం తప్పకుండా పాటించే ఇల్లాలు. ఆయా సందర్భాలలో పేదలకు దాన ధర్మం చేసే చేయి ఆమెది.. ఓల్డు బి.ఏ.. ఇంగ్లీషును అపారంగా మాట్లాడుతుంది.. పిల్లలను క్రమశిక్షణగా పెంచి చదివిస్తోంది. యదార్థంగా.. మాధవ్ తల్లి అన్నమ్మ.. మాధవ్కు తన అన్న రామారావు కూతురు సంధ్యను చేసుకోవాలని ఆశపడింది. భర్త పుణ్యకోటి గారినీ ఒప్పించింది. భార్యాభర్త కుమారుడు మరో ముత్తయిదువు కలసి పిల్లను చూచేదానికి వస్తున్నట్లుగా తన అన్న సంధ్య తండ్రి రామారామావుకు అన్నమ్మ తెలియచేసింది.. వారూ వీరిని రావలసిందిగా జవాబు ఇచ్చారు.. మనుషులు తమ భవిష్యత్తును గురించి ఎన్నో వూహించుకొంటారు.. బహు కొద్దిమంది విషయంలోనే వారి వూహలు నిజం కావచ్చు.. కానీ.. చాలామంది విషయంలో.. వారి వూహ.. కలలకు.. వాస్తవ జీవితానికి ఎలాంటి సంబంధం వుండదు. లారీ యాక్సిడెంట్లో పుణ్యకోటిగారు పరమపదించారు.. ఆ రెండు కుటుంబాల బాంధవ్యం తెగిపోయింది. ఆ తర్వాత మాధవ్ వివాహం.. శరభేశ్వరరావు గారి కుమార్తె సుందరితో జరిగింది. గోపాలు.. ఒక తమ్ముడు చెల్లి.. చెల్లి సంగీతకు వివాహం యింది. తమ్ముడు పరశురామ్.. అగ్రికల్చర్ బియస్సీ చదివి.. వున్న ఆరు ఎకరాల మాగాణి.. నాలుగు ఎకరాల తోటలో ఆయా రుతువులకు తగినట్లుగా వ్యవసాయం చేసి.. మంచి ఫలితాలను రాబట్టి.. గ్రామీణ ప్రశాంత వాతావరణానికి అలవాటు పడిపోయాడు. వారి తండ్రి రాజారావుగారిలా.. ఆ తండ్రికి విశ్రాంతి.. మాధవరావు ఏక్ నిరంజన్.. తమ్ముడు.. చెల్లి.. ఇలాంటి బంధాలు ఏమీ లేవు. పెండ్లి అయిన పదేళ్లల్లో.. సతీమణి సుందరికి కడుపు పంట.. ముగ్గురు ఆడపిల్లలు.. లలిత ఎనిమిదేళ్లు.. పద్మిని ఆరు సంవత్సరాలు.. రాగిణి నాలుగు సంవత్సరాలు.. ముగ్గురూ వారి అమ్మమ్మగారి ఇంట వైజాగ్లో వున్నారు. వారి తాత శరభేశ్వరరావు లిక్కర్ వ్యాపారి.. అమ్మమ్మ ఆదిలక్ష్మి లెక్చరర్.. ఇంట్లో వంటమనిషి.. పనిమనిషి.. గార్డినర్.. వారికి మొగ సంతతి లేని కారణం.. ఆదిలక్ష్మి తన ముగ్గురు మనుమరాళ్లను తన పెండ్లికాని ఇద్దరు కూతుర్లు శ్రావణి.. శాంభవిలతోపాటు ఎంతో మోడరన్ గా మమ్మీ.. డాడీ.. గ్రాండ్ఫా.. గ్రాండ్ మా.. పిలుపులతో మన హైందవ సాంప్రదాయానికి భిన్నంగా పెంచసాగింది. చిన్నపిల్లలు ఆంగ్లో ఇండియన్ పిల్లల్లా తయారైనారు. * * * గోపాల్ రైల్వే స్టేషన్ చేరాడు. రైలు పావుగంట లేటు.. ప్లాట్ఫారమ్ టికెట్ తీసుకొని పైకి వెళ్లాడు. రైలు వచ్చి ఆగింది. గోపాల్ బోగీ యస్.5 ను సమీపించాడు. తల్లి సుశీల, తండ్రి రాజారావు దిగాడు. ఆప్యాయంగా నవ్వుతూ తల్లిని తండ్రిని పలకరించి.. తండ్రి చేతిలోని సూట్కేసును గోపాల్ తన చేతిలోకి తీసుకొన్నాడు. “నాయనా గోపీ !..” పలకరించింది సుశీల “ఏం ఆమ్మా !..” “మాలతి.. పిల్లలు బాగున్నారా !..” తల్లి ప్రశ్న సుశీలకు తన మేనకోడలు మాలతి.. మనుమరాలు శాంతి.. మనుమడు ముకుందంటే పంచప్రాణాలు.. “రాత్రి మాట్లాడేటపుడూ ఇదే ప్రశ్న.. ఇపుడు కళ్లముందున్నప్పుడు అదే ప్రశ్న.. వ్యంగ్యంగా భార్య ముఖంలోకి చూస్తూ నవ్వాడు రాజారావు.. శంకర్.. నవ్వుతూ కుడిచేతితో తల్లి ఎడమచేతిని పట్టుకొని.. “అంతా బాగున్నారమ్మా !.. నాన్నా !.. తమ్ముడెలా వున్నాడు ?..” “వాడికేంరా.. వాడు పూలరంగడు..” తండ్రి ఆనందంగా నవ్వాడు. ముగ్గురూ స్టేషన్ బయటికి వచ్చారు. టాక్సీలో కూర్చొని.. పావుగంటలో ఇంటిముందు దిగారు.. వాకిట్లో.. వారిరాకకోసం.. మాలతి.. కూతురు శాంతి.. కొడుకు ముకుందంతో ఎదురు చూస్తూవుంది. నాయనమ్మను తాతలయ్యను చూడగానే.. శాంతి.. ముకుంద వారివైపుకు పరుగెత్తారు. వెనకాలే మాలతి నడక.. రాజారావుగారు ఆనందంగా నవ్వుతూ మనుమరాలిని ఎత్తుకొన్నారు. సుశీల.. ముకుందును ఎత్తుకొంది నవ్వుతూ.. “మామయ్యా.. అత్తయ్యా.. బాగున్నారా !.., ప్రీతిగా సమీపించి మాలతి అత్తయ్యగారి చేతిని తన చేతిలోకి తీసుకొంది.. “నాన్నా!.. అమ్మా!.. వాళ్లు ఎదిగారమ్మా !.. దించండి..” తల్లిదండ్రుల మీది ప్రీతితో అన్నాడు గోపాల్. “ఫరవాలేదులేరా !.. నా మనుమడేగా !..’ “ఆ.. అలాచెప్పు.. ఒరేయ్.. ఎత్తుకొన్నది నా మనుమరాలినేగా !.." ఇరువురూ ఆనందంగా మనుమరాలి మనుమల పరిష్వంగ ఆనందంలో నవ్వుకొన్నారు. ఆరుగురూ.. సరదాగా పరమానందంతో ఇంట్లో ప్రవేశించారు.. “అత్తయ్యా !.. మామయ్యా !.. ముందు వేడిగా ఓ కప్పుకాఫీ ఇవ్వనా !..” చిరునవ్వుతో అడిగింది కోడలు మాలతి.. “ఆ.. ఆ.. ఇవ్వమ్మా !..” కూర్చుంటూ చెప్పాడు రాజారావు. “అత్తయ్యా!.. కూర్చోండి.. ఐదు నిముషాల్లో కాఫీ తీసుకొస్తాను. త్రాగి స్నానం చేద్దురుగాని..” నవ్వుతూ చెప్పింది మాలతి. “అలాగే అమ్మా !..” అంది సుశీల. గోపాల్ తన గదికి వెళ్లి బట్టలు మార్చుకొని హాల్లోకి వచ్చాడు. “నాన్నా !.. వేడినీళ్లతో మీరు ప్రతి సాయంత్రం స్నానం చేస్తారుగా.. వేణీళ్లు రెడీ.. వెళ్లి స్నానం చేయండి నాన్నా !..” చెప్పాడు గోపాల్. “ఆ..ఆ.. అమ్మాయి కాపీ తెస్తోంది.. త్రాగి స్నానానికి వెళతాను గోపూ !..” “సరే.. నాన్నా !..” “ఆ.. అమ్మా శాంతీ!.. స్కూలుకు వెళుతున్నావుగా!..” అడిగారు రాజారావుగారు.. “ఆ.. తాతయ్యా.. ఆటో వస్తుంది.. దాంట్లో వెళతాను..” తల ఆడిస్తూ చెప్పింది శాంతి.. “తాతయ్యా.. నేనూ వెళతాను..” నవ్వుతూ చెప్పాడు ముకుంది. “తాతయ్యా.. వాడు చెప్పింది అబద్ధం.. వాడు స్కూలుకు రాడు.. అమ్మా నాన్నా వాణ్ణి ఇంకా పంపలేదు..” రహస్యాన్ని చెప్పినట్టు చెప్పింది.. “పైనెల నుంచీ వెళతాను తాతయ్యా!..” బుంగమూతితో చెప్పాడు ముకుంద. “ఆ.. రైట్.. అలాగనే వెళ్లుదువుగాని నాన్నా.. ఆ.. స్కూలుకు ఎందుకు వెళ్లాలి ?.. నవ్వుతూ అడిగాడు రాజారావుగారు మనవడిని తన తొడలపై కూర్చోబెట్టుకొని.. “చదువుకొనేందుకే తాతయ్యా !..” తనకు అంతా తెలిసినట్టుగా.. నిర్లక్ష్యంగా నవ్వుతూ చెప్పాడు ముకుంద. మాలతి కాపీ కప్పులతో వచ్చి మామగారికి.. అత్తగారికి.. అందించింది. “పిల్లలకు..” అడిగింది సుశీల. “నానీ !.. పిల్లలు కాఫీ తాగకూడదు..” చెప్పింది శాంతి. “హార్లిక్స్ తాగాలి నానీ !..” చెప్పాడు ముకుంద. భార్యా భర్తలు కళ్లు ఎగరేస్తూ ఒకరి ముఖాలు ఒకరు చూచుకొని నవ్వుకున్నారు. కాఫీ కప్పులు టీపాయ్ పైవుంచి స్నానానికి వెళ్లారు. రాజారావుగారు సుశీల అనుకున్నారు.. గోపాల్ మాలతీలు పిల్లలను చాలా పద్ధతిగా పెంచుతున్నారని.. సంతోషించారు. * * * మరుదినం వాకిటముందు పళ్లుతోముకుంటూ మిత్రులు ఇరువురు తారసపడ్డారు. “గోపాల్ !..” పిలిచాడు మాధవ్. “యస్.. మాధవ్ !..” “మీ అమ్మా నాన్నా వచ్చారా !..” “వచ్చారండీ !..” “నాకు పరిచయం చేయరా ?.., , వ్యంగ్యంగా నవ్వుతూ అడిగాడు మాధవ్.. “పరిచయం.. దానికేముంది.. ఇపుడే పరిచయం చేస్తాను..” ఇంటి వరండాలో ప్రవేశించి.. “నాన్నా !.. ఇలారండి..” పిలిచాడు గోపాల్.. పదిహేను సెకన్లలో రాజారావుగారు ఇంటిముందుకు వచ్చారు. బిల్డింగ్ నుంచి రోడ్డు సైడ్ కాంపౌండ్ గోడలు ఇరవై అడుగుల స్థలం తూర్పు వుంది. ఆ రెండు ఇళ్లు కట్టింది ఒకే బిల్డర్.. మంచి వాస్తు లక్షణాలతో కట్టాడు. రెండు ఇండ్ల మధ్యన ఐదున్నరడుగుల గోడ (హద్దు). వీధిగేటుకు నేరుగా ఇంటి సింహద్వారం ముందరి వరండానుంచి ఎనిమిది అడుగుల పేవ్మెంటు.. దాని ప్రక్కన ఇరువైపులా అందమైన పూలమొక్కలు.. గోపీకి మాలతికి పూలమొక్కలు.. చెట్ల పెంపకం అంటే ఎంతో ఇష్టం.. ఇంటికి నాలుగు ప్రక్కలా తూర్పు పదిహేను అడుగులు.. పడమట పది అడుగులు.. స్థలం వదిలి ఇంటి నిర్మాణం 55x25 అడుగులతో జరిగింది. దక్షిణపు వైపు బరువైన పూలచెట్లు, మామిడి, సపోటా.. జామ.. పడమట టెంకాయచెట్లు.. ఉత్తరాన దానిమ్మ.. నిమ్మ.. అరటి చెట్లు క్రమంగా నాటారు గోపాల్.. మాలతి.. అలా చెట్లు నాటటంలో.. పూలమొక్కలను పెంచడంలో వారి వుద్దేశ్యం.. వాటి నుండి మనకు అంటే మనుషులకు ఆక్సిజన్ / ప్రాణవాయువు స్వచ్ఛంగా లభ్యపడుతుందనే భావన.. ఆరోగ్యానికి చక్కని గాలిని ఆస్వాదించడం అత్యవసరం అని వారి నమ్మకం. ఇరువురూ పల్లెటూరి వాతావరణంలో పుట్టి పెరిగి దంపతులు అయినవారే. ఇక.. పిల్లలు శాంతి ముకుందలకు పూలమొక్కలన్నా చెట్లన్నా ఆ చిన్న వయస్సునుంచే ఎంతో అభిమానం.. ప్రేమ.. ప్రీతి.. దీన్నే కదా అంటారు ఆవు చేలోమేస్తే దూడ గట్టున మేస్తుందా అని.. తల్లి తండ్రి మాట్లాడుకొనే విధానం.. వారు నేర్పిన మాటలు.. అలవాటు ప్రకారమే పిన్నలు ఎదుగుతారు.. మంచి పౌరులుగా తయారవుతారు. తన్ను సమీపించిన తండ్రి రాజారావుగారిని చూచిన గోపాల్.. “మాధవ్ గారూ !.. మా నాన్నగారు.. పేరు రాజారావు..” చెప్పాడు గోపాల్.. “ఆ.. మందేవూరండీ !..” అడిగాడు మాధవ్.. రాజారావుగారి వయస్సు ఆరవై సంవత్సరాలు.. మాధవ్ తనను అడిగిన ప్రశ్నకు ఆశ్చర్యపోయి తనుయుడి ముఖంలోకి చూచాడు. గోపాల్ విరక్తిగా నవ్వి.. “మాది నెల్లూరని చెప్పాను కదండీ.. మరచిపోయారా !..” “ఓహో.. నెల్లూరా !..” తల ఆడిస్తూ చెప్పాడు మాధవ్. “అవునండీ..” క్లుప్తంగా జవాబు చెప్పాడు గోపాల్.. మాధవ్ ‘నమస్కారం.. గిమస్కారం’ అనే ఏమాట లేకుండా తన తండ్రిని చూడగానే వూరేదని అడగటం అతనికి నచ్చలేదు.. ‘సంస్కార రహితుడు.. పెద్దా చిన్నా గౌరవం తెలియనివాడు.. అహంకారి..’ అనుకొన్నాడు గోపాల్. కొడుకు ముఖభంగిమలు కనిపెట్టిన రాజారావు.. వ్యంగ్యంగా నవ్వుతూ.. “ఆ.. ఇంతకీ మనదేవూరండీ !..” విసిరాడు ఓ భాణం.. ఆ స్టయిల్ మాధవ్రావ్క గోపాల్కు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇరువురి ముఖాలను చూచి రాజారావు ఆనందంగా ఆదోలా నవ్వాడు. వారి భావన గోపాల్కు అర్థం అయింది. “మాధవ్.. మా నాన్నగారు మీవూరేదని అడిగారు!..” నవ్వాడు గోపాల్ “మాదా అండీ.. భీమవరం..” అన్నాడు రాగయుక్తంగా మాధవ్.. తండ్రీ కొడుకులు ఒకరి ముఖాలొకరు చూచుకొని నవ్వుకున్నారు. వరండాలోకి మాధవ్ అర్థాంగి సుందరి ప్రవేశించింది. “ఎంతసేపు ఆ పళ్లతోముడు.. పూడి చేతికొస్తాయోమే.. చాలు.. చాలు.. ఇంట్లోకి రండి. కాఫీ చల్లారిపోతోంది..” పద్యం చెప్పినట్టు చెప్పి.. ఇంట్లోకి వెళ్లిపోయింది సుందరి.. భార్య తన పరువు తీసేసిందనే భావన మాధవ్ ముఖంలో.. ఏదో అనాలనుకున్నాడు.. కానీ తాను మాయమైపోయింది..’ నోరుమూసుకొని ఇంట్లోకి పోవడం కర్తవ్యం..!’ అనుకొన్నాడు మాధవ్.. “వస్తానండీ!.. కాఫీ తాగాలి..” వేగంగా ఇంట్లోకి వెళ్లాడు మాధవ్.. రాజారావుగారు.. గోపాల్.. తల్లి సుశీల పిలుపు విని లోనికి వెళ్లారు. * * * ఆపీస్లో గోపాల్ తన పనిలో నిగ్నుడైయున్నాడు. సమయం ఐదుగంటలు.. మాధవ్ గోపాల్ని సమీపించాడు. “గోపాల్ !..” పిలిచాడు. కంప్యూటర్ ఫీడ్లో లైన్ను పూర్తి చేసి కామా పెట్టి.. మాధవ్ ముఖంలోకి చూచాడు. “నాకు వన్ అవర్ పర్మిషన్ కావాలి !..” “ఇపుడు టైము ఎంత ?..” అడిగాడు గోపాల్. మాధవ్ వాచ్లో టైమ్ చూచుకొని.. “ఐదు..” అన్నాడు మాధవ్. “ఏమిటి అవసరం?..” మాధవ్ తన తండ్రిని సగౌరవంగా పలకరించలేదని గోపాల్ మనస్సున కినుక.. “మా అత్తా మామలు పిల్లలూ వస్తున్నారు. మీరు వారం రోజుల క్రిందట రైల్వే స్టేషన్కు వెళ్లి మీ అమ్మా నాన్నలను రిసీవ్ చేసికొన్నట్టు నేను నా వారిని రిసీవ్ చేసుకోవాలి..” “నేను ఆరోజు.. ఆఫీస్ టైమ్ అరున్నర అయ్యాక.. ఇరువురం బయటకు వచ్చి నేను స్టేషన్కు వెళుతున్నానని.. ఆ మాట నా భార్యకు చెప్పమని చెప్పాను. కానీ.. మీరు గంటముందు వచ్చి స్టేషన్కు వెళ్లాలంటున్నారు..” పరీక్షగా మాధవ్ ముఖంలోకి చూచాడు గోపాల్.. “అవును..” మెల్లగా అన్నాడు మాధవ్.. మనస్సులో గోపాల్ను తిట్టుకొంటూ.. “పర్మిషన్ స్లిప్ ఎక్కడ?..” కంప్యూటర్ను చూస్తూ అడిగాడు గోపాల్.. “రూల్ ఈజ్ రూల్.. మాధవ్ గారూ !..” వ్యంగ్యంగా నవ్వాడు గోపాల్.. మాధవ్ ఆవేశంగా తన సీట వద్దకు వెళ్లి పర్మిషన్ స్లిప్ వ్రాసి బాయ్ చేతికి ఇచ్చి వెళ్లిపోయాడు. ఆఫీస్ బాయ్ మణి ఆ స్లిప్ను గోపాల్ టేబుల్పై వుంచి విషయం చెప్పాడు. కొన్ని క్షణాలు దాన్ని పరీక్షగా చూచి.. ఇనీషియల్ వేసి బిగ్బాస్కు మణి ద్వారా పంపాడు. ఆఫీస్ టైమ్ అయ్యాక ఇంటికి బయలుదేరాడు. పౌర్ణమి ముందు త్రయోదశి.. పండు వెన్నెల.. అమ్మా.. నాన్న.. అర్థాంగి.. కొడుకు.. కూతురూ.. ఇంటి ముందున్న పేవ్మెంట్మెద కూర్చొని ఆనందంగా కబుర్లు చెప్పుకొంటున్నారు. గోపాల్ వారిని సమీపించాడు. భార్య పిల్లలు లేచారు. శాంతి ముకుందులు గోపాల్ను సమీపించారు. తన చేతిలోని మల్లెపూలను మాలతి చేతికి అందించాడు. శాంతి లోనికి వెళ్లింది. వెనకాలే గోపాల్ వెళ్లాడు. పాదరక్షలు విప్పి డ్రస్ మార్చుకొని రెస్టురూమ్లోకి వెళ్లాడు. మాలతి.. సగంపూలు (రెండు మూరలు) శ్రీ మహాలక్ష్మీ విగ్రహానికి అలంకరించింది. మిగిలిన వాటిని మూడు ముక్కలు చేసి బయటికి వచ్చి ప్రీతిగా అత్తగారి జుట్టు ముడిలో వుంచింది. శాంతికి పెట్టింది.. మూడు ముక్కలనుతాను అలంకరించుకొంది. గోపాల్ వాకిట్లోకి వచ్చి తల్లి ప్రక్కన కూర్చున్నాడు. ఒళ్లో కొడుకు.. నాయనమ్మ ఒడిలో శాంతి ఆనదంగా కూర్చున్నారు. “మాలతీ !..” “ఏమండీ!..’ “ప్రక్క ఇంటికి చుట్టాలు వచ్చారా !..” “రాలేదండీ.. అసలు మాధవ్ గారు కూడా ఇంకా వచ్చినట్టు లేదండి..” కార్తీకమాసం.. వెన్నెలను కారుమబ్బులు కమ్మాయి.. సన్నగా తూర ప్రారంభం అయింది. వారంతా ఇంట్లోకి వెళ్లిపోయారు. వర్షం వేగంగా కురియసాగింది. * * * రాత్రి పెరిగే కొద్ది..గాలివాన అధికమయింది. రైలు రాక రెండు గంటలు లేటు. ఆరున్నరకు రావాల్సిన రైలు ఎనిమిదిన్నరకు చేరింది.. మాధవ్ మామగారు, అత్తగారు, ఇద్దరు మరదళ్ళు.. ముగ్గురు కూతుళ్లు లలిత.. పద్మిని.. రాగిణి వచ్చారు. టాక్సీలో అందరూ తొమ్మిదింపావుకు ఇంటికి చేరారు. అందరూ తడిసిపోయారు. బట్టలు మార్చుకొన్నారు ఇంటికి చేరగానే. సుందరి.. చపాతీలు.. ఆఱగడ్డల కూర చేసింది. తల్లికి పిల్లలకు వాటిని పెట్టింది. శరభేశ్వరరావు గారికి ప్రతి సాయంత్రం రెండు పెగ్గులు విస్కీ సేవించి.. భోంచేసి.. శయనించడం అలవాటు. అల్లుడు మాధవన్ను పిలిచాడు. మాధవ్ మొదట వద్దన్నాడు. కానీ మామగారి బలవంతంతో ఆయన ముందు కూర్చున్నాడు. శరభేశ్వరరావుగారి అర్థాంగి ఆదిలక్ష్మి సరంజామాను సమకూర్చింది. శరభేశ్వరరావు రెండు గ్లాసులలో విస్కీ, వాటర్ని నింపాడు. ఒకదాన్ని అల్లుడికి అందించాడు. తాను ఒకటి చేతికి తీసుకొని ‘ఛియర్స్’ చేసి సేవించడం ప్రారంభించాడు. అల్లుడితోపాటు గిల్లుడు అన్నట్టు.. మామకు తగిన అల్లుడు మాధవ్.. బయట మెరుపులు.. గాలి.. వర్షం.. తలా నాలుగు పెగ్గులు వేశారు. మామా అల్లుళ్లు.. భోంచేశారు.. హాయిగా అనందంగా శయనించారు. * * * తెల్లవారికూడ వాతావరణంలో మార్పు లేదు.. గోపాల్ మాధవ్లు రడీ అయ్యి ఆపీస్కు వెళ్లిపోయారు. పన్నెండు గంటల ప్రాంతంలో రాజారావుగారు.. ఆ ఇంట్లో నుంచి శరభేశ్వరరావుగారు బయటకు వచ్చారు. ఇరువురు వాకిటముందున్న మొక్కలను చెట్లను పరిశీలనగా చూచారు. అలా వారు చూస్తూవుండగా.. వారి చూపులు కలిసాయి. రాజారావుగారి మస్తిష్కంలో ఏదో భావన.. పేరు మెదిలాయి. శరభేశ్వరరావును పరీక్షగా చూచాడు.. శరభేశ్వరరావుగారి తండ్రి కోటేశ్వరరావు.. హైస్కూల్ టీచర్.. రాజారావుగారి వూర్లో ఆరు సంవత్సరాలు పనిచేశారు. రాజారావుగారి తండ్రి త్రివిక్రమరావు.. కోటేశ్వరరావు ఆ వూరికి ట్రాన్స్ఫర్ అయి రాగానే.. వారి ఇంట్లో కొంత భాగాన్ని వారికి వుచితంగా వుండేటట్టు అన్నింటిని అమర్చి ఇచ్చారు. విద్యా దానాన్ని చేసే గురువులుగా కోటేశ్వరరావుగారిని.. త్రివిక్రమరావుగారు ఎంతగానో అభిమానించేవారు. ఆరీతిగా రాజారావుకు శరభేశ్వరరావు.. సమ వయస్కులు.. స్నేహితులుగా మారిపోయారు. సెవెన్త్ నుంచి ప్లస్ వన్ వరకు ఆ ఇరువురూ కలసి చదువుకున్నారు. ఒకే క్లాసు.. ఒకే బెంచి.. చిన్ననాటి ఆ మధురస్మృతులు.. రాజారావుకు బాగా జ్ఞాపకానికి వచ్చాయి. “ఏమండీ!..” పిలిచాడు.. రాజారావు. శరభేశ్వరరావు వినిపించుకోలేదు. కొన్ని క్షణాల తర్వాత.. “మిస్టర్ కంటేశ్వరరావ్ !.. కాస్త బిగ్గరగా పిలిచాడు. తొట్రుపాటుతో శరభేశ్వరరావు రాజారావు ముఖంలోకి చూచాడు. రాజారావు హద్దు గోడవరకూ నడిచాడు.. శరభేశ్వరరావు కూడా ఆశ్చర్యంతో మెల్లగా గోడను సమీపించాడు. “ఏమండీ !.. మీరు శరభేశ్వరరావుగారే కదూ !..”. రాజారావును ఆశ్చర్యంగా చూస్తూ శరభేశ్వరరావు..”అవును మరి.. మీరు !!!..” ప్రశ్నార్ధకంగా రాజారావు ముఖంలోకి చూడసాగాడు. “ఎవరినో గుర్తు పట్టండి సార్ !..” ‘ నవ్వుతూ చెప్పాడు రాజారావు.. కొన్ని క్షణాలు రాజారావును నిశితంగా చూచిన శరభేశ్వరరావుకు గతం గుర్తుకు వచ్చింది.. ఆ పదిహేనేళ్ల వయస్సు.. ఆ నెల్లూరు.. రాజారావు.. వారి తండ్రి త్రివిక్రమరావు.. “మీరు.. రాజారావు కదూ !..” ఆశ్చర్యానందాలతో అన్నాడు శరభేశ్వరరావు. “ఆ.. రాజారావునే!.. మిత్రమా శరభేశ్వరరావు.. బాగున్నారా.. మాధవ్ మీ కుమారుడా !.. అడిగాడు రాజారావు. “కాదు.. అల్లుడు..” క్లుప్తంగా జవాబు చెప్పాడు శరభేశ్వరరావు. “ఓహెూ!.. తిరిగిరండీ.. మా వాళ్లను చూద్దురుగాని !..” ప్రీతిగా ఆహ్వానించాడు రాజారావు. శరభేశ్వరరావు.. గోపాల్ ఇంటి ఆవరణలో ప్రవేశించాడు.. ముఖానికి మాస్కుతో.. రాజారావు నమస్కరించాడు మిత్రుడికి.. శరభేశ్వరరావు తల ఆడించాడు చిరునవ్వుతో.. ఇరువురూ వరండాలో ప్రవేశించారు.. ఆసనాన్ని చూపించాడు రాజారావు.. శరభేశ్వరరావు.. కూర్చున్నాడు. రాజారావు భార్యను.. కోడలిని పిలిచాడు.. తనూ కుర్చీలో కూర్చుంటూ.. ముందు అర్థాంగి సుశీల వచ్చింది.. “సుశీ !.. వీరు నా బాల్య మిత్రులు..” కోడలు మాలతి వచ్చింది. “ఆ.. మాలతీ !.. వీరు నా బాల్య స్నేహితులు.. వీరి నాన్నగారు మనవూర్లో హైస్కూల్లో పనిచేశారు. మేమిరువురం కలసి చదువుకొన్నాము. వీరి పేరు శరభేశ్వరరావు.. “ ఇల్లాలు సుశీల.. కోడలు మాలతి శరభేశ్వరరావు గౌరవంగా నమస్కరించారు. మాలతి లోనికి వెళ్లిపోయింది. “ఆ.. రాజారావుగారూ !..”. “శరభేశ్వరరావ్.. ఆ రావులు గీవులు అవసరమా.. ఆరోజుల్లో పిలిచినట్టే ‘రాజా’ అని పిలువు.. నాకేం అభ్యంతరం లేదు.. సరే.. ఏదో అడగబోయావ్.. అడుగు?..” చిరునవ్వుతో చెప్పాడు రాజారావు. “ఇంతకాలం ఏ చేసేవాడివి ?..” “బియ్యే పాసయ్యా.. వివాహం చేశారు నాన్న.. బి.ఈడీ.. చదివి స్కూలు మాస్టర్గా పని చేశా.. రిటైర్ అయినా.. ఈ సంవత్సరమే.. మా వూర్లో హెడ్మాస్టర్ హెూదాలో. గోపాల్ నా పెద్ద కొడుకు.. చిన్నవాడు పరశురామ్.. వాడు అగ్రికల్చరల్ బియస్సీ చేసి.. వ్యవసాయం చేస్తున్నాడు. వాడికి ఇంకా వివాహం కాలేదు. గోపాల్కి ఇద్దరు పిల్లలు.. అంటే నాకు మనుమడు ముకుందు.. మనుమరాలు శాంతి వున్నారు. అమ్మా నాన్నా స్వర్గస్థులైనారు. మిత్రమా !.. ఇదీ నా కధ.. మరి నీ కధ !..” నవ్వుతూ అడిగాడు రాజారావు. శరభేశ్వరరావుకు.. రాజారావులోని ఆత్మీయతాభావం.. అభిమానం.. అమాయకంగా అన్ని విషయాలు ఒక్కసారి విపులంగా చెప్పడం.. ఆశ్చర్యం కలిగించింది. 'వీడు ఏమీ మారలేదు.. ఆ చిన్ననాటి లాగానే వున్నాడు..’ అనుకొన్నాడు శరభేశ్వరరావు. మాలతి కాఫీ కప్పులతో వచ్చి ఇరువురికీ అందించింది.. తోటే వచ్చిన శాంతి ముకుందలు నల్లని శరభేశ్వరరావు గారిని వారి కోర మీసాలు చూచి భయపడి నాయనమ్మ ప్రక్కన ఆమె చేతులు పట్టుకొని వెనగ్గా నిలుచున్నారు. వారి ఆ స్థితిని చూచిన సుశీల.. “అమ్మా !.. శాంతీ ! ముకుందా !.. వారూ మీ తాతయ్యగారి వర సే.. మీ తాతయ్యగారి స్నేహితులు..” చిరునవ్వుతో చెప్పింది. ఇరువురూ కొంచెం ముందుకు వచ్చి.. చేతులు జోడించి.. “నమస్తే తాతయ్య గారూ !..” నవ్వుతూ చెప్పి లోనికి వెళ్లిపోయారు.. వారి వెనకాలే సుశీలా.. ఖాళీ కప్పులు తీసుకొని మాలతీ లోనికి వెళ్లిపోయారు. రాజారావు.. అతని కుటుంబ సభ్యులను చూచాక.. శరభేశ్వరరావుగారి మదిలో ద్వేషం.. కలవరం.. అసూయ.. కుర్చీనుంచి లేచి.. “ఆ.. నేవెళుతున్నా రాజారావ్ !..” వరండా నాలుగు మెట్లు దిగి వేగంగా తన అల్లుడి ఇంటి వైపుకు నడిచాడు.. అతని పెంకితనాన్ని.. అసూయాభావాన్ని గ్రహించి రాజారావు ‘వీడు ఆనాడు ఈనాడు ఒకేలాగున్నాడు’ అనుకొన్నాడు.. సాయంత్రం ఆరున్నరకు గోపాల్ ఇంటికి వచ్చాడు. పిల్లలు తాత ఫ్రెండ్ వచ్చారు నాన్నా. చెప్పారు. వారు చెప్పిన విధానానికి పెద్దలు ముగ్గురు నవ్వుకొన్నారు. “ఎవరు నాన్నా !..” అడిగాడు గోపాల్ రాజారావు.. శరభేశ్వరరావు గారిని గురించి గోపాల్కు చెప్పాడు. * * * మరుదినం.. ముకుందుడి పుట్టిన రోజు.. ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి పనిమనిషి మంగమ్మతో కలసి మాలతి శుభ్రం చేసి.. వాకిట అందంగా ముగ్గులు పెట్టింది. కోడలు వేసిన ముగ్గులు చూచి సుశీల ఆశ్చర్యపోయింది. చదువుకొన్న తన కోడలికి ముగ్గుల విషయంలో ఇంతటి సామర్థ్యం వున్నందుకు ఆనందించింది. “మాలతీ !..” “ఏంటత్తయ్యా !” “ముగ్గు అద్భుతంగా ఉందమ్మా !..” “ఇందులో నా గొప్పతనం ఏమీ లేదత్తయ్యా !.. అంతా మా అమ్మది..” చిరునవ్వుతో చెప్పింది మాలతి. రాజారావు వరండాలోకి వచ్చాడు. “ఆ.. ఏమిటి సంగతి ?.. ఈ రోజు మన ముకుంద పుట్టిన రోజు కదా !.. ప్రక్క ఇంటివాళ్లను పిలవరా !..” అడిగారు రాజారావు. వరండాలోకి అపుడే వచ్చిన గోపాల్.. “ఏమిటి నాన్నా !..” అడిగాడు. “నీ ఫ్రెండ్ మాధవ్ను నీ కొడుకు బర్త్ డేకి పిలవ్వా ?..” గోపాల్ పిలవాలా వద్దా అనే ఆలోచనలో పడ్డాడు. కారణం మాధవ్ ఇంటికి వారి మామ అత్త పిల్లలు వచ్చివున్నారుగా.. పిలవాలా వద్దా అనేది అతని సందేహం. “ఏరా.. జవాబు చెప్పు !.. మీ ఫ్రెండ్ మామగారు శరభేశ్వరరావు నా మిత్రుడని రాత్రి చెప్పాను గదా !..” “ఆ.. ఆ.. అవును నాన్నా !.. అమ్మా!.. ఈ విషయంలో నీ నిర్ణయం ఏమిటమ్మా !..” “ఒరేయ్ గోపీ !.. పిలవకపోతే మీ నాన్నగారు బాధపడతారురా !.. కారణం వారి బాల్య మిత్రుడు.. నీ మిత్రునికి మామగారయ్యారుగా !..” క్రికంట భర్త ముఖంలోకి చూస్తూ చెప్పింది సుశీల. పిలుద్దాం.. అయ్యా !..” అంది మాలతి. “సరే.. ఓకే.. అమ్మా నీవు వెళ్లి పిలిచిరా !.. బాగుంటుంది.. ఇటు నాన్నగారు అటు వారి మిత్రులు సంతోషపడతారు..’ “భోజనానికా.. టిఫిన్ కా!..” అడిగింది సుశీల.. “మీరే చెప్పండయ్యా !..” అంది మాలతి. రాజారావు గోపాల్ సుశీల ముఖంలోకి చూచారు. ‘‘సరే! పిలిచి వస్తాము.. టిఫిన్ మాత్రమే !..” అంది సుశీల. “సరే.. గుడ్.. వెళ్లి పిలిచివద్దాం.. పద సుశీ !..” నవ్వుతూ చెప్పాడు రాజారావు. ఇంట్లోకి వెళ్లి కుంకుమ భరిణను చేతికి తీసుకొని వచ్చి అత్తయ్య చేతికి అందించింది మాలతి. రాజారావు.. సుశీల.. మాధవ్ ఇంటికి వెళ్లి “సాయంత్రం తమ మనుమడి పుట్టిరోజు వేడుక “ అని చెప్పి రమ్మని ఆహ్వానించి వచ్చారు. వీరు వెళ్లే సమయానికి శరభేశ్వరరావు.. కుమారి.. లలిత.. పద్మిని.. చీట్లాటాడుతున్నారు. సమయం వుదయం ఏడున్నర ప్రాంతం.. రాజారావు సుశీలను చూచి వారూ.. ఆశ్చర్యపోయారు.. తప్పు చేశామని మనుసున ఇరువురూ అనుంటూ పిలిచి వెంటనే వెనుదిరిగారు.. ఉదయపు ఆ సన్నివేశం నచ్చక. * * * సమయం సాయంత్రం.. ఆరున్నర.. గోపాల్ ఇతర మిత్రులు.. ఐదు కుటుంబాల వారు.. వారి పిల్లలు (ముగ్గురికి ఒకొక్కరు.. ఇరువురికి ఇద్దరు) వచ్చారు. రాజారావుగారు తమ పిల్లలకు ఎప్పుడూ కేక్ కట్ చేయించి జన్మదినాలను జరపలేదు. గోపాల్ కూడా అదే విధానాన్ని పాటిస్తున్నాడు. ఉదయాన్నే బిడ్డకు తలంటి స్నానం చేయించి.. కొత్త బట్టలకు కుంకుమ రాసి తొడిగి పెద్దలందరికీ పాదాభివందన చేయించి.. దేవుడికి నైవేద్యంగా పెట్టిన పాయసాన్ని.. గారెలను.. బూరెలను అందరికీ పంచి.. ఆనందంగా అందరూ కలసి భోజనం చేయడమే వారి పద్ధతి. అది ఆరంభం అయింది. ప్రక్కింటివారు.. గోపాల్ ఇంటికి ఎనిమిదింటికి వచ్చారు. వారు వచ్చేసరికి వచ్చిన వారిలో కొందరు వెళ్లడానికి బయలుదేరారు.. వారిని చూచిన శరభేశ్వరరావు బృందం ఆశ్చర్యపోయింది. “గోపాల్ !.. వేరీజ్ కేక్ !..” ఆశ్చర్యంతో అడిగాడు మాధవ్. “నో కేక్ !..” చిరునవ్వుతో జవాబు చెప్పాడు గోపాల్. “దెన్ వై యు కాల్ అజ్ ?..” ఆవేశంగా అడిగాడు మాధవ్. ఆదిలక్ష్మి.. ఆ ఇంటివారినందరినీ పరిశీలనగా చూచింది. సుశీల ముఖంలోకి చూచి.. “ఏయ్ !.. ఓల్డ్ లేడీ !.. వై యు హ్యావ్ కమ్ టు అవర్ హౌస్.. అండ్ కాల్ అజ్.. యు డోన్నో హౌటు కండక్ట్ బర్త్ డే పార్టీ.. షేమ్!.. సుందరీ !.. రభేష్.. లెటజ్ !.. నాన్ స్టాండ్రెడ్ ప్యూపిల్స్ !..” అసహ్యించుకొంటూ తన ఇంగ్లీషు భాషా పరిజ్ఞానాన్ని అంతా ప్రదర్శించింది. అందరు ఆశ్చర్యపోయారు. బిక్క ముఖాలతో ఆమెను చూచారు. అంతవరకూ మౌనంగా వున్న రాజారావ్.. “రేయ్ !.. శరభేశ్వర్ !.. నీ భార్యకు చెప్పు.. నోరును అదుపులో పెట్టుకోమని.. ఎవరి ఇంటి పద్ధతులు వారివి. ఆవిడ.. ఆ టీషర్టు.. జీన్ప్యాంట్.. లిపిక్.. అదే డిటోగా నీకూతురు సుందరి.. ఆవిడ ముగ్గురు పిల్లలూ!.. ఇదా మన నాగరికత.. మీరు ఈ దేశస్థులా !.. విదేశస్థులా !.. ఐదుగురు ఆడవారు.. ఒక్కరి ముఖాన బొట్టులేదు.. చేతులకు గాజులు లేవు. యాభై సంవత్సరాలు పైబడ్డ మీ ఇల్లాలి అవతారం ఎంత అందవికారంగా వుందో.. కళ్లు తెరచి చూడు.. మీరు కోరిన కేకు ఇక్కడ లేదు.. కమ్మటి పాయసం.. మినపగారెలు.. పులుసన్నం.. పెరుగన్నం వున్నాయి. కావాల్సిన వాటిని ఎంతకావాలో అంతా తినండి. మనం తెల్లవాళ్లం కాదని.. పదహారణాల ఆంధ్రులమన్న విషయాన్ని మరచిపోకండి.. మీరు చేసే పొరపాట్లను.. మీ సంతతి.. ఈ చిన్నారుల పాలు చేయకండి.. సమాజంలో నేడు ఆడపిల్లల విషయంలో ఎన్నో అన్యాయాలు.. అరాచకాలు జరుగుతున్నాయి.. దానికి కారణం మన పెంపకం.. ఆడబిడ్డలను మన కళ్లలా జాగ్రత్తగా కాపాడాలి.. వారు ఎదిగి మంచి ప్రతిభతో హైందవ సమాజానికి.. దేశానికి గౌరవాన్ని ప్రసాదించే వారుగా తీర్చిదిద్దడం మన బాధ్యత. నీ మనుమరాళు ముగ్గురూ బంగారు తల్లుల్లా వున్నారు. వారికి మన హైందవతను గురించి నేర్పండి. సార్ !.. శరభేశ్వరరావుగారూ!.. మీ ఆవిడ నా ఇల్లాలును అవమానించింది. అది చాలా పెద్దతప్పు.. నీవు నా బాల్య మిత్రుడవు. అందుకే నేను నావారు నమ్మి ఆచరించే హైందవ విధానాన్ని నీకు చెప్పాను. మిత్రమా!.. హైందవ ధర్మాలను ఆచారాలను సంకరం చేయకండి. బంగారు భవిష్యత్తు ఉన్న మన వారసులను పెడదారి పట్టించకండి. మన భాషను గౌరవించండి. తేనెలూరే తెలుగు మన పిల్లలకు ప్రీతిగా నేర్పించండి. నామాటలు నచ్చితే మీరు కూర్చొని మా ఆతిధ్యం స్వీకరించి నా మనుమణ్ణి ఆశీర్వదించండి. నచ్చకపోతే ప్లీజ్ అవుట్!..” ఆవేశంగా రాజారావుగారు చెప్పారు. వారి కళ్లల్లో ఆవేదన.. ఆవేశపూరిత కన్నీరు. శరభేశ్వరరావు.. వారి బృందం కూర్చున్నారు. సుశీల మాలతి వారికి ప్రీతిగా టిఫిన్ పెట్టారు. పాయసాన్ని ఇచ్చారు. వారు తిని.. ముకుందును ఆశీర్వదించారు. రాజారావుదంపతులకు చేతులు జోడించారు. “మిత్రమా.. నా కళ్లు తెరిపించావు.. ధన్యవాదాలు..” అందరూ మౌనంగా వెళ్లిపోయారు. * * * //సమాప్తి //

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.


57 views0 comments
bottom of page