పెళ్ళంటే
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- Apr 18, 2023
- 1 min read

'Pellante' New Telugu Story
Written By Ch. C. S. Sarma
'పెళ్ళంటే' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
తండ్రి బలరామరాయుడు. కూతురు అమెరికా రిటన్ మల్లీశ్వరి.. ఉదయం ఆరున్నప్పుడు వారంతా ముందలి లాన్ లో కూర్చొని కాఫీ త్రాగుతున్నారు.
వారి మధ్యన బలరామ్ రాయుడుగారి భార్య మంగమ్మ..
‘‘డాడీ!..’’ కాపీ సిప్ చేసి పిలిచింది మల్లీశ్వరి..
‘‘ఏం తల్లీ!..’’
‘‘రేపు నన్ను చూచేదానికి మీ ఫ్రెండ్ కొడుకును రమ్మన్నారా!..’’
‘‘అవునురా!..’’
‘‘డాడ్!..’’
‘‘ఏమ్మా!..’’
‘‘నాదో కోరిక..’’
‘‘ఏమిటది? చెప్పు!..’’
‘‘మీరు పేపర్లో నా వివరాలతో ఏడ్ వేయండి. పెండ్లి కొడుకులను ఈ మన గ్రామానికి ఆహ్వానించండి. ఎలాంటి వారు.. ఎంతమంది వస్తారో చూద్దాం. అందులో మీ ఫ్రండ్ కొడుకునూ రమ్మని చెప్పడి. నా మేరేజ్ ప్రపోజల్ నావల్ టీ గా జరగాలి!..’’ కాళీకాఫీ కప్పును టీపాయ్ పై వుంచి అవసరానికి వేగంగా ఇంట్లోకి పోయింది మల్లీశ్వరి.
మంగమ్మ తెరిచిన నోరు మూయలేదు..
బలరామ్ రాయుడు భార్య ముఖంలోకి ఆశ్చర్యంతో చూచాడు. ‘‘గోవిందయ్యా!..’’ బిగ్గరగా పిలిచాడు..
గోవిందయ్య వారి దివాంజీ / గుమాస్తా. వరండాలో నించి పరుగెత్తుకొని లాన్ లోకి వచ్చాడు. సాధరణంగా వారి డ్యూటి ఎనిమిది టు ఒకటి. రెండు టూ ఏడు.. అమ్మాయిగారు అమెరికాలో యం.యస్. ఆతరువాత యం.బి.ఏ. చేసి వచ్చింది. కాబట్టి.. ఆమెకు ఎప్పుడు ఏది అవసరం అవుతుందో.. ఏం కోరుతుందోనని రాయుడు గోవిందు టైమును మార్చారు.. ఆరుటు పన్నిండు. రెండు టూ ఎనిమిది..
‘‘అయ్యా!..’’ వినయంతో కూడిన పలకరింపు.
‘‘రేపు తెల్లారేటప్పటికి అన్ని ప్రాంతీయ్య పేపర్లలో అమ్మాయి ఫోటో.. వరుడుకావలెను.. ఇంజనీర్.. డాక్టర్.. లాయర్. ఉన్నతమైన ఫ్యామిలీ!.. ఈ ప్రకటన రావాలి. ఇన్ టర్ వ్యూ మన వూర్లో.. మన ఇంట్లో!.. సరేనా!..’’ గంభీర్యంగా అడిగాడు బలరామ్ రాయుడు.
మంగమ్మ తల కొట్టుకొంటూ.. ‘‘ఆ కూతురు కోతికోరికలు కోరడం.. తండ్రి కోరొందిలా పాటించడం.. బాగుంది..’’
‘‘చాలా బాగుంది!..’’ వేగంగా ఇంట్లోకి పోయింది.
రాయుడికి కొంచం చవుడు. మిషన్ వుంది. అది ఉదయం కదా చవికి తగిలించలేదు. భార్య ఆవేశంగా ఏదో అన్నాదని గ్రహించాడు. కానీ.. ఆమె మాటలు అర్థం కాలేదు.
‘‘మీ అమ్మ అన్నది నీకు అర్థం అయిందిరా గోవిందా?..’’ అడిగాడు.
‘‘బాగా అర్థం అయింది!..’’ తల ఆడించాడు గోవిందుడు.
‘‘ఏమంది?..’’
‘‘మీ అబ్బా కూతురులాంటి వాళ్లు ఈ ప్రపంచంలో లేరంది! సరే పని చెప్పారుగా.. నేను వీధిన పడతా!..’’ అరిచి చెప్పి వెళ్లిపోయాడు.
గోవిందు వీధిలోకి రాయుడు ఇంట్లోకి ప్రవేశించాడు..
గోవిందుడు ప్రక్కన వున్న జిల్లా రాజధానికి వెళ్ళి ప్రకటన ఇచ్చి ప్రూఫును తీసికొని వచ్చి బలరామరాయుడికి కుమార్తె మల్లీశ్వరి సమక్షంలో ఇచ్చాడు. తండ్రి కూతుళ్ళకు మహదానందం.
* * *
ఆ రోజున ఆ గ్రామానికి వారి ఇంటికి నలుగురు పెండ్లికొడుకులు వచ్చారు. మల్లీశ్వరి తెల్లని తెలుపు. చందమామలా వుంటుంది. ఇరువురు వరులు నలుపు. తండ్రి కూతుళ్ళు వారితో మాట్లాడనేలేదు. అదే వున్నబలం. మూడో వ్యక్తి పశువుల డాక్టర్. పేరు గోవిందరాజులు.. తండ్రి కూతుళ్ళు ప్రక్కప్రక్కన అతను ఎదురుగా కూర్చొన్నారు.
‘‘నాలో మీకు ఏం నచ్చింది?..’’ చిరునవ్వుతో అడిగింది మల్లేశ్వరి. అతను వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. కొన్ని క్షణాల తరవాత అతనికంటే ముందు మల్లీశ్వరి..
‘‘వు ఆర్ వెరీ స్లో!.. సారీ ఐ డోన్ట్ లైక్.. వుప్లీజ్!..’’ ద్వారాన్ని చూపించింది.
నోరు విప్పబోయిన గోవిందరాజులు లేచి మౌనంగా బయటకి నడిచాడు.
నాల్గవ వ్యక్తి దేవరాయ. డాక్టర్ నవ్వుతూ హాల్లోకి ప్రవేశించాడు. అందరికీ విష్ చేశాడు. వారు చెప్పకముందే వారి ఎదుటి కుర్చీలో ఠీవిగా కూర్చొని తన విజిటింగ్ కార్డును.. మల్లీశ్వరి వంక చూస్తూ బలరామరాయుడికి అందించాడు.
‘‘థ్యాంకూ బాబు!..’’ అన్నాడు రాయుడు
‘‘నన్ను మీరు ప్రేమిస్తున్నారా!..’’
‘‘లేదు!..’’ నెస్టు సెకండ్ జవాబు.
‘‘పెండ్లి చేసికొంటారా!..’’
‘‘అవును, ఆ తర్వాత ప్రేమిస్తాను!..’’
‘‘ఎంతగా ప్రేమిస్తారు?..’’
దేవరాయ లేని నవ్వూతూ ‘‘బై".. చేయి విసిరి వెళ్ళిపోయాడు!
బలరామరాయుడు, మల్లీశ్వరి.. మంగమ్మలు ఆశ్చర్య పోయారు.
* * *
‘‘అంబ పలుకు.. జగదాంబ పలుకుతుంది.’’
‘‘తల్లే.. పలుకు.. పలుకు..’’
బుడబుక్కల దేవర ఢమరకాన్ని వాయిస్తూ మంగమ్మగారి ఇంటిముందు పలికిన పలుకలవి..
‘‘జొన్నవాడ కామాక్షమ్మ పలుకు.. అల్లూరి దుర్గమ్మ పలుకు..’’
ఢమరుక శబ్ధం.. ఢుబు..డుబు..డుబు.. డుబు.. డుబు..
‘‘సూళ్ళూరిపేట చెంగాలమ్మ పలుకు.. కావల కళుగోళ్ళమ్మా పలుకు..’’
డుబు..డుబు..డుబు..డుబు..డుబు.. ఢమరకం సవ్వడి.
ఆ ఇంట్లో ఇల్లాలు మంగమ్మ కూతురు.. యుక్త వయస్కురాలు..
అమెరికాలో యం.యస్.సి. యం.బి.ఎ చదివి వచ్చిన మల్లిశ్వరి వున్నారు. మల్లీశ్వరి తండ్రిగారు బలరామ్ రాయుడు పనిమీద పొరుగు వూరికి వెళ్ళయున్నారు.
సమయం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతం..
మంగమ్మ వయస్సు యాబై.. జంగదేవర్లు అన్నా.. బుడబుక్కల వారు అన్నా.. చిలక జోస్యులు అన్నా.. సోది చెప్పే అక్కలన్నా మంగమ్మ గారికి మంచి నమ్మకం.
ఆమె పుట్టింది ఒక చిన్న వంద ఇళ్ళ పల్లెటూరు. మెట్టింది మూడువందల ఇళ్ళు వున్న పెద్దవూరు..
వంశపారం పర్యంగా కొందరు పై వృత్తుల వాళ్ళు గ్రామాలల్లో పర్వదినాల్లో తిరిగి జగన్మాతను తలచుకొంటూ.. వారికి తోచిన మంచి మాటలను ఇళ్ళముందు పలికి.. ఇంటి వారు సంతోసంగా ఇచ్చిన కానుకలను స్వీకరిస్తారు. వారిని మనసారా దీవిస్తారు.
బుడబుక్కల దేవర వాక్కులు విని.. మంగమ్మ వంటగదినుండి వీధిగుమ్మం వైపుకు నడిచింది.
పళ్ళు తోముకుంటున్న మళ్లీశ్వరి.. బుడబుక్కల అతను తమవాకిట చేరి.. తన ప్రశాంతతకు భంగం కలిగించినందున.. అతన్ని చూచి నాలుగు చెడా పెడా వాయించాలనుకొంది. వేగంగా బ్రష్ చేయసాగింది.
దేవర.. మంగమ్మ రాకను గమనించాడు.
ఢమరకాన్ని.. డుబు.. డుబు.. డుబు.. డుబు.. డుబు.. నినదం బిగ్గరగా వెలువడేలా చేతిలో వేగంగా త్రిప్పసాగాడు. అది అద్భుతమైన నాదం వీనులకు విందు.
‘‘బెజవాడ కనకదుర్గమ్మ పలుకు.. కాశీ విశాలాక్షితల్లి పలుకు.. కలకత్తా కాళీమాతా పలుకు..’’ కమ్మనిస్వరం.. ఆనందనాదం.. మంగమ్మ దేవరను సమీపించింది.
తలచుట్టూ ఎత్తయిన తలపాగ.. దానికి నాలుగు వైపులా స్థూపాకారపు మిరమిల మెరిసే ఇత్తడి కమ్ములు.. విశాలమైన నొసటన విభూతి రేఖలు.. మధ్యగీతపై నడుమ రూపాయిసైజు సిందూరపు బొట్టు.. కనుబొమల నడుమ చూపుడు వ్రేలు వెడల్పు కాటుక (రక్ష) దాని మధ్యన కాషాయరంగు తిలకం.. ఎడమ చేతిలో ఢమరకం.. చంకకు జోలి.. దేవర చూచే దానికి సాక్షాత్.. ఆవేషధారణలో వచ్చని పరమశివునిలా గోచరిస్తున్నాడు.
‘‘అబ్బీ!..’’
‘‘తల్లీ!..’’
‘‘చాలాఏలికి!..’’
ఇరువురూ ఇంటి వరండాని సమీపించారు.
‘‘మీ దేవురు?..’’
‘‘నెల్లూరు మూలాప్పెట!..’’
‘‘నీ పేరు?..’’
‘‘దేవర..’’
‘‘మీనాన్నగారి పేరు?’’
‘‘బ్రహ్మన్న!..’’
‘‘ఆఁ నీవు బ్రమ్మన్న కొడుకువా?..’’ ఆశ్చర్యంతో అడిగింది మంగమ్మ.
దేవర తండ్రి ఆమె స్వగ్రామానికి వెళ్ళేవాడు.
తలవూపాడు దేవర..
ఇంతలో మల్లీవ్వరి వచ్చి తల్లి ప్రక్కన నిలబడింది.
‘‘వేరే పని చేసికోలేవా?.. ఉదయాన్నే వూరి మీద పడ్డావ్?..’’ ఆవేశంతో అడిగింది మల్లీశ్వరి..
నేను చేస్తున్నది పనే చిన్నీ!.. ఇది మా కులవృత్తి!..’’ చిరునవ్వుతో జవాబు చెప్పాడు దేవర.
‘‘చిన్నీ!.. ఎవరాచిన్నీ!..’’ వ్యంగ్యంగా అడిగింది మల్లీశ్వరి.
‘‘దేవరా!.. ఇది చిన్న పిల్ల. దాని మాటలను లెక్కపెట్టుకోకు. ఏదో నీకు.. మా గురించి తోచిన నాలుగు మాటలు చెప్పు!..’’ ప్రాధేయ పూర్వకంగా అడిగింది మంగమ్మ!..
‘‘ఆ..ఆ.. చెబుతానత్తా!.. ఆ..సారీ.. చెబుతానమ్మా!..’’ కళ్ళు మూసుకొంటాడు దేవర.
డుబు.. డుబు.. డుబు.. డుబు.. డుబు..అతని ఢమరికనాదం వినసొంపుగా వుంది.
మళ్లీశ్వరి తన చేతులతో చెవులు మూసుకొంది.
‘‘వీరిని చులకనగా చూడకు. వీరు జగన్మాత ఉపాసకులు. వీరి నోటి వాక్కు ఫలిస్తుంది. నేను వారిని అడగబోయేది నీగురించే! ఐదుగురు అబ్బాయిలు వచ్చారు. వెళ్ళిపోయారు. ఒక్కరూ నీకు నచ్చలేదుగా, నీ వయస్సు ఇప్పుడు ఇరవై ఎనిమిది. నీ వయస్సుకు నేను ముగ్గురు బిడ్డల తల్లిని. తెలుసుకో!..’’ ఆవేశంగా చెప్పింది మంగమ్మ.
‘‘ఆ..ఆ.. ఆ విషయం నాకు చాలా అవసరం? నచ్చినోడు.. రావాలిగా!..’’ ఆవేశంగా అంది మల్లీశ్వరి.
డుబు..డుబు..డుబు..డుబు.. డుబు.. ఢమరుక రవం..
‘‘చిన్నీ!.,. వచ్చాడు. నీకు నచ్చినోడు వచ్చాడు.. వూర్లోకి వచ్చాడు.’’ నవ్వుతూ చెప్పాడు దేవర.
తల్లీ కూతుళ్ళు ఆశ్చర్యపోయారు..
‘‘ఎప్పుడు దేవరా?..’’ అడిగింది మంగమ్మ ఆత్రంగా..
‘‘ఈరోజు!..’’
‘‘నిజంగానా!..’’ అంది మంగమ్మ..
‘‘మీ ఇంటికి మీరు పిలిస్తే వస్తారు. నేను చెప్పవలసింది చెప్పేసినా!.. వస్తా!..’’ క్రికంట మల్లీశ్వరి ముఖంలోకి చూచి నవ్వి.. వేగంగా వీధివాకిట వైపుకు నడిచాడు దేవర..
మంగమ్మ పిలిచింది దేవర ఆగలేదు. వీధివాకిటిని సమీపించాడు. కోటు బేజునుండి మడచిన కాగితాన్ని తీసి.. వీధిగేటు వద్ద జారవిడచి వీధిలో ప్రవేశించి వేగంగా ముందుకు వెళ్ళిపోయాడు.
పరుగున మల్లీశ్వరి వీధిగేటు వద్దకు చేరి క్రింది పడియున్న కాగితాన్ని చేతికి తీసికొంది. చూచింది.. చదివింది.
‘చిన్నీ!.. ఇది నేను మీకు పెట్టిన ముద్దు పేరు. నేను పెండ్లి చూపులకు వచ్చినప్పుడు.. మీరు నన్ను ఒకమాట అడిగారు. అది, నా కోసం ఏమైనా చేస్తారా?.. నేను తల ఆడించాను. వెళ్ళిపోయాను. ఈ మాస్టరేట్ డాక్టర్ కు మీరు బాగా నచ్చిన కారణంగా.. ప్రాక్టికల్ గా నా తత్వాన్ని మీకు చూపాలని ఈ వేషం వేశాను. సాయంత్రం ఐదు గంటలకు నేను నా మిత్రులతో కలసి మీ ఇంటికి వస్తాను. వీధిగేటు దగ్గర మీరు నిలబడి నాకు స్వాగతం పలికితే.. నేను మీ వాడిని. నాకంటికి మీరు అక్కడ కనబడకపోతే.. నేను నా మిత్రుడు వెనక్కు వెళ్ళిపోతాము. మనకోసం చాలామంది వెయిటింగ్. మీ జీవితం మీ ఇష్టం. విష్ యు ఆల్ ది బెస్ట్..’’ దేవర..
మల్లీశ్వరికి ఎంతో ఆశ్చర్యం.. ఆనందం.. అనుమానం..
కళ్ళు తుడుచుకొంది. ఆ లేఖను మరోసారి చదివింది. వదనంలో ఆనందం. మనస్సున సంతోషం.. శరీరంలో పరవశం..
‘‘అమ్మా!.. నాకు నచ్చినోడు సాయంత్రం వస్తున్నాడు.’’ ఆనందంగా నవ్వుతూ బిగ్గరగా అరచి తల్లివైపుకు పరుగెత్తింది. వీధిగేటు తెరుచికొని లోనికి వస్తూవున్న బలరామ రాయుడు మల్లీశ్వరి మాటలను విని నవ్వుతూ ఇంటివైపుకు నడిచాడు.
రెండు కుటుంబాల పెద్దలు కలసి ఆనందంగా మాట్లాడుకొని మల్లీశ్వరి దేవరా వివాహాన్ని నెల తరువాత.. గొప్పగా జరిపారు.
సమాప్తం.
|
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.
అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.
మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.
Comments