top of page
Writer's picturePudipeddi Ugadi Vasantha

పెళ్ళిభోజనం


'Pelli Bhojanam' - New Telugu Story Written By Pudipeddi Ugadi Vasantha

Published In manatelugukathalu.com On 10/10/2023

'పెళ్ళిభోజనం' తెలుగు కథ

రచన, కథా పఠనం: పూడిపెద్ది ఉగాది వసంత

"హాయ్ పిల్లలు అందరు హాల్లోకి రండి, అమ్మ కూల్ కూల్ లస్సితో ఎదురుచూస్తోంది " అందరిని తన పిలుపు చేరాలని, కాస్త గట్టిగాపిలిచింది రమ.


"వైశాఖ మాసపు ఎండలు గీరెక్కించేస్తున్నాయంటే నమ్ము. మామూలు పనులు చేసుకోడానికే ఓపిక చాలదు. అందులోనూ ఆడపెళ్లివారింట పనులంటే చెప్పతరం కాదు. " ఉస్ అని పెద్ద నిట్టూర్పుతో హాల్లో సోఫాలో చతికిలబడ్డాడు అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన రమణ. అందరు అప్పుడే గూటికి చేరారు ఆరోజు పెళ్లిపనుల షెడ్యూల్ ముగించుకుని.


ఇంతలో దివ్య, నవ్య కూడా హాల్లోకొచ్చి, ఏసీ కాస్త పెంచి, కూర్చున్నారు.


రమా, రమణ ఇద్దరు బ్యాంకు ఉద్యోగులే. వారికి ఇద్దరాడపిల్లలు. పెద్దకూతురు దివ్య బీ టెక్ చదివి, గూగుల్ లో ఉద్యోగం చేస్తోంది, పెళ్ళై రెండేళ్లయింది. చిన్న కూతురు నవ్య కూడా బీ టెక్ చదివి, టాటా కన్సల్టెన్సీ లో ఉద్యోగం చేస్తోంది, ఇప్పుడు నవ్య పెళ్లి పనుల బిజీ లోనే ఉన్నారు.


అందరు లస్సి తాగి స్థిమితపడ్డాకా చెక్ లిస్ట్ తీసి, అప్పటివరకు జరిగిన పనులను టిక్ చేసేసి, ఇంకా ఏమేమి మిగిలున్నాయో, ఎవరెవరు ఏమేమి చేయాలో చర్చించుకున్నారు.


"రేపుదయాన్నే, క్యాటరర్ వస్తాడమ్మా, మనకొచ్చే అతిధుల ఇష్టాన్ని బట్టి, ఐటమ్స్ నిర్ణయించుకుంటే మంచిది. ఎందుకంటే, అతిధులు తృప్తిగా భోంచేసి, వధూవరులను ఆశీర్వదిస్తే దేవుడు ఆశీర్వదించినట్టే తల్లి!! భోజనం హిట్ అయితే, పెళ్లి చాలా బాగా అయిందని చెప్పుకుంటారు రా".


"ఏ పని చేసినా, మన గతమే మనకి పెద్ద బాలశిక్ష గా ఉపయోగపడాలి. " స్థిరంగా చెప్పింది రమ


"మీకు గుర్తుంది గా, దివ్య పెళ్ళికి కేటరింగ్ విషయం లో, ఎవరో సలహా చెప్పేరు 'మగపెళ్ళివారికి క్యాటరింగ్ బాధ్యత అప్పచెప్పేస్తే, సహానికి సహం పేచీలు, గొడవలు తప్పుతాయి, ఎక్కువగా గొడవలొచ్చేది పెళ్ళిభోజనాల వద్దే ' అని. అది పట్టుకుని మనం, కేటరింగ్ బాధ్యత దివ్య అత్తింటివారికి అప్పజెప్పేసాము. వాళ్ళు, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, మార్వాడి అగడం, బొగడం అని, పలు రకాల కౌంటర్లు పెట్టించారు భోజనాల్లో.


"అన్ని రకాలు పెడితే, ఏది తినాలో అర్ధంకాక, ప్రతిదీ వడ్డించేసుకుని, తినకుండా వదిలేయడం తో, చాల ఫుడ్ వేస్ట్ అయిపోయిందిట. తిరనాళ్ళని మరిపించే రష్ లో, ఆయా కౌంటర్లన్నీ తిరిగి, తిరిగి ఏమేమి ఉన్నాయి అని చూసేసరికే అలిసిపోయారట అతిధులు. ఏదో ఇంత తినేసి పోదాములే అని చాలామంది అసంతృప్తిగా తిన్నారని తెలిసింది.


"నిజం చెప్పాలంటే వాళ్లలో చాలామంది విసుక్కున్నారట మనమీద. 'వీళ్లకేమయింది ఇలాంటి భోజనాలు తగలెట్టారు!! శుభకార్యం అంటే, పూర్ణం వేయాలి, పచ్ఛన్నం కలపాలి, పప్పు, దప్పడం, కందా బచ్చలి, ఇంత కొబ్బరి పచ్చడి, దోసావకాయ గట్రా పెట్టి, విస్తరేసి వొడ్డిస్తే, అందరు తృప్తిగా తింటారు కదా.. బిక్షగాడి బొచ్చెలా పట్టుకుని, "మాదాకబళం" తల్లి అంటూ తిరిగినట్టుండకూడదు' అని.

"సరే సరే ! అందుకేగా ఈసారి ఆ తప్పు చేయదలుచుకోలేదు మనం. పెళ్లంటే ఆడపెళ్ళివారు చేసేది, అంచేత ఎందులో ఎలాంటి లోపాలున్నా, అవి ఎవరివల్ల అయినా, అవి మనం చేసినట్టే లెక్క కదా. " ముక్తాయించాడు రమణ.


"గొడవలంటే ఏంటమ్మా.. ఆ కూర బాలేదు, ఈపులుసు బాలేదు, ఉప్పు లేదు లాంటివా ?"


"అయ్యో అదేమడుగుతావులేరా, ఇండియా పాకిస్తాన్ యుద్ధాలు తీరుగా కూడా అవుతుంటాయి, కొన్ని సార్లు. "

పెళ్లిపనులగురించి మాట్లాడుకుంటూ, ఒక్కొక్కరు శుభలేఖలమీద, వేరే ఊళ్లలో ఉండే చుట్టాలు, స్నేహితుల అడ్రస్లు రాస్తున్నారు, మర్నాడు పోస్ట్ ఆఫీసుకెళ్లి అందించాలని. ఆలా రాసుకుంటూ, పెళ్లిళ్లు వాటి భాగోతాల గురించి, పెళ్లిళ్లలో వచ్చే తగాదాల గురించి మాట్లాడుకున్నారు.



"ఆరోజుల్లో, మగపెళ్ళివారంటే, మహా పేచీకోరుల్లా వుండేవారురా, కోడిగుడ్డుమీద వెంట్రుకులు వెతికేవారు. పెళ్లికొచ్చిన మగపెళ్ళివారికి అన్ని ఏర్పాట్లు చూడడానికి బాగా తెలివైన, మంచి ప్రవర్తన కలిగిన వారిని పంపేవారు ఆడపెళ్ళివారి తరఫునుంచి. మగపెళ్లివారు ఎంత విసిగించిన సరే, సహనం కోల్పోకుండా, చాకచక్యంగా వ్యవహరించి, సమస్య పెద్దది కాకుండా చూడడం వీరి బాధ్యత.


పెళ్ళికి తరలి వచ్చిన మగపెళ్ళివారి కోసం అన్ని సౌకర్యాలు కలిగిన ఒక విడిదిని ఏర్పాటు చేసేవారు ఆడపెళ్ళివారు. పొలిమేరల్లోనే బ్యాండ్ మేళంతో సహా ఎదురెళ్లి, వారికి సాదరంగా స్వాగతం పలికి, ఆ విడిదింటికి తీసికెళ్ళేవారు.


మా పెద్దక్క తెలుసుగా, దానిపెళ్లిలో అతి చిన్నవిషయానికి, ఎంత పెద్ద గొడవ చేసేరో తెలుసా?


నానాజీ మావ, శంకరం మావ తెలుసుగా, వారికి మగపెళ్ళివారికి ఏర్పాట్ల చూసే బాధ్యత అప్పజెప్పారు. వారు వంటవారితో బిందెతో కాఫీ తీసికెళ్ళి, పెళ్లిపెద్దలకి ముందుగాను, తర్వాత మిగతా వారికీ ఇస్తుండగా, ఓ మూలనుండి దెబ్బలాటధోరణిలో కేకలు వినిపించించాయి. "ఇది కాఫీ యా అంటూ "ఛ, ఛీ, థు" "MK వాటర్ (మురుక్కాలవ నీరులా )" లా ఉంది, అంత గతికడుక్కుపోయి ఉన్నామనుకుంటున్నారా " అక్షరాలు నిప్పులు కురిపిస్తుంటే, ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. దీనికి కారణం ఏంటంటే, పెళ్లి పెద్ద లక్ష్మమ్మ గారి కోసం చిక్కగా ఓ కంచు గ్లాసుడు పాలలో, ఓ చెంచా డికాక్షన్, రెండు చెంచాల పంచదార వేసి, నురగలు కక్కుతున్న కాఫీని ఇద్దరు ఆడంగులు తెచ్చి అతిమర్యాదతో ఇవ్వడం చూడడం జరిగింది అక్కడివారు. ఆవిడ కాఫీ ఇలాగె ఉండాలని ముందుగానే స్పెసిఫికేషన్ ఆడపెళ్ళివారికి తెలియజేసారు, లేదంటే, ఆవిడ భూమ్యాకాశాలు ఏకం చేసేస్తారనీను. అందుకే కంచుగ్లాస్ కూడా మర్చిపోలేదు.


"ఇలాంటివారితో వియ్యమందితే ఇంతే సంగతులు, పెళ్లి కేన్సిల్ చేసేయండి " పెళ్లికొడుకుకి చిన్నాన్న వరస అయిన ఆసామి దూకుడుపోయాడు. వంతపాడారు మిగతా వారు.


పక్కనే తన స్నేహితులతో కలిసి పేకాడుకుంటున్న పెళ్ళికొడుకు, "అతికష్టం మీద మా బాస్ కాళ్లావేళ్లా పడి ఓ పదిరోజులు లీవ్ గ్రాంట్ చేయించున్నారర్రా, మళ్ళీ ఆ గాడిద కాళ్ళు పట్టుకోలేనర్రా బాబు, సర్దుకుపొండిరా ప్లీజ్ " ఎవరి బాధ వారిది.


నానాజీ, శంకరం మావలు అక్కడికి వెళ్లి క్షమార్పణలు చెప్పి, చిటికెలో మంచి కాఫీ పంపిస్తామని చెప్పి అక్కడ మంటలు ఆర్పారు. బతుకుజీవుడా!! అని నిట్టూర్చారు అందరు.


"ఆమ్మో ఇంత జరిగేదా ఆ రోజుల్లో ? కల్యాణానికని వచ్చి, కయ్యానికి కాలు దువ్వినట్టు లేదూ ? ఆమ్మో మేమైతే చచ్చినా అలాంటి ఇంటికి కోడలుగా వెళ్ళడానికి ఒప్పుకునేవాళ్ళం కాదు " అన్నారు దివ్య, నవ్య


****

నలుగురు ఓ గంట తర్జన భర్జనలు పడి, భోజనం ఎలా ఉండాలి అన్నది నిర్ణయించుకున్నారు.


"ఇప్పుడు పెళ్లికూతురు ఇష్టాలని కూడా కనుక్కుని, ఆ ఐటమ్స్ కూడా పెడుతున్నారు. నన్నయితే అస్సలు అడగలేదు" దివ్య బుంగమూతి పెట్టింది.


"మనింట్లో మొదటి పెళ్లి కదరా, మాకు ఎలాంటి అనుభవము లేదు కదా, శ్రేయాభిలాషులు, పెద్దవాళ్ళు ఎలా చెపితే అలా చేసేసాము. అయినా, ఒక సంగతి చెప్పనా, ఎవరి పెళ్లి భోజనం వారు ఎప్పుడు తృప్తిగా తినే వీలుండదు తెలుసా ? అంతెందుకు నా పెళ్ళిభోజనంలో అన్ని నాకిష్టమైనవే ఉన్నా సరే, ఏవీ తినలేకపోయాను. అలాగే, వారి తల్లితండ్రులు కూడా అవేవి ఆస్వాదిస్తూ తినే వీలుండదు సవాలక్ష పనులు, టెన్షన్లు వలన.


దివ్య చెవిలో నవ్య ఎదో గుసగుసలాడింది. "ఓసోస్ ! అదేమంత కష్టమైనది, తీరనిది ఏమి కాదులే. నేను ఏర్పాట్లు చేస్తానుగా" గీత బోధించినప్పుడు కృష్ణుడు పెట్టిన పోజులా అభయమిస్తున్నట్టు చెయ్యి చూపించింది దివ్య.


అమ్మా, నాన్నలకి కూడా నవ్య కోరిన కోరిక చెప్పింది దివ్య. వాళ్ళు కూడా 'అయ్యో తప్పక మగపెళ్ళివారితో మాట్లాడి ఏర్పాటు చేద్దాం, అదేమంత పెద్ద విశేషం కాదన్నట్టు' స్పందించారు.


నవ్యకి చాలా ఎక్సయిటింగ్ గాను, థ్రిల్లింగ్ గాను ఉంది, పెళ్లిరోజు నాడు తీరబోయే తన కోరికని తలుచుకుంటుంటే.

****

పెళ్లంతా అయ్యాకా, వధూవరులని ఓ పక్కగా ప్రత్యేక ఆసనాల్లో కూర్చోబెట్టి, వారికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.


అప్పుడు పెళ్ళికొడుకు సూరజ్ గుసగుసగా అడిగాడు నవ్యని, "నీకేదో కోరిక ఉందిట కదా, అమ్మవాళ్ళు చెప్పేరు". సిగ్గుతో తలూపింది నవ్య. "అయితే నాకు కూడా ఒక కోరిక ఉంది, బ్యాచిలర్స్ పార్టీ లాగా, నేను బ్యాచిలర్ గా ఉన్నప్పటి లాస్ట్ లంచ్ ఇదేగా, మళ్ళీ రాత్రికి శీలం పోగొట్టుకుంటానుగా, చిలిపిగా అంటూ, ఈరోజు ఈ లంచ్ నా కుటుంబసభ్యులందరితో కలిసి చేయాలనీఉంది. నీకోరికకి నా ఈ కోరిక అడ్డం అవుతుందేమో ? ఏమి చేద్దాము ?


కుదరదా అన్నట్టు అయోమయంగా చూసింది నవ్య !


"తనవారిని పిలవమని కబురుపెట్టిన కజిన్ వచ్చి "అమ్మా, నాన్నలకి షుగర్ ఉంది అని, ముందే తినేశారని, అక్క గర్భిణీ కనుక తానూ వారితో తినేసిందని చెప్పగా అది విని, సూరజ్ బాగా నిరాశ పడినా, వెంటనే తేరుకుని, తొలిసారిగా తన భార్య కోరిక తీర్చబోతున్నందుకు ఆనందించాడు..


ఇంతలో, భోజనం ఏర్పాట్లు, కేవలం వధూవరులిద్దరికోసమే చేసి, ఐటమ్స్ అన్ని, సాంపిల్స్ లాగా విస్తట్లో వడ్డించి, వడ్డించుకోడానికి చిన్న చిన్న గిన్నెల్లో స్పూన్స్ వేసి పెట్టి, అందరు బయటికి వెళ్ళిపోయేరు.


తినడానికి ముందు, సూరజ్ వద్ద నవ్య మనసు విప్పింది. తాను ఎందుకు ఈ కోరిక కోరిందో వివరించింది. " ఎవరూ వారి పెళ్లి భోజనం వారు తృప్తిగా చేయలేదని అమ్మవాళ్ళు చెపుతుంటే, ఆశ్చర్యపోయాను. అదేంటి ఇంతా కష్టపడి, మెనూ ఎంపిక దగ్గరనుంచి అన్నింట్లోనూ ఉత్సాహంగా పాలుపంచుకున్న పెళ్లి కూతుళ్లు, వారి పెళ్లి భోజనం, వారు చేయలేకపోడం ఏంటి ? అని బాగా మధనపడి, దీనికి స్వస్తి పలికేలా చూడాలని అనుకున్నాను. నా పెళ్లి తర్వాత, వధూవరులిద్దరూ ఏకాంతంగా, తొలి భోజనం గా వారి పెళ్లి భోజనమే చేయాలనేది ఒక సంప్రదాయంగా మారాలని కోరుకుంటున్నాను. "


భోజనాలు చేస్తూకూడా నవ్య చెపుతోంది.. "ఇలా కలిసి అన్నిరకాల రుచులతో కూడిన భోజనం చేయడం ద్వారా, ఒకరి అభిరుచులు ఒకరికి తెలుస్తాయి కూడాను. ఇప్పుడు చుడండి, ఈ వంకాయకూరలో కొంచెం కారం తక్కువుంటే నాకిష్టం, మీరు దీన్ని బాగా ఇష్టంగా తినడం గమనించాను. మీ ఇష్టం తెలుసుకునే వీలు తోలి రోజే కలిగడం నా లక్. "


తన భార్య నవ్యత్వ ఆలోచనలకు సూరజ్ కి చాల సంతోషంగా ఉంది.


"అవును నవ్యా! ఓ మాట అడుగుతాను ఏమి అనుకోకు, మాచుట్టాల్లో చాలా మందికి ఈ భోజనం నచ్చలేదనుకుంటాను, వాళ్ళు ఏవేవో కామెంట్ చేస్తుంటే విన్నాను. ఇవేగా పెట్టి ఉంటారు. అన్ని బావున్నాయిగా ! ఏమై ఉంటుందంటావ్ ?, " నసుగుతూనే అడిగాడు సూరజ్.


"హాయ్ దొంగలు!! విష్ యు ఏ వెరీ హ్యాపీ మారీడ్ లైఫ్!!"


"హాయ్ స్వీట్ కపుల్, పెళ్లవగానే, మీ పెళ్లి భోజనం మీరు ఏకాంతంగా తింటున్నారు కదూ.. నా దృష్టే తగిలేలా ఉందర్రా, తినండి పాపం. ఈ అదృష్టం మా ఎవరికీ కలగలేదర్రా.


"ఎంతైనా నువ్వు నా మేనకోడలువి రా.. చాల మంచి కోరిక కోరావు రా " నెత్తిన సుతారంగా చిన్నగా మొట్టి, ముద్దు పెట్టుకుంది ప్రమీల.


" నేను ఈవెనింగ్ ఫ్లైటుకే తిరిగి వెళ్ళిపోవాలి నవ్యా, నా కూతురికి రేపు సిజేరియన్, తొలి కానుపు. " నిమిషానికి 200 పదాల స్పీడ్ లో మాట్లాడుతోంది ప్రమీల, నవ్యకి స్వయానా మేనత్త, బొంబాయి లో ఉంటారు వాళ్ళు.


ఆమె వాగ్ధాటి ఆగాకా, కుర్చీ లోంచి లేచి వచ్చి అత్తను వాటేసుకుందామనుకుంది నవ్య, కానీ బ్రహ్మ ముడి ఉండడంతో వీలుపడక, సడెన్ బ్రేక్ వేసింది, "హాయ్ అత్తా అసలు నువ్వు రాలేవనుకున్నాము, పాపం వదిన నిండు గర్భిణీ కదా.. దా అత్తా కూర్చో, నువ్వు ఈ పరిస్థితుల్లో రావడమే గొప్ప.. ఇదిగో ఈయనే సూరజ్, కాసేపటి క్రితం నాలో సగం అయ్యారు.. "నవ్య మొహం లో వేయి పున్నముల వెలుగు నిండి ఉండడం ప్రమీల గమనించి, చాల తృప్తి పడింది.


"సూరజ్ నేను లోపలికొస్తున్నప్పు, నువ్వు నవ్యని ఓ ప్రశ్న అడిగావు. అదింకా చిన్నపిల్ల, అదేం చెపుతుంది ? అనుభవం ఉన్నదాన్ని, నేనే సమాధానం చెపుతాను, మరోలా భావించకండి. ఇవాళ ఒక్కరోజే, అంటే మీరు మగపెళ్ళివారిగా ఈ విడిదింట్లో ఉన్నంతవరకే కదా మీ వాళ్లు వారి దర్పం ప్రదర్శించగలరు. రేపు వచ్చినా కూడా, ఈ వైభవం, ఆడపెళ్ళివారి అతిమర్యాదలు ఇంతలా పొందలేరు కదా.. ? అందుకె అదో ఆనవాయితీగా, మగపెళ్ళివారం అనే ఠీవి ని కొనసాగిస్తుంటారు "


వియ్యాలవారి విందు గురించి అన్నమయ్య కీర్తన కూడా ఒకటుంది, తొలిగా శ్రీరంగం గోపాలరత్నంగారు పాడారు.. ఆదిలా సాగుతుంది.. అని ఓ నాలుగు లైన్లు పాడింది ప్రమీల.

"విందు చేసినారు వియ్యాలవారింట..

విందు మాట చెపితే వింతగా తోచును..

పప్పు ఉడకాలేదు, చారు కాగలేదు

అరటికాయకూర పోపు అంటలేదు.."


మొత్తం పాటంతా వియ్యాలవారి వంటల గురించి వంకలే వినిపిస్తాయి. అంచేత, అందరు ఓమాటంటుంటారు, మహారాజునైన మెప్పించగలం కానీ మగపెళ్ళివారిని మెప్పించలేము అని.


పెళ్లికొచ్చిన వారికిదో ఫన్ నాన్నా! అవేవి పట్టించుకోకండి. ఇలాంటి వాటి మీద మీ ఇద్దరు అస్సలు టైం వేస్ట్ చేసుకోవద్దు, ఇలాంటివే కాపురాల్లో అగాధాలు సృష్టిస్తాయి పిల్లలూ!!


వారెవరితోను మీరు కలకాలం కాపురం చెయ్యక్కర్లేదుగా.. మీ ఇద్దరి ఇష్టాలని, అయిష్టాలని ముందు క్షుణ్ణంగా గా అర్ధం చేసుకుని, ఎవరు ఎంత వరకు రాజి పడగలరో ఆలోచించుకొని, ఒకరి కోపతాపాలనొకరు అర్ధం చేసుకుంటూ, సర్దుకుపోతే, అంతా ఆనందమే కదా. తాను తెచ్చిన వెండిగ్లాసులు ఇద్దరికీ చెరొకటి ఇచ్చేసి, ఆశీర్వదించి, వెళ్ళిపోయింది ప్రమీల.


మళ్ళీ వెనక్కొచ్చి చెప్పింది, ఒక గొప్ప సమాజ సేవికురాలిగా పేరు తెచ్చుకున్న ప్రమీల, "నీ ఆలోచన గ్రేట్ రా నవ్య.. నేను నీ ఆలోచనని ఒక సంప్రదాయం గా మార్చడానికి కృషి చేస్తాను రా. అది కాపురాల సుస్థిరతకి ఎంతో ఉపకరిస్తుంది. లవ్ యు !! గుడ్ లక్ !!


“మీ పెళ్లి భోజనం అదిరిపోయింది రా, అలాగే మీ సంసారం కూడా అన్నిరుచులతో కలగలిసిన కమ్మదనం సంతరించుకోవాలి. శతమానం భవతి! శతశతమానం భవతి !!”ఆశీర్వదిస్తూ నిష్క్రమించింది ప్రమీల.

***

పూడిపెద్ది ఉగాది వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: పూడిపెద్ది ఉగాది వసంత

నా గురించి స్వపరిచయం...మూడు కథా సంకలనాలలో నా కథలు అచ్చయ్యాయి. తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు సంపాయించుకున్నాయి. ప్రముఖ పత్రికలూ తెలుగు వెలుగు, నవ్య, విపుల, స్వాతి, సాక్షి , సహారి, మొదలైన పత్రికలలో నా కథలు విరివిగా అచ్చయ్యాయి . పోటీలలో కూడా చాల బహుమతులు వచ్చాయి .


నా కథ మీ మన్ననలు అందుకుంటుందని విశ్వసిస్తున్నాను.


కృతజ్యతలతో


ఉగాది వసంత


180 views4 comments

4 Comments


పెళ్లి భోజనం రచన ఆద్యంతం ఎంతో హృద్యంగా సాగింది. అద్భుతః అనిపించింది. అలనాటి ప్రముఖ రచయిత, మా ముత్తాత గారు కీ.శే. పూడిపెద్ది వేంకట రమణయ్య గారి శైలి ఉట్టి పడింది. వసంత గారికి అభినందన పూర్వక శుభాకాంక్షలు..🙏🙏🙏 -VISWANADHA SRINIVAS

Like

@venkataramp.s.3561 • 1 hour ago

Bagundi pellibhojanam. chala Baga chadivaru

Like

@sudharamanapudipeddi7857 • 4 hours ago

చాలా బావుంది పెళ్లి భోజనం కథ. చక్కని పదాలతో వాక్యాలు కూర్చేరు. వర్ణన, వివరణ బావుంది. చదవడం కూడా బావుంది.

Like

పెళ్ళి భోజనం అనే కథ కొత్త కథాంశం తో పాటు వినూత్న ఆలోచనతో ఆకట్టుకునే రీతిలో బాగా రాసారు రచయిత ఉగాది గారు --M prasanthi Guntur

Like
bottom of page