top of page

పెన్షన్


'Pension' New Telugu Story Written By M R V Sathyanarayana Murthy

'పెన్షన్' తెలుగు కథ

రచన: M R V సత్యనారాయణ మూర్తి

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)పెన్షన్ మీద ఆధారపడే ముగ్గురు వ్యక్తుల కథ ఇది. సుజాతమ్మ, రాఘవయ్య, రాములమ్మ అనే ముగ్గురు వ్యక్తులు పెన్షన్ మీద ఆధార పడే వ్యక్తులు.


ముగ్గురి స్థితిగతులూ వేరు. కానీ ముగ్గురూ ప్రతి నెలా పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

ముగ్గురివీ వేరు వేరు సమస్యలు. ఆ సమస్యలని కళ్ళకు కట్టినట్లు ఈ కథలో చూపారు రచయిత MRV సత్యనారాయణ మూర్తి గారు.

ఇక కథ ప్రారంభిద్దాం.


ముందుగా సుజాతమ్మ కథ..


“ఎక్కడికండీ సుజాతమ్మ గారూ, పొద్దున్నే బయల్దేరారు? ” అడిగింది సింహాచలం.


చిన్నగా నవ్వి “పాల పేకేట్టుకి” అంది సుజాతమ్మ.


“మీ ఇంట్లో అద్దెకున్న వాళ్ళని తెమ్మంటే తేరా? మీరు బయల్దేరారు” ఆరా తీసింది సింహాచలం.


“అస్తమానూ ఇంట్లో వుంటే ఏం తోస్తుంది. అందుకని.. ” నడుస్తూనే చెప్పింది సుజాతమ్మ.


కిరాణా షాప్ పక్కవీధిలోనే. సుజాతమ్మ ఇంటికి పెద్ద దూరం కాదు. సింహాచలం నాలుగు అడుగులు వేసి తెలుగు మాస్టారు ఇంట్లోకి వెళ్ళింది పనిచేయడానికి. ఐదు నిముషాలలో కిరాణా కొట్టు దగ్గరకు వచ్చింది సుజాతమ్మ. పాల పేకెట్టు, రెండు బట్టల సబ్బులు తీసుకుని వెనుతిరిగింది.


సుజాతమ్మ ఇంట్లో అద్దెకుండే వెంకట్రామయ్య చాలా మంచి వ్యక్తి. ఎవరికీ ఎ సాయం కావాలన్నా చేస్తాడు. ఒకటి రెండు సార్లు అడిగాడు ‘నేను పాల ప్యాకెట్లు, కిరాణా సరకులు తెచ్చిపెడతానని’.


సుజాతమ్మే ‘వద్దు బాబూ.. నేను తెచ్చుకుంటాను. ఇంట్లో ఎం తోచదు కదా’ అని సున్నితంగా చెప్పింది.


కానీ అసలు విషయం ఏమిటంటే ‘నువ్వు ఇంట్లోనే కూర్చుంటే కాళ్ళు, చేతులు పట్టేస్తాయి. హాస్పిటల్స్ చుట్టూ తిరగాలి. సరకులు అన్నీ నువ్వే తెచ్చుకో. దాని వలన నీకు సరుకుల ధరలు కూడా తెలుస్తాయి’ అని కూతురు పల్లవి హితబోధ చేసింది. అందుకని అరవై ఎనిమిదేళ్ళ వయసులో సరకుల కోసం బయటకు వెళ్తోంది సుజాతమ్మ.


సుజాతమ్మ భర్త కృష్ణమూర్తి కాలేజీ లో లెక్చరర్ గా పని చేసి రిటైర్ అయ్యాడు. ఉద్యోగంలో ఉండగానే కాలనీ లో మేడ కట్టుకున్నాడు. కూతురికి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో పెళ్ళి చేసాడు. కొడుకు ఎం. కాం. చదివినా ఉద్యోగం రాక బలాదూర్ గా తిరుగుతున్నాడు. తండ్రి గారాబమే అతన్ని పాడు చేసింది. లక్షా ఏభై వేల జీతంలో రిటైర్ అయ్యాడు కృష్ణమూర్తి.


‘మనకి బోల్డు డబ్బుంది. నువ్వు బెంగ పెట్టుకోకు, ఉద్యోగం రాలేదని. హ్యాపీ గా ఉండు’ అని కొడుక్కి చెప్పి అతను ఎంత అడిగితె అంత డబ్బు ఇచ్చేవాడు. చెడు అలవాట్లు మరిగి ఒకరోజు వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్య్యాడు కృష్ణమూర్తి కొడుకు. ఆ షాక్ కి కృష్ణమూర్తి కి పక్షవాతం వచ్చి కాలు, చెయ్యి పడిపోయాయి. సుజాతమ్మ భర్తకి సేవలు చేయడంతోనే సరిపోతోంది.

ఒక రోజు కృష్ణమూర్తి కొడుకు స్నేహితులతో మోటార్ సైకిల్ మీద తణుకు రెండవ ఆట సినిమాకు వెళ్లి తిరిగి వస్తూ, ఆగి ఉన్న లారీ ని గుద్దేసి స్పాట్ లోనే చనిపోయాడు. అప్పటికే అతను బాగా తాగి ఉన్నాడు.


కొడుకు దుర్మరణం కృష్ణమూర్తి ని బాగా కృంగ దీసింది. ఇది జరిగిన రెండేళ్లకే కృష్ణమూర్తి చనిపోయాడు. సుజతమ్మని కూతురు హైదరాబాద్ తీసుకెళ్ళదు. రెండు నెలలకో, మూడు నెలలకో ఒకసారి శివాపురం వచ్చి తల్లిని చూసి వెళ్తుంది. పెన్షన్ డబ్బులు, ఎక్కువగా ఖర్చు పెట్టవద్దని, పొదుపుగా ఉండమని తల్లికి నూరిపోస్తుంది. ప్రస్తుతం సుజాతమ్మకి భర్త పెన్షన్ ఎభైవేలు వస్తోంది. ఇంటి అద్దె ఆరువేలు వస్తోంది.


‘నువ్వు పదహారు వేలకంటే ఎక్కువ ఖర్చు పెట్టకు. ప్రతి నెలా, నలభై వేలు బ్యాంకు లో ఉంచు. మా అమ్మాయి పెళ్ళికి ఉపయోగపడుతుంది’అని తల్లికి గట్టిగా చెప్పింది పల్లవి.


“కాశీ వెళ్లి గంగలో స్నానం చేయాలని ఉంది. ఒక్కసారి నన్ను కాశీ తీసుకువెళ్ళు తల్లీ” కూతుర్ని బతిమాలింది ఓ సారి సుజాతమ్మ.


‘నీకు ఆయాసం రోగం ఉంది. కాశీ వెళ్లి స్నానాలు అవీ చేసి వస్తే నీకు లేని పోనీ రోగాలు చుట్టుకుంటాయి. నేను చాకిరీ చేయలేను’ అని చెప్పి పాలకొల్లు క్షీరా రామ లింగేశ్వరుడి గుడికి తీసుకువెళ్ళి ‘ఇదిగో ఈయనా శివుడే’ అని చెప్పింది. కూతురి గడుసుతనానికి నివ్వెరపోయింది సుజాతమ్మ.


పదిహేను రోజులు పోయాకా కిరాణా కొట్టు కి వెళ్లి వస్తుంటే సింహాచలం కనిపించింది సుజాతమ్మ కి.


“ఏమిటి, ఈ మధ్యన కనిపించడం లేదు.. ఊరికి వెళ్ళావా? ” అడిగింది సింహాచలాన్ని.


“అవును అమ్మగారు. గంగా పుష్కరాలకి కాశీ వెళ్లాను, మా వాళ్ళతో కల్సి. విశ్వనాథుడి గుడి చాలా విశాలంగా కట్టారు. దర్శనం బాగా అయ్యింది. మూడు రోజులు కాశీ లో ఉండి, అయోధ్య, నైమిశారణ్యం కూడా చూసి వచ్చాం” ఆనందంగా చెప్పింది సింహాచలం.


ఐదు నిముషాలు ఆమెతో మాట్లాడి ఇంటికి వచ్చింది సుజాతమ్మ. ఆమె మనసు మనసులో లేదు. అందరి ఇళ్ళల్లో పనిచేసి జీవించే సింహాచలం కూడా తన డబ్బు పొదుపు చేసుకుని పుణ్యక్షేత్రాలు చూసి వచ్చింది. తనకి చేతినిండా డబ్బు ఉన్నా తన కోరికలు తీరడంలేదు.

ఒకరి ఆజమాయిషీ లో జీవించ వలసి వస్తోంది.


భర్త ఉన్నన్ని రోజులూ ఆయన మాటకి ఎదురు చెప్పలేదు. ఇప్పుడు కూతురు తన మీద పెత్తనం చెలాయిస్తోంది. తన జీవితం ఇలా నిస్సారంగా గడిచి పోవలసిందేనా? తన ఆశలు చంపుకుని లక్షలు.. లక్షలు మూటకట్టి కూతురికి ఇవ్వవలిసిందేనా? అలా చేసినా ఆమెకి ఏమైనా కృతజ్ఞత ఉంటుందా? ఉహూ.. ఏమీ ఉండదు. మధ్యాహ్నం సాయంత్రం కూడా ఆలోచించింది. రాత్రి ఒక నిర్ణయానికి వచ్చింది.


మర్నాడు సింహాచలం కి తన మనసులోని మాట చెప్పింది. ఆమె చాలా సంతోషించింది.

ఒకటో తారీఖు రాగానే పెన్షన్ ఏభై వేలు తీసుకుంది సుజాతమ్మ. సాయంత్రం చీకటి పడేవేళ సింహాచలాన్ని తీసుకుని విజయవాడ బస్సు ఎక్కింది. రాత్రి పదకొండు గంటలకు కాశీ వెళ్ళే రైలు ఎక్కారు సుజాతమ్మ, సింహాచలం. రైలు ఎక్కగానే గుండె నిండా ఊపిరి పీల్చుకుని, ఆనందంగా నవ్వింది సుజాతమ్మ.


********


ఇదీ పెన్షనర్ సుజాతమ్మ కథ.

ఇక మరో పెన్షనర్ రాఘవయ్య గారి కథ తెలుసుకుందాం.


సాయంత్రం నాలుగున్నర గంటలు అయ్యింది. నిద్రలేచిన రాఘవయ్య హాలులోకి వెళ్ళబోతూ, కొడుకూ, కోడలూ తన గురిచి మాట్లాడుకోవడంతో గుమ్మ దగ్గరే ఆగిపోయారు.


“ఏమండీ, మీ నాన్న గారిని ఈసారి ఎవరి దగ్గరకూ పంపకుండా ఒక సంవత్సరం పాటు మన దగ్గరే ఉంచుకుందాం” అంది రమణి.


ఆమె భర్త శేషగిరి ఏమీ అర్ధం కాక ఆమె కేసి చూసాడు. తండ్రి వచ్చిన తర్వాత ఎప్పుడు వెళ్లిపోతాడా? అని ఎదురు చూసే భార్య, ఏడాది పాటు ఇక్కడ ఉండనిస్తుందా? ఇది జరిగే పనేనా?

“నేను విన్నది నిజమేనా రమణీ” అడిగాడు భార్యని.“అవును మీరు కరెక్ట్ గానే విన్నారు. మావయ్యగారిని ఏడాది పాటు మన ఇంట్లోనే ఉంచుకుందాం” నవ్వుతూ అంది రమణి.


అయినా ఇంకా అర్ధం కాక భార్యకేసే చూసాడు ఆశ్చర్యంగా.


“అబ్బా. మీకు ఏదీ ఒక పట్టాన తెలీదు. అన్నీ విడమర్చి చెప్పాలి. మన అబ్బాయి ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నాడా? ” భర్తతో అంది.


‘అవును’ అన్నట్టు తలూపాడు శేషగిరి.


“వచ్చే సంవత్సరం వాడిని బి. టెక్. చదివించాలంటే చాలా డబ్బులు కావాలిగా. మావయ్య గారికి డెబ్భై వేలు పెన్షన్ వస్తోందిగా. పూర్వం మనకి నలభై ఇచ్చే వారు మావయ్యగారు. ఇప్పుడు ఏభై ఇమ్మని అడుగుదాము. అంటే పన్నెండు నెలలకు, మొత్తం ఆరు లక్షలు వరకూ వస్తుంది. ఆ డబ్బుతో మన అబ్బాయి కాలేజీ ఫీజులు కట్టేయవచ్చు. మీరు ఆఫీస్ లో, లోన్ పెట్టక్కరలేదు. ఏడాది గడిచాక ఆయన ఇష్టం. ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటారు. ఎలా ఉంది నా ఐడియా?" కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంది రమణి.


భార్య తెలివి తేటలకి మురిసిపోయాడు శేషగిరి. “నువ్వు సూపర్ రమణీ. నాకు బర్డెన్ లేకుండా చేసావ్" అని భార్యకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.


వాళ్ళ మాటలు విన్న రాఘవరావు గుమ్మం దగ్గర నుండి వెనక్కి వచ్చి మంచం మీద కూర్చున్నాడు. చివరికి రక్తసంబంధం కూడా ధనసంబంధంగా మారిపోయిందా? అని బాధ పడ్డారు. కొద్దిసేపు అయ్యాక హాలు లోకి వచ్చారు రాఘవయ్య.


“రండి మావయ్యా టిఫిన్ పట్టుకొస్తాను” అని లోపలకు వెళ్లి వేడి వేడి పకోడీలు ప్లేటులో పెట్టి తెచ్చింది రమణి. రాఘవయ్య టిఫిన్ తిన్నాక, టీ తెచ్చి ఇచ్చింది. భర్త కేసి చూసి సైగ చేసింది అడగమన్నట్టు.


“నాన్నా, ఈ సారి నువ్వు నాలుగు నెలలకే వెళ్ళిపోకుండా ఏడాది పాటు మా దగ్గరే ఉండాలి. కిరణ్ ఇంటర్ రెండో ఏడు చదువు తున్నాడుగా. నువ్వు హెడ్ మాస్టర్ గా చేసావుగా. వాడిని శ్రద్ధగా చదివిస్తావని మా ఇద్దరి కోరిక” చాలా వినయంగా అడిగాడు శేషగిరి.


‘అలాగేరా అబ్బాయి’ అని వాకింగ్ కి పార్క్ కి వెళ్ళారు రాఘవయ్య. తమ సమస్య ఇంత తేలిగ్గా పరిష్కారం అయినందుకు భార్యా, భర్తా ఇద్దరూ ఆనందించారు.


రాఘవయ్య హై స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన వయసు డెబ్భై ఐదు సంవత్సరాలు. ఆరోగ్యం గానే ఉన్నారు. మూడేళ్ళ క్రితం భార్య జానకమ్మ చనిపోయింది. స్వంత ఊరు జగన్నాధపురం లో చిన్న కొడుకు దగ్గర ఉంటూ ఉంటె, మా దగ్గర కూడా ఉండాలని మిగతా ఇద్దరు కొడుకులూ పట్టు పట్టడం వలన, ముగ్గురు కొడుకులు దగ్గర నాలుగు నెలలు చొప్పున ఉంటున్నారు రాఘవయ్య. ఎవరి దగ్గర ఉన్నా తన కోసం ఇరవై వేలు ఉంచుకుని మిగతా పెన్షన్ డబ్బులు వారికి ఇచ్చేస్తారు. పెద్ద కొడుకూ, రెండవ కొడుకూ తనని బాగానే చూస్తారు. కానీ ఆయనకే మొహమాటంగా ఉంటుంది. చిన్నకొడుకు నారాయణ దగ్గర ఉన్న స్వేచ్చ, చనువు మిగతా వాళ్ళ దగ్గర ఉండదని ఆయన భావన. శివపురం అంటే రాఘవయ్యకి చాలా ఇష్టం.


ఒక ఏడాది రెండో కొడుకు శేషగిరి వద్దే ఉన్నాడు. ఆ తర్వాత మూడోకొడుకు నారాయణ దగ్గరకు వచ్చారు. నారాయణ తండ్రి దగ్గర డబ్బు తీసుకోనని ఖరాఖండిగా చెప్పాడు.

’నాకు కల్గిన దాంట్లో మీకు పెడతాను, మీ అవసరాలకు, మందులకు ఏమైనా కావలిసిస్తే మీ పెన్షన్ డబ్బులు వాడుకోండి ‘ అని.

రాఘవయ్య కొడుక్కి తెలియకుండా కోడలికి కొంత డబ్బు ఇచ్చి వెళ్ళేవాడు. కానీ ఆ డబ్బు ఆమె తణుకు లోని వృద్ధాశ్రమానికి అత్తగారి పేరు మీద విరాళంగా ఇస్తోందని రాఘవయ్యకి ఇంతవరకూ తెలీదు. నాలుగు నెలలూ నారయణ దగ్గర హాయిగా గడిచిపోయాయి. రాఘవయ్య పెద్ద కొడుకు దగ్గరకు వెళ్ళలేదు. మరుసటి నెలలోనే జానకమ్మ తద్దినం ఉంది. కొడుకులిద్దరినీ తద్దినానికి శివపురం రమ్మనమని చెప్పారు రాఘవయ్య.


అయిష్టంగానే పెద్దకొడుకు, రెండో కొడుకు శివపురం వచ్చారు. తద్దినం పూర్తి అయ్యింది. భోజనాలు అయ్యాక అందరూ చావిట్లో సమావేశమయ్యారు.


“నాన్నగారూ! రాత్రి బస్సు కి హైదరాబాద్ కి టికెట్లు తీయమంటారా? ” అడిగాడు పెద్దకొడుకు చక్రధర్.


“నెను ఇంక ఎక్కడికీ రాదలచుకోలేదు. శివపురం లోనే ఉంటాను” తాపీగా చెప్పారు రాఘవయ్య. కొడుకులు ఇద్దరి గుండెల్లో రాయి పడినట్టు అయ్యింది. నెలా నేలా తండ్రి ఇచ్చే డబ్బులు తమ్ముడు తినేస్తాడా? అన్న దుగ్ధ వారిలో వ్యక్తమయ్యింది. అది పసిగట్టారు ఆయన.


“మీ బాధ నాకు అర్ధమయ్యింది. నా పెన్షన్ డబ్బులు అన్నీ నారాయణే తినేస్తాడని మీ ఉద్దేశ్యం. అది తప్పు. నారాయణ నా దగ్గర ఎప్పుడూ డబ్బు తీసుకోలేదు. వాడికి తెలియకుండా కోడలికి ఇస్తే ఆమె ఏం చేసిందో తెలుసా? ” ఒక్క నిముషం ఆగారు రాఘవయ్య.


పెద్ద కొడుకు చక్రధర్ కి ఉక్రోషం వచ్చింది. మొన్నటి వరకూ శేషగిరి దగ్గర ఉంటే, వాడు బోల్డు లబ్ది పొందాడు. ఇప్పుడు తన వంతు వచ్చేసరికి, తండ్రి రాను అని అనడం తట్టుకోలేక పోతున్నాడు.


“ఏం.. ఆవిడగారు ఆ డబ్బులతో నగలు చేయించుకుందా? ” వ్యంగ్యంగా అన్నాడు చక్రధర్.


“అందరూ మీలా స్వార్ధపరులుగా ఉంటారనుకోకండి. ఆ డబ్బులు మీ అమ్మ పేరు మీద వృద్ధాశ్రమం లో ఇచ్చేసింది. నా కళ్ళు తెరిపించింది. నేను చేయవలిసిన కర్తవ్యం బోధపరచింది. అయినా ఒక విషయం అడుగుతాను, తండ్రికి భోజనం పెట్టి డబ్బులు తీసుకోవడానికి మీకు సిగ్గు అనిపించడంలేదా?


మీకు జీతాలు బాగానే వస్తున్నాయిగా. నెలకు ఏభై, అరవై వేలు సంపాదించుకుంటున్నారుగా. మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నారాయణ చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. అది మీకు తెలుసు. వాళ్ళ ఆవిడ మెషిన్ మీద బట్టలు కుడుతూ వాడికి చోడు వాదోడు గా ఉంటోంది. వీళ్ళ అబ్బాయి కూడా బి. టెక్. లో చేరాడు. కానీ వాళ్ళు ఎవరి దగ్గరా చేయ్యిచాచలేదు. ముందు చూపుతో పొదుపు చేసుకుని ఆ డబ్బుతో చదివిస్తున్నారు. అదీ జీవితమంటే! మీకు నన్ను చూడాలని ఉంటే ఇక్కడికే రండి. అంతే” అన్నారు రాఘవయ్య.


కొడుకులు ఇద్దరూ తలలు దించుకున్నారు. రాత్రి బస్సు కే ఇద్దరూ వెళ్ళిపోయారు. రాఘవయ్య ఇద్దరు పేద విద్యార్ధినులను దత్తత తీసుకుని వారిని చదివిస్తున్నారు. నెల నెలా తణుకు వృద్ధాశ్రమానికి వెళ్లి తనకి తోచిన సాయం చేసి వస్తున్నారు. ఆయన మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది.

****

అలా రాఘవయ్య గారు తన సమస్యని పరిష్కరించుకున్నారు.

ఇప్పుడు రాములమ్మ కథ తెలుసుకుందాం.


ఆరోజు ఒకటో తారీఖు. ఉదయం తొమ్మిదిగంటలు అవుతోంది. శివపురం లోని పెడల్ కాలనీ లో తన పూరి పాక దగ్గర కూర్చుని ఉంది రాములమ్మ. పొద్దున్న తాగిన టీ చుక్క అప్పుడే అరిగి పోయింది. ఆకలి వేస్తోంది. ఆశగా వీధి చివర కేసి చూస్తోంది గ్రామ వాలంటీర్ కోసం, అతను ఇచ్చే డబ్బుల కోసం.


‘హూ.. వీడు పెందరాలే రాడు. పొద్దున్నే టీలు, కాఫీ లు ఇచ్చే వాళ్ళకి ముందుగా డబ్బులు ఇస్తాడు, వాళ్ళతో కబుర్లు చెప్పుకుని తీరుబడిగా వస్తాడు. ఏం చేస్తాం. దేవుడు వరమిచ్చినా, పూజారి అనుగ్రహించాలి అన్నట్టు, ప్రభుత్వం పేదలకి మేలు చేయాలని ఎన్నో ఆలోచనలు చేసినా, కింది వాళ్ళు దానిని సరిగా అమలు చేయడంలేదు. వీడు డబ్బులు ఇస్తే, రాముడు హోటల్ కి వెళ్లి రెండు ఇడ్లీలు తినాలి. బాగా ఆకలిగా ఉంది ‘ అని మరోసారి దీర్ఘంగా నిట్టూర్చింది రాములమ్మ.


పెన్షన్ ఇచ్చే కుర్రాడు పెద్ద రెడ్డి గారి ఇంటి దగ్గర కబుర్లు చెబుతూ, జోకులు వేస్తూ నవ్వుతున్నాడు. రాములమ్మ ఆకలితో, కళ్ళల్లో కోటి ఆశలు నింపుకుని వాలంటీర్ కోసం ఆత్రుతగా చూస్తోంది.


******

M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Podcast Link:


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.77 views1 comment
bottom of page