top of page

పిల్లోడి పెళ్లి



'Pillodi Pelli' - New Telugu Story Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 03/05/2024

'పిల్లోడి పెళ్లి' తెలుగు కథ 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


"రంకెల రంగయ్యగారూ! నమస్కారములు" నవ్వుతూ చేతులు జోడించారు వామనశాస్త్రి. 

శాస్త్రిగారు రంగయ్యగారు మంచి మిత్రులు. 

"ఆ.. శాస్త్రి తెచ్చినావా!" అడిగాడు రంకెల రంగయ్య. 

"ఏమిటి రంగన్నా! ఆ ప్రశ్న!.. తమరు అడగడం, నేను లేకుండా వుండడమూనా!"


"కూకో!.. "

రంగయ్య వ్యవసాయదారుడు. ఐదవ తరగతి వరకు చదివాడు. మహా తెలివికలవాడు. బి. ఎ, ఎం. ఎ వరకు చదివిన అనుభవం. వారికి ఒక కొడుకు. గొప్ప తెలివితేటలు కలవాడు. పేరు రంకెల రామలింగ. 


రామలింగ అన్నపేరు రంగయ్యగారి తండ్రిగారిది. రంగయ్య గారికి తన తండ్రి అంటే ఎంతో ప్రేమ, గౌరవం. ఆ కారణంగా వారు తన కుమారునికి ఆ పేరుపెట్టారు. వారి అర్థాంగి సుందరి. కరోనా కాలంలో స్వర్గస్థులైనారు. 


రామలింగ ఎం. ఎస్సీ వరకు స్వదేశంలో చదివి డాక్టర్ చదువుకు అమెరికా వెళ్ళి ఎం. బి. బి. యస్ చదివి మాస్టర్స్ చేసి సొంత వూరికి ఆరునెలల క్రిందట తిరిగి వచ్చాడు. ఓ ప్రైవేటు హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్నాడు. రంగయ్య లెక్కల విషయంలో మహా ఖరారు. కొడుకు చదువుకు అయిన మొత్తం ఖర్చును ఓ రెండువందల పేజీల నోట్ బుక్కులో వివరంగా దినవారిగా అకౌంటెంట్ చేత వ్రాయించాడు. ఆ మొత్తం లక్షల్లో వుంది. 


ఆ కారణంగా బాగా కట్న కానుకలను ఇచ్చే మంచి సంబంధాన్ని చూడమని తన మిత్రుడు, పురోహితుడు అయిన వామనశాస్త్రికి చెప్పాడు. 


వామనశాస్త్రి రెండు మూడు సంబంధాలను గురించి లోగడ అమ్మాయిల ఫొటోలు చూపించి వివరించాడు. 


ఆ సంబంధాలు ఏవీ రంగయ్య గారికి నచ్చలేదు. 

ఈసారి రెండు కొత్త సంబంధాలను తెచ్చాడు. 

"ఆ.. వామనా! ముందు పిల్ల ఫొటోను చూపించు. "


రామలింగ ఆరడుగుల ఎత్తు, తెల్లని తెలుపు, మంచి అందగాడు. తన కొడుకు అందచందాలకు తగిన తెల్లని అమ్మాయిని చూచి సెలక్ట్ చేసి పెళ్ళి చేయాలన్నది రంకెల రంగయ్య సంకల్పం. వామన శాస్త్రి తన సంచిలోనుంచి ఒక ఫొటోను తీసి చిరునవ్వుతో రంగయ్యగారి చేతికి అందించాడు. 


"మిత్రమా తిలకించండి!" చిరునవ్వుతో చెప్పాడు వామనశాస్త్రి. 


రంగయ్య అమ్మాయి ఫొటో పరీక్షగా చూచాడు. 

"ఆ.. వివరాలు చెప్పు!"


"రంగన్నా! అమ్మాయి వాళ్ల వూరు విజయవాడ. పేరు త్రిజ. ఎం. ఎ పాసైంది. ఒక్కగానొక్క కూతురు. తండ్రి సాంబశివరావు గారికి బినామీల పేరుతో విజయవాడలో పది బ్రాందీ షాపులు ఉన్నాయి. తల్లి లెక్చరర్ సునంద. మీరు ఆశించినంత కట్నం ఇస్తాడు. రాజమర్యాదలు చేస్తారు. వారి తదనంతరం ఆ సామ్రాజ్యానికి మన లింగం బాబే సర్వాధికారి" నవ్వాడు వామనశాస్త్రి. 


"ఆ.. ఇంతకీ అమ్మాయి రంగు?"


"మన అబ్బాయి అంత రంగులేదు. ఛామనఛాయ. శ్రీకృష్ణుని రంగు. ’నలుపు నారాయణుని పోలు’ అన్నారుగా మన పెద్దలు. రంగన్నా" అవునంటాడని ఆశగా రంగయ్య ముఖంలోనికి చూచాడు వామనశాస్త్రి. 


"చూడూ వామనా! కోడలు నలుపైతే వంశం అంతా నలుపైపోద్ది. ఇది నాకు నచ్చలా!" కాస్త విసుగ్గా చెప్పాడు రంగయ్య. 


వామనశాస్త్రి రంగయ్య చేతిలోని ఫొటోను తన చేతికి తీసుకొని సంచిలో పెట్టుకొన్నాడు. మరో ఫొటోను తీసి రంగయ్య చేతికి అందిస్తూ.. 

"దీన్ని చూడండీ!.. "


రంగయ్య ఫొటోను చేతికి తీసుకొన్నాడు. కొన్ని క్షణాలు పరీక్షగా చూచాడు. 

వదనంలో చిరునవ్వు. ఆ అమ్మాయి వారికి నచ్చింది. 

"వామనా! పిల్ల రంగును గురించి నేను నిన్ను అడగనులే!.. మిగతా వివరాలు సెప్పు!"

చిరునవ్వుతో చెప్పాడు రంగయ్య. 


"రంగును గురించి ఎందుకు అడగవు మిత్రమా!"


"ఆ.. ఫొటో చూస్తా వుంటే రంగు ఎంతో తెలిసిపోలా!" ఆనందంగా నవ్వాడు రంగయ్య. 


’ఒరే పిచ్చి సన్నాసి! ఆ పిల్ల కాకి నలుపురా. బ్యూటీపార్లర్‍కు వెళ్ళి ఫూల్ మేకప్‍తో ఫొటో దిగిందిరా. రంగు పిచ్చోడా!’ స్వగతంలో అనుకొన్నాడు వామనశాస్త్రి. 


"ఆ.. వామన అసలు ఇసయాలు సెప్పు!"


"వీరిది విశాఖపట్నం. అమ్మాయి బి. టెక్ సివిల్ ఇంజనీర్. ఈమెకు ఒక తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. వీరి తండ్రి గారి పేరు కుబేరరావు. వీరికి ఇరవై జట్టీలు అంటే పడవలు ఉన్నాయి. వాకిట్లో మూడు కార్లు. రొయ్యల వ్యాపారి. అమెరికాకు, లండన్‍కు ఎగుమతి. ఒక అరఎకరం విస్తీర్ణంలో కోల్ట్ స్టోరేజీ వుంది. రొయ్యలు క్లీన్ చేసి అందులో ప్యాక్ చేసి భద్రపరుస్తారు. 


నెలకు రెండుసార్లు విమానంలో ఆ ప్యాక్ చేసిన రొయ్యలను విదేశాలకు పంపుతారు. వీరి అర్థాంగి అంబిక లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్. ఆ మనిషి నీలాగే మహా ఖరారు. ఈరోజుల్లో ఎవరు ఎప్పుడు చస్తారో తెలీదు కదా!.. మనం తినే తిండంతా కెమికల్స్ మయం కదా!.. ఆ కారణంగా వారు తన యావత్ ఆస్థిని నాలుగు భాగాలుగా చేసి పిల్లలపైన వీలునామాలు వ్రాశారు. పెద్దమ్మాయి పేరు సత్య. ఈమె పేరున వారికి ఉన్న రెండు షాపింగ్ కాంప్లెక్స్ లు, రెండు సినిమా హాల్సును వ్రాశారు. 


రెండవ అమ్మాయి సుధ. ఆమె పేరున వారికి వున్న స్టార్ హోటల్‍ను వ్రాశారు. అబ్బాయి ఆనంద్. వారి పేరున జట్టీలను (పడవలు) కోల్డ్ స్టోరేజిని వ్రాశారు. భార్య పేరున సొంత వూరు అనకాపల్లిలో వున్న ఇరవై ఎకరాల మాగాణి, వారి ఇంటి వ్రాశారు. 


"ఆ.. వామనా!"


"అడుగు రంగా!"


"నీవు పిల్లని చూచావా!"


"ముందు నీవు నామాటకు జవాబు చెప్పు!"


"అడుగు!"


"అమ్మాయి నీకు బాగా నచ్చిందా!.. "


"వామనా! నేను ఒకసారి సెబితే వందసార్లు సెప్పినట్టు. నీకు తెలవదా ఏంటీ?.. అమ్మాయి సూపర్!" ఆనందంగా నవ్వాడు రంగయ్య. 


’ఓరి తిక్కలోడా! సినిమా యాక్టర్‍లా ఆ పిల్ల ఫుల్ మేకప్‍తో వుందిరా. ఇప్పటికే నీకు ఐదు సంబంధాలు తెచ్చాను. ఒక్కటీ నీకు నచ్చలేదు. నా నెత్తిన నీవు పాలాభిషేకం చేసినట్లయింది. ఇక మీదట నీ బాధ (కబురుచేయడం) నాకు లేకుండాపోతే అది నాకు పరమానందం’ అనుకొన్నాడు వామనశాస్త్రి. 


"వామనా!.. "


"ఏంటో ఆలోచిస్తా వుండావు. ఏంది?"


"ఈనాటికి నేను తెచ్చిన ఈ సంబంధం నీకు నచ్చినందుకు ఆలోచన కాదు. ఆనందిస్తున్నా!" చిరునవ్వుతో చెప్పాడు వామనశాస్త్రి. 


"ఆ.. సరే వామన! మంచి రోజు చూడు. అబ్బయ్య నేను నీవు విశాఖపట్నం వెళ్ళి పిల్లని చూచి అన్ని ఇసయాలు మాటాడుకోని వస్తాము. "


"అలాగే రంగన్నా!.. "


కొడుకు రామలింగ, ప్రక్కన ఒక అందాలభామతో సీన్‍లోకి ఎంట్రీ ఇచ్చాడు. 

వారిరువురినీ చూచి రంకెల రంగయ్య, వామనశాస్త్రి ఆశ్చర్యపోయారు. 

"అరే అబ్బయ్యా!" కళ్ళు పెద్దవి చేసి వారిని చూస్తూ పిలిచాడు రంగయ్య. 


"ఏంటి నాన్నా!" కొడుకు రామలింగ చిరునవ్వుతో అడిగాడు. 


"ఆ పిల్ల ఎవర్రా?"


"నాన్నా!"


"ఏంటబ్బయ్యా?"


"ఈమె పేరు సంధ్య. డాక్టర్. నాతో పనిచేస్తూ ఉంది. మేమిద్దరం ప్రేమించుకున్నాము. పెళ్ళి చేసుకోదలచుకున్నాము. మీరు మా వివాహాన్ని జరిపించాలి నాన్నా!" చెప్పాడు లింగ. 


"అయ్యా! రామలింగయ్యగారు.. వారి వివరాలు!" సందేహంతో మెల్లగా అడిగాడు వామనశాస్త్రి. 


"వామనా!.. "


"రంగన్నా!.. "


"ఆ విషయం మనకు అవసరమా!" ఆవేశంతో అన్నాడు రంగయ్య. 


"స్వామీ! ఈమెది మా కులమే! నేను అన్నీ విచారించే వివాహం చేసుకోవాలనుకొన్నాను. నాన్నకు చూపించాలని తీసుకొచ్చాను. మీరు ఏ విషయం మీద వచ్చారో నాకు తెలుసు. కానీ వివాహ విషయంలో నా నిర్ణయం మారదు" ఖచ్చితంగా చెప్పాడు లింగ. 


"విన్నావా రంగన్నా!" విచారంగా అన్నాడు వామనశాస్త్రి. 


"సంధ్యా! రా.. నా గదికి వెళదాం!" రామలింగ ముందు వెనకాలే సంధ్య అతని గదివైపుకు నడిచారు. 


"ఓరేయ్ వామనా! ఇప్పుడు మనం ఏం చేయాల్రా!" విచారంగా అడిగాడు రంగయ్య. 


"రంగన్నా! ప్రస్తుతంలో నా బుర్ర పూర్తిగా వేడెక్కిపోయింది. ఇంటికెళ్ళి నీ మరదలి చేత తలకు నూనె అంటించుకొని వేడి వేడి నీళ్లు స్నానం చేసి, భోజనం చేసి, పంచాంగం తీసి మంచి ముహూర్తాన్ని నిర్ణయించుకొని వస్తా. ఈలోపల నీవూ వంటమనిషి తాయారు చేత తల అంటించుకొని బావి దగ్గర చన్నీటి స్నానం చేసి, భోజనాన్ని ఓ పట్టు పట్టి మంచం ఎక్కు. "

"చన్నీటి సానమా!" ఆశ్చర్యంతో అడిగాడు రంగయ్య. 


"సానమా కాదు స్నానం.. ఒంట్లోని వేడి పోవాలిగా వస్తా" లేచి వేగంగా వామనశాస్త్రి వెళ్ళిపోయాడు. 

రంకెల రంగయ్య దిగాలుపడి ’అనుకొన్నదొక్కటి.. అయింది. మరొక్కటి బోల్తాకొట్టిందిలే బుల్ బుల్ పిట్టా!’ అనుకొని విరక్తిగా నవ్వుకొన్నాడు. ఆ క్షణంలో అతని కళ్ళల్లో కన్నీరు.. 

  *

సమాప్తి

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.




37 views0 comments
bottom of page