top of page

ప్రతీకారం



'Prateekaram' - New Telugu Story Written By Kasivarapu Venkatasubbaiah

Published In manatelugukathalu.com On 09/09/2024

'ప్రతీకారం' తెలుగు కథ

రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



కర్నూలు కడప కాలువ (కె. సి కెనాల్) చివరి ఆయకట్టు భూములున్న ఊర్లు రామాపురం, రంగాపురం. కెసి కెనాలు నిండుగా నీళ్ళు ప్రవహించేటప్పుడు ఎగువ భూముల్లో తడిపంటలు, దిగువ భూములు చివరి ఆయకట్టు కావడం వల్ల అరకొరగా నీళ్ళు వస్తాయి కాబట్టి ఆరుతడి పంటలు వేసుకుంటారు. ఒక్కొక్కసారి కాలువ చివరి భూములకు నీళ్ళు రాక పంటలు ఎండుతుంటాయి. 


 రామాపురం, రంగాపురం ప్రజలు నీటి లభ్యతను బట్టి పంటలు వేసుకుంటుంటారు. ఏ సమస్య వచ్చినా సమైక్యంగా ఉంటూ కలిసికట్టుగా సమస్యను పరిష్కరించుకుంటారు. రెండు గ్రామాల మధ్య దూరం కిలోమీటరే కాబట్టి పండగలొచ్చినా పబ్బాలొచ్చినా దేవర్లొచ్చినా తిరుణాలలొచ్చినా రెండూర్ల ప్రజలు కలిసిమెలిసి జరుపుకుంటారు. రెండూర్ల మధ్య వివాహ సంబంధాలు, బంధుత్వాలు ఉన్నాయి. తగాదాలోస్తే మాత్రం పౌరుషం పట్టుదల ఉడుకు దుడుకు ఎక్కువే!


 రామాపురానికి రామచంద్రారెడ్డి, రంగాపురానికి రంగనాథనాయుడు పెద్దమనుషులు, భూస్వాములు. ధనంలో గాని, పలుకుబడిలోగాని ఇద్దరికి ఇద్దరూ సమవుజ్జీలు. ఇద్దరి మధ్య చక్కటి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరిలో ఎవరు గొప్పంటే తేల్చడం కష్టమే. ఇద్దరికీ సరిసమానంగా సంతానం. రామచంద్రారెడ్డికి నలుగురు కొడుకులు ముగ్గురు కూతుర్లు, రంగనాథ నాయుడికి నలుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. 


 కెసి కెనాలుకు వచ్చే కొద్దిపాటి నీటిని సమదృష్టితో, సమన్యాయంతో, సమపాళ్లలో పంచుకుంటారు. ఐదెకరాలు ఉన్నవాడు ఒక ఎకరా, పదెకరాలు ఉన్నవాడు రెండెకరాలు. ఆపై ఉన్నవారు మూడు లేక నాలుగు ఎకరాలు మాత్రమే వరిపైరు పెట్టుకోవాలి. మిగతా భూమి ఆరుతడి పైర్లు, వర్షాధార పంటలు పెట్టుకోవాలని రెండూర్ల మధ్య ఒప్పందం ఉంది. 


 ఆ యేడు కూడా ఒప్పందంలోని నిబంధన ప్రకారమే వరిపైరు పెట్టుకున్నారు. సాగునీరు మాత్రం మామూలు కన్నా కనిష్టంగా వచ్చాయి. దానితో నీటికి కటకట ఏర్పడింది. సాగునీటి సమస్య ప్రాణాంతక సమస్యగా పరిణమించింది. రైతుల్లో కడుపు బాధ రగిల్చింది. కొసరు కొసరుగా వస్తున్న నీళ్ళను రాత్రుళ్ళు కాపుకాసి పారించుకుంటున్నారు రైతులు. 


 రామచంద్రారెడ్డి భూములు కాలువ ఎగువన ఉండడంవల్ల వాళ్ళు, కాలువకు వచ్చిన నీళ్ళు వచ్చినట్లు తమ వంతుగా తమ భూములకు వాడుకుంటూ దిగువకు వదలకుండా ఉన్నారు. దిగువన ఉన్న వరిపైరు ఎండిపోవడం రైతులు తట్టుకోలేక పోతున్నారు. 


 రాత్రి రామచంద్రారెడ్డి పెద్ద కుమారుడు రాఘవరెడ్డి తమ మళ్లకు మడవ కట్టుకుంటూ ఉండగా రంగనాథనాయుడి చిన్న కొడుకు ప్రతాపనాయుడు అతని దగ్గరకు పోయి

 "అన్నా! మా పైర్లు నీళ్ళులేక ఎండిపోతున్నాయి. మా పైర్లకు రోన్ని నీళ్ళు వదులన్నా!" అడిగాడు.


దానికి రాఘవరెడ్డి "వదిలేది లేదబ్బీ! మా వంతు నీళ్ళు పారగట్టుకున్న దాకా, కిందికి వదిలేది లేదు" కరాఖండిగా చెప్పాడు. 


 "చిన్న పాయ కిందికి యిడువన్నా! మా పైర్లు కూడా పచ్చబడతాయి" బతిమాలుతున్నట్లు అడిగాడు ప్రతాపనాయుడు. 


 "మా పైర్లు పారినంతవరకు వదలనని చెప్పుతావుంటే వినపడలేదా? అవతలికి పో" గట్టిగా గద్దించాడు రాఘవరెడ్డి. 


"వదలక పోవడం గొప్ప అనుకుంటున్నావా? నీళ్ళ దగ్గర మొగతనం కాదు" నిఘ్ఠారంగా పలికాడు ప్రతాప్. 


"ఏందిరా! జాస్తి మాట్లాడుతాండవ్! సన్న సన్న బర్లు ఇరుగుతాయ్! జాగ్రత్త " పూని పూని మీదికి పోయాడు రాఘవ. 

రాఘవలో పౌరుషం పొడ్చుకొచ్చి ఉవ్వెత్తున లేచింది. 


 " ఏంది సంగతి! మీది మీదికి వచ్చాండవ్! ఇక్కడెవరూ నీకు భయపడి వెనక్కు తగ్గరు. నీలిగితే రొమ్ములు పగులుతాయి" ఎదురు నిలిచాడు ప్రతాప్. ప్రతాపులో ఉక్రోషం ఉప్పెనలా ముంచుకొచ్చింది. 

"రారా! దమ్ముంటే తన్లాడ్తాం! కిందేసి ఎదలపై నిర్జీ రాయి (నిడిజీవి గ్రామం) ఎత్తుతా!" రొమ్ములు విరుచుకొని ముందుకు పోయాడు రాఘవ. 


"ఏందిరా నీ కతా!” ప్రతాప్ మడిమలు తొక్కుకుంటా ఎదురెక్కిపోయాడు. 


 "ఎగిరి తన్నుతే గోడకు బల్లిలా కరసకపోతావ్!" రాఘవ.. 


 "పిడికిలి బిగించి గుద్దుతే నేలకు అప్పచ్చిలా అతుక్కుపోతావ్" ప్రతాప్.. 


ఇద్దరికీ మాటామాటా పెరిగి మెడపట్లు పట్టుకున్నారు. ఇద్దరూ తిట్టుకున్నారు. కొట్టుకున్నారు. పిడికిళ్ళతో గుద్దుకున్నారు. మోచేతులుతో పొడుచుకున్నారు. బర్లకేసి ఊదుకున్నారు. 

కిందామీదా పొర్లారు. ఎంతసేపు కలబడినారో తెలియదు గానీ, ఒక కయ్యంతా వరిగంటలు చెదిరిపోయి బురద బురదైంది. 


 అగస్మాత్తుగా అదుపు తప్పి కింద పడ్డాడు ప్రతాప్. ప్రతాప్ పెరాయించుకునే లోపల రాఘవ ప్రతాపును కఠినాత్మకంగా అతిభయానకంగా మెడకాయను పారతో నరికాడు. శవాన్ని కాలువ గండికి అడ్డంగా వేసి మడవ పారగట్టుకుని ఇల్లు చేరాడు రాఘవరెడ్డి. 


ఖూనీ విషయం రెండూర్లల్లో పొద్దన కల్లా గుప్పుమంది. జనాలు గుంపులు గుంపులుగా చేరి భయంభయంగా చర్చించుకోసాగారు. కనీవినీ ఎరుగనంత సంచలనం జనంలో మొదలైంది. రామచంద్రారెడ్డి ఇంటి ముందు రామచంద్రారెడ్డి మనుషులు పెద్ద ఎత్తున జమైనారు. 


రంగనాథనాయుడి ఇంటి దగ్గర ఆయన అనుచరులు అభిమానులు సానుభూతిపరులు లెక్కకు మించి గుంపైనారు. ప్రతాపనాయుడు ఖూనీ కావడం రంగాపురంలో దుఃఖానికి పరిమితి లేకుండా పోయింది. ఆడవాళ్ళు తిట్లకు లేసుకున్నారు. 


"నీ యాకుచినగ! నీకు దూము తగల! నిన్ను పాడె మీద తీసుకు పోనూ! నీకు రోగమొచ్చి సచ్చిపోనూ! నీ నోట్లో ఏడు దోవల దుమ్ము గొట్టా! నువ్వెప్పుడు సచ్చినావని వింటామురా! నీ వంశం నీరువంశం గాను! నీ తలపండు పగల! నీ యాలి ముండమొయ్యా! నీ ఇంట్లో పీనిగెల్లా! నీ పిండాకూడు కాకులు తిన! నీ వడ్డియిరిగి వంకపాలు గాను! నీ నాలిక నక్కలు పెరక!" అంటూ శాపనార్థాలు పెట్టారు. 


రామచంద్రారెడ్డి కొడుకు రాఘవరెడ్డిపైన అరచి కోపపడ్డాడు. "నీళ్ళ అత్తికారానికి మనిషిని సంపుతావా! మనిషంటే మేకపోతు అనుకున్నావా! నువ్వేం మనిషవిరా! పశువులా ప్రవర్తించావు! నువ్వు చేసిన పనికి రెండూర్ల మద్దిన ఎన్నో యేండ్లుగా ఉన్న స్నేహ‍సంబంధాలు చెడిపోతాయి. రొండూర్ల మద్దిన పార్టీ పడుతుంది. 


ఈ దిక్కున కొంత మంది, ఆ దిక్కున కొంత మంది హత్య కావొచ్చు! మొగోలంతా జైలుపాలు పాలుకావచ్చు! చేలు బీడ్లైతాయి. మొగోళ్ళులేని ఆడవాళ్ళు చెడిపోవచ్చు! పిల్లలు పోరంబోకులై తరంగాకుండా పోతారు. జనం ఆదాయం ల్యాక ఆర్థికంగా చితికి పోతారు. నీ ఆవేశం వల్ల ఎన్ని అనర్థాలు జరగుతాయో తెలుసా? క్షణకాలం ఓర్చుకొని ఉంటే గుణం వచ్చేది. కోపాన్ని అదుపు చేసుకోల్యాక పోయావు" తీవ్రంగా మందలించాడు రామచంద్రారెడ్డి. 


 రామచంద్రారెడ్డి, రంగనాథనాయుడి ఇంటికి రాయబారం పంపి క్షమాపణ చెప్పించాడు. లాభం లేకపోయింది. సస్సేమిరా వినుకోలేదు. పైగా ప్రతాపనాయుడి చితి మీద ప్రాణానికి ప్రాణం తీస్తామని ప్రమాణం చేశారు. 


రామచంద్రారెడ్డి అనుకున్నట్లే రెండూర్లు రెండు వర్గాలుగా విడిపోయి రెండూర్ల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకుంది పరిస్థితి. ఇరువర్గాలలో ఎవరూ ఒంటరిగా బయటికి పోవడం లేదు. ఏ పని మీదైనా, ఎక్కడికి పోవలసి వచ్చినా గుంపులు గుంపులుగా ఆయుధాలు వెంటబెట్టుకొని పోతున్నారు. బయటకు వచ్చినప్పుడు ఇరువైపులా చూసుకుంటూ ముందెనుక గమనించుకుంటూ నడుస్తున్నారు. 


వాతావరణం భయంభయంగా ఉంది. నిన్నటి వరకు స్నేహంగా ఉన్నవారు ఇప్పుడు బద్ధ శత్రువులైనారు. రంగనాథనాయుడోళ్ళు ప్రొద్దుటూరు కోర్టులో కేసు వేశారు. రాఘవరెడ్డి నెంబర్ వన్ ముద్దాయిగాను రామచంద్రారెడ్డిని మిగతా ముగ్గురు కొడుకులను వరుసగా రెండు మూడు ముద్దాయిలగాను, చివరి కొడుకు వివేకారెడ్డిని రామచంద్రారెడ్డిని నాలుగు ఐదు ముద్దాయిగాను కేసు బుక్ చేశారు. అందరినీ అరెస్టు చేసి జైల్లో వేశారు. 


చివరి ముద్దాయిలైన రామచంద్రారెడ్డికి వివేకారెడ్డికి నెలకే బెయిల్ వచ్చింది. వివేకారెడ్డి ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజిలో లెక్చరర్. అది శత్రుపక్షానికి అనుకూలంగా మారింది. 


వివేకారెడ్డి కాలేజికి పోయే సమయం చూసి, కొనేటి కాల్వవీధిలో మాటువేసి, దాడిచేసి పిడిబాకుతో పొడిచారు. అక్కడే వున్న పోలీసులు అలెర్ట్ కావడం వల్ల మరో పోటు పొడవకుండనే పారిపోయారు రంగనాథనాయుడి మనుషులు. పోలీసులు ఆలస్యం చేయకుండా ఆసుపత్రిలో చేర్చడం వల్ల వివేకారెడ్డి బతికి పోయాడు. 


అది మొదలు ఇరువైపులా ఉద్రిక్త పరిస్థితులు తీవ్రంగా ఏర్పడ్డాయి. మూడు నెల్లకు మిగతావారు కూడా బెయిల్ పై విడుదలైయ్యారు. రామచంద్రారెడ్డి వాళ్ళు సమావేశమై ఏదోకటి చేసి భయపెట్టక పోతే శత్రువులు రెచ్చిపోతారని ఒకతప్పుడు నిర్ణయానికి వచ్చారు. 


 కడపలో రంగనాథనాయుడి బావ ఇన్కమ్ టాక్స్ ఆఫీసులో ఉద్యోగం. అతడు ఆఫీసుకు పోతుంటే సంధ్యా థియేటర్ దగ్గర కాపుకాసి రాక్షసంగా నరికి చంపారు రామచంద్రా రెడ్డోళ్ళు.. దానితో రంగాపురంలో పెను చలనం చెలరేగింది. ఉద్రేకం కట్టలు తెంచుకుంది. కోపోద్రిక్తులైన రంగాపురం ప్రజలు నానా రకాలైన ఆయుధాలు అందుకొని ఒక్కసారిగా రామాపురం మీద పడ్డారు. జనం భీతిల్లి పిల్లాజల్లా అందరూ ప్రాణభయంతో పారిపోయారు. అందిన వారిని అందినట్లు నరికి పొడిచి పాశవికంగా చంపారు. 


రాఘవరెడ్డి పశువులకు మేత ఎత్తుక పోతూ కనిపించాడు. అతన్ని నరికినరికి, పొడిచిపొడిచి కసిదీరా చంపారు. దాడిలో అతడే మొదటి కబళమైయ్యాడు. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు ముసలివాళ్ళు తప్పించి కనబడిన యువకుడినల్లా వెంటబడి వేటాడి పైశాచికంగా చంపారు. రామచంద్రారెడ్డి యింట్లో మిగతావాళ్ళు ఔతుఖాన్లో ఒకడు, నేలపాతరలో ఒకడు, కర్డనంలో ఒకడు, జొల్లగంప కింద ఒకడు, దాక్కొని బతికిపోయారు. ఆవూరికి కొత్తగా అల్లుడిగా వచ్చిన ఒకతన్ని ధాన్యం నిలువ చేసే గాజలో దాచి కాపాడుకున్నారు అతని అత్తాభార్యావాళ్ళు. 


 ఎవరో ఫొన్ చేస్తే జీపులో పోలీసులు వచ్చారు. దానితో రంగాపురంవాళ్ళు పారిపోయారు. పోలీసుల విచారణలో పదిమంది చనిపోయారని, చాలా మందికి రక్తపు గాయాలైనాయని తేలింది. రామచంద్రారెడ్డి, రంగనాథనాయుడి మీద, అతని కొడుకుల పైనేకాక మరో పదిమంది పైన కేసు రాయించాడు. వారందరినీ అరెస్టు చేసి జైల్లో వేశారు. 


ఒకే రోజు పది మంది ఖూనీ కావడంతో రాష్ట్రమంతా దిగ్భ్రాంతికి గురైంది. రెండూర్లల్లో ప్రభుత్వం పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేసింది. దానివలన ఇరువైపుల వారు చడిచప్పిడి లేకుండా కొన్నాళ్ళు ఊరక ఉండిపోయారు సమయం కోసం ఎదురుచూస్తూ.. 


ఇంతలోపల రంగనాథనాయుడి వాళ్ళకు బెయిల్ మంజూరై బయటికి వచ్చారు. రామచంద్రారెడ్డి, రంగనాథనాయుడు తమ తమ రక్షణ కోసం వందల మందిని కాపలబెట్టుకొని మదువు మాంసాలతో విందు భోజనం ఏర్పాటు చేసి జనాన్ని పెంచి పోషిస్తున్నారు. ఇరువర్గాలవారు కోర్టు వాయిదాలకు మందీ మార్భలంతోకత్తులు బాకులు బల్యాలు ఈటెలు గండ్రగొడ్డెళ్ళు నాటు తుపాకుల తోపాటు సంచుల్లో నాటు బాంబులు కూడా తీసుకొని పోయి వస్తున్నారు. 


ఒకరోజు వాయిదాకు పోయి వస్తూ పొల్లోలి, లింగాపురం గ్రామాల మధ్య ఎదురుపడ్డారు. బాకుల్తో ఈటెల్తో పొడుచుకున్నారు. కత్తులతో గొడ్ఢెళ్ళతో నరుకున్నారు. తుపాకుల్తో కాల్చుకున్నారు. బాంబుల్తో ప్రేల్చుకున్నారు. అక్కడంతా రణరంగ కురుక్షేత్రమైంది. పోలీసులోచ్చి తుపాకులు ఎగరగాల్చడంతో ఎవరి దారిన వాళ్ళు పరిగెత్తారు. అటుపది ఇటుపది శవాలు పడ్డాయి. నలబై మంది గాయాలతో ఆసుపత్రి పాలైనారు. 


రెండు వర్గాలవాళ్ళు కేసు పెట్టుకోలేదు. ఈసారి రామాపురం రంగాపురం ఫ్యాక్షన్ కథ దేశం మొత్తం తెలిసిపోయింది. అయినా ఎవరూ తగ్గలేదు. ‌ మనుషుల్ని పగలు కక్షలు పాషాణ హృదయాలుగా మారుస్తాయని రుజువైంది. 

 జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, పోలీసు యంత్రాంగం రెండు గ్రూపుల్ని పిలిపించి వేరువేరుగా విచారించి రాజీ పడమని బలవంతం పెట్టారు. రెండు గ్రూపులవాళ్ళు రాజీ పడుతున్నట్లు నటించారు. 


అగ్రిమెంట్ పత్రాల మీద రెండు గ్రూపుల నాయకుల సంతకాలు తీసుకుని "ఒప్పందం ఉల్లగించారంటే సెరి పది లక్షల రూపాయలు కట్టాలి. అంతేకాదు జైల్లో చిప్పకూడు తింటూ మగ్గిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త!" అని బెదిరింపు మాటలు చెప్పి పంపించారు. సద్దుమణిగినట్లే ఉండింది కొన్నాళ్ళు. 


 అటు కొన్ని దినాలకు రామచంద్రారెడ్డి మనుషులు యర్రొంకలో దాచుకొని యర్రగుంట్ల నుంచి వస్తున్న రంగనాథనాయుడి మనుషులపైన హఠాత్తుగా దాడి చేసి అవతలి వ్యక్తులు తేరుకొనేలోపే క్రూరాతి క్రూరంగా ఐదుగురిని హత్య చేసి అక్కడి నుంచి ఉడాయించారు. రంగాపురం అట్టుడికిపోయింది. ముందు మాదిరిగానే రామాపురం మీద దాడి చేయాలని ఉద్యుక్తులైనారు జనం. 


రంగనాథనాయుడు ప్రతీకారంతో రగిలిపోయాడు. ఐనా తమకం పట్టాడు. రంగనాథనాయుడు తన మనుషులతోనూ, ఊరి ప్రజలతోనూ "మనం దాడి చేస్తామని రామాపురంవాళ్ళు జాగ్రత్త పడివుంటారు. అప్రమత్తులై ఆయుధాలతో సిద్ధంగా ఉండినప్పుడు మనం దాడి చేస్తే ప్రాణనష్టం మనకే ఎక్కువగా ఉండొచ్చు. కొన్ని రోజులు ఓపిక పడదాం. అదును చూసి దెబ్బ తీస్తాం. ఇప్పటికి తమాయించుకోండి. " సర్దిచెప్పి వారి ఆవేశాన్ని చల్లార్చాడు. ప్రతీకారం తీర్చుకోవడం కోసం పోలీసు స్టేషనులో పిర్యాదు చేయలేదు రంగనాథనాయుడు. 

ఆతరువాత పదినాళ్ళు గడిచాక మైదుకూరు నుంచి బస్సులో వస్తున్న రామచంద్రారెడ్డి మనుషుల్ని కుందూ బ్రిడ్జి దగ్గర యాబై మంది బస్సాపి లోనికి పోయి చిక్కినోడిని చిక్కినట్టే పొడిచి కిరాతకంగా చంపారు. ప్రయాణికుల మధ్య దాక్కున్న వారిని, సీట్లకింద దూరినవారిని బయటకు లాగి కర్కశంగా నరికి చంపారు. బస్సు కిటికీ గుండా దుమికి పారిపోతున్న వారిని వెంటాడి భయంకరంగా హత్య చేశారు. 


వాళ్ళ ముఖాల్లో కసి తీరలేదు. మొత్తం పన్నెండు శవాలు తేలాయి. ప్రయాణికులు భయబ్రాంతులైయారు. దీనితో మరోసారి రాష్ట్రమంతా పెను సంచలనం జరిగింది. కక్ష అనేది మొదలైతే దానికి పరిమితులు హద్దులు ఉండవనేది తేటతెల్లమైంది. 


రామాపురం రంగాపురం ప్యాక్షన్ రావణకాష్టంలా రగులుతున్నదని, ఆపడం పోలీసుల వల్లను, అధికారుల వల్లను కావడం లేదని ప్రభుత్వానికి అర్థమైపోయింది. ఇది రాజకీయ జోక్యం ద్వారా ఆగవచ్చ అనుకుంది. 


 జిల్లా మంత్రి చంద్రశేఖరరెడ్డిని, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనందనాయుడుని రామాపురం రంగాపురం ప్యాక్షన్ నాయకుల్ని రాజీ చేయమని పంపింది ప్రభుత్వం. వీరికి జిల్లా యంఎల్యేలు, యంపీలు సహకరించమని ఆదేశించింది. 


 రామచంద్రారెడ్డిని చంద్రశేఖరరెడ్డి, రంగనాథనాయుడిని ఆనందనాయుడు ఏకాంతంగా కలిశారు. ఇద్దరికి ఇద్దరూ ఎంతో సర్ది చెప్పారు. ఇద్దరికీ ముఠా తగాదాల వల్ల వచ్చే కష్టనష్టాలు వివరించి చెప్పారు. ఎంతో ప్రయత్నం తరువాత ఇద్దరినీ ఒక చోట చేర్చారు. రెండూర్లకు సంబంధించిన జిల్లా పరిషత్ హైస్కూల్ భవనంలోని మీటింగ్ హాలులో ఇరువర్గాలను కలిపి మాట్లాడారు. రెండూర్ల ప్రజలు భవనం చుట్టూ చేరారు. పోలీసులు పహారా కాశారు. 


"ఇరువైపులా ఎంతోమంది చనిపోయారు. ఆడవాళ్ళు చాల మంది ముండమోశారు. ఆర్థిక నష్టాలు పెద్దగా జరిగాయి. చేన్లు చేసేవారు లేక బీడ్లైనాయి. పశువుల్ని పట్టించుకునే వారు లేక బక్కచిక్కిపోయాయి. పాడిపంటలు దెబ్బ తిన్నాయి. ప్యాక్షన్ అన్ని విధాలా మంచిది కాదు. కేసి కెనాలును బాగుచేసి చివరి ఆయకట్టు భూములకు సంపూర్ణంగా సాగునీరు అందేటట్లు చేస్తాం. రెండూర్ల అభివృద్ధికి రెండేసి కోట్ల రూపాయల చొప్పున విడుదల చేస్తాం. ఇకనైనా రాజీపడి ఈ నష్టాన్ని ఆపండి. ఊర్ల అభివృద్ధికి సహకరించండి" మనస్సుకు ఎక్కేట్లు బాగా వివరించారు మంత్రివర్యులు. 


 ‌‌"మాకు ఎక్కువ నష్టం జరిగింది" రామచంద్రారెడ్డి చెప్పాడు.

 

"మాది తప్పు కాదు, ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం వారే!" అన్నాడు రంనాథనాయుడు. 


"సరే సరే! అయిందేదో అయింది. ఇద్దరూ సమవుజ్జీలే. ఇద్దరూ సమర్థులే. కాబట్టి రాజీ పడకపోతే ఇంకా ప్రాణనష్టం జరుగుతుంది. " మంత్రులు ఒత్తిడి తెచ్చారు. 

రెండు కుటుంబాల వారిని పక్కనున్న ఆఫీసు రూంలోకి పిల్చుకొని పోయి రహస్యంగా చర్చించారు. 


"రాష్ట్రం యావత్తూ మీవైపే చూస్తున్నది. మీరు రాజీ పడక తప్పదు. ఏదైనా నిగూఢ విషయం ఉంటే చెప్పండి. " మంత్రి చంద్రశేఖరరెడ్డి సాలోచనగా అన్నాడు. 


రామచంద్రారెడ్డి రంగనాథనాయుడు ఎవరికివారు "అవతలివారు రాజీకి కట్టుబడరని, ఇదివరకు కుదిరిన రాజీ విఫలమైందని కాబట్టి నమ్మడానికి వీలులే”దని చెప్పారు. 

 "అందువలన నేను ఒక ప్రతిపాదన చేస్తాను. అలా జరిగితే మీ ఇద్దరి మధ్యనా ఎప్పటికీ తగాదాలు రావు. వింటారా?" అన్నాడు మంత్రి ఆనందనాయుడు. 


దానికి వత్తాసు పలికాడు మంత్రి చంద్రశేఖరరెడ్డి. 


"ఏమిటో చెప్పండి. అంగీకారమైతే ఒప్పుకుంటాం" అన్నారు రామచంద్రారెడ్డి రంగనాథనాయుడులు. 


"డొంకతిరుగుడు లేకుండా, నానబెట్టకుండా సూటిగా విషయానికి వస్తాను. రామచంద్రారెడ్డి తన ముగ్గురు కూతుర్లను రంగనాథనాయుడి కొడుకులకు, రంగనాథనాయుడు తన ముగ్గురు కూతుర్లను రామచంద్రారెడ్డి కొడుకులకు ఇచ్చి వివాహం చేసినట్లైతే ఏ తగాదా ఉండదు. ఏ సమస్య రాదు. ఇందుకు సమ్మతించండి. అందరూ బాగుంటారు. " అనందనాయుడు వత్తిడి తెస్తునట్లు చెప్పాడు. 


ఆ ప్రతిపాదనను బలపరిచాడు చంద్రశేఖరరెడ్డి. సి యం కు ఫోన్ చేసి సియంతో కూడ చెప్పించారు. 


"మాకు పది నిమిషాలు టైం కావాలి. మావాళ్ళతో మాట్లాడి వస్తాం. " అని అనుమతి తీసుకుని ఇరు కుటుంబాల వారు తమతమ వర్గాలతో చర్చించి పది నిమిషాల్లో వచ్చారు.

 

 "మాకు సమ్మ‍తమే కానీ.. " అంటూ నసికారు ఇద్దరూ. 


 "ఏమిటో రహస్యం! చెవి దగ్గరికొచ్చి చెప్పండి. మాకు ఏదో విధంగా రాజీ పడడం కావాలి అంతే!” అన్నారు మంత్రులు. 


నలుగురు దగ్గరగా కూర్చొని ఏదో మాట్లాడుకున్నారు. 

ఆతర్వాత ఇరువర్గాల పెళ్ళిళ్ళు అత్యంత వైభవంగా జరిగాయి. వివాహాలకు రాజకీయనాయకులు తోపాటు అధికారులు, పోలీసు డిపార్ట్మెంట్ ఆజరై పెళ్ళిళ్ళకు నిండుదనం తెచ్చారు. మళ్ళీ యదావిధిగా రెండూర్ల ప్రజలు కలిసి పోయారు. 


కొంతకాలానికి రామాపురం మనుషులు భుజంగరావు పణీందరరెడ్డి కెసి కెనాల్ చాపాడు చానల్ కాలువలో శవాలై కనబడినారు. అటు కొంత కాలానికి రంగాపురం మనుషులు నాగరాజారెడ్డి నాగభూషణరావు మైలవరం డ్యాం దక్షిణ కాలువలో పీనిగలై తేలారు. వీళ్లు పగ ప్రతీకారం ఆరిపోకుండా ఎగదోసే శకుని లాంటి వారని పేరుంది. 



 రాజీ ప్రయత్నాల్లో జరిగిన రహస్య మంతనాలే ఈచావులకు కారణమని జనం గుసగుసపోతూ చెవులు కొరుక్కున్నారు. ఐనప్పటికీ ప్రజలెవరూ పట్టించుకోలేదు. ఇంకప్పటి నుంచి మళ్ళెప్పుడూ రెండూర్ల మధ్య ఖూనీ జరగలేదు. 

 ---------- 

కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య

చదువు: B.com

పుట్టిన తేది: 1960

తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య

రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.

అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.

సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.

సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.---------



41 views1 comment

1 Comment



@aadinarayanareddy2300

• 7 days ago (edited)

రెడ్లకు.... నాయుళ్లకు  వియ్యం కలిపి శాంతి నెలకొల్పిన చరిత్ర సృష్టి రచయితది. అభినందనీయం.   అటువైపు ఇటువైపు రాజీ కుదరకుండా తమ చాకచక్యంతో  పగను ఎప్పటికప్పుడు ఆరిపోకుండా రగుల్కొలుపుతూ వచ్చిన ఇరువైపులా ఉన్న ద్రోహులను గుర్తించి గుట్టుగా మట్టుపెట్టిన  ఇరువైపుల నాయకులూ అభినందనీయులు. పీడ విరగడ అయింది.          కథ సుఖాంతం.   ఏది ఏమైనా ఇటువంటి దుర్ఘటనలు ఏ ఊరిలో కూడా జరుగకూడదు.   రచయితకు అభినందనలు.

Like
bottom of page