'Railu Vellipoyindi' New Telugu Story
Written By Ch. C. S. Sarma
'రైలు వెళ్ళిపోయింది' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
ధనుర్మానం...
శివాలయ పూజారి శంభు ఆలయ తలుపులను నాలుగు గంటలకు తెరచి... తాను శుచిగా బావిలోని గంగను చేదుకొని పరమేశ్వరునకు అభిషేకం ప్రారంభించాడు.
ఆలయం ముందు మండపం...
అది... సాంబుడి నిలయం...
వాడూ... పూజారిగారి పిలుపుతో లేచి... కాలకృత్యాదులు తీర్చుకొని ... తన సైకిల్ పై ఒక కిలోమీటరు దూరంలో ఉన్న రైల్వేస్టేషన్ కు ఐదు గంటలలోపల చేరుతాడు.
వార్తా పత్రికలు.... తెలుగు ... ఇంగ్లీషు...
స్థానిక ఏజంటు గోపయ్య...
వారి కింద ఆరుగురు డెలివరీ బాయిస్...
అందులో సాంబుడు ఒకడు...
తన పేపర్లన్నింటినీ సైకిల్ పై క్యారేజికి తాడుతో కట్టేసి...
“అన్నా !... నే బయలుదేరుతా !...” చెప్పాడు సాంబుడు.
“ఆ... ఆ... మంచిదిరా... జాగ్రత్త.... గోపయ్యగారి అభిమాన పూర్వక హెచ్చరిక...
సాంబుడు నవ్వుతూ .... “అట్టాగే అన్నా !...’’ సైకిల్ ఎక్కి గ్రామంవైపుకు బయలుదేరాడు.
ఆ రైల్వే స్టేషన్ కు మూడువైపులా మూడు పెద్ద గ్రామాలు. పదోతరగతి వరకు స్కూళ్లు... స్టేషన్ నుండి మూడు గ్రామాలు దాదాపు ఓ కిలోమీటర్ దూరంలో వుంటాయి.
సాంబుడు వుండే గ్రామంలో శివాలయం... మరో గ్రామంలో రామాలయం... మూడవ గ్రామంలో వెంకటేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి.
ఆ మూడు ఊళ్లల్లో సాంబుడు వుండే వూరు పెద్దది... హైస్కూలు... ఆర్ట్స్ కాలేజి వుంది. మిగతా రెండు వూళ్లల్లో హైస్కూళ్లు మాత్రమే.
సాంబుడి దినచర్య...
స్టేషన్ కు వెళ్లి దిన వార్తాపత్రికలను ఏజంటు దగ్గరనుంచి తీసుకొని వచ్చి... వంద ఇళ్లల్లో వేయడం...
ఈ పని ఉదయం ఏడు... ఏడున్నర లోపు పూర్తవుతుంది.
శరభయ్య ఆ గ్రామ సర్పంచి... నాలుగు రిక్షాలు వున్నాయి.
నాలుగు రిక్షాలకు నలుగురు డ్రైవర్లు.
ఒక రిక్షాకు సాంబుడు సారథి.
జనాన్ని బట్టి ఆ రిక్షాలు... స్టేషన్కు... స్టేషన్ నుండి ఎడమవైపు వున్న వూరికి.. కుడివైపున వున్న వూరికి... సవారీతో తిరుగుతుంటాయి.
వచ్చిన ఆదాయంలో మూడువంతులు శరభయ్యకు... ఒక వంతు రిక్షా తొక్కిన అతనికి...
సాంబుడు పేపర్లు పంచాడు. శివాలయానికి చేరాడు. కాళ్లు ముఖం కడుక్కొని ఆలయంలో ప్రవేశించి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించాడు.
పూజారి శంభు గారు మాతా పితల నివేదనా ప్రసాదాన్ని సాంబుడి కోసం తీసి ఉంచాడు.
వాణ్ణి చూచిన శంభు గారు...
“సాంబా !...”
“సా...మీ !...”
“చేయి పట్టు... ప్రసాదం తీసుకో !...” అరటి ఆకులో వున్న ప్రసాదాన్ని సాంబుడి చేతిలో పెట్టాడు శంభు గారు.
సాంబుడు ప్రసాదాన్ని కళ్లకు అద్దుకొని తిన్నాడు. కుళాయి తిప్పి నీళ్లు తాగాడు.
“సామీ !.. సాయింత్రం కలుద్దాం !... శరభన్నగారి యింటికి వెళుతున్నా !...”
“మంచిదిరా !... జాగ్రత్త...”
“అట్టాగే సామీ !..” చిరునవ్వుతో చెప్పి సాంబుడు ఆలయ పరిసరాలను దాటి శరభయ్య ఇంటికి వెళ్లాడు.
శరభయ్యకు ఒక కూతురు. శారదాంబ... వయస్సు పదహారు. సాంబుడి వయస్సు పధ్నాలుగు సంవత్సరాలు... కుర్రాడు బాగా ఒడ్డూ... పొడుగూతో దాదాపు ఇరవై ఏళ్ల వాడిలా బలంగా వుంటాడు. అందరికీ అతనంటే ఎంతో ప్రియం... అభిమానం... అది అతని ముఖారవింద లక్షణం.
“అక్కా!... రిక్షా తీసుకొంటున్నా!...’’
తాను మామూలుగా తీసుకొనే సైకిల్ రిక్షానుసమీపించాడు.
శారదాంబ... అతనివంక కొంటెగా చూచి నవ్వింది.
ఆ నవ్వులో సాంబుడికి ఏదో అనుమానం...
“అక్కా...
“అలా పిలవొద్దని చెప్పానా !...’’
“అలవాటైపోయిందిగా అక్కా !...”
“మార్చుకో !..”
“ఎట్టా కుదురిద్ది అక్కా !....’’
“అయితే రిక్షాను తాకొద్దు...”
“ఏంటి శారదాంబక్కా... నీవంటున్నది ?...” ఆశ్చర్యంతో అడిగాడు సాంబుడు.
శారదాంబ తల్లి స్నేహలత వచ్చింది. సాంబుడి చివరి మాటలను విన్నది.
“సాంబూ !... బాగున్నావా !...” ప్రీతిగా అడిగింది స్నేహలత...
“ఆ... అమ్మా!... బాగుండా !.. క్షణం తర్వాత... “అమ్మా... అక్కకు ఒంట్లో సరిగా లేదంట. విషయం ఏదో కనుక్కొని... డాక్టర్ కాడికి తీసుకెళ్లండి... రోజులు బాగా లేవు... అశ్రద్ధ చేయకూడదు... అమ్మా... నే వస్తా !...” సైకిల్ రిక్షాను తీసుకొని శారదాంబ వంక ఓరకంట చూచి... వీధిలో ప్రవేశించాడు.
స్నేహలత... కూతురు ముఖంలోకి చూచింది. రుసరుసలాడుతూ శారదాంబ ఇంట్లోకి వెళ్లింది. స్నేహలత ఆమెను అనుసరించింది.
‘ఈ సాంబుగాడికి చాలా పొగరు... నామాటను వినిపించుకోడు... అర్థం చేసుకోడు.. చెప్తా... చెప్తా... వీడి సంగతి నాన్నకు చెప్పి... ఓ ఫిటింగ్ పెడతా... నేను.. నా కెపాసిటీ ఏంటో చూపిస్తా !...’ అనుకొంది శారదాంబ.
* * *
తిరువనంతపురం... పవిత్ర క్షేత్రం వారణాసి... ఎక్స్ ప్రెస్ ఆస్టేషన్లో ఆగింది. ఐదారుగురు ప్రయాణీకులు దిగారు. స్టేషన్ బయటకు వచ్చారు.
ఒకే కుటుంబం... భార్యా భర్త... ఇద్దరు పిల్లలు ... ఒక యువతి... పాతిక సంవత్సరాల వయస్సు... ఆమెతో ఓ యాభై సంవత్సరాల పెద్దమ్మ... మరో నలభైఏళ్ల పెద్ద మనిషి...
భార్యా భర్తలు ఒక రిక్షా మాట్లాడుకొని ఎడమచేతివైపున (ఉత్తరం)వున్న వూరికి బయలుదేరారు.
నలభై సంవత్సరాల పెద్దమనిషి మరో రిక్షాతో కుడిచేతివైపున (దక్షిణం) వున్న గ్రామానికి బయలుదేరాడు.
ఆ యువతి వారి తల్లి... సాంబుడిని సమీపించారు.
“వూర్లోకి వస్తావా !...”
“ఎవరింటికండీ ?...”
“పూజారిగారి ఇంటికి !...
“ఆ... ఎక్కండి !...”
“ఎంత ?...”
“మీరు ఏమీ ఇవ్వనక్కర్లేదండీ... వారు నా గురువుగారు.. ఎక్కండి.. ఎక్కండి…” చిరునవ్వుతో చెప్పాడు సాంబుడు
“అలా కాదు... ఎంత ఇవ్వాలో చెప్పు...” అంది ఆ యువతి మధుమతి
“అమ్మా !... మీరు ఎక్కండి... అయ్యగారు ఎంత చెబితే... అంత ఇవ్వండి... సరేనా !...”
‘ఈ అబ్బాయి ఎవ్వరో ! మామయ్య మీద ఎంతో అభిమానాన్ని చూపుతున్నాడు. మంచి వారికి మంచి వారే తోడవుతారుగా !...’ అనుకొంది మధుమతి.
“అమ్మా !... ఎక్కు…”
ఆ పెద్దమ్మ మధుమతి రిక్షా ఎక్కారు.
పెద్దమ్మ పక్కనే మధుమతి కూర్చుంది.
సాంబుడు రిక్షా ఎక్కి తొక్కడం ప్రారంభించాడు.
“అమ్మా !... స్వామీజీ మీకు ఏమవుతారు ?...”
“మా మామయ్య !...” సాలోచనగా చెప్పింది మధుమతి.
“మామయ్యగారు దేవుడమ్మా !... “ ఎంతో ప్రీతిగా చెప్పాడు సాంబుడు.
ఇరవై నిముషాల్లో సాంబుడు శివాలయ ప్రాంగణంలో దక్షిణపు వైపున వున్న పూజారి శంభుగారి ఇంటి ముందు రిక్షాను ఆపాడు సాంబుడు...
“సా...మీ !... సా...మీ !...” బిగ్గరగా పిలిచాడు
మధుమతి, వారి తల్లి మాధవి రిక్షా దిగారు.
శంభూగారి భార్య శకుంతల సింహద్వారాన్ని సమీపించి వీధి వైపుకు చూచింది. వాకిట వున్న మధుమతిని, మాధవిని చూచి... నవ్వుతూ వచ్చి వారిని సమీపించింది.
“వదినా !... మధూ !... బాగున్నారా !... రండి...’’ ప్రీతిగా పలికి మాధవి చేతిని తన చేతిలోనికి తీసుకొంది....
సాంబుడు రెండు సూటుకేసులను... వరండాలో వుంచాడు.
శకుంతలమ్మగారికి నమస్కరించాడు.
ఆ ముగ్గురు వరండాలోకి ప్రవేశించారు.
వీధిగేటు దగ్గరకు శంభుగారు వచ్చారు.
వారిని చూచి సాంబుడు చేతులు జోడించి నమస్కరించాడు.
“సా...మీ !... మన బంధువులు వచ్చారు...” చెప్పాడు...
వేగంగా మధుమతి వరండాలోకి వచ్చింది.... సాంబుడికి డబ్బులు ఇవ్వాలని. శంభుగారిని చూచింది.. చిరునవ్వుతో..
“మామాయ్యా ... బాగున్నారా ...’’ ఆపేక్షగా పలకరిస్తూ... వారిని సమీపించింది.
“మామయ్యా !... ఈ అబ్బాయికి డబ్బులు ఇవ్వాలి... ఇంత అని అతను చెప్పలేదు...”
శంభూగారు... సాంబుడి ముఖంలోకి చూస్తూ... “ఏరా !... డబ్బులు తీసుకోలేదా !..”
“సా... మీ !... ఈ దేవుడికి సంబంధించిన వారి దగ్గర డబ్బులు తీసుకొంటే... ఆ దేవుడు నన్ను శిక్షిస్తాడండీ !... మన్నించండి....’’ నవ్వుతూ చేతులు జోడించాడు సాంబుడు.
శంభూగారు సాంబుణ్ణి ఆప్యాయంగా చూస్తూ “అమ్మా !... మధు... వీడు మన వాడమ్మా !... డబ్బులు తీసుకోడు తల్లీ... నీవు లోనికి పద... వస్తున్నా !..” అనునయంగా చెప్పాడు.
మధుమతి... సాంబుడి ముఖంలోకి చిరునవ్వుతో చూచి లోనికి వెళ్లిపోయింది.
శంభూగారు సాంబుడి ముఖంలోకి చూచాడు.
దాన్ని గమనించిన సాంబుడు...
“అయ్యా !.. ఏంటి అలా చూస్తుండారు ?...” ప్రశ్నార్థకంగా శంభుగారి ముఖంలోకి చూచాడు సాంబుడు.
శంభూ సాంబుడి చేతిని తన చేతిలోనికి తీసుకొని ఆలయ మండపం వైపుకు నడిచారు.
వారు మండపంలో కూర్చున్నారు...
“సాంబూ!... కూర్చోరా!...” సాలోచనగా చెప్పారు శంభుగారు.
“ఫర్లేదయ్యా !... చెప్పండి !...” శంభూగారి ముఖంలోకి చూస్తూ అడిగాడు సాంబుడు.
“సాంబూ !...”
“అయ్యా !...”
“నీకు ఆ శరభయ్య కూతురు శారదాంబకు ఏమిటిరా సమస్య!...” ఆసక్తిగా అడిగాడు శంభూగారు...
వుదయం జరిగిన విషయం సాంబుడికి గుర్తు వచ్చింది...
ఆశ్చర్యంతో... అమాయకంగా శంభూగారి ముఖంలోకి చూచాడు.
‘శారదాంబ ఇంట్లో వుండేది నలుగురు. శరభయ్య... వారి సతీమణి స్నేహలత... కొడుకు వీర ప్రతాప్... కూతురు శారదాంబ... ఆ శారదాంబ ఈ స్వామితో ఏమి చెప్పిందో !... వారడిగిన ప్రశ్నకు జవాబు నేను ఏమని చెప్పాలి ?... అయినా కొంచెం తడిశాక... ఇక పూర్తిగా తడిసేదానికి జంకితే ఏం లాభం ?... ధైర్యం చేసుకొని స్వామినే అడగాలి ఎవరు తనని గురించి ఏం చెప్పారనేది ?...’ ఆ నిర్ణయానికి వచ్చాడు సాంబుడు.
“సా.. మీ !... మీరు... డైరక్టుగా మీతో ఎవరు ఏం చెప్పారో దాన్ని నాకు చెప్పండయ్యా !... అది నిజమా !... అబద్ధమా !... అనే విషయాన్ని ఆ ఆలయంలో వుండే మన సాంబశివస్వామి సాక్షిగా నాకు తెలిసింది తమరికి చెబుతానయ్యా !...” దీనంగా శంభుగారి ముఖంలోకి చూచి చెప్పాడు సాంబుడు.
సాంబుడి ముఖానికి పట్టిన చమట... కళ్లలోని బాధ... వదనంలోని విచారం... చూసిన శంభుగారు... సాంబుడు ఎలాంటి తప్పు చేసివుండడనే నిజం తనకు తెలిసివున్నప్పటికీ... ఆ యదార్థాన్ని సాంబుడి నోటినుండి వినాలనేది శంభుగారి ఆశయం.
“అదికాదురా !... నీకు ... ఆ శారదాంబకు ఏమిటిరా సమస్య... నిజం చెప్పు...’’
“స్వామీ ! ఆమె మాట తీరు... చూపులు... సరిగా లేవయ్యా... ఆమెను చూడాలంటేనే నాకు భయం అయిపోయింది.” కన్నీటితో దీనంగా చెప్పాడు సాంబుడు....
శంభుగారికి సాంబుడు చెప్పిన మాటల్లోని పరమార్థం అర్థం అయింది.
‘తన శిష్యుడు సాంబుడు... ఐదేళ్ల ప్రాయంలో ఆలయంలో తనకు తారసపడ్డాడు. తనకు ఎవరూ లేరన్నాడు. అప్పటినుంచీ వుంటున్నాడు... మంచివాడు... మంచి మానవత్వాన్ని నా దగ్గర నేర్చుకున్నాడు... పద్ధతిగా పెరిగాడు... వీడిలో ఎలాంటి మార్పు లేదు...’ అనుకొని...
“ఆ... సరేరా !... నాకు విషయం అర్ధం అయింది. నీవు భయపడకు... బాధపడకు... వీలైనంతవరకు ఆ పిల్లకు దూరంగా వుండు... నేను వాళ్ల నాన్న శరభయ్యకు చెప్పి ఆ పిల్ల తత్వం మారేలా చేస్తా...” అనునయంగా చెప్పారు శంభుగారు.
శంభుగారు తన ఇంటివైపుకు నడిచారు. సాంబుడు తన రిక్షాతో స్టేషన్ వైపుకు వెళ్లాడు.
* * *
సమయం సాయంత్రం ఏడుగంటలు.
వర్షం కురుస్తూ వుంది. ఉరుములు... మెరుపులు...పదినిముషాల కొకసారి...
జనాల గుండెల్లో దడ దడ... భయం... వర్షంపై అసహ్యం... అంతా దైవలీల... కొన్ని ప్రాంతాల్లో జలమయం... కొన్ని ప్రాంతాల్లో విపరీత ఉష్ణం... ఎండ... సెగలు పొగలు... తాపం... ఋతుధర్మం... ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిగా వుంటుంది. ఆయా స్థితిగతులకు... ఆయా ప్రాంతవాసులు సహనంతో... వాతావరణ స్థితిగతులను భరించవలసిందే... కలవారు ప్రత్యమ్నాయాలతో చలికి వేడిని... వేడికి చలిని (చల్లదనం) కల్పించుకొని ఆనందంగా ఉంటారు. అదే కూలర్సు... హీటర్లతో... మధ్య పేద వర్గీయులు.... కాలానుగుణంగా సమస్యలను ఎదుర్కొంటూ జీవిత విధానాన్ని సాగించుకోక తప్పదు.
రైలు వచ్చి స్టేషన్ లో ఆగింది.
ఒక్కడే దిగాడు... అతను శరభయ్య కుమారుడు వీర ప్రతాప్... ప్లాట్ ఫారమ్ నుండి స్టేషన్ ముందుకు సొరంగ మార్గం గుండా వచ్చాడు.
అతనికి నగరంలో వుద్యోగం... గవర్నమెంటు జాబ్... కలెక్టరు ఆఫీసులో యు.డి.సి., వయస్సు ముప్పై సంవత్సరాలు... అవివాహితుడు.
వీర ప్రతాప్ ఆశయం వివాహ విషయంలో... అందరిలా కాదు...
తన దృష్టిలో... తాను గొప్ప అందగాడని... గొప్ప వుద్యోగంలో వున్నానని... తనకు కాబోయే భార్య ఓ రేంజిలో (గొప్ప) వుండాలని... తన్ను వరించి... గ్రేట్ గా కట్నకానుకలను తేవాలని ఆశ.
వాన కురుస్తునే వుంది. ‘స్టేషన్ దాటి గేటును సమీపించాడు. నేరుగా చూచాడు. రోడ్డుకు అటువైపు మర్రి చెట్టుకింద సాంబుడు... వాడి రిక్షా...
చూచాడు... స్టేషన్ మెట్లు దిగి ఆకాశం వైపు చూచాడు. మేఘాలు చెదిరి వాన ఆగే సూచన లేదు.
‘ఇంటికి చేరేలోగా తడిసి పోవడం తప్పదు... అనవసరంగా ఆగని ఈ వానను చూస్తూ ఇక్కడ ఎందుకు ?... ఇంటికి పోతే తడిసిన గుడ్డలను విప్పేసి వేరే పొడి గుడ్డలు కట్టుకోవచ్చు... అమ్మ చేతి భోజనాన్ని తినవచ్చు... హాయిగా కాసేపు టీవీ చూచి ... మంచంపై వాలి నిద్రపోవచ్చు...’ అనుకొన్నాడు.
వేగంగా సాంబుడిని సమీపించాడు.
“సార్ !... బాగుండారా !...” అడిగాడు సాంబుడు
“ఒరేయ్ !... ఏందిరా నీ చతురు... వానలో తడుస్తూ వుంటే!... బండీ తీ... వూరికి పోదాం....” ఆదేశించాడు వీర ప్రతాప్.
సాంబుడు తలకు మఫ్లర్... రెయిన్కోట్ ధరించివున్నాడు.
“ఎక్కండి సారూ !...” నవ్వుతూ చెప్పాడు. వీర ప్రతాప్ రిక్షాను ఎక్కాడు.
రెండు పక్కలా పట్టా దించాడు సాంబుడు... రిక్షా ఎక్కి తొక్కసాగాడు.
వాన... వూపులు వూపులుగా తగ్గుతూ ఎక్కుతూ కురుస్తూ వుంది. సాంబుడి మనస్సున ఓ ఆలోచన. వెంటనే... ‘రేయ్ !... సాంబా !... నిప్పుతో చెలగాటమా !... వీర ప్రతాప్ ఎవరూ ?... దారినపోయే దానయ్య అనుకొన్నావా !... శారదాంబ అన్నయ్య. తన చెల్లిలి పేరెత్తి... ఆమెను గురించి తప్పుగా చెబితే... నీకు సన్మానం చేస్తాడనుకొంటున్నావా !... డొక్క చించి డోలు కడతాడు... ఛస్తావ్... జాగ్రత్త !...’ మనోహితుని హితవాక్యాలు.
‘ఆ... అవునవును... ఈ ప్రతాప్ గాడు అంతటోడే... తాను గొప్ప అందగాడినని... మాంచి వుద్యోగం ఎలగబెడతావున్నానని... చాలాచాలా గర్వం... అహంకారి... వీడితో మాట్లాడితే ముప్పు మనకే... నిప్పుతో చెలగాటాలాడకూడదు...’ అలోచనానంతరం సాంబుడి నిర్ణయం....
దారి పొడుగునా... వీర ప్రతాప్ ఏమీ మాట్లాడలేదు... తన అలోచన ... తుది నిర్ణయం ప్రకారం సాంబుడూ మౌనం...
మట్టిరోడ్డు కావటం వల్ల బురద బురదగా మారింది... ఇరవై నిముషాలలోపు పయనం... నలభై నిముషాలుగా మారింది. అతి శ్రమ మీద రిక్షాను నడిపి వీరప్రతాపను ఇంటికి చేర్చాడు.... రిక్షాదిగి ప్రతాపుడు ఇంట్లోకి పరిగెత్తాడు. రిక్షా తన తండ్రిది.. అంటే తనదే... ఇక డబ్బులు విషయం... తన బండిలో తాను వచ్చినందుకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి.... ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతుంది... తనకు ఆ మాత్రం హక్కు... వారసత్వ రీత్యా లేదా !... అదీ వీరప్రతాప్ మహోన్నత భావన...
శారదాంబ వరండాలోకి వచ్చి వయ్యారంగా నిలబడింది. నవ్వుతూ సాంబుని పలకరించింది. సాంబుడు మౌనంగా రిక్షాను కొట్టాంలో వదిలి... చలికి వణుకుతూ... వేగంగా శివాలయం వైపుకు నడిచాడు.
తన మాటకు జవాబుచెప్పకుండా ... తన్ను లక్ష్య పెట్టకుండా వెళ్లిపోయిన సాంబుడికి బుద్ధి చెప్పాలనే నిర్ణయానికి వచ్చింది శారదాంబ.
ఆ రాత్రి భోజనానంతరం... పదిన్నర ప్రాంతంలో శారదాంబ తండ్రి గదిలోకి కన్నీటితో ప్రవేశించింది. కూతురు స్థితిని చూచి శరభయ్య ఆందోళనగా కారణం అడిగాడు.... నటనా విన్యాసంతో సాంబుడు తన్ను వేధిస్తున్నట్టు అబద్ధాన్ని అందంగా ఒలకబోసింది.
తన దగ్గరవుంటూ... తన మూలంగా బ్రతుకుతూ.. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టాలనుకొన్న సాంబుడికి... తగిన శిక్ష విధించాలనుకొన్నాడు శరభయ్య.
తన...మన... అనేవారు విచారంగా ఏమైనా చెబితే... వారి నటన మనలోని విచక్షణా జ్ఞానాన్ని నశింప చేస్తుంది. వేగం... ఆవేశం మనస్సును ఆక్రమించుకొటాయి.
బయట వర్షం పడుతూనే వుంది. సాంబుడి గురించి ఆలోచనలతో శరభయ్య శరీరంలో వుష్ణం పెరిగింది. ఆగ్రహావేశాలతో మంచంపై ఒరిగిపోయాడు.
* * *
ప్రపంచంలోని మూడువంతుల పాప ప్రక్షాళన చేసేది... ఆ సూర్య భగవానుడే... వారి దివ్య తేజోభరిత కిరణాలకు అంతటి మహత్తర శక్తి.
నిద్రలేచి... శుచిగా ఆ ప్రాతఃకాలపు పురోగమనంలో వున్న ఆ దినకరునికి నమస్కారం చేసి వారిని మదిలో తలచుకొంటే మనస్సు ఎంతో ప్రశాంతంగా... ఎలాంటి లోపం శారీరకారోగ్యంలో ఎప్పుడూ వుండదనేది పూజ్యులు పెద్దల మాట...
ఆమాటనే శంభుగారు సాంబుడికి ఎప్పుడో చెప్పారు. వాడు ప్రతి నిత్యం... వానగాని... వంగుడుగాని... ఆ గురువుగారు చెప్పిన మాటను... ఆ క్రియను నెరవేర్చి తన దిన చర్య ప్రారంభిస్తాడు. ఆస్థికులు ఆహా ... ఆద్భుతం అనుకుంటారు... నాస్తికులు పరమ చాదస్తం అనుకొంటారు. ఎవరి భావన వారికి ఆనందం....
కానీ... ఆరోజు...
పద్ధతి ప్రకారం సాంబుడు లేవలేక పోయాడు. నిన్నటి అతివృష్టి వానలో తడవటం కారణం శరీరంలో నలత.. జ్వరం...
శరభయ్య... అతని కుమారుడు వీరప్రతాప్ శివాలయానికి వచ్చారు. శంభూగారిని సాంబుడుని గురించి అడగాలని... వాకిట ముగ్గు వేస్తున్న మధుమతిని చూచారు. శరభయ్య శంభూగారిని గురించి అడిగారు.
“ఇంట్లో పూజలో వున్నారు మామయ్య!...” చెప్పింది మధుమతి.
“శరభయ్య వచ్చాడని చెప్పు ...”
“అలాగే...”
వీరప్రతాప్ ... మస్కిష్కంలో పెడబుఱ్ఱ కదిలింది. కన్నార్పకుండా మధుమతిని చూచాడు.
మధుమతి లోనికి వెళ్లి శంభూగారికి విషయాన్ని చెప్పింది...
హారతి ముగించి పదినిముషాల్లో శంభుగారు బయటికి వచ్చి శరభయ్యకు నమస్కరించాడు.
వయస్సున శంభూగారి కన్నా శరభయ్య పెద్దవాడు. గ్రామ సర్పంచి.
“సాంబు ఎక్కడా ?...” గద్దించినట్టు అడిగాడు వీర ప్రతాప్.
అతని స్వరానికి శంభూగారు ఆశ్చర్యపోయాడు. శరభయ్య ముఖంలోకి చూచారు.
వారూ అదే ప్రశ్నను అడిగారు...
“ఈ సమయంలో వాడు మీ యింటికి వచ్చి రిక్షా తీసుకొని స్టేషన్ కు వెళ్లిపోవలసింది కదా... రాలేదా!...” సందేహంతో అడిగాడు.
“రాలేదు...” వీర ప్రతాప్ జవాబు.
మేలుకొన్న సాంబుడు... మెల్లగా లేచి సూర్యభగవానుడికి నమస్కరించి... దక్షిణపు వైపున వున్న శంభుగారి గృహ ఆవరణలోకి ప్రవేశించాడు.
శరీరంలో తెంపు లేదు... కంపనం... జ్వరతీవ్రత... కాళ్లు తడబడుతుండగా... శంభుగారి ఇంటి వాకిటి ముందుకు వచ్చాడు. అక్కడ వున్న వారందరికీ... చేతులు జోడించి నమస్కరించాడు.
“ఏరా !... అదోలా వున్నావ్?... ఒంట్లో సరిగా లేదా !...” అడిగాడు శంభుగారు.
“అవును సామి... జ్వరంగా వుంది...” నీరసంగా మెల్లగా చెప్పాడు సాంబుడు.
వీరప్రతాప్ ఆవేశంతో అతన్ని సమీపించాడు. సాంబుడి చెంపలపైన తన రెండు చేతులతో నిర్దయగా వాయించాడు.
అడ్డుపోయిన శంభుగారిని ప్రక్కకు త్రోసివేశాడు. వారు తూలి నేలమీద పడిపోయారు.
జ్వరంతో బాధపడుతున్న సాంబుడు... ఎదురు తిరగలేదు. కప్పలా నేల కూలాడు.
భార్య... కోడలు శంభుగారిని లేవదీశారు.
“ఇదిగో శంభూ !... వీడ్ని వూర్లోనుంచి వెళ్లగొట్టు... కొడుకు... నా కూతురుతో ఎకచకాలు ఆడుతుండట... ఇక్కడుంటే వీడు నా చేతుల్లో ఛస్తాడు... జాగ్రత్త... తరిమెయ్ !... తరిమెయ్!...” అసహనం... ఆవేశం... ఆగ్రహం... ముప్పిరిగా శరభయ్యను శాసించాడు.
తండ్రీ కొడుకులు క్యాకరించి సాంబుడి మీద వుమ్మేసి... మహా వీరుల్లా విజయగర్వంతో వెళ్లిపోయారు.
శంభు మెల్లగా సాంబుణ్ణి తాకి చూచాడు. ఒళ్లు కాలిపోతూవుంది.
సాంబుడి జ్వర తీవ్రతకు... వారంతా ఎంతో బాధ పడ్డారు. తను.. భార్య.. అక్క.. సాంబుణ్ణి వరండాలోకి చేర్చి చాపపై పడుకోబెట్టారు. పై పంచను తడిపి సాంబుడి నొసటన వేశాడు శంభూగారు... పదినిముషాల తర్వాత సాంబుడు కదిలాడు. భారంగా కళ్లు తెరిచాడు.
మధుమతి కాపీగ్లాసుని శంభూకు అందించింది. సాంబుడి మెడక్రింద చేయి వేసి లేపి... బలవంతంగా ఆ కాఫీని త్రాగించాడు శంభుగారు.
మధుమతి ఏదో మాత్ర ఇచ్చింది. నోట్లో వేసి నీళ్లు పోశాడు శంభూగారు.
మైకంతో కళ్లు మూసుకొని ఒరిగిపోయాడు సాంబుడు... సాయంత్రం మూడున్నరకు మేల్కొన్నాడు సాంబుడు... కళ్లు తెరచి నాలుగు వైపులా చూచాడు. శంభూగారి ఆశ్రమంలో వున్నానన్న విషయం సాంబుడికి అర్థం అయింది.....
‘ఇప్పటికే నావల్ల వీరు ఎంతో కష్టపడి వుంటారు... నావల్ల వీరికి ఇకపై కష్టం కలుగకూడదు... వెళ్లిపోవాలి... దూరంగా ... నన్ను ఎవరూ ఎరుగని చోటికి వెళ్లిపోవాలి... ఆ నిర్ణయానికి వచ్చాడు సాంబుడు...
మానవతావాది శంభు గారు... బిస్కట్లు... కాఫీ బలవంతంగా సాంబుడు చేత తినిపించి త్రాగించాడు.
సూర్యుడు అస్తమించాడు. పగలు పోయి రాత్రి వచ్చింది. ఏదో తిని ఆ ఇంటివారు శయనించారు. “ రాత్రి రెండు సార్లు శంభూగారు సాంబుడిని తాకి చూచాడు. జ్వరం తగ్గినందుకు ఆనందించాడు. వెళ్లి పడుకొన్నాడు.
సాంబుడికి సాలుగు గంటలకు మెలకువ వచ్చింది. చుట్టూ కలయ చూచాడు. ఎంతో ప్రశాంతంగా వుంది.
మెల్లగా లేచాడు. వరండాలో రెండవ వైపు మంచం మీద నిద్రపోతున్న శంభూ గారిని సమీపించాడు. వారి పాదాల వైపుకు నడిచాడు. తన చేతులను వారి పాదాలకు తగలకుండా... వారికి నమస్సుమాంజలిని సమర్పించి... చేతులను కళ్లకు అద్దుకొని వరండా మెట్లు మూడు దిగాడు.
ఎదురుగా... మధుమతి నిలబడివుంది....
అదిరిపోయాడు సాంబుడు.... కళ్లల్లో కన్నీరు...
ఆమె అతన్ని సమీపించింది.
అతని చేతిని తన చేతిలోకి తీసుకొని... వెయ్యి రూపాయలు అతని చేతిలో పెట్టి మూసింది.
“నేను ఈ వూరికి వుద్యోగరీత్యా వచ్చాను. హైస్కూలు టీచర్ని. మూడు నాలుగు సంవత్సరాల వరకు నాకు ఇక్కడినుంచి బదిలీ రాదు... వచ్చినా నేను ఇక్కడే వుండేదానికి ప్రయత్నిస్తాను. వుంటాను.. నా పేరు పి.మధుమతి. పట్నానికి వెళ్లు... ఏదైనా పనిచూచుకో... పద్ధతిగా బ్రతుకు... అన్ని విధాలా స్థిరపడిన తర్వాత నాకు వుత్తరం వ్రాయి. నేనూ నీకు జవాబు... నీవు ఈ వూరికి రావచ్చా... రాకూడదా... అనే విషయంలో వ్రాస్తాను. దైవాన్ని నమ్ము... నీతి నిజాయితీ... ధర్మం... న్యాయం... సత్యం... సౌభ్రాతత్వం ఈ ఆరు గుణాలను పాటించు, నేను సహాయం చేస్తాను. పార్టు టైమ్ లో చదువుకో. ఇది మా అన్నయ్య ఫోన్ నెంబర్. ఫోన్ చెయ్యి. నీకు వుద్యోగాన్ని కల్పిస్తాడు... భయపడకు.
ఒకనాడు నీవు గొప్పవాడివి అవుతావు. అపుడు రావాలి నీవు ఈ వూరికి... నీకు ఓ సోదరిగా నా శుభాశీస్సులు..” సాంబుడి చేతికి ఒక కాగితాన్ని ఇచ్చి తన కుడిచేతిని ఆపని తలపై వుంచి మనసారా దీవించింది... ఆ బంగారు తల్లి మధుమతి.
* * *
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.
అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.
మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.
ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.
ความคิดเห็น