top of page

సంస్కారానికి చదువు ఎందుకు???'Samskaraniki Chaduvu Enduku' - New Telugu Story Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 29/06/2024

'సంస్కారానికి చదువు ఎందుకు???' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


అతని పేరు సత్యయ్య. అందరూ పిలుస్తారు ’సత్తి’ అని. 


అది చిన్న గ్రామం.. రెండు వందల ఇళ్ళు వున్నాయి. సత్యయ్య తల్లి రమణమ్మ.. తండ్రి శివయ్య. శివయ్య నిరుపేద. కూలిపనులు జీవనాధారం.. సత్యయ్య ఆ దంపతులకు ఒక్కడే. ఎంతో గారాబంగా పెంచారు. సత్యయ్యను ఐదవ ఏట ఆ గ్రామంలో ఉన్న ప్రాధమిక పాఠశాలలో చేర్పించారు ఆ దంపతులు.


సత్యయ్య చాలా చురుకైనవాడు. గొప్ప తెలివి తేటలు కలవాడు.

గురువులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినేవాడు. కాలక్రమంలో మాస్టర్లు సత్యయ్య తత్వాన్ని గ్రహించి, అతన్ని ఏకసంతగ్రాహిగా గుర్తించి ఎంతగానో అభిమానించేవారు. ఆ మాటలను విన్న శివయ్య రమణమ్మలు ఎంతగానో సంతోషించేవారు.


కాలవాహినిలో రోజులన్నీ ఒకే రీతిగా గడవవు. భూమికి చీకటి, వెలుగులు సహజం. మనిషికి కష్టసుఖాలు తప్పవు. అది ఆశ్వయుజ మాసం. వర్షాకాలం. ఎడతెరిపి లేని వర్షాలు. ఊరి చుట్టూ నీరు, దోమలు ప్రబలిపోయాయి. 


శివయ్యకు జ్వరం. ఊరిలో వున్న నాటు వైద్యుడు నారాయణయ్య ఇచ్చిన మందులు పనిచేయలేదు. జ్వరం తీవ్ర స్థాయికి చేరింది.


ఆ గ్రామాన్ని పదిహేను కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ హాస్పిటల్ ఉంది. అప్పటికి సత్యయ్య వయస్సు పదకొండు సంవత్సరాలు.


సంపన్నుడు గోవిందయ్య గారి ఒంటెద్దు బండిలో శివయ్య పడుకోబెట్టి సత్యయ్య, తల్లి రమణమ్మ శివయ్యకు తగిన చికిత్స కోసం ఆ తాలూకా వూరికి బయలుదేరారు.


స్పృహ లేని స్థితిలో వున్న శివయ్యను చూచి ఆ తల్లి తనయులు కన్నీటితో ఆ ఒంటెద్దు బండిలో హాస్పిటల్ వైపుకు ప్రయాణం సాగించారు.


వర్షం ప్రారంభమయింది. హోరు గాలి వురుములు, మెరుపులు. బండిని నడుపుతున్న సాంబయ్య గోవిందయ్య గారి పాలేరు ఎద్దుని అదిలిస్తూ.. అతి శ్రమతో బండిని ముందుకు నడుపుతున్నాడు. వారు చేరవలసిన గమ్యం యింకా ఎనిమిది కిలోమీటర్లు వుంది.


సత్య, రమణమ్మ, గోవిందయ్యలు చలికి గడగడ వణుకుతున్నారు.

ఎద్దు వర్షంలో అతి ప్రయాసతో బండిని ముందుకు లాగుతూ వుంది.

స్పృహ లేని శివయ్యకు అవేమీ తెలియదు.


పెద్ద శబ్దంతో పిడుగు పడింది. ఎద్దు బెదిరి పల్లపు ప్రాంతంలోనికి బండిని లాగింది. బండి బోల్తా పడింది. శివయ్య దేహం జారి బండి నుండి క్రింద పడిపోయింది సత్యయ్య, రమణమ్మలు బండి నుండి క్రింద పడ్డారు.


తెలివిగా గోవిందయ్య బండి నుండి ఒడ్డున దూకాడు. గుంటలో వున్న బురదనీళ్ళతో సత్యయ్య, రమణమ్మలు తడిసిపోయారు. ఆత్రంగా శివయ్యను తాకి చూచారు. బయలుదేరేముందు అతని శరీరం ఎంతో వేడిగా వుండింది కానీ.. ఇప్పుడు ఆ శరీరం చల్లగా ఐస్ గడ్డలా మారిపోయింది.


కోటయ్య ఆత్రంగా శివయ్య శరీరాన్ని తాకి చూచాడు. తన చేతిని శివయ్య ముక్కు దగ్గర ఉంచాడు.

రమణమ్మ, సత్యలు కన్నీటితో కోటయ్య ముఖంలోకి దీనంగా చూచారు.


"అక్కా!.. బావ ఎల్లిపోయిండు" కన్నీటితో చెప్పాడు కోటయ్య.


"అంటే..!" అమాయకంగా అడిగాడు సత్య.


"రేయ్ సత్యా! మీ నాయన చచ్చిపోయిండురా!" బొంగురుపోయిన కంఠంతో చెప్పాడు కోటయ్య.


"అయ్యా!.. ఎల్లిపోయావా!" భోరున ఏడుస్తూ రమణమ్మ శివయ్య ఎదపై వాలిపోయింది.


అయోమయ స్థితిలో వున్న సత్యయ్య కన్నీటితో..

"కోటయ్య మామా! నాయన.." భోరున తల్లిని చూస్తూ ఏడ్చాడు సత్య.


శవాన్ని ఒడ్డుకు చేర్చాడు కోటయ్య.


వానగాలి తగ్గాయి. కోటయ్య బండిని వెనక్కి తిప్పాడు. రమణమ్మ సత్యలు శివయ్య శవంపై పడి ఏడుస్తూ వూరికి చేరారు. ఆ విషయాన్ని విని గోవిందయ్య ఆశ్చర్యపోయాడు. శివయ్య అతనికి కుడి భుజంగా వున్నవాడు.


పనుల విషయంలో గోవిందయ్య అనేకసార్లు శివయ్యను తిట్టేవాడు.


శివయ్య.. తన యజమాని తిట్టినందుకు బాధపడేవాడు. కానీ.. ఏనాడు, గోవిందయ్యను ఎదిరించలేదు. తూలనాడలేదు. తన జీవితాంతం గోవిందయ్యకు శివయ్య ఎంతో విశ్వాస పాత్రుడుగా, నమ్మిన బంటులా బ్రతికాడు. అలాంటి శివయ్య మరణవార్త గోవిందయ్య కళ్ళల్లో నీటిని నింపింది.


’మనిషి బ్రతికి వుండగా వాడి విలువ తెలియదు. ఎన్నోసార్లు వాడిని తిట్టాను. కసిరాను. కానీ, ఏనాడు తిరిగి నన్ను పల్లెత్తు మాట అనలేదు. మంచివారిని ఆ దేవుడు త్వరగా తన వద్దకు చేర్చుకొంటాడట. శివయ్య ఎంతో మంచివాడు!.. అందుకే నలభై సంవత్సరాల ప్రాయంలోనే ఆ దేవుడి వద్దకు వెళ్ళిపోయాడు. అతని ఖర్మ క్రతువులు సవ్యంగా జరగాలి నా డబ్బుతో. అతని భార్యకు, కుమారుడికి ఆశ్రయాన్ని కల్పించాలి. వారికి ఏ లోటు లేకుండా చూచుకోవాలి. నా పాపాలను ఆ రీతిగా ప్రక్షాణం చేసుకోవాలి. శివయ్య ఆత్మకు శాంతిని కలిగించాలి. అది నా ధర్మం’ అనుకొన్నాడు గోవిందయ్య.


చిన్నవాడైన సత్య చేత గోవిందయ్య, శివయ్య అంత్యక్రియలు ఖర్మకాండలను పద్ధతిగా జరిపించారు. గోవిందయ్యలో కలిగిన మార్పుకు వూరి జనం ఆశ్చర్యపోయారు.

*

గోవిందయ్య రమణమ్మను, సత్యయ్యను కొండయ్య చేత తన ఇంటికి పిలిపించాడు. భార్య సౌదామినిని పిలిచాడు. "చూడు సౌదా!.. ఈనాటి నుండి రమణమ్మ, సత్య మన ఇంటి సభ్యులు. వారు మనతోనే వుంటారు. వారిని జాగ్రత్తగా చూచుకోవడం మన కర్తవ్యం. మనిషి ఒకనాడు చచ్చిపోతాడు. కానీ అతని చేతలు, మాటలు కలకాలం నిలిచిపోతాయి. మనకు మన ఇంటికి శివయ్య ఎంతో సేవ చేశాడు. అతని ఇల్లాలిని బిడ్డను సంరక్షించడం మన ధర్మం. ఏమంటావ్?" ఆమె ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు గోవిందయ్య.


"మామా!.. నీ ఇష్టమే నా ఇష్టం" చిరునవ్వుతో చెప్పింది సౌదామిని.


"ఏం రమణమ్మా!.. నీవేమంటావ్?" అడిగాడు గోవిందయ్య.


"అన్నా!.. నేను మీ మాటను కాదనగలనా!.." దీనంగా చెప్పింది రమణమ్మ.


"ఏరా సత్యా నీవేమంటావ్!"


"అయ్యా!.. మీరు గొప్పోళ్ళూ. మీ మాటను ఇనడం నా దరమం. నేను మా అయ్యలా మన ఇంటి పనిపాట చూచుకొంటానయ్యా!"


"నేను నిన్ను స్కూల్లో చేర్పించి చదివించాలనుకొంటున్నా. చదువుకొంటావా!"


సత్యయ్య మౌనంగా వుండిపోయాడు.

"సత్యా!.. చెప్పరా నీ నిర్ణయాన్ని.."


"అయ్యా!.. నాకు చదువు ఒద్దయ్యా!.. చదువు పేరుతో నేను మా అమ్మకు దూరం కావడం నాకు ఇష్టం లేదు. మా అమ్మకు ఇంకెవరున్నారయ్యా!.. నేను తప్ప. నేను అమ్మతో వుంటూ, మీ ఇంట మా నాయనలా యీ ఇంటి పనులన్నీ చూచుకొంటానయ్యా. తప్పుగా అనుకోమాకండి" దీనంగా చెప్పాడు సత్యయ్య.


"అయితే నీకు చదువంటే ఇష్టం లేదన్నమాట!.."


"అవునయ్యా!.." తలదించుకొని మెల్లగా చెప్పాడు సత్యయ్య.


"సరే నీ యిష్టం. జాగ్రత్తగా పనులు చెయ్యి."


"అట్టాగే అయ్యా!" చిరునవ్వుతో చెప్పాడు సత్యయ్య.


ఆనాటి నుంచి, రమణమ్మ ఇంటి పనులన్నీ చేసేది. సత్యయ్య పొలం, తోటల పనులు సాటి పెద్దవారితో కలిసి చేసేవాడు. కాల చక్రంలో పది వసంతాలు చిత్ర విచిత్రంగా సాగిపోయాయి.

*

సాయంత్రం వరకు ఆ పెద్దింటి పనులు చేసి రాత్రివేళ తమ గుడిశకు వెళ్ళి నిద్రపోయే వారు రమణమ్మ, సత్యయ్యలు. అప్పటి సత్య వయస్సు ఇరవై ఒక్క సంవత్సరం.

వ్యవసాయ పనుల్లో వస్తాదయ్యాడు. గోవిందయ్యకు సత్య, అతని తండ్రిలా కుడి భుజంగా మారిపోయాడు. సాటివాదు కొందరు సత్యలోని నీతి నిజాయితీ, పట్టుదల పెద్దలయందు అతనికి వున్న గౌరవాభిమానాలను చూచి ఎంతగానో సంతోషించేవారు. కొందరు ’వీడు మనలను మించిపోయాడే’ అని కుళ్ళుకొనేవారు.

*

గోవిందయ్య, సౌదామినీలకు తొలుత కొడుకు, రెండవసారి కూతురు. కొడుకు పేరు కోదండరామ్. కూతురి పేరు పద్మావతి. పద్మావతి తన అన్న కన్నా మూడేళ్ళు చిన్న. కోదండరామ్ పట్నంలో వారి మేనమామ ఇంట్లో వుంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. సత్య కోదండరామ్ సమవయస్కులు. పద్మావతి సత్య కన్నా నాలుగు సంవత్సరాలు చిన్న.


పన్నెండవ ఏట యుక్తవయస్కురాలైంది పద్మావతి. ఆ వేడుకను గోవిందయ్య, సౌదామినీలు ఎంతో ఘనంగా జరిపించారు. పద్మావతిని సత్య తన చిన్నతనంలో ఆమెను ఎత్తుకొని ఆడించేవాడు. లాలించేవాడు. నిద్రపుచ్చేవాడు.


ఆ కారణంగా పద్మావతికి సత్య అంటే ఎంతో ఇష్టం. అభిమానం. యుక్తవయస్కురాలైన పద్మావతి మనస్సున సత్య బొమ్మ నిలిచిపోయింది. అతన్ని పద్మావతి ఎంతో ఆదరంగా గౌరవంగా చూచేది. ప్రీతిగా మాట్లాడేది.


వయసు పెరిగేకొద్ది పద్మావతికి సత్య అంటే తన ప్రాణ సమానంగా అయినాడు.

పద్మావతి పెండ్లి అంటూ చేసుకొంటే తాను సత్యనే చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది.

తన మనస్సులోని భావాలను పద్మావతి సత్యకు కొన్ని సమయాల్లో మర్మంగా తెలియజేసింది.

మొదట్లో ఆమె మాటలలోని గూడార్థాన్ని సత్య గమనించలేక పోయాడు. చిన్ననాటి నుంచి వున్న పరిచయం కారణమనుకొన్నాడు.


అప్పటికి సత్య వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు. పద్మావతి వయస్సు పదిహేడు సంవత్సరాలు. పద్మావతి పదవ తరగతి పరీక్షలు వ్రాసింది. సౌదామిని, గోవిందయ్యలు పద్మావతిని పట్నంలో కాలేజీలో చేర్చాలనుకొన్నారు.


సత్య పశువులకు గడ్డి వేస్తున్నాడు.

పద్మావతి చక్కగా అలంకరించుకొని అతన్ని సమీపించింది.

"సత్యా!.."


సత్య వెనుతిరిగి ఆమె వైపు చూచాడు.

"ఏం చిన్నమ్మా!"


"పనంతా అయిందా!"


"అయిపోనాదమ్మగోరు!.."


"నా గురించి నీవేమనుకొంటున్నావ్?"


"మీరు చాలా మంచోళ్ళు చిన్నమ్మా!"


"చాలా అంటే!.."


"ఇంత అని చెప్పలేనంతగా!.."


"అలాగా!.."


"అవును చిన్నమ్మా!.."


"నేను ఒక మాట చెబుతాను వింటావా!"


"చెప్పండి.."


"నన్ను నీవు.."


"నేను?.."


"పెండ్లి చేసికొంటావా?"


"ఏంటీ?.."


"పెళ్ళి!.."


"చిన్నమ్మగోరూ!.." ఆశ్చర్యంతో నోరు తెరిచాడు.


"అరవకు మెల్లగా మాట్లాడు. నీవంటే నాకు ఎంతో ఇష్టం సత్యా!"


"మీరన్నమాట తప్పు చిన్నమ్మా!"


"ఏమిటి తప్పు!"


"పెళ్ళి.."


"చెప్పాను కదా!.. నీవంటే నాకు ఇష్టం అని!" చిరుకోపంతో అంది పద్మావతి.


"చిన్నమ్మగోరూ!"


"ఆ చెప్పు!"


"నేను మీ పనోణ్ణి. మీరు నా యజమానురాలు. దేవతతో సమానం. దేవతను పూజించాలే కాని.."


"కాని!.."


"సొంతం చేసుకోనాలనుకోకూడదమ్మా. అది తప్పు. పాపం!.." దీనంగా చెప్పాడు సత్య.


"నాకు నీవు కావాలి!.."


"చిన్నమ్మా!"


"చిన్నమ్మా కాదు నా పేరు పద్మావతి. పద్మా అని పిలువు!.."


"యజమానురాలిని పేరుతో పిలవకూడదండే!"


"పిలవమని చెప్పింది నేనేగా!"


"అలా పిలవడం నాకు పాపం చిన్నమ్మా!.. నా పని అయిపోనాది. నేను ఇంటికి ఎలతుండా!.." సత్య వేగంగా నడిచి ఇంటి ముందుకొచ్చి వీధిలో ప్రవేశించాడు.


వేగంగా వెళుతున్న సత్యని ఆశ్వర్యంగా చూస్తూ విచారంగా నిలబడిపోయింది పద్మావతి.

దొడ్లొకి వచ్చిన పద్మావతి తల్లి సౌదామిని, వారి సంభాషణ అంతా విన్నది. సత్య పట్ల పద్మావతికి వున్న అభిప్రాయం ఆమెను అర్థం అయ్యింది.


ఆ రాత్రి పదిన్నర సమయంలో..

సౌదామిని తమ బెడ్ రూములో ప్రవేశించింది.

గోవిందయ్య మంచంపై పడుకొని కళ్ళు మూసుకొని వున్నాడు. మంచంపై కూర్చొని అతని మోకాళ్ళపై తన చేతిని వుంచి సౌదామిని..

"ఏమండీ!.." మెల్లగా పిలిచింది.


గోవిందయ్య భార్య పిలుపు విన్నాడు మంచంపై లేచి కూర్చున్నాడు.

"ఏమిటి సౌదా!.."


"అమ్మాయిని మా అమ్మగారి వూరికి పంపిద్దామండి."


"ఏమిటి మీ అమ్మగారి యింటికా!"


"అవునండి.."


"ఇప్పుడు శలవులు కదా!.. మీ వూరికి పంపవలసిన అవసరం ఏమిటీ!.. ఎటూ కాలేజీలు తెరిచాక ఆ వూర్లోనేగా అమ్మాయిని చేర్చాలి!.. అప్పుడు తను ఉండబోయేది మీ అమ్మగారి ఇంట్లోనేగా!.. శలవరోజుల్లో ఇప్పుడు పంపడం ఎందుకు?" భార్య ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు గోవిందయ్య.


సౌదామినికి ఏం చెప్పాలో తోచక మౌనంగా వుండిపోయింది.


"సత్య.. పది సంవత్సరాల వయస్సు నుండీ ఈ ఇంట పెరిగాడు. ఇంట్లోని అందరికీ ఆత్మీయుడైనాడు. కాలుతో చూపిన దాన్ని శ్రద్ధగా తన చేతులతో చేసేవాడు. ఏనాడూ ఏ తప్పూ చేయలేదు. మంచికి మానవత్వానికి నిజాయితీకి మారుపేరు. యుక్తవయస్సులో వున్న పద్మావతి అతన్ని తన వాడిగా చేసుకోవాలనుకొంటూ వుంది. దానికి కారణం అణువణువునా అతని శరీరంలో, మనస్సులో వున్న మంచితనం. 


తనెవరో అతనికి బాగా తెలుసు. అతనికి పద్మావతి పట్ల ఎలాంటి ఆశా లేదు. కానీ అతని విషయంలో పద్మావతి భావన వేరుగా ఉంది. తాను సాయంత్రం విన్న వారిరువురి సంభాషణను గురించి భర్తకు చెబితే వారు ఆవేశంతో సత్యను నిందించవచ్చు, శిక్షించవచ్చు. కారణం తాను యజమాని. సత్య నౌకరు. కనుక వెంటనే పద్మావతిని మా అమ్మగారి ఇంటికి పంపించడం సమంజసం’ అనుకొంది సౌదామిని. 


భర్తతో అసలు విషయం చెప్పకుండా కూతురు పద్మావతిని అమ్మగారి ఇంటికి, పట్నానికి పంపాలని నిర్ణయించుకొంది.

భర్తతో.. "నాలుగురోజులు అమ్మవాళ్ళ ఇంటికి నేను పద్మావతి వెళ్ళి వస్తామయ్యా!" ఎంతో దీనంగా అడిగింది.


"సరే వెళ్ళిరా..!" అన్నాడు గోవిందయ్య.


సంస్కారం, లౌక్యం వున్న ఆడవారు కొందరు తమ ఆడపిల్లల విషయంలో వారిని ఏ తప్పు చేయనీయకుండా ఇలాంటి ఆలోచన జాగ్రత్తలు తీసుకొంటారు.


ఆ మరుదినం కూతురు పద్మావతితో సౌదామిని తన అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది.

*

సత్య మనస్సున ఎంతో కలవరం. అప్రశాంతత. పద్మావతి తనతో చెప్పిన విషయాన్ని తల్లికి చెప్పాలా వద్దా అనే సందేహం. ఎంత ఆలోచించినా అతనికి సరైన భావన కలుగలేదు.

నగరంలో వుండే తన మేనమామ ఏడుకొండలు తన అక్కా, అల్లుడిని చూచేదానికి వచ్చాడు.

ఆ రోజు గోవిందయ్య ఇంటికి ఎనిమిది గంటలకు భయంతోనే సత్య పనికి వెళ్ళాడు. ఇంట్లోని వంట మనిషి నాగమ్మ చెప్పగా అతనికి తెలిసింది, వుదయాన్నే సౌదామిని పద్మావతీలు వూరికి వెళ్ళారన్న విషయం. నాగమ్మ అతనితో..

"అమ్మగోరు పాప పదిరోజులు రారు" అని చెప్పింది. 


ఆ మాట వినగానే సత్యయ్య మనస్సు కుదుటపడింది.

’హమ్మయ్యా!.. దేవుడుండాడు’ అనుకొన్నాడు.


తన దినచర్యను క్రమంగా చేసి, సాయంత్రం ఏడుగంటలకు ఇంటికి వెళ్ళాడు.


పట్నంలో ఏడుకొండలకు ఇరవై ఆటోలు వున్నాయి. అంటే అతను యజమాని. అతని క్రింద ఇరవైమంది ఆటో డ్రైవర్లు పనిచేస్తున్నారు. అల్లుణ్ణి చూచి ఆప్యాయంగా పలుకరించాడు ఏడుకొండలు. సత్యను చూచి దాదాపు మూడు సంవత్సరాలైంది. యుక్తవయస్కుడైన సత్యయ్యను చూచి ఆనందించాడు ఏడుకొండలు.


"ఒరే సత్యా!"


"ఏం మామ"


"ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు నీవు ఆ మాలకొండయ్య కాడ ఎట్టిచాకిరి చేస్తావురా. నీవు నాతో పట్నానికి రా. మనకు ఇరవై ఆటోలు వున్నాయి. ఆటో నడపడం నేర్పిస్తా. నేను యీ మధ్యనే హోటల్ పెట్టిన. బాగా సాగుతూవుంది. హోటల్ని, ఆటోలను చూచుకోవడం నా ఒక్కడివల్ల సాధ్యం కావడం లేదు. 

నాకున్నది ఒక్క ఆడపిల్ల. నీ మరదలు సంపంగి. ఆమెకు ఇప్పుడు పదహారేళ్ళు. హోటల్ పనుల్లో నాకు సాయంగా వుంటోంది. టెన్త్ పాసైంది. మంచి తెలివికల బిడ్డ. నీవు సంపంగి హోటల్ బిజినెస్ చూచుకొంటే నాకు విశ్రాంతి దొరుకుద్ది. ఏమంటావ్" ఆప్యాయంగా చెప్పాడు ఏడుకొండలు.

తల్లికొడుకులు ఏడుకొండల ముఖంలోకి ఆశ్చర్యంగా చూచారు.


"అక్కా! నేను చెప్పింది తమాషాకు కాదు. నిజం. ఇద్దరూ నాతో పట్నానికి వచ్చేశేయండి. అక్కడ మీ బతుకులు బాగుంటాయ్. నా మాటను కాదనకండి." అనునయంగా చెప్పాడు ఏడుకొండలు.

సత్యయ్య మనస్సున ఒక భావన కలిగింది. ’నేను, నా తల్లి మాలకొండయ్య కొలువు మాని మామతో పట్నం వెళ్ళిపోతే తనకు పద్మావతి వేధింపు తప్పుతుంది కదా! ఏడైనా బ్రతకాలంటే పనిచెయ్యాల్సిందే. యీడ చేసే చాకిరి ఆడ హోటల్లో చేస్తే మనస్సున కలవరం దిగులు, భయం లేకుండా ప్రశాంతంగా బతకొచ్చు కదా!’ అనుకొన్నాడు.


"అమ్మా!.. మామ సెప్పిన మాటకు నీవేమంటవే?" అడిగాడు సత్యయ్య.


"ఒరే సత్తి!.. నా అక్క నా మాటను కాదనదురా!.. ముందు నీ సంగతి చెప్పు. నేను చెప్పిన మాటలు నీవు నచ్చినాయా? నచ్చలేదా?.. చెప్పు" చిరునవ్వుతో చెప్పాడు ఏడుకొండలు.


సత్యయ్య కొన్ని క్షణాలు ఆలోచించాడు.

"మామా!.. మా అమ్మమాటే నా మాట" సత్యయ్య తన అభిప్రాయాన్ని చెప్పేశాడు.


"అక్కా!.. సత్య ఒప్పుకొన్నాడే. నీవేమంటావ్?" అడిగాడు ఏడుకొండలు.


"నాకూ ఇష్టమేరా తమ్ముడూ!.." నవ్వుతూ చెప్పింది రమణమ్మ.


ముగ్గురూ ఆనందంగా నవ్వుకొన్నారు. కలిసి భోంచేశారు.


మరుదినం ఉదయం రమణమ్మ, సత్యయ్య ఏడుకొండలు, గోవిందయ్య ఇంటికి వెళ్ళారు. సత్య, రమణమ్మలు మౌనంగా నిలుచున్నారు. ఏడుకొండలు మెల్లగా విషయాన్ని గోవిందయ్యకు చెప్పాడు. గోవిందయ్య ఆశ్చర్యపోయాడు. కొన్ని నిముషాలు సత్యను, రమణమ్మను చూస్తూ వుండిపోయాడు.


"పదకొండు సంవత్సరాల బంధాన్ని తెంపుకొని పోవాలని నిర్ణయించుకొన్నారా సత్యా!.. రమణమ్మ!.." ఆవేదనతో అన్నాడు.


"సామీ!.. మీరు గొప్పోళ్ళు. మీకు నేను చెప్పేటంతటోణ్ణి కాను. కానీ.. జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదిగి గొప్ప స్థితికి రావాలి కదయ్యా!" చిరునవ్వుతో చెప్పాడు ఏడుకొండలు.


"అవును.. అవును ఆమాట నిజమే!" సాలోచనగా అన్నాడు గోవిందయ్య. కొన్ని క్షణాల తర్వాత..

"రేయ్ సత్యా!.. నీ నిర్ణయం.." గోవిందయ్య పూర్తిచేయక ముందే సత్య..

"మారదు సామీ!" తలవంచుకొని మెల్లగా చెప్పాడు.


"అంతేనంటావా?.." ఆవేశంగా అడిగాడు గోవిందయ్య.


"అంతే సామి!.." తల పైకెత్తి గోవిందయ్య ముఖంలోకి సూటిగా చూసి చెప్పి తలదించుకొన్నాడు సత్యయ్య.


వెంటనే గోవిందయ్య లేచి ఇంట్లోకి వెళ్ళి తన గదిలో వారికి ఇవ్వవలసిన సొమ్ము (డబ్బు) లెక్క చూసి, ఐదువేల రూపాయలను బీరువా తెరిచి తీసుకొని వరండాలోనికి వచ్చాడు.

"రమణమ్మా!.. ఈ డబ్బును తీసుకో. ఐదువేలు. నీకు నీ కొడుక్కు నేను ఇవ్వవలసిన మొత్తం"

రమణమ్మ వైపు డబ్బున్న చేతిని సాచాడు. రమణమ్మ డబ్బును అందుకొంది.


ఏడుకొండలు చేతులు జోడించి "దండాలు సామి వెళ్ళొస్తాం" వినయంగా చెప్పాడు.


రమణమ్మ, సత్యయ్యలు చేతులు జోడించారు.

"మంచిది" ముక్తసరిగా అన్నాడు కోదండయ్య. 


’అయ్యగారికి ఇప్పుడు నామీద చాలా కోపంగా వుంది. నేను ముందుగా చెప్పాపెట్టకుండా పని మానేశానని. కానీ నా నిర్ణయానికి కారణం వారి కూతురే అన్న విషయం వారికి తెలియదుగా!’ అనుకొన్నాడు సత్యయ్య.


ఆ ముగ్గురూ ఆ భవంతి ఆవరణం దాటి వీధిలో ప్రవేశించారు.

గోవిందయ్య వారిని చూస్తూ నిలబడిపోయాడు.

*

మరుదినం రమణమ్మ, సత్యయ్యలతో ఏడుకొండలు అతని వూరికి వెళ్ళిపోయాడు.

గోవిందయ్య ఉదయాన్నే తొలి బస్సులో పట్నంలోని తన అత్తగారింటికి చేరాడు.

అతన్ని చూచిన సౌదామిని భయపడిపోయింది.

"ఏమిటండీ ఇలా వచ్చారు" ఆశ్చర్యంతో అడిగింది.


"సౌదా!.. సత్య, రమణమ్మలు మన ఇంట్లో పనిమానేసి సత్య మేనమామతో కలిసి అతని వూరికి వెళ్ళిపోయారు" విచారంగా చెప్పాడు గోవిందయ్య.


సౌదామిని ఆశ్చర్యపోయింది.


ఆ క్షణంలో.. ఆమెకు, సత్యకు తన కూతురు పద్మావతికి జరిగిన సంభాషణ గుర్తొచ్చింది.

"నేను మీ పనోణ్ణి. మీరు నా యజమానురాలు. దేవతతో సమానం. దేవతను పూజించాలే కాని, సొంతం చేసుకోవాలనుకోకూడదు. అది తప్పు. పాపం.."


సత్యయ్య అన్న పై మాటలు, ఆమె చెవుల్లో మారుమ్రోగాయి. అప్రయత్నంగా కళ్ళల్లో కన్నీరు.

భార్య కళ్ళల్లో కన్నీటిని చూచాడు గోవిందయ్య, అతని మనస్సులోనూ బాధ..

"సౌదా! నేను చాలా దూరం చెప్పాను. కానీ సత్య నా మాటలను లెక్కచేయలేదు." విచారంగా చెప్పాడు గోవిందయ్య.


సౌదామినీ పెదవులపై విరక్తితో కూడిన చిరునవ్వు..


"సంస్కారానికి చదువెందుకు? సత్య గొప్ప సంస్కారవంతుడు’ అనుకొంది మనస్సున..

తండ్రి, తల్లి సంభాషణను విన్న పద్మావతి కళ్ళు బాధతో చెమ్మగిల్లాయి. తన బాధ ఆమె ఎవ్వరితోనూ చెప్పుకోలేని దీనస్థితి.

*

సమాప్తి

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.38 views0 comments

Comments


bottom of page