top of page

శాంతి కోసం


'Santhi Kosam' New Telugu Story


Written By: Ch. C. S. Sarma
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


ప్రతి ఒక్కరికీ జీవితగమనంలో శాంతి, మనస్సుకు చాలా అవసరం. వివాహితులకు ఆ శాంతి లభ్యపడాలంటే... వారు జీవిత నాటకాన్నిచాలా శ్రద్దగా ఎదుటివారికి (అర్ధాంగికి, ఆఫీస్ కి) ఆనందాన్ని కలిగించే రీతిగా నర్తించాలి మరి... రంజిత్, రేవంత్ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. రంజిత్ సీనియర్. రేవంత్ జూనియర్. యిద్దరూ యం.కాం గ్రాడ్యుయేట్లు. ఒకే వూరి వారు. ఒకే స్కూలు... కాలేజిలో చదివినవారు. మంచి స్నేహితులు.

రంజిత్ కన్న రేవంత్ మూడేళ్ళు చిన్న. యిరువురికీ వివాహం అయింది. రేవంత్ సహన సంపన్నుడు. రంజిత్ అసహనభూషణుడు.

రేవంత్ భార్య కాపరానికి వచ్చింది. ఆసమయానికి రంజిత్ భార్య అమ్మగారి యింటికి వెళ్ళివుంది. ఆ రోజు యిద్దరూ ఆఫీసుకు వచ్చారు. "గురూ!... ఈ రాత్రికి మీ డిన్నర్ మా ఇంట్లో. సాయంకాలం నీవు నాతో మా యింటికి రావాలి." సాదరంగా ఆహ్వానించాడు రంజిత్‌ను రేవంత్. "ఏంట్రా విశేష?..." "మా ఆవిడ నిన్న వచ్చింది గురూ!..." "వస్తే!..." ఆశ్చర్యంగా రేవంత్ ముఖంలోకి చూచాడు రంజిత్.

"వదిన ఊర్లో లేదు కదా!... ఈరోజు మా యింటికి వచ్చి మీ మరదలి వంటకాలను సేవించాలని నా కోరిక.." నవ్వుతూ చెప్పాడు రేవంత్. "నిన్ననేగా తను వచ్చింది. కొద్దిరోజులు గడవనీ." "ఏం ఫర్వాలేదు గురూ!... మొహమాట పడకు. యీ సాయంత్రం నీవు నాతో మాయింటికి వస్తున్నావు..." "తప్పదంటావా!..."

"తప్పదు. నీవు నాతో వస్తున్నట్లుగా యింట్లో చెప్పి వచ్చాను." "అలాగా!" "అవును" "సరే వస్తాను..." గురువుగారు తన కోర్కెను మన్నించినందుకు రేవంత్ ఆనందించాడు. యిరువురూ వారి వారి పనుల్లో మునిగిపోయారు. *** యింటర్ కమ్‌లో రంజిత్ ‌ను బాస్ రామదాసు పిలిచాడు. ఆయన యిల్లు ఆఫీసుకు దగ్గరలోనే. ప్రతిరోజు ఆఫీస్ బాయ్ తిరుపాలు ఒంటిగంటకు వారి యింటికి వెళతాడు. రామదాసుగారి అర్ధాంగి అనసూయ క్యారియర్ చేసి వుంచుతుంది. తిరిపాలు దాన్ని తీసికొని వచ్చి రామదాస్ గారి టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోతాడు.

రంజిత్ బాస్ క్యాబిన్ లో ప్రవేశించాడు. "రంజిత్ భోంచేశావా?..." "లేదు బాస్. బయటికి వెళ్ళాలి..." "తెచ్చుకో లేదా!..." "లేదు సార్..." "మా ఆవిడ వూరెళ్ళింది..." "బయట తిండి తింటే ఆరోగ్యం పాడవుతుందని తెలీదూ?..." "తెలుసు సార్... కానీ పరిస్థితి..." "నీ సమస్య నాకు అర్థమైంది. చేతులు కడుక్కొని రా... నా క్యారియర్ వచ్చింది. యిద్దరం షేర్ చేసుకొందాం" అప్యాయంగా చెప్పాడు రామదాసు. "వద్దు సార్... నేను బయటికి వెళతాను. మీరు భోంచేయండి..." అనునయంగా చెప్పాడు రంజిత్. "బాస్ మాటను కాదంటావా?...." కాస్త కఠినంగా వినిపించాయి ఆ పలుకులు రంజిత్ చెవులను. "నో నో సార్... తింటాను.." ముఖభావాలను బాస్ చూడకుండా ప్రక్కకు త్రిప్పుకొని, బేసిన్ వద్దకెళ్ళి చేతులు కడుక్కొని అయిష్టంగా వచ్చి బాస్ ముందు కూర్చున్నాడు రంజిత్. క్యారియర్ ఓపన్ చేసి నాలుగు గిన్నెలు వేరు చేశాడు రామదాసు. ఒక దాంట్లో సాంబార్ రైస్, ఒక దాంట్లో రసం రైస్, ఒక దాంట్లో పెరుగన్నం, ఒక దాంట్లో దొండకాయ కూర, ఊరగాయ "రంజిత్ చూచావా!... మూడు రకాల రైస్. నీకేం కావాలి" "మీ యిష్టం సార్ ఏదైనా ఇవ్వండి.” "నేమ రసం రైస్ తీసికొంటా. నీవు సాంబార్ రైస్ తీసికో" ఆ గిన్నెను రంజిత్ కు అందించాడు. క్యారియర్ పై మూతలో దొండ కాయకూర, ఊరగాయ వున్న దానిలో సగం వేసి యిచ్చాడు. "వీటిని తిన్న తర్వాత పెరుగన్నం షేర్ చేసికొందాం" అన్నాడు రామదాసు. "అలాగే సార్!..." "తినడం ప్రాభించు..." తల ఆడించి స్పూన్‌తో సాంబారు అన్నాన్ని నోట్లో పెట్టుకొన్నాడు రంజిత్. అతని వళ్ళు జలదరించింది. ముఖంలో ఎవగింపు. రామదాసు ఆనందంగా తినసాగాడు. సాంబారు అన్నం... తియ్యగా బెల్లపుపొంగలిలా వుంది. దాన్ని రామదాసు గారు సంతోషంగా ఆరగిస్తున్నాడు. "అన్నం పరబ్రహ్మ స్వరూపం. వేస్ట్ చేయకూడదు రంజిత్. తెలుసుగా!..." నవ్వుతూ చెప్పాడు రామదాసు. నోట్లోవున్న ముద్దను మింగి "యస్ సార్!" అన్నాడు రంజిత్. 'దీని అర్థం, నేను యీ బెల్లపు పొంగలిని, సాంబారు అన్నంగా భావించి మొత్తం తినెయ్యాలని బాస్ వుద్దేశ్యం' అనుకున్నాడు రంజిత్. పులి ముందు నిలబడి దాని ఆజ్ఞను పాటించకుండా పారిపోవడం సాధ్యమా. మందును మింగినట్లు ఆ సాంబార్ అన్నాన్ని మ్రింగసాగాడు రంజిత్. "దొండకాయ కూరను నలుచుకో!..." బాస్ వుత్తరువు. దొండకాయ కూరను నోట్లో పెట్టుకున్నాడు. అందులోనూ బెల్లం... తియ్యగా వుంది ఆకూర. "కూర ఎలా వుంది రంజిత్?..." "చాలా అద్భుతంగా వుంది సార్.." తన లోని కసిని బయటికి చెప్పలేక యీ అభినందనను వదిలాడు రంజిత్. "మై వైఫ్ ఈజ్ వెరీ గుడ్ కుక్ యునో!..." నవ్వుతూ అన్నాడు రామదాస్. "యస్ సార్!... యీ పదార్థాలే అందుకు సాక్షి" అని పైకి అని ' నీ ముఖం మాడ, ఎందిరా నీ అభినందన, యిది తిండట్రా... అంతా బెల్లం మయం. నా ఖర్మ కాలి నేను యీ పూట నీ పాల పడ్డాను. నాకు మొదటి నుంచీ తీపు అంటే యిష్టం లేదు. తినకపోతే నీవేమంటావో... అని చేదు మందును మింగినట్లు మింగుతున్నానురా' అని మనస్సులో అనుకున్నాడు రంజిత్. అలవాటు లేని తీపు లోనికి వెళ్ళగానే - రంజీత్ కడుపులో ఏదో సంకటం. "నౌవ్... లెటజ్ షేర్ పెరుగన్నం." యీ మాట వినేసరికి రంజిత్ కి భయం వేసింది. "సార్!... పెరుగన్నం నాకొద్దు సార్!... నా కడుపు నిండింది. ప్లీజ్. మీరు తినండి...” ఎంతో వినయంగా చెప్పాడు రంజిత్. "కొద్దిగా తీసుకో రంజిత్... పెరుగన్నం చాలా బాగుంటుంది." “సార్ నా కడుపు నిండింది. వద్దు సార్...” ప్రాధేయపూర్వకంగా చెప్పాడు రంజిత్. "ష్యూర్!..." "యస్ సార్!... యిక నేను లేస్తాను.” ప్లేటును చేత పట్టుకొని బేసిన్ దగ్గరకు వెళ్ళి కడిగి... బాస్ టేబుల్ మీద వుంచి... “థ్యాంక్స్ సార్!... యిక నే వెళతాను..” అన్నాడు రంజిత్. "చూడు ... నీకో రహస్య చెబుతాను. జాగ్రత్తగా విను." పెరుగు అన్నాన్ని తింటూ అన్నాడు రామదాసు. రంజిత్ రామదాసు ముఖంలోకి చూస్తూ నిలబడ్డాడు. "ఆడవాళ్ళు చేసిన వంటకాలను మనకు నచ్చక పోయినా... బ్రహ్మాండంగా వున్నాయని చెప్పాలి. వుప్పు తక్కువ... కారం ఎక్కువ అని ఆన్నామనకో మన బ్రతుకు బజారుపాలే. యిష్టం అయితే తినడం... లేదా కడుపులో సరిగా లేదని తప్పించుకోడం, శాంతియుతమైన సంసార జీవితానికి....మనం పాటించవలసిన సూత్రం యిది. నా భార్య మైసూరియన్. నేను కడప వాణ్ణి. యీ తిండి తినే దానికి మారిపోయానంటే... కారణం... నీవు అర్థం చేసికోవాలి. తిండి విషయంలో అర్ధాంగితో పేచీ పెట్టుకొంటే సంసార జీవితం... సవ్యంగా సాగదు రంజిత్. అశాంతితో... మనం అలమటించాల్సి వస్తుంది. యిది నా స్వానుభవం..." నవ్వుతూ చెప్పాడు రామదాస్. మరోసారి వారి సందేశానికి థ్యాంక్స్, చెప్పి వారి గదినుండి బయటికి నడిచాడు రంజిత్. సిగిరెట్ కాల్చుకొనే దానికి ప్రక్కన్నే వున్న బంకు వద్దకు వెళ్లి తీసికొని వెలిగించాడు. అతనికి గతస్మృతులు జ్ఞప్తికి వచ్చాయి. *** తన భార్య కాపురానికి వచ్చి నెలరోజులయ్యింది. వారం రోజులు ఆమె తల్లి సాయంగా వుండి వూరికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వంట భార్య శాంతి చేసేది. కూరల్లో... వుప్పో, కారమో ఏదో ఒకటి ఎక్కువగా వుండడం... లేకపోతే అస్సలు లేకుండా వుండడం జరిగింది. రంజిత్ భోజన ప్రియుడు. ఆమె వంటకాలను తినలేక... గొడవ చేసేవాడు. ఆమె ఎంతగానో బాధపడేది. ఆవేశంగా మాట్లాడినందుకు తనూ తర్వాత బాధపడేశాడు. ఆ రాత్రి వారికి శివరాత్రే. యిలాగే సాగింది రెండు వారాలు, సహనశీల శాంతి తన సమస్యను అర్ధం చేసికొంది. వూరికివెళ్ళి అమ్మదగ్గర అన్ని వంటకాలు బాగా నేర్చుకొని రావాలని నిర్ణయించుకొని తమ్ముణ్ణి రప్పించుకొని, వారం రోజుల క్రింద వూరికి చెక్కేసింది. తన అమ్మానాన్నలను చూడాలనే వుద్దేశ్యంతో వెళుతూ వుందని భార్య శాంతిని... ఆమె తమ్ముడితో వూరికి సాగనంపాడు రంజిత్. తను ఎప్పుడు తిరిగి వస్తుందనే విషయాన్ని రంజిత్ అడగలేదు. శాంతీ చెప్పలేదు. రామదాసుగారి మాటలు... రంజిత్ ‌కు తన తప్పును తాను తెలిసికొనేలా చేశాయి. ఆఫ్ట్రాల్ మూడు గంటల్లో జీర్ణం అయిపోయే తిండి విషయంలో తన భార్య బాధపడేలా ప్రవర్తించిన తీరు... తప్పని అతనికి తెలిసి వచ్చింది. యికపై తనూ రామదాసు గారి సిద్ధాంతాన్ని ఫాలో కావాలని నిర్ణయించుకొన్నాడు. ఆఫీసులోనికి వెళ్ళాడు. "ఏం గురూ!... అదోలా వున్నావ్?" అడిగాడు రేవంత్. "రేవంత్! నేను అర్జెంటుగా ఊరికి వెళ్లాలి. ఈ రాత్రికి నేను మీ ఇంటికి భోజనానికి రాలేను." "విషయం ఏమిటి గురూ!..." "వెళ్ళి మీ వదినను తీసుకొని రావాలి..." లీవ్ లెటర్ వ్రాసి బస్ రూముకు వెళ్ళి యిచ్చాడు. "అలిగిపోయిన భార్యను తీసికొని వచ్చేదానికి వెళుతున్నావా రంజిత్!" నవ్వాడు రామదాస్. రెండు క్షణాల క్షణాల తర్వాత "పెండ్లయిన క్రొత్తల్లో నేనూ ఇలాంటి వీక్నెస్‌ను ఫేస్ చేశాను. వెళ్ళిరా. ఒక మాట... నేను చెప్పే మాటలను జీవితాంతం మర్చిపోకు శాంతికోసం ప్రతి మగాడు ఆ పని చేయక తప్పదు..." యీసారి బిగ్గరగా నవ్వాడు రామదాస్. ఆఫీసు వదిలి నేరుగా బస్టాండ్ వైపుకు నడవసాగాడు రంజిత్. రామదాస్ మాటలు అతని చెవుల్లో మారుమ్రోగాయి. 'బాస్ నీవు నా కళ్ళు తెరిపించావు' అనుకున్నాడు రంజిత్. * * *సమాప్తం***

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


Podcast Link

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.51 views0 comments

Comments


bottom of page