top of page

సార్థకత




'Sardhakatha' Written By Kamala Parijatha

రచన : కమల పారిజాత

“శ్వేతా..!” పిలిచింది నిర్మల నాలుగోసారి....!

ఇక తప్పదని పుస్తకం పక్కన పడేసి, “ఏంటమ్మా..” అంటూ చిరాగ్గా వంటింట్లో ఉన్న తల్లి దగ్గరికి వెళ్లింది శ్వేత.

మామయ్య ఫోన్ చేసాడు. నీతో ఏదో పనుందట!

రేపొకసారి వెళ్లిరాకూడదూ!?

“వెళ్లకూడదు, రాకూడదు” అన్నది శ్వేత గిన్నెలపై మూత తీసి ఏం కూరలు చేసిందో చూస్తూ.

“ఎందుకే అలా అంటావ్., వాడేం చెప్పినా వినిపించుకోవేం? ‘తల్లి చచ్చినా మేనమామ ఉండా’లంటారు. అలాంటోడు ఎందుకు రమ్మంటాడు. నీకేదో మంచి చెయ్యాలనే కదా” అన్నది నిర్మల కాస్త కోపంగా.

“ఫోన్లో చెప్పొచ్చు కదా! నేను చదువుకోవాలి, టైం వేస్ట్ అవుతుంది” అన్నది శ్వేత అంతే కోపంగా.


“అన్నీ ఫోన్లో కుదురుతాయా? ఒకసారి వెళ్తే ఏం? అమ్మమ్మ ను కూడా చూసినట్టుంటది కదా!”


“సరే చూస్తానులేమ్మా..!”

“చూస్తానంటే కుదరదు. ఎప్పుడు వెళ్తావో చెప్పు”.


“రేపు వెళ్తాను. ఇప్పుడు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా. నోట్స్ అవసరం ఉంది. కంబైన్డ్ గా చదువుకుంటాం, వచ్చేసరికి లేట్ అవుతుంది” అంటూ బయటకు వెళ్లిపోయింది‌ శ్వేత.

“హూ...మ్..ఏం చదువులో ఏమో! ప్యాసయ్యేనా? ఉద్యోగం చేసేనా? ఒకయ్య చేతిలో పెట్టి బరువు దించుకుంటే చాలు” అని సన్నగా నిట్టూర్చింది నిర్మల.

* * * * * * * * * * * * * * * * *

“ఇవన్నీ ఎందుకమ్మా ఇప్పుడు, మోసుకొని పోవటం నా వల్ల కాదు”.

“ఏమున్నయ్? నాలుగు చీరెలు, నాలుగు తువ్వాళ్లు.

ఇంట్లో నేసినవే కదా అని పంపిస్తున్న. ఆ మాత్రం మోయలేవా?”

బ్యాగ్ తీసుకొని మౌనంగా, బస్టాప్ వైపు నడిచింది శ్వేత. బస్ ఎక్కి విండో సీట్ లో కూర్చుని బయటకు చూసింది. బస్ అప్పుడే కదిలి ముందుకు వెళ్తుంటే, శ్వేత ఆలోచనలు వెనక్కి వెళ్లాయి.


ఆ రోజు పదవ తరగతి పరీక్షా ఫలితాలు; మామయ్య కు చెప్పు అని అమ్మ ఊరికే వెంటపడుతుంటే, ఫోన్ చేసి క్లాస్ ఫస్ట్ వచ్చానని చెప్పితే ‘అన్ని సబ్జెక్ట్స్ క్లియరా’ అని ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత కూడా ‘చీటీలు పెట్టుకొని పాస్ అయ్యింది. నా బిడ్డని,నీ బిడ్డని కూర్చోబెట్టి పరీక్ష పెడితే నీ బిడ్డకెన్ని మార్కులొస్తాయో చూద్దామా’ అన్నాడు. అయినా అమ్మ ఏమీ అనకపోవటంతో చాలా బాధనిపించింది. చిన్నప్పుడు, ఎప్పుడైనా ఇంటికి వస్తే ‘ఎక్కాలొచ్చా? తప్పులు లేకుండా తెలుగు రాస్తావా? ఫలానా దానికి సమాధానం చెప్పు’ అని ఊరికే విసిగించే వాడు.

‘నా తమ్ముడు తెలుగు పండితుడు, నా బిడ్డ చదువుసంధ్యల గురించి పట్టించుకుంటున్నాడ’ని మా అమ్మ మురిసిపోయేది.


ఇంటర్ చదివే రోజుల్లో ఒకసారి అమ్మమ్మ ను చూద్దామని వెళ్లాను. మామయ్య అత్తమ్మని పిలిచి ‘ఆ షెల్ఫ్ లో సీతాఫలం ఉంది, ఇవ్వు’ అనగానే, ఎప్పటిదో ఎండినట్టు పాడైనట్టు ఉన్న పండును తెచ్చి నా చేతికి ఇవ్వబోయింది. నేను వద్దని చెప్పిన వెంటనే, ‘వద్దయితే బయట పడెయ్’ అని అత్తమ్మ తో అన్నాడు. నాకు చాలా అవమానం అనిపించింది. పడేయాల్సినది నాకెందుకు ఇవ్వటం. మేము పేదవాళ్లము, వ్యవసాయం లేదు. అమ్మమ్మ, తాతయ్య సంపాదించి మామయ్యను పదిహేను ఎకరాల ఆసామిని చేసారు. మగ పిల్లవాడని చదివిస్తే, ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు అయ్యాడు. అందుకే మమ్మల్ని హీనంగా చూస్తాడు.ఎప్పుడూ వాళ్ల పిల్లలతో పోల్చి తక్కువ చేసి మాట్లాడటం ఆయనకు సర్వ సాధారణ విషయం. మామయ్య ప్రవర్తనే నాలో కసి పెరిగేలా చేసింది. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలి అని నిర్ణయం తీసుకునేలా చేసింది.

‘కొత్తపల్లి వచ్చిందమ్మా.. దిగండి’ అని కండక్టర్ అనటంతో ఆలోచనల నుండి బయటకు వచ్చి, బ్యాగ్ తీసుకొని బస్ దిగింది శ్వేత.


అసలు మామయ్య నన్ను ఎందుకు రమ్మన్నట్టు అని ఆలోచిస్తూ రెండు అడుగులు వేసింది. కనుచూపు మేరలో ఇల్లు కనబడుతుంది. ఇంటి ముందు మూడు కార్లు ఉన్నాయి. ఒకటి మామయ్యది. మరి ఇంకా రెండు ఎవరివో అనుకుంటూ వెళ్లి గేట్ తీసేలోపే శ్వేత అత్త స్వరూప హడావిడిగా వచ్చి శ్వేత చేయి పట్టుకొని బ్యాక్ గేట్ నుండి ఇంట్లోకి తీసుకెళ్లింది.

“ఏమైంది, అత్తమ్మా ! ఎందుకు ఈ తొందర” అని స్వరూప చేతిలో నుండి తన చేయి తీసుకుని బ్యాగ్ కింద పెట్టి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది శ్వేత.

“తొందరే మరి. నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇలా కూర్చుంటే కాదు. వెళ్లి కాళ్లు చేతులు మొహం కడుక్కోని రా” అన్నది స్వరూప.

“ఎందుకు? నా కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు? అసలేం జరుగుతోంది ఇక్కడ” అన్నది శ్వేత అసహనంగా.

“ముందు నువ్వు ఫ్రెషప్ అవ్వు. టైం లేదు” అని బలవంతంగా లేపి వాష్ రూమ్ లోకి పంపించింది స్వరూప.

చేసేదేం లేక మొహం కడుక్కోని బయటకు వచ్చింది శ్వేత.

“ఈ చీర కట్టుకో..కట్టుకోవచ్చా? నేను కట్టాలా” అన్నది స్వరూప.

“ఇవన్నీ ఎందుకు? విషయం ఏంటో చెప్పు అత్తమ్మా” అన్నది శ్వేత మొహం తుడుచుకుంటూ.

“చెప్పకూడదని కాదు తల్లీ...వాళ్లొచ్చి చాలాసేపు అయింది. ఎంతసేపని కూర్చుంటారు. అలా వేట్ చేయించటం బాగుంటుందా” అన్నది స్వరూప.

“వాళ్లు వాళ్లు అంటావ్, వాళ్లెవరో చెప్పవేం” అన్నది శ్వేత చిరాగ్గా.

“ఇంకెవరు? నిన్ను చూడటానికి వచ్చిన వాళ్లు. మంచి ఆస్తిపరులు. ఏదోలా ఈ సంబంధం ఓకే అయితే మీ అమ్మా నాన్నలకు భారం తీరిపోతుంది. మీ మామయ్య కొలీగ్ తీసుకొచ్చిన సంబంధం. ఏదో మామయ్య మంచితనం వల్ల ఈ సంబంధం వచ్చింది. ఇది వదులుకుంటే మీ నాన్న ఇంతకన్నా మంచిది తేలేడు. రెండు మూడు కంపెనీలు ఉన్నాయట. అలాంటి వాళ్లు కట్నానికి ఆశపడరు. కట్నమే అనుకుంటే మన సంబంధానికి వచ్చేవాళ్లు కాదు. మనం కాదంటే వేరే వాళ్లు రెడీగా ఉన్నారట. మీ మామయ్యే నా మేనకోడలు ఉందని పట్టుబట్టి తీసుకొచ్చాడట. ఇంకా ఏం ఆలోచించకు. త్వరగా కానివ్వు” అన్నది స్వరూప.

“పెళ్లి చూపుల కోసం రమ్మన్నారా? ముందే చెప్తే నేను రాకపోదును. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటానని ఎవరు చెప్పారు? అంతా మీ ఇష్టానికి నిర్ణయం తీసుకోవటమేనా” అన్నది శ్వేత కోపంగా.

“అయ్యో! ఇప్పుడు కోప్పడితే పనులు కావే తల్లి...! అవతల మీ మామయ్య పిలుస్తున్నాడు. ఇవన్నీ తర్వాత మాట్లాడొచ్చు ముందు పదా” అన్నది స్వరూప తొందరపెడుతూ.

“అయితే నేను ఇలాగే వస్తాను. చీరె, పూలు అవసరం లేదు” అన్నది మనసులో బాధపడుతూ.

‘సరే ఏదో ఒకటి’ అనుకుంటూ శ్వేతను తీసుకెళ్లి, చాప మీద కూర్చోబెడుతుండగా, “పర్లేదమ్మా ఈ కుర్చీ ఖాళీగానే ఉంది కదా. అందులో కూర్చోబెట్టు. మాకు అటువంటి ఫార్మాలిటీస్ లేవు” అన్నాడు వచ్చిన వాళ్లలో ఒక వ్యక్తి.

నిప్పుల కుంపటి మీద కూర్చున్నట్టు కుర్చీలో కూర్చొని ఎవరినీ చూడటం ఇష్టం లేక తల వంచుకుంది శ్వేత.


కొంచెం సేపటి వరకు ఎవరూ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దాన్ని చేధిస్తూ "వెంకటేశ్వరరావు గారూ! అమ్మాయి వయసెంతా? " అన్నాడు పెళ్లి చూపులకని వచ్చిన వ్యక్తి, శ్వేత మామయ్యను ఉద్దేశించి.

24 ఉంటాయి. ఈ ఉగాది కి 25 వస్తాయి అన్నాడు వెంకటేశ్వరరావు.

కాసేపు కూర్చోని , “సరే! ఆలోచించుకొని చెప్తాం” అని బయటకు నడిచారు వచ్చిన వాళ్లు. వారితోపాటు వెంకటేశ్వరరావు కూడా బయటకు వెళ్లాడు.

“ఎలా ఉన్నాడు. నీకు అతను నచ్చాడా శ్వేతా?” అన్నది స్వరూప.

“అందులో ఇద్దరు ముసలి వాళ్లున్నారు. ముగ్గురు నలభై దాటినవారు. నన్ను చూడటానికని వచ్చిందెవరసలు” అన్నది శ్వేత ఆశ్చర్యంగా.

“అదే... గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు కదా, అతనే. ఇరవై సంవత్సరాల క్రితం పెళ్లైందట, భార్య చనిపోయి రెండు సంవత్సరాలు అయ్యిందట. ఒంటరిగా ఎలా ఉంటావని అందరు బంధువులు వెంటపడితే పెళ్లి చేసుకోవాలనుకున్నాడట. కొంచెం బట్టతల ఉందనుకో. అదేమంత పెద్ద విషయం కాదు. మగవాడు తొందరగా ముసలివాడు కాడు కాబట్టి వయసు గురించి ఆలోచించాల్సిన పని లేదు. అతను ఒప్పుకుంటే నీ అంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు. కాలు మీద కాలేసుకుని మహారాణిలా బతుకొచ్చు. ఏం లేనోన్ని చేసుకుంటే పెట్టి పొయ్యలేక మీ అమ్మానాన్నలు ఇబ్బంది పడతారు. నువ్వు ఉద్యోగం చెయ్యాల్సిన అగత్యం లేదు. ఏమంటావ్?” అని స్వరూప అంటుండగా కోపంగా వచ్చాడు వెంకటేశ్వరరావు.

"చీరె కట్టుకుంటే బాగుండేది కదా, చిన్నగా కనబడుతుందట, 24 కూడా ఉండవట, నా పక్కన కూతురు లాగా ఉంటుంది " అంటున్నాడు. ఏ గంగల్నో దూకి సావుర్రి. ఏదో నా తోడ పుట్టిన అక్కకు కష్టం అవుతదని ఎంతో కష్టపడి తెచ్చిన ఈ సంబంధం. రేపు చెప్తామని వెళ్లిపోయారు. ఇంకేం చెప్తారు” అన్నాడు బుసకొడుతూ.

“పోనియ్ లేరా! రేపు చెప్తమన్నారంటున్నవ్ కదా..ఆలోచించుకొని చెప్తారులే. నువ్వు తిందురా అమ్మా ఎప్పుడు తిన్నావో ఏమో” అన్నది అనసూయమ్మ శ్వేత ను కుర్చీలోంచి బలవంతంగా లేపుతూ.

“ఆ తిండి మా ఇంట్లో ఉందిలే అమ్మమ్మ. అన్నానికి మొహం వాచిలేంలే” అంటూ గబగబా బయటకు నడిచి బస్ ఎక్కింది శ్వేత.

* * * * * * * * * * * * * * * * * * * *

“ఏమో అనుకున్నాను గానీ నీ కూతురు అసాధ్యురాలే అక్కా..! ఎవ్వరెంత అంటున్నా పట్టుబట్టి గవర్నమెంట్ ఉద్యోగం కొట్టేసింది. నా మేనకోడలు పోలీస్ ఇన్స్పెక్టర్ అంటే నాకు చాలా గర్వంగా ఉంది. మామకు తగ్గ కోడలు. మన చుట్టాల్లో మా ఇద్దరికే గవర్నమెంట్ ఉద్యోగాలు. మేము మీ కాళ్లు మొక్కెటోళ్లం కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే నా కొడుకుకు చేసుకునే వాడిని. అయినా ఆ ఉద్యోగం చూసి ఎవడో ఒకడు చేసుకోకపోతాడా! ఇక మంచి అబ్బాయిని చూసి నాలుగు అక్షింతలు వేసి చేతులు దులుపుకుంటే అయిపోతుంది” అన్నాడు వెంకటేశ్వరరావు ఆనందంతో తబ్బిబ్బవుతూ...

“మీ కంత శ్రమ అక్కర్లేదు మామయ్యా! ఆడపిల్లకు పెళ్లే పరమావధి, పిల్లల్ని కనటమే పరిపూర్ణత అదే సార్థకత అనే సోది చాలా విన్నాను. ఆడపిల్ల పుట్టిందంటే చాలు ఆ క్షణం నుండి పెళ్లీ పెళ్లీ అని చావగొడ్తారు. ఇంకా జీవితంలో మరే ఆశయాలు లేనట్టు, పెళ్లే జీవితానికి ఆశయం, పరమార్థం అన్నట్టు. నాకంటూ ఒక మెదడు ఉంది దానికి ఆలోచనలు ఉన్నాయి. నా భావాలను అర్థం చేసుకునే వ్యక్తి ఎదురైనప్పుడు చూద్దాంలే మామయ్యా!” అంటున్న కోడలిని తెల్లబోయి చూసాడు వెంకటేశ్వరరావు.

***శుభం***

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.


లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి



రచయిత్రి పరిచయంనా పేరు కమల పారిజాత. నాకు కథలు చదవటం ఆసక్తి. సమాజాన్ని చదవటం మరింత ఆసక్తి. ఆ ఆసక్తే కథలు రాయటానికి ప్రేరణ కలిగించింది. సమాజ ప్రగతికి రచయిత/రచయిత్రి పాత్ర చాలా ముఖ్యం. అందుకే నేను రచనలు చేయాలని నిర్ణయించుకున్నాను. శాస్త్రీయత, సమానత్వం, ప్రగతిని పెంపొందించడం నా రచనల ఉద్దేశం.





142 views7 comments
bottom of page