top of page

ముట్టు శయ్య

గమనిక : ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి 2021 కథల పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకుంది. ఎంపికలో పాఠకుల అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకున్నాం.

Muttu Sayya Written By Kamala Parijatha

రచన : కమల పారిజాత


‘ఈ కోళ్లు పాడుగాను...ఏమున్న ఇంట్లనే సస్తయి, ఎక్కడెక్కడో కోళ్లొచ్చి ఈ ఇంట్లనే తలగవడ్తయ్. ఏడసూడు పెంట పెంట ‘అని కోళ్లను కొట్టి గేట్ వేయబోయి ఎదురుగా దివ్యను చూసి ఆశ్చర్యపోయింది అనసూయమ్మ. దివ్య చెప్పులు విప్పి, కాళ్లు కూడా కడుక్కోకుండానే లోపలికి వెళ్లి, బ్యాగ్ చైర్ లో పడేసి, గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది.

“దివ్యా! ఏమైందమ్మా ఇలా వచ్చావు ?తలుపు తియ్యి…. “అని భయంగా అడిగింది అనసూయమ్మ.

“ నానమ్మా..! నాకు తలనొప్పిగా ఉంది ,ప్లీజ్ నన్ను వదిలెయ్ “అన్నది దివ్య తలుపు తియ్యకుండానే. ఏం చేయాలో అర్థం కాక గేటు దగ్గర మెట్టు పైనే కోడలు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది అనసూయమ్మ.

‘అత్తమ్మా.. తిన్నావా ?’అని తట్టా పారా జామ చెట్టు దగ్గర పెట్టి, కాళ్లు కడుక్కోని వచ్చింది సరోజ.

“ తినలేదు, నీ కోసమే చూస్తున్న…”

“నా కోసం చూడటం ఎందుకు? తిని మందులు వేసుకోకపోయావు‌?. నీరసం వస్తుంది, బీపి తక్కువైతదని ఎన్నిసార్లు చెప్పిన?” అని చిన్నగా మందలించింది సరోజ అనసూయమ్మ ను.

“తింటానులేవే! తొందరేం వచ్చింది... దివ్య వచ్చింది, వచ్చినప్పటి నుండి గదిలోకి వెళ్లి తలుపులేసుకుంది. ఎంతడిగినా చెప్పదేం... నువ్వైనా అడుగమ్మా...ఏమైందో ఏమో... అమ్మమ్మ ఇంటికి పండగకని వారం ముందే పోయిన పిల్ల, రేపు పండగ పెట్టుకోని ఎందుకొచ్చిందో అర్థమయితలేదు. జెర నువ్వడిగి తెలుసుకో” అన్నది అనసూయమ్మ.

“దివ్యా....దివ్యా...., డోర్ తియ్యవే.... ఏమైంది నీకు? అమ్మమ్మ ఏమైనా అన్నదా...అంత ఆగమేఘాల మీద ఎందుకొచ్చినవ్?...బయటకు రా” అంటుండగానే ఫోన్ మోగింది. ఫోన్ లో సరోజ తల్లి సుగుణమ్మ జరిగిన విషయం చెప్పింది.

"సరే అమ్మ! నేను పనులు పూర్తి చేసుకొని సాయంత్రం వరకు వస్తా" అని ఫోన్ కట్ చేసి ఆదుర్దగా చూస్తున్న అనసూయమ్మ కి విషయం చెప్పింది. జరిగింది తెలుసుకుని తేలికగా ఊపిరి పీల్చుకున్నారు.

తల్లి అమ్మమ్మ ఇంటికి వెళ్తుందని అర్థమై గదిలో నుండి బయటకు వస్తుంది దివ్య, బాగా ఏడ్చిందని మొహం చూస్తే అర్థమవుతుంది.

“ పిచ్చితల్లీ... దీపావళి ప్రతి సంవత్సరం వస్తుంది. పండగకు ఉండకపోతినని అంతగనం ఏడ్వాలా...? పండగ పనంతా చేసినందుకు పుణ్యం వస్తనే ఉండే !బాధెందుకే?” అన్నది సరోజ. “పండగకు లేనని బాధ కాదమ్మా.....”

“మరి?” ప్రశ్నార్థకంగా చూసింది సరోజ.

“ అమ్మమ్మ కు కష్టం కావద్దని పనులన్నీ చేసాను. స్నానం చెయ్యలే, తినలే...ఇలా అవ్వగానే నేనేదో తప్పు చేసినట్టు చూసి నన్ను బయటనే నిల్చోబెట్టి బ్యాగ్ నా మొహాన పడేసింది అమ్మమ్మ. అది గుర్తొస్తే చాలా బాధనిపిస్తుంది.అలా అవ్వటం నేరమా అమ్మా?” అన్నది వెక్కుతూ...

“అయ్యో పిచ్చి పిల్లా! నేరం కాదు, పాపం కాదు. అలా అవ్వటం సహజం. అలా అయినప్పుడు ఇలా చెయ్యటం సహజం” అంటున్న తల్లిని మధ్యలోనే ఆపి “ఏది సహజం అమ్మా! .. ఇలా హీనంగా చూడటమా” అన్నది కోపంగా...

“హీనం ఏముందే? ఇదే విషయాన్ని పండగలా జరుపుకోలేదా? అమ్మమ్మ నీకు తన చంద్రహారం ఇచ్చింది కదా...ఎంత మురిసిపోయింది ఆ రోజు నిన్ను చూసి”.

“ఆ....ఆ రోజు పందిరెక్కి పది మందిని పిలిచి అవమానించారు, ఈ రోజు పది మంది ముందు ఇలా అవమానించారు.

ఓ ...నేను అమ్మనయ్యానని తెగ సంబర పడతావే...తల్లవటమే గొప్ప అంటావే...నువ్వు తల్లి అవటానికి కారణం ఏందమ్మా...?”

“ దివ్యా....ఏంటా మాటలు?తల్లితో మాట్లాడే తరీకా ఇది?. పుట్టుక గురించెందుకే నీకు?” అన్నది అనసూయమ్మ గుడ్లురుముతూ..

“ఇప్పుడు నేనేమన్నానని…. ఆరేళ్ల పిల్లవాడు బూతులు మాట్లాడగలడు కానీ ఒకమ్మాయి తన శరీరంలో జరిగే మార్పుల గురించి మాట్లాడకూడదు, సిగ్గు పడాలి, తలొంచుకోవాలి. సహజమైన విషయాలను అపోహలతో, అహంకారంతో అవమానిస్తుంటే అణచి వేస్తుంటే నోరు మూసుకుని పడుండాలి. ఈ లోకంలో తనకంటూ ఒక ఉనికి ఉందన్న విషయం కూడా మర్చిపోవాలి .అంతే కదా?” అన్నది కోపంగా దివ్య.

“ వైనాలు వందనాలు నేర్సుకోడమే ఆడదానికి పెద్ద సదువు అంటే ఇన్నవా...ఆ వచ్చిరాని సదువులు సదివి ఎట్ల మాట్లాడుతుంది సూడు?” అని కోడలిని చివాట్లేసింది అనసూయమ్మ.

“అవును, మనకు ఆ పనికిమాలిన ఆచారాల బురదలో పొర్లడమే ఇష్టమాయె” అన్నది దివ్య వెటకారంగా...

‘అమ్మో అమ్మో...నన్ను పంది అన్నద’ని నెత్తి నోరు బాదుకుంటూ గేటు దగ్గర మెట్టు మీద కూలవడి చిన్నగా శోకాలు పెట్టింది అనసూయమ్మ.

“ఏంటే నోటికెంతొస్తే అంతే మాట్లాడుతావ్. లోకంలో ఎవ్వరూ చదువుకోలేదా? వాళ్లందరూ నీలాగే మాట్లాడుతున్నారా” అన్నది సరోజ కోపంతో వచ్చిన ఆయాసంతో.

“అవును, నాలుగు రాళ్లు వెనకేసుకుందామని చదివేటోళ్లకు నలభై రాళ్లు మీద పడ్డా బాధపడరు. పేడ పురుగు పేడలో పుట్టి, పేడలో పెరిగి, పేడలో చచ్చినట్టు వాళ్లు కూడా అంతే. అది దాటి బయటకు రారు, వచ్చే వాళ్లను రానివ్వరు .మూర్ఖపు పీత బుర్రలు.”

“అంటే మన ఊళ్లో ఉన్న డాక్టరమ్మకు ఏం తెల్వదంటవా...ఆమె ముట్లు, దూరాలు పాటిస్తది. మన ఇంట్లోనైనా ఉప్పు కారం ముట్టుకుంటాం కానీ ఆమె ఏదీ ముట్టుకోదు. కనీసం ఇంట్లో చెట్లను కూడా తాకదు” అన్నది సరోజ.

“నువ్ పొద్దున లేస్తే మన పొలంలో పని చేస్తావ్ కదా !చెట్టూ పుట్టా ముట్టుకోని, మరి ఆ చెట్లేం చావటం లేదే...అందులో పంట తెచ్చి నైవేద్యం కూడా పెడ్తావు కదా.. ఏమైంది మరి?” అన్నది దివ్య.

“మనది వ్యవసాయ కుటుంబం కాబట్టి తప్పలేదు. డాక్టరమ్మకు ఆ అవసరం లేదు ఆమెకు సాగుతోందలా” అన్నది సరోజ.

“మనకు తప్ప లేదా లేక తప్పు లేదా?సాగితే..కొనసాగించగలిగే ఆచారాల గురించి నువ్వెందుకమ్మ అంత ఆరాటపడుతున్నవ్?”.

“దివ్యా... నీకెలా చెప్తే అర్థమైతది. పెద్దలు పెట్టిన ఆచారం, కొన్ని చోట్ల ముట్టు గుడిసెలుంటాయట .ఆ టైంలో ఇంట్లో కూడా ఉండరట. లోకంలో ఎవ్వరికీ లేని ఆలోచనలు నీకెందుకే తల్లీ ...నలుగురితో నారాయణా అని బతకక” అని నెత్తి కొట్టుకుంది సరోజ.

“ముట్టు ముట్టు అన్నవాడు ముట్టులో పుట్టడా...వేమన ఏమన్నాడో తెలుసా అమ్మా..

‘ముట్టు ముట్టు అని ముట్టరాదందురు

ముట్టుకు మూలమేమి నవ రంధ్రాలలో మురికే...పుట్టటంతోనె ముట్టటం మొదలవుతుంది’ అన్నాడు.

“ఎవరో ఏదో అన్నారని మనం వేల సంవత్సరాల నుండి వచ్చిన ఆచారాలు కాదంటామా?” అన్నది సరోజ అసహనంగా.

“ ఇందుగలడందులేడని సందేహం లేనప్పుడు ఆ ముట్టు గుడిసెలో మాత్రం ఉండడా...శేష శయ్య పైన నిద్రించే వాడు కూడా ఒకనాడు తల్లి కడుపులో ముట్టు శయ్య పై నిద్రించలేదంటావా అమ్మా...

ముట్టు కాదు సృష్టి కి తొలిమెట్టు. స్త్రీ కి గర్భాశయం వరం కాదు అలాగే శాపం కూడా కాకూడదమ్మా అంటూ గదిలోకి వెళ్లిపోయింది దివ్య.

సూర్యుడొచ్చి ఒక్కసారిగా కటిక చీకటిని ఊడ్చేసి వెలుగులు ప్రసరించినట్టు, సరోజ మనసులో ఉన్న అజ్ఞాన చీకటి, దివ్య మాటల వెలుగులో ఊడ్చుకుపోయింది.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి

> ముట్టు శయ్య

> మగ రాయుడు

> కన్యాదానంరచయిత్రి పరిచయం

నా పేరు కమల పారిజాత. నాకు కథలు చదవటం ఆసక్తి. సమాజాన్ని చదవటం మరింత ఆసక్తి. ఆ ఆసక్తే కథలు రాయటానికి ప్రేరణ కలిగించింది. సమాజ ప్రగతికి రచయిత/రచయిత్రి పాత్ర చాలా ముఖ్యం. అందుకే నేను రచనలు చేయాలని నిర్ణయించుకున్నాను. శాస్త్రీయత, సమానత్వం, ప్రగతిని పెంపొందించడం నా రచనల ఉద్దేశం.


1,044 views13 comments
bottom of page