top of page

నేనే ప్రకృతి


'Nene Prakruthi' New Telugu Poem Written By Kankipati Sowmya

'నేనే ప్రకృతి' తెలుగు కవిత

రచన: కంకిపాటి సౌమ్య


అమ్మ గర్భంనుండి బైటికి వచ్చాను

కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాను

అర్థం కాని అయోమయంతో ఏడ్చాను

అమ్మ స్పర్శతో ఒడిలో ఒదిగాను


అందమైనది నా చిన్ని బాల్యం

అందులో ప్రతి జ్ఞాపకం అమూల్యం

సీతాకోక చిలుకలా ఎగిరాను

ఆడుతూ పాడుతూ ఎదిగాను


ఆటల్లో అంటిన మురికి మరకలు

అదేనా అంటూ అడిగే సమాజ ప్రశ్నలు

అర్థం కాక మూతపడే నా నోటి పలుకులు

అలుముకుంది నా గుండెలో ఏదో గుబులు


హుషారుగా ఉదయాన్నే లేచాను

ఎప్పటిలాగే బడికి తయారయ్యాను

ఏదో వింత రంగు కనపడి భయపడ్డాను

పరుగున వెళ్ళి అమ్మకు చెప్పాను


అదే అని నిర్దారణ చేసే మా నానమ్మా

కబురు చెప్ప ఫోన్లు చేసే మా అమ్మ

ఎదురు బదురు కూర్చుని ఏడవండమ్మా

అని సలహా ఇచ్చే నా మేనత్తమ్మ


చివ్వుక్కుమనింది నా తల్లి మనసు

ఎందుకో మేమంటే వాళ్ళకి అంత అలుసు

నా చిన్ని మనసుకి ఇవన్నీ ఏం తెలుసు

పుట్టుకొచ్చే నాలో కొత్తగా సొగసు


ఎవరితో కలవాలన్నా ఎందుకో తడబాటు

అయ్యారు నా అన్నలు నాకు ఎడబాటు

భరించలేనిది నా శరీరంలో కలిగే పోటు

చేసుకున్నాను నిదానంగా అన్నీ అలవాటు


ఎర్ర సముద్రం వలే ప్రవహించింది

ఒంట్లో శక్తినంతా హరించింది

తిండిపై శ్రద్ధను తగ్గించింది

నిద్రకు దూరం చేసింది


కలిగే నాలో చాలా మార్పులు

నలిగే నా మనసులో ఎన్నో తలపులు

తిరిగింది నా మది ఎన్నో మలుపులు

తెరిచింది నా గుండె సందేహాల తలుపులు


వారం నుంచే కలిగే పిచ్చి కోపం

తీర్చుకోవాలనే పగ ప్రతీకార తాపం

ఎవ్వరూ బాధ్యులు కానిది ఈ నెపం

ఏమి చేశానని నాకీ శాపం


ఎవరు అర్థం చేసుకుంటారు నాలోని వేదన

ఎవరికి వినిపిస్తుంది నా మనో రోదన

ఎలా తగ్గుతుంది నాలోనీ ఆందోళన

ఎవరికి చెప్పాలి నా ఈ ఆవేదన


కనుకా


ఓ మగువా మేలుకో

నీ ఔన్నత్యాన్ని తెలుసుకో

శక్తి సామర్థ్యాలు పెంచుకో

మనో బలంతో నిన్ను దృఢంగా మలుచుకో


నువ్వే ప్రకృతివని నీలో ప్రకృతిని అలవరచుకో

నీకు నువ్వే సాటి అని తెలుసుకో

ఉన్నతమైన స్థానాన్ని ఎంచుకో

విశాలమైన నీ రెక్కలు విప్పి సాగిపో


చేపలు పాలు గుడ్లు

ఆరోగ్యాన్ని పెంచే ప్రొటీన్లు

రంగురంగుల పండ్లు కూరగాయలు

అందాన్ని పెంచే విటమిన్లు


కొండలెక్కే మేకలు తినే ఆకులు

ఆకుకూరల రూపంలో ఉండే ఖనిజాలు

రుధిరాన్ని, శక్తిని పెంచే ఇనుము

ఉక్కులాగా మారుస్తాయి తినుము


అందుకే..


మంచి ఆహారాన్ని తీసుకుందాం

శారీరకంగా బలంగా ఉందాం

మానసికంగా ఆరోగ్యంగా ఉందాం

అన్నిచోట్ల చిరునవ్వులు పంచుదాం


***


కంకిపాటి సౌమ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నా ఆలోచనలకు అక్షర రూపమే నా కవిత

నా అనుభూతుల ప్రతిరూపమే నా కవిత

నా భావావేశానికి ఆకారం ఇస్తే అదే నా కవిత


చదివించేలా మాత్రమే కాక

ప్రభావితం చేసేలా నా రచనలు ఉండాలనేదే నా కోరిక..


కంకిపాటి సౌమ్య

విజయవాడ27 views0 comments

Comments


bottom of page