top of page

సీతకోటి


'Seethakoti' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'సీతకోటి' తెలుగు కథ

రచన : సుదర్శన రావు పోచంపల్లి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

శ్రీ రామకోటి వ్రాస్తున్న ధనుష్పాణి భార్య యోజన గంధను పిలుస్తాడు.


“సృష్టిలో ఆడవారు ఆకాశంలో సగం అంటారు కదా! నేను మన కుటుంబ యోగ క్షేమాలు కోరుకుంటున్నాను. ఆ రాముణ్ణే నమ్ముకున్నా- కుటుంబ సమ్రక్షణ మన ఇద్దరి బాధ్యత. కనుక ఇవ్వాళిటి నుంచి రామకోటి వ్రాయడములో నువ్వు కూడా భాగ స్వామివి కావాలి” అంటాడు ధనుష్పాణి..


“ఇంకా నయం! మన నలుగురు పిల్లలను పిలిచి, ‘మీరు కూడా బాధ్యత వహించాలి’ అంటులేరు. సంతోషం” అంటుంది యోజనగంధ నవ్వుతూ.


“అట్ల కాదు గంధా(ధనుష్పాణి భార్యను ముద్దుతో పిలుచుకునే పేరు- అందులోనే ద్యోతకమైతది వీరి అన్యోన్నత)! ఒక సారి రంగములో దిగిన దరువాత ఆ కార్యము సంపూర్ణంగా నెరవేర్చకపోతె అసంతృపిగా ఉంటుంది. అదీగాక ఇది దైవ కార్యమాయె! అందులోనూ ఆ రాముణ్ణే సంపూర్ణంగా నమ్ముకున్నవాడినైతి. అందులోను ఆడవారు ఆకాశం లో సగం అంటారుకదా.. నువ్వు, నేను నిర్వహించే కార్యక్రమాలలో సగము పంచుకుంటే తప్పేమిటి?” నవ్వుకుంటూ అంటాడు ధనుష్పాణి.


యోజన గంధ కూడా తడుముకోకుండా “మీకు ఈ రోజే జ్ఞానోదయమైనట్టున్నది. సరెగాని నా పనులలో కూడా సగము పంచుకొండి” అంటుంది భర్త ముఖంలో ముఖము పెట్టి చూసుకుంటూ.


“చచ్చిన్రా భగవంతుడా! తెలివిగల భార్యలు దొరికితె ఇక భర్తల పని గోవిందా" అనుకుంటాడు భార్యకు వినవచ్చీ వినరాకుండా.


“ఏదో మీలో మీరే గొణుక్కుంటె నాకేమి అర్థమైతది? ధైర్యము చేసి వినొచ్చేటట్టు అనడానికి భయమెందుకో..” అంటుంది యోజన గంధ.


వంటింటికి పోయి రెండు కప్పుల కాఫీ కలిపి తీసుక వస్తుంది యోజనగంధ. ఒకటి భర్త కందించి తానొకటి తీసుకొని త్రాగుతూ భర్తకెదురుగా కూర్చుంటుంది. ఆ రోజు సెలవు దినము కనుక భార్యా భర్తలిద్దరూ నిమ్మళంగా కూర్చొని మాట్లాడుటకు సమయము దొరికింది కదా అనుకుంటు..

పిల్లలు నలుగురు వాళ్ళ లోకంలో వాళ్ళు..


“సరెనండి. మీరు తల పెట్టిన కార్యములో నేనూ పాలు పంచుకుంట. కాని మీ శ్రీరామకోటి మీరే పూర్తి చెయ్యండి. దానికి తోడుగా నేనూ ‘సీత కోటి’ వ్రాస్తాను” అంటంది యోజనగంధ.


“ఇదేమి కొత్త మెలిక? నేను ఎన్నడూ వినని వింత చెబుతున్నావు” అంటాడు ధనుష్పాణి భార్యవైపు అదోరకంగా చూస్తూ-


“అవునండి. ఆకాశం లో సగం- సీతమ్మవారిని తలువద్దా- ఇది కలియుగం. హక్కులు అందరికీ సమానమే. ఎప్పుడో ఒకప్పుడు ఆమెకూ యోగము పట్టవలసిందే కదా- మన భక్తి ప్రపత్తే ఆమెకు కలిగే యోగము- అందుకొరకే నేనూ ఈ రోజునుండే ‘సీత కోటి’ వ్రాయడము మొదలపెడుతా” అంటుంది యోజన గంధ.


“అమ్మా తల్లీ.. నిన్ను ఉండలేక కదిపిన.. ఇక ముందు నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి” అంటాడు ధనుష్పాణి.


“సీత, శక్తి స్వరూపిణంటారండి. ఆమెను పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతవని పెద్దలు చెబుతారు (కృత యుగే రేణుకా శక్తి- త్రేతా యుగే సీతా శక్తి- ద్వాపరే ద్రౌపదీ శక్తి- కలియుగే గృహే గృహే శక్తి అంటారు). అందుకే నేను కొత్త వరవడిగా ఉంటుందని ‘సీత కోటి’ వ్రాయ పూనుకుంటున్నాను” అంటుంది యోజన గంధ.


అన్నట్టే ఆ రోజు భోజన కార్యక్రమాలు ముగిసిన తరువాత కొడుకు సుధానిధితో కొన్ని వ్రాయని పుస్తకాలు, కలము తెప్పించుకొని ‘రేపు ముహుర్తము బాగుంది. రేపటినుంచి మొదలు పెడుత’ అని బిడ్డలను (1. పారాయణి, 2. నారాయణి, 3. శైలేయి. ) ముగ్గురిని పిలిచి తను తలపెట్టిన కార్యము గురించి చెబుతుంది.


దానికి వాళ్ళు ముగ్గురు ముక్త కంఠముతో “వహవ్వా.. మా అమ్మ ఎంత మంచిదో. స్త్రీ జాతికి బాసటగా నిలువడానికి సూచకంగా ‘సీత కోటి’ వ్రాయ పూనుకున్నాది. భేష్” అని చప్పట్లు కొడుతారు.


ధనుష్పాణిది మధ్య తరగతి కుటుంబము- పిత్రార్జితంగా తాము ఉంటున్న ఇల్లు, కొంత వ్యవసాయ భూమి- ఆయన ఆస్తులు. ప్రభుత్వ ఉద్యోగము చేయ ఇష్టము లేక ఆ ఉన్న భూమిలోనే ఆధునిక పద్ధతులు అనుసరించుచు రకరకాల పంటలు పండించుచు మంచి ఫలసాయము పొందుతుంటాడు. కుటుంబ పోషణకు లోటు లేదను తృప్తితో జీవనము కొనసాగిస్తుంటాడు.


యోజనగంధ మాత్రం సొంత నిర్వహణ పాఠ శాలలో ఉపాధ్యాయ వృత్తి నిర్వహించుచు కుటుంబ అవసరాలకు తనవంతు బాధ్యతగా కొంత డబ్బు సంపాదిస్తుంది. నలుగురు పిల్లలనూ పై చదువులకై అన్య దేశాలకు పంప ఇష్టములేక ఉన్న చోటే స్థితిమంతులుగా జీవించ హిత బోధ చేస్తుంది. వాళ్ళూ తలిదండ్రుల ఆలోచనలను అవగాహన చేసుకొనీ ఎవరికి వారే వివిధ రంగాలలో నిలదొక్కుకుంటారు.


నలుగురికీ ఇంచుమించు పెళ్ళి ఈడు వచ్చినందున వారికి మంచి సంబంధము వెతుకు క్రమములో కుల గోత్రాల జోలికి పోకుండా ఉంటారు దంపతులిద్దరు- వరదక్షిణ- లాంచనాలు ఇచ్చిపుచ్చుకొను సంప్రదాయము వదులుకొని అల్లుళ్ళకు ఇవ్వడము కాని కొడుకు కొరకు కోరడము కాని చేయకుండా సభ్యత సంస్కారమున్న వారి ఆచూకీ తీసి పెద్ద చిన్న తేడా అని యెంచకుండ నలుగురికీ ఒకే వేదిక పై వివాహం జరిపిస్తాడు ధనుష్పాణి.


బిడ్డలు వారి వారి అత్తగారిళ్ళకు పోగా కోడలు ను మహా లక్ష్మే మనన ఇంట అడుగు పెట్టిందని సంబరముతో ఉంటారు ధనుష్పాణి- యోజనగంధ. అల్లుళ్ళ పేర్లు వరుసగా విద్వాన్, విజేత్, విజ్ఞాన్ కాగా కోడలు పేరు అపరంజి పేరుకు తగ్గట్టే బంగారు బొమ్మ. ధనుష్పాణి సహజంగా రామ భక్తుడు- రామాయణము చదివిన వాడు కనుక కోడలును మామనే తండ్రిగా అన్ని బాధ్యతలు వహించి చూసుకోవాలి. ఆమెకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వచ్చినా సంపూర్ణ బాధ్యత మామగారే అని చదివాడు- ఆ తీరుగనే తమకు బిడ్డలు నలుగురు అనుకుంటాడు ధనుష్పాణి.


కోడలుకు కొత్త లేదు అల్లునికి పాత లేదను సామెత యెరిగిన అపరంజి అత్తకు తోడుగా ఇంటి పనులు, వంట పనులకు పూనుకుంటుంది. ఒకనాడు అపరంజి తానే స్వయముగా వంట చేసి మామగారికి భర్త సుధానిధికి వడ్డిస్తుంది-


అపరంజికి వంట చేయడము లో అంత ప్రావీణ్యము లేకనో ఇక్కడి రుచులు తెలువకనో ఎదో రకంగా వండింది కాబట్టి ధనుష్పాణి ఏమీ అనకుండా తిని పోతాడు- భార్య చేతి వంట తొలిసారి కనుక సుధానిధి కూడా కిమ్మనకుండా తింటాడు ఏ వ్యాఖ్యానము చేయకుండ. ఇక అత్త కోడళ్ళు ఒకేసారి తినడానికి కూర్చుంటారు- అత్తకు ముందుగా వడ్డించి తాను తినడానికి ఉపక్రమిస్తుంది అపరంజి.


యోజన గంధ ఆ వంటకాలను రుచి చూస్తూనే “అపరంజీ! ఈ కూరలో ఉప్పు సరిపోలేదమ్మా” అనగానే నాలుక కరుచు కుంటుంది అపరంజి-


“క్షమించండి అత్తయ్యా! రేపు మీ సలహతోనే వండుతాను” అంటుంది. సరేలే అని తిని చేయి కడుక్కొని నేరుగా భర్త దగ్గరకు పోయి కొడుకును కూడా పిలిచి అడుగుతుంది-


“ఈ రోజు వంట అంత రుచిగా ఉన్నదా తండ్రీ కొడుకులిద్దరు కిమ్మనకుండా తిన్నారు. ఏమిటీ విశేషము” అంటుండగానే తండ్రీ కొడుకులిద్దరు ఒకరి ముఖము ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటారు.


“నేనూ రోజూ వండిపెడుతుంటే నానా రకాల వంకలు పెడుతారు- ఈ రోజు అంత కమ్మగా ఉందా ఇద్దరికి” అని నవ్వుకుంటూ అడుగుతుంది యోజనగంధ.


“కోడలుకు కొత్తగద, నీవు ఈ ఇంట్లో అడుగు పెట్టి వండిన నాటి పరిస్థితి నెమరు వేసుకో. ఐనా నా అనుభవము నా కొడుక్కు రావద్ద” అంటాడు ధనుష్పాణి.


కోడలు వైపు చూస్తూ “నువ్వు ఏమీ అనుకోకమ్మా అపరంజి! మేమేదో సరదాకనుకుంటున్నాము” అంటాడు ధనుష్పాణి.


“మన అమ్మాయిలది కూడా అక్కడ వారి వారి అత్తవారిండ్లలో ఇదే పరిస్థితి. అది మనము గమనించాలి” అంటడు ధనుష్పాణి.


సుధా నిధి- అపరంజి ఇద్దరు అన్యోన్యంగా ఉంటూ ఉంటారు- ఒకనాడు అపరంజి తన తల్లిగారింటి ముచ్చట్లు చెబుతూ “మా వదినలు నన్ను సదా గేలి చేసేవారు. ఐనా మా వదినలు చాలా మంచి వాండ్లు” అంటుంది.


“ఐతె ఏదన్న ఒక్క గేలి మాట చెప్పు. నేను సంబర పడుతాను” అంటాడు సుధానిధి.


అపరంజి, వాళ్ళ వదినలు పాడిన పాటొకటి వినిపిస్తుంది, సుధానిధికి సిగ్గుపడుతు.


ఆడకూతురో అర్థ మొగుడా

ఏడ జూతురో నీ జోడు కొరకు

ఊరు వాడ తిరిగి వస్తి

వారివీరీనడిగి వస్తి


కట్ణకానుకల్ ఇస్తనంటి

పట్ణ మైనా పంప్తనంటి

ఎక్కడెక్కడో ఎదికి చూస్తె

ఒక్కడైనా కాన రాడు


చక్కనైన పిల్లవాడు

చదువు కాస్తా నేర్చినోడు

బుద్ధి గల్గి మెల్గెటోడు

నీకు సరి తూగే ఈడువాడు


అద్దమంటి ఆడపిల్లవ్ ముద్దులొల్కే మర్దలమ్మ

ఒక్కడైతే కానబాడే బక్కపల్చని చిన్నవాడు


బారెడంతా జుట్టువాడు నేల చూపుల పిల్లవాడు

కాలు కాస్త ఈడ్చువాడు చేతులెత్తి నడుచు వాడు


బూతులెన్నో నేర్చినోడు మూతి మీసం లేనివాడు

మనసు పడితె చెప్పవమ్మ మనుమాడ ఒప్పుకుంటె


మరు రోజె ముహుర్తం నీ మంచి గోరి చెబుతున్న

మంచి వాడు మా తమ్ముడు మించి పోతె దొరుకడమ్మ.


ఆ పాట విని “ఐతే నన్ను అట్ల ఊహించుకుంటున్నావా” అంటాడు సుధా నిధి-


“అయ్యో రామా! వాండ్లు నన్ను ఎప్పుడో చిన్నప్పుడు ఆట పట్టించిన సంగతి చెప్పిన- దిష్టి మాంత్రగాడి వలే దాన్ని మీకు అన్వయించుకోవడ మేమిటి” అంటుంది అపరంజి.

ఆ రాముని భక్తి నీకూ ఉన్నదా” అని అపరంజిని దగ్గరికి తీసుకుంటాడు సుధానిధి. “మరి మా అక్కలు నన్నెట్లు ఆట పట్టించేదో చెప్పమంటావా అపరంజీ” అంటాడు సుధానిధి-


“సరె కానియ్యండి ఆ అపురూపమేమిటో విని తరించాలి గద” అంటుంది అపరంజి,


చెబుతా విను అంటూ-


తుమ్మ చెట్ల బాయి కాడ తమ్మీ ఒకతుంది

వాకిట్ల నుండి వస్తే దిడ్డి నుండి పోలేదు

మిద్దె ఎక్కి నడుస్తె ఇల్లు దద్దరిల్లి పోతుంది

అడ్డెడూ బియ్యమైతె ఆ పూటకే సరి

పెద్ద బండి పట్టా ఐతె వడ్డాణ మైతది

చెవులు గుట్ట గడ్డపార

ముక్కుకైతె మేకు జాలు

చేతి గాజులైతె సైకిల్ చక్రాల సైజుండు

పది చీర లంటగుడితె పనికిరావచ్చు

మా మంచి మరదలు మహిలోన దొరకదు

తాత్సారం చేయకుండ తమ్మీ చేసుకో.


ఇట్లా నన్ను గేలి చేస్తుంటే నేను అనలేక కాదు పాపం ఆడ పిల్లలని ఊరుకునే వాడిని.”


“ఇప్పుడు చెప్పండి. నేను అంత లావుగా ఉన్ననా.. మరి లేక హిడింబనా” అంటుంటే సుధానిధి ప్రేమతో కొట్టడానికి చేయి లేప బోతుంటాడు.


“ ఆహా.. మీకు ఈ కళ గూడా ఉన్నదా” అని అతని చేయి పట్టుకొని దిగ్గున లేచి “మీ మగ బుద్ధి పోనిచ్చుకోరు” అంటు కిలకిల నవ్వుతుంది అపరంజి.

***


ఆ రోజు యోజన గంధ పుట్టిన రోజు. ఒకరోజు ముందే ముగ్గురు బిడ్డలూ ముగ్గురు అల్లుళ్ళూ వస్తారు- తమను పెంచి పెద్ద చేసి విద్యా బుద్ధులు నేర్పించి మంచి సంబంధాలు చూసి పెళ్ళి చేసి పంపిన తల్లిదండ్రులంటె అమిత గౌరవము ముగ్గురాడ పిల్లలకు. కోడలు అపరంజి కూడా వాళ్ళలో ఒకతై సంతోషంగా ఆనాటి పండుగ వాతావరణానికి ముగ్ధురాలైతది.


ఇల్లంతా అలంకరించి మంచి మంచి పిండి వంటలు, మిఠాయీలు చేసి ఆ రోజు అందరూ ఒక్కదగ్గర కూర్చొని భోజనాలు చేస్తారు నవ్వులు ముచ్చట్లు చోటు చేసుకోగా. ఆడ బిడ్డలకూ అల్లుళ్ళకూ తగిన కట్ణాలు పెట్టి అందరికీ నమస్కరిస్తుంది అపరంజి (ఇది అనాది నుండి అపరంజి తల్లిగారింట నడుస్తున్న ఆచారము)-


“ఈ ఆధునిక యుగములో ఇంకా ఈ ఆచారాలేమిటి?” అని భర్త సుధానిధి మెల్లగా అనబోతుంటె వారించి “మన సంప్రదాయము మనము పాటించాలె- ఆడ బిడ్డలు ఎప్పుడూ రారుగద. ఐనా ఈ రోజు అత్తయ్యగారి పుట్టిన రోజు జరుపుకుంటున్నాము అంటే దానికొక రూపు ఇవ్వాలంటె ఇలాంటి కార్యక్రమాలు జరుగాలి కదా. అదీ ఏడాదికొక్కసారి. నన్నడుగుతె మామయ్య గారి పుట్టిన రోజు కూడా ఇంకా ఘనంగా జరుపుకుంటేనే మన సంసారానికి ఒక అర్థముంటది” అంటుంది అపరంజి.


అపరంజి మాటలకు అందరూ చప్పట్లు కొడితె యోజన గంధ కోడల్ని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది.


ఇక ధనుష్పాణి సంబర పడుతూ “ఈ రోజు ఒక పండుగ వాతావర్ణమేర్పడింది మన ఇంట్ల- ఈ సంప్రదాయము ఇట్లనే కొనసాగాలే- రేపు ముగ్గురాడ పిల్లలకు గాని, సుధానిధికి గాని సంతాన భాగ్యము కలిగితె ఇదేవిధంగా మన ఇల్లు కళకళ లాడుతూ పుట్టబోయే వాండ్ల ఆట పాటలతో ఇంకా తళ తళలాడాలని నా కోరిక” అంటాడు.


“ఈ సందర్భమున నేను మీ అందరికి నా అనుభవములో ఉన్న కొన్ని పద్ధతులు పాటించ చెబుతున్నాను- అదేమిటంటె- అనాదినుంచి వస్తున్న సత్సంప్రదాయాన్ని కొనసాగించాలి. సాటి మనిషిని గౌరవించాలె- ఎవరినీ ఆర్థికంగా గాని విద్యలో గాని వెనుక బడిన వారిని చిన్న చూపు చూడ కూడదు- బంధు మర్యాద పాటించాలి- ఎవరికీ పెట్టలేకున్నాా ఒకరికి చేయిజాప కూడదు. కష్టానికి వెరువకుండ సంపాదించుకో గలుగాలి- పూర్వీకుల ఆస్తి ఎట్టి పరిస్తితిలోను పోగొట్టక రాబోవు తరానికి అందీయాలి.


ఆపదలో ఎవరున్నా చేతనైనంతవరకు ఆదుకునే ప్రయత్నము చేయాలి వెనుకడుగు వేయ కూడదు. కులము, మతము, గోత్రము లాంటి సంప్రదాయాల జోలికి పోవద్దు. మనమే గొప్ప అనే అహంకారము దరి చేరనీయొద్దు. ఆడ మగ అను బేధాలు మానుకోవాలె- అందరూ సమానమనే భావనతో కలసి మెలసి వ్యవహరించాలి. కరువుకు కృంగడము- కాలానికి పొంగడము ఆరోగ్యకరము కాదు. పెద్దవారిని గౌరవించే సంస్కారము విడనాడవద్దు. పజ్జనవ్వు పనికిరాదు. ఇంకా ఇంకా చెప్పేవి చాలా ఉన్నాయి ఎవరైనా నా మాటలకు నొచ్చుకుంటె క్షంతవ్యుడను” అని అల్లుండ్ల వైపు చూసుకుంటూ ముగిస్తాడు ధనుష్పాణి.


“మామ గారు చెప్పినవన్ని మాకు శిరోధార్యము” అంటారు ముగ్గురల్లుళ్ళు ముక్త కంఠంతో.


అందరూ లేచి వాళ్ళ వాళ్ళ సంభాషణలో చేరితె ధనుష్పాణి శ్రీరామకోటి, యోజన గంధ సీత కోటి- వ్రాయనుపక్రమిస్తారు.


సమాప్తం


సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.



43 views0 comments
bottom of page