top of page

స్ఫూర్తి కిరీటాలు 1


'Spurthi Kiritalu1/3' New Telugu Story Written By K. Lakshmi Sailaja

'స్ఫూర్తి కిరీటాలు 1/3' తెలుగు పెద్ద కథ మొదటి భాగం

రచన: కే. లక్ష్మీ శైలజ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


"పల్లె కు పోదాం పారును చూద్దాం చలో చలో,

అల్లరి చేద్దాం చలో చలో"


కారు నడుపుతూ సన్నగా పాడుకుంటూ ఉన్నాడు విక్రాంత్. విక్రాంత్ పాటవిని "అమెరికా అంతటా తిరిగినా కనపడని నీ 'పారు' ఆ పల్లెలో ఉందా ఏంటి?" అంది వాళ్ళమ్మ విజయ. విజయ మాటలకు గట్టిగా నవ్వాడు, వాళ్ళ నాన్న విక్రమ్.

నంద్యాల దాటి బండి ఆత్మకూరు రోడ్ వైపుగా వెళ్తున్న వాళ్ళ కారు రోడ్డుకు అటూ, ఇటూ ఉన్న అరటితోటల మధ్యలో వెళ్తోంది. గ్రీష్మ ఋతువు ఎండలకు అలసిన వాళ్ళు ఆ తోటల చల్లదనానికి సేదతీరుతున్నారు. సహజమైన చల్లటి గాలి ఎంతడబ్బు పోస్తే దొరుకుతుంది? ప్రతి మనిషి జీవితంలో పద్ధెనిమిది చెట్లనుంచి వచ్చే ఆక్సిజన్ వాడుకుంటాడట. అంటే ప్రతి మనిషి జీవితంలో కనీసం పద్ధెనిమిది చెట్లు నాటుకోవాలేమో! ఆలోచిస్తూ నవ్వుకున్నాడు, విక్రమ్.

ఒక పది నిముషాలకు కొత్తపల్లె దాటి, కారు కోడూరు లో ప్రవేశించింది. నాన్నమ్మ, జేనాన్న లను చూస్తూనే విక్రాంత్ కు అమ్మా, నాన్నలను చూసినప్పటి కంటే ఎక్కువ సంతోషమేసింది. ఆ పెద్దవాళ్ళకు కూడా వాళ్ళ కొడుకును చూసినదానికంటే మనవణ్ణి చూస్తేనే ఎక్కువ తృప్తిగా అనిపిస్తుంది. కొడుకు, కోడలు, మనవళ్ళకు మంచినీళ్ళు ఇచ్చి, ఒక పెద్దగ్లాస్ వెన్న చిలికిన మజ్జిగ ఇచ్చింది, రాజేశ్వరి. “ఎందుకు నాన్నమ్మా, మజ్జిగ అమెరికాలో ఇంత తియ్యగా వుండవు?” అన్నాడు విక్రాంత్. “తాజా వెన్న చిలికిన మజ్జిగ తియ్యదనమది. బయట కొన్న పెరుగులో ఉండదు గదా!” అంది రాజేశ్వరి.


కొద్దిసేపు తరువాత అందరూ విశ్రాంతిగా కూర్చున్నప్పుడు విక్రమ్ ఇలా చెప్పాడు. "నాన్నా, అమెరికా లో విక్రాంత్ p. hd. పూర్తయ్యింది. ఉద్యోగం కంటే బిజినెస్ చేయడం ఇష్టం అంటున్నాడు. రెండు మూడు చెప్పాడు. అందులో జ్యూట్ బ్యాగ్స్ తయారీ ఒకటి. అదీ మనవూర్లో అయితే మంచిదట. ఈ మధ్య ప్లాస్టిక్ లో కొన్నిరకాల బ్యాగ్స్ బ్యాన్ చేస్తున్నారు కదా. 2022 జూలై ఒకటవ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ లో కూడా వాడకూడదంటున్నారు. అందుకని జ్యూట్ బ్యాగ్స్ కు డిమాండ్ ఉంటుందనిపిస్తోంది. "


“చాలారోజులనుంచీ ఈ విషయం విక్రాంత్ చెపుతూనే ఉన్నాడుగా. ఆవిష్కరణకు అవసరాలే ప్రధాన మూలమట. మన అవసరం కోసం జ్యూట్ బ్యాగ్స్ సాధారణ జీవితంలోకి ప్రవేశిస్తున్నాయి. సరే కానీయండి. వాడు తృప్తిగా పనిచేసుకుంటానంటే మనం అడ్డు రావడమెందుకు?” అన్నాడు వాళ్ళ నాన్న రత్నమయ్య.


"అవునట. ప్లాస్టిక్ కవర్స్ తిని అవి జీర్ణమవక గోపాలరెడ్డి వాళ్ళ ఆవు మొన్న చనిపోయింది రా. భూమిలో కరగనందువల్ల వర్షపు నీళ్ళు భూమిలో ఇంకి పోవడం లేదట. అందువల్ల నీటి సమస్య కూడా వస్తోందట" అంది రాజేశ్వరి. "నాన్నమ్మా, నీక్కూడా చాలావిషయాలు తెలుస్తున్నాయి. నువ్వు చెప్పింది నిజం. క్యాన్సర్ వచ్చేదానికి కూడా ప్లాస్టిక్ కారణమవుతుందట" విక్రాంత్ చెప్పాడు.


"అవును అత్తయ్యా, ఈకారణాల వల్లే, ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి ప్రత్యామ్నాయంగా జ్యూట్ బ్యాగ్స్ ను వాడుతున్నారు. అందుకని జ్యూట్ బ్యాగ్స్ తయారు చేసే దానికి ఇక్కడ చిన్న పరిశ్రమను పెట్టాలని విక్రాంత్ అలోచన. ఈ మధ్య బట్టల షాప్ వాళ్ళు కూడా ప్లాస్టిక్ కవర్స్ మానేసి జ్యూట్ బాగ్స్ ఇస్తున్నారు. " అంది విజయ. ఇంతలో రాజేశ్వరి ఇంట్లోకి తొంగి చూస్తూ "భోజనాలు సిద్దమేనా జయంతీ" అంది.


"ఆ.. పూర్తయ్యింది అమ్మమ్మా" అని జయంతి గొంతు వినపడింది.


"ఎవరమ్మా, లోపల?" విక్రమ్ అడిగాడు.


“మన రామయ్య గారి సావిత్రమ్మ పిన్ని కూతురి కూతురు. వివరాలు మళ్ళీ మాట్లాడుకుందాం. భోజనానికీ లేవండి" అని రాజేశ్వరి కూడా లేచింది. అందరూ కూడా ఆమెను అనుసరించారు.


విక్రమ్ కర్నూల్ లో ఎం. బి. బి. ఎస్. చదివి, హైదరాబాద్ లో ఎం. ఎస్. చేసి, అమెరికా వెళ్ళాడు. రాజేశ్వరి అన్నకూతుర్నే కోడలిగా చేసుకున్నారు. అమెరికా లో గ్రీన్ కార్డు తీసుకోకుండా విక్రాంత్ కు పది సంవత్సరాలప్పుడు ఇండియాకు వచ్చేశారు. అప్పటికి కూతురు విరూపకు ఏడు సంవత్సరాలు. ఆ అమ్మాయి ఇప్పుడు అమెరికా లో ఎం. ఎస్. చేస్తోంది. ఇండియా వచ్చి, తల్లి తండ్రులకు దగ్గరగా నంద్యాల లోనే శ్రీనివాసనగర్లో మూడంతస్థుల బిల్డింగ్ లో అత్యాధునిక వసతులు ఏర్పాటు చేసుకొని ప్రైవేటుగా నర్సింగ్ హోమ్ ను తమ ఇంటి పక్కన ఏర్పాటు చేసుకున్నాడు. తన స్వగ్రామం వాళ్ళకు ఫీజ్ కూడా తక్కువ తీసుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటున్నాడు.


రత్నమయ్యకు అన్నదమ్ములు లేరు. మంచి ఆస్తి ఉంది. పొలాలు, ఎద్దుల సేద్యం, బర్రెల పాడి, చేసేందుకు జీతగాళ్ళు, చేస్తున్న పోస్టుమాస్టర్ ఉద్యోగం. చదివింది చిన్న చదువే అయినా పేపరు చదవడం, టి. వి. లోవార్తలు వినడం చేయడం వల్ల విజ్ఞానాన్ని పెంచుకుంటూ, వ్యవసాయ శాఖ అధికారుల సహాయంతో పంటలు చక్కగా పండించుకుంటూ, ఊర్లో మేడమిద్దె లో కావలసిన వసతులన్నీ తానూ, కొడుకు కలిసి ఆలోచించి ఏర్పాటు చేసుకొని, రాజేశ్వరికి పనికి సహాయంగా ఇద్దరు మనుషులను ఏర్పాటు చేసి, హాయిగా పల్లెటూరి గాలి పీల్చుకుంటూ ఉన్నారు. రాజేశ్వరి కూడా ఇంటిని, పనివాళ్లను మేనేజ్ చేస్కుంటూ, స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్ చూసుకుంటూ, చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటుంది.


నంద్యాలకు కోడూరు ఐదుకిలోమీటర్లు దూరం. గంటకో బస్సు సౌకర్యం. ఊర్లో ఎవ్వరికీ ఆసుపత్రి సౌకర్యం కావాలని అనిపించేది కాదు. ఇంతవరకూ ఊర్లో ఎవరికీ పెద్దగా అత్యవసరమైన ఆరోగ్య సమస్యలు రాలేదు. అందువల్ల కూడా విక్రమ్ ఇక్కడ హాస్పిటల్ పెట్టలేదు. అందరూ ఇంటికి కావలసిన సరుకులు, బట్టలూ అన్నీ రోజూ నంద్యాల లో కొనుక్కునేవారు. పెద్ద చెరువు వల్ల ముక్కారు పంటలు పండేవి. సస్యశ్యామలమైన ఊరు. అందువల్లే అందరూ కలిసి నంద్యాలలో ఉండాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చినా, అనవసరమని అనుకునే వాళ్ళు. ఎవరికి చూడాలనిపించినా, ఇరవై నిముషాల ప్రయాణమే కనుక ఎవరూ ఆ విషయం ఆలోచించలేదు.


రత్నమయ్య జీపు లో పొలానికి వెళ్ళి వచ్చేవాడు. కూలి వాళ్ళకు మంచి సలహాలిచ్చి పని చేయించుకునేవాడు. చిన్నప్పటినుంచీ వున్న ఊరు. ఇక్కడినుండి వెళ్లాలని పించదు. అందులోనూ ఇంకా యాభై నాలుగేళ్ళే కనుక ఆరోగ్య సమస్యలు లేవు. రాజేశ్వరి చిన్నకోడూరులో ఉన్న అతని మేనమామ కూతురే. అందువల్ల ఐదోక్లాస్ చదివిన రాజేశ్వరికి కూడా నంద్యాలలో సినిమా చూడడటం వరకే ఇష్టం తప్ప తమ ఊరు విడిచి వెళ్ళాలని అనుకోదు. ఊర్లో కూడా గతంలో బాగా బతికి ఇప్పుడు బీదతనం లో ఉన్న వాళ్ళకు ఏదో ఒక పని కల్పించి, పని చేయించి డబ్బిచ్చి ఆదుకునేది.


అలాంటిదే ఇప్పుడు జయంతి సంగతి. రామయ్య వాళ్ళు కొంచెం మధ్యతరగతి వాళ్ళే. కొంచెం పొలం ఉంది. పురోహిత్యం ఉంది. ఆయనకు నలుగురు కూతుళ్ళు. మగపిల్లల కోసం చూస్తే, ఈ నలుగురి చదువులు, వాళ్లకు తగ్గ సంబంధాల కోసం పొలాలమ్మి పెళ్ళిళ్ళు చేయడంతో ఆస్తికాస్తా హారతి కర్పూరం అయ్యింది. వాళ్ళచివరి కూతురు జానకి విక్రమ్ కు క్లాస్ మేట్. వాళ్ళమ్మ సావిత్రి చివరి కూతురు జానకిని బాగా చదివించాలని ఆరాటపడేది. ఇంటర్ వరకూ జానకి విక్రమ్ తో పాటు నంద్యాలలోనే చదివింది. విక్రమ్ కర్నూల్ కు వెళ్ళాడు. జానకి డిగ్రీ నంద్యాల పి. ఎస్. సి. అండ్ కె. వి. ఎస్. సి. కాలేజీ లోనే చదివింది.


డిగ్రీ తరువాత పెళ్ళి చేసేటప్పుడు డిగ్రీ చదివిన పెళ్ళికొడుకును వెదకవలసి రావడం ఇబ్బంది అయ్యింది. పదో తరగతి చదివిన వాడు పదివేలు అడుగుతున్నాడు కట్నం. అప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ లో పని చేసే జయకర్ తో రత్నమయ్య చేసిన ఆర్ధిక సహాయంతోనే చాలా వయసు వచ్చిన తరువాత జానకికి పెళ్ళి చేశారు. కానీ నాలుగు సంవత్సరాలకే అతను చనిపోవడంతో అత్తవారింటి వాళ్ళు సరిగా చూడక, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కూతురు జయంతిని, ఇద్దరు మగపిల్లలను పెంచుకుంది. అంతలో మొన్న కరోనాటైంలో జానకి చనిపోయింది.


ఇక్కడ రామయ్యకు పక్షవాతం రావడంతో సావిత్రమ్మ ఒంటరిదయ్యింది. అందుకే నెల క్రితం జయంతి తన తమ్ముళ్ళిద్దరినీ తీసుకొని ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు వాళ్ళకు పొలాలేమీ లేవు. జయంతి సాయంత్రం పిల్లలకు ట్యూషన్స్ చెపుతూ, ఉదయం రాజేశ్వరికి సహాయం చేస్తూ ఉంటోంది. సావిత్రికి వచ్చే ఓల్డేజ్ పెన్షన్ తో, రేషన్ సరుకులతో కాలం గడుపుతున్నారు. రాజేశ్వరి కూరగాయలు లాంటివి ఏదైనా సహాయం చేస్తుంటే, “ఎందుకక్కా, ఉన్నవి సర్దుకుంటాంలే, ” అనేది సావిత్రి. “ఏం ఫరవాలేదు. చేలోవేలే” అని ఇస్తూఉండేది రాజేశ్వరి.


మధ్యాహ్నం మనవడికి మాగాయ, మీగడ పెరుగుతో అన్నం పెడుతూ.. “సాయంత్రం తాతయ్య గారింటికి కూడా వెళ్ళొస్తారా? వాళ్ళు కూడా నిన్ను చూడాలని ఎదురుచూస్తూ ఉంటారు. అమ్మ కూడా వాళ్ళమ్మను చూడటానికి వస్తుంది” అని రాజేశ్వరి మనవనితో అంటూ, విజయ వైపు చూసింది చిన్న కోడూరు కు వెళ్ళి రండన్నట్లు.


“నువ్వు కూడా రా అత్తయ్యా, అందరం కలిసి వెళదాం” అంది విజయ.


“నేను పోయిన వారం వెళ్ళొచ్చాలే. జయంతి తో రాత్రికి నూనెవంకాయ, జొన్నరొట్టె చేయిస్తాను విక్రాంత్ కు” అంది రాజేశ్వరి.


“రొట్టె లోకి మీగడ కుడా తీసిపెట్టాను ఈరోజుది” అంది మళ్ళీ.


“అయితే త్వరగా వచ్చేస్తాము” అని విక్రాంత్ నవ్వాడు.


జయంతి అందరికీ చక్కగా వడ్డించింది. కాకరకాయ కూర నూనె ఎక్కువ వెయ్యకుండానే, చేదు లేకుండా చేసింది. అందరికీ బాగా నచ్చింది.


“జయంతీ, నువ్వు కూడా తినేసి, కూరలు ఇంటికి తీసుకెళ్ళు” అంది రాజేశ్వరి. జయంతి మొహమాటంగా తల ఊపింది.


ఈ పాపను కొంచెం చిన్న వయసులో విక్రమ్ కు, విజయ కు చూసిన గుర్తుంది, జానకి తో పాటు పండుగలకు వచ్చినప్పుడు. ఇప్పుడు పెద్దవయసులో బాగా పేదరికంగా కనపడుతోంది. బట్టలు మాత్రం రాజేశ్వరి దయవల్ల మంచివి వేసుకుంటోంది, అనుకున్నారు. వారం క్రితం రత్నమయ్య జయంతి తమ్ముళ్ళ గురించి సచివాలయం దగ్గర కనపడ్డ కోమిటి శెట్టి రమణయ్య తోనూ, హెడ్మాస్టర్ గారితోను మాట్లాడాడు. రామయ్య గారిని గుర్తుపెట్టుకొని, సావిత్రమ్మ కష్టాన్ని మనం గమనించాలని మాట్లాడుకున్నారు. ఆడపిల్ల కాబట్టి జయంతి భోజనం, బట్టలు తనే చూస్తానన్నారు.


ఇద్దరు మగపిల్లలకు చెరి నాలుగు జతల బట్టలు తెచ్చి ఇస్తానని కోమిటిశెట్టి చెప్పాడు. హెడ్ మాస్టర్ గారు పిల్లలిద్దరూ నైన్త్, టెన్త్ కనుక జాగర్తగా చదువు చెప్పే పని చూస్తాననీ, మిగతా సార్లకు కూడా చెప్తాననీ చెప్పారు. కోవిడ్ వల్ల జరిగిన అభ్యసన నష్టాన్ని పూరించుకోవాలిగా మరి. పుస్తకాలను సగం రేట్ కు అమ్ముతానని చెప్పిన ధనుష్ తో, ఇప్పుడే కాదు..ఎప్పుడూ పుస్తకాలు అమ్మవద్దనీ ‘విద్యాదానం ఎంతో గొప్పదనీ నచ్చచెప్పి, ఆ మగపిల్లలకు పుస్తకాలు ఇప్పించారు.


రేషన్ షాప్ డీలర్ తో కూడా ఒక మాట చెప్పాడు. అతను వాళ్ళ పేర్లు వ్రాసుకున్నాడు. సాయంత్రం కార్డు తెప్పించి కార్డులో ముగ్గురు పిల్లల పేర్లు ఎంటర్ చేశాడు. ప్రెసిడెంట్ గారితో చెప్పి, రేపు వారం దేవాలయానికి సున్నం వేసేటప్పుడు వాళ్ళ ఇంటికి సున్నం వేయించమని చెప్పాడు. ఈ వివరాలన్నీ జయంతి ఇంటికి వెళ్ళిన తరువాత రాజేశ్వరి, రత్నమయ్యలు వివరంగా చెప్పారు.

===================================================================

ఇంకా ఉంది...

============================================================

కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : నా పేరు K. లక్ష్మీ శైలజ.

నెల్లూరు లో ఉంటాను.

నేను ఎం. ఏ. ఎం.ఫిల్ చేశాను.

ఇప్పటి వరకు 40 కథలు , పది కవితలు ప్రచురితమైనవి.

జూన్ 2022 న తానా గేయతరంగాలు లో గేయం రచించి పాడటమైనది.

యూట్యూబ్ లో కథలు చదవడం ఇష్టం.
36 views0 comments

Comments


bottom of page