top of page

స్ఫూర్తి కిరీటాలు 2


'Spurthi Kiritalu2/3' - New Telugu Story Written By K. Lakshmi Sailaja

'స్ఫూర్తి కిరీటాలు 2/3' తెలుగు పెద్ద కథ రెండవ భాగం

రచన: కే. లక్ష్మీ శైలజ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


జరిగిన కథ:


ఎం. బి. బి. ఎస్. చదివి అమెరికా వెళ్లిన విక్రమ్ తిరిగి ఇండియా వచ్చి స్థిరపడతాడు.

అతని కొడుకు విక్రాంత్ అమెరికాలో p. hd. పూర్తి చేసి ఇండియాలో పరిశ్రమ స్థాపించాలనే ఆశయంతో వస్తాడు.


ఇక స్ఫూర్తి కిరీటాలు 2 చదవండి..


చిన్న కోడూరుకు పదినిముషాల్లో చేరుకున్నారు విక్రాంత్ వాళ్ళు.


“అమ్మమ్మా హాల్ లోనే ఈ ఆవులు బర్రెలు ఎందుకూ? గాడిపాట్లు గడ్డీ పేడ వంటిట్లోకి వాసన కదా” అన్నాడు విక్రాంత్.. హాల్ లోనుండి వంటిట్లోకి రెండు మెట్లు ఎక్కి లోపలికి వెళుతూ.


“అలవాటయ్యిందిరా. అయినా ఇది రాయలసీమ సంప్రదాయం, పశువులను కూడా ఇంట్లోనే కట్టేసుకోవడం. మీరు ఆవులను బయట కుక్కలను ఇంట్లో కట్టేసుకుంటారు. మేము ఆవులను ఇంట్లో కుక్కలను బయట కట్టేసుకుంటాము ” అన్నాడు తమాషాగా వాళ్ళ తాతయ్య సీతారామయ్య.

నిజమే కదా అనుకొని నవ్వారందరూ. అమ్మమ్మ సీతమ్మ వచ్చి బఱ్ఱె ఈనిందని మిరియాలపొడి వేసిన జున్ను తెచ్చి ఇచ్చింది ప్లేట్ లో.


సీతారామయ్య వాళ్ళ అమ్మ తొంభై రెండు సంవత్సరాలున్నా కర్ర పట్టుకొని నెమ్మదిగా ఇంట్లో తిరుగుతూ ఉంది. ‘ఎప్పుడైనా కరెంటు పోతే వంటిట్లో ఒక్క లైట్ అయినా వెయ్యి నాయనా పాలు పొయ్యి మీద ఉన్నాయి. పొంగుతాయి’ అంటూ ఉండేదట ఆమె.


అది గుర్తొచ్చి ’ఇప్పుడు ఒక్కలైటయినా వెయ్యమంటున్నావా పెద్దమ్మమ్మా ?.. కరెంట్ పోతే” అన్నాడు విక్రాంత్ నవ్వుతూ.


“పోరా దొంగభడవా” అందామె నవ్వుతూ.


“అయినా 90 సంవత్సరాలు వచ్చాయి కదా! నీ ఆరోగ్య రహస్యమేమిటి తల్లీ? “అన్నాడు సరదాగా మళ్ళీ.


“ఏమీ లేదు. నేను ఒక్క మాత్ర కూడా మింగను. నీళ్ళే కదా అని తీసిపారెయ్యకుండా ప్రతి రోజు ఉదయాన్నే రెండు గ్లాసుల గోరు వెచ్చని నీళ్ళు తాగుతాను. మలబద్హకం లేకుండా తిన్నది జీర్ణమవుతుంది. అంతకంటే ఇంకేమి కావాలి?” అందామె.


నిజమే కదా అనుకున్నారు అందరూ. ఇంతలో పొలంనుండి కూరగాయలు పని వాళ్ళతో కోయించి బస్తాలు కట్టించి ట్రాక్టర్లో తీసుకొని ఇంటికి వచ్చారు జనార్దన్ శాంతలు.


“మామయ్యా ఇవన్నీ నంద్యాలకా?” అన్నాడు విక్రాంత్.


"అవున్రా. రాత్రి బస్సుకు మార్కెట్ కు వేసి పంపుతే రేపు అమ్ముతారు’ అన్నాడు జనార్దన్.


“వదిన అటికమామిడాకు కావాలంది తెచ్చాను. వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళు విజయా ” అంది కూతురితో శాంత.


వాళ్ళ కొడుకు శ్రవణ్ నంద్యాల లో కోర్ట్ లో పని చేస్తున్నాడు. అప్పుడే బండిలో వచ్చాడు. విక్రాంత్ శ్రవణ్ కొద్దిసేపు వూర్లో ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకున్నారు.


జ్యూట్ బాగ్స్ తయారుచేసే ఆలోచనను చెప్తే “తప్పకుండా పెట్టు బావా. మంచి లాభముంటుంది. రెండో శనివారం నేను మీఇంటికి వస్తాను. ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఆలోచిద్దాము. అప్ప్లయ్ చెయ్యడం పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలి అన్నీ చూద్దాము ” అన్నాడు శ్రవణ్.


“అలాగే” అన్నాడు విక్రాంత్.


వాళ్ళ కూతురు స్రవంతి కర్నూల్లో ఎమ్మెస్సీ ఫిజిక్స్ చేస్తోంది. ఆ అమ్మాయితో వీడియో కాల్ లో మాట్లాడారు. కాఫీలు తాగి అరిసెలు తిన్నారు.


“అమ్మమ్మా! నీ నేతి అరిసెలు రెండు తింటే కడుపు నిండి పోతుంది ” అన్నాడు విక్రమ్ సీతమ్మతో.

“అత్తయ్య చేసినంత బాగా అరిసెల పాకం పట్టడం మాకు రాదన్నయ్యా” అంది శాంత.


రాత్రికి తిరిగి ముగ్గురూ పెద్ద కోడూరుకు వచ్చారు. జొన్న రొట్టెలు తిన్నారు. ‘పెరుగులో చక్కర వేసి ఇవ్వమ’న్నాడు విక్రాంత్.


‘రాత్రి పూట పెరుగు తినకూడ’దన్నాడు రత్నమయ్య.


‘మజ్జిగలో కొంచెం శొంఠిపొడి గానీ సైన్ధవ లవణం గానీ వేసుకొని తాగితే మంచిది’ అని రాజేశ్వరి అందరికీ మజ్జిగ కలిపి ఇచ్చింది.


జయంతి పని అయిన తరువాత కొద్దిసేపు కంప్యూటర్ వర్క్ చెయ్యడం గమనించాడు విక్రాంత్. అంటే ‘ఏదైనా ఉద్యోగం చెయ్యగలదు’ అనుకుంటూ ‘తాతయ్య లాప్టాప్ కూడా వాడుకోవడానికి ఇచ్చారంటే బాగా నమ్మకమన్నమాట ’ అనుకున్నాడు.


తెల్లవారి చీకట్లోనే నంద్యాలకు వచ్చేశారు. సన్నగా వర్షం పడుతోంది. శ్రావణ మాసం లో వర్ష ఋతువు కనుక పేరంటాలకు వెళ్ళే ఆడవాళ్ళు పట్టు చీరలు తడవకుండా ఎంతో జాగర్తగా నడవడం సరదాగా ఉంటుంది. ఉతికిన బట్టలు బైట తీగల మీద ఆరవెయ్యగానే వర్షం రావడం పరుగెత్తి కెళ్ళి బట్టలు తెచ్చుకోవడం అటు సంతోషం ఇటు కష్టం అనుకుంది విజయ.

ఎక్కువ వర్షం వస్తే చిన్నప్పుడు నంద్యాలకు కోడూరు కు మధ్యన ఉండే చామ కాలువ పొంగేది. బస్సులు ఆగిపోయ్యేవి. ఇప్పుడు కొత్తగా బ్రిడ్జి కట్టారు కనుక ఆ ఇబ్బంది లేదు.


ఆరోజు గూగుల్ లో సెర్చ్ చేసి ఫ్యాక్టరీకి స్థలం ఎంత కావాలి బిల్డింగ్ ఎంత ఉండాలి ట్రాన్స్పోర్ట్ మిషనరీ గురించి కొంత సమాచారాన్ని తెలుసుకున్నాడు. ఫ్రెండ్స్ తో మాట్లాడి ఏ కాలం లో ముడి సరుకు కొనాలి మార్కెటింగ్ ఎలా? అనేవి సేకరించుకున్నాడు. బ్యాంకు లోన్ గురించి విక్రమ్ కనుక్కున్నాడు. లేబర్ ఎంతమందిని తీసుకోవాలి. ఎన్ని రోజుల తరువాత వారిని పెంచాలి అనే వివరాలు తెలుసుకున్నాడు.


మళ్ళీ రెండు రోజులకు విక్రాంత్ ఒక్కడే కోడూరుకు వచ్చాడు. రత్నమయ్య పెద్దకోడూరు నుంచి ఈర్నపాడుకు పొయ్యే రోడ్ పక్కన ఉన్న తమ స్థలమైతే బావుంటుందన్నారు. అందుకని వెళ్ళి ఆ స్థలం చూసి వచ్చారు. రెండు సంవత్సరాల క్రితం ఒక బిల్డింగ్ కట్టి అక్కడ కూలి వాళ్ళతో వేరుశెనక్కాయలు వలడం లాంటి పనులు చేయించేవాళ్ళు. ఇప్పుడు ఖాళీగా వుంది. వదిలిపెట్టేశారు. పక్కనే ఇంకొక రేకుల షెడ్ కుడా వెయ్యవలసి ఉంటుంది. కూలీలు కుడా ఊరికి దగ్గరే కనుక సులభంగా త్వరగా రాగలుగుతారు. రోడ్ పక్కనే కనుక ట్రాన్స్పోర్ట్ ఈజీ గా ఉంటుంది.


వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి రాజేశ్వరి గడప తట్టుకొని కాలి బొటనవేలు మడత పడి సున్నం బెల్లం పట్టు వేసుకొని పడుకొని వుంది. ‘నాన్న దగ్గరకు వెళదామా’ అంటే రేపటికంతా తగ్గిపోతుందిలే అన్నది. జయంతి ఆమెకు కావలసిన సహాయం చేస్తోంది. వీళ్ళు రాగానే జయంతి అందరికీ కాఫీ తెచ్చి ఇచ్చింది. జయంతి పెద్దవాళ్ళు కట్టుకునే చీర కట్టుకొని వుంది. వెళ్ళేటప్పుడు చీర తట్టుకొని పడబోయింది. “ఆ.. ఆ.. జాగర్త” అంది రాజేశ్వరి. జయంతి లోపలికి వెళ్ళిపోయింది.


జయంతి లోపలకు వెళ్ళిన తరువాత “జయంతి ఏం చదివింది నాన్నమ్మా” అన్నాడు విక్రాంత్.


“బి. సి. ఎ. చదివిందట” అనగానే విక్రమ్ కొక ఆలోచన వచ్చింది.


మళ్ళీ “అమ్మాయికి నేను ఇంట్లోవున్న రెండు జతల బట్టలు ఇచ్చాను. కానీ చాలటం లేదు పాపం. వర్షాలు కదా! ఆరినట్టులేదు. అందుకే వాళ్ళమ్మమ్మ చీర కట్టుకుంది” అంది రాజేశ్వరి.


విక్రాంత్ సాలోచనగా “మరి మనం కొనలేమా?” అన్నాడు.


“జయంతి రాగానే పరిస్థితి గమనించి విజయకు ఫోన్ చేశాలే. అమ్మాయికి డ్రెస్సెస్ కొని తెలిసిన వాళ్ళతో బస్సు లో పంపమని. పది గంటలకు షాప్ కెళ్ళి పంపిస్తానంది. బహుశా ఇప్పుడొచ్చే బస్సులో వస్తాయి” అంది రాజేశ్వరి.


మాటల్లోనే రెడ్డిగారి పాలేరు రెండు పెద్ద బిగ్ షాపర్స్ తీసుకొచ్చి ఇచ్చాడు. పెద్దవాళ్ళు కట్టుకునే నేత చీరలు రెండు, రెండు కాస్ట్లీ డ్రెస్సెస్ కుడా ఉన్నాయి అందులో, ఒక అరడజన్ మామూలు డ్రెస్సెస్ తో పాటుగా.


రాజేశ్వరి జయంతిని పిలిచి జయంతి రాగానే “జయంతీ ఇదుగో ఈ బ్యాగ్ లో డ్రెస్సులు విజయ పంపింది. నీకోసమే. తీసుకో” అంది.


కానీ జయంతి మొహమాటపడింది “వద్దండీ” అంటూ.


అప్పుడు రత్నమయ్య “జయంతీ నువ్వు ఈ ఇంట్లో స్వంత మనిషి లాగా ఉండొచ్చు. కొత్తగా ఫీల్ అవ్వకు. నువ్వు మాకు కావలసిన పనులు స్వతంత్రంగా చేసినట్లే మేము నిన్ను మా స్వంతపిల్లగా చూస్తున్నాము” అని నచ్చచెప్పాడు.


ఇంతలో విక్రాంత్ “నా జ్యూట్ ఫ్యాక్టరీ లో అకౌంటెంట్ గా చేయడం మీ కిష్టమైతే చేరండి. ” అన్నాడు.


”ఇంకేం. శుభం. జయంతీ! ఈ రోజు వెంటనే రవ్వలడ్డులు చేసి నోరు తీపు చెయ్యి” అంది రాజేశ్వరి సంతోషంగా.


జయంతి నమ్మలేనట్లుగా చూసింది.


“అవునండీ. అప్పోయింట్మెంట్ లెటర్ తీసుకున్నప్పటి నుంచీ మీరు పనిమొదలుపెట్టి ఖర్చులన్నీ వ్రాయండి. కొద్దిరోజులు ఇంటి నుంచే” విక్రాంత్ చెప్పాడు.


“మంచి పని విక్రాంత్. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అప్పాయింట్మెంట్ పని మొదలయ్యింది” అన్నారు రత్నమయ్య నవ్వుతూ.


జయంతి మౌనంగా కొద్దిసేపు నిలబడి తరువాత పెద్దవాళ్ళకిద్దరికీ కాళ్ళకు నమస్కారం చేసి లోపలకు వెళ్ళింది.


జయంతి ఆ బట్టలు ఇంటికి తీసుకొని వెళ్ళిన తరువాత వాళ్ళ అమ్మమ్మ చీరలు నీళ్ళల్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి కొద్దిసేపు నానబెట్టి మళ్ళీ వేరే నీళ్ళల్లో పిండి ఆరవేసింది.


అది చూసి జయంతి పెద్ద తమ్ముడు చైతన్య “ఎందుకక్కా కొత్త వాటిని పిండుతున్నావు? “ అని అడిగాడు.


“ఉప్పువేస్తే రంగులు వదలవు. నేతబట్టలు నేసేటప్పుడు దారానికి గంజి పట్టిస్తారు. అందుకని నేతచీరలకు సన్న పురుగులు ఉండే అవకాశముంది. పసుపువేసి పిండుకుంటే అవి చచ్చిపోతాయి. అందుకని ఇలా చేస్తాము “ అంది జయంతి.


జేనాన్నతో తాను గూగుల్ లో చూసిన విషయాలు చర్చించి పూజారిని పిలిచి మంచి రోజు చెప్తే కాగితాల మీద పని మొదలు పెడతామని చెప్పాడు విక్రాంత్. వరలక్ష్మీ వ్రతానికి అందరూ కలుస్తారు కనుక ఆ టైములో ముహూర్తం చూస్తే బాగుంటుందనుకున్నారు. రెండ్రోజుల్లో రాజేశ్వరి కాలు బాగాఅయ్యి నెమ్మదిగా నడిచేసింది. విజయ విక్రమ్ వచ్చి చూసి వెళ్లారు. జయంతి అమ్మవారి అలంకరణకు కావలసినవి తెప్పించి చక్కగా అలంకరణ చేసింది.


విక్రమ్ చెల్లెలు సుశీల భర్త సుమంత్ వాళ్ళ కొడుకు సుశాంత్ కూడా వచ్చారు కడప నుండి. సుశాంత్ బి. టెక్ ఆ సంవత్సరమే పూర్తి చేశాడు. ‘సుశాంత్ కు ఫ్యాక్టరీ లో స్టోర్ కీపర్ ఇంఛార్జి ఇద్దామ’ని రత్నమ్మయ్య చెప్పగానే ‘ఒకే’ అన్నాడు విక్రాంత్. స్వంత వాళ్ళు ఉంటే మంచిది అన్న ఉద్దేశ్యం తో రత్నమయ్య చెప్తే అంతా యువత అయితే వర్క్ బాగా జరుగుతుందని విక్రాంత్ కూడా సరే అన్నాడు. సుశాంత్ తో సహా వాళ్ళ అమ్మా నాన్నలు సంతోషించారు. జనార్దన్ సీతమ్మ శాంత స్రవంతి లు వచ్చారు. రాజేశ్వరి వాళ్ళ నాన్నమ్మ వైకుంఠమ్మ కూడా వచ్చింది.


ఆడవాళ్ళందరూ చక్కాగా పూజచేసి పాటలు పాడి తోరణాలు కట్టుకొని కుడుముల వాయినాలు తీసుకున్నారు. సుశీలకు నెమలి డిజైన్ ఉన్న కమ్మలు తెచ్చాడు విక్రమ్. కమ్మకున్న గొట్టం పెద్దగానూ సుశీల చెవి తమ్మెరంధ్రం చిన్నగానూ ఉండటం తో చెవిలో పట్టడం కష్టమయ్యింది.


“ఒక నాలుగు రోజులు సన్నని వేప పుల్లను చెవులకు పెట్టుకోమ్మా రంధ్రం పెద్దగయ్యి కమ్మ సులభంగా పడుతుంది ” అంది వైకుంఠమ్మ. జయంతి ఇంట్లో మనిషి లాగా అన్ని పనులు చేస్తూ ఉండటం చూశారందరూ.


అప్పుడే పూజారి ఒకవారం లో ముహూర్తం పెట్టాడు జ్యూట్ బాగ్స్ ఫ్యాక్టరీ పనులు మొదలు పెట్టడానికి. పూజారికి దక్షిణ ఇచ్చి నమస్కారం చేశాడు విక్రాంత్.


ఒకరోజు రెండు కార్లల్లో అందరూ నంద్యాల పక్కన నల్లమల అడవిలో కొండల్లో ఉండే మహానందికి వెళ్ళొచ్చారు. సీతారామయ్య సుశాంత్ కు మహానంది విశిష్టతను ఇలా వివరించారు. ‘ఇక్కడ కోనేట్లో నంది నోట్లో నుంచి వచ్చే జలధార ఎక్కడో కొండల్లో నుండి కనపకుండా నిత్యమూ వస్తూనే వుంటుందట. కోనేట్లో నీరు స్వచ్ఛంగా ఉండి అడుగున ఉన్న చిన్న రాయైనా కనపడుతూ ఉంది.


శివలింగంమీద ఆవుగిట్టలు కూడా కనిపిస్తాయి. చిన్నప్పుడు నంద్యాలలో నంద్యాల చుట్టుపట్ల ఉండే నవ నందులనూ శివరాత్రికి చూసి వచ్చేవాళ్ళం. నంద్యాల చుట్టూ ఇన్ని నందులు ఉండటం వల్ల ఇంగ్లీష్ వాళ్ళు ‘నందిఆల్’ అని పిలిస్తే అది కాల క్రమేణా నంద్యాల అయ్యిందట. ’ అంతా విని అక్కడ చూసి సుశాంత్ వాళ్ళ నాన్న సుమంత్ చాలా సంతోష పడ్డారు.


తరువాత ఫ్యాక్టరీ కి అప్లై చెయ్యడం స్టాక్ కు అడ్వాన్స్ ఇవ్వడం కూలీలను నియమించుకోవడం ఇలాంటి పనులతో బిజీగా సరిపోయింది. రత్నమయ్య ఫ్యాక్టరీకి అనుకున్న స్థలం లో ఉన్న బిల్డింగ్ కాక ఇంకొక పొడవాటి షెడ్ పక్కన భోజనాలకు ఆఫీసుకు రూములు కట్టించడం చేస్తున్నారు. వాచ్ మెన్ గా ఊర్లో ఉండే గొల్ల పుల్లయ్య ను ఏర్పాటు చేశారు. కొన్ని తరాలుగా నమ్మకంగా పొలం దగ్గర కాపలాగా ఉన్నకుటుంబమది. ఈ వర్క్ కు సంబంధించిన ఫైనాన్స్ మేటర్ కు అంతా జయంతి లెక్కలు తయారు చేస్తోంది. అద్ధం లాంటి ఆ రిపోర్ట్ మెయిల్ లో పెట్టగానే దాన్ని బట్టి ఎక్కువ తక్కువలు జేనాన్నా మనవళ్ళు చూసుకుంటున్నారు.


రత్నమయ్య మామూలుగానే బుక్స్ నంద్యాల లైబ్రరీ నుండి తెచ్చుకొని చదువుతూ ఉంటాడు. ఒకసారి విక్రాంత్ అడిగాడు. ‘టి. వి. లో సినిమా చూడకుండా ఎప్పుడూ చదువుకుంటూ ఉంటావెందుకు జేనాన్నా?” అని. “బుక్స్ ఆర్ మై ఫేవరేట్ హీరోస్ “అని చెప్పారాయన. ‘చదువుతూ ఉంటే ఆ కథా దృశ్యాలు కళ్ళ ముందు ఆవిష్కృతమవుతాయి. అప్పుడు నేను లోకాన్నే మరిచి పోతాను ” అని కూడా అన్నారు.


ఫ్యాక్టరీ కి పర్మిషన్ రాగానే ప్రారంభోత్సవం ఘనంగా చేశారు. ప్రారంభోత్సవానికి స్టేట్స్ నుంచి విరూప కూడా వచ్చింది. టెన్ టు ఫైవ్ ఉద్యోగం కాకుండా స్వంతంగా పరిశ్రమ ప్రారంభించడం విరూప కు బాగా నచ్చింది. గడప దగ్గర టెంకాయ కొట్టి హారతి ఇచ్చింది. విరూప కు ఐ ఫోన్ గిఫ్టుగా ఇచ్చాడు విక్రాంత్. “నువ్వు రాగానే నువ్వు కూడా ఇందులో జాయిన్ అయిపో తల్లీ “అన్నారు రత్నమయ్య.

“అలాగే జేనాన్నా “ అంది విరూప.


ఆ తరువాత పనులన్నీ చక చకా జరిగి పొయ్యాయి. ముడి సరుకు తెప్పించి గోడౌన్ లో పెట్టించడం తయారైన బాగ్స్ ను ప్యాక్ చేసి లారీలకు ఎత్తించి కుదుర్చుకున్న కాంటాక్ట్ ప్రకారం సరుకులను గమ్యానికి చేర్పించడం బ్యాంకు లోన్ తీర్చుకోవడం పని వాళ్ళతో సామరస్యంగా ఉండటం అన్నీ అందరూ కలిసి చేస్తూ ఉన్నారు. విక్రాంత్ నిద్రాహారాలు మాని ఫ్యాక్టరీ లోనే గడుపుతున్నాడు.


వేళకు తినకపోతే ఆరోగ్యం చెడిపోతుందని రత్నమయ్య గారు పార్వతి రోజు దగ్గరుండి తినిపించి వస్తున్నారు. మంచి లాభాలు వస్తున్నాయి. ఒక ఆరునెలలకు విక్రాంత్ పక్కన ఇంకో బిల్డింగ్ కట్టి ఇంకా లోన్ తీసుకొని మూడు షిఫ్ట్ లు పని చేయించి ప్రొడక్షన్ పెంచుదామని చెప్పాడు. “అలసిపోతావేమో ” అన్నాడు రత్నమయ్య.


“అలసిపోవడమే కాదు. ఆరునెలలకే ఇంత అభివృద్ధంటే ఇన్కమ్ టాక్స్ విషయం లో ఎక్కువ ఇబ్బందులు రావొచ్చు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇలాంటి ఫ్యాక్టరీ జిల్లాలో వేరేచోట్ల పెట్టొచ్చు. చిన్న పరిశ్రమలు పెద్దపరిశ్రమలవటం మంచిదే కానీ కొంచెం నిదానంగా అంటే ఇంకా వ్యాపారపు మెళుకువలు తెలుసుకోవాలి ముడిసరుకు తక్కువకు తెచ్చుకోవడం ప్రొడక్షన్ లో ఖర్చు తగ్గించుకోవడం వర్కర్స్ ను తృప్తి పరచడం లాంటి వన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ అయితే కొంచెం బాగుంటుందేమో ఆలోచించండి ” అంది జయంతి.

అంత చక్కటి విశ్లేషణ ఇచ్చిన జయంతి నీ ప్రశంసగా చూశాడు విక్రాంత్. నిజమే. తను బిజీ లో పట్టించుకోలేదు కానీ జయంతి ఎంతో శ్రద్ధగా ఫ్యాక్టరీ పనులు గమనిస్తోంది!. నిజంగా ఇంట్లో వాళ్ళ కుండే శ్రధ్ధ పరాయి వాళ్ళకుండదు కదా అనిపించింది. రత్నమయ్య “జయంతి చాలా సేపు లాప్టాప్ లో పని చేస్తూనేవుంటుంది. మనమిచ్చే జీతానికి బయటి వాళ్ళు ఇలా పని చెయ్యరు. అందుకే జయంతికి ఇంట్లో వంట పనికూడా తగ్గించేశాము. పార్వతమ్మను వంటకు రమ్మని చెప్పాము.


స్టాక్ ఎంట్రీలుశ్రద్ధగా చూసుకుంటూ వర్కర్స్ కు జీతాలు వాళ్ళ సెలవులూ చూస్తూ ఎక్కడా పొరపాటు రాకుండా చూస్తోంది. మొన్న’వర్కర్స్ ఎక్కువగానే వున్నారు. ప్రొడక్షన్ పెంచవచ్చు కూడా. బియ్యం బస్తాలే కాకుండా బిగ్ షాపర్స్ చిన్న చేతిసంచులు కూడా చేసేదానికి పర్మిషన్ తీసుకోవచ్చు. నీతో ఒకసారి మాట్లాడమంది ” అని చెప్పాడు.


విక్రాంత్ అప్పుడు ఆలోచించి జేనాన్న తో ఇంకో మాట కూడా చెప్పాడు. స్టాక్ విషయం కొంత సుశాంత్ కు అప్పగిస్తే బాగుంటుందా! అని. జయంతికి పని తగ్గుతుంది. ‘సుశాంత్ మనవాడే కాబట్టి నమ్మకంగా ఉంటాడు’ అని. నాన్నమ్మను కూడా సలహా అడిగి అందరి సమ్మతం తో మర్నాడు సుశాంత్ కు స్టాక్ విషయం అలాట్ చేశాడు.


అది తెలిసి జయంతి “నేనేమైనా తప్పు మాట్లాడానా? ‘ అంది తాతయ్యతో.

“లేదు జయంతీ వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటే మైండ్ సరిగా పనిచేయదు. నువ్వు ఫ్రీగా ఉంటేకదా ఫ్యాక్టరీ లో ఆఫీస్ చక్కగా నడుపగలవు. అందుకని నీ కోసమే అలా చేశాము ” అన్నాడు రత్నమయ్య.


దాంతో సంతృప్తి పడింది జయంతి.

===================================================================

============================================================

కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : నా పేరు K. లక్ష్మీ శైలజ.

నెల్లూరు లో ఉంటాను.

నేను ఎం. ఏ. ఎం.ఫిల్ చేశాను.

ఇప్పటి వరకు 40 కథలు , పది కవితలు ప్రచురితమైనవి.

జూన్ 2022 న తానా గేయతరంగాలు లో గేయం రచించి పాడటమైనది.

యూట్యూబ్ లో కథలు చదవడం ఇష్టం.
30 views0 comments

Comentarios


bottom of page