'Thandre Nayam' - New Telugu Story Written By Padmavathi Divakarla
'తండ్రే నయం' తెలుగు కథ
రచన: పద్మావతి దివాకర్ల
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
చాలా ఏళ్ళ తర్వాత తన స్నేహితుడు శశిధర్ని చూడటానికి ఆ ఊరు వెళ్ళాడు సుధాకర్. తన తండ్రి ఉద్యోగరీత్యా ఆ ఉళ్ళో ఉన్నప్పుడు పదవ తరగతి వరకూ అక్కడ చదువుకున్నాడు సుధాకర్. శశిధర్ అయితే పదవ తరగతితోనే చదువు ఆపేసి ఆ ఊళ్ళోనే తండ్రి వ్యాపారం చూసుకుంటూ స్థిరపడ్డాడు. దాదాపు ఇరవై తర్వాత అక్కడికి వచ్చిన సుధాకర్ ఆ ఊళ్ళో జరిగిన మార్పులకి ఆశ్చర్యపడ్డాడు.
ఒక్కప్పుడు అక్కడుండే పూరి గుడిసెల స్థానంలో పట్టణం మాదిరే పెద్దపెద్ద మాల్స్, సినిమా హాళ్ళు, అపార్ట్మెంట్లు వెలిసాయి. అన్నీ వింతగా చూస్తూ స్నేహితుడితో కలిసి నడుస్తున్న సుధాకర్ ఆ ఊరి మూడు వీధుల కూడలిలో వెలిసిన రాజకీయ నేత నాగభూషణం విగ్రహం చూసి ఆశ్చర్యం చెందాడు. అయితే అతన్ని ఆశ్చర్యపరిచింది ఆ విగ్రహం కాదు. అక్కడ కొంతమంది ఆ విగ్రహానికి చేతులెత్తి దండం పెట్టడం అతన్ని మరింత సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది.
ఎందుకంటే సదరు నేత నాగభూషణం పరమ దుర్మార్గుడు. ఎక్కడ్నుంచో పొట్ట చేతపట్టుకొని ఆ ఊరు వచ్చిన నాగభూషణం చాలా మోసాలకు పాల్పడి కొద్ది రోజులలోనే చాలా సంపాదించాడు. ఆ తర్వాత వడ్డీ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టిన అతను బీదసాదలను దోచుకున్నాడు.
కంట్రాక్టర్గా కూడా అవతారమెత్తి నాసిరకం నిర్మాణాలు చేపట్టి తరతరాలకు సరిపడా సంపాదించాడు. బాగా సంపాదించాక నాగభూషణం దృష్టి రాజకీయాలపై పడింది. అందులో కూడా రాణించి తనా ఊళ్ళో మకుటం లేని మహారాజనిపించుకున్నాడు.
ఆ తర్వాత అతని చేసిన దుర్మార్గాలకి, అక్రమాలకి అంతే లేదు. అలాంటి వ్యక్తికి శిలావిగ్రహం కట్టించడమే కాకుండా, అందరూ దండం పెట్టడం చాలా వింతనిపించింది సుధాకర్కి.
అందుకే తన మిత్రుడ్ని అడిగాడు, "ఇతని విగ్రహం ఇక్కడ ప్రతిష్టించడమే కాక, ప్రతీ వాళ్ళూ దండం పెడుతున్నారు. ఈ తరం వాళ్ళకి బహుశా ఇతని గురించి తెలిసినట్లు లేదు." అన్నాడు.
"అదేం లేదు. అందరికీ ఈ నాగభూషణం గురించి పూర్తిగా తెలుసు. అయితే, ఇతని వారసుడిగా కొడుకు నాగరాజు రాజకీయల్లో ప్రవేశించిన తర్వాత, కొడుకు కన్నా తండ్రే నయమనిపించింది వాళ్ళందరికీ. నాగరాజు మోసాలు, అక్రమాలకే పరిమితం కాలేదు. రాజకీయ హత్యలు కూడా నాగరాజుకి మంచినీళ్ళ ప్రాయం.
అందుకే అందరూ ఇప్పుడు నాగభుషణం తనకి తెలియకుండా చేసిన మంచి పనులు గుర్తుకు తెచ్చుకొని ఆ గౌరవం ఇస్తున్నారు మరి! పైగా కొడుక్కి మంచి బుద్ధులివ్వమని మనసులోనే వేడుకుంటున్నారు కూడా." అన్నాడు శశిధర్ నవ్వుతూ.
విస్తూపోతూ అతణ్ణి చూస్తూ ఉండిపోయాడు సుధాకర్.
***
పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.
Comments