'Amma Leni Puttillu' - New Telugu Story Written By Penumaka Vasantha
'అమ్మ లేని పుట్టిల్లు' తెలుగు కథ
రచన: పెనుమాక వసంత
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"అమ్మ కు బాలేదక్కా! సీరియస్ గా ఉంది." రమ్మని తమ్ముడు కాల్ చేశాడు.
"అదేంటి.. రా నిన్న కూడా మాట్లాడాను, .. ఏమైంది? ముందు నిజం చెప్పు ఎలా ఉంది? అమ్మకు" అని అడిగాను.
"రాత్రి గుండె నొప్పి అంది. వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశాం. ముందు బయలుదేరు అక్కా!” అని సెల్ పెట్టేశాడు శరత్.
వెంటనే జర్మనీ నుండి ఇండియా కు టికెట్ బుక్ చేసుకుని బయలుదేరింది విజయ. ఫ్లైట్ ఎక్కిందే గానీ అమ్మ ఆలోచనలే మది నిండా. అమ్మ నాన్నను పెళ్లి చేసుకుని ఏనాడూ సుఖ పడింది లేదు. ఆయన తాగుడు అలవాటు భరించి ఎపుడూ ఆనందంగా ఉన్నది లేదు. పొలం పనులు చేయిస్తూ ఇంటి బాధ్యతలను నెత్తిన వేసుకుని శ్రమ పడేది.
నాకు అన్నయ్య, తమ్ముడు ఉన్నారు. అన్నయ్య పెళ్ళిచేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు. తమ్ముడు అమ్మ కు చేదోడు వాదోడుగా ఉంటూ డిగ్రీ తో చదువు మానేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు.
నా పెళ్ళికి అన్నయ్య సాయం చేయక పోయినా తమ్ముడు నా పెళ్ళికి అమ్మ తో పాటు కష్టపడ్డాడు. నాన్న అక్షింతలు వేయటం తప్ప ఎటువంటి సాయం ఆయన నుండి లేదు. ఆయన తాగి పెళ్లి లో గొడవ చేయకుండా ఉంటే.. చాలని అమ్మ కోరుకుంది.
ఇలా నా పెళ్లి చేసి కొంచం ఊపిరి పీల్చుకుంది అమ్మ. నాకూ తమ్ముడు కి మాత్రమే తెలుసు! అమ్మ తన పుస్తెలు కుదువ పెట్టీ మా పొలాలకి ఎరువులు, పురుగుమందులు తేవటం.
నాన్న తన తాగుడు కి డబ్బులు ఇవ్వలేదని అమ్మని కొడుతుంటే తమ్ముడు, నేను ఆయన్ని బయటకు పంపే వాళ్ళం.
ఆయన అంత చేసినా ‘నాన్న అన్నానికి ఆగలే’డంటూ అన్నం కలిపి ఆయన నోట్లోపెట్టేది. మనుషుల్ని ప్రేమించటం, అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను.
ఇంట్లో నాన్న తాగుడు, అప్పులు.. ఇవన్నీ చూసి అన్నయ్య ఉద్యోగం చూసుకుని హైదరబాద్ లో స్థిరపడ్డాడు. పండగకి చుట్టంచూపుగా రావటం చేసేవాడు.
‘పెద్దొడా!’ అని అమ్మ ప్రేమగా పిలిస్తే.. ఎక్కడ డబ్బులు అడుగుతుందో లేదా అప్పులు మీద పడతాయనీ ‘ఆ.. ఏంటీ?’ అని అంటి ముట్టనట్లుగా ఉండేవాడు.
మా తమ్ముడు ‘అన్నయ్యను డబ్బులు అడుగుదాం’ అంటే అమ్మ ఊరుకునేది కాదు..
"చిన్నోడా! వాడు భార్య పిల్లలతో సిటీ లో ఎన్ని కష్టాలు పడుతున్నాడో!? వద్దు నాన్నా! వాడిని అడగవద్దు" అనేది.
నా పెళ్లి మా బావతో అవ్వటం వల్ల కొంచం కుదట పడింది అమ్మ. మా అన్నయ్య మీద వదిన చాలా మంచిది.
పెళ్లి ఖర్చులకి అమ్మ కి కొంత మనీ ఇచ్చింది. అపుడు అమ్మ వదిన్ని "నువ్వు నాకు కూతురువి! కోడలివి కాదు" అంటూ కళ్ల నీళ్ళు పెట్టుకొంది.
‘మనందరం ఒకట! అత్తయ్య! దిగులు పడకండ’ని పెళ్లి పనులను నెత్తిన వేసుకుంది వదిన. అలా నాతో పాటు సమానంగా చూసేది వదిన్ని.
తమ్ముడికి పెళ్లి చేస్తే ఇక తన బాధ్యత తీరుతుందని అమ్మ అంటుండేది. తమ్ముడు 'అబ్బా..! అక్క పెళ్లికి చేసిన అప్పులు తీరనీ.. , అమ్మా! నా పెళ్ళికి ఏమి తొందర" అంటాడు.
"ఇంతలో ఏమయ్యింది అమ్మకూ!?" అనుకుంటూ ఇండియా చేరి ఇంటికి వచ్చాను. బయట జనాలు అందరు గుమిగూడుంటే ఏదో లోపల అపశకునం గా అనిపించింది.
నన్ను చూడగానే.. అందరూ “విజయమ్మ.. వచ్చావా! అమ్మ ఇక లేదమ్మా” అని ఏడుస్తున్నారు.
‘ఏంటి మీరు అంటుం’దంటూ లోపలికి వెళ్ళేసరికి అమ్మ వరండాలో పడుకుని ఉంది అదే చిరునవ్వు మొహంతో!
నాన్న ‘వచ్చావా విజ్జి.. మీ అమ్మ ఎంత పని చేసిందో!? చూడూ, నన్ను అన్యాయం చేసి పోయింద’ని ఏడుస్తున్నాడు.
"అమ్మ ఎక్కడికీ పోలేదు. అమ్మా! లేమ్మా” అని నేను ఎంత లేపినా లేవలేదు.
"అక్కా! అమ్మ లేకపోతే నేను బ్రతక”నని గోడకేసి తల కొట్టుకుంటున్నాడు తమ్ముడు.
“తమ్ముడూ! వద్దురా.. నువ్వు లేకపోతే నేను ఉండను రా! అమ్మా.. లేమ్మా! తమ్ముడు నీకోసం తల బాదు కుంటున్నాడు”..
నేను గుండెలు బాదుకుని ఏడ్చినా.. అమ్మ తిరిగి రాలేదుగా!
ఊరి వారందరూ ‘శాంతమ్మ పేరుకు తగ్గట్లే శాంతం గా ఉండేది. ఎపుడూ ఆమెను కోపంతో మేము చూడలేదు. తన పని తను చేసుకుపోతుందే తప్ప ఎవరి విషయాల్లో తల దూర్చదు. చిన్నాడి కి పెళ్లి చేయాలనేది. ఇంతలోకి ఇట్లా అయింది’ అని అమ్మ గూర్చి చెప్పుకుంటుంటే.. నాకు ఏడుపు ఆగటంలేదు.
అమ్మ దినకర్మలు అయ్యాయి. అమ్మకు చిన్న పుస్తకములో ‘ఎవరికి ఎంత ఇవ్వాలి?’ అనే లెక్కలు, ఇంకా ముఖ్యమైన వాటి గూర్చి రాసుకోవటం తెలుసు. ఆ పుస్తకాన్ని ఎపుడూ ఎవరికీ చూపదు.
అమ్మ అలమరా తలుపు తాళం తీసి చూస్తే ఆ బుక్ కనిపించింది.
వాటిలో అమ్మ ఇలా రాసింది. 'ఈ మధ్య తరచూ, గుండెనొప్పి వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళితే ఏవో టెస్టులు రాస్తారు. ఇపుడే కొంచం అప్పుల నుండి కోలుకుంటున్నాము. చిన్నాడికి నా నొప్పి గూర్చి చెపితే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. కొంత పొలం ఇప్పటికే అప్పులకు అమ్మాము. మళ్ళీఅప్పులు చేయకూడదు, నా గుండె జబ్బు కోసం! అదే తగ్గుతుంది లే! ఎందుకైనా కొన్ని ముఖ్య విషయాలు తెలియాలి పిల్లలకు.
పెద్దాడ! నీకు ఐదు ఎకరాలు, చిన్నాడికి ఐదు ఎకరాలు దస్తా వేజులు రాయించాను. చెల్లికి నా పుట్టింటి ఎకరం ఇవ్వండి.
ఈ ఇల్లు ఎవరు మమ్ములను చూస్తే వాళ్లకు అనుకున్నా. నేను పోయినా నాన్న ఈ ఊరు వదలడు కాబట్టి, చిన్నాడి దగ్గర ఈ ఊరిలోనే వుంటాడు కాబట్టి వాడికి ఈ ఇల్లు దక్కుతుంది.
ఉన్న బంగారం పోనూ మిగిలిన నా బంగారం రెండు జత గాజులు, నానుతాడు, నల్ల పూసలు మాత్రమే ఉన్నాయి. ఆడపిల్లకు గాజులు ఇచ్చి, పెద్దాడు నల్లపూసలు, చిన్నాడు నానుతాడు తీసుకోండి.
అందరిలో మీరు ఆస్తి కోసం తన్నుకోకుండా అందరికి సమానం గా పంచాననే తలుస్తాను.
చిన్నాడికి నా తమ్ముడి కూతురిని అడిగి పెళ్లి చేయండి. నేనుంటే.. నేనే చేస్తా. పెద్దాడ! నీ పిల్లల పేర పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు ఫిక్స్డ్ చేశా. అవి వాళ్ళు పెద్దయినాక తీయండి.
విజయా! నీకు ఇంకా పిల్లలు పుట్టలేదు కదమ్మా! అయినా నీ ఎకరం కౌలు డబ్బులు బ్యాంకులో వేస్తున్నా. అవి ఈసారి ఇక్కడకు వచ్చినప్పుడు తీసుకునిపో. ఇక చిన్నాడు చూస్తాడులే నీ లావాదేవీలు.
మీ నాన్నకు చెప్పేది ఏముంది.!? ఆయన మారడు, ఆ తాగుడు మానడు. ఆయనకి వేళకి తిండి పెట్టండి. అన్నానికి ఆగలేడు”
ఇదంతా చదివిన నాకు ఏడుపు ఆగలేదు.
‘అమ్మా! నువ్వు లేని ఈ ఆస్తుల పంపకాలు.. ఎందుకు మాకు?..’
మా నాన్న పెద్దగా ఏడిచాడు. ‘ఇంటిని ఎంత గుట్టుగా లాక్కొచ్చింది.. పాడి చేసి ఇంటిని జరిపింది. నన్ను తాగొద్దని గొడవ చేసినా పాపిష్టోడిని వినలేదు.! ఇక నన్ను ఎవరు చూస్తారు..’
“నాన్నా! నువ్వు ఏడవవాకు. అసహ్యం వేస్తుంది! ఉన్నన్నాళ్లు అమ్మని డబ్బులు ఇవ్వు.. తాగుడికని ఏడిపించావు. ఇక ఏడవకు. అమ్మ ఆత్మ శాంతించదు. ఆ డబ్బుల కోసం పాడి చేసేది. కూరల మడులు వేసి కూరలు అమ్మేది. ఇరవై ఎకరాలు, పది ఎకరాలు అయింది అప్పులు పోను. ఏనాడైనా నాగలి పట్టావా! దుక్కి దున్నావా?” అని తమ్ముడు నాన్నను తిడుతుంటే నాన్న “నిజమేరా! దాని కోరికలు ఏవి తీర్చలేదు. దాని ఈ ఒక్క కోరిక తీరుస్తాను.. ఇకనుండి తాగను” అన్నాడు నాన్న.
అపుడే మా అమ్మ తమ్ముడు, సూరి మామ వచ్చాడు అక్కడికి.
“బావా! మా అక్క వున్నపుడు తాగుడు మానేస్తే మా అక్క సంతోషపడేదిగా.! ఇపుడు మానేస్తే ఏమి లాభం?” అన్నాడు.
నేను వెంటనే అమ్మ రాసింది సూరి మామ కు చూపించాను. "మీ అమ్మ నిజం గా దేవత! ఊళ్ళోనే పుట్టిల్లు ఉన్నా.. ఒక్కనాడు కూడా ఇది కావాలని మమ్ములను అడిగేది కాదు. నా పిల్లను మా అక్క చెప్పినట్లు చిన్నాడి కి ఇచ్చి పెళ్లి చేస్తాను" అన్నాడు.
ఎపుడూ నేను జర్మనీకి బయలు దేరుతుంటే అమ్మ పచ్చళ్ళు, వడియాలు, నెయ్యి, బట్టలు అన్నీ ఇచ్చి పంపేది. ఈసారి నుండి ఎవరు అలా సర్ది ఇస్తారు!? అనుకునే సరికి నాకు ఏడుపు ఆగలేదు.
“తమ్ముడూ! వచ్చే యేడు నీ పెళ్లికి వస్తా రా! నాన్న జాగ్రత్త”ని చెప్పి, అమ్మ లేని పుట్టిల్లు ను చూసి బాధతో బయల్దేరాను జర్మనీకి.
***
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.
コメント