top of page

గతకాలానికి వివరణ - ఈ సంస్మరణ 1'Gathakalaniki Vivarana Ee Samsmarana 1' New Telugu Story Written By Pandranki Subramani

'గతకాలానికి వివరణ - ఈ సంస్మరణ' పెద్దకథ మొదటి భాగం

రచన: పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


బేగం పేట ప్రక్కన రైల్వే వంతెనకు ఆనుకుని ఊరి మొదలున ఉంది బ్రాహ్మణవాడ. అక్కడ రోడ్డు నడి మధ్యన ఉంది మంగళ ఫైనాన్స్ సర్వీసెస్ కంపెనీ. ఆ కంపెనీ మరీ పాతది కాకపోయినా మరీ కొత్తది కూడా కాదు. రంగారావు దానిని ప్రారంభించి నత్తనడకన అభివృధ్ధి సాధిస్తున్నట్టు కనిపించినా స్థిరమైన పునాదిపైనే వ్యాపారాన్ని నిలబెట్టి ముందుకు సాగిస్తున్నాడనాలి.


షేర్స్- మ్యూచ్వల్ ఫండ్సు- ప్రేవేటు కంపెనీల ఫిక్సెడ్ డిపోజిట్స్- బాండ్సు కొనుగోలు-- తదితర పెట్టు బడులపై తగు సలహాలివ్వడంతో బాటు యితర లావాదేవీలు కూడా చేస్తుంటాడు. అతడికి సహాయకులుగా ఒక లేడీ స్టాప్- ఒక మేల్ స్టాప్ ఉన్నారు. వాళ్ళకు తోడుగా మరెవ్వరూ సహాయక స్టాఫ్ లేరు. శుచీ శుభ్రత- దస్త్రాల ఫైలింగ్ అమరిక వంటి తదితర చిన్నపాటి పనులన్నీ వాళ్ళే చూసుకో వాలి.


అప్పుడప్పుడు వచ్చే విజిటర్సుని రిసీవ్ చేసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలు కంప్యూటర్ సిస్టమ్ లో టైపు చేసి, ఖాతాదారులకు మెయిల్ చేయడం- డాక్యు మెంట్లూ ముఖ్యమైన ఉత్తరాలూ పోస్టుచేయడానికి ప్రక్కనే ఉన్న బేగంపేట పోస్టాఫీసుకి వెళ్లి డెలివరీ చేయడమూ వాళ్ళ పరిధిలోని డ్యూటీయే—మొత్తానికి రంగారావు ఆదేశాను సారం ఇద్దరూ యెవరికి వారు- “అది నీది ఇది నాది” అని చెప్పడానికి వీలులేదు.


అందుబాటులో ఉన్నప్పుడు అన్నీ తామై చూసుకోవాలి. పొరపాట్లు దొర్లితే ఇద్దరూ సమానంగా బాధ్యత వహించాలి. అంటే—వాళ్ళకలా తర్బీదునిచ్చి బాధ్యతగల సిబ్బంది గా సామాజిక అవగాహన గల పౌరుల్లా తీర్చి దిద్దాడన్నమాట రంగారావు.


అలాగని వాళ్ళను మరీ రాచిరంపాన పెట్టే రకం కాదు రంగారావుది. ఉదయమూ సాయంత్రమూ ఇద్దరికీ టీ కాఫీలతో బాటు స్నాక్స్ వాళ్ళ సీట్ల వద్దకు వచ్చేలా ఆఫీసు ఎదురుగా ఉన్న ఉస్మాన్ ఆలీ టీ షాపు ఓనరుతో యేర్పాటు చేసాడు. టీ- షాపు వాళ్ళతో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ తెరిపించాడు. విజిటర్స్ వస్తే తను స్వయంగా వెళ్ళి వాళ్ళను రిసీవ్ చేసుకునే లోపల అదే టీ షాపునుండి టీలు బిస్కట్లు వచ్చేటట్టు కూడా యేర్పాటు చేసాడతను. సభ్యత ప్లస్ వ్యాపార ప్రాజ్ఞత యెరిగిన మనిషి. అట్టడుగునుంచి పైకి వచ్చిన మనిషి.


ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే, రంగారావు ఒంటరివాడు. చెప్పాలంటే ఒక విధంగా పెళ్లీడు దాటుతూన్న పెళ్లి కాని పరమశివం అన్నమాట. ఆఫీసు పై పోర్షన్ లోనే ఉంటూ అన్నీ తనకు తానే చూసుకుంటూ వంట కూడా తనకు తానుగా చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నాడు. వంటా వార్పూ చేసి పెట్టడానికి చుట్టు ప్రక్కల తెలిసిన వాళ్ళు వంటకత్తెలను పంపించడానికి తాపత్రయపడ్డా అతడు నాజూకుగ్గా తిరస్కరించాడు.


కారణం- ఆదినుండీ కొన్ని తనకు తానుగా చేసుకోవాలన్న పట్టుదల-- వంట తనకు తన తల్లి స్వయంగా నేర్పిన దైవీక విద్య అని తన సర్కిల్ వాళ్ళతో చెప్పుకుంటాడతను. అతడిదొక టైపనుకుంటూ ఊరుకున్నారు వాళ్ళు. ఉదయమే లేచి బేగం పేట స్టేషను చుట్టూ ఉరకలు వేసే పరుగు వంటి నడక చేసి పార్కులో చెమటలు పోసేలా యోగాసనాలు- తదుపరి శవాసనంతో ముగించి ఉస్మాన్ ఆలీ షాపులో స్ట్రాంగ్ టీ తాగి గది చేరుకుంటాడు. అప్పుడు గాని అతడికి తెరపి కలిగినట్లని పించదు. ఉపశమనం పొందినట్లు తోచదు.


ఆసనాల అలసటతో నడుస్తూ వస్తున్నప్పుడు అతడ అలా పార్కువేపూ పూదోటల వేపూ చూస్తూ పచ్చటి చెట్లను చూపుల పలకరింపుతో పరామర్షిస్తూ రావడం అతడికి అత్యానందం కలిగించే దైనందిన చర్య. డబ్బులిచ్చి ప్రవేశ రుసుము చెల్లించినా పొందలేని అంతర్గత ఆహ్లాదకర చర్య--- ఈ విషయంలో అతడు భారత వృక్ష శాస్త్రజ్ఞుడు జగదీశ్ చంద్రబోసుని గుర్తుంచుకుంటాడ తను. సున్నిత జీవాలైన చెట్లూ పువ్వులూ అతడి ఉదయకాల పలకరింపుల్ని స్వీకరించి గుర్తుంచుకుంటాయన్న నమ్మకం--


ఇక స్టాఫ్ విషయానికి వస్తే- ముకుందరావు కొత్తగా పెళ్లి చేసుకున్న ఉమ్మడి కుటుంబస్థుడు. ఒళ్ళువంచి పనిచేసే బ్లూ- కాలర్ శ్రామికుడు. అవిశ్రాంతమూ పని నేర్చుకోవాలన్న తహతహతో ఇంకా సాధించాలన్న తపనతో ఉంటాడు. ఏది చెప్పినా కాదనకుండా అప్పటికప్పుడు చేసి ముగిస్తాడు. అందుకే అతడి పనితనానికి ముగ్ధుడయి రంగారావు అతడికి ఇన్సెంటివ్ గా స్కూటర్ కొనిచ్చాడు.


సెలవు దినాలలో ముకుందరావు కొత్త పెళ్ళాంతో ట్యాంక్ బండ్ వద్ద తరచూ రివ్వు రివ్వున తిరుగుతూ కనిపిస్తాడు. పెళ్ళాం అందానికే కాదు- స్టూటరుకి పూసిన క్రీమ్ రంగుకి కూడా ముచ్చట పడిపోతుంటాడు. ఒక్క కుడుముకే సంబరపడి పోయే తత్వమన్నమాట ముకుందరావుది.


లేడీ స్టాఫ్ అనుసూయేమో పెళ్లి చేసుకున్న మూడు సంవత్సరాలకు భర్తను కోల్పోయిన వితంతు. అతడెలా పోయాడం టే;సాధారణ విషయంగా తేలిపోవచ్చు. అతడలా సాధారణ పరిస్థితుల వల్లలో అనారోగ్య కారణాల వల్లనో చనిపోలేదు. దూరం నుంచి విధి వేసిన గాలం వల్ల పోయాడు. ఎలాగని-- కారుకి క్రింద కూర్చుని యేకాగ్రతతో రిపేర్ చేసేటప్పుడు కారు బాడీని పైకెత్తి ఉంచినప్పుడు జాకీ పరికరం ప్రక్కకి జారిపోయింది. దాని ఫలితంగా నేలపైన పడుకున్న ఆమె భర్త గుండెలపైన కారు అమాంతం పడింది. ఆ రాపిడిలో ఆస్పత్రికి తీసుకు వెళ్ళే లోపల ఊపిరాడక చనిపోయాడు.


ఇప్పుడు వెనుకా ముందూ తోడు లేని అత్తామామలను ఆమే దగ్గరుండి యింటి కోడలు రోల్ నుండి కూతురు రోల్ కి తనను తను మార్చుకుని వాళ్లను చూసు కుంటూంది. వాళ్ళ మందూ మాకుల ఖర్చు మాత్రం రంగారావే భరిస్తాడు. ఎలాగంటే, ఎందుకంటే—రంగారావు మొదటి నుండీ ఒక ఉదాత్తమైన పధ్ధతి పాటిస్తుంటాడు. ఎవరైనా ఎక్కణ్ణుంచైనా మందులు కొనుక్కోలేక పోతున్నామని మొర పెట్టుకుంటే అతడు ఆ మందుల ఖర్చు భరిస్తాడు.


ఐతే ఒక షరుతు పైన- చేతికి డబ్బులివ్వడు. వైద్యుడి ప్రిస్క్రిప్షన్ ప్రకారం చీటీ వ్రాసి ఆఫీసుకి ఆమడ దూరాన ఉన్న ధన్వంతరి మెడికల్ షాపుకి పంపిస్తాడు. వాళ్ళా ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులిచ్చి బిల్ రిఫరెన్సుతో అకౌంటు బుక్కులోకి ఎక్కిస్తారు. ఇతడేమో నెలకొకసారో పక్షం రోజులకొకసారో డెబిట్ కార్డు ద్వారా సెటిల్ చేసి వస్తాడు. వైద్యుడి సిఫార్సు లేకుండా యెవరొచ్చినా యెంతగా గీపెట్టినా రూపాయి కాసు కూడా విదల్చడు. సిబ్బంది సహాయంతో వాళ్లను బైటకు గెంటి వేయడానికి కూడా వెనుదీయడు.


మొదట్లో అతడు రెండు మూడు కేసుల విషయంలో యేమరు పాటున వైద్యుడి ప్రిస్క్రిప్షన్ ప్రకారం కంప్యూటర్ సిస్టమ్ లో మందుల ఖరీదు తెలుసుకుని క్యాష్ ని అందించాడు. అప్పుడేమయింది;రోగ నివారణకై వెళ్ళవలసిన మందుల షాపుకి బదులు మరొక మందు షాపుకి వెళ్ళసాగారు. ఇది గమనించి జరిగిన విషయాన్ని ముకుంద రావు రంగారావు చెవిన వేసిన వెంటనే క్యాష్ పధ్ధతిన పేమెంట్ చేసే ద్వారాలను ముసివేసాడు.


అటుపైన మెడికల్ షాపు ద్వారానే మందులు సరఫరా చేసే ఫూల్ ప్రూఫ్ పధ్ధతిని ప్రవేశ పెట్టాడు. ఈ విషయంలో ఇంకొకడుగు ముందుకేసి చెప్పాలంటే- మరి దేని విషయంలోనూ అతడు వితరణకు పూనుకోడు. ఈ మందు ఖర్చుల వితరణ నిమిత్తం అతడు నెలసరి ఆర్థిక నివేదిక ముందస్తుగా తయారు చేసుకుంటాడు. ఆ నెల మొత్తం రాబోయే రాబడికి తగిన రీతిన పది శాతం కేటాయిస్తాడు.

అలా సవరించి న కేటాయింపు లోపలే మందుల ఖర్చులు భరించడానికి ముందుకు వస్తాడు. వితరణ చేసే మందుల ఖర్చులు గాని నెలసరి కోటాను మించి పోతే—వెనుకడుగు వేసి, తదుపరి సర్దు బాటులూ ముందస్తు జాగ్రత్తలూ తీసుకుని ఆగిపోతాడు. కుండలో ఉంటేనే కదా- ఒకరికో ఇద్దరికో పంచి పెట్టేది-- మరీ అత్యవసర మయిన పరిస్థితి గాని యెదురయితే పెటీ క్యాష్ అకౌంటు నుండి డబ్బలు డ్రా చేసి సర్దడానికి ప్రయిత్నిస్తాడు.


ఇకపోతే—పరిస్థితి అంతవరకు రాకుండా రంగారావుకి యిబ్బంది కలగకుండా సిబ్బంది అతడికి వత్తాసుగా జాగ్రత్త పడ్తారు. వితరణ కోటా యెప్పుడు దాటి పోయిందని తెలుసుకుంటారో. అప్పుడో యిప్పుడో దాటపోబోతుందని గ్రహిస్తారో ఆర్తులను గేటు వద్దే ఆపి సాగనంపేస్తారు. ఖర్చుల బండి తడబడకముందే బ్రేకులు వేస్తారన్నమాట--


ఐతే—రంగారావు యెంతటి అకౌంట్సు పట్టింపు గల మనిషయినా, లోలోన ఆత్మసాక్షి గల వ్యక్తి. సౌమ్య శుభ్ర తేజస్సుతో వ్యవహరించే వ్యక్తి. ఈ ఉన్నత గుణాంశాన్ని మొదట అనసూయ గుర్తించింది. ఎలాగంటే- లీలానగరులో ఉంటూన్న వాళ్ళ ఆడ పడుచు ఒకసారి నిమ్స్ ఆస్పత్రికి వెళ్ళినప్పుడు అక్కడ రంగారావు దీనంగా కనిపించే బీదా బిక్కీ వద్దకు వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాల గురించి ఆరాతీస్తూ వాళ్ళ చేతిలో ఉన్న ప్రిస్క్రి ఫ్షన్ ప్రకారం తానే మందులు కొనిస్తుండటం గమనించింది.


ఆ వార్తను వదిన చెవిన వేసింది. అది విన్నంతనే ఆసక్తి ఆపుకోలేక బాస్ ని అడిగింది అనసూయ- “డిగ్నిటీ గల వ్యక్తులు మీరు. మీరెందు కు సార్ అలా పేషంట్స్ బెడ్స్ వద్దకు వెళ్ళి వాళ్ళ మెడికల్ బిల్లులు చెల్లించడం?మీ సహాయం కావలసిన వాళ్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వాళ్ళే వస్తారుగా!వాళ్ళకేమిటి మన మంగళ ఫైనాన్స్ కంపెనీకి వచ్చే దారి తెలియదా యేమిటి?”


దానికతడు తాపీగా బదులి చ్చాడు - “కారణం ఉంది అనసూయగారూ! ఈ నెల ఇరవై ఐదు రోజులయి పోయిన తరవాత కూడా యిబ్బంది లో ఉన్నఆర్తులు మెడికల్ బిల్సు చెల్లింపు కోసం రాలేదు. ఖర్చుచేయాల్సిన నెలసరి బడ్జెట్ కోటా మిగిలి పోయింది. ఇది గాని ఖర్చుకాకుండా మిగిలిపోతే నాలో అశాంతి రగిలి పెరిగి పోతుంది. ఇదీ సంగతన్నమాట”


అనసూయ అతడి వేపు యెగాదిగా చూసి- “బాస్ నిజంగానే అదో విధమైన టైపే!“ అనుకుంటూ సీటుకి వెళ్ళి కూర్చుంది;


చాలా సేపు అతడి పోకడ గురించి పరిపరి విధాల తలపోస్తూ-- ఇల్లు చేరిన తరవాత కూడా ఆ పూటంతా బాసు గురించే ఆలోచిస్తూ గడిపింది. ఈరోజుల్లో యిటువంటి వ్యక్తులు కూడా ఉంటారా!ఎవరైనా ఆర్తుల కోసం పనిగట్టుకుని వెతుక్కుంటూ వెళ్ళి వితరణ చేస్తారేమిటి—ఇద సెన్సిటివ్ నెస్సా లేక వైల్డర్ నెస్సా--


ఒక రోజు అనసూయ అనుకోకుండానే బాస్ నియమావళిని ఉల్లంఘించింది. ఒక పదహారేళ్ళ అమ్మాయిని తీసుకు వెళ్లి రంగారావు ముందు నిల్చుండబెట్టి- ఆ పిల్ల పేదింటి అమ్మాయని స్కూలు ఫీజు కట్టి యెగ్జామ్ ఫీజు కూడా కట్టి ఆదుకొమ్మంది.


రంగారావు మండిపడ్డాడు. తను ధర్మసత్రం నడపడం లేదని గొంతు పెద్దది చేసి చెప్పి- అదే ఆఖరి ఉదంతమనీ ప్రకటించి ఆ పిల్లకివ్వాల్సిన ఫీజు డబ్బులు స్కూలు డిమాండ్ ప్రకారం స్వయంగా స్కూలుకి వెళ్లి కట్టి వచ్చాడు. ఎందుకంటే అతడెవ్వరి చేతికీ డబ్బులిచ్చే ఆనవాయితీ లేదు గనుక--


ఇది జరిగి పట్టుమని పదిరోజులు కూడా కాలేదు. అనసూయ మరొకసారి మరొక విధమైన అభ్యర్థనతో అతడి చేంబర్ లోకి ప్రవేశించింది. ఈసారి ఇద్దరు ఛత్తీస్ ఘడ్ సోదరులను అతడికి పరిచయం చేసింది.

=======================================================================

ఇంకా వుంది...

=======================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.32 views0 comments

Comments


bottom of page