'Gathakalaniki Vivarana Ee Samsmarana 2' - New Telugu Story Written By Pandranki Subramani
'గతకాలానికి వివరణ - ఈ సంస్మరణ' పెద్దకథ రెండవ భాగం
రచన: పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ:
మంగళ ఫైనాన్స్ సర్వీసెస్ కంపెనీ అధినేత రంగారావు.
పెళ్లి వయసు దాటుతున్న బ్రహ్మచారి.
ఇద్దరు అసిస్టెంట్లు- ముకుందరావు, అనసూయ.
హాస్పిటల్ ఖర్చులు భరించలేక ఎవరైనా ఇబ్బంది పడుతుంటే సహాయం చెయ్యడం రంగారావు నైజం.
ఇద్దరు ఛత్తీస్ ఘడ్ సోదరులను సహాయం కోసం రంగారావు దగ్గరకు తీసుకొని వస్తుంది అనసూయ.
ఇక గతకాలానికి వివరణ, ఈ సంస్మరణ 2 వ భాగం వినండి..
”మీకు అంతరాయం కలిగిస్తున్నందుకు క్షమించండి. విషయం విని ఆ తరవాత ఔననడమో కాదనడమో మీ ఇష్టం. ఇద్దరూ కవల సోదరులు. అమ్మానాన్నలిద్దరూ విష జ్వరం తాకి చిన్నప్పుడే చనిపోవడాన అనాథాశ్రమంలో పెరిగారు. ఒక దశ వయసు చేరేటప్పటికి ఆశ్రమ నియమాను సారం వీళ్ళ చేతికి కొంత నగదు యిచ్చి ఆశ్రమం విడిచి వెళ్లిపొమ్మని ఆదేశించారు.
దిక్కూ ముక్కూ తెలియక సరాసరి స్టేషన్ కి వచ్చి కనిపించిన ట్రైను యెక్కేసి ఇక్కడ దిగారు. మీ గురించి యెవరో యెక్కడో చెప్పారట. వేళా పాళా తెలియకుండా సరాసరి మన కార్యాలయం చేరి, ప్రొద్దుట ఆరునుంచి ఇక్కడే పడిగాపులు కాస్తూ కూర్చున్నారు. ఈరోజు మీరు నడక కోసం బైటకు వెళ్ళనట్టునారు. అందువల్ల వీళ్ళు మీ కంటపడలేదనుకుంటాను”
అప్పుడామె మాటను కట్ చేస్తూ అన్నాడతను- “ఇంతకీ మేటర్ ఏమిటంట? స్కూలు ఫీజో లేక కాలేజీ ఫీజో కట్టడానికి డబ్బు సహాయం కావాలంటున్నారా! లేక, మాడిపోతూన్న కడుపుల్ని చల్లార్చుకోవడానికి డబ్బులు కావాలంటున్నారా!”
అప్పుడామె కూడా జాప్యానికి తావివ్వకుం డా చట్టున బదులిచ్చింది- “కాదండి. మీ సహాయం కోరడానికి వచ్చారు”
ఏ సహాయమన్నట్టు ప్రశ్నార్థంగా కనుబొమలెగరేసి చూసాడు రంగారావు.
“లోను యివ్వమని అడగటానికి వచ్చినట్టున్నారు. ఈ కవల సోదరులిద్దరికీ టీలు, సమోజాలు, కచోరీలు చేయడం వచ్చట. బేగం పేట రోడ్డు బ్రిడ్జి ప్రక్కన షెల్టర్ వంటి చోటు ఉందట. అది కూడా వాళ్ళ ఛత్తీస్ ఘడ్ వాళ్లెవరో యేర్పాటు చేసిస్తామన్నారట. ఇద్దరూ వాళ్ళ అమ్మ పైన ఒట్టు పెట్టి చెప్తున్నారు తీసుకున్న సొమ్మును తప్పకుండా తిరిగిచ్చేస్తామని—“
“ఇవేమిటి ఒట్టుల్ని నమ్మేరోజులా! కపట నాటక సూత్రధారులు పెరిగిపోతూన్న గడ్డు రోజులు. కష్టించి పైకి రావాలను కుంటున్నారు. మంచి పధ్ధతే. కాని నా నియమావళిలో ఇది లేదుగా! ”
“నిజమేనండి. సారీ అండీ! కాని అబ్బాయిలిద్దరూ చిత్త శుధ్దిగల వ్యక్తుల్లా కనిపిస్తున్నారు. ఛత్తీస్ ఘడ్ అనాధాశ్రమంలో పెరిగి పెద్దయిన వాళ్లు. ఆశ్రమ జీవితంలో మంచీ మన్ననా అలవర్చుకున్న కుర్రాళ్ళు. తెలుగు గాని ఉర్దూగాని తెలియక కొట్టు మిట్టాడుతున్నవాళ్ళది డిజర్వింగ్ కేసండి”
“ఒప్పుకుంటున్నాను. కాని రెండు షరతులపైన. ఒకటి- మీరు మళ్లీ నావద్దకు ఇటువంటి తప్పాతడకా కేసుల్ని తీసుకు రాకూడదు. రెండవది—“
అప్పుడు అనసూయ చప్పున బాసుకి అడ్డు తగిలింది. “సారీ సార్! వీళ్ళను మీ వద్దకు నేను తీసుకురాలేదు. వాళ్ళే మీ గురించి యెక్కడో యెవరి ద్వారానో విని ఆఫీసు ముంగిట కూర్చున్నారు. నాకు కొంచెం హిందీ తెలుసు కాబట్టి వాళ్ళ గోడు తెలుసుకుని మీకు చెప్పాను. అంతే-- ”
“ఇటీజ్ ఓకే. మధ్య మీరు బెంబేలు పడిపోకండి. ఇటువంటి కేసు మీరింతకు ముందొకటి తీసుకు వచ్చారు కదా- అందువల్ల ఈ ఒక్కమాటా చెప్పాల్సి వచ్చింది. ఇక ఆఖరు పాయింటు. వీళ్ళకు క్యాష్ చేతికివ్వను. ముకుందాన్ని వీళ్ళతో బాటు వెళ్లి వీళ్ళకు కావల్సిన సామగ్రి కొనివ్వమనండి. సామాగ్రంతా వీళ్ళు పెట్టబోయే టీ షాపుకు రవాణా ఐన తరవాత చిల్లర ఖర్చులకి వేయి రూ పాయిల నగదు మాత్రం అందచేయ మనండి. నౌ- ఇటీజ్ ఓకే? ”
ఆ మాటతో అనసూయ ముఖం ఫెళ్ళున మెరిసింది. అప్పుడామె సంతోషంలో ఆవేశానికి లోనవుతూ అంది- “మీకు గాని ఆక్షేపణ గాని లేకపోతే ఈ రోజు మీకు వంట నేను చేసిపెడ్తాను సార్! నేను మీ అమ్మగారంతటి దివ్యంగా కాకపోయినా వంట బాగానే చేస్తాను సార్”
ఆ మాటకతడు ఆశ్చర్యపోయినట్టు చూసి “ఇప్పుడు కాదు గాని—మరొకసారి ఆ అవకాశం మీకిస్తాలే! ” అని దిన పత్రికను చేతిలోకి తీసుకుని సీటు నుండి లేచి వడివడిగా బైటకు నడిచాడు; ఛత్తీస్ ఘడ్ సోదరుల నమస్కారాలను కూడా స్వీకరించకుండా--
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------
శుక్రవారం. ఉదయకాల నడక ముగించి సందడిస్తూన్న పార్కులో కూర్చుని కాసేపు ఆసనాలతో బాటు లయబధ్ధ బ్రీథింగ్ తీసుకునే కసరత్తు కూడా పూర్తి చేసి పబ్లిక్ స్కూల్ మలుపు దాటి ముందుకు సాగిన కొద్ది సేపటికి అతడు అన్యమనస్కంగా ఆగిపోయాడు. ఎదురుగా విశాల భవన సముదాయం కనిపించింది. తను చాలా రోజులుగా యిటు వేపు నుంచే బ్రాహ్మణవాడకు చేరుకుంటాడు. మరెందుకిది తన కళ్ళబడలేదు? ఆమాంబాపతు ఇండ్ల సముదాయం తనకు కనిపించకుండా పోవడం యేమిటి-
నానాటికి ఆదమరపు తనకు యెక్కువయిపోతుందేమో! ఇంతకీ తన వయసెంతని? ముప్పై నాలుగు లేక ముప్పై ఐదు లోపేగా- అతడలా దూరాన నిల్చుని కళ్ళు విప్పార్చి భవన సముదాయంలోకి చూపు సారించాడు. వాటిలో యేమేమి ఉంటుందో, యెటువంటి వసతులు సౌకర్యాలు అమర్చి ఉంటాయో అతడు ఊహించాడు. కనీసం రెండైనా పార్టీ హాల్స్ ఉంటాయి. ఇంటరాక్టివ్ జిమ్, సీనియర్ సిటీజన్స్ యోగా పార్కు ఉంటుంది.
కిడ్స్ ఇన్ డోర్ గేమ్స్ హాల్, బిలియర్డ్స్ రూమ్ తో బాటు, పిల్లల ఆలనాపాలనా చూసుకునేందుకు క్రెచ్ ఉంటుంది. యెదిగిన పిల్లలు ఆడుకునేందుకు చిల్డ్రన్ పార్కు కూడా ఉంటుంది. యోగా హాలుతో స్పా- మసాజ్ రూమ్- సలూన్ సదుపాయం కూడా ఉంటుంది. ఆరోగ్యం కోసం జాగింగ్ ట్రాక్ కూడా ఉంటుంది. ఇంకా మరెన్నో ప్లే- యేరియాలు పరచుకుని ఉంటాయి.
మొత్తానికి అదంతా సకల సౌకర్యాలకు సకల సౌభాగ్యాలకు నిలయంగా భాసిల్లుతుంది. అప్పుడతని మెదడు పైన చిన్ననాటి జ్ఞాపక చిహ్నాలు ముద్రించుకుంటూ కదల నారంభించాయి. తను చిరుప్రాయంలో అమ్మ చేతిని పట్టుకుని పుస్తకాల సంచిని భుజానికి వ్రేలాడదీసుకుని బడినుండి ఆడుతూ గెంతుతూ యింటికి వెళ్తున్నప్పుడు తను అమ్మను తరచూ అడుగుతుండే వాడు అటువంటి విస్తారమైన గేటడ్ నివాస సముదాయంలో యెవరుంటారని.
ఇంకెవరు, మనుషులుంటారని అమ్మ బదులిచ్చేది. తను ఊరుకునేవాడు కాడు- “మరి నర్సిగాడు చెప్తున్నాడే అమ్మా— లోపల దెయ్యాలుంటాయని.
దానికి అమ్మ నవ్వుతూ అనేది- “ఛే—అవేం మాటల్రా చిన్నోడా! గొప్పోళ్ళు బాగా చదువుకున్నోళ్ళు ఉంటారురా! ”
తను ఊరుకునేవాడు కాడు- “పెద్ద పెద్ద డబ్బుగలోల్లా! “ అని క్వరీ లేవదీసేవాడు.
దానికి అమ్మ దిద్దుబాటు చేసేది- “అక్కడుండే వాళ్ళందరూ డబ్బున్నోళ్ళు కారు. అప్పో సప్పో చేసి ఇండ్లు కొనుక్కున్న జీతగాళ్ళూ ఉన్నారు అక్కడ! ”
అప్పటి అమాయకపు రోజులు గుర్తుకి వచ్చి నవ్వుకున్నాడు రంగారావు. కుర్ర వెధవా అని కొట్టి పడేయకుండా అమ్మ యెంత ఓర్పుతో తన అనుమానాలు నివృత్తి చేసేది! అందుకేగా తల్లిని ధరణితో పోల్చుతుంటారు విజ్ఞులు-- అతడలా ప్రాత జ్ఞాపకాల తుంపరలో తడుస్తూ ముందుకు సాగాడు. బ్రాహ్మణ వాడ మలుపు వద్దకు చేరేటప్పటికి ఆంజనేయ స్వామి వారి గుడిలో హనుమంతు దండకం యెవరో చదువుతున్నారు.
అతడికి తెలుసు, దండకం చదవడం పూర్తయిన తరవాత అర్చకుడు ప్రసాదం పంచిపెడ్తాడని. తన చిన్ననాటి రోజుల్లో తను గాని నర్సిగాడు గాని అటువంటి అవకాశాన్ని యెప్పుడూ జారవిడుచుకునే వారు కాదు. బాదం ఆకులోనో మోదుకు ఆకులోనో ప్రసాదం తిన్నతరవాత లెక్క చూడకుండా తమ ఉనికి గమనించకుండా అర్చక స్వాములు రెండవ సారి ప్రసాదం యస్తే బాగుంటుందనుకునే వాడు.
”అవన్నీ అప్పటి రోజులు. ఇప్పుడు కంచుకాగడా పెట్టి వెతికినా కానరావు కదా! “అనుకుంటూ అతడు యెడంగా జరిగి నడి రోడ్డుపైన నిల్చుని బళ్ళ రాకను గమనిస్తూనే ఆంజనేయుడికి చేతులు జోడించి నమస్కరించి ముందుకు నడిచాడు.
మరి కొద్ది దూరం నడిచేటప్పటికి అక్కడ చర్చి యెదురైంది. మరి కొద్ది దూరం నడిచేటప్పటికి మసీదు కనిపించింది. లోపల్నించి నమాజ్ వినిపిస్తూంది. అప్పుడతనికి చప్పున బడి పంతులు అప్పన్న పంతులు గారు గుర్తుకి వచ్చారు. ఆయన నుడివిన ఆద్యాత్మిక వచనాలు గుర్తుకి వచ్చాయి.
”ప్రతి ప్రార్థనా స్థలం పవిత్రమైనదే—ఎందుకంటే ప్రతి ప్రార్థనా స్థలంలోనూ దేవుడుంటాడు. మనం పిలిచే పేరే వేరూగా ఉండవచ్చు. దేవుడు మాత్రం ఒక్కడే! అంచేత అన్ని దేవస్థలాల ముందూ తలవంచి నడవాలి“ అనేవారాయన.
ఎంతటి ఉన్నతమైన ఆధ్యాత్మిక చింతన! అంతడలా చిన్ననాటి జ్ఞాపకాల జడిలో తేలుతూ తల వంచి నడుస్తూ తన కార్యాలయం- కమ్- రెసిడెన్స్ దగ్గరకు చేరాడు.
”ఎలాగున్నారు భాయ్ సాబ్? ”అంటూ పరామర్శిస్తూ ఉస్మాన్ అలీ టీ- షాపులోకి దూరి రెండు బిస్కట్లు తిని ఒక కప్పు స్ట్రాంగ్ టీ తాగి పనిలో పనిగా ఓసారి కంపెనీ పేర నమోదయి ఉన్నఖాతా పుస్తకాన్ని సరిచూసి, సాయంత్రం లోపల వచ్చి టీ- ఖాతాలో చేర్చబడ్డ మొత్తాన్ని వచ్చి తీసుకోవచ్చని అలీగారికి భరోసా యిచ్చి లేచేటప్పటికి అలీగారే యెదురొచ్చి రంగారావుని ఆపాడు.
”మా గల్లీలో నిన్న పేద్ద ప్రెమాదం జరిగిపోయింది సాబ్!”
అదేమిటన్నట్టు కళ్ళు పెద్దవి చేసుకుని చూసాడు రంగారావు.
”మన ఘర్కే సామ్నే ఒక పదేళ్ళ అమ్మాయి ఉంది సాబ్—ఆ చుక్రీ ఉతికిన బట్టలు ఆరేయడానికి డాబా పైకి యెల్లి తొందర తొందరగా బట్టలు ఆరేస్తూ హై టెన్షన్ పవర్ ఫుల్ కరెంట్ వైర్ పైన చేయి పెట్టేసింది సాబ్! ”
అప్పుడు రంగారావు కంగారుపడుతూ అడిగాడు- “అప్పుడేమ యింది? ఆ పదేళ్ళ పాపను ఆస్పత్రిలో చేర్పించారు కదూ! ఇప్పుడు బాగుంది కదూ!”
“బాగుంది గాని—బిల్ కుల్ బాగాలేదు సాబ్! ”
రంగారావు అర్థం కానట్టు చూసాడు- “ఇంతకీ ఏమైంది అలీగారూ! ”
“కుడి హాత్ ఊడి పడిపోయింది సాబ్! ”
అదివిని ఉలిక్కిపడుతూ అడిగాడు రంగారావు. “ ఆస్పత్రిలో చేర్పించారా! ”
“ఇప్పుడాపిల్ల చాలా రోజులు దవాఖానాలోనే ఉంది సాబ్. అల్లా దయ—ప్రాణాలతో బయటపడింది. కాని కాలిపోయి ఊడిపడ్డ చేతిని డాక్టర్లు అతికించలేక పోయారు”
అది విని రంగారావు పెను నిట్చూర్పు విడిచాడు. ఈ మధ్య పెక్కు సినిమాలకు ట్యాగ్ లు పెడ్తున్నారు సినీ రచయితలు- “ఎక్కడైతే ధర్మదేవత ఉంటుందో అక్కడ దుష్ట శక్తి కూడా ఒక మూల పొంచి ఉంటుంది”.
అదే సూత్రం ప్రకారం, పెక్కుమందికి మేలు చేస్తూన్న విద్యుత్తు కూడా అప్పుడప్పుడు కీడు తలపెడ్తుంటుంది.
సర్వలక్షణాలూ సంపూర్ణంగా ఉన్నప్పుడే అమ్మాయిలకు పెండ్లి కావడం కష్టతరమవుతుంది. ఒక చేతిని కోల్పోయిన ఆ పదేళ్ళ పాప పెద్దదయితే యెన్ని కష్టాలు పడవల సుంటుందో-- అలా ఆలోచించుకుంటూ బయటకు కదలబోయాడతను.
ఉస్మాన్ అలీ అభ్యర్థింపుగా పలిచాడు- “ఏక్ బాత్ రంగారావు సాబ్! ”
ఉఁ చెప్పండి అని వెను తిరిగి చూసాడతను.
“తమరు ఆ పిల్ల ట్రీట్మెంటుకి మద్దత్ చేయగలరేమోనని—”
రంగారావు చిన్నగ నవ్వాడు- ‘ఇది అడగడానికి యెందుకు అంతగా సందేహిస్తున్నారు అలీగారూ! కాని—ఇక్కడ ఒక మేటర్ ఉంది. మీకు తెలుసో తెలియదో గాని— ఎలక్ట్రి సిటీవాళ్లు వాళ్ళ రూల్స్ ప్రకారం ఏదో కొంత నష్టపరిహారం ఇచ్చుకుంటారు. ఆ పిల్లకు ట్రీట్మెంట్ కూడా ఆస్పత్రి స్టాఫ్ ఉచితంగానే ఇస్తారు. వాళ్ళ అమ్మానాన్నలను ట్రై చేయమని చెప్పండి. తప్పకుండా కొంతలో కొంత ఫలితం ఉంటుంది”
ఉస్మాన్ అలీ నసుగుతూ బదులిచ్చాడు-- “మీది అచ్చాబాత్ రంగా రావు సాబ్. కాని అవన్నీ పూర్తవడానికి వక్త్ పడుతుంది కదా! దవాఖానాలో అప్పుడప్పుడు అర్జంట్ మందులు దొరకడం లేదట-- మీ వద్దకు వస్తే తమరు మద్దత్ చేస్తారా సాబ్—“‘
ఆ మాటకు రంగారావు నవ్వుతూ అలీ భుజంపైన చేయి వేసాడు. “తప్పకుండా—మీరు చెప్పడమూ నేను చేయకపోవడమూనా! ఐతే—నేను పెట్టిన రూల్స్ ప్రకారం ప్రిస్క్రిప్షన్ తో వస్తానే పే- మెంట్ అవుతుంది. సరేనా—”
“మరొకటి రంగారావు సాబ్. మందులు ఇంజెక్షన్లూ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి సాబ్—’
“పర్వాలేదు, నేను చూసుకుంటాను” అని బడ్డీషాపు నుండి బయటకు వచ్చాడు.
అతడు మంగళ కార్యాలయం వేపు నడుస్తూ మనసున అలీ వేడుకోలు గురించి ఆలోచించాడు. అతడెందుకు అంతలా నసిగి నసిగి తనతో మాట్లాడాడో రంగారావుకి తెలియక పోలేదు. తను దైవ భక్తుడు. అందునా హిందువు. గాయపడ్డ ఆ పదేళ్ళ పాప ఇస్లామియా మతస్థురాలు. తను సహాయం చేయడానికి సంసిధ్ధత తెలియపర్చడేమోనని-- మానవత్వపు మందారాలకు హారం గుది గుచ్చడానికి తావలం లేకపోవడమేమిటి—
తమ యిష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా బ్రాహ్మణ వాడలో తామందరూ కలిసేగా మనుగడ సాగించాలి—కలిసేగా ఒకరి సమస్యల్ని మరొకరు పంచుకోవాలి— యిదేగా యెవ్వరూ కాదనలేని ధర్మసూత్రం!
ఆరోజు మధ్యాహ్నం ఉస్మాన్ అలీ ఆ పదేళ్ళ పాపతో బాటు వాళ్ళ అమ్మానాన్నలను కూడా తనతో బాటు తీసుకు వచ్చాడు. అనసూయకు హిందీతో బాటు ఉర్దూ కూడా కొంత తెలుసు కాబట్టి, ఆమెను తన బిల్స్ డిస్కౌంటింగ్ పనిని అప్పటికి ఆపుచేసి తన గదికి రమ్మని ఇంటర్ కామ్ ద్వారా పిలుపునిచ్చాడు.
ఆమె అతడి పిలుపందుకున్నతోడనే విలంబిత కాలం తరవాత అతడి గదిలో ప్రత్యక్షమైంది. ఉస్మాన్ అలీ అతడి ముందూ అనసూయ ముందు మరొక మారు జరిగినదంతా వివరించాడు. అంతావిన్న అనసూయ కుర్చీలోనుండి యిటు తిరిగి విన్నదంతా రంగారావుకి వివరించబోయింది.
అతడు వద్దన్నట్టు చేతితో సైగ చేసి కొత్త విషయం యేమైనా ఉంటే చెప్పమన్నాడు.
అప్పుడామె వివరించింది-- “మరేం లేదు సార్! మందుల ఖర్చుతో బాటు వాళ్ళ అమ్మాయి మరీ నీరసంగా ఉండటాన నెలకు రెండు హార్లిక్స్ బాటిల్స్ కావలసి ఉందట—మందుల ఖర్చులతో బాటు మీరు ఈ హార్లి క్సు బాటిల్స్ ఖర్చు కూడా భరిస్తారా అని అడుగుతున్నారు. ఏం చెప్పమంటారు”
“మీరు చెప్పకండి. ఇది నేను చెప్తాను. యాజ్ ఎ స్పేషల్ కేస్- యాజ్ ఎ స్పెషల్ కేస్ ఒన్లీ—నెలకు రెండు బాటిల్స్ హార్లిక్స్ ఖర్చు మనం భరిస్తాం. కాని—అదే షరతు పైన—బిల్లు యిచ్చిన తరవాతనే పేవ్మెంట్—ఇక మరొక ముఖ్యమైన విషయం—“
అతను ఉస్మాన్ అలీ వేపు తిరిగాడు.
“బోలియే సాబ్! ”అంటూ కుర్చీనుండి లేవబోయాడు.
లేవకండని సంజ్ఞ చేస్తూ రంగారావు చెప్పసాగాడు “ఈ పాప విషయమై నేను మా కంపెనీ లాయర్ తో సూచాయిగా మాట్లాడాను. ఓర్పుగా మేటర్ డీల్ చేస్తే—సర్కారు నుండి బెనిఫిట్స్ పొందవచ్చంటున్నాడాయన.”
=======================================================================
ఇంకా వుంది...
=======================================================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
Comments