'Gathakalaniki Vivarana Ee Samsmarana 3' - New Telugu Story Written By Pandranki Subramani
'గతకాలానికి వివరణ - ఈ సంస్మరణ' పెద్దకథ మూడవ (చివరి) భాగం
రచన: పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ:
మంగళ ఫైనాన్స్ సర్వీసెస్ కంపెనీ అధినేత రంగారావు.
పెళ్లి వయసు దాటుతున్న బ్రహ్మచారి.
ఇద్దరు అసిస్టెంట్లు- ముకుందరావు, అనసూయ.
హాస్పిటల్ ఖర్చులు భరించలేక ఎవరైనా ఇబ్బంది పడుతుంటే సహాయం చెయ్యడం రంగారావు నైజం.
ఇద్దరు ఛత్తీస్ ఘడ్ సోదరులను సహాయం కోసం రంగారావు దగ్గరకు తీసుకొని వస్తుంది అనసూయ.
అనసూయ మాట మీద ఆ ఛత్తీస్ ఘడ్ పిల్లలకు స్వయం ఉపాధి కోసం లోన్ ఇస్తాడు రంగారావు.
ప్రమాదంలో చెయ్యి కోల్పోయిన పర్వీన్ అనే అమ్మాయికి కూడా సహాయం చేస్తాడు.
ఇక గతకాలానికి వివరణ - ఈ సంస్మరణ చివరి భాగం చదవండి..
అప్పుడతను చెప్పడం పూర్తి చేయకముందే ఉస్మాన్ అలీ కలుగ చేసుకున్నాడు. “అవన్నీ పొందడానకి మా కాలనీ సంఘం ద్వారా ప్రయత్నిస్తున్నాం సాబ్!”
“నేను చెప్పబోయేది నష్ట పరిహారం విషయం కాదు, ఆడపిల్ల కాబట్టి— స్కూల్ ఫీజు- కాలేజీ ఫీజు రియంబర్సుమెంట్ పూర్తిగా ఎడ్యుకేషన్ డిపార్టుమెంటి నుండి పొందవచ్చంటున్నారు మా లాయర్. దీనికి తోడు ఆయన మరొక ఆసక్తికరమైన సంగతి ఒకటి చెప్పారు”
అందరూ అతడి వేపు కళ్లు విప్పార్చి చూసారు. అతడు కొన్ని క్షణాలు ఆగిన తరవాత చెప్పసాగాడు “మైనారిటీ తీరిన తరవాత మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ తో అప్లయ్ చేస్తే- దివ్యాంగులు కోటానుండి ఈ పాపకు ఉద్యోగం దొరికే అవకాశం కూడా ఉందంటున్నారు మా కంపెనీ లాయర్ గారు. పోటీ పరీక్షల బాదరా బందీకి లోనుకాకుండా—” అంటూ డ్రాయర్ సొరుగు నుండి కంపెనీ లాయర్ విజిటింగ్ కార్డు తీసి అందించాడు అలీకి--
ఆ మాట విన్నంతనే వెనుక వరసలో కూర్చున్న పర్వీన్ చప్పున లేచి వచ్చి రంగారావుకి సలాం పెట్టింది. కూతుర్ని చూసి ఆమె తల్లి దండ్రులు కూడా లేచి నిల్చున్నారు. అతడు అదేమీ గమనించకుండా నిశ్శబ్దంగా తన చేతిని అందించాడు. పర్వీన్ మిగిలిన ఆ ఒక్కచేతినీ అతడి చేతితో కలిపింది. ఇదే కదూ-- మాటకందని మౌనం—
అందరూ వెడలిపోయిన తరవాత ఎవరో టాక్స్ సేవింగ్ మ్యూచ్వల్ ఫండ్స్ పర్చేజ్ చేయడానికి వచ్చారని చెప్పడానికి రంగారావు గదిలోకి వచ్చింది అనసూయ. వచ్చి వాళ్లు కొనబోయే మ్యూచ్వల్ ఫండ్స్ వివరాలిచ్చి గది బయటకు వెళ్తూ అనసూయ రంగారావుకి ఆశ్చర్యం గొలిపే వార్తను అందించింది; ఉస్మాన్ అలీ ఆ నెల సప్లయ్ చేసిన టీ-ఖర్యుల డబ్బులు వద్దని వెళ్ళిపోయాడని—
ఆ వార్త విని, రంగారావు మొదట ఆశ్చర్యపోయి తరవాత నవ్వేసాడు. ”ఉస్మాన్ అలీగారిది పెద్ద మనసే -- కాదనను. కాని-- అది వేరు ఇది వేరు. అడిగినప్పుడల్లా టీ రుచికరంగా చేసిపెడ్తే చాలు. అలీగారు కాస్తంత ఎమోషనల్ ఐనట్టున్నారు. మీరు స్వయంగా వెళ్ళి వోచర్ పైన సంతకం తీసుకుని ఈ నెల టీ ఖర్చుల డబ్బులు ఇచ్చేసి రండి. “
ఆమె చిరునవ్వు చిందిస్తూ-అలాగే అన్నట్టు తలూపి వెళ్ళిపోయింది.
------------------------------------------------------------------------------
ఆరోజు సోమవారం. నగరంలో ముఖ్యంగా పాత బస్తీలో యేవో ప్రజా పోరాట ఆందోళనలు వ్యాపించాయి. రెండు మూడు చోట్ల సెక్షన్ 144 విధించారు భద్రతాదళం వారు. టీవీలోని వార్తలు చదివి రంగారావు బల్లపైనున్న తెలుగు దిన పత్రికను చేతిలోకి తీసుకున్నాడు. అందులో మొదటి పేజీలోని వార్తను చదివిన వెంటనే అతడు కలతకు లోనయాడు. బయటకు వచ్చి వేగంగా క్రిందకు దిగి స్టాండులోనున్న బైక్ ని తీసుకుని జోరుగా కిక్ యిచ్చాడు.
అతడు బైక్ పైన కూర్చుని తిన్నగా పిల్లల ఆస్పత్రి వేపు పోనిచ్చాడు. ఇరవై నిమిషాల్లోపల అక్కడకు చేరుకున్నాడు. అక్కడ చాలామంది పిల్లలు విషజ్వరాలకు లోనయి వార్డులోని బెడ్స్ పైన పడుకుని ఉన్నారు. అక్కడ చాలమంది పిల్లలే అడ్మిట్ అయారని అతడు ఆ పూట ఉదయం దిన పత్రికలో చదివాడు.
అతడూహించినట్టే పిల్లల తల్లులూ తండ్రులూ భారీ యెత్తున తన్నుకొచ్చే మందుల బిల్లులకు తట్టుకోలేక పోవచ్చు కదా! కొంతలో కొంత అటువంటి వాళ్ళకు వెసులు బాటు కలిగించ వచ్చు కదా! అప్పటికప్పుడు అంత మందికి మందులివ్వగల స్థితి హాస్పిటల్ ఫార్మసీకి ఉండకపోవచ్చు కదా! అప్పుడూ యిప్పుడా అని కాదు— సమయానికి మందులు కొనిచ్చి ఆదుకోవడమేగా ముఖ్యం!
మధ్యాహ్నమంతా పిల్లల ఆస్పత్రిలోనే ఉండిపోయి పిమ్మట ఆఫీసు చేరుకున్న రంగారావు- ఏమైందో యేమో గాని చలి జ్వరంతో వణకసాగాడు. అది గమనించిన అనసూయ వెంటనే ఇంటికి వెళ్లి అత్తయ్య ఆండాలుని తీసుకు వచ్చింది. వాళ్ళిద్దరూ వచ్చేటప్పుడు, తమతో డాక్టర్ ని కూడా తీసుకు వచ్చారు. బ్రెడ్డు తినిపించి పాలు తాగిపించి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మాత్రలు వేయించి చాలా సేపు రంగారావుతోనే ఉన్నారు.
మరి కాసేపు తరవాత అత్తయ్యను ఇంట్లో దిగబెట్టి వచ్చిన అనసూయ రంగారావు ఒంటిపైనున్న దుప్పటి సర్దుతూ అడిగింది- “మీరు వెళ్ళింది ఫీవర్ ఆస్పత్రే కదా— అక్కడేదో జరిగుంటుంది. కొన్ని రకాల జ్వరాలు వెంటనే ఇన్ఫెక్ట్ అవుతాయి. ఇప్పు డెలాగుందండీ! ”
రంగారావు భారంగా కళ్ళు విప్పడానికి ప్రయత్నిస్తూ గొణికినట్లు అన్నాడు- “నీతో మాట్లాడాలి. నీకు కొన్ని విష యాలు చెప్పాలి. కాని లేచి కూర్చోలేక పోతున్నాను”
ఆమె వెంటనే బదులివ్వలేదు. బాస్ ని కొత్తగా పట్టణ ప్రవేశం చేసిన విషజ్వరం తాకిందని డాక్టర్ వ్రాసిచ్చిన మందుల పేర్లు చూసి తెలుసుకుందామె. కాసేపు తేరిపార చూసి, నిదానంగా అతడి పైనుండి దుప్పటి ప్రక్కకు తొలగించి అతణ్ణి పొదవి పట్టుకుని తనకు ఆనుకునేలా కూర్చోబెట్టింది. ఇప్పుడతనికి కాస్తంత ఉపశమనం కలిగినట్లనిపించింది.
అరమోడ్పు కళ్ళతో ఆమెను తేరి చూసేందుకు ప్రయత్నిస్తూ చెప్పసాగాడు- “కొందరిని చూస్తే పెదవి విప్పి చెప్పాలని పిస్తుంది. మరికొందరిని చూస్తే మనసు విప్పి సర్వమూ వివరించాలనిపిస్తుంది. ఇంకా కొందరిని చూస్తే యేకంగా హృదయ ఖండాన్ని తీసి వాళ్ళ ముందుంచాలనిపిస్తుంది. ఇప్పుడు నీతో అదే చేయబోతున్నాను. కొంచెం ఓర్పు తెచ్చుకుని వింటావా! ”
ఉఁ అంటూ అతణ్ణి మరింత దగ్గరగా పొదవి పట్టుకుందామె. అతనికిప్పుడు వెచ్చగా నిబ్బరంగా ఉంది. ఆడదాని శరీరం లోని వెచ్చదనం కదూ-- ఆత్మీయత కలబోసిన వెచ్చదనం కదూ--
అతడా వెచ్చదనంలోని సుఖాన్ని అనుభవిస్తూ కొన్ని క్షణాలు ఊరకుండిపోయి మెల్లగా తనలో తను గొణుక్కున్నట్లు చెప్పసాగాడు- “నేనిప్పుడు చాలా మందికి- ముఖ్యంగా బీదా బిక్కీకి చేస్తూన్న సహాయ సహకారాలు యెవరి కోస మనుకుంటున్నావు? నాకోసం నా గొప్ప కోసమనుకుంటున్నావా! కాదు. ముమ్మాటికీ కాదు. మా అమ్మ మంగళాదేవి గారి కోసం చేస్తున్నాను. నేనప్పుడు మూడవ తరగతి చదువుకుంటున్నాను. మాకుటుంబం పచ్చగా కళ కళగా ఉండేది. మరీ పచ్చగా ఉంటే విధి ఓర్వ లేక పోతుందేమో! మా నాన్న స్కిన్ క్యాన్సర్ తో మంచాన పడ్డాడు.
అప్పట్నించి మా అమ్మకు కష్టాలు ఆరంభమయా యి. భారీగా పుట్టుకొస్తూన్న వైద్య ఖర్చుల కోసం- ముఖ్యంగా మందుల బిల్లులు చెల్లించడం కోసం సగం నగలు తాకట్టు పెట్టింది. మిగతా నగలు అమ్మేసింది. చివరకు పరిస్థితి యెంత వరకు వెళ్లిందంటే- ఉన్న ఇంటిని సహితం బ్యాంకు వాళ్ళకు తాకట్టు పెట్టింది. ఆ డబ్బులతో మందులూ ఇంజెక్షన్ లూ ఇప్పించి కీమో థెరపీ వంటివి చేయిపించింది. ఐనా నాన్న శరీర స్థితిలో మెరుగుదల కనిపించలేదు.
ఆ చిన్న వయసులో క్యాన్సర్ గురించి, అందులో స్కిన్ క్యాన్సర్ గురించి నాకేం తెలుసు? ఖర్చు చేస్తూ పోతే ఏది మాత్రం ఎన్నాళ్లుంటుందని? ఇక కడ గండ్లకు తట్టుకోలేక అమ్మ మా ఇంటికి దగ్గర్లో ఉన్న స్క్రాప్ షాపులోకి పనిగత్తెగా చేరింది. కాని అదంతా తార్ యెడారిలోని నీటు బొట్టుగానే మారింది. ఎదురైన ఒడి దుడుకుల్ని తట్టుకోలేక పోయింది. అమ్మ, నాన్నను బతికించుకోవాలన్న ఆవేశంలో నన్ను బడిమాన్పించ కూడదన్న పట్టుదలతో అమ్మ చివరకు-” అంటూ ఆగిపోయాడతను.
అనసూయ అతడి ముఖాన్ని పైకెత్తి తన వేపు తిప్పుకుంది. రంగారావు కళ్ళవెంట కన్నీరు ధారగా ప్రవహిస్తూంది. అనసూయ తన చీర కొంగుతో అతడి కళ్లు తుడిచింది. తుడుస్తూనే అంది- “పర్వాలేదు. ఓర్పు తెచ్చుకుని చెప్పండి. లేకపోతే గుండె బరువెలా తగ్గుతుంది? మనసుకి తెరపి యెలా వస్తుంది?”
“చెప్తాను-- చెప్తాను. చివరకు అమ్మ ఖరీదైన మందుల ఖర్చులు భరించలేక అన్య పురుషులకు కొంగు పరచనారంభించింది. మరొక పది సంవత్సరాలు ఉండవలసిన అమ్మ నాన్నపోయిన మూడేళ్ళకే చనిపోయింది. నాకు అనాథాశ్రమమే గత్యంతర మయింది”
ఆ పైన చెప్పలేక రోదించనారంభించాడు రంగారావు. అనసూయ ఇక యేమీ అడగలేదు. అతణ్ణి గుండెలకు అదుముకుంది. అదుముకుంటూ చాలా సేపు అలానే ఉండి పోయింది. ఎట్టకేలకు గొంతు ముడి వద్ద పూడుకు పోయిన దు:ఖం నుండి తేరుకుంటూ అడిగింది- “ఇప్పుడెలాగుంది రంగా! ”
“మా అమ్మ ఒడిలో తలపెట్టుకున్నట్లుంది. ఇక్కడే ఇలాగే నాతోనే ఉండిపో! కలకాలం నాలో కలసిపో! ”
ఆమె మౌనంగా ఉండిపోయింది; అతణ్ణి తన గుండెల్లోకి మరింత లోతుగా తీసుకుంటూ--
***
=======================================================================
సమాప్తం
=======================================================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
Comments