top of page

స్ఫూర్తి కిరీటాలు 3


'Spurthi Kiritalu3/3' - New Telugu Story Written By K. Lakshmi Sailaja

'స్ఫూర్తి కిరీటాలు 3/3' తెలుగు పెద్ద కథ రెండవ భాగం

రచన: కే. లక్ష్మీ శైలజ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)



జరిగిన కథ:


ఎం. బి. బి. ఎస్. చదివి అమెరికా వెళ్లిన విక్రమ్ తిరిగి ఇండియా వచ్చి స్థిరపడతాడు. అతని కొడుకు విక్రాంత్ అమెరికాలో p. hd. పూర్తి చేసి ఇండియాలో పరిశ్రమ స్థాపించాలనే ఆశయంతో వస్తాడు.


జ్యూట్ ఫ్యాక్టరీని ఘనంగా ప్రారంభిస్తాడు విక్రాంత్.

జయంతిని అకౌంటెంట్ గా అపాయింట్ చేస్తాడు.


ఇక స్ఫూర్తి కిరీటాలు 3 చదవండి..


జయంతి ఆరోజు వాళ్ళ ఇంట్లో అందరి నోట్లో చక్కర పోసింది. తాతగారు తనను మెచ్చుకున్నారని సంతోషంగా చెప్పింది. సావిత్రమ్మ కూడా సంతోషించింది. జయంతికి వచ్చే జీతాన్ని కొంచెం తీసి పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్స్ చెయ్యమని రత్నమయ్య గారు కూడా చెప్పినందున అలాగే చేస్తోంది. మగపిల్లలు కాలేజీకి రాగానే జయంతికి పెళ్ళి చెయ్యాలని ఆమె ఆలోచన.


చక్కెర డబ్బా చుట్టూ ఉన్న చీమలు చూస్తూ జయంతి చిన్న తమ్ముడు రాహుల్ “ అక్కా, రాత్రి పూట కూడా చీమలు మేల్కొనే ఉంటాయా ?” అన్నాడు.


“అవును చీమలు నిద్రపోవు. అవి ఎప్పుడూ పనిచేస్తూ, ఆహారం తింటూ ఉంటాయి, ” అంది జయంతి. రాహుల్ ఆశ్చర్య పొయ్యాడు.


ఒకరోజు ఇంట్లోనే ఆఫీస్ రూంలో లాప్ టాప్ ముందు జయంతి కుర్చీలో కూర్చొని తలకు అరచెయ్యి పెట్టుకొని కూర్చొని ఉండటం రాజేశ్వరి గమనించింది.


“ఏమైందమ్మా, ” తల మీద చెయ్యి వేస్తూ, ఆందోళనగా అంది.


జయంతి కుర్చీలో నుంచి లేచి నిలబడి తల ఎత్తి రాజేశ్వరిని మౌనంగా చూసింది గానీ, ఏమైందీ చెప్పలేక పోతోంది. ఎలా చెప్పాలి. చెప్తే అమ్మమ్మ తనను తప్పుగా అనుకుంటుందేమో. తాను ఇంటి మనిషి కాదు. పరాయి మనిషి. ‘మా ఇంటి వాళ్ళను తప్పు పడతావా?నీ కెంత ధైర్యం’ అని అంటే తాను ఏం చెప్పాలి?


రాజేశ్వరి తట్టి తట్టి పిలుస్తోంది. ‘జయంతీ, జయంతీ’అని.


జయంతి ‘‘అమ్మమ్మా’’ అంటూ సంశయంగా ఆగిపోయింది.


“వంట్లో బాగా ఉందా?” మళ్ళీ అడిగింది. తల ఊపింది, బాగానే వుందన్నట్లు జయంతి.


“కూర్చో. ఎందుకు దిగులుగా ఉన్నావు? ఇంట్లో ఏమైనా ఇబ్బందా?” అంది మళ్ళీ.


రాజేశ్వరి గట్టిగా మాట్లాడుతూ ఉండటం వినపడి బయట రూంలోనుంచి రత్నమయ్య వచ్చాడక్కడికి. వస్తూనే వాళ్ళిద్దరినీ చూసి వాకిట్లోనే నిలబడ్డాడు. తాతయ్యను చూసి జయంతి తేరుకొని ఇద్దరినీ అక్కడ కూర్చోమంది. వాళ్ళు అయోమయంగా జయంతిని చూస్తూ కూర్చున్నారు.


‘ఏమైందీ అమ్మాయికి?’ అనుకుంటూ ఉన్నారు.


“సావిత్రికి బాగానే ఉందికదా ?” అంది రాజేశ్వరి మళ్ళీ.


“బాగానే ఉందమ్మమ్మా. నేను ఇబ్బంది పడ్తున్నది ఫ్యాక్టరీ గురించి. ఈ మధ్య మనము పంపుతున్న స్టాక్ నాసిరకంగా ఉందని, కొనుగోలు దారులు తక్కువ చెల్లిస్తున్నారు. కానీ మన ముడి సరుకు నాణ్యమైనది. తయారైన బస్తాలు కూడా ఎక్కడా డామేజీగా ఉండవు. ఎందుకు ఇలా జరుగుతోందని మామూలుగా వారానికి ఒకరోజు వెళ్లడం కాకుండా మధ్యలో నేను మొన్నటి రోజు ఫ్యాక్టరీకి వెళ్ళాను” అంది.


రాజేశ్వరికి, ‘ఏదో జరిగింది.. అది జయంతికి ఇబ్బందిగా వుంది’ అనుకుంది. కానీ రత్నమయ్య మనసులో ఫ్యాక్టరీ లో ఏదో అవకతవక జరిగిందనీ, అది జయంతి తెలుసుకుంది కానీ చెప్పలేక పోతోందనీ అర్ధమయ్యింది.


“ ఇదుగో జయంతీ, ఫ్యాక్టరీ లో ఏం జరిగిందీ నిర్భయంగా చెప్పు. నీకేం ఇబ్బంది రాదు. నువ్వొక ఉద్యోగస్తురాలిగా మాత్రమే ఇక్కడ చెప్తున్నావు. అంతే. ఇక్కడ ఉన్నది అమ్మమ్మా, తాతయ్యా కాదు. ఓకే, ” అన్నాడు ధైర్యం చెపుతూ.


అతని మనసు కీడు శంకిస్తోంది. విక్రమ్ అనుభవలేమి వల్ల తెలుసుకోలేనిది జయంతికి ఇప్పుడు తెలిసినట్లుంది అనుకున్నాడు.


“తప్పు చేసినవాళ్ళు, “.. అంటూ సందేహంగా ఆగిపోయింది జయంతి.


“ఎవరైనా ఫరవాలేదు. నువ్వు సందేహించకు,” అనునయంగానే గంభీరంగా అన్నారాయన.


“తాతయ్యా, రెండు నెలలనుంచీ మన లాభాలు తగ్గాయి. ఉత్పత్తి ఎక్కువగానే ఉంది. ఎగుమతులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అందుకని బాలన్స్ షీట్ లో పరిశీలిస్తే మనకు వచ్చిన అమ్మకాల డబ్బు చాలా తక్కువగా వస్తోంది. ఏమైందని ఫ్యాక్టరీ కి వెళ్ళాను. ఆరోజు సుశాంత్ ఆఫీస్ లో లేరు, “ అంటూ ఆగింది అమ్మమ్మ వైపు చూస్తూ జయంతి.


రాజేశ్వరి ప్రశ్నార్ధకంగా రత్నమయ్య వైపు చూసింది. రత్నమయ్య మనసులో ఉన్న సందేహం కూడా తీరుతున్నట్లుగా ఉంది. ఈ మధ్య సుశాంత్ ఎక్కువగా ఇంటికి రావడం లేదు. ఫ్యాక్టరీ లో తన గదిలో ఉంటున్నాడు. భోజనం అక్కడికే పంపిస్తున్నారు. అందుకని రెండుమూడు సార్లు తాను చూడటానికి వెళితే తనను చూసి తడబడ్డాడు.


ఫైల్స్ కొంచెమటూ ఇటూ సర్దాడు, తనకేదో కనపడ కూడదన్నట్లు. తన మనసులో అప్పుడే ఏదో కొంచెం అనుమానం వచ్చింది కానీ విషయం తెలిసేంత వరకూ దండించకూడదని, వెనకడుగు వేశాడు. ఇప్పుడు జయంతి కి అదే విషయం లో తీగదొరకడం, డొంక లాగడం జరిగిపోయినట్లుంది. బంధువులు కదా చెప్తే ఏఅంటారో నని జంకుతోంది.


అందుకే రత్నమయ్య మళ్ళీ చెప్పాడు. “నువ్వు ప్రస్తుతం ఉద్యోగస్థురాలివే. బంధుత్వాలు గురించి వద్దు. వివరంగా చెప్పు, ”


జయంతి ఇలా చెప్పుకొచ్చింది. “నాకు ఇంట్లో అనుమానంరాగానే మామూలుగా వెళ్ళినట్లుగానే నేను స్కూటీ లో ఫ్యాక్టరీ కి వెళ్ళి, స్కూటీని ఫ్యాక్టరీకి ఇవతగానే ఆపేసి లోపలికి వెళ్ళాను. నా అదృష్టం కొద్దీ సుశాంత్ అప్పుడే నంద్యాలకు వెళ్ళి ఉన్నాడు. నేను వచ్చింది విక్రాంత్ గారు గమనించలేదు. బయట వాచ్ మెన్ మాత్రం చూసి విష్ చేశాడు. నేను నేరుగా సుశాంత్ గదికే వెళ్ళాను.


అక్కడ సుశాంత్ కు మీరు రీ-ఆర్డర్స్ ఇచ్చి స్టాక్ విషయం లో అధికారాన్ని పెంచినప్పటి నుంచీ మనకు వచ్చిన ఆర్డర్స్ కు డెలివరీ ఎలా, ఎవరికి పంపుతున్నారని వివరాలు చూశాను. కొన్నిపేపర్స్ ఫోన్ తో ఫొటోస్ తీసుకున్నాను. ఒక ఫైల్ లో ఒక ఆర్డర్ వెనుక ఒక ఫోన్ నెంబర్ విడిగా వ్రాసి వుంది. నోట్ చేసుకొని అన్నీ సర్ది ఇంటికి వచ్చేశాను. నేను నా బీ. సి. ఏ. క్లాస్ మాటే శిరీష ద్వారా వాళ్ళ అన్నశశాంక్ తో ఈ విషయం చెప్పి సహాయం చెయ్యమన్నాను. ఆ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి నా ఫోన్ కూడా కాన్ఫరెన్స్ లో పెట్టి మాట్లాడించాను.


శశాంక్ ను సుశాంత్ మనిషి అన్నట్లుగా చెప్పమన్నాను. ఈ సారి డెలివరీ అయ్యే సరుకును డామేజి గా ఎంత వ్రాయగలరు అని అడిగించాను. వాళ్ళ తాము డామేజ్ వ్రాసే శాతానికి ఎంత పర్సెంటేజ్ ఇచ్చేదీ వివరంగా చెప్పారు. సరేనని ఈ సారి ఒక పదిరోజుల తరువాత సరుకు పంపుతామనీ చెప్పి పెట్టేశాము. ఈ మధ్య మనకు పంపిన డామేజ్ పర్సెంటేజ్ లెక్కవేస్తే మనకు వచ్చిన నష్టం సరిపోయింది.


కానీ ఇదంతా జరిగినట్లుగా ఎక్కడ కనపడదు. నేను తయారు చేసిన రిపోర్ట్ లో మాత్రమే ఉంటుంది. అది మీరు చూసి, విక్రాంత్ గారికి చెప్తే మంచిదా కాదా అని ఆలోచించండి. తెలిస్తే బాధ పడతారు. మనకు తెలిసినా తెలియనట్లు సుశాంత్ గారిని ఇంటికి పంపిస్తే బాగుంటుందేమో. ”

అంతా చెప్పి రెండు రిపోర్ట్స్- ఒకటి నిజం, ఒకటి అపద్ధం రిపోర్ట్స్ ఇచ్చింది. ఎంత నష్టం అనగా ఎంత డబ్బు సుశాంత్ తీసుకున్నాడు అనేది తెలుస్తోందక్కడ. రత్నమయ్య సాలోచనగా చివరి మొత్తం చూశాడు. రాజేశ్వరి మొహం కోపంగా వుంది.


“ఈ విషయం మనమే చూసుకుందాము. సుశాంత్ ను ఇంటికి పంపించి, మొదట్లో లాగే నీకే స్టాక్ పని వప్పగించి, ఇంకో ఇద్దరు స్టాఫ్ ను నీ కింద ఉంచేట్టు అప్పోయింట్మెంట్ చేసుకుందామము. నేను సుశాంత్ విషయం సుశీలతో మాట్లాడి రేపు వారం వాడిని పంపించేస్తాను” అన్నారు రత్నమయ్య.


రాజేశ్వరితో” ఓకేనా, తెలియని తనం. డబ్బు వస్తోంది కదా అనుకున్నాడు. తప్పని అనుకోలేదు. మనం ఆ విషయం అడగొద్దు. సుశీలను కూడా చెప్పొద్దని చెప్దాము. వాడేమైనా బిజినెస్ పెడతానంటే డబ్బు సహాయం చేద్దాము” అన్నారు.


రాజేశ్వరి నెమ్మదిగా “సరే, ”అన్నది, మంచి పనే అన్నట్లుగా. ఒక వారం లో అన్ని పనులు చేసి, ఊపిరి పీల్చుకున్నారు రత్నమయ్య. విక్రాంత్ మాత్రం సుశాంత్ వెళ్ళి పోతుంటే బాధపడ్డాడు.


సుశాంత్ తో ఆర్ధిక, అనుబంధాల సమస్యను పరిష్కరించుకునే లోపల రత్నమయ్యకు మానసిక కష్టం కలిగేట్టు ఇంకొక సమస్య కళ్ళ ఎదుటికొచ్చింది. ఒకరోజు ఫ్యాక్టరీ లో పనిని గమనిస్తూన్న రత్నమయ్యకు గోడ పక్కన ఒక నలుగురు కూలీలు చేరి మాట్లాడుకునే మాటలు చెవిన పడ్డాయి. పని వాళ్ళలో చాలామంది చుట్టుపక్కల ఊర్ల వాళ్ళే. దగ్గర వాళ్ళయితే, వాళ్ళు వచ్చి పోవడానికి బాగుంటుందని అలా తీసుకున్నారు ఎక్కువ భాగం. దాదాపు అందరూ తెలిసినవాళ్ళే. పొలం పనులకు వస్తూవుంటారు.


ఆగొంతును బట్టి పక్క ఊరి వాళ్ళని అర్ధమయ్యింది. జయంతి రోజులో ఎక్కువ భాగం తమ ఇంట్లోనే ఉండటం, విక్రాంత్ కూడా ఇక్కడే ఉండటం గురించి వాళ్ళు తప్పుగా అర్ధం వచ్చేట్టు మాట్లాడటం విని ఒక నిముషం మనసులో బాధ అనిపించింది. వాళ్ళ మీద కోప్పడటం అనవసరమనిపించి, ఇవతలికి వచ్చేశాడు.


ఇవేమీ తెలియని విక్రాంత్ మంచి సరుకును తెప్పించడం, మంచి బ్యాగ్స్ ను ఉత్పత్తి చెయ్యడం వీటి గురించే ఆలోచించుకుంటూ వున్నాడు, రూమ్ లో.


వాళ్ళ నోరు మూయించే పని తానే చేయాలని పించిందాయనకు. తమ మనసులో కూడా కొద్ది రోజులనుంచీ ఈ మాట మసులుతూనేవుంది. కానీ పిల్లలిద్దరూ ఎప్పుడూ అలా ప్రవర్తించినట్లుగా కనిపించలేదు. ఫ్యాక్టరీ పనుల వల్ల బిజీ గా వున్నారు అనుకొని చిన్నగా నవ్వుకున్నారు. ‘కాగల కార్యం గంధర్వులు తీర్చారు’ అనుకొని ఇంటికి రాగానే రాజేశ్వరితో సంప్రదించారు. ఆమె కూడా ‘నాకు ఈ మధ్య అలాగే అనిపిస్తోంది’ అని సంతోషపడింది. ఊర్లో జరుగుతున్న శ్రీరామ నవమి ఉత్సవాలు తనకు మంచి సమయమనిపించింది.


‘పెళ్ళి పని కాబట్టి ఇక్కడ చెప్తున్నా రనుకుంటారు, ’ అనుకున్నాడు. ఊర్లో అందరికీ ఒకేసారి చెప్పినట్లు కూడా అవుతుంది అని భావించారు. జయంతికి, సావిత్రమ్మకు తమతో సంబంధమంటే భయముంటుంది తప్ప అయిష్టముండదు. అయినా ఆరోజు ఆదివారం ఉదయం సావిత్రమ్మను సంప్రదించాడు. అనుకున్నట్లే భయపడిందామె. కానీ రత్నమయ్య సర్ది చెప్పాడు. విక్రమ్, విజయలకు చెప్పాడు.


ఇక పిల్లలిద్దరినీ మధ్యాహ్నం అడిగాడు. విక్రాంత్.. జయంతి వైపు చూశాడు, ఏమంటుందోనని. జయంతి తనకు చెడ్డపేరు వస్తుందని వద్దని చెప్పింది. ఉద్యోగస్థురాలిగా మాత్రం ఉండనియ్యమంది. తన తమ్ముళ్ల బాధ్యత తనదే కనుక వాళ్ళను ఒక దారిలో పెట్టాలంది.


అప్పుడు రత్నమయ్య గారు “ఎవరికోసమో మనం అన్ని విషయాలలో భయపడవలసిన పని లేదు. మన కోసం కూడా కొన్ని చేసుకోవాలి. ఇది మా ఇష్టప్రకారం నిన్ను అడుగుతున్నాము. ఎవరో ఏదో అంటారని నువ్వు భయపడవద్దు. మీ అమ్మమ్మ కూడా ఉదయం వప్పుకుంది. నీ తమ్ముళ్ల బాధ్యత మాదే. విక్రాంత్ మంచితనం నీకు తెలుసు. నీ కిష్టమైతే మేమందరం నీకు తోడుగా ఉంటాము. నిన్నెవరూ ఏమీ అనలేరు. ధైర్యంగా వుండు, ” అన్నారు.


అప్పుడు విక్రాంత్ “నేనే చెప్పాలనుకున్నాను జేనాన్నా. కాకపోతే బిజీ వల్ల టైం కుదరలేదు. జయంతికి ఇష్టమైతే నాకు అభ్యంతరం లేదు, ” అన్నాడు.


జయంతి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. రాజేశ్వరి సముదాయించింది. ఆరోజు రాత్రి శ్రీ రామ నవమి ఉత్సవాల స్టేజి మీద ఈ పెళ్ళి గురించి ఊరి వాళ్ళందరికీ తెలియజేసి ఊపిరి పీల్చుకున్నారు రత్నమయ్య,


ఇంతలో ఇంకో శుభవార్త తెలిసింది. ఆ సంవత్సరం యువ పారిశ్రామికవేత్తలకు ఇచ్చే అవార్డు ను విక్రాంత్ కు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఉన్నత విద్య చదివి, స్వయంగా ఫ్యాక్టరీని నెలకొల్పి తక్కువ సమయంలో ఎక్కువ వ్యాపారం జరుగుపుతున్నందుకు, ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్నందుకు, ముఖ్యంగా కాన్సర్ కు ఒక కారణమైన, మరియు జంతువులకు హాని చేస్తున్న ఇంకా నీటి నిల్వలకు అవరోధమవుతూ పర్యావరణానికి చెడు చేస్తున్న ప్లాస్టిక్ కు ప్రత్యామ్యాయంగా జ్యూట్ బ్యాగ్ లను తయారు చేస్తూ ఉండటం చాలా ఉత్తమమైన పనిగా ప్రశంసించారు.


“మీ లాంటి స్ఫూర్తి దాయకమైన యువత ఈ దేశానికి ఏంత్తో అవసరం. ఎంతసేపూ గవెర్నమెంట్ ఉద్యోగం రాలేదని ఎదురుచూస్తూ, ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉండకుండా స్వతంత్రంగా ఇలాంటి చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసి, తామే తమ చుట్టూ ఉన్న వారికి ఉపాధి కల్పిస్తే వచ్చే తృప్తి ముందు ప్రభుత్వ ఉద్యోగం వల్ల వచ్చే సంతోషం తక్కువే. అందుకే ఈ బహుమతి మీకు, ” అంటూ ఆ సంవత్సరం ఉత్తమ చిన్న పరిశ్రమల స్థాపకులకు ఇచ్చే అవార్డు ను విక్రాంత్ కు ఇచ్చారు, కలెక్టర్ గారు.


ఫంక్షన్ కు శ్రవణ్ వచ్చాడు. ఇంటికి వచ్చి ఆ అవార్డును ముందు నాన్నమ్మ, జేనాన్నలకు, ఆ తరువాత అమ్మ, నాన్నలకు జయంతికి, చూపించి, వీడియో కాల్ లో చెల్లెలికి చూపించాడు, విక్రాంత్. అందరూ శ్రమకు తగ్గ ఫలితం లభించిందని సంతోషించారు.


“నీ జీవితం లో ఈ అవార్డు ‘స్ఫూర్తి కిరీటం’ అన్నారు రత్నమయ్య.

===================================================================

సమాప్తం

============================================================

కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : నా పేరు K. లక్ష్మీ శైలజ.

నెల్లూరు లో ఉంటాను.

నేను ఎం. ఏ. ఎం.ఫిల్ చేశాను.

ఇప్పటి వరకు 40 కథలు , పది కవితలు ప్రచురితమైనవి.

జూన్ 2022 న తానా గేయతరంగాలు లో గేయం రచించి పాడటమైనది.

యూట్యూబ్ లో కథలు చదవడం ఇష్టం.


19 views0 comments
bottom of page