top of page

శ్రీ పూడిపెద్ది సుందర రామయ్యగారు'Sri Pudipeddi Sundararamaiah Garu' - New Telugu Article Written By Pudipeddi Ugadi Vasantha

'శ్రీ పూడిపెద్ది సుందరరామయ్య గారు' తెలుగు వ్యాసం

రచన, వ్యాస పఠనం: పూడిపెద్ది ఉగాది వసంత

మరుగునపడిన స్వాతంత్య్ర సమర యోధులు

శ్రీ పూడిపెద్ది సుందర రామయ్యగారు


వందేమాతరం అంటున్నది మాతరం

పదం పదం గళం గళం కలగలిపి నిరంతరం


అంటూ ఉద్యమించి, బ్రిటిష్ వారి తుపాకీ కి తమ ఛాతీ ని అదిమిపట్టి, ప్రాణత్యాగానికైనా సిద్ధపడిన ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగఫలమే ఈనాడు మనం అనుభవిస్తున్న స్వతంత్ర భారతం. స్వతంత్ర సమరం లో పోరాడిన మహనీయులు ఎందరో ఉన్నారు. అందులో ఆరుపదులు దాటిన వృద్ధులతో పాటు, పదహారు ప్రాయంగల యువకిశోరాలు కూడా ఉన్నారు. అలాంటి యువకిశోరాల్లో, పూడిపెద్ది సుందర రామయ్యగారు ఒకరు.


ఆ మహానుభావులందరి పేర్లు గానీ, వారికి సంబంధించిన పూర్తి వివరాలు గానీ మనలో చాలా మందికి తెలియవు. వీళ్ళు పోరాటానికిచ్చినంత ప్రాధాన్యత, ప్రముఖులతో తీయించుకున్న ఫోటోలు సేకరించి, భద్రపరుచుకోడానికి గానీ, ప్రచారానికి గానీ ఇవ్వకపోవడమే కారణం అయి ఉంటుంది.


అలా మరుగున పడిపోయిన మాణిక్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒక మాణిక్యం, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు సుందర రామయ్య గారు. వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము.

పూడిపెద్ది సుందర రామయ్య గారు, 12-8-1912న విశాఖపట్నంలో ఎలమంచిలి దగ్గర ఉన్న దిమిలి గ్రామం లో జన్మించారు. వీరి తండ్రిగారు పూడిపెద్ది కృష్ణమూర్తి గారు దిమిలి లో ఉన్న హై స్కూల్ లో హెడ్ మాస్టర్ గా పనిచేసేరు. తల్లిగారు పూడిపెద్ది వెంకటరత్నం. తాతముత్తాతల కాలం నాటినించి అందరు బాలాత్రిపుర సుందరి దేవి ఉపాసకులే. సుందర రామయ్య కూడా ఆ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు.


సుందర రామయ్యకి పదిహేనేళ్ల వయసులోనే, తల్లి, తండ్రి ఇరువురు పది నెలల తేడాలో మరణించారు. చిన్న తనం నుంచి స్వతంత్ర భావాలూ ఎక్కువగా కలిగి ఉన్న సుందర రామయ్య, ఒక అనాధగానే తన స్వశక్తితో ఎదిగారు. ఆయన కేంబ్రిడ్జి స్కూల్ లో ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీ చదివారు.


స్వతంత్ర సమరంలో తొలి అడుగు, గాంధీగారిని కలవడం:


1929 నుండి 1945 లలో, ఐదు సార్లు మహాత్మా గాంధీ గారు విశాఖపట్నం వచ్చారు. గాంధీగారి పిలుపు మేరకు, రెండు సార్లు గాంధీగార్ని కలిసి, ఆయన చేపట్టిన అనేక ఉద్యమాల్లో, సుందర రామయ్య పాల్గొన్నారు.


1929 లో, అంటే తన పదిహేడవ ఏటే, ఉద్యమబాట పట్టి స్వాతంత్య్రం కోసం జరిగే ఉద్యమాల్లోకి అడుగుపెట్టిన సుందర రామయ్య, అతి పిన్న వయసులోనే స్వాతంత్య్రం కోసం పోరాడిన యువకుడుగా పేరు గడించారు.వైజాగ్ టౌన్ హాల్ లో గాంధీగారి సభ:


1929 ఏప్రిల్ 28 నాడు వైజాగ్ టౌన్ హాల్ లో జరిగిన అతి పెద్ద సభలో ఉప్పు సత్యాగ్రహం గురించి, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం గురించి గాంధీగారి ఉపన్యాసం విన్నాకా, అప్పటికే దేశభక్తి మెండుగా ఉన్న సుందర రామయ్యగారు మరింత ఉత్తేజితులయ్యారు..


దేశభక్తికి పరాకాష్ట:


డిగ్రీ అయిన వెంటనే, తన పదిహేడవ ఏట, హార్బర్ లో (ఇప్పుడు హార్బర్ ని పోర్ట్ ట్రస్ట్ అంటారు ) టైం సూపర్ వైజర్ గా ఉద్యోగం వచ్చింది కానీ, బ్రిటిష్ వారిచ్చిన దుస్తులు, వాచీ ధరించి, పనిచేయడం ఇష్టం లేక, ఉద్యోగంలో చేరిన వెంటనే రాజీనామా చేసేసారు.

దేశం కోసం న్యాయశాస్త్ర పట్టా పరీక్షలు వదులుకోవడం:


స్వతంత్ర భావాలు మళ్ళీ చదువుకొమ్మని ప్రేరేపించగా న్యాయశాస్త్ర పట్టాలో చేరేరు. కానీ, 1933 లో మళ్ళీ గాంధీగారి నుండి పిలుపు రావడంతో, మర్నాటి నుంచి జరగబోయే న్యాయశాస్త్రం ఫైనల్ పరీక్షలని మానుకుని, స్వాతంత్య్ర సమరం దిశగా మునుముందుకు సాగిపోయారు. అప్పటికి సుందర రామయ్యకి ఇరవయ్యేళ్లు.


ఇక అక్కడనించి వెనుతిరిగి చూడకుండా, మాజీ రాష్ట్రపతి V V గిరిగారు, తెన్నేటి విశ్వనాధం గారు, మల్లెమడుగు జగన్నాధరావు గారు, చెరుకువాడ నర్సింహారావు పంతులు గారు, దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు, మల్లవరపు వెంకట కృష్ణ రావుగారు (M V Krishna Rao garu ), మారేపల్లి రామచంద్ర కవి గారు, దిగుమర్తి వెంకట రామస్వామి గారు, దిగుమర్తి జానకి బాయిగారు, కొల్లూరు సూర్యం గుప్త, మొదలైన నాయకులతో కలిసి, సహాయ నిరాకరణ ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, తదితర స్వాతంత్య్ర ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు.


పెందుర్తి రైల్వే స్టేషన్ లో రైల్ రోకో:


విశాఖ జిల్లా పెందుర్తి రైల్వే స్టేషన్ పట్టాలపై కూర్చుని, నిర్వహించిన రైల్ రోకో కార్యక్రమం చాలా విజయవంతమైంది ఆరోజుల్లో. ఇందులో ప్రముఖ స్థానిక నాయకులు ఓ యాభై మంది దాకా పాల్గొన్నారు. వీరందరి పేర్లు ఓ శిలా ఫలకం పై చెక్కించి పెందుర్తి పంచాయతీ ఆఫీస్ లో ప్రతిష్టించడం విశేషం. ఆ శిలా ఫలకం నేటికీ పెందుర్తి పంచాయితీ ఆఫీస్ లో చూడవచ్చు.


బరంపురం జైలు జీవితం:


అనేక స్వాతంత్య్ర ఉద్యమాల్లో పాల్గొని, జైలుకెళ్లినవారిలో మల్లెమడుగు జగన్నాధరావు గారు, చెరుకువాడ నర్సింహారావు పంతులు గారు, దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు, మల్లవరపు వెంకట కృష్ణ రావుగారు (M V Krishna Rao garu ), మారేపల్లి రామచంద్ర కవి గారు, దిగుమర్తి వెంకట రామస్వామి గారు, దిగుమర్తి జానకి బాయిగారు, తెన్నేటి విశ్వనాధం గారు, కొల్లూరు సూర్యం గుప్త, V V గిరిగారు, సుందర రామయ్యగారు తదితరులు ఉన్నారు.


జైలు లో ఉన్న సమయంలో, ఆంగ్లేయులు అడిగే ఏ ప్రశ్నకి సమాధానం చెప్పాలన్నా, వీరందరూ "వందేమాతరం " అనే చెప్పేవారట. ఇలా వందేమాతరం అన్నప్పుడల్లా, పది లాఠీ దెబ్బలు కొట్టమని బ్రిటిష్ వారి ఆజ్యట. ఎక్కడా తగ్గేదిలేదు అన్నట్టుగా, దెబ్బలు తింటూ కూడా "వందేమాతరం "అనడం మానలేదుట.


సుందరరామయ్య గారి దేశభక్తి, దైవభక్తి, నిర్దేశిత జీవనసూత్రాలకి కట్టుబడే మనస్తత్వం పట్ల ఆకర్షితులైన "బెల్ " అనే దొర, ఓ రోజు ఇలా అడిగారట.. "సుంద్రం!! మిమ్మల్ని కొట్టడానికి చేతులు రావడం లేదు, అంచేత, "వందేమాతరం " అనడం మానేయండి " అని వేడుకున్నారుట.


వెంటనే సుందర రామయ్యగారు ఇలా స్పందించారట “ఓ. ఎస్ !! నేను వందేమాతరం అనడం మానేస్తాను, అయితే ఒక కండిషన్ మీద " అని, "నా బదులు మీరు వందేమాతరం అంటే చాలు" అన్నారట.


సుందర రామయ్యగారి దేశభక్తి కి చలించిపోయిన "బెల్ " దొర, కన్నీటి పర్యంతమై, సుందర రామయ్యగారిని గాఢంగా ఆలింగనం చేసుకున్నారట.


దేశభక్తుల దీనావస్థ:


స్వాతంత్య్ర ఉద్యమాలలో ఉత్సాహంగా పాల్గొన్న వారెవ్వరికి ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చేవారు కారు, వారిని యథేచ్ఛగా వ్యాపారాలు కూడా పెట్టుకోనిచ్చేవారు కారు. అలాంటి వారిని, ఎదో ఒక వంకతో, అరెస్ట్ చేసి జైలు లో పెట్టి హింసించేవారు ఆంగ్లేయులు. ఇవన్నీ చూసి, సుందర రామయ్యగారు, ఇతర ముఖ్య నాయకులు, కొన్నాళ్ళు అజ్యాతం లోకి వెళ్ళిపోయేరు. విజయనగరం దగ్గర, తుర్కమ్ చెరువు అనే చిన్న కుగ్రామంలో కొన్నాళ్ళు తల దాచుకున్నారు. తదుపరి వీరంతా రాజధాని కలకత్తా కి వెళ్ళిపోయి, తలదాచుకుని, అక్కడ మారు పేర్లతో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ జీవించేవారు.


ఆర్మీ కాంట్రాక్టు:


ఇంతలో బ్రిటిష్ ప్రభుత్వం వారు ఓ టెండర్ పిలిచారని వార్త తెలిసింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, యుద్ధభూమిలో ఉన్న సైనికులకు, ఇతర స్టాఫ్ కి ఎలాంటి జబ్బులు రాకుండా ఉండేలా నాణ్యమైన ఆహారం అందించాలని, బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించి, ఆర్మీ కాంట్రాక్టు లకి టెండర్ ప్రకటించింది.


"సుందరం పంతులు" అనే మారుపేరుతో దానికి కొటేషన్ వేసి, కాంట్రాక్టు గెలుచుకున్నారు సుందర రామయ్య. చేసే పనిలో నిబద్ధత కలిగి ఉంటారు కనక, కాంట్రాక్టు సమయమంతా అన్నీ నాణ్యమైన సరుకు అందించి, బ్రిటిష్ ఆర్మీ అధికారుల మన్ననలు సంపాయించారు. సుందర రామయ్య నిజాయితీకి మెచ్చుకుని, తనకివ్వవలసిన కాంట్రాక్టు డబ్బు కాకుండా, లక్ష రూపాయల నగదు బహుమానం అందచేశారు బ్రిటిష్ ఆర్మీ అధికారులు.


సుందర రామయ్య చేసిన దేశ సేవ లో మచ్చుకు కొన్ని:


దేశభక్తులంటే సుందర రామయ్య కి చాలా అభిమానం. తను ఆర్మీ కాంట్రాక్టు ల ద్వారా సంపాదించిన సొమ్మంతా, అలాంటి దేశభక్తులకి ఇచ్చేవారు.


వందేమాతరం అని ఎవరన్నా అనగానే, వారిని తనింటికి తీసికెళ్ళి భోజనం పెట్టించేవారు. వారికి ఆర్ధిక సహాయం కూడా అందించేవారు.


హిందూ గర్భిణీ స్త్రీ లకి నొప్పులొస్తే, తన కారు, డ్రైవర్ ని ఇచ్చి, వాళ్ళని ఘోష హాస్పిటల్ లో దింపించేవారు.


“స్టోన్ హౌస్” అనే ఇల్లు కట్టించి, అందులో, పేద బ్రాహ్మణ పిల్లలకి, పెళ్ళికి కావాల్సిన సంబారాలన్నింటిని ఇచ్చి పెళ్లిళ్లు చేయించేవారు. దాదాపు 105 పెళ్లిళ్లు చేయించారని చెపుతారు.

అధిక సంఖ్యలో యువకులు ఉద్యమాలలో పాల్గొనాలని, యువకులందరికి ఉచితంగా భోజన, వసతులు కల్పించేవారు.


ఆర్మీ కాంట్రాక్టు ద్వారా తను ఆర్జించిన లక్షల కొద్దీ డబ్బు ఎందరో పేదల ఆకలి తీర్చింది, బట్టలు తొడిగింది, ప్రాణాలు పోసింది. అవసరం లో ఉన్నవారిని ఆదుకొంటూ, అందరికి ఆత్మబంధువైనారు సుందర రామయ్య.


స్వతంత్ర ఉద్యమంలో బిజీ అయిపోయి, తన వ్యాపారాలని పట్టించుకోకపోవడం వలన, తీవ్రంగా నష్టపోయారు. దేశభక్తి కోసం సర్వం ధారపోసిన వ్యక్తిగా పేరు సంపాయించుకున్నారు.


ఎవరైనా కష్టం ఉందని, తన గడపకోస్తే, వెంటనే ధన సహాయం అందించేవారు.


ఎవరికైనా కష్టం ఉందని భోగట్టా తెలిసినా కూడా, వారి ఇంటికెళ్లి మరీ ధన సహాయం అందించేవారు.


స్వతంత్ర సమరంలో పాల్గొంటున్న వారందరికీ, ఒక ఇల్లు అద్దెకి తీసుకుని, వారికి భోజనాది సౌకర్యాలు కల్పించి, వారి వారి ఇళ్లకు పంపడానికి డబ్బు కూడా ఇచ్చేవారు.


వీరు గావించిన దానధర్మాలకు గాను, వైజాగ్ వాసులు వీరిని దేవుడు బాబు గా అభివర్ణించారు.

తమ అవసరాలకి అప్పు తీసుకున్న మిత్రులు మొహం చాటేయడంతో, కేవలం చేతిలో డబ్బు లేని కారణంగా, వీరి పెద్దకుమార్తె వివాహం మూడు సార్లు వాయిదా పడింది.


పేదరికం అంటే ఏంటో, ఆకలి రుచి ఏంటో, అనాధల అవస్థలెలా ఉంటాయో చూసిన వారు కావడం వలన, దేశంలో పేదరికం అనేది లేని రోజు రావాలని ఆకాంక్షించారు.. పేదరికానికి పెద్ద విస్తరేసి అన్నార్తుల ఆకలి తీర్చారు.


ఈ మధ్య కాలంలో శ్రీ పూడిపెద్ది సుందర రామయ్యగారికి సంబంధించి, "మూడు" ముఖ్య విశేషణాలు చోటు చేసుకున్నాయి. అవి ఇక్కడ పొందుపరుస్తున్నాను.


మొదటి ముఖ్య విశేషం:


కేంద్ర ప్రభుతం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "ప్రధాన మంత్రి యువ మెంటర్ షిప్ " లో భాగంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని, ప్రాచుర్యంలోకి రాని పలువురు స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలను ఓ పుస్తక రూపంలోకి తీసుకువచ్చారు. ఈ పుస్తకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ ఢిల్లీ వారు, 23 భాషల్లోకి అనువదించి ముద్రించారు.


ఇందుకుగాను, ఆంధ్ర ప్రదేశ్ లో మరుగునపడిన స్వాతంత్ర సమరయోధుల గురించి విషయం సేకరణ చేయడానికి, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం లో PhD చేసే ప్రవీణ్ కుమార్ అనే విద్యార్థిని ఎంపిక చేసారు. వీరు ౩౦ మంది స్వాతంత్ర సమరయోధుల గురించి వివరణాత్మక వ్యాసాలు సేకరించి పొందుపరిచి, వాటిని నేషనల్ బుక్ ట్రస్ట్, ఢిల్లీ వారికీ అందచేశారు, ఇందులో, శ్రీ పూడిపెద్ది సుందర రామయ్యగారి జీవిత చరిత్ర కూడా చోటు చేసుకోవడం చెప్పుకోదగ్గ, గొప్ప విశేషణం.


మరొక ముఖ్య విశేషం:


మన గౌరవ ప్రధాన మంత్రి మోడీ గారు, స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంలో, అదే రోజు, ఆగష్టు ఒకటవ తేదీ, 2022 నాడు, అల్ ఇండియా రేడియో వార్తల్లో, శ్రీ పూడిపెద్ది సుందర రామయ్యగారి గురించి ఐదు నిమిషాలపాటు వారి గురించి చెప్పడం మరొక ఘనమైన విశేషం.


మూడో ముఖ్య విషయం:


ఆగష్టు 15 వ తేదీ, 2022 నాడు, స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ కార్యక్రమం లో భాగంగా, అదే రోజు, అల్ ఇండియా రేడియోలో ఉదయం 7 గంటల వార్తల్లో, శ్రీ పూడిపెద్ది సుందర రామయ్యగారి గురించి మళ్ళీ మరో ఐదు నిమిషాలపాటు చెప్పడం మరొక ఘనమైన విశేషం


విషయం సేకరణ:


మా నాన్నగారి ఆప్తమిత్రులైన మాజీ రాష్ట్రపతి శ్రీ వీ వీ గిరిగారిని, శ్రీ తెన్నేటి విశ్వనాధం గారిని, శ్రీ భాట్టం శ్రీరామ్ మూర్తిగారిని, శ్రీ దిగుమర్తి రామస్వామి గారిని, శ్రీ ఎం. వీ కృష్ణారావుగారిని, మరియు వనమాల లక్ష్మణ రావుగారిని మా నాన్నగారు శ్రీ పూడిపెద్ది సుందర రామయ్యగారు కలిసి మాట్లాడుతున్నప్పుడు, వారి కనిష్ట పుత్రికగా వారి సాహచర్యం లో ఉంటూ, చాల విషయాలు తెలుసుకున్నాను. శ్రీ వీ వీ గిరిగారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేటప్పుడు, నాన్నగారు నాకు డిక్టేట్ చేస్తే, నేను టైపు చేసేదాన్ని, ఇలా కూడా అనేక విషయాలు గ్రహించాను. అలాగే మా నాన్నగారి స్నేహితులని, సన్నిహితులని అడిగి, మరింత విషయ సేకరణ చేశాను. అలాగే, మా అన్నయ్య శ్రీ పీ. ఎస్. పీ. వీ. శర్మ (శంకరుడు) ఇచ్చిన సమగ్ర సమాచారం, ప్రోత్సాహం కొనియాడతగ్గది.


వ్యాస రూపకర్త:

ఉగాది వసంత పూడిపెద్ది, రచయిత్రి

సుందర రామయ్య గారి కనిష్ట పుత్రిక


పూడిపెద్ది ఉగాది వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: పూడిపెద్ది ఉగాది వసంత

నా గురించి స్వపరిచయం...మూడు కథా సంకలనాలలో నా కథలు అచ్చయ్యాయి. తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు సంపాయించుకున్నాయి. ప్రముఖ పత్రికలూ తెలుగు వెలుగు, నవ్య, విపుల, స్వాతి, సాక్షి , సహారి, మొదలైన పత్రికలలో నా కథలు విరివిగా అచ్చయ్యాయి . పోటీలలో కూడా చాల బహుమతులు వచ్చాయి .


నా కథ మీ మన్ననలు అందుకుంటుందని విశ్వసిస్తున్నాను.


కృతజ్యతలతో


ఉగాది వసంత
54 views1 comment

1 commentaire


Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
15 août 2023

@annapurnasirisha5335 • 11 hours ago The great freedom fighter ️ proud to be an indian🇮🇳 and very greatful feel for our pedda tatagaru sri pudipeddi sundara ramaiah garu...very nice post pinni️REPLY0 replies


J'aime
bottom of page