top of page

స్వేచ్ఛగా ఎగిరే ఓ రెక్కల పక్షి


'Swechhaga Egire O Rekkala Pakshi' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao

'స్వేచ్ఛగా ఎగిరే ఓ రెక్కల పక్షి' తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

సుదర్శనరావు ఈమధ్య తన కొడుకు బబ్లు నడవడికకు తలపోటు భరించలేక రోజుకు ఒక జండూబామ్ సీసా వాడుతున్నాడు.


బబ్లు తనకు ఒక్కగానొక్క కొడుకు. 8 వ సంవత్సరం.. ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు.


బబ్లు చదువులో అన్ని ఫస్ట్ మార్కులే కానీ.. ప్రవర్తన లో చాలా కాలం నుండి ఏదో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది సుదర్శనరావు కి.


తన ఇంటి పక్కనే ఉన్న చందర్రావు గారి కొడుకు శివ బబ్లు క్లాస్మేట్. ఆరోజు కాన్వెంట్ నుండి వచ్చి తన ఇంట్లోకి వెళ్ళి పుస్తకాల బ్యాగ్ మరియు క్యారేజ్ లోపల పెట్టి.. మళ్లీ బయటకు పరుగున వచ్చి పక్కనే ఉన్న సుదర్శనరావు ఇంట్లోకి వెళ్ళాడు.. శివ.


''అంకుల్.. బబ్లూ పుస్తకాల బ్యాగు క్యారేజ్ పట్టుకొని మా కాన్వెంటుకి పక్క వీధిలో ఉన్న పసలవారి వీధిలో దొమ్మర ఆట చూడడానికి వెళ్ళాడు.. 'మీ నాన్న తిడ తాడు వద్దురా '.. అని చెప్పాను. నా మాట విన కుండా పరుగున వెళ్ళిపోయాడు'' అంటూ చెప్పాడు.


సుదర్శనరావు కి కోపం వచ్చింది. వెంటనే ఇంటికి తాళం వేసి భార్య లక్ష్మి ని తీసుకుని మోపెడ్ మీద చాలా స్పీడుగా పసలవారి వీధి చేరాడు.


అప్పటికే ఆ వీధి 4 మార్గాల కూడలిలో దొమ్మర ఆట మొదలెట్టారు.. పొడవాటి లావు వెదురు కర్రలు ఆ పక్కన ఒకటి, ఈ పక్కన ఒకటి నిలబెట్టి, ఆ రెండింటికి ఒక తాడు కట్టారు. ఆ తాడు మీద ఏడేళ్లు వయసు చిన్నపిల్లను నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ పరిస్థితిలోనైనా కాలు జారి కింద పడితే దెబ్బ తగలకుండా ఉండడానికి నేల మీద సరైన కట్టు దిట్టమైన ఏర్పాట్లు కూడా చేసుకోలేదు వాళ్లు.


ఆ పిల్ల చాకచక్యంగా, మరింత నేర్పుగా మరో వెదురు కర్రను తన రెండు చేతులతో పట్టుకుని ఏమాత్రం తడబాటు లేకుండా సునాయాసంగా ఆ తాడు మీద నడిచేస్తుంది.


వాళ్ల దగ్గర ఉన్న వాయిద్యాలు పెద్ద శబ్దం చేస్తూ

ఉండటంతో ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా హోరెత్తి పోతుంది.


చిన్నపిల్లలు నుంచి పెద్దల వరకు అందరూ చుట్టూ గుమిగూడారు. వాళ్ళల్లో కొంతమంది నిలబడి ఉన్నారు కొంత మంది కూర్చున్నారు, నేల మీద ఆ మట్టి దుమ్ము ధూళి లోనే.


మోపెడ్ ఒక పక్కన పెట్టి ఆ గుంపును సమీపించిన సుదర్శనరావు.. అందరినీ తోసుకొని లోపలికి వెళ్ళి చుట్టూ పరికించాడు. అక్కడ ముందువరుస లో నేలమీద మట్టిలో కూర్చొని తన కొడుకు బబ్లు ఆసక్తిగా,, కళ్ళు ఆర్పకుండా చాలా పరిశీలనగా చూస్తున్నాడు ఆ దొమ్మరి వాళ్ల విన్యాసాలు.


సుదర్శనరావు వెంటనే కోపంగా బబ్లు చెయ్యి పట్టు కొని.. క్యారేజ్ స్కూల్ బ్యాగ్ మరో చేత్తో పట్టుకుని బలవంతంగా లాక్కొచ్చాడు బయటకు. వెంటనే తన భార్యతో సహా ముగ్గురు చాలా స్పీడ్ గా ఇంటి కి చేరుకున్నారు.


కొడుకును ఇంట్లోకి లాక్కొచ్చి భార్య అడ్డుకుంటున్నప్పటికి వీపు మీద చేతితో రెండు దెబ్బలు తగి లించాడు కోపంతో సుదర్శనరావు.


ఆ రాత్రి బబ్లు భోజనం చేయకుండా ఏడుస్తూ పడుకున్నాడు తల్లి పక్కనే.


రెండు రోజులు పోయాక ఆదివారం వచ్చింది. కొడుకు ను సిటీలో జరుగుతున్న పెద్ద సర్కసు కు తీసుకు వెళ్లాలని భార్యతో చెప్పి అందరూ కలిసి ఆ సాయంత్రం మోపెడ్ మీద వెళ్లారు.


సుదర్శనరావు బబ్లుతో నెమ్మదిగా ఇలా అన్నాడు


''బబ్లు.. ఇలా నాకేసి చూడు. రోడ్డుమీద మట్టిలో కూర్చుని చూసే ఆ దొమ్మరవాళ్ళ ఆటలు ఎందుకురా.. ముగ్గురికీ మూడు వేలు టిక్కెట్టు కొని లోపలికి తీసుకెళ్తాను. హాయిగా ఫ్యాన్ కింద కూర్చుని ఈ సర్కస్ చూడు.. ఏనుగులు, పులులు, సింహాలు.. అబ్బో.. నువ్వు ఇంత వరకు సినిమాలోనే కానీ బయట చూడలేదు కదా సర్కస్. అది కూడా జెమినీ వారి ఇంటర్నేషనల్ సర్కస్ చూపిస్తా చూడు.. '' అన్నాడు. ముగ్గురు లోపలికి వెళ్లి ముందువరుస లో కూర్చున్నారు.


షో మొదలైన 10 నిమిషాలకే బబ్లు గాడ నిద్ర లోకి జారుకున్నాడు. సుదర్శనరావు గమనించి నిద్ర లేపి ఐస్క్రీమ్ ఇప్పించాడు.. వెంటనే పాప్కార్న్ కూడా కొనిచ్చాడు. బబ్లూ.. అవి రెండు శుభ్రంగా తిని మళ్ళి పడుకున్నాడు మత్తుగా.


సుదర్శనరావుకు చిర్రెత్తింది. ఇంకా గంట షో ఉందనగా బబ్లు ని ఇంటికి తీసుకు వచ్చేశాడు.


*


రెండు రోజుల తర్వాత ఆ దొమ్మరవాళ్ళ సర్కస్ ని పిల్లలు అందరూ చూడటం కోసం కాన్వెంట్ యాజమాన్యం తమ ఆవరణలో పెట్టారు.. ఒకరోజు సాయంత్రం..


కాన్వెంట్ ప్రిన్సిపాల్ రామేశ్వరం సుదర్శనరావు కి ఫోన్ చేశాడు.


“హలో సార్.. సుదర్శనరావు గారు, నేను శ్రీ నికేతన్ కాన్వెంట్ ప్రిన్సిపాల్ ని రామేశ్వరం మాట్లాడు తున్నాను..


చిన్న విషయం.. సార్! మీ అబ్బాయి బబ్లు మీ ఇంటి దగ్గర నుండి ఒక కిడ్డీ బ్యాంక్ తెచ్చాడు. దానిని దొమ్మర ఆటగాళ్లకు ఇచ్చేశాడు. మా స్టాప్ విషయం పసిగట్టి నాకు చెప్పడం తో నేను కిడ్డీ బ్యాంక్ ఓపెన్ చూస్తే అందులో పది వేల రూపాయల వరకూ డబ్బులు ఉన్నాయి సార్. ఇదంతా మీకు తెలిసి జరిగిందో లేదో నాకు అర్థం కాక ఫోన్ చేశాను.


ఆ డబ్బులు అన్ని దొమ్మరవాళ్లకు ఇచ్చేయ వచ్చా సార్. '' అంటూ అడిగాడు సెల్ ఫోన్ లో.


వెంటనే సుదర్శనరావు భార్యతో సహా వచ్చాడు కాన్వెంట్ కి.


ప్రిన్సిపాల్ దగ్గర్నుండి ఆ కిడ్డి బ్యాంక్ తీసుకుని తను బ్యాగ్ లో వేసుకొని తన జేబులో నుండి 10 రూపాయలు తీసి ఆ దొమ్మర ఆటగాళ్లకు ఇచ్చాడు. ఇంకా అక్కడ ప్రదర్శన జరుగుతుండగానే బబ్లు జబ్బ గట్టి గా పట్టుకొని.. లాక్కుంటూ బయటకు తీసుకొచ్చి భార్యతో సహా మోపెడ్ మీద ఇంటికి వచ్చాడు సుదర్శనరావు.


''బబ్లు.. ఇలాగైతే నిన్ను చదువు మానిపించేసి

మోటర్ షెడ్ లో పడేస్తాను. లేకుంటే మన ఇంటి పక్క పెయింట్లు వేసే సూర్యనారాయణ వెంట పంపించేస్తాను. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్.. '' అని.. అంటూ పక్కనే ఉన్న చిన్న జూక తీసుకుని చేతుల మీద రెండు తగిలించాడు.


బబ్లు.. తన తండ్రిని చూసి భయపడుతూ..

'' కొట్టొద్దు నాన్న.. కొట్టొద్దు..'' అని ఏడుస్తూ తల్లి ఒడిలోకి చేరిపోయాడు.


*


పది రోజులు పోయాక..


సంక్రాంతి పండుగ వచ్చింది. కచేరీ చావడి దగ్గర పగటివేషగాళ్ళు ఉన్నారని తెలిసి భోజనం కూడా చెయ్యకుండా అక్కడకు వెళ్లిపోయాడు బబ్లు. వాళ్ళ వేషధారణ, మాటలు అన్నీ సునిశితంగా పరిశీలిస్తూ.. వాళ్లల్లో ఒకడిని అడిగి పుస్తకం మీద వాళ్ల గురించి ఏదో రాసుకుంటున్నాడు.


ఇక్కడ.. ఇంటికి వచ్చిన భర్తకు బబ్లు కనబడటం లేదని చెప్పింది బబ్లు తల్లి లక్ష్మి.


వెంటనే సుదర్శనరావు మోపెడ్ మీద ఊరంతా తిరిగి మొత్తానికి బబ్లు ని పగటివేషగాళ్ళు ఉన్న చోట పట్టుకొని ఆ కచేరి చావడిసెంటర్ లోనే చేతుల మీద కాళ్ల మీద అటూ ఇటూ కొట్టాడు. గట్టిగా ఏడుస్తున్న బబ్లుని ఇంటికి తీసుకు వచ్చాడు.


''ఊర్లో నా పరువు మొత్తం తీసేస్తున్నావురా. ఏసీ థియేటర్లో మంచి సినిమాలు చూపిస్తూనే ఉన్నాను కదా. ఈ వెధవ వేషాలు ఏమిటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈసారి ఇలాంటి వేషాలు వేస్తే చేతి మీద వాతలు పెడతాను. ఇప్పుడే వంగక పోతే పెద్దయ్యాక ఎలా ఒంగుతావు రా నువ్వు''.. అంటూ భార్య వారిస్తున్నా ఇంటికి తీసుకొచ్చి ఇంటిదగ్గర మరో రెండు తగిలించాడు.


ఆ రాత్రి బబ్లు కి జ్వరం వచ్చింది.. రెండు రోజులుండి తగ్గిపోయాక.. ఒక ఆదివారం బబ్లూ ని ఏసి థియేటర్లో సినిమాకు తీసుకువెళ్ళాడు సుద ర్శనరావు భార్యతో.


ఈసారి కూడా బబ్లు పదినిమిషాలు సినిమా చూశాక నిద్రలోకి జారిపోయాడు.


''వెయ్యి రూపాయలు వేస్ట్. ఈ వెధవని.. గేదెలు కడిగే చోట పనికి పెట్టాలి''అంటూ సుదర్శనరావు కొడుకుని సినిమా మధ్య లోనే ఇంటికి తీసుకు వచ్చాడు.


**


ఈ వయసులోనే కొడుకుని సరైన దారిలో పెట్టాలి

లేకుంటే భవిష్యత్తులో తన మాట వినడు అని పించింది సుదర్శనరావుకి.. వెంటనే తన తమ్ముడు విజయనగరం లో ఉన్న కుమార్ కి ఫోన్ చేశాడు. ఆ మర్నాడే కుమార్ వచ్చాడు. కుమార్ విజయనగరంలో చిన్నపిల్లల డాక్టర్.


సుదర్శన్ రావు తన తమ్ముడు కుమార్ కి వివరంగా అన్ని విషయాలు చెప్పాడు.. బబ్లుని విజయనగరం లో ఎవరైనా మంచి మానసిక వైద్యుడు కి చూపిస్తే బాగుంటుంది అని తన అభిప్రాయం కూడా చెప్పాడు.


కుమార్ సావధానంగా విషయాలన్నీ విని అన్నగారి ని తొందరపడవద్దని చెప్పి.. బబ్లు ని తీసుకుని పార్కుకి వెళ్ళాడు.


గంట తర్వాత తిరిగి వచ్చాడు.. బబ్లూ ని వీధిలో ఆడుకోడానికి పంపించి.. అన్న వదిన దగ్గర కూర్చు న్నాడు.. కుమార్.


''అన్నయ్య నీకన్నా చిన్నవాడి ని. నేను నీకు చెప్తు న్నాను అని అనుకోవద్దు.. బబ్లూ గురించి మనకు చిన్నప్పటి నుండి తెలుసు కదా.. వాడిది ఓ డిఫరెంట్ మైండ్ అని మనoదరం అనుకునే వాళ్ళం.


అది మనందరం గ్రహించి.. తదనుగుణంగా వాడి భవిష్యత్తు బాటలు వేయాలి. పార్కులో వాడితో చాలాసేపు మాట్లాడాను. అమ్మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం అని చెబుతూ.. చాలా ప్రశ్నలు నన్ను వేశాడు.. మన బబ్లు.


‘మనుషులకు కోపం ఎందుకు వస్తుంది’ అని వాడి మొదటి ప్రశ్న.


‘అంత అందమైన గులాబీ పువ్వు కు ముళ్ళు ఎందుకు ఉంటాయి..’ ఇది వాడి రెండవ ప్రశ్న.


‘తిండిలేని వాళ్లు ఎలా బ్రతుకుతున్నారు?’ ఇది వాడి మూడవ ప్రశ్న. ఇంకా చాలా ప్రశ్నలువేశాడు.


వాడి చిన్నప్పట్నుంచీ నేను నీకన్నా వాడితో ఎక్కువ చనువు గా ఉండేవాడిని కనుక నా దగ్గర ఏ మాత్రం భయం లేకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు. వాడి ప్రశ్నలకు సంపూర్తిగా నేను సమాధానం చెప్పలేక పోయాను. కానీ వాడి లో ఈ వయసులోనే అంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందో అర్థం చేసుకోలేక పోతున్నాను. పురివిప్పిన నెమలిలా వాడి మనసు మహా ఆనందంగా ఉంది.


నువ్వు కూడా అంతే అన్నయ్య.. చిన్నప్పుడు ఇంట్లో రక రకాల పురాణ పాత్రలు నటించి చూపించే వాడివి. పెద్ద సినిమా యాక్టర్ అవుతానని చెప్పే వాడివి. నాన్న నిన్ను కొట్టి తిట్టి ఇంజనీర్ లో జాయిన్ చేయించాడు. ఇష్టం లేని నువ్వు అది కూడా పూర్తి చేయలేక ఇదిగో ఇప్పుడు ఈ చిన్న ఉద్యోగం లో సుఖం లేకుండా బ్రతికేస్తున్నావ్. అప్పుడే నిన్ను చదువుతో పాటు నీ మనసుకు ఇష్టమైన నటన లో నీకు ఉత్సాహం కల్పిస్తే ఇప్పుడు ఎక్కడ ఉండేవాడి వో. ఆనాడు నీ బాల మేధస్సును నాన్న అర్థం చేసుకోలేనట్లే ఇప్పుడు నువ్వు కూడా బబ్లు విషయంలో ప్రవర్తిస్తున్నావు. నీకన్నా సంవత్సరంనర చిన్నవాడినైన నాకు అప్పటి విషయాలన్నీ బాగా గుర్తు కనక చెప్తున్నాను.


రోడ్డుమీద మట్టిలో కూర్చుని వీధి ప్రదర్శన చూశాడు అంటే.. వాళ్లకు తన దాచుకున్న డబ్బులు మొత్తం ఇచ్చేశాడు అంటే.. ప్రాచీన కళల పట్ల, అలాగే లేని వాళ్ళ పట్ల వాడి ఆలోచన ధోరణి అర్థం చేసుకోవచ్చు.


పగటివేషగాళ్ళు వేషధారణను ఇష్టపడుతున్నాడు అంటే.. సమాజాన్ని వాడు నిశితంగా పరిశీలిస్తున్నట్టు నీకు అనిపించడం లేదా?


బబ్లు కి తండ్రి స్థానం నుంచి నువ్వు ఆలోచించొద్దు అన్నయ్య.. బబ్లుకి ఒక మంచి స్నేహితుడుగా ఆలోచించు.


ఏ పిల్లలకైనా ముందు తల్లిదండ్రులే మంచి స్నేహితులు కావాలి అన్నయ్య. అప్పుడు వాళ్ళు మానసికంగా ఎదుగుతారు. అలాంటి వాళ్లే ఈ దేశానికి భావిభారత పౌరులుగా ఎదుగుతారు.


వదిన.. నువ్వు ఏమన్నాసరే, పంపడానికి ఇష్టపడక పోయినా సరే బబ్లుని నాకూడా తీసుకెళ్ళిపోతాను. టెన్త్ పూర్తయ్యే వరకు మా అబ్బాయి పింకీ తో పాటు అక్కడే ఉంటాడు. ప్రస్తుతం ఇప్పుడు వాడికి స్థల మార్పు కావాలి. మనమందరం ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుసుకోవచ్చు.. కాదనకండి. బబ్లూ మీ ఇద్దరికీ ఎంతో నాకూ అంతే కదా.


ఇంతకుముందు బబ్లుని అడిగాను.. ‘మా ఇంటి దగ్గర ఉండి మా అబ్బాయి పింకీ తో పాటు కలిసి చదువుకుంటావా’ అని.. బాగా ఇష్టపడి సరే అన్నాడు.. బబ్లు. ఇక మీరు ఏమీ అభ్యంతరం చెప్పకండి.


వాడితో మాట్లాడి నేను అర్థం చేసుకున్న దాన్నిబట్టి వాడి మనసుకు ఇప్పుడు బాగా స్వేచ్ఛ కావాలి. మీ దగ్గర స్వేచ్ఛ బాగానే ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో మీ దగ్గర కన్నా నా దగ్గర వాడికి ఎక్కువ స్వేచ్ఛ దొరుకుతుంది అనేది నా అభిప్రాయం.


చదువు అబ్బే ఈ చిన్నారి వయసులో వాళ్ల మనసు బందీ అయిపో కూడదు అన్నయ్య స్వేచ్ఛగా ఎగిరే పక్షిలా ఉండాలి.


నీకన్నా చిన్నవాడిని నీకు చెబుతున్నానని ఏమీ అనుకోవద్దు. పిల్లల మనస్తత్వాలు నాకు కొంతలో కొంత తెలుసు కనుక చెప్పవలసి వచ్చింది'' అంటూ అన్నా వదినలను ఒప్పించాడు విజయనగరం నుండి వచ్చిన డాక్టర్ కుమార్.


కుమారు చెప్పింది వాళ్ళిద్దరూ బాగా అర్థం చేసుకు న్నారు.


ఆ రోజే కాన్వెంట్ లో బబ్లు ట్రాన్స్ఫర్ కు సంబంధించిన పనులు పురమాయిoపులు చేసి.. ఆ సాయంత్రం రైల్వే స్టేషన్కు చేరిపోయారు వాళ్లంతా.


బబ్లు ని తల్లిదండ్రులు ప్రేమతో ముద్దు పెట్టుకున్నారు.


ఆకాశంలో ఆనందంగా ఎగిరే రెక్కల పక్షిలా బబ్లు మహదానందంగా ఉన్నాడు ఇప్పుడు.

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నల్లబాటి రాఘవేంద్ర రావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు

Profile Link:

Youtube Play List Link:

https://www.youtube.com/playlist?list=PLUnPHTES7xZoIxGa0YWaOkHitya8HiEb0


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు




48 views1 comment
bottom of page