top of page

తెలుగు - పార్ట్ 1


'Telugu - Part 1/2' - New Telugu Story Written By Lakshmi Madan

Published In manatelugukathalu.com On 01/03/2024

'తెలుగు - పార్ట్ 1/2' పెద్ద కథ ప్రారంభం

రచన, కథా పఠనం: లక్ష్మి మదన్




రాధమ్మకు మేఘాలలో తేలి పోయినంత సంతోషంగా ఉంది. 15 రోజుల క్రితం భర్త ఆమెను పిలిచి..


"ఇదిగో, ఉన్నావా?" అని పిలిచాడు భాస్కరం.


"ఉండక ఎక్కడికి పోతాను ఏంటో చెప్పండి" అన్నది చిరాకుగా రాధమ్మ...


"మంచి మాట చెప్తాను అనుకుంటే ఆచిరాకుగా మొహం పెడతావ్ ఏంటి" అని విసుక్కున్నాడు భాస్కరం..


"అదేం లేదండి స్టవ్ మీద కూర పెట్టాను మాడిపోతుందని సరేలెండి స్టవ్ బంద్ చేసి వస్తాను" అంటూ లోపలికి వెళ్లి స్టవ్ బంద్ చేసి చేతులు కడుక్కొని వచ్చి భాస్కరం ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది.


"సంతోషమైన వార్త వెంటనే చెప్పాలనుకుంటే నీ విసుగుతో నాకు మూడంతా పోయింది సరేలే... కొడుకు కోడలు మరియు బిడ్డ అల్లుడు అమెరికా నుండి ఒకేసారి వస్తారట. ఈశుభవార్త చెప్పాలని నిన్ను పిలిచాను" అన్నాడు భాస్కరం సంతోషంగా...


"ఏంటి.. పిల్లలు అంతా వస్తారా.. అందులో అందరూ ఒక్కసారి వస్తున్నారా అయ్యో ఏం చేయను.. పనులన్నీ ఎలా అవుతాయి" అంటూ ఒకపక్క సంతోషం, ఒకపక్క టెన్షన్ పడుతూ కుర్చీలో నుండి లేచి అటు ఇటు తిరగసాగింది రాధమ్మ.


"అసలు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు రాధమ్మ" అన్నాడు భాస్కరం.


"మీకు అలాగే అనిపిస్తుంది. నేను ఎన్ని పనులు చేసుకోవాలి.. ఇల్లంతా సర్దాలి, పిల్లలకు గదులు ఏర్పాటు చేయాలి. పక్క బట్టలన్నీ మార్చాలి. ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి.. అసలే అమెరికా నుండి వస్తున్నారు. వాళ్లకు కావాల్సిన పిండి వంటలు అన్ని చేసి పెట్టాలి.. ఎన్నుంటాయండి" అన్నది రాధమ్మ ఇంకా హడావుడి పడుతూనే...


"అదేంటే వాళ్లంతా ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలే కదా! ఇవాళ కొత్తగా దుమ్ము ధూళి వస్తుందా వాళ్ళకి ఏంటే నీ అర్థం లేని మాటలు మరీ ఇంత అతి పనికిరాదు సుమా!" అన్నాడు భాస్కరం..


"వాళ్లు వెళ్లి 12 ఏళ్లు అయింది ఇప్పటివరకు పిల్లలు మన ఇల్లు చూడలేదు వాళ్లకు ఈ డస్ట్ పడుతుందో లేదో కాళ్లకు చేతులకు మట్టి అంటుకుంటుందా అని పిల్లలు ఏమనుకుంటారో!" అన్నది రాధమ్మ..


"సరేలే నీ బాధలు నువ్వు పడు. అవసరమైన సరుకులు లిస్టు ఇవ్వు, నేను తెచ్చి పెడతాను. ఆ తర్వాత మిగతావన్నీ నువ్వు నిదానంగా చేసుకో" అన్నాడు భాస్కరం.


వీళ్ళు ఉండేది చిన్న పల్లెటూరు. రాధమ్మ పుట్టి పెరిగింది కూడా పల్లెటూర్లోనే. ఎక్కువ చదువుకోలేదు కూడా.. భర్త టీచర్ ఉద్యోగం చేస్తూ ఏ ఊరికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి వెళ్ళేది. అన్ని చిన్న చిన్న ఊళ్లే. పిల్లలను మాత్రం ఐదవ తరగతి నుండి పట్నంలో హాస్టల్లో ఉంచి చదివించారు.. ఏమీ తెలియలేదు రాధమ్మకు.. తెలుగు తప్ప ఇంగ్లీషు హిందీ ఒక్క ముక్క కూడా అర్థం కాదు... పిల్లలు ఎన్నో సార్లు చెప్పారు "నాన్న దగ్గర కొంచెం ఇంగ్లీష్ నేర్చుకో అమ్మ, ఎక్కడికైనా వెళ్లినా, ఎవరైనా వచ్చినా నీకు సులభంగా ఉంటుంది" అని..


ససేమిరా అంటూ రాధమ్మ ఆ చదువుల జోలికి వెళ్లలేదు...


ఎప్పుడు చూసినా ఇంట్లో పని. అప్పడాలు వడియాలు చేయడం, పిల్లలకు ఇష్టమైన పిండి వంటలు చేసి భర్తకి ఇచ్చి అమెరికాకు పంపించడం, స్వయంగా పిండి గానీ రవ్వ గాని ఇంట్లోనే విసురుకోవడం, ఎప్పటికప్పుడు ఇల్లు శుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టుకోవడం, ఇంకా కుదిరితే చీరల మీద ఎంబ్రాయిడరీ చేసుకోవడం.. ఇలాంటివంటే చాలా ఇష్టం. ఆమె జీవితం ఇలాగే గడిచిపోతుంది...


ఒకసారి కేబుల్ టీవీ వాళ్ళ దగ్గర నుండి ఒక ఫోన్ వచ్చింది.. వాళ్ళు కేబుల్ కనెక్షన్ ఇవ్వాలని మాట్లాడుతూ ఏదో బి తో ఉన్న పేరు చెప్పి ఇలా చేయాలి అన్నారు. ఎన్ని సార్లు బి చెప్పినా విలాగే అర్థమయింది రాధమ్మకు. అప్పుడు వాళ్లు బి ఫర్ బాంబే అమ్మ అని అన్నారు. అంటే సులభంగా అర్థం కావడానికి. కానీ ఆ విషయం రాధమ్మకి అర్థం కాక "బాంబే ఏంటి బాంబే.. మేము వనపర్తి లో ఉంటే నువ్వు బాంబే అంటావేంటి. కేబుల్ కనెక్షన్ బాంబేలో ఇస్తావా ఏంటి" అంటూ మాట్లాడేసింది..


అక్కడే ఉన్న పిల్లలు గట్టిగా నవ్వారు...


"నన్ను చూసి మీరు ఎందుకు నవ్వుతున్నారు? ఫోన్లో వాడు అలా మాట్లాడితే తప్పులేదు కానీ నేను అరుస్తున్నానని నవ్వుతున్నారా" అని కోపం తెచ్చుకుంది రాధమ్మ..


"అది కాదమ్మా ఏదైనా అక్షరంతో పేరు చెప్తే మనకు అర్థం కాకుంటే ఏదైనా ఊరు పేరు కానీ వస్తువు పేరు కానీ చెప్తారు అప్పుడు మనకు అర్థమవుతుంది" అని చెప్పాడు అక్కడే ఉన్న కొడుకు విక్రాంత్.


"ఇవన్నీ నాకేం తెలుసు" అంటూ లోపలికి వెళ్ళిపోయింది రాధమ్మ.


చదువు రాకపోయినప్పటికీ తెలివితేటల్లో మాత్రం ఏ మాత్రం తగ్గదు.. ఇంటిని చక్కబెట్టుకోవడం ఖర్చు లెక్కలు చూసుకోవడం పొదుపుగా వాడుకోవడం తెలుసు...


ఇక రాధమ్మ హడావుడి ఇంత అంతా కాదు ఇద్దరు పని వాళ్ళని మాట్లాడుకొని ఇల్లంతా అంగుళం అంగుళం కూడా పరీక్షించి శుభ్రం చేయించింది పడకగదులకైతే సున్నాలు కూడా వేయించింది... బాత్రూమ్స్ క్లీన్ చేయించి ఇలా ఒకటేమిటి ఇంటిని అద్దంలా తయారు చేసింది...


ఇక భాస్కరం కిరాణా షాపుకు ఇంటికి తిరగడమే సరిపోయింది తెచ్చిన సామాన్లు సరిపోలేదని ఇంకా కొన్ని మరిచిపోయానని ఇలా పంపిస్తూనే ఉంది..


అతను కూడా రాధమ్మ ఆత్రుతను అర్థం చేసుకొని చెప్పిన పనల్లా చేసుకుంటూ పోతున్నాడు...


భాస్కరం రిటైర్ అయిన కూడా అతనికి ఊరికే ఉండడం ఇష్టం లేక ఒక స్కూల్లో పని చేస్తున్నాడు.. ఇక అతను స్కూలుకు లీవ్ పెట్టి ఇంట్లో పనులన్నీ చూసుకోవడానికి నిర్ణయించుకున్నాడు.


ఎన్నో రకాల పిండి వంటలన్నీ చేసి డబ్బాలు నింపించింది...


ఇక మధ్యాహ్నం వరకు వాళ్లు వస్తారని తెలిసింది భర్త భాస్కరం అద్దెకు కార్ తీసుకొని పట్నం వెళ్ళాడు వాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి...


భోజనానికి అన్ని ఏర్పాట్లు చేసింది... పులిహోర మామిడికాయ పప్పు వంకాయ పులుసు బెండకాయ వేపుడు దోసకాయ పచ్చడి అన్ని చేసి పిల్లల కోసం ఎదురు చూస్తూ కూర్చుంది రాధమ్మ...


ఇంతలో వాకిట్లో కారు చప్పుడు అయ్యింది. ఒక్క పరుగున వాకిట్లోకి వెళ్ళింది...


ఇంటి ముందు రెండు కార్లు ఆగి ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ లగేజ్ కి ఒక కారు సరిపోదని మరొక కారు పట్నంలో అద్దెకి తీసుకొని వచ్చారు ముందుగా పిల్లలు దిగారు... పిల్లలని ఎప్పుడైనా ఫోన్లో చూడటమే తప్ప వాళ్ళని ఇప్పటివరకు చూసింది కూడా లేదు... ఒక్కసారి మనసంతా సంతోషంతో ఉప్పొంగిపోయింది రాధమ్మకు గబా గబా వాకిట్లోకి పరిగెత్తి కూతురు పిల్లలని కొడుకు పిల్లలని రెండు చేతులతో దగ్గరకు తీసుకుంది...


వాళ్లకు నానమ్మ తాతయ్య ఎవరో తెలియనే తెలియదు ఒక్కసారి ఆ పిల్లలు చేతులు విదిలించుకుని..


"ఏ వాట్ ఇస్ దిస్" అని అన్నారు..


ఇంతలో కొడుకు కోడలు కూతురు అల్లుడు కార్ల నుండి దిగారు...


"వాళ్లని కంగారు పెట్టకమ్మా కాస్త సర్దుకోని అలా గట్టిగా హత్తుకుంటే వాళ్లకు ఊపిరాడదు" అన్నారు వాళ్లు..


బిత్తర పోయింది రాధమ్మ ఇన్నాళ్లకు పిల్లలను చూస్తున్న అనే సంతోషంతో పట్టుకుంటే ఇలా అన్నారు ఏంటి అని అనుకొని సరేలే అని తనకు తాను సర్ది చెప్పుకొని లోపలికి నడిచింది..


అందర్నీ సంతోషంతో పలకరించింది... కోడలు ఇల్లంతా పరికించి చూస్తూ మొహం చిట్లించుకొని..


"మా సామాను ఏ గదిలో పెట్టమంటారు" అని అడిగింది.


"ఇదిగో ఈ గదిలో పెట్టమ్మా రెండు గదులు శుభ్రం చేయించాను" అని చెప్పి లోపలికి తీసుకెళ్ళింది..


గదిలో పెద్ద పందిరి మంచం దానిమీద చక్కగా పరిచిన కొత్త దుప్పటి... పక్కనే పెద్ద కిటికీ కిటికీలో నుండి కనిపిస్తున్న ముద్దమందారం చెట్టు మరియు మల్లె చెట్టు చక్కని గాలివీస్తుంది.. గది ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కొంచెం సంతృప్తిగా చూసింది కోడలు నీరజ.


బయటకు వచ్చి కూతురిని మరో గదిలోకి తీసుకెళ్లింది "ఇదిగో దీపా నువ్వు ఈ గదిలోపెట్టుకో అయినా నీకు చిన్నప్పటినుండి ఈ గది అంటే ఇష్టం కదా" అన్నది రాధమ్మ.


అందరూ స్నానాలు చేసి వంటింట్లోకి వచ్చారు ఇంట్లో భోజనాల బల్ల లేనందువల్ల అందరికీ పీటలు వేసి కంచాలు పెట్టి వడ్డించింది రాధమ్మ.


పిల్లలు ఏవేవో అడుగుతున్నారు ఒక్క ముక్క కూడా రాధమ్మకు అర్థం కావడం లేదు వాళ్లకు తెలుగు అసలే రాదట ఇంట్లో బయట అంతా ఇంగ్లీషులో మాట్లాడతారట...


ఆ మాటలను ఇటు కొడుకు అటు కూతురు గొప్పగా చెప్పుకోసాగారు..


వాళ్లకు తెలుగు రాదమ్మ.. నువ్వు వాళ్లతో ఎలా మాట్లాడుతావో ఏంటో ఇంగ్లీష్ నేర్చుకోమంటేనేమో నేర్చుకో వు.." అన్నది దీప..


గ్రానీ గ్రాండ్పా అంటూ పిలసాగారు ఆ పిలుపులే నచ్చలేదు భాస్కరంకు గాని రాధమ్మకు గాని చక్కగా నానమ్మ తాతయ్య అని పిలిస్తే ఎంత బాగుంటుంది అని మనసులో అనుకున్నారు..


అసలు పిల్లలు భోజనమే సరిగా చేయలేదు వాళ్లకు ఈ వంటలు ఏవి నచ్చలేదట..


“అమ్మ ఇంకా ఇవే వంటలు చేస్తున్నావా నువ్వు ఎప్పుడు మారతావు కొత్త వంటలు నేర్చుకోలేవా పిల్లలకి ఈ వంటలు ఎక్కువ అలవాటు లేవు" అని చెప్పాడు విక్రాంత్..


బుర్ర తిరిగిపోసాగింది రాధమ్మకు" దూరదేశంలో ఉన్నంత మాత్రాన మాతృభాషను దూరం చేసుకుంటారా చిన్నప్పుడు తిన్న తిండ్లను మరిచిపోతారా..".. అని అనుకున్నది..


భోజనాలు అయ్యాక అందరూ ఎవరు గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు అలసిపోయి ఉన్న వాళ్లంతా వెంటనే నిద్రపోయారు.


తర్వాత వంటింట్లో రాధమ్మ కూర్చొని భోంచేసింది అక్కడికి వచ్చిన భాస్కరం ఆమె వంటిల్లుసర్దడం సహాయం చేశారు....


========================================================================

ఇంకా ఉంది..

========================================================================


లక్ష్మి మదన్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం ; పేరు లక్ష్మి

కలం పేరు : లక్ష్మీ మదన్

హైదరాబాద్ లో ఉంటాను.

500 కి పైగా కవితలు


32 views0 comments
bottom of page