'Telugu - Part 2/2' - New Telugu Story Written By Lakshmi Madan
Published In manatelugukathalu.com On 05/03/2024
'తెలుగు - పార్ట్ 2/2' పెద్ద కథ
రచన, కథా పఠనం: లక్ష్మి మదన్
రాధమ్మ పడుకున్నది అన్నమాట కానీ నిద్ర రావడం లేదు. పిల్లలతో ఎంతో సంతోషంగా గడపాలనుకుంటే,
"వాళ్లకి తెలుగు రాదు ..నాకు ఇంగ్లీష్ రాదు.. ఇన్ని రోజులు అందరూ చెప్పినా కూడా నేను ఇంగ్లీష్ నేర్చుకోకపోతిని కదా పిల్లలు తినే ఆహార పదార్థాలు ఎలా చేయాలో నాకు తెలియదు పిల్లలు నాకు ఎలా దగ్గరవుతారు?"..
ఇలా ఆలోచిస్తూ తెల్లవార్లు నిద్రపోకుండానే ఉన్నది...
ప్రొద్దున లేచిన తర్వాత స్నానం,, పూజ చేసుకున్న రాధమ్మ పిల్లల కోసం తపాలా రొట్టె తయారు చేసింది. బియ్యం పిండిలో వాము జీలకర్ర ఉప్పు, పచ్చిమిరపకాయ ముద్ద సన్నగా తరిగిన ఉల్లిపాయలు నువ్వులు కొత్తిమీర కరివేపాకు వేసి దళసరిగా ఉన్న బాండ్లీలో పెట్టి చక్కగా తపాలా రొట్టెలు తయారు చేసింది...
పిల్లలకు వచ్చిన రోజు ప్రయాణం వల్ల చిరాకుగా ఉండి ఎక్కువ సేపు నిద్రపోయారు.. వాళ్లు నిద్రలేచి మొదట వంటింట్లోకి వచ్చారు.. వాళ్లకు నాయనమ్మని చూడగానే ఎంతో సంతోషంగా అనిపించింది...
ఎర్రటి కుంకుమ బొట్టు, ముక్కు కు తెల్ల రాళ్ల ముక్కుపుడక, చక్కగా జడ వేసుకొని తలలో ఎప్పుడూ ఏదో ఒక పువ్వు పెట్టుకుని చక్కని చీర కట్టులో వాళ్ళకి వాళ్ళ నాయనమ్మ ఎంతో అందంగా కనిపించింది... కూతురు పిల్లలు కూడా అమ్మమని చూడగానే వాళ్ల సంతోషాన్ని వ్యక్తపరిచారు...
రాధమ్మ పిల్లలను చూడగానే దగ్గరికి రమ్మని చెయ్యితో పిలిచింది...
"గుడ్ మార్నింగ్ గ్రానీ" అన్నారు పిల్లలందరూ ఒకేసారి...
" నో గ్రానీ.. నానమ్మ ,అమ్మమ్మ" అని చెప్పింది రాధమ్మ నవ్వుతూ..
పిల్లలు కూడా రాధమ్మ మాట్లాడేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు...
ఓకే ఓకే.. అని కొడుకు పిల్లలు నానమ్మ అని కూతురు పిల్లలు అమ్మమ్మని పిలిచారు...
ఒక్కసారిగా గాలిలో తేలినట్లు అనిపించింది రాధమ్మకి.. అక్కడే ఉండి చూస్తున్న భాస్కరం రాధమ్మ సంతోషాన్ని చూసి తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు...
పిల్లలు బ్రష్ చేసుకుని లోపలికి వచ్చారు వెంటనే వారికి గ్లాసుల్లో పాలు పోసి ఇచ్చింది రాత్రి కూతురు కోడలు చెప్పిన విషయం గుర్తు వచ్చింది...
"పిల్లలకు పాలలో కార్న్ ఫ్లెక్స్ లేదా బిస్కెట్స్ వేసి పెట్టమ్మా" అని చెరొక ప్యాకెట్టు ఇచ్చారు...
కానీ రాధమ్మకి అవేవీ పెట్ట బుద్ధి కాలేదు ..వాళ్ళు చక్కగా పాలు తాగిన తర్వాత స్నానం చేయడానికి తీసుకెళ్లింది అందరికీ వేడి నీళ్లు బక్కెట్లల్లో పోసి ఆరుబయట కూర్చోబెట్టి చక్కగా సున్నిపిండి పెట్టి స్నానాలు పోసింది...
"ఇదేంటి "అని పిల్లలు అడిగారు రాధమ్మకు అదేంటో చెప్పడానికి చేతకాలేదు వెంటనే భాస్కరం వచ్చి "ఇది సబ్బు కన్నా చాలా మంచిది ఒంటికి రాసుకుంటే ఒళ్ళు చక్కగా మెరుస్తుంది "అని చెప్పారు..
పిల్లలు చక్కగా పిండి రాసుకొని స్నానాలు చేసి లోపలికి వచ్చారు ..వాళ్ళందరికీ బట్టలు వేసి దేవుడి గదిలోకి తీసుకువెళ్ళింది రాధమ్మ..
దేవుళ్ళ శ్లోకాలు చెప్పి వాళ్లతో చదివించింది వాళ్లు వచ్చి రాని మాటలతో చదివారు ..ఇదంతా వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది నానమ్మ చేసేదంతా వాళ్లకు ఎంతో నచ్చింది అలంకరించిన పూలతో దేవుళ్ళు ఎంతో చక్కగా కనబడుతుంటే మనసులో నుండి వాళ్లకి కూడా ఒక భక్తి భావం వెలువడింది.. చేతులు జోడించి నమస్కారం చేసుకొని వంటింట్లోకి వచ్చారు.. అందర్నీ అక్కడే కూర్చోబెట్టి ప్లేట్లల్లో అందరికీ తపాలా రొట్టె పెట్టింది...
ముందుగా అదేంటో పిల్లలకి అర్థం కాలేదు కానీ కొంచెం కొంచెం తింటుంటే ఆ రుచి ఎంతో అద్భుతం అనిపించింది ఎప్పుడూ తినే పిజ్జా బర్గర్లు విసుగనిపించింది.. ఈ రుచి వాళ్ళకి కొత్తగా అనిపించింది చక్కగా తపాలే రొట్టె తినేశారు...
పిల్లలంతా పెరట్లో పూల మొక్కల మధ్య ఆడుకుంటుంటే రాధమ్మకు ఎంతో సంబరంగా అనిపించింది..
కొడుకు కోడలు కూతురు అల్లుడు ఆలస్యంగా లేచారు.. బయటకు వచ్చి చూస్తే పిల్లలు మొక్కల మధ్య ఆడుకుంటున్నారు.. అప్పటికే స్నానాలు చేసి చక్కగా బొట్టు పెట్టుకుని కనిపిస్తున్నారు.. ఇదంతా వీళ్ళకి కూడా సంతోషంగానే అనిపించింది... కానీ మట్టిలో ఆడుతున్నారని గట్టిగా అరిచారు..
"అమ్మా! వారిని మట్టిలో ఎందుకు ఆడనిస్తున్నావు? కాళ్లు చేతులు పాడైపోతాయి"? అని కూతురు తల్లితో గట్టిగా అరిచింది దానికి కొడుకు కూడా వంత పాడాడు.. కోడలు అయితే ఎప్పుడు తప్పు వెతుకుదామా! చూస్తూనే ఉంది.. అల్లుడు కాస్త నెమ్మది అయిన వాడిలా ఉన్నాడు అతను ఏమి మాట్లాడలేదు..
రాధమ్మ ఏమి మాట్లాడలేదు ఇదంతా చూస్తున్న భాస్కరం వచ్చిన కోపాన్ని దిగమింగుకున్నాడు..
మధ్యాహ్నం భోజనాల సమయంలో కూడా పిల్లలు "ఇది తినరు అది తినరు" అని వాళ్ళ తల్లిదండ్రులు చెబుతూనే ఉన్నారు ..కానీ రాధమ్మ వారి మాట వినకుండా కంచంలో ఒకే చోట అన్నం కలిపి నెయ్యి వేసి పప్పు కూర పచ్చడి అన్నీ కలిపి ముద్దలు చేసి పెట్టింది పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారు...
అయినా నమ్మకం కలిగ లేదు వాళ్ళ తల్లిదండ్రులకి "అసలు వాళ్ళు ఈ తిండి సరిగా తినరు చెప్తే ఇవే పెడుతున్నావ్ వాళ్లకు" అని కూతురు వచ్చింది. ఆ వెంటనే కోడలు వచ్చి అవును" ఈ తిండ్లు పిల్లలకి అసలే పడవు బయట ఏమైనా తెప్పిద్దామంటే ఇక్కడ ఏమీ దొరకవు "అని గులగసాగింది...
ఇంకా తట్టుకోలేక పోయిన భాస్కరం అక్కడికి వచ్చాడు...
" ఏంట్రా విక్రాంత్... ఏంటమ్మా దీప! మీరంతా ఎక్కడ పెరిగారు పూల మొక్కల మధ్యలో ఆడుకుంటే మీ పిల్లలకు మట్టి అంటుతుందా! మీరు మట్టి అంటకుండానే పెరిగారా పుట్టింది మనం ఈ మట్టిలో అనే విషయం మర్చిపోవద్దు.. మట్టి మీద మమకారం పెంచుకోవాలే తప్ప తెంచుకోకూడదు ..పుట్టి పెరిగింది ఇక్కడే జన్మభూమిని, మాతృభాషను మరిచిపోయి మీరు అక్కడ చేస్తున్నది ఏమిటి! పిల్లలకి ఇప్పటివరకు ఒక్క తెలుగు ముక్క అయినా నేర్పించారా మీరు! మంచి భోజనం అమ్మ మీకోసం ఆరాటపడి వండితే అది మీకు నచ్చడం లేదు.. విదేశాల్లో ఉంటున్నారు అక్కడి కల్చర్ పాటించొద్దని చెప్పడం లేదు.. కానీ ఇక్కడి సాంప్రదాయాలని మరువద్దు అని చెప్తున్నాను ఉదయం అమ్మ చేసిన వంటని పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారు.. ఇప్పుడు చూడు ప్రేమతో గోరుముద్దలు తినిపిస్తుంటే కడుపునిండా తిన్న పిల్లలు ఎంతో హాయిగా ఆడుకుంటున్నారు.. వాళ్లు మీ అమ్మను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీ అమ్మ కూడా వచ్చిరాని ఇంగ్లీషులో వాళ్లకు ఏదో ఒకటి నచ్ఛ చెప్తుంది.. కానీ మీరు మాత్రం ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడి వాతావరణం అసహ్యించుకుంటున్నారు.. ఆలోచించండి ఇది ఎంతవరకు సరియైనదో.. ఏ దేశమేగినా ఎందుకాలిడిగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే నానుడిని మీరు గుర్తు పెట్టుకుంటే ఇలా చేయరు.. ఇప్పటికైనా మీ మూలాలను మీరు మర్చిపోకుండా అందరితో కలిసిపోండి" అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాడు...
ఒక్కసారిగా అందరూ ఆలోచనలో పడ్డారు బాల్యం అంతా కళ్ళ ముందు కదలాడింది ..అవును మేమంతా ఇలా ఆడుకునే కదా పెరిగాము.. ఎంతో స్వచ్ఛంగా స్వేచ్ఛగా పెరిగిన మేము అక్కడ ఒక రేఖను గీసుకొని అందులోనే బ్రతుకుతున్నాము ఇక్కడైనా స్వేచ్ఛగా పిల్లలని పెరగనిస్తే చాలు.. ఇంత తప్పుగా ఆలోచించాము అని అనుకున్నారు...
ఇదేమీ పట్టని రాధమ్మ పిల్లలకు కొబ్బరాకులతో బొమ్మలను చేస్తూ కొత్త కొత్త ఆటలు వాళ్ల దగ్గర నేర్చుకుంటూ సంతోషంగా ఉండిపోయింది... మధ్య మధ్యలో తాను చేయించిన చేగోడీలు చకిలాలు పల్లీల లడ్డులు వాళ్లకు తినిపిస్తూ మురిసిపోసాగింది రాధమ్మ..
ఆటల్లో భాగంగానే వాళ్ళకి పద్యాలు పాటలు నేర్పిస్తూనే ఉంది మెల్ల మెల్లగా పిల్లలంతా తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టారు వాళ్ళు ఉన్న నెల రోజుల్లో పిల్లలంతా తెలుగు నేర్చుకోవడం రాధమ్మ కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోవడం జరిగిపోయింది ఇప్పుడు వాళ్ళ మధ్య ఏ అడ్డుగోడలు లేవు పిల్లలు కూడా తెలుగంటే ఇష్టపడుతున్నారు..
పాలమీగడ లాంటి తెలుగును ఎవరు మాత్రం ఇష్టపడరు ఏ భాష వాళ్ళైనా ఒక్కసారి తెలుగును నేర్చుకుంటే ఎప్పుడు మర్చిపోరు..
తెలుగులో మాట్లాడుతూ తెలుగును కాపాడుకుందాం!
🌹🌹🌹🌹🌹🌹🌹
========================================================================
సమాప్తం
========================================================================
లక్ష్మి మదన్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం ; పేరు లక్ష్మి
కలం పేరు : లక్ష్మీ మదన్
హైదరాబాద్ లో ఉంటాను.
500 కి పైగా కవితలు
Balu Ayyagari
•23 hours ago
తేట తెలుగు ప్రేమికులకు వందనం..❤