top of page

చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 11



'Chejara Nee Kee Jivitham - Episode 11' - New Telugu Web Series Written By C. S. G. Krishnamacharyulu Published In manatelugukathalu.com On 01/03/2024

'చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 11' తెలుగు ధారావాహిక

రచన : C..S.G . కృష్ణమాచార్యులు 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


ఇందిరని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు శేఖర్. పెళ్ళైన వెంటనే తను అర్జెంట్ గా జర్మనీ వెళ్లాల్సి రావడంతో, ఇందిరకు తోడుగా తన పిన్నిని, తమ్ముడు మధుని ఉంచుతాడు. 


వెంకట్ అనే వ్యక్తితో మాట్లాడుతున్న వదిన ఇందిరని వారిస్తాడు మధు. శేఖర్ గురించి మధుతో చెప్పడం ప్రారంభిస్తుంది ఇందిర.


అతను డిగ్రీ చదివే రోజుల్లో ప్రభ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో ఇందిరను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి రోజే ప్రభకు వివాహం కాలేదని తెలుసుకుంటాడు. ఇద్దరూ జర్మనీ వెళ్లి అక్కడ కలిసి ఉంటారు. 


ఇందిర చెప్పిన మాటలు నమ్మలేక పోతాడు మధు. భర్తతో విడాకులు వచ్చేవరకు మధుతో సహజీవనం చేస్తానంటుంది ఇందిర. అంగీకరించడు మధు. అన్నయ్య శేఖర్ కి కాల్ చేసి ఇండియా వచ్చెయ్యమంటాడు. ఇందిర వూహించినట్లే ఇప్పట్లో రాలేనంటాడు శేఖర్. 


గీతా మేడంని కలిసి సమస్య వివరిస్తాడు మధు. ఇందిరని తనవద్దకు తీసుకొని రమ్మంటుంది మేడం. తన కథను గీతా మేడం కి వివరిస్తుంది ఇందిర. మేడం ఇంటికి దగ్గర్లోని ఒక ఇంటికి షిఫ్ట్ అవుతారు ఇందిర, మధులు.. మ్యూజిక్ క్లాసెస్ లో చేరుతుంది ఇందిర. స్కూల్ లో టీచర్ గా చేరుతుంది. మంచి పేరు తెచ్చుకుంటుంది. తన విషయంలో ఒక నిర్ణయం తీసుకోమని కోరుతుంది ఇందిర.


ఇక చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 11 చదవండి. 


మధు మనస్సులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. ఒక స్త్రీకోసం సొంత అన్నను వదులుకోవడమా? జీవితాన్ని వెలిగించే జ్యోతిర్మయిని వదులుకుంటే మళ్ళీ దొరుకుతుందా? పొందలేక, వదలలేక యెన్నాళ్ళు అగమ్య గోచరమైన జీవితాన్ని సాగించాలి? ఇప్పుడు కఠిన నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. విధి లీల కాక బోతే అన్న పెళ్ళి చేసుకుని, నా దగ్గర వదిలివేయడమేమిటి? నా పట్ల ఆమెకు ప్రేమ కలగడమేమిటి? గీతా రవిలు ఆమెకు కొండంత అండగా నిలబడి, గర్వంగా తలెత్తుకునే స్థితికి తీసుకు రావడమేమిటి? జరగబోయేది స్పష్టంగానే వుంది. అన్నయ్య దోషిగా తలదించుకునే సమయం వచ్చింది. ఈ విషయం తెలిసి కూడా ఇందిరను వదినగా భావించడం మూర్ఖత్వం. ఎదురుగా నిలుచున్న ఈ సుగుణాల రాశినింక యెంత మాత్రం ఆలశ్యం చేయకుండా నా దానిని చేసుకోవాలి. ఇందులో అనైతికత లేదు. అలా ఒక నిర్ణయానికి వచ్చిన మధు మనసు వుత్సహంతో ప్రేమతో వెలిగిపోయింది. 


" ఇందూ! నిస్సారమైన నా బ్రతుకులోకి అమృత వర్షిణిలా వచ్చావు. ఆప్తులు లేని నా వొంటరి జీవితంలోకి స్నేహమూర్తిగా వచ్చి ఆప్యాయతను పంచావు. ఆనాడు ఆ స్వామి అన్నట్లు నా జీవితంలో అన్ని ప్రశ్నలకు నీవే సమాధానివి. నా జీవన నావకు చుక్కానివి. నిన్ను నేను గాఢంగా ప్రేమిస్తున్నాను. నా భార్యవై, ప్రేయసివై, సహచరివై, నా ప్రాణం పోయేవరకు నాతోనే వుంటానని చెప్పవా?" మోకాళ్ళ మీద కూర్చుని ఇందిర చేతులు పట్టుకుని ప్రార్ధనగా అడిగాడు మధు.

 

ఇందిర మనసు నల్ల మబ్బులు తొలిగిన చందమామలా మెరిసింది. ఆమెకన్నుల లో కోటి కాంతులు విరిసాయి. ఆమె అనురాగ సుధాభరితమైన స్వరంతో తన అంగీకారం తెలిపింది. " మధూ! నీ ప్రేమ నా అదృష్టంగా భావిస్తాను. నేను నా ప్రాణం పోయేవరకు నీకు తోడుగా వుంటాను. ఇక నువ్వే నాకు సర్వస్వం". అంది. ఇందిర సమాధానానికి పులకితుడైన మధు ఆమెను గాఢంగా కౌగలించుకున్నాడు. ఇందిర అతని కౌగిలిని మరింత బిగించి అతని యెదపై తల వాల్చి యెల్లలు లేని ప్రశాంతిని పొందింది. 


కౌగిలితో తనివితీరని అతడు, ఆమె ముఖాన్ని తన అర చేతుల్లోకి తీసుకున్నాడు. కవిత్వం చెప్తూ పదే పదే ముద్దాడాడు. పూర్ణ చంద్రుని వంటి మోముకు ముద్దు. నీలి మేఘాల బోలు కురుల నిగనిగలకు ముద్దు. ప్రశాంత నింగిని బోలు నుదుటికి ముద్దు. ప్రేమ వర్షించు కనులకు ముద్దు. సిగ్గుతో యెరుపైన బుగ్గ లకు ముద్దు. ముక్కు పుడక కాంతితో శోభించు తీరైన నాసికకు ముద్దు. 


ఇందిర కూడా అతని ముఖాన్ని ముద్దాడి అతనిలో ఆవేశాన్ని పెంచింది. మోహావేశంతో మధు కంపిస్తున్నఇందిర పెదవులని గాఢంగా చుంబించాడు. 

ఇద్దరూ కొద్దిసేపు ప్రేమ తన్మయత్వంలో మునిగిపోయారు. 


కొన్ని క్షణాల తర్వాత, స్త్రీ సహజమైన విచక్షణతో ఇందిర, అతడి కౌగిలి మెల్లగా విడిపించుకుని, "ఇంత వరకు ఓకే. పనిమనిషి ఇక మన యింటికి రావచ్చు. ఇక రండి ఆ టిఫిన్ చేయడానికీ “ అంది.. 


మధు ఆమెను మళ్ళీ దగ్గరకు తీసుకుంటూ "అండి యేమిటి క్రొత్తగా?" అని అడిగాడు. 


"అలా పిలిస్తేనే పనిమనిషితో సహా అందరూ నన్ను మెచ్చుకుంటారు" అంటూ ఇందిర అతనికి దూరంగా జరిగి, "ఇప్పటికిది చాలు" అంటూ క్రిందికి వెళ్ళిపోయింది. 


ఇందిరను అనుసరించబోయిన మధు, ఆమె ఫోన్ మాట్లాడడం గమనించి ఆగిపోయాడు. అతని మదిలో మళ్ళీ గజిబిజి ఆలోచనలు చెలరేగాయి. నాకున్న యేకైక బంధం అన్నయ్య. ఆ బంధం తెగకుండా కాపాడు దేవా! అని ఒక నిమిషం ప్రార్ధించాడు. ఇందిరను ఏ పరిస్థితులలోను వదలక ఆమె ఆత్మ గౌర్వానికి భంగం కలగ కుండా చూసుకోవాలి. 


అప్పుడూ ఇప్పుడూ మగజాతికి స్త్రీ చులకనే. రాముడు సీతని అగ్నిప్రవేశం చేయమని అవమానించాడు. ద్రౌపదిని వివస్త్రని చేస్తున్న దుశ్శాసనుని నివారించ కుండా ధర్మం పేరిట భర్తలు, అరివీరభయంకరులమని చెప్పుకునే పెద్దలు కిమ్మనకుండా వుండి స్త్రీజాతిని అవమానించారు. నేనలా వుండకూడదని అనుకున్నాడు. ఫోన్ మాట్లాడటం ముగిసినట్లుంది.


ఇందిర, "మధూ రండి! అక్కడేం చేస్తున్నారు?" అంటూ పిలిచింది. 


"వస్తున్నా! అంటూ టిఫిన్ ప్లేట్ తీసుకుని క్రిందికి వెళ్ళాడు మధు. ఇద్దరూ ఒకరికొకరు టిఫిన్ తినిపించుకున్నారు. 


 తినడం అయ్యాక ఇందిర, "మామయ్య ఫోన్ చేసారు. మనల్ని సాయంత్రం నాలుగు గంటలకు రమ్మన్నారు" అని చెప్పింది. 

 @@

మధుని చూస్తూనే రవి  "ఇలా రా" అని తన అగదిలోకి తీసుకెళ్ళాడు. ఇందిర గీత దగ్గరకు వెళ్ళింది. 

"మధూ! ఇంకో పది నిమిషాలలో మీ అన్నయ్యతో జూం మీటింగ్. నాదగ్గర అతని పెళ్ళికి సంబంధించిన అన్ని సాక్ష్యాలు డాక్యుమెంట్ రూపంలో వున్నాయి. అతనికి, ప్రభకి లీగల్ నోటీసులిచ్చాను. ఉద్యోగం పోతుందని, పాస్ పోర్ట్ రద్దవుతుందని భయ పెట్టాను. భయపడ్డాడు. ఇవ్వాళ సెటిల్ చేస్తానని చెప్పాడు. నువ్వు అతనికి కనబడకుండా వుండు. అవసరమైతే పిలుస్తాను" అని చెప్పాడు రవి. 


 మధు మనసు భారంగా మూల్గింది. ప్రక్కకి వెళ్ళి కూర్చున్నాడు. కొంత సేపటిలో మీటింగ్ ప్రారంభమయ్యింది. 


శేఖర్, ప్రభ తెరపైకి వచ్చారు. ప్రభని చూసి మధు "ఇందిరతో పోలిస్తే అంత అందగత్తె కాదు. ప్రేమ విచిత్రమైనది" అనుకున్నాడు. 


రవి కఠిన స్వరంతో "ఇందిర అనాధ యేం చేసినా చెల్లుతుందనే కదా, యిలా చేశారు. చదువుకున్న పశువులు మీరు. మిమ్మల్నిద్దరినీ జైలు వూచలు లెక్కబెట్టేలా చేస్తాను" అని బెదిరించాడు. 


"సార్! మీరు పెద్దవారు. కాస్త శాంతంగా వినండి. నేను చేసినది తప్పే. కానీ నేను ఇందిరకు యే హానీ తలపెట్టలేదు. నా తమ్ముడి రక్షణలో వుంచాను. నిజం నెమ్మదిగా తనకి అర్ధమయ్యేలా చేస్తే తను ఆవేశంతో తన ప్రాణానికి ముప్పు తలబెట్టకుండా వుంటుందని ఆశపడ్డాను. అంతే గాని నాకు వేరే దురుద్దేశ్యం లేదు". అని శేఖర్ ప్రాధేయ పూర్వకంగా బదులిచ్చాడు. 


"అమాయకుడి చెవిలో పూలు పెట్టు. నా చెవిలో కాదు. మరి నీ తమ్ముడి పరిస్థితి ఆలోచించావా? వదినతో వ్యభిచారం చేస్తున్న మరిది అని అందరూ అనుమానపు చూపులతో చూస్తూంటే అతను పడే మానసిక వేదన సంగతేంటి? నువ్వు భ్రష్ట భర్తవే కాదు. భ్రష్ట అన్నవు కూడా" నిప్పులు చెరిగాడు రవి. మధు కళ్ళళ్ళో నీరు తిరు తిరిగింది. 


మనసు లో అనుకున్నాడు "ఎంత చక్కగా నా బాధను తెలియ చేసా సార్! నమస్కారం" అని. 

"సారీ సర్! నేనా విషయం గ్రహించక పోవడం తప్పే. నన్ను మన్నించండి. నేను ఇందిరకు నా తమ్ముడికి క్షమాపణలు చెప్తాను" వినయంగా బదులిచ్చాడు శేఖర్. 


"ఈ సారీల వల్ల లాభం లేదు గానీ ఎలా సెటిల్ చేస్తావో చెప్పు" అని శేఖర్ ని అడిగి, ప్రభను చూస్తూ " ఏమమ్మా ప్రభా! ఆడదానివే కదా! నీలా ధనికుల బిడ్డకాదు. నీ అంత చదువుకోలేదు. ఒక అనాధ పట్ల ఇదేనా నీవు వ్యవహరించే తీరు. ఎలా న్యాయం చేస్తారో చెప్పండి" కాఠిన్యం కొంత తగ్గించి, మృదుత్వం జోడించి అడిగాడు రవి. ప్రభ తలదించుకుంది. 


"దయ చేసి మమ్మల్ని మన్నించండి. విడాకులకి కావల్సిన పత్రాలపై సంతకం పెడతాను. లేదా మీరు ఏక పక్షంగా విడాకులు కోరితే మీకు కావల్సిన సాక్ష్యాలు అందిస్తాను. ఇందిరకు ఒకే సారి భరణంగా కోటి రూపాయలు చెల్లిస్తాను" అని విడాకులకు తన సమ్మతి తెలియ చేసాడు శేఖర్. 


"నీ డబ్బుకోసం బేరమాడే మానిషి కాదు ఇందిర. బాంక్ వివరాలు మైల్ చేసాను. వెంటనే డబ్బు పంపించు. ఏక పక్షంగా విడాకులిప్పించే ప్రయత్నం చేస్తాను. మరి నీ తమ్ముడి సంగతి యేమిటి? అతని మీద పడిన మచ్చ యెలా తొలగిస్తావు?" అని శేఖర్ ని నిలదీసాడు రవి. 


========================================================================

ఇంకా వుంది..

========================================================================

C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: C..S.G . కృష్ణమాచార్యులు

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. మేనేజ్మెంట్ విద్యకు సంబంధించిన అనేక పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, హిమాలయ  వంటి ప్రముఖ సంస్థల ద్వార ప్రచురించాను.   చిన్నతనం  నుంచి  ఆసక్తివున్న తెలుగు రచనా వ్యాసంగం తిరిగి మొదలుపెట్టి కవితలు, కథలు, నవలలు వ్రాస్తున్నాను. ప్రస్తుత నివాసం పుదుచ్చెరీలో.

42 views0 comments
bottom of page