top of page

చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 2'Chejara Nee Kee Jivitham - Episode 2' - New Telugu Web Series Written By C. S. G. Krishnamacharyulu Published In manatelugukathalu.com On 14/01/2024

'చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 2' తెలుగు ధారావాహిక

రచన : C..S.G . కృష్ణమాచార్యులు 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:

ఇందిరని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు శేఖర్.

పెళ్ళైన వెంటనే తను అర్జెంట్ గా జర్మనీ వెళ్లాల్సి రావడంతో, ఇందిరకు తోడుగా తన పిన్నిని, తమ్ముడు మధుని ఉంచుతాడు.

వెంకట్ అనే వ్యక్తితో మాట్లాడుతున్న వదిన ఇందిరని వారిస్తాడు మధు. 

శేఖర్ గురించి మధుతో చెప్పడం ప్రారంభిస్తుంది ఇందిర.


ఇక చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 2 చదవండి


మధు అసహననాన్ని గమనించిన ఇందిర చిరునవ్వుతో యిలా అంది "చూసావా? నేను ముందే చెప్పాను. వినడానికి సహనం వుండాలని”. 


"నిజమే! ఇదొక మాయలా వుంది నాకు. చెప్పండి వింటాను" అన్నాడు మధు. 


"మీ అన్నయ్య డిగ్రీ చదివే రోజుల్లో ప్రభ అనే అమ్మాయిని ప్రేమించాడు. చదువైన తర్వాత, ఇద్దరూ ఒకే కంపనీలో చేరారు. మీ అన్నయ్య పెళ్ళి చేసుకుందామని అడిగితే ఆమే, నిరాకరించింది. ఆ తర్వాత వేరొకనితో నిశ్చితార్ధమని ఒక ఆహ్వాన పత్రిక పంపింది. దానితో క్రుంగిపోయిన మీ అన్న నాకు ప్రపోజ్ చేసి, నెలరోజుల తర్వాత పెళ్ళి చేసుకున్నాడు. సరిగ్గా మా పెళ్ళి రోజు ఆమె మీ అన్నయ్య కి ఫోన్ చేసి, నిశ్చితార్ధం రద్దు చేసుకున్నా, నీతో పెళ్ళి నాకు ఇష్టమే అని చెప్పింది. అంతే! మీ అన్నయ్య లో సంఘర్షణ చెలరేగింది. ఇద్దరూ అలోచించుకుని, ఒక పథకం ప్రకారం జర్మనీ వెళ్ళి అక్కడే పెళ్ళి చేసుకున్నారు”. 


“అంతా కట్టు కథ. వెంకట్ ఒక తిరుగుబోతు. వాడి మాటలు మీరెలా నమ్మారు?"


"సాక్ష్యాలు వున్నాయి కాబట్టి"


“అవి కల్పితాలు కావచ్చు. నాకు చెప్పకుండా ఇదంతా, అంటే నమ్మను”. 


“నువ్వు పరిశోధక విద్యార్ధి గా పరిశీలన చేసి న తర్వాతనే నిజం నిర్ధారణ చేస్తావు కదా. ఈ విషయంలో కూడ అలాగే చెయ్యి.” 


“సరే! ఆ సాక్ష్యాలు యేమిటి?”


ఇందిర మొబైల్ ఫోన్ లో ఫోటొలు చూపించింది. ప్రభ, శేఖర్ సన్నిహితంగా వున్న ఫొటోలు. కొన్నింటిలో వారి ఆలింగనాల దృశ్యాలు. 


“ఇవి పాతవో, లేదా ఫోటొ షాప్ చేసినవో కావచ్చు కదా?”


“కావచ్చు. కానీ ఈ ఫోటోలలో ఉన్న ప్రదేశాలు జర్మనీలోనివే. పరిశీలనగా చూస్తే ఇవి వాస్తవమయినవని తెలుస్తుంది". 


"అన్నయ్య మిమ్మల్ని పెళ్ళి చేసుకున్నాక, ప్రభని చేసుకున్నాడంటే నమ్మలేక పోతున్నాను" మధు స్వరం విషాదభరితమయ్యింది. 


"నాకు విడాకులు యిచ్చికదా మీ అన్నయ్య ప్రభని పెళ్ళి చేసుకోవాలి. అలా ఎందుకు చేయలేదు? పైగా ఆ విషయం నా దగ్గర యెందుకు దాస్తున్నాడు?”


"అదే నాకూ అర్ధంకావడం లేదు" అని నీరసంగా బదులిచ్చాడు మధు.


“నిజానికి మీ అన్నయ్యకి. ప్రభతో బిడ్డను కనేదాకా నాతో తెగ తెంపులు యిష్టం లేదు. నేను నిరీక్షణలో వున్న భార్యను. కొద్ది కాలంలో వాళ్ళు బిడ్డని కనడం నాకు విడాకులు ఇవ్వడం గ్యారంటీ” 


"అన్నయ్య మిమ్మల్ని పెళ్ళి చేసుకున్న విషయం ప్రభకు తెలియదా?"


"తెలుసు. వెంకట్ అనడం ఆమె తనగురించే గాని ఇతరులగురించి ఆలోచించని స్వార్ధపరురాలు" 


"కథ ఇక్కడితో ఆగిపోలేదు. మీ వదిన ప్రభ ఆలోచనలు వేరుగా వున్నాయి. ఆవిడ ఒక పధకం వేసింది. వాళ్ళ చేతికి మట్టి అంటకండా నన్ను వదిలించుకోవాలని.". 


 “పథకమా!" బేల గా ఇందిరను చూస్తూ వుండిపోయాడు మధు. 


"ఆధారాలు వున్నాయి దీనికి కూడా. ఆ పథకం లక్ష్యం నన్ను దోషిగా చూపడం. అది తెలిసే వెంకట్, నా వెంట పడి" మీ అందం అడవికాచిన వెన్నెల. ఎలాగో విడాకులు వస్తాయి కాబట్టి నాతో జీవించండి: అని వేధిస్తున్నా డు.”. 


“వాడు నీచుడు. వాడి నీచపు మాటలకు అన్నయ్యని ఎలా బాధ్యుడిని చేస్తావు?”. 


"ఎందుకంటే రెండు కారణాలు. మీ అన్నయ్య విషయాలన్నీ అతనికి తెలుస్తున్నాయి. వెదుక్కుంటూ వచ్చి మరీ ప్రలోభ పెడుతున్నా డు. ఇంకో విషయం. చెప్తే నీ మనసు గాయపడుతుంది. కానీ చెప్పక తప్పదు. నువ్వు కూడా ఇందులో ఆట బొమ్మవే.”. 


"ఎలా? చెప్పండి” అని విషణ్ణ వదనంతో అడిగాడు మధు. 


“ఏదో ఒక రోజు మనం తప్పు చేస్తే, దాన్ని చూపి, నన్ను వదిలించుకోవాలని ప్లాన్.”


మధు మొహం యెర్రబడిపోయింది. “నిజమా! నమ్మలేను" అంటూ తలాడించాడు.


"నేను పాత వుద్యోగానికి వెళ్ళిపోతానంటే వద్దు. త్వరలో వస్తా కదా. నీకేంకావాలన్నా మధు నడుగు. ఎక్కడికి వెళ్ళాలన్న చెప్పు. తోడు వస్తాడు. ప్రతీ దానికీ మధు, మధు.. నాకూ మొదట అర్ధం కాలేదు ఈ కుట్ర. క్రమ క్రమంగా అర్ధమయ్యింది”. 


“నమ్మ లేక పోతున్నాను. అంతా అయోమయంగా వుంది" అన్నాడు మధు. 


“మీ అన్నయ్య నువ్వనుకున్నంత మంచివాడేం కాదు. చదువుకునే రోజుల్లో అతను అమ్మాయిలతో పబ్బులకి, షికార్లకి బాగానే తిరిగేవాడు. నువ్వు చూస్తే పాత సినిమా హీరో లాగ. చదువు తప్ప ఇంకో ప్రపంచం లేదు. స్నేహితులు తప్ప గర్ల్ ఫ్రెండ్ లేదు. మీ ప్రొఫెసర్ నిన్ను సొంత బిడ్డలా చూస్తుంది.”. 


“ఇవన్నీ యెలా తెలుసు?”


“మీ అన్న సంగతి తెలియడం మొదలయ్యాక నీ వెలాంటి వాడివో అని తెలుసుకున్నా. అదంతా ఎందుకు? ఏ రోజైనా నా ముఖం చూసి మాట్లడావా? నాతో కలిసి భోజనం మాట దేవుడెరుగు, టీ కూడా తాగలేదు. అంత బిడియం నీకు. ఇలా ఎవరైన వుంటారా?”


 "ఎందుకో మొహమటం. నిజమే! మీరు వంటరిగా యెలా వుంటున్నారో అడగకఫోవడం నా తప్పే" అల్లకల్లోలమైన మనసుతో దిగులుగా బదులిచ్చాడు మధు. 


"పోనీలే. నీ మంచితనాన్ని తప్పు పట్టను. ఇప్పుడు నీకు రెండు విషయాలు అర్ధం కావాలి.

ఒకటి. నీ వదిన ప్రభ. నేను కాదు. చట్టపరంగా విడాకులకై యెదురు చూసే వంచిత స్త్రీని నేను. రెండు, వ్యభిచారి అని ముద్ర వేసి, ఎటువంటి పరిహారం ఇవ్వకుండా, నా నుంచి విడాకులు పొందడం మీ అన్న, వదినల ప్లాన్!,

నేనీ పరిస్థితి లో యేంచెయ్యాలి?" నిగ్గదీసింది ఇందిర. 


"మీరు మీ పాత వుద్యోగానికి వెళ్ళి పోండి. విడాకులు వచ్చే వరకు వుండి ఆ తర్వాత పెళ్ళి చేసుకోండి" మధు సలహా యిచ్చాడు. 


“వినడానికి ఇది సులువుగా అనిపిస్తుంది. కానీ ఇందులో కొన్ని ఇబ్బందులున్నాయి. మొదటిది నా ప్రవర్తన వల్లనే విడాకులు ఇచ్చాడనే అప్రదిష్ట నేను మూట కట్టుకోవాలి. రెండు, నా మొగుడు నన్ను వదిలేసాడని చెప్పడం ఎంత అవమానంగా వుంటుందో ఆలోచించు. మూడవది. అసలే అనాధను. నాకు రెండొ పెళ్ళి అంత సులువుగా అవుతుందా? పెళ్ళైనా, నా కాపురం సజావుగా సాగుతుందా? నాలో లోపాల్ని వెదుకుతూ నా రెండో భర్త నన్ను వేధించడని ఎలా నమ్మడం?” 


"అలా నిరాశగా ఆలోచించడమెందుకు? మీకు మంచే జరగవచ్చు గదా?” అనునయంగా అన్నాడు మధు. 


"ఎలా ఆలోచించను? ఎంతో జాగ్రత్తగా అడుగు వేసాననుకొని ఈ అగాధంలో పడిపోయాను. భవిష్య త్తు అంతా అంధకారమయంగా కనిపిస్తోంది. పెళ్ళి చేసుకున్న ఆనందం ఆవిరై, ఈ బంధం నా పాలిట యమపాశంగా మారింది. నా జీవితం పూర్తిగా నా చేజారిపోయింది."


ఆమె ఆవేదన అర్ధం చేసుకోవడానికి యత్నిస్తున్నవాడిలా మధు మౌనంగా వుండిపోయాడు. 

“ఒక సంవత్సరం సంతోషంగా కాపురం చేసిన భర్త చనిపోతే, ఆ భార్య మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా అతనితో గడిపిన మధుర క్షణాలు గుర్తు చేసుకుంటూ శేష జీవితం గడిపేయగలదు. కానీ నాకా మధుర ఘడియలే లేవు". అంటూ ఆమె భారంగా నిట్టూర్చింది. 


 ఆలోచనలో పడి ఇద్దరూ కాసేపు మౌనంగా వుండిపోయారు. ఇద్దరి మధ్య నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ ఇందిర "మీ అన్నయ్య చేస్తున్న అన్యాయానికి నువ్వే పరిహారం చేయగలవు" అంది. 


"నేనా ఎలా?" ఆశ్చర్యపోతూ అడిగాడు మధు. 


"ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. రేపు ఇదే వేళకి ఇక్కడే ఇద్దరం కలిసి నా భవిష్యత్తు నిర్ణయిద్దాం" అంది ఇందిర. 

========================================================================

ఇంకా వుంది..

========================================================================

C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: C..S.G . కృష్ణమాచార్యులు

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. మేనేజ్మెంట్ విద్యకు సంబంధించిన అనేక పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, హిమాలయ  వంటి ప్రముఖ సంస్థల ద్వార ప్రచురించాను.   చిన్నతనం  నుంచి  ఆసక్తివున్న తెలుగు రచనా వ్యాసంగం తిరిగి మొదలుపెట్టి కవితలు, కథలు, నవలలు వ్రాస్తున్నాను. ప్రస్తుత నివాసం పుదుచ్చెరీలో.

62 views0 comments
bottom of page