top of page

చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 3'Chejara Nee Kee Jivitham - Episode 3' - New Telugu Web Series Written By C. S. G. Krishnamacharyulu Published In manatelugukathalu.com On 19/01/2024

'చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 3' తెలుగు ధారావాహిక

రచన : C..S.G . కృష్ణమాచార్యులు 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


ఇందిరని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు శేఖర్. పెళ్ళైన వెంటనే తను అర్జెంట్ గా జర్మనీ వెళ్లాల్సి రావడంతో, ఇందిరకు తోడుగా తన పిన్నిని, తమ్ముడు మధుని ఉంచుతాడు. 


వెంకట్ అనే వ్యక్తితో మాట్లాడుతున్న వదిన ఇందిరని వారిస్తాడు మధు. శేఖర్ గురించి మధుతో చెప్పడం ప్రారంభిస్తుంది ఇందిర. 

అతను డిగ్రీ చదివే రోజుల్లో ప్రభ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో ఇందిరను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి రోజే ప్రభకు వివాహం కాలేదని తెలుసుకుంటాడు. ఇద్దరూ జర్మనీ వెళ్లి అక్కడ కలిసి ఉంటారు. 

ఇందిర చెప్పిన మాటలు నమ్మలేక పోతాడు మధు. 


ఇక చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 3 చదవండి. 


సాయం సంధ్యా సమయం. పిల్లల కేరింతలతో ప్రాంగణం సందడిగా వుంది. ఆకాశం మేఘావృతమై వర్షం యెప్పుడైనా మొదలయ్యేలా వుంది. చల్లటి గాలులుతో శరీరం పులకిస్తోంది. అనుకున్న ప్రకారం ఇందిర, మధులు సమావేశమయ్యారు. ఈ సమస్య పరిష్కారంలో తన పాత్ర ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో వున్నాడు మధు. సంభాషణ ప్రారంభిస్తూ ఇందిర ఇలా అంది. 

"మీ మేనేజ్మెం ట్ సిద్ధాంతాల ప్రకారం ఒక లక్ష్య సాధనకు ఎన్నో మార్గాలుంటాయి. ఆందులో ఆచరణ యోగ్యమైనది యెంచుకుని, దానిని అమలు చేయాలి" 


అవునన్నట్లు తలూపాడు మధు. 


"ఒక ఎదిగిన ఆడ పిల్లగా నా లక్ష్యం ఒక మంచి మనిషిని పెళ్ళి చేసుకుని అతనితో అన్యోన్యంగా కాపురం చేయడం. ఆ లక్ష్యాన్ని మీ అన్న చిన్నాభిన్నం చేసాడు. చేజారిన జీవితాన్ని మళ్ళీ నా చేతుల్లోకి తీసుకోవాలి". 


"ఏం చెయ్యాలనుకుంటున్నారు?" 


"మీ అన్నయ్య నన్ను వదులు కోవడానికి యిష్ట పడితే పరస్పర అంగీకారంతో ఒక యేడాదిలో విడాకులు పొందవచ్చు. లేకుంటే విడాకులు తీసుకోవడం అంత సులభం కాదు. కోర్టులో మీ అన్నయ్య రెండో పెళ్ళి నిరూపించాలంటే ఫోటోలతో సాధ్యం కాదు”. 


"అడిగితే అన్నయ్య వొప్పుకోడంటారా?" ఒకింత అనుమానంతో అడిగాడు మధు. 


"మీ అన్నయ్య నిజాయితీగా తను చేసిన పని చెప్పి విడాకులు అడిగితే ఈ చర్చంతా ఎందుకు?” నిష్ఠూరంగా అంది ఇందిర. 


"పోనీ నేను అన్నయ్య అభిప్రాయమేమిటో తెలుసుకోనా?" తను చేయగల సహాయమిదేనన్న తలంపుతో అడిగాడు మధు. 


"తప్పకుండా కనుక్కో. వదినను జాగ్రత్తగా చూసుకో నేను త్వరలో వచ్చేస్తా అంటాడు మీ అన్న" నిశ్చయంగా జరిగేది అదేనన్న స్వరంతో అంది ఇందిర. ఆలోచనలో వున్న మధుని చూస్తూ ఒక నిమిషమాగి యిలా చెప్పింది. 

"మీ అన్నయ్య నిరీక్షణ భార్యగా నేను అశోకవనంలో సీతలా యెదురుచూడమొక ఆప్షన్. ప్రతీకార చర్యగా నచ్చిన మనిషితో సహజీవనం చేస్తూ యెదురుచూడడం ఇంకొక ఆప్షన్". 

"ఏది మీకు మంచిదనుకుంటున్నారు"


"మొదటి మార్గంలో నా జీవితం హారతి కర్పూరంలా కరిగిపోవడం తప్ప ఏ ప్రయోజనం వుండదు. ఆయన తిరిగి వచ్చి విడాకులివ్వచ్చు. లేదా రాముడిలా శీల పరీక్ష చేయవచ్చు. ఆత్మాభిమానం వున్న ఏ అడది ఇలాంటి కాపురం చేయదు. అంటే భవిష్యత్తులో మీ అన్నయ్యతో నేను కలిసి జీవించే అవకాశం లేదు. " 


"అయ్యో! మరీ అంత కఠిన నిర్ణయమా?" 


"నీకు చిన్నప్పుడే తల్లి చనిపోయింది. అక్క చెల్లి లేరు. పోనీ గర్ల్ ఫ్రెండ్ వుందా అంటే అదీ లేదు. మరి ఆడదాని మనసు నీకెలా తెలుస్తుంది? ప్రేమ ఇవ్వు, స్త్రీ మనసు మల్లెపూవై గుబాళిస్తుంది. దగా చెయ్యి, పాషాణమై నిన్ను అంతం చేస్తుంది" 


"సారీ! మీ అభిప్రాయం చెప్పండి" ప్రాధేయపూర్వకంగా అడిగాడు మధు.

 

"రెండోది. మీ అన్న మార్గం. నచ్చిన స్త్రీతో తనెలా వుంటున్నాడో అలా నాకు నచ్చిన పురుషునితో సహజీవనం చేస్తాను. ఆయన విడాకులిచ్చిన తర్వాత కుదిరితే పెళ్ళి చేసుకుంటా. లేదంటే ఒంటరిగా జీవించేస్తాను. ఇలా చెయ్యడం వల్ల రెండు లాభాలు. ఒకటి నేను డిప్రెషన్ లో కి జారిపోకుండా వుండడం, రెండు, ఆయన మీద ప్రతీకారం తీర్చుకున్న తృప్తి." 


"మీ ఆలోచనలు సాంప్రదాయాలకు వ్యతిరేకంగా వున్నాయి" తిరస్కారం ధ్వనించింది మధు స్వరంలో. 


"ఏమిటి సాంప్రదాయం? మీ అన్న చేసినదా? మీరు పురుషుని సమర్ధించినట్లు స్త్రీని ఎందుకు సమర్ధించరు? ఈ నాడు ఆర్ధిక స్వాతంత్ర్యం గల యువతులు వివాహం చేసుకోవడానికి తీసుకుంటున్న ఒక జాగ్రత్త సహజీవనం. అలాంటి సహజీవనాన్ని నేను నా జీవితం సాగడానికి ఆలంబనగా కోరుకుంటున్నా. సహ జీవనం లోని మధుర జ్ణాపకాలు చాలు మిగిలిన మొత్తం జీవితానికి, తృప్తిగా బతికేయడానికి" కొద్దిగా ఆవేశంతో అంది ఇందిర. 


 "అలా అనుకోవడమెందుకు? మీతో సహజీవనం చేసిన వ్యక్తినే మీరు వివాహం చేసుకోవచ్చుగా?" 

"ఒక మగాడు ప్రియుడిగా చూపే ప్రేమ భర్తగా చూపలేడు. దానికి మగాడు చెప్పే సాకు ఏమిటంటే కుటుంబ బాధ్యతలు, వుద్యోగంలో సవాళ్ళు. అవి తనకే వున్నట్లు, స్త్రీలకు లేనట్లు. అందువల్లనే సహజీవనం చేసిన తర్వాత చేసుకున్న వివాహాలు కూడా విడాకులకు దారి తీస్తున్నాయి". 


"మీరు మరీ నిరాశావాదాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ ప్రపంచంలో మీకు మంచే జరగదన్నట్లు" అన్నాడు మధు నిరిప్తంగా. 


"ఎక్కడ జరిగింది మధూ. అడుగడుగునా కష్టాలే ఎదురొస్తున్నాయి" 


"అయితే, మీ సహజీవనంలో కూడ మీకు కష్టాలుండవని ఏమిటి గ్యారంటీ?" 


"వుంటాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, మంచి వ్యక్తిని యెంచుకోవడం, రెండు అనువైన చోట జీవించడం. " 


"మీకలాంటి వ్యక్తి దొరికాడా?" 


"ఆహా ! మీ అన్నయ్యే చూపించాడు. అ వ్యక్తి నువ్వే" 


ఒక్క సారి కరెంట్ షాక్ తిన్నట్టు అదిరి పడ్డాడు మధు. "మీకు మతి వుండే మాట్లాడుతున్నారా?" అని కోపంగా అడిగాడు. 


"అనుకున్నా నీకు కోపం వస్తుందని. నువ్వు కొన్నివిషయాలు గ్రహించాలి. మొదటిది, నేను నీకు వదినను కాదు, నీ అన్నయ్యని వదిలించుకోవడానికి ఎదురు చూస్తున్న అభాగ్య స్త్రీని. ఆందు వల్ల మీ అన్నయ్యకి నీవు అన్యాయం చేస్తున్నానని అనుకోనక్కరలేదు. రెండు. నీతో నేను శాశ్వత బంధం కోరుకోవడం లేదు. నీకు పిహెచ్ డీ రాగానే నేను వెళ్ళిపోతాను. ఆందువల్ల నీవు నన్నొక గుదిబండగా భావించనక్కర లేదు. మన సహజీవనం నీ చదువుకు అంతరాయం కలిగించకుండా చూసుకుంటాను. " 


"బూతు కథలా వుంటుంది మన బంధం. మీరు వేరొక వ్యక్తిని చూసుకోండి". 


"నాకు నమ్మకమైన వ్యక్తివి నువ్వే. నువ్వయితేనే ఒక స్త్రీ కోరుకునే ప్రేమను అందిస్తావు. వేరొకరితో తీరేది కామ వాంఛే. నాకు కావల్సినది అపురూపమైన ప్రేమ జీవితం. " 


"మీరు అన్నయ్య భార్యగా వున్నంతవరకు, మీతో సంబంధం పెట్టుకోవడం అనైతికమనే నా అభిప్రాయం. నేనొక సారి అన్నయ్య తో మాట్లాడుతాను. మీరిలాంటి ఆలోచనలు విడిచి పెట్టండి"


దృఢమైన మధు మాటలు విని, " సరే! నీ నమ్మకం నేనెందుకు కాదనాలి? " అంది ఇందిర. 


 ఒక నిమిషం తర్వాత ఇందిర లేచి మౌనంగా స్విమ్మింగ్ పూల్ వైపు నడిచింది. వెడుతున్న ఆమె వైపు చూసి మధు బాధ పడ్డాడు. " చదువు, ఆందం, చలాకీతనం వున్న ఈమెను అన్నయ్య కాకుండా వేరొక మంచి వ్యక్తి వివాహం చేసుకుని వుంటే రాణీలా హాయిగా వుండేది. దురదృష్టం!" అని జాలి పడుతూ ఇంటి వైపు అడుగులు వేసాడు. 


అర్ధరాత్రి 12 గంటల సాయంలో శేఖర్ కి ఫోన్ చేసాడు మధు. శేఖర్ బదులిస్తూ "నా కింకా పని అవ్వలేదు. ఏదైన అర్జెంటా? అని కొంచెం విసుగ్గా అడిగాడు. 


"అవునన్నయ్యా! వదిన నీ కోసమిలా యెన్నాళ్ళు యెదురు చూడాలి? నేను తను కలిసి వుంటే జనం తప్పుగా అనుకుంటున్నారు. వదిన చాలా బాధ పడుతోంది". 


"జనంగురించి మనకెందుకు? నేను ఇప్పుడే సెటిలవుతున్నాను. నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలంటే తను అక్కడే వుండాలి". 


"కానీ అన్నయ్యా! తను నాతో వుండే బదులు బెంగళూర్ వెళ్ళి అక్కడ యేదైన హాస్టల్లో వుంటూ వుద్యోగం చేసుకుంటే బాగుంటుంది కదా!" 


" వద్దు. నేను వచ్చేదాకా నువ్వు తనని కనిపెట్టివుండు. శని ఆదివారాలలో నీకు సమయం వుంటుంది కదా, గుడికో, సినిమాకో తీసుకెళ్ళు" 


"రోజంతా వూరికే కూర్చుంటే తనకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయిట. నువ్వు అక్కడ ఎవరితో నైనా సహజీవనం చేస్తున్నవేమోనని బెంగ పెట్టుకుంది" 


"అలాంటిదేం లేదని చెప్పు. బోర్ కొట్టకుండా వుండాలనే తనని సంగీతం నేర్చుకోమన్నాను. తను ఒక స్కూల్లో సంగీత పాఠాలు చెప్తోంది కదా. ఇంకేం కావాలి. సరే! వుంటాను. చాలా పనుంది" అని ఫోన్ పెట్టేసాడు శేఖర్. 


 ఇందిర వూహించినట్లే శేఖర్ మాట్లాడడం మధుకి నిరాశ కలిగించింది. 

========================================================================

ఇంకా వుంది..

========================================================================

C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: C..S.G . కృష్ణమాచార్యులు

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. మేనేజ్మెంట్ విద్యకు సంబంధించిన అనేక పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, హిమాలయ  వంటి ప్రముఖ సంస్థల ద్వార ప్రచురించాను.   చిన్నతనం  నుంచి  ఆసక్తివున్న తెలుగు రచనా వ్యాసంగం తిరిగి మొదలుపెట్టి కవితలు, కథలు, నవలలు వ్రాస్తున్నాను. ప్రస్తుత నివాసం పుదుచ్చెరీలో.


52 views0 comments
bottom of page