top of page

తప్పు చేశాను!'Thappu Chesanu' - New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar

Published In manatelugukathalu.com On 16/01/2024

'తప్పు చేశాను' తెలుగు కథ

రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్యమ భటులు ఒక వ్యక్తి చేతులకు సంకెళ్లు వేసి, ఈడ్చుకుంటూ వెళ్తున్నారు. 


"నన్ను వదిలిపెట్టండి. నేనే పాపాలూ చేయలేదు" అంటూ కేకలు పెడుతున్నాడతను. అయినా వాళ్ళు వినిపించుకోకుండా యమపురికి తీసుకొని వచ్చారు. యమధర్మరాజు ముందు ప్రవేశ పెట్టారు. 


ఆ వ్యక్తి మెడలో ఒక పలక వేలాడుతూ ఉంది. దాని మీద 'పాపి' అని రాసి ఉంది. 


"నువ్వు చేసిన తప్పులేమిటి? అవి నువ్వు తెలుసుకొని పశ్చాత్తాప పడి ఉంటే,నీ శిక్షలో కాస్త తగ్గింపు ఉంటుంది" అన్నాడు యమధర్మ రాజు. 


"నాకు తెలిసి నేనేమీ పెద్ద తప్పులు చేయలేదు. పైగా ఎంతోమందికి సహాయం చేసాను". చెప్పాడతను. 


యముడు తన చూపును చిత్రగుప్తుడి వైపు సారించాడు. 


చిత్రగుప్తుడు గొంతు సవరించుకొని, "ఇతను ఒక ప్రభుత్వరంగ సంస్థలో ఉన్నతాధికారి. 

 కీలకమైన పదవికి కావలసిన అభ్యర్థిని, పదోన్నతి(ప్రమోషన్) మీద ఎంపిక చేసే సందర్భంగా, భారీ అవినీతికి పాల్పడ్డాడు. పెద్ద మొత్తంలో లంచం తీసుకున్నాడు" చెప్పాడు చిత్రగుప్తుడు. 


"అబద్ధం!" అంటూ గట్టిగా అరిచాడు ఆ పాపి. "నేను ఎవరి దగ్గరా ఒక్క నయా పైసా కూడా లంచం తీసుకోలేదు. ఎవరి మీద ప్రమాణం చెయ్యమన్నా చేస్తాను" అన్నాడు అతను. 


చిత్రగుప్తుడు యమధర్మరాజు వైపు తిరిగి "మహాప్రభూ! పదోన్నతుల సమయంలో, దళారీగా వ్యవహరించే ఇతని దూరపు బంధువు ఒకతను, ఇతన్ని కలిశాడు. తనకు తెలిసిన మనిషికి పదోన్నతి విషయంలో సహాయం చేయమని కోరాడు" అంటూ చెబుతున్నాడు చిత్రగుప్తుడు. 


ఆయన మాటలకు అడ్డువచ్చిన ఆ పాపి "అందుకు నేను ఒప్పుకోలేదు. ప్రమోషన్ అనేది ఇంటర్వ్యూ మార్కులను బట్టి ఉంటుందని నేను అతనికి చెప్పేశాను" అన్నాడు. 


 ఏదో చెప్పబోతున్న చిత్రగుప్తుడ్ని ఆపి, యమధర్మరాజు ఆ పాపితో "తర్వాత ఏం జరిగిందో నువ్వే చెప్పు" అన్నాడు. 


 ఆ పాపి బదులిస్తూ "అప్పుడా దూరపు బంధువు, 'తెలిసిన మనిషి ప్రమోషన్ విషయంలో సహాయం చేయలేకపోయావు. సెంటర్లో నాకు ఒక స్థలం ఉంది. నీకున్న పరిచయాలతో దాన్ని అమ్మిపెట్టు. కనీసం ఈ సాయమైనా చేసిపెట్టు' అని కోరాడు. ఇలాంటి విషయాల్లో నేను కల్పించుకోననీ, కావాలంటే నా బావమరిది తో చెప్పి కొనిపిస్తాననీ చెప్పాను. నా బావమరిది ఆ స్థలాన్ని ప్రభుత్వం వారు చెప్పిన రేటుకే కొన్నాడు. ఒక్క పైసా కూడా తగ్గించి కొనలేదు" అని చెప్పాడు. 


"ఇంతకీ నీ దూరపు బంధువు చెప్పిన వ్యక్తికి పదోన్నతి కల్పించావా?" అడిగాడు యమధర్మరాజు. 


"అతను ఇంటర్వ్యూలో చక్కగా సమాధానం ఇచ్చాడు. అందువల్ల ఎంపికయ్యాడు. అయినా నేను లంచం ఏమీ తీసుకోలేదు. మా బావమరిది కూడా ప్రభుత్వ ధర ప్రకారమే ఆ స్థలాన్ని కొన్నాడు. మరి నా తప్పు ఏమిటి?" ప్రశ్నించాడు ఆ పాపి. 


యముడు ఇక చెప్పమన్నట్టుగా చిత్రగుప్తుడి వైపు చూశాడు. 


చిత్రగుప్తుడు మాట్లాడుతూ "ప్రభూ! భూలోకంలో ప్రభుత్వం నిర్ణయించిన ధర ఒకటి ఉంటే, వాస్తవంగా అమ్ముడుపోయే ధర అంతకు రెట్టింపు ఉంటుంది. 30 లక్షలకు అమ్ముడుపోయే స్థలం ప్రభుత్వ ధర 15 లక్షలు ఉంటుంది. ఇతని బావమరిది 15 లక్షలకే ఆ స్థలాన్ని కొన్నాడు. అంటే అతనికి 15 లక్షలు లాభం వచ్చింది" అని చెప్పి, ఆ తర్వాత బావమరిదికి వచ్చిన ఆ లాభం లో ఈ పాపి కి ఎంత చేరిందో, ఎలా చేరిందో వివరించాడు. అంతేకాకుండా ఇంటర్వ్యూలో ఆ వ్యక్తి ఎలా చక్కగా సమాధానాలు చెప్పగలిగాడో కూడా వివరించాడు. 


అంతా విన్న యముడు పాపికి కఠిన శిక్ష విధించాడు. 


ఆ శిక్ష ప్రకారం ఐదు సంవత్సరాల పాటు ఆ పాపి ప్రతిరోజు 500 కొరడా దెబ్బలు తినాలి. ఆ గాయాలపై ఉప్పు కారం రాశాక, సలసలా కాగే నూనెలో అరగంట సేపు వేగాలి. 


శిక్ష విన్న ఆ పాపి యమధర్మరాజుకు దండం పెడుతూ "అంత శిక్ష నేను భరించలేను. దయచేసి కనికరించండి" అని వేడుకున్నాడు. 


యముడు మాట్లాడుతూ "ఇప్పటివరకు నువ్వు చేసింది తప్పని నీ కనిపించడం లేదు. కొంతకాలం శిక్ష అనుభవించాక నీ తప్పు నువ్వే తెలుసుకుంటావు. అప్పుడు నీ ముందు నుంచి వెళుతున్న వాళ్లను పిలిచి, 'నేను తప్పు చేశాను' అంటూ నీ తప్పును వివరించి చెప్పాలి. అలా ఎంతమందికి చెబుతావో అన్ని రోజుల శిక్ష, నీకు తగ్గుతుంది" తీర్పు ముగించి ఆసనం నుండి పైకి లేచాడు సమవర్తి. 


భటులు ఆ పాపిని శిక్షించడానికి తీసుకొని వెళ్తున్నారు. అతను వెళ్తున్న దారిలో చాలామంది 'నేను తప్పు చేశాను. నా తప్పు వినండి' అంటూ వెళుతున్న వారిని ప్రాధేయ పడుతున్నారు. వారిలో తనకు తెలిసిన వ్యక్తి ఒకచోట కనిపించడంతో ఆగిపోయాడు పాపి. 


ఆ వ్యక్తి మెడలో 'మహాపాపి' అనే బోర్డు వేలాడుతూ ఉంది. కొరడా దెబ్బలకు చర్మం చిట్లి రక్తం కారుతూ ఉంది. అతను పది సంవత్సరాల ముందు తన స్థానంలో రిటైర్ అయిన వ్యక్తిగా గుర్తించాడు పాపి. భటుల అనుమతితో అతన్ని సమీపించాడు. 


"నమస్తే సార్. నేను మీ జూనియర్ ను. మీరేమిటి ఇక్కడ? అయినా నేనంటే క్విడ్ ప్రోకో పద్ధతిలో అవినీతికి పాల్పడ్డాను. కానీ మీరు అలాంటివి ఏమీ చేయలేదు. మరి మీకెందుకు ఈ శిక్ష?" అని అడిగాడు. 


"అందుకు బదులిస్తూ "నిజమే! నేను ఏ విధమైన అవినీతికి పాల్పడలేదు. కానీ మా కులం వాళ్లకి సహాయం చేయాలనే తపన ఉండేది. అలాగని వ్యక్తిగతంగా ఏ సహాయమూ చేయలేదు. ఇలా ప్రమోషన్ సమయాల్లో కుల గజ్జి చూపించే వాడిని. అది తప్పని చాలాకాలం ఈ నరకంలో శిక్ష అనుభవించి తెలుసుకున్నాను. నేను చేసిన తప్పును అందరికీ చెప్పుకుంటూ శిక్ష తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నాను. ఇంతలో నువ్వు అనర్హుడికి ప్రమోషన్ ఇవ్వడం వల్ల, నా శిక్ష మరో ఐదేండ్లు పెరిగింది" విచారంగా చెప్పాడు మహాపాపి. 


"మీ శిక్ష పెరగడంలో నా పాత్ర ఏముంది?" ఆశ్చర్యంగా అడిగాడు పాపి. 


"ఆరోజు క్యాస్ట్ ఫీలింగ్ తో నేను ప్రమోట్ చేసిన వ్యక్తి, ఈరోజు నీకు డబ్బు ఆశ చూపి ప్రమోషన్ పొందాడు. ఆరోజు నేను ఆ ప్రమోషన్ ఇవ్వకపోయి ఉంటే అతనికి నువ్వు ఇచ్చిన ప్రమోషన్ కు ఎలిజిబిలిటీ ఉండేది కాదు. అందువల్ల నా శిక్ష మరో ఐదు ఏళ్ళు పెరిగింది" విచారంగా చెప్పాడు మహా పాపి. 


ఇంతలో భటులు అతని గాయానికి ఉప్పు కారాలు రాసి, "పద. కాసేపు బాణట్లో వడియాల్లాగా వేగుదువు గానీ.. " అంటూ అతన్ని ముందుకు నడిపించారు. 


మహాపాపి చేసే హాహాకారాలు వింటూ, తనకు జరగబోయే శిక్షను ఊహించుకుంటూ, అతనికి కాస్త వెనగ్గా విచారంగా నడుస్తున్నాడు పాపి. 


 మరికొంత దూరం వెళ్ళాక 'తప్పు చేశాను. నా పాపాలు వినండి' అంటూ మరో వ్యక్తి గావుకేకలు పెడుతూ ఉండడం గమనించాడు పాపి. కాసేపు అతన్ని పరీక్షగా చూసి అతను తనకు, మహా పాపికి కూడా చాలా సీనియర్ అని గుర్తించాడు. అతని మెడలో 'అనంత పాపి' అనే బోర్డు ఉంది. భటుల అనుమతితో పాపి, మహాపాపి అతన్ని సమీపించారు. 


"నమస్తే గురువుగారూ! నేను మీకు చాలా జూనియర్ ని. మీలాంటి నిజాయితీపరుడైన వ్యక్తిని ఎక్కడా చూడలేదని ఇప్పటికీ మన స్టాప్ చెప్పుకుంటూ ఉంటారు. 


'లంచానికి లోబడని వ్యక్తి ఎవరైనా ఉన్నారా' అంటే మీ పేరే చెబుతారు. 


'పరస్త్రీల వంక కన్నెత్తి చూడని వ్యక్తులు ఈ కాలంలో ఉన్నారా' అంటే మీ గురించే చెబుతారు. 


'కులం మతం అంటే అసలు పట్టించుకోని వ్యక్తి ఎవరైనా ఉన్నారా' అంటే అందుకు సమాధానంగా కూడా మీ పేరే వస్తుంది. 


మరి మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు?" ఆశ్చర్యపోతూ అడిగాడు పాపి. 


"అదే.. ఆ పేరు నిలబెట్టుకోవడం కోసం నేను తప్పు చేశాను. చేసిన ఆ పాపం నన్ను ఈ స్థితికి తెచ్చింది" కొరడా దెబ్బల బాధను తలుచుకుంటూ చెప్పాడు అనంత పాపి. 


"కాస్త అర్థమయ్యేటట్లు వివరించండి" అని అడిగాడు మహా పాపి. 


"మీలో ఒకరు లంచం తీసుకొని ఒక వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చారు.. " చెబుతున్న అతని మాటలకు అడ్డు వచ్చి, "ఆ ప్రమోషన్ విషయంలో నేను ఏ లంచమూ తీసుకోలేదు. మా బావమరిది కొన్న స్థలానికి, నాకు ఎటువంటి సంబంధం లేదు" అంటూ వాదించబోయాడు పాపి. 


 అతన్ని ఆపి అనంతపాపి మాట్లాడుతూ "నా మెడలో బోర్డు చూసావు కదా ! నీకంటే ఎంతో సీనియర్ ని. భూలోకంలోనే కాదు, ఈ నరకంలో కూడా. ఆ స్థలం కొనడంలో మీ బావమరిదికి 15 లక్షలు లాభం వచ్చింది. అతను తన చెల్లెలికి.. అంటే నీ భార్యకు 10 లక్షల విలువ చేసే కారును గిఫ్ట్ గా కొనిచ్చాడు. ఇక నువ్వు అడిగిన ప్రశ్నలకు ఆ అభ్యర్థి చక్కగా ఎలా సమాధానం ఇచ్చాడో, అందులోని మర్మమేమిటో కూడా నాకు తెలుసు" అన్నాడు తన మెడలోని బోర్డును తడుముకుంటూ. 


మహాపాపి కల్పించుకుంటూ "మీరు చెప్పడం పూర్తి చేయండి గురువుగారూ " అన్నాడు. 


 అప్పుడు అనంతపాపి మాట్లాడుతూ "నువ్వు క్యాస్ట్ ఫీలింగ్ తో అతన్ని ప్రమోట్ చేసినందువల్ల అతను ఇప్పుడు మరో నిజాయితీపరుడితో పోటీపడి, డబ్బులు ఇచ్చి, ప్రమోషన్ సాధించాడు.. అయితే నీ కంటే ముందుగా అతనికి ప్రమోషన్ కల్పించిన వ్యక్తిని నేను. 


అప్పట్లో నేను ఒక సారి ప్రమోషన్లు ఇవ్వబోతున్నాను. ఆ సమయంలో మా క్యాస్ట్ వ్యక్తి, ఇతను మాత్రమే పోటీ పడ్డారు. 


ఇతని సామాజిక వర్గం వాళ్ళు నన్ను కలిసి నిష్పక్షపాతంగా వ్యవహరించమని, క్యాస్ట్ ఫీలింగ్ తో ఇతనికి అన్యాయం చేయవద్దని కోరారు. అప్పట్లో నాకు కులమత విచక్షణ లేని వ్యక్తిగా, సెక్యులరిస్టుగా మంచి పేరు ఉండేది.. వాస్తవంగా నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మెరిట్ ఉన్నవాడు, నిజాయితీపరుడు. కానీ అతన్ని ప్రమోట్ చేస్తే నాకున్న మంచి పేరు పోతుంది. అతని వర్గం వాళ్ళు నామీద దుష్ప్రచారం చేయడం, విధి నిర్వహణలో నన్ను చికాకు పరచడం జరుగుతుంది. అదే నా మనిషికి ప్రమోషన్ ఇవ్వకపోయినా అతను ఊరకే ఉండిపోతాడు. అవకాశం లేక నేను తనని ప్రమోట్ చేయలేదని నమ్ముతాడు. ఈ కారణంగా నేను మెరిట్ లో ఉన్న వ్యక్తిని కాదని, ఇతన్ని ప్రమోట్ చేశాను. తరువాతి ప్రమోషన్ అతను కులాన్ని ఉపయోగించి పొందాడు. ఆ తర్వాత ప్రమోషన్ డబ్బుతో కొన్నాడు" చెప్పడం ముగించాడు అనంతపాపి. 


"మొత్తానికి ముగ్గురం తప్పులు తెలుసుకున్నాం కాబట్టి చేసిన తప్పులు నలుగురికీ చెప్పుకుంటూ, శిక్ష తగ్గించుకొని బయటపడదాం" అన్నాడు పాపి. 


"ఈ శిక్షలు నువ్వు ఊహించలేనంత బాధను కలిగిస్తాయి. నీ శిక్ష ఇంకా మొదలు కాలేదు కాబట్టి నీకు తెలీదు. ఇక్కడ కలిగే బాధకు భూలోకంలో అయితే వెంటనే ప్రాణాలు విడుస్తాం. మనకా అవకాశం లేదు. ఎందుకంటే ప్రాణం విడిచాకే ఇక్కడికి వచ్చాం గనుక. చావు రాక పోవడమే నరకమని ఇక్కడికి వచ్చాకే తెలుసుకుంటాం. 


ఐదేళ్ళకయినా విముక్తి కలుగుతుందని ఆశలు పెట్టుకోవద్దు. ఇలా అక్రమంగా ప్రమోషన్లు కొట్టేసిన వ్యక్తి, కొద్ది రోజుల్లో మనం పనిచేసిన స్థాయికి వస్తాడు. అప్పుడు అతను చేసే అక్రమాల తాలూకు పాపానికి,, మనమే మూల కారణం అవుతాము. దాంతో మన శిక్ష మరింత పెరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు దెబ్బ తినడానికి మనలాంటి వాళ్లే కారణం. నిజాయితీపరులను అణచివేస్తూ, కష్టపడే మన కింది ఉద్యోగుల శ్రమని దోచుకుంటూ, మన ప్రమోషన్ లకు వాళ్ళని మెట్లుగా వాడుకుంటూ సంస్థలను నాశనం చేస్తున్నాం..” విచారంగా చెప్పాడు అనంత పాపి. 


"మిగిలిన మాటలు బాణట్లో వేగుతూ మాట్లాడుకోండి" అంటూ భటులు ముగ్గురినీ నూనెలో వేయించడానికి తీసుకొని వెళ్లారు. 


***సమాప్తం***


 మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము.

 (అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).

100 views1 comment

1 Comment


👌👌మంచి కథ సార్... ఈ కథను ప్రభుత్వ కార్యాలయాలలోని బోర్డుల మీద పెడితే, ఆ భయంతో అయినా కొందరన్నా మారుతారేమో.

Like
bottom of page