top of page

చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 1

శ్రీ C. S. G . కృష్ణమాచార్యులు గారి ధారావాహిక ప్రారంభం


'Chejara Nee Kee Jivitham - Episode 1' - New Telugu Web Series Written By C. S. G. Krishnamacharyulu Published In manatelugukathalu.com On 09/01/2024

'చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 1' తెలుగు ధారావాహిక

రచన : C..S.G . కృష్ణమాచార్యులు 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


సాయంత్రం ఆరు గంటల సమయం. చందన అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ ప్రవేశ గేటు వద్ద వచ్చే వాహనాలతో, మనుషులతో సందడి నెలకొంది. ప్రవేశ ద్వారా నికి కుడివైపు సూపర్ మార్కెట్, కూరగాయల దుకాణం, రెస్టారంట్, మందుల షాపు వున్నాయి. వస్తువులు కొనుక్కోడానికి వచ్చిన వారిలో కొందరు అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నారు. 


అప్పుడే మోటార్ సైకిల్ పై లోనికి వచ్చిన మధు, మందుల షాపు దగ్గర వెంకట్ తో మాట్లాడుతున్న ఇందిరను చూసి ముఖం చిన్న బుచ్చుకున్నాడు. వాహనం పార్కింగ్ స్థలం లో పెట్టి నడుచుకుంటూ వచ్చి ఇందిరకు కనబడేలా కొద్ది దూరంలో నిలబడ్డాడు. మధుని గమనించిన ఇందిర, సంభాషణ ముగించి, అతని దగ్గరకు వచ్చింది 


" వెంకట్ మంచివాడు కాదు. అతనితో మాట్లాడవద్దని చెప్పానుగా వదినా!"


" చెప్పావు. కానీ నాకు తప్పదు" 


" ఎందుకని" 


" అది తెలుసుకోవాలంటే నీకు సమయం, ఓర్పు వుండాలి కదా!" అంది ఆమె నిర్వికారంగా. 


“ఉన్నాయి, చెప్పు" ధృఢస్వరంతో అన్నాడు మధు. 


" అయితే రా" అంటూ ఆమె భవంతికి ఎడమవైపు రహదారిలో వున్న స్విమ్మింగ్ పూల్ కు యెదురుగా వున్న బెంచ్ దగ్గరికి నడిచింది. ఆ భవనాల చుట్టూ వున్న రహదారిలో వాకింగ్ చేసే వారి పద సవ్వడి మినహాయిస్తే, ఆ ప్రదేశం నిశ్శబ్దంగా వున్నట్టే. ఇద్దరూ కూర్చున్నాక ఆమె యిలా అంది. 


" ఒక సమస్యను అర్ధం చేసుకోవాలంటే, దానికి సంబంధించిన వ్యక్తుల గురించి, వారి పరిస్తితి గురించి, వారు యెదుర్కొనే కష్టం గురించి, తెలుసుకోవాలి. ఔనా!” 


" అవును" అని బదులిచ్చాడు మధు. అతనిలో చికాకు తగ్గి ఆసక్తి పెరిగింది. 


“మొదట నా గురించి చెప్తాను. నా తల్లి తండ్రు లెవరో, నేనెప్పుడు పుట్టానో నాకు తెలియదు. కల్యాణి అనే దేవత నన్ను తన ఆశ్రమంలో చేర్చుకుని పెంచింది. నాకు నా తోటి ఆడపిల్లలకు ఆమే అమ్మ. మా ఆత్మవిశ్వాసం పెంచడానికి, తరచూ అమ్మ ఇలా చెప్పేది. " లేదు అని ఎప్పుడూ అనుకోకూడదు. ఇపుడు యేది లేదని అనుకుంటున్నారో దానిని భవిష్యత్ లో సాధించాల్సిన జాబితాలో రాసుకోండి. ఇవాళ కనీస అవసరాలతో తృప్తి పడండి. బాగా చదివి, వుద్యోగం సాధించి, మీ సొంత డబ్బుతో మీకు కావలసిన సౌకర్యాలన్నీ అమర్చుకోండి. అప్పుడు మీకు యెంతో స్వేచ్చగా, గర్వంగా వుంటుంది”. 


మా అమ్మ శ్రద్ధంతా మా చడువు, వుద్యోగం మీదే వుండేది. ప్రేమ గురించి మాకు అమ్మ ఎన్నో జాగ్రత్తలు చెప్పేది. ” ఉద్యోగం తెచ్చుకుని జీవితంలో స్థిరపడే దాక, ప్రేమను దూరంగా వుంచండి. ప్రేమ పేరుతో పొరపాటు చేసి మళ్ళీ అనాధలుగా మారకండి. పెళ్ళయ్యాక కూడా ఉద్యోగం వదలకండి. మీ సంపాదనే మిమల్ని కాపాడుతుంది, సమాజం లో గౌరవాన్ని, జీవితానికి భధ్రతని ఇస్తుంది”. 


అమ్మ అకాంక్ష నర్ధం చేసుకుని మేము లేమిని పట్టించుకోకుండా పెరిగాము. నేను కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్నాను. బి. కాం పాసయ్యి, ఒక స్టార్ హోటల్ లో రిసెప్షనిస్ట్ గా చేరాను. కస్టమర్లతో, తోటి వుద్యోగులతో నేను పనిచేసేతీరు నచ్చి నాకు అసిస్టెంట్ మేనేజర్ గా ప్రమోషన్ ఇచ్చారు. అప్పుడు మీ అన్న శేఖర్ పరిచయం. తరచూ ఆయనకు తెలిసిన వారి పార్టీలు, ప్రోగ్రాముల యేర్పాట్లకోసం నన్ను సంప్రదించేవారు. మా మధ్య అలా స్నేహం బల పడింది.. 

 అకస్మాత్తుగా ఒక రోజు" నన్ను పెళ్ళి చేసుకుంటావా?" అని అడిగారు. 


" నేను అనాధను. నాకు కులగోత్రాలు లేవు" అని చెప్పాను. ఆయన నవ్వుతూ " నేను అనాధనే. అమ్మ చనిపోయింది. నాన్న వేరే పెళ్ళి చేసుకున్నాడు. సవతి తల్లి నన్ను నా తమ్ముడిని ఇంటినించి పంపించేసింది. అప్పటినించి, నాకు వాడు, వాడికి నేను. నువ్వు ఒప్పుకుంటే నా అదృష్టం అనుకుంటాను" అన్నారు. ఈ ప్రతిపాదనతో పాటు ఆయన ఒక షరతు పెట్టారు. ఒక ఏడాది పాటు నేను ఉద్యోగం చేయకూడదని. లైఫ్ ఎంజాయ్ చెయ్యాలంటె ఇద్దరం ఉద్యోగం చేస్తే కుదరదని చెప్పారు. 


నేను అలోచనలో పడ్డాను.. ఒక నెల రోజులు స్నేహితులతో, అమ్మతో చర్చించిన తర్వాత, సరేనన్నాను. ఆయన షరతులో చెడు యేముందని అందరూ భావించారు. రిజిస్త్రార్ ఆఫీసులో, కొద్ది మంది బంధువులు, మిత్రుల సమక్షంలో పెళ్ళి క్లుప్తంగా జరిగింది. శేఖర్ మా ఆశ్రమానికి లక్ష రూపాయలు చందా యిచ్చారు. అందరూ నన్ను అదృష్టవంతురాలివన్నారు. 


నన్ను ఈ వూరికి, ఈ ఇంటికి తెసుకు వచ్చారు. కొత్త జీవితం, కొత్త్త వూరు, కొత్త యిల్లు. మనసులో ఒక వైపు ఆనందం, మరొక వైపు తెలియని అలజడి. ఇంట్లో అడుగు పెట్టాను. మీ దూరపు చుట్టం శాంతమ్మ, నన్ను ప్రేమతో ఆహ్వానించి, నాతో దేవునిగదిలో దీపం పెట్టించారు. అంత వరకు బాగుంది. ఆ తర్వాతే   నా జీవితం గాడి తప్పింది. 


ఆ రోజు సాయంత్రం ఆయన ముఖంలో సంతోషం లేదు. కారణం నేను అడగలేదు. రాత్రి ఆయన వేరే గదిలో పడుకోడానికి వెడుతూ అశనిపాతంలాంటి విషయాలు చెప్పారు. “


“మన జాతకాల ప్రకారం శోభనం, మూడు నెలల తర్వాతేనని పురోహితులు చెప్పారు. వారం రోజుల తర్వాత నేను జర్మనీ వెళ్ళాలి. నీకు తోడుగా మా పిన్ని వుంటారు. నా తమ్ముడు మధు ఇక్కడే యూనివర్సిటీలో పిహెచ్ డీ స్టూడెంట్. వాడు కూడా శని, ఆదివారాల్లో వచ్చి కావలసిన సాయం చేస్తాడు.. ”


నా పుట్టుకెప్పుడో తెలియకుండా జాతకాలెలా చూసారని మనసులో అనుకున్నా కానీ ఆయనతో ఆ మాట అనలేదు. వారం తర్వాత  శేఖర్ జర్మనీ వెళ్ళారు. మొదట రోజూ ఫోన్ చేసేవారు. ఆ తర్వాత ఫోన్ బదులు వాట్సప్ మెసేజెస్ పంపడం మొదలు పెట్టారు. 


” ఒక వారం అని పిలిచి ప్రాజెక్ట్ పూర్తి బాధ్యత యిచ్చారు. ఒక సంవత్సరం ఇక్కడే వుండాలి. వీలు చూసుకుని వస్తాను. బెంగ పెట్టుకోకు” 'అని నమ్మ బలికారు. 


 నెల నెలా పాతిక వేలు పంపిస్తున్నారు. ఇప్పటికి యెనిమిది  నెలలు గడిచాయి. ఇంత వరకు ఒక్కసారయిన  రాలేదు. నాలుగు నెలల తర్వాత శాంతమ్మ గారు, ఆమె కూతురి దగ్గరికి వెళ్ళిపోయారు. మీ అన్న బలవంతం మీద నువ్వు హాస్టెల్ వదిలి వచ్చావు నాకు సాయంగా వుండాలని. ప్రతిరోజూ  15 కిలో మీటర్ల దూరం వె ళ్ళి వస్తున్నావు. ఏమిటిది? ఎందుకిలా? ఎప్పుడైనా ఆలోచించావా?”. 


" మీ పెళ్ళి జరిగినప్పుడు నేను సింగపూర్ లో ఒక సెమినార్ వుంటే వెళ్ళాను. నేను లేకుండా హడవుడిగా పెళ్ళి యెందుకు చేసుకున్నాడో నాకు అర్ధం కాలేదు. మా అమ్మ చనిపోయిన తర్వాత  మేమిద్దరం మాఅమ్మ కోరుకున్నట్లు రామలక్ష్మణుల్లా కలిసి వుంటున్నాము. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత పరిశోధన. అంతా అన్నయ్య అండతో జరిగాయి. అన్నయ్య చాలా మంచివాడు. సందేహాలు వద్దు”. 


" నిజమే. రాజ్యం కోసం భార్యను వదిలిన రాముడిలా మీ అన్న, సీత ముఖం చూడకుండా, గౌరవించిన లక్ష్మణుడి లా నువ్వు. దిక్కు తెలియని జీవితం నాది. ఎవరితో మాట్లడాలన్న ఒక సంకోచం. పరిచయం  వున్నకొద్ది మంది నిన్నే నా భర్త అనుకుంటున్నారు. అలా కాదని నాకథ చెప్తే, ఇక్కడ వుండడమెందుకు, పుట్టింటికి పోరాదా అంటారు. పుట్టిల్లు లేని అనాధనని చెప్పి పలుచన కాలేక ఇలా ముడుచుకుపోయి బ్రతుకుతున్న నాకు, వెంకట్ గోల ఒకటి”. 


“వాడేమంటున్నాడు?". అసహనంతో అడిగాడు మధు. 

========================================================================

ఇంకా వుంది..

========================================================================

C..S.G . కృష్ణమాచార్యులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: C..S.G . కృష్ణమాచార్యులు

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. మేనేజ్మెంట్ విద్యకు సంబంధించిన అనేక పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, హిమాలయ  వంటి ప్రముఖ సంస్థల ద్వార ప్రచురించాను.   చిన్నతనం  నుంచి  ఆసక్తివున్న తెలుగు రచనా వ్యాసంగం తిరిగి మొదలుపెట్టి కవితలు, కథలు, నవలలు వ్రాస్తున్నాను. ప్రస్తుత నివాసం పుదుచ్చెరీలో.141 views4 comments
bottom of page