top of page

చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 4'Chejara Nee Kee Jivitham - Episode4' - New Telugu Web Series Written By C. S. G. Krishnamacharyulu Published In manatelugukathalu.com On 25/01/2024

'చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 4' తెలుగు ధారావాహిక

రచన : C..S.G . కృష్ణమాచార్యులు 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:

ఇందిరని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు శేఖర్. పెళ్ళైన వెంటనే తను అర్జెంట్ గా జర్మనీ వెళ్లాల్సి రావడంతో, ఇందిరకు తోడుగా తన పిన్నిని, తమ్ముడు మధుని ఉంచుతాడు. 


వెంకట్ అనే వ్యక్తితో మాట్లాడుతున్న వదిన ఇందిరని వారిస్తాడు మధు. శేఖర్ గురించి మధుతో చెప్పడం ప్రారంభిస్తుంది ఇందిర. 


అతను డిగ్రీ చదివే రోజుల్లో ప్రభ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో ఇందిరను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి రోజే ప్రభకు వివాహం కాలేదని తెలుసుకుంటాడు. ఇద్దరూ జర్మనీ వెళ్లి అక్కడ కలిసి ఉంటారు. 


ఇందిర చెప్పిన మాటలు నమ్మలేక పోతాడు మధు. 


భర్తతో విడాకులు వచ్చేవరకు మధుతో సహజీవనం చేస్తానంటుంది ఇందిర. అంగీకరించడు మధు. అన్నయ్య శేఖర్ కి కాల్ చేసి ఇండియా వచ్చెయ్యమంటాడు. 

ఇందిర వూహించినట్లే ఇప్పట్లో రాలేనంటాడు శేఖర్. 


ఇక చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 4 చదవండి. 


రాత్రి సరిగ్గా నిద్రపోలేక పోయాడు మధు. అయినా అలవాటు ప్రకారం వుదయమే నిద్రలేచి బీచ్ ఒడ్డున జాగింగ్ చేసాడు. అన్నయ్య శేఖర్ చెప్పిన మాటలు, ఇందిర దైన్య స్థితి, ఆమె విపరీత ఆలోచనలు, తన నిస్సహాయ స్థితి, మధు మనస్సులో సుడులు తిరుగుతూ మనశ్శాంతి లేకుండా చేసాయి. ఇంటికి తిరిగి వచ్చిన మధు ఫ్లాస్క్ లోని వేడి పాలు గ్లాస్ లో పోసుకుంటూ ఇందిర యేంచేస్తోందో అనుకున్నాడు. నా మనసే ఇంత అల్లకల్లోలంగా వుంటే ఆమె మనసు బహుశా అగ్నిగుండంలా వుండి వుంటుంది అని అనుకున్నాడు. 


పాలు త్రాగుతూ ఒక సారి ఇందిరను పలకరిద్దామా అని మధు అనుకుంటుండగా, అతనికి ఇందిర పాడుతున్న మంగళ హారతి వినబడింది. కుతూహలంతో మెల్లగా దేవుని గది దగ్గరకు వెళ్ళాడు. తలార స్నానం చేసి, పట్టు చీర కట్టుకుని, హారతి పళ్ళెం చేత పట్టుకుని, భక్తితో హారతి పాట పాడుతున్న ఇందిరను చూడగనే అతనికి తన తల్లి, ఆమెచెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. " నాన్నా! గుర్తు పెట్టుకో. నీకు ఏ కష్టంవచ్చినా ఆ దేవుడికి చెప్పు. దేవుడిని నమ్మి నువ్వు యే పని చేసినా, అది తప్పకుండా జరుగుతుంది". 


అప్రయత్నంగా కనులు మూసి దేవుని ధ్యానించాడు. 

అతడిని గమనించిన ఇందిర " హారతి అద్దుకో" అంటూ అతని దగ్గరికి వచ్చింది. 


"ఇప్పుడే వచ్చాను. ఇంకా స్నానం చేయలేదు" అన్నాడు మధు. 


"పర్వాలేదు. మనసు ముఖ్యం" అంటూ హారతి పళ్ళెం అతని ముందుంచింది. కాదనలేక, మధు హారతి కళ్ళకద్దుకున్నాడు. 


"ఇవాళ శుక్రవారం కదా! లక్ష్మి దేవి పూజ చేసాను. నువ్వు స్నానం చేసి వచ్చేటప్పటికి టిఫిన్ రెడీ చేస్తాను" అంది ఇందిర. 


దేవుని తలంపులతో మధు మనసు తేలికయ్యింది. ఆలోచనలు ప్రారంభమయ్యాయి. "సమస్యా పరిష్కారం లో తొలిమెట్టు మనసుని అదుపులో వుంచడం. చెదిరిన మనస్సుతో బుద్ధి పని చేయదు. రెండో మెట్టు ఇతరుల సహాయం కోరడం. మహాభారతంలో అర్జనుడు శ్రీకృష్ణుని సహాయం కోరాడు. రామాయణంలో రాముడు సుగ్రీవుని మద్దతు కోరాడు. నేను ఎవరిని ఆశ్రయించాలి? కృష్ణుడు గీతాబోధన చేసి అర్జనుడిని కర్తవ్యోన్ముఖుని గావించాడు. నాకు అలాంటి గురువు.. నా ప్రొఫెసర్ గీతా మేడం. ఆమెకి నా కష్టం చెప్పుకుంటాను. ఆవిడ అండ వుంటే ఇందిరకు కూడా మంచి జరిగేలా చెయ్య వచ్చు" అని ఒక నిర్ణయానికి వచ్చిన మధులో మళ్ళీ వుత్సాహం వురకలేసింది. 


"రాజస్తాన్ సెమినార్ కి పేపర్ ఇవాళే పంపించాలి. ముందు దాని సంగతి చూసి తర్వాత ఈ సంగతి చూడాలి" అని అనుకున్నాడు. టేబులు మీద టిఫిన్ రెడీ గా వుంది. ఇందిర జాడ లేదు. ప్రతిరోజు లాగే ఒక్కడే తినేసి యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. 

 ***


గీతా మేడం ఇంట్లో.. సొఫాలో ఆమెకెదురుగా కూర్చున్నాడు మధు. "నీ సమస్య ఏమిటో వివరంగా చెప్పు" అని ప్రసన్న గంభీర స్వరంతో అడిగింది గీత. మధు జరిగినదంతా, యేదీ దాచకుండా వివరంగా చెప్పాడు. అంతా విన్నతర్వాత, గీత యిలా అంది. 


"ఆమె అనాధ కావడం వల్ల ఈ సమస్య జటిలమైంది. ఆమెకు తల్లి తండ్రులుంటే, వాళ్లకు ఆర్ధిక స్థోమత వుంటే, ఆమె వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయేది. ఒకవేళ కుటుంబం పేదదైనా ఆమెకు అండ దొరకడం కష్టమే. ఒక పెళ్ళి చేసిన తర్వాత ఇంకోటంటే అదేమంత సులభమైన సవాలు కాదు.. రెండొ పెళ్ళి అనగానే వచ్చే సంబంధాలు అంతంత మాత్రమే. తప్పనిసరి పరిస్థితులలో మనసు చంపుకొని కాపురం చేసే వాళ్ళెంతమందో". 


"నిజమే మేడం!" వినయంగా ఆన్నాడు మధు. 


"ఒక వేళ పెళ్ళి కాలేదనుకో. ఈ మగ డేగలు వాలిపోతాయి. ఆమాట ఈమాట చెప్పి, వివాహేతర సంబంధం యేర్పర్చుకుంటారు. అలాంటి బంధాలు సాధారణంగా అవమానకర పరిస్థితులలో ముగుస్తాయి. ఇవన్నీ గమనించే ఇందిర తన భవిష్యత్తు పై ఆశ వదులుకుంది" 


"అవును మేడం" అంటూ తల పంకించాడు మధు. 


"ఇందిర విషయంలో ఇంకో ప్రమాదమేమిటంటే, పెళ్ళి అన్నయ్యతో, కాపురం తమ్ముడితో చేసిన గడసరి అనే కళంకం ". 


"అవును మేడం, ఇంటికి వచ్చేవాళ్ళు కాస్త మీ ఆవిడని పిలుస్తారా, అని నన్ను అడుగుతారు. మా అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో తెలిసిన వాళ్ళు మీ ఆవిడ ఈ మధ్య కనబడ లేదు. కులాసాయేనా అని వాకబు చేస్తారు. అందుకే ఇందిర పనిమనిషిని కూడ పెట్టుకున్నట్టు లేదు" అని సమాజాన్ని తప్పు పట్టాడు మధు.

 

"వద్దనుకున్న పేరెలాగో వచ్చిందనే కదా నిన్ను సహజీవనం చేయమని కోరింది". 


"కావచ్చు మేడం! ఇది పాపం కాదా. ఆమె నా అన్న భార్య". 


 "నువ్వు మీ అన్న భార్య అంటున్నావు. నా భార్య అని మీ అన్న అనుకుంటున్నాడా?" 


"అనుకునే కదా! ప్రతి నెలా తనకు డబ్బు పంపుతున్నాడు"


"డబ్బు.. ఆ డబ్బు ఆమె వుద్యోగం చేసి సంపాదించుకోలేదా? ఆమె వుద్యోగం వూడ గొట్టి తన మీద ఆధారపడేలా చేసి, నెల నెలా ముష్ఠి వేస్తాడా? భార్యకి ఇవ్వాల్సింది ప్రేమ. డబ్బు ఇచ్చేవాడు యజమాని అవుతాడు కాని భర్త కాడు. తల్లి తండ్రులు, తోడబుట్టినవాళ్ళు ప్రేమని పంచుతూ, ఆమె కోర్కెలు తీరుస్తారు. అదనంగా భర్త ఒక్కడే, ఆమె కామ వాంఛలు కూడా తీరుస్తూ, తల్లి కావాలన్న ఆమె కోర్కె నెరవేరుస్తాడు. ఈ మాత్రం ఇంగితం లేదా మీ అన్నకి?"


"ఉద్యోగపరంగా భర్త దూరంగా వున్న స్త్రీలు, ఇందిరలా ఆలోచించరు కదా మేడం" 


ఈ మాట అనేటప్పుడే మధుకి అర్ధమైంది ఇది ఇందిరకు వర్తించదని. 

"ఇందిర పరిస్థితి వేరు కదా మధు. ఆమె భర్త విదేశానికి వెళ్ళి భర్త కాకుండా పోయాడు. ఇప్పుడు ఆమె ముందున్న ప్రశ్నలు మనం వేసుకుని సమాధానాలు వెదుకుందాం?”


"సరే అడగండి మేడం. " తన సంసిద్ధత వ్యక్తపరిచాడు మధు. 


" ప్రభ, శేఖర్ విడాకులు తీసుకుంటారా?"


"అన్నయ్య ప్రభని ఎంతగానో ప్రేమించాడు. దానికి నిదర్శనం పెళ్ళి చేసుకున్న తర్వాత, భార్యని, తమ్ముడిని, దేశాన్ని విడిచి పెట్టాడు. మోసమని మనమంటే త్యాగమని ప్రేమికులంటారు. అందుచేత, అన్నయ్య విడాకులిచ్చే చాన్స్ జీరో. ఇక ప్రభ గురించి నాకు అంతగా తెలియదు. నా వుద్దేశ్యంలో ప్రభ కూడా విడాకుల దాక వెళ్ళదు. ఎందుకంటే ఫ్రభకి తల్లి తండ్రీ వున్నారు. ఏదైనా సమస్య వస్తే వాళ్ళు సర్ది చెప్పే అవకాశముంది. అందు వల్ల వాళ్ళు విడాకులు తీసుకొనే సంభావ్యత 0. 3 అనవచ్చు”. 


"అంటే శేఖర్, ఇందిరకి విడాకులిచ్చే చాన్సులెక్కువే కదా!" 


"అవును మేడం. కానీ అది ఎప్పుడో తెలియడం లేదు" 


"మన దేశంలో విడాకులు తీసుకునే ప్రక్రియ యింకా సులభం కాలేదు. పరస్పర అంగీకారం వుంటే కనీసం ఆరునెలలు, లేకపొతే కనీసం 3 సంవత్సరాలు పడుతుంది. ఇందిర అంగీకరిస్తుంది కాబట్టి మీ అన్నయ్యకి విడాకులు తేలికగా వస్తాయి. అతను తన జీతంలో 25 శాతం ఇందిరకు భరణంగా ఇవ్వాల్సి వుంటుంది. కానీ భార్య ఇంకొకరితో సంబంధం పెట్టుకుందని కోర్టుని సమ్మిస్తే భరణం ఇవ్వనవసరం లేదు. ఇప్పుడు చెప్పు. శేఖర్ ఎలాంటి విడాకులు తీసుకుంటాడు. భరణం ఇచ్చేదా? ఇవ్వనిదా?”. 


మధు ఆలోచనలో పడ్డాడు. నువ్వు కూడా ఆటబొమ్మవే. ఇంట్లో రహస్య కెమేరాలున్నాయని నిన్న ఇందిర అన్న మాటలు గుర్తుకొచ్చి, అతని మనసు వికలమైంది. ఇందిర సరిగానే అర్ధంచేసుకుంది. నన్ను అక్రమ సంబంధం అనే వుచ్చులో బిగించాలని మీ అన్నయ్య ఆలోచన అని అంటే తనకు కోపం వచ్చింది. కానీ అదే నిజమనిపిస్తోంది. కేవలం డబ్బు కోసమా యింత కక్కుర్తి పని? 


దీర్ఘంగా ఆలోచిస్తున్న మధు యేమి సమాధానం చెప్తాడో అని కుతూహలంగా యెదురుచూస్తోంది గీత. 

========================================================================

ఇంకా వుంది..

చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 5 త్వరలో

========================================================================

C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: C..S.G . కృష్ణమాచార్యులు

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. మేనేజ్మెంట్ విద్యకు సంబంధించిన అనేక పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, హిమాలయ  వంటి ప్రముఖ సంస్థల ద్వార ప్రచురించాను.   చిన్నతనం  నుంచి  ఆసక్తివున్న తెలుగు రచనా వ్యాసంగం తిరిగి మొదలుపెట్టి కవితలు, కథలు, నవలలు వ్రాస్తున్నాను. ప్రస్తుత నివాసం పుదుచ్చెరీలో.


60 views0 comments

Comments


bottom of page