top of page

శభాష్ సంజీవి - ఎపిసోడ్ 4'Sabhaash Sanjeevi - Episode 4' - New Telugu Web Series Written By Otra Prakash Rao Published In manatelugukathalu.com On 18/01/2024

'శభాష్ సంజీవి - ఎపిసోడ్ 4' తెలుగు ధారావాహిక

రచన : ఓట్ర ప్రకాష్ రావు 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


‘గుడ్దిగోలా’ బ్రాండ్ కూల్ డ్రింక్ తాగడంవల్ల వచ్చే నష్టం గురించి స్కూల్ లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపిస్తాడు తొమ్మిదవ తరగతి స్టూడెంట్ సంజీవి.. దాంతో సంజీవి మీద పగ పెంచుకుంటారు వ్యాపారి జిడ్డు, డీలర్ చండుడు.. 


వార్డెన్ విశ్వనాథాన్ని లోబరుచుకుని, సంజీవి మీద దొంగతనం నేరం మోపి, ఆ బాధలో ఉన్న అతన్ని కిడ్నాప్ చేస్తారు.. అక్కడ బాలు అనే కుర్రాడు పరిచయమౌతాడు సంజీవికి.. 


గుడ్దిగోలాకు అనుకూలంగా మరో మ్యాజిక్ ప్రదర్శన ఏర్పాటు చేస్తాడు చండుడు. ఆ మెజిషియన్, సంజీవి చేసిన ప్రదర్శన మోసమని నమ్మిస్తాడు. సంజీవి కిడ్నాప్ అయినట్లు గ్రహిస్తాడు హెడ్ మాస్టర్ వెంకటరమణ. 


ఇక శభాష్ సంజీవి - ఎపిసోడ్ 4 చదవండి.. 


పిల్లలందరూ నలుగురు నలుగురుగా విడిపోయి ఒక్కొక్క ఇంటికి వెళ్లారు. భగవాన్ తన ముగ్గురు మిత్రులతో ఆ ఇంటి తలుపు తట్టాడు. 

తలుపులు తెరవగానే సంజీవి గురించి పూర్తిగా చెప్పిన తరువాత, "సంజీవి ఈ వీధిలోకి వచ్చి తప్పిపోయినట్లుగా భావిస్తున్నాము. ఆ రోజు ఈ వీధిలోకి కారు రావడం లాంటిది చూసారా ఆంటీ" అడిగాడు భగవాన్. 


"అయ్యో, అలాగా ఉదయాన్నే టిఫన్ చేసే పనులలో బయటకే రాలేదు" అంది. 

 కారు బొమ్మలతో ఆడుకొంటున్ననానీని చూసాడు భగవాన్.

"ఎల్ కే జీ చదువుతున్న వాడికి కార్లు అంటే ప్రాణం" అంది నానీ అమ్మ. 


"ఔను నానీ ఈ వీధిలో నీవు పెద్ద కారు చూసావా " అడిగాడు భగవాన్.

“చూసాను “

 “ఎప్పుడు “

“అప్పుడు” 


‘అప్పుడు అంటే ఈ రోజు కావచ్చు, నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, మూడురోజులముందు కావచ్చు.. అదే చిన్న పిల్లల బాష’ అన్న ఆలోచన భగవాన్ నందు కలిగింది. 


 "మరి ఆ కారు ఏ రంగులో వుంది" అడిగాడు భగవాన్.

 "తెల్ల రంగులో వుంది” 

 "ఇంకా ఆ కారులో ఏమేమి చూసావు నానీ”

 బుగ్గమీదు వేలు పెట్టుకొని పైకి చూస్తూ ఒక్క క్షణం ఆలోచించినతరువాత " కారుకు నంబరు చూసాను "


 "ఏం నంబరు" ఆతృతతో అడిగాడు భగవాన్ .

 " రెండు " అంటూ రెండు వేళ్ళు చూపించాడు.. 

 "మిగతా నంబర్లు తెలీదా" 

 తెలీదన్నట్టుగా తలా ఆడించాడు. 

 "రెండు మాత్రం ఎలా గుర్తుంది "

 "అది మా ఇంటి నంబరు. నాకు ఎందుకు గుర్తుండదు? "


 “మా ఇంటి నెంబరు రెండు అయినందువలన రోడ్డుమీద కనపడిన కార్ల నంబరు చూసినప్పుడంతా ఆ నంబర్లలో రెండు ఉంటే, ‘అమ్మా మనింటి నంబరు వుంది’ అంటూ గొప్పగా చెప్పడం అలవాటయింది "  అంది నాని అమ్మ.

 

 ఒక్క క్షణం అలోచించి పేపర్ తీసుకొని కారు బొమ్మ వేసాడు. 

 ఆ బొమ్మను నానీ కిస్తూ “నీవు చూసిన రెండు ఎక్కడ ఉందొ చెబితే నీకు కలర్ పెన్సిల్ ఇస్తాను” అన్నాడు. 

 జేబులో వున్న పది రూపాయలు తీసుకొని పక్కనున్న స్నేహితుడికి ఇచ్చి “కలర్ పెన్సిల్ తీసునిరా” అన్నాడు. 


 కలర్ పెన్సిల్ అనగానే ఉత్సాహంతో కారుకు వున్న నాలుగు నంబర్ల వరుసలో చివరగా రెండు వ్రాసాడు నానీ. 

 “ఇంకొక నంబరు ఏమిటో రాసావంటే మరో కలరు పెన్సిల్ ఇస్తాను. ” భగవాన్ పక్కనున్న విద్యార్థి అన్నాడు. 


 “నాకు తెలీనప్పుడు ఎలా వ్రాయాలి “ అంటూ బుంగమూతి పెట్టాడు నానీ. 


 స్నేహితుడు తెచ్చిన కలరు పెన్సిల్ ఇస్తూ నీవు ఆ కారు ఎక్కడ చూసావు చూపించు” అనడిగాడు. 

 నానీ బయటకు తనింటికి పక్కనున్న రోడ్డుమీద నిలబడినప్పుడు చూశానని చేప్పాడు. 

 “కారు ఆ పక్క వెళ్లిందా, ఈ పక్క వెళ్లిందా " అడిగాడు. 

 “ఈ పక్క పోయింది”  అన్నాడు. 


 హెడ్ మాస్టర్ ఇంటికి ఈ వీధిలో వెళ్తున్న సమయాన సంజీవి కిడ్నాప్ కావడానికి అవకాశం వుంది అన్న నిర్ణయానికి వచ్చాడు. కారులో ఇక్కడినుండి బస్టాండు వైపు వెళ్లారన్న నిర్ణయానికి వచ్చాడు. 

 *** *** ***

యుగంధర్ తన స్నేహితులతో ఆ ఇంటికి వెళ్ళాడు 

 పరిచయం చేసుకున్నాక తాము వచ్చిన సంగతి చెప్పాడు. 

 ఆమె తన చేతిలో సెల్ ఫోన్ ప్రక్కన పెట్టి వారితో మాట్లాడసాగింది. 

 ఆ సమయంలో నాలుగు సంవత్సరాల వయసుకల మున్నా అక్కడున్న సెల్ ఫోన్ తీసుకొని ఫోటో తీసాడు. 


 "సెల్ ఫోన్ ద్వారా పిల్లలకు రేడియేషన్ సమస్య వస్తుందని తెలుసు, అందుకోసమే వీడికి సెల్ ఫోన్ నందు వీడియో గేమ్స్ చూడటానికి అనుమతించము, వాడూ ఇప్పుడు సెల్ ఫోన్ చూడటం మానుకున్నాడు. సెల్ ఫోన్ దొరికిందంటే చాలు ఏదో ఒక ఫోటో తీస్తాడు. వారానికి ఒకసారి ఆ ఫొటోలన్నీ డిలీట్ చేసే స్తుంటాము "


 "ఆంటీ ఆ రోజు మున్నా ఏదైనా ఫోటో తీసాడేమో చూడండి" అన్నాడు యుగంధర్. 

 “నువ్వే చూడు యుగంధర్, అంటూ సెల్ ఫోన్ ఇచ్చింది. కెమెరా ఫైల్ ఓఎన్ చేసి చూసాడు. 

 ఒక ఫోటో కనపడగానే " ఆంటీ, సంజీవి నిజంగానే కిడ్నాప్ అయ్యాడు. మీ మున్నా ఫోటో తీసాడు" అంటూ ఏడవసాగాడు. 


 ఇంకొకడు పరుగెత్తుకొంటూ వెళ్లి హెడ్ మాస్టర్ ను పిలుచుకొనివచ్చాడు. ఏడుస్తున్న యుగంధర్ ను సముదాయించారు హెడ్ మాస్టర్. 

 "సార్ మన సంజీవి కిడ్నాప్ అయివుండొచ్చు అని ఊహించాము, కానీ ఇపుడు నిజంగా కిడ్నాప్ అయ్యాడన్న సంగతి తెలియగానే ఏడుపును కంట్రోల్ చేయలేకపోయాను " అంటూ కళ్ళు తుడుచుకున్నాడు యుగంధర్.

 

సెల్ ఫోన్ నందున్న ఫోటో చూసాడు హెడ్ మాస్టర్. 

 మున్నా తీసిన ఫొటోలో కాళ్లనుండి నడుమువరకు మాత్రమే వుంది. ఎవరో ఆగంతకుడు విద్యార్థి చేయి పట్టుకొని వున్నాడు. ఆ విద్యార్ధి సంజీవి అని ఊహించారు. 

 "యుగంధర్! ఈ ఫోటో నా సెల్ ఫోనుకు పంపు. నేను పోలీసు స్టేషనుకెళ్లి వారికి చూపిస్తాను " అన్నాడు వెంకటరమణ. 


సెల్ ఫోన్ నందున్న ఫోటోను హెడ్ మాస్టర్ ఫోన్ కు పంపాడు యుగంధర్.

 మనుషులను, కారునంబరును గుర్తుపట్టలేకపోయినా కారు తెల్లదని మాత్రం తెలిసింది. అంతకు మించి వివరాలు ఏమీ తెలుసుకొనలేకయారు. 


వెంకట కృష్ణమూర్తి, మధుబాబు, భగవాన్, యుగంధర్ లను మాత్రం తనతో పాటు పోలీసుస్టేషన్కు తీసుకొని వెళుతూ మిగిలిన వారిని ఇళ్లకు వెళ్ళమన్నాడు. 

*** *** ***

 

మధుబాబు వెంకటకృష్ణమూర్తి కలసి హాస్టల్ వైపు వెళ్లారు. ఇద్దరూ కలసి స్నేహితులతో విచారించారు. 

 “మధుబాబూ! ఈ కిడ్నాప్ విషయంలో ఈ హాస్టల్ వార్డెన్ విశ్వనాథం పాత్ర ఉన్నట్లు అనుమానంగా ఉందిరా "


 “కృష్ణమూర్తీ! అనుమానం అక్కర్లేదు, తప్పకుండా వుంది. మనం హెడ్ మాస్టర్ తో రేపు చెప్పాలి “

 ఉదయం ఇంటర్వెల్ సమయంలో రమ్మని మధుబాబు, వెంకటకృష్ణ, భగవాన్, యుగంధర్ లను రమ్మని ప్యూన్ చేత చెప్పి పంపాడు. 


 ఇంటర్వెల్ సమయంలో నలుగురు వెళ్లారు 

 "సంజీవి గురించి మాట్లాడటానికి పిలిపించాను. మీరూ ఆ వీధిలోనివారితో పోలీసులలాగా తలా తోక లేని ప్రశ్నలు వేస్తున్నారని అనుకొన్నాను. ఇప్పుడు తెలిసింది పోలీసులు అర్థం పర్థం లేని ప్రశ్నలు ప్రశ్నించినా వచ్చే సమాధానాలతో ఏదో ఒక క్లూ దొరుకుతుందని తెలిసింది. "


 "సంజీవి కిడ్నాప్ చేశారన్నది నిజం. కానీ ఎవరు చేశారన్నది కనిపెట్టాలి " అన్నాడు భగవాన్. 

 "ఈ కిడ్నాప్ చేసినవాడికి వార్డెన్ విశ్వనాథంకు సంబంధం వున్నదని అనుమానం కలుగుతోంది"అన్నాడు వెంకటకృష్ణ. 


 "హాస్టల్ నందున్న స్నేహితుడిని అడిగితే జరిగిందంతా చెప్పాడు. నాకు పూర్తిగా ఆ వార్డెన్ మీద అనుమానం కలుగుతోంది సార్ "అన్నాడు మధుబాబు.


 “నేను ఆ సంగతి రామూర్తితో చెబుతాను ఈ రోజు ఉదయమే రాంమూర్తి నాతొ మాట్లాడాడు. ఆ పనిలోనే పట్టణానికి వెళ్ళినట్లు చెప్పారు ”


 “మేము విశ్వనాథం నిజం చెప్పేలా ప్రయత్నిస్తాం సార్” 

 “రాంమూర్తి ఈ ఊరిలో లేడు. ఒకవేళ ఏమైనా జరిగితే.. "

 “ ఏమీ జరగదన్న నమ్మకం మాకుంది సార్. మేమూ తొమ్మిదవ తరగతి చదువుతున్నాము. మాకూ మా పరిధులు ఏమిటో తెలుసు సార్ "

 “ జాగ్రత్తగా ప్రవర్తించాలి "అన్నాడు వెంకటరమణ 

 *** *** ***

విశ్వనాథం హాస్టల్ నుండి ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి అదే పనిగా తలుపులు తడుతున్న శబ్దం విని విశ్వనాథం, భార్య పిల్లలు ఒక్కసారిగా మేల్కొన్నారు. లైట్ వేసి టైం చూసారు. సమయం పన్నెండు గంటలు అయింది. ఇంటి ముందు, పెరటివైపు తలుపులు తడుతున్నశబ్దం. విశ్వనాథం ఎక్కువగా వణికి పోయాడు. 


ఏడవతరగతి చదువు తున్న కొడుకు ఏకనాథ్ తలుపు తీయడానికి వెళ్తే “నువ్వెళ్ళద్దు “ అంటూ గట్టిగా చేయి పట్టుకొంది యమున. 

 “అమ్మా నాకేమి భయం లేదమ్మా" అన్నాడు. 

 “నువ్వు వెళ్ళద్దు ఏకనాథ్. నేను వెళ్తాను " అంటూ లేచివెళ్లి వణుకుతూ తలుపులు తీసింది యమున. 


 ఎవరూ లేరు కానీ ఇంటిముందున్న కవరు తీసుకొని తలుపు గడియ పెట్టి వచ్చింది. 

 అలాగే పెరటివైపు తలుపు తీసింది. అక్కడా ఒక కవరు వుంది. కవరుతీసుకొని గడియపెట్టి వచ్చింది 

 " ఏంటండీ, ఎవరో వెదవలు కవరు పెట్టి పోయారు. " అంటూ రెండు కవర్లు చేతిలోవుంచింది. ఆ కవర్లు చూడగానే విశ్వనాథంకు చెమటలు పట్టింది. ఆ రోజు సంజీవి సంచిలో పెట్టిన కవరు లాగే ఈ రెండు కవర్లు వున్నాయి. లోపల తెల్ల పేపరు ఉండటం చూసాడు. 


ఆ ఉత్తరం బేకింగ్ సోడా తో రాసిన రహస్య ఉత్తరమని ఊహించాడు విశ్వనాథం. ఎవరు వ్రాసింటారో అర్థం కాలేదు. 

 భార్య పిల్లల ముందు దీపపు వెలుగులో వేడి చేసి చదవాలంటే భయంగా వుంది. ఏమి వ్రాసి వుంటారో ఏమిటో.. ఎవడో నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఇప్పుడు చదివితే వాళ్లకు తెలిసిపోతుంది ‘ అని మనసులో అనుకొంటూ భయపడిపోయాడు విశ్వనాథం. 


 " నాన్నా, ఇది బేకింగ్ సోడా లేక నిమ్మపండు రసంతో రాసిన రహస్య వుత్తరంలాగుంది. వేడి చేస్తే తెలుస్తుంది " అన్నాడు ఏకనాథ్. 

 “ అర్ధరాత్రివేళ సైన్స్ ప్రయోగాలా, అందరూ పడుకోండి. " లేని ఆవేశం తెచ్చుకొని విశ్వనాథం అరిచాడు.. 


 లైట్స్ ఆపి అందరూ పడుకొన్నారు. 

 నిద్రపట్టలేదు. అందులో ఏమి వ్రాసిందో చదివితేకాని నిద్ర పట్టదనిపించింది. ఇప్పుడు ఇంటిలో చదవడానికి అవకాశం లేదని బాధపడ్డాడు. 

 ఆ రెండు ఉత్తరాలు తీసుకొని ఉదయాన్నే హాస్టల్ కు వెళ్ళాడు. దారిలో కొవ్వొత్తి, అగ్గిపెట్ట కొనడం యుగంధర్ గమనించాడు. 


 గదిలో కొవ్వొత్తి వెలిగించి దీపం దగ్గరగా ఉంచాడు. 

'ఎందుకు సార్ నన్ను దొంగ అన్నారు ' ఒక ఉత్తరంలో వుంది. 

'వాళ్ళు నన్ను చంపేశారు' అని మరొక పేపర్లో వ్రాసివుంది. 


ముష్టి పదివేల రూపాయలకు అనవసరంగా ఇబ్బందుల్లో ఇరుక్కున్నాను ఏం చేయాలి 'అని మనసులో అనుకొంటూ తల పట్టుకొన్నాడు. అదేసమయాన ఎనిమదవ తరగతి చదివే చెంగయ్య వచ్చి "నాకు ఇక్కడ ఉండటానికి భయంగా వుంది సార్ “ అన్నాడు. 


“నీకా.. ఏం భయంరా “ అడిగాడు విశ్వనాథం. 

"సార్ రాత్రి.. అర్ధరాత్రి సమయంలో సంజీవి కనపడి నేను దొంగను కాను, నన్ను చంపుతున్నారు అన్నాడు " ఏడుపు గొంతుతో అన్నాడు. 

"అయ్యో " తలపట్టుకొంటూ అన్నాడు విశ్వనాథం. 


“సంజీవి పుస్తకాల సంచిలో ఆ ఉత్తరం పెట్టిన వాడు, డబ్బు పెట్టినవాడు బాగుపడడు సార్. వాడికి ఆ దేవుడు నరకం చూపిస్తాడు సార్.. " అంటూ చెంగయ్య శాపనార్థాలు పెట్టడం ప్రారంభించాడు. వాడు తిడుతున్న తిట్లు తనకే తగులుతుందని తెలిసినా ఎలా అడ్డుకోవాలో అర్థంకాక కొయ్యబొమ్మలా చూడసాగాడు విశ్వనాథం. 

 *** *** *** 

విశ్వనాథంకు రాత్రి అంటేనే భయంగా వుంది. ఈ ఆధునిక కాలంలో దెయ్యం రావడం.. పిచ్చిపట్టినట్లవుతోంది. 

 

ఆ రాత్రి మరలా పన్నెండు గంటలకు కిటికీ దగ్గర ఎవరో మాట్లాడుతున్న శబ్దం. 

ముగ్గురూ మేలుకున్నారు. 


“ఏమండీ కిటికీ దగ్గర ఎవరో వున్నట్లుండి నేను చూస్తాను. ”అంటూ కిటికీ తెరిచింది భార్య యమున. 

 గాలిలో ఒక ఆకారం తేలుతోంది "సార్ నా పైన దొంగ అన్న నింద ఎందుకు వేశారు. వాళ్ళు నన్ను అన్యాయంగా చంపేశారు. ” అంటున్న గొంతు వినపడింది. 


ఏకనాథ్ ఆ ఆకారంవైపు తీక్షణంగా చూసాడు. కర్ర తీసుకొని ఇంటిముందు లైట్ వేసి తలుపు తీసి వేగంగా బయటకు వెళ్ళాడు. 

కొడుకు వెళ్లడం గమనించి తల్లితండ్రులు వేగంగా ఇంటిబయటకు వెళ్లారు. ఆ ఆకారం అలాగే పైకి వెళ్ళసాగింది. 


“దెయ్యాలు లేని ఈ రోజుల్లో ఇది వింతగా వుంది. ఏదో గూడుపుఠాణి జరుగుతోంది మనం వెంటనే పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేద్దాము. " అంది భార్య యమున. 

పోలీసు స్టేషన్ అనగానే విశ్వనాథం ఉలిక్కిపడ్డాడు. 

“ఇటువంటివాటికి పోలీసు స్టేషన్కు ఎందుకురా తలుపులు తీయకుండా ఉంటే సరే.. ఆ దెయ్యం అలాగే అరచి వెళ్ళిపోతుంది "అన్నాడు.

 

"నాన్నా రేపు మనం పోలీసు స్టేషన్ కు వెళ్ళాలి "అన్నాడు ఏకనాథ్. 

“పోలీసు స్టేషన్ కెళితే వాళ్ళు నన్నే అనుమానిస్తారు”

" మిమ్మల్ని అనుమానించడానికి ఏముంది" అంటూ యమున ప్రశ్నించింది. 

వేరే దారిలేక జరిగిందంతా ఒక్కటీ విడువకుండా చెప్పాడు.

 

"ఇక నిజం దాచడం వలన మనకే ప్రమాదం. వెంటనే పోలీసులకు చెప్పండి" భార్య చెప్పింది. 

========================================================================

ఇంకా వుంది..

========================================================================

ఓట్ర ప్రకాష్ రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1. పేరు:  ఓట్ర ప్రకాష్ రావు

https://www.manatelugukathalu.com/profile/oprao/profile2. నా గురించి   : 2017న జనవరి నెలలో రాణిపేట బి.హెచ్.ఈ.ఎల్. నందు పదవీ విరమణ పొందిన తరువాత తమిళ నాడు లోని తిరుత్తణి లో స్థిరపడ్డా ను. ”Free Yoga” పేరు మీద తిరుత్తణి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచితముగా యోగాసనములు నేర్పుతున్నాను. తీరిక సమయంలో కథలు వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను 2020 సంవత్సరం మార్చ్ మాసం నుండి లాక్ డౌన్ కారణంగా బడులు తెరవకపోవడంతో పిల్లలకు ఉచిత యోగ తరగతులకు వెళ్ళలేక పోయాను 3. విద్య : ఐ టీ ఐ 4. సాహిత్య ప్రపంచంలోని తీపి జ్ఞాపకాలు  :  1988 న ఆంధ్రప్రభ వారు నిర్వహించిన తెలుగు మినీ కథల పోటీలో మొదటి బహుమతి,  2015 నందు రాయగడ రచయితల సంఘం నిర్వహించిన కథల పోటీలో కన్సోలేషన్ బహుమతి,    2017 ,2018,2019,2020 నందు కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందా ను.   2018 న కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కవితల పోటీలో బహుమతి పొందాను               2018 అక్టోబర్ నెలలో Mytales.in నిర్వహించిన చిట్టినీతి కథల పోటీలో నా కథను ఉత్తమ కథగా ఎన్నిక               2020 ప్రతిలిపి వారు నిర్వహించిన మాండలిక కథల పోటీలో మొదటి బహుమతి లభించింది             2021 శ్రీ శ్రీ కళావేదిక వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో మొదటి బహుమతి           2021 మనతెలుగుకథలు.కామ్ వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో ప్రత్యేక బహుమతి 6. ఇంతవరకు ప్రచురించినవి  ఆంధ్రప్రభ ,ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, గోతెలుగు ,హాస్యానందం, జాగృతి, కెనడా తెలుగుతల్లి, ప్రజాశక్తి ,ప్రతిలిపి ,ప్రియదత్త, రచన, వార్త, విపుల ,శ్రీ శ్రీ కళావేదిక, మనతెలుగుకథలు.కామ్ - పత్రికలలోమొత్తం మీద ఇంతవరకు 70 కథలు ప్రచురించబడింది       ఆంధ్ర ప్రభ , బాల భారతo ,ఈనాడు హాయ్ బుజ్జి , మనతెలంగాణ , నవతెలంగాణ , ప్రభాత వెలుగు దర్వాజా , ప్రజాశక్తి , సాక్షి, వార్త , విశాలాంధ్ర - పత్రికలలో 130 బాలసాహిత్యపు కథలు

28 views0 comments

Comments


bottom of page