top of page

శభాష్ సంజీవి - ఎపిసోడ్ 1

ఓట్ర ప్రకాష్ రావు గారి కొత్త ధారావాహిక ప్రారంభం'Sabhaash Sanjeevi - Episode 1' - New Telugu Web Series Written By Otra Prakash Rao Published In manatelugukathalu.com On 03/01/2024

'శభాష్ సంజీవి - ఎపిసోడ్ 1' తెలుగు ధారావాహిక

రచన : ఓట్ర ప్రకాష్ రావు 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్బడిలో మేజిక్ కార్యక్రమం జరుగుతోంది. పిల్లలందరూ ఆసక్తితో చూస్తున్నారు. ఒక్కొక్క మేజిక్ ప్రదర్శనకు సంతోషంతో చప్పట్లు తడుతున్నారు. 


 మెజీషియన్ పిల్లల వైపు చూస్తూ "బాల బాలికలారా, ఇప్పుడు భూదేవి తాపం పెరిగిపోయిందంటారే, ఎందుకో చెప్పగలరా. " అడిగాడు. 


"భూమి అంతా ప్లాస్టిక్ తో నిండిపోయింది. వర్షంనీరు కూడా భూమిని తాకడం లేదు" అన్నాడు అద్విక్. 


"ఇంకా"


"అడవులు నరికి ఇండ్లు కట్టడం.. చెరువులు ఆక్రమించుకొని ఇండ్లు కట్టడం" అంది రుత్వీ. 


"చాలు చాలు ఇలా చెప్పుకొంటూ పోతే చాలా కారణాలు చెప్పవచ్చు. గురుత్వాకర్షణ శక్తివలన మీరు భూమిపై నడుస్తున్నారు. మరి మీరు చంద్రునిపై అలా నడవగలరా" అడిగాడు. 


“నడవలేముసార్, తేలుతూ నడుస్తాము. ఎందుకంటె అక్కడ గురుత్వాకర్షణ శక్తీ చాలా తక్కువగాఉంటుంది“ అన్నాడు ధీరజ్. 


"భూమాతకు ప్రాణం వస్తేఏంచేస్తుందో తెలుసా. ప్లాస్టిక్ వస్తువులకు మాత్రం గురుత్వాకర్షణ శక్తీ కలగకుండా చేస్తుంది" అంటూ ఒక అబ్బాయిని చూస్తూ "నీ పేరేంటి " అడిగాడు. 


"నా పేరు కృతిన్ " అన్నాడు. 


"మంచిపేరు, కృతిన్ నీవు వేదిక మీదకు వచ్చి అక్కడున్న ప్లాస్టిక్ బాటిల్ నందున్న నీటిని త్రాగి అక్కడ పారవేయ్. " అన్నాడు మెజీషియన్. 


కృతిన్ మంచినీరు త్రాగి నేలమీద ప్లాస్టిక్ బాటిల్ విసిరివేసాడు. 


ఆ ప్లాస్టిక్బాటిల్ ఒక్క సారిగా పైకి వెళ్లడం చూసి అందరూ ఆశ్చర్యంతో చూడసాగారు. 

"భూమాతకు ప్రాణం వస్తే ఈ ప్లాస్టిక్ తన పైన పడకుండా ఆకాశం వైపు లేక సూర్యుడి వైపు విసిరివేస్తుంది. అందుకే ఇప్పుడు ఆ ప్లాస్టిక్ బాటిల్ పైకి వెళ్లేలా చేసింది. ఇంకొక అబ్బాయి ఎవరైనా వస్తారా“ అనగానే ప్రమోద్ చేతిని పైకి లేపుతూ  “నా పేరు ప్రమోద్” అన్నాడు. 

 వెరీ గుడ్ ప్రమోద్. నీపేరు నేను అడగకుండానే చెప్పావు. అక్కడ ఒక మూలన వున్న ప్లాస్టీక్ కవర్లుసంచి తీసి నేలమీద విసిరివేస్తే భూమాత ఏమి చేస్తుందో చూద్దాం. " అన్నాడు.

 

 ప్రమోద్ ఆ ప్లాస్టిక్ సంచి తీసుకొని నేలమీద విసిరి వేసాడు. మరికొన్ని క్షణములలోనే అది పైకి వెళ్ళింది. అందరూ ఆశ్చర్యంతో సంతోషంతో చప్పట్లు కొట్టారు.


"మెజీషియన్ అంకుల్, అలా ఆకాశంలోనికో లేక సూర్య గ్రహానికో వెళ్లిందంటే అది కూడా కలుషితమవుతుంది. " అంటూ లేచి అడిగింది సహజ.. 


"నీవు చెప్పిన లాజిక్ సరియైనది. నేను అంతవరకు ఆలోచించలేదు. భూమాత మీద ప్లాస్టిక్ వేయవద్దండి. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించండి అన్నపాయింట్ మీద ఈ మేజిక్ చేసాను. "

మరికొన్ని మాజిక్కులు చేసిన తరువాత "అవగాహన కలిగించే మాజిక్ మాత్రమే చేయాలని హెడ్ మాస్టర్ వెంకటరమణ గారు చెప్పడం వలన ఈ రోజు అవగాహన కలిగించే మేజిక్కులు మాత్రమే చేసాను. ఇక సెలవు" అంటూ చేతులు జోడించాడు. 


హెడ్ మాష్టర్ తన ప్రసంగంలో మేజిక్ ప్రదర్శించిన మేఘనాథంకు కృతజ్ఞతలు తెలిపిన తరువాత, "అవగాహన కలిగించే ప్రదర్శనలు చేయాలని చెప్పినప్పుడు తొమ్మిదవ తరగతి చదువుతున్న సంజీవి తాను చేసే ప్రదర్శనకు అనుమతి అడిగాడు. అది మేజిక్ కాకున్నా ఆ ప్రదర్శన ద్వారా మీలో తప్పకుండా మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. అందుకే సంజీవి ఆ ప్రదర్శన చేయడానికి అనుమతించాను" అన్నారు. 


వేదిక కింద వున్న ఎలక్ట్రిక్ స్టవ్ మీద ఒక పాత్ర ఉంచాడు. అందులో ‘గుడ్డి గోలా’ కంపెనీపానీయం పోసిన తరువాత స్టవ్ ఆన్ చేసాడు. కొంత సమయం తరువాత నల్లని తారులాంటి పదార్థము మిగిలింది. 


"మీరు ప్రతిరోజూ తాగేఈ గుడ్డి గోలా కంపెనీపానీయంలో తారు లాంటి విష పదార్ధం చూడండి. అది ఆరోగ్యానికి పూర్తిగా చెడుపు చేస్తుంది. మీరంతా చదువుకుంటున్న విద్యార్థులే మీకు పెద్దగా నేను చెప్పనక్కరలేదు. అందరూ వరుసగా వచ్చి ఇందులో మిగిలిన ఆ విష పదార్ధం చూడండి. పోషక విలువలు లేని ఈ పానీయం వలన ముఖ్యమైన చాలా వ్యాధులు రావడానికి అవకాశముంది. ఇందులో ఉపయోగించే కృత్రిమ తీపి పదార్ధంనందు చక్కర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దానివలన కేన్సర్ రావడానికి ఎక్కువ అవకాశాలు వున్నాయి. ఇక మీరు ఈ కూల్ డ్రింక్ తాగుతారో, మానుకొంటారో మీ ఇష్టం. " అన్నాడు సంజీవి. 


అందరూ వరసలో నిలబడి ఆ పాత్రలో మిగిలిన నల్లటి గట్టి పదార్థమును చూడగానే ఇక మీద ఆ చల్లటి పానీయము త్రాగకూడదని గట్టిగా నిర్ణయించుకోనున్నారు. "శభాష్ సంజీవి.. శబాష్ సంజీవి"అంటూ పొగుడుతుంటే ఉప్పొంగి పోయాడు. 


 "నా ఈ ప్రదర్శనకు ఇంతమంది ఇంతగా స్పందిస్తారని ఉహించలేదు. ఇదే ప్రదర్శనను విద్యాధికారుల అనుమతితో మన జిల్లాలలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రదర్శించాలనుకొంటున్నాను." అన్నాడు సంజీవి. 


 తాను చేసిన ప్రదర్శన వలన మరిన్ని కష్టాలకు గురికావలసి వస్తుందని ఆవగింజంతయినా ఊహించలేదు సంజీవి. 

*** *** *** 

ఆ ఊరిలో జడ్డు అనే వ్యాపారి వున్నాడు. అసలు అతని పేరు జడ్డు కాదు. అది అతను పెట్టుకొన్న పేరు. తన అంగడికి వచ్చిన వారినిఎలాగైనా తన మాటలతో మైమరపించి జిడ్డులాగా పట్టుకొని కొనిపించేవాడు. అందరూ అతనిని జిడ్డు అని పిలుస్తుంటే, జిడ్డు అన్నది సిగ్గుగా అనిపించి జడ్డు అన్న పేరు పెట్టుకొన్నాడు. 


బడి గంటలు కొట్టడానికి ఐదు నిమిషాల ముందే ఇంటిలో వున్న భార్య అంగడికి వచ్చింది. బడిపిల్లలలందరూ తన అంగట్లో అమ్ముతున్న ‘గుడ్డి గోలా’చల్లని పానీయం కొనుక్కొనిత్రాగి వెళ్లేవారు. ఆ సమయాన ఒక్కసారిగా కొనటానికి పిల్లలందరూగుంపుగా రావడం వలన జడ్డు భార్య, భర్తకు సహాయం చేసేది. బడి గంటలు కొట్టగానే జడ్డు ఆనందంతో బడిబయటకు వస్తున్న పిల్లలను చూడసాగాడు. 


పిల్లలందరూ బడి గేటునుండి వేగంగా తన అంగడికి రావడానికి బదులుగా నేరుగా ఇళ్లకు వెళ్తున్న పిల్లలను చూసి ఆశ్చర్య పడ్డాడు. 


 "రేయ్ ఏంట్రా గుడ్డి గోలా’డ్రింక్ తీసుకోకుండా వెళ్తున్నారు. " ఒక అబ్బాయిని పిలిచి అడిగాడు. 

 "ఇకమీదట గుడ్డి గోలా’ తాగకూడదని నిర్ణయించుకొన్నాము జడ్డు అంకుల్. " అన్నాడు. 


"ఎందుకురా" బాధగా అడిగాడు.. 


 "నీవు అమ్మే కూల్ డ్రింక్ నందు ఎన్నిరకాల విషపదార్థములు వుందో శాస్త్రీయముగా సంజీవి చూపించాడు. ఇకమీదట ఎవరూ త్రాగరు. "


మొదటి సారి కోపంతో గట్టిగా" ఆ సంజీవి ఎవడ్రా" అనడిగాడు జడ్డు.

 

" వాడు తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. " అంటూఒక విద్యార్థి సమాధానమిస్తూ వెళ్ళాడు. 

 ****** ***

చండుడు ఆ జిల్లాకు చెందిన గుడ్డి గోలా’ కంపెనీ చల్లని పానీయమునకు టోకు వ్యాపారి. 

జడ్డుకు ఫోన్ చేసాడు "జడ్డూ ఈ రోజు వ్యాపారం ఎలా వుంది "


"ఏంచెప్పమంటారు సార్, ప్రతిరోజూ వందకు తక్కువకాకుండా అమ్ముడు పోయేవి ఈ రోజు ఒక్కటీ అమ్ముడుపోలేదు. "


"ఈ రోజు బడి సెలవు వదిలారా " 


" బడి సెలవు లేదు, పిల్లలు అందరూ వచ్చారు. ఎవడో సంజీవి అనే వెధవ, తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. వాడు మనం అమ్ముతున్న ‘గుడ్డి గోలా’ పానీయంలో విషతుల్యమైన పదార్థములున్నాయని బడిపిల్లల ఎదుట శాస్త్రీయంగా నిరూపించాడట. ఎవరూ ఇక ఈ కంపెనీ పానీయం త్రాగకూడదని నిర్ణయించుకొన్నారంట. "


 "నేను రేపువచ్చివ్యాపారం ఎలా వృద్ధి చేయాలో చెబుతాను. " అన్నాడు చండుడు. 


మరుసటి రోజు సాయంత్రం బడి వదలగానే ఒక్క విద్యార్థి కూడా అంగడివైపు రాలేదు. జడ్డు బాధగా తన ముఖానికి చెమటతో పట్టిన జిడ్డును తుండుగుడ్డతో తుడుచుకున్నాడు. 

 చండుడు రాగానే“ఈ రోజూ ఒక్క కూల్ డ్రింక్ కూడా అమ్ముడుపోలేదు "బాధగా అన్నాడు

 "జడ్డూ, ఇంతకుమునుపు గుడ్డి గోలా పానీయాలు తాయారు చేసే కంపెనీ యజమాని అయిన కాలకేయుడితో మాట్లాడాను. కొన్ని రోజులలో మంచి ఆలోచన చెబుతానన్నారు. ఆ సంజీవి ఎవడు. " అన్నాడు.

 

సంజీవి గురించి వివరంగా చెప్పిన తరువాత " నా జీవనాధారమే ఈ వ్యాపారం. "అన్నాడు జిడ్డూ.


 " ఈ జిల్లా మొత్తానికి నా పూర్తి ధనమంతా గుడ్డి గోలా పానీయం మీద పెట్టుబడి పెట్టాను. నీకే కాదు, నాకూ నష్టం రాకూడదంటే సంజీవి లాంటి వాడు చెప్పింది తప్పు అని అందరికీ నమ్మకం కలిగించేలా చేస్తానుజడ్డూ " 


" ఈ పానీయానికి గుడ్ది గోలా అని పేరుపెట్టారు ఎందుకు. గుడ్డి అంటే కళ్ళు కనపడనిది అన్న అర్థం వస్తుందిగా అంటూ ఒకడు వెక్కిరించాడు.. " 


 " అసలు ఈ పానీయం కనిపెట్టింది మనదేశం వారు కాదు. ఆ దేశం వారు గుడ్డి గోలా అన్న పేరు పెట్టారు. మన తెలుగు రాష్ట్రాలలోనే అర్థం సమస్య. అయినా పేరులో ఏముంది. మన పానీయం చాలా విషమైనది అని C. S. E. లాంటి ప్రభుత్వ విజ్ఞానులు చెప్పినా విద్యార్థులు, యువకులు గుడ్డి పేరు గురించి పట్టించుకొంటారా. పేరులో ఏమీలేదు. అంతా మన ప్రకటనలో వుంది. " అన్నాడు చండుడు. 


 "సార్ నిజంగా ఈ పానీయం అంత ప్రమాదకరమైనదా "


 "జడ్డూ, నీకు లోకం పోకడ తెలీదు. ఇతర పానీయాలతో పోలిస్తే ఇది పెద్ద ప్రమాదకరమైనది కాదు. కానీ మన అభివృద్ధి భరించలేక అందరూ మనమీద దుష్ప్రచారం చేస్తున్నారు. " అంటూ ఒక అబద్దపు బాణం వదిలాడు చండుడు. 

========================================================================

ఇంకా వుంది..

========================================================================

ఓట్ర ప్రకాష్ రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1. పేరు:  ఓట్ర ప్రకాష్ రావు

https://www.manatelugukathalu.com/profile/oprao/profile2. నా గురించి   : 2017న జనవరి నెలలో రాణిపేట బి.హెచ్.ఈ.ఎల్. నందు పదవీ విరమణ పొందిన తరువాత తమిళ నాడు లోని తిరుత్తణి లో స్థిరపడ్డా ను. ”Free Yoga” పేరు మీద తిరుత్తణి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచితముగా యోగాసనములు నేర్పుతున్నాను. తీరిక సమయంలో కథలు వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను 2020 సంవత్సరం మార్చ్ మాసం నుండి లాక్ డౌన్ కారణంగా బడులు తెరవకపోవడంతో పిల్లలకు ఉచిత యోగ తరగతులకు వెళ్ళలేక పోయాను 3. విద్య : ఐ టీ ఐ 4. సాహిత్య ప్రపంచంలోని తీపి జ్ఞాపకాలు  :  1988 న ఆంధ్రప్రభ వారు నిర్వహించిన తెలుగు మినీ కథల పోటీలో మొదటి బహుమతి,  2015 నందు రాయగడ రచయితల సంఘం నిర్వహించిన కథల పోటీలో కన్సోలేషన్ బహుమతి,    2017 ,2018,2019,2020 నందు కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందా ను.   2018 న కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కవితల పోటీలో బహుమతి పొందాను               2018 అక్టోబర్ నెలలో Mytales.in నిర్వహించిన చిట్టినీతి కథల పోటీలో నా కథను ఉత్తమ కథగా ఎన్నిక               2020 ప్రతిలిపి వారు నిర్వహించిన మాండలిక కథల పోటీలో మొదటి బహుమతి లభించింది             2021 శ్రీ శ్రీ కళావేదిక వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో మొదటి బహుమతి           2021 మనతెలుగుకథలు.కామ్ వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో ప్రత్యేక బహుమతి 6. ఇంతవరకు ప్రచురించినవి  ఆంధ్రప్రభ ,ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, గోతెలుగు ,హాస్యానందం, జాగృతి, కెనడా తెలుగుతల్లి, ప్రజాశక్తి ,ప్రతిలిపి ,ప్రియదత్త, రచన, వార్త, విపుల ,శ్రీ శ్రీ కళావేదిక, మనతెలుగుకథలు.కామ్ - పత్రికలలోమొత్తం మీద ఇంతవరకు 70 కథలు ప్రచురించబడింది       ఆంధ్ర ప్రభ , బాల భారతo ,ఈనాడు హాయ్ బుజ్జి , మనతెలంగాణ , నవతెలంగాణ , ప్రభాత వెలుగు దర్వాజా , ప్రజాశక్తి , సాక్షి, వార్త , విశాలాంధ్ర - పత్రికలలో 130 బాలసాహిత్యపు కథలు


57 views1 comment

1 Comment


@nageswararaobondala5810 • 9 hours ago

మంచి సందేశంతో మొదలు పెట్టిన ఈ కథ శ్రోతలను అమితంగా ఆకట్టుకోవాలని ఆశిస్తాను.వినిపించిన తీరు,వారి గాత్రం చాలా బాగుంది.

Like
bottom of page