top of page

లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 2



'Life Is Love - Episode 2'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 24/01/2024

'లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 2' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ: 

ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అవుతారు వరదరాజుల నాయుడుగారు. మూడు మాసాల క్రితం పెళ్ళైన కూతురు వాణి, భర్తతో కాక ఒంటరిగా ఇంటికి వస్తుంది.ఆమె మనసులో ఉన్నది చెప్పమని తరచి తరచి అడుగుతారు.



ఇక లైఫ్ ఈజ్ లవ్ ఎపిసోడ్ 2 చదవండి.


"నాన్నా! మావారు నా వాటా ఆస్థిని గురించి అడిగి వివరాలు తెలుసుకొని రమ్మన్నారు. వారు ఏదో వ్యాపారం ఆరంభిస్తారట. పాతిక లక్షలు కావాలి" మెల్లిగా చెప్పింది వాణి.


"ఏంటీ.... పాతిక లక్షలా!!" ఆశ్చర్యంతో అడిగింది అనురాధ.


నాయుడుగారు ఎడమ అరచేతిని ఎత్తి అనురాధకు చూపించారు. దాని సారాంశాన్ని గ్రహించిన ఆమె మౌనంగా తల దించుకొంది.

దీపక్.... అక్కను, తండ్రిని, తల్లిని పరిశీలనగా చూచాడు. ఏదో ఆలోచనతో అతనూ తలదించుకొన్నాడు. 

నాయుడుగారు చిరునవ్వుతో వాణికి దగ్గరగా జరిగి ముఖంలోకి చూస్తూ...

"తల్లీ అదా విషయం?" మెల్లగా అడిగారు.


తలదించుకొనివున్న వాణి.... అవునన్నట్టు తల ఆడించింది.

ఆమె భుజంపై చేయివేసి "లాయర్‍ గారిని పిలిపించి నీకు చెందవలసిన ఆస్థి వివరాలను వ్రాయించి నీకు రేపు ఇస్తాను. చచ్చేటప్పుడు ఎవరూ ఏమీ తీసుకొని పోబోరు. వున్నది వారసులకు చెందాల్సిందే" చిరునవ్వుతో "నీ నాలుగో భాగం..."


"నాలుగా!" ఆశ్చర్యంతో అంది అనురాధ.

"కాదు... ఆరు" అంది వెంటనే.


నాయుడుగారు ఆశ్చర్యంతో అనురాధ ముఖంలోకి చూచారు.

"నా భర్త ఎంతో వుత్తముడనుకున్నాను కానీ...."

"అనూ!" కాస్త హెచ్చుస్థాయిలో అన్నారు నాయుడుగారు.

నిట్టూర్చి అనురాధ తలదించుకొంది.


"అనూ!.... ఏదో ఒకరోజు ఆ పని నేను చేయాలిగా. అది ఈరోజే చేస్తాను. నాలుగును కాదని ఆరు అన్నావే దాని అర్థం."


"మీరూ.... నేను ఆ నాలుగుతో కలిస్తే ఆరు కదా!:


"అలాగా!" 


"అవునండీ... బతికినంతకాలం... మన అవసరాలకు, మనకూ డబ్బు అవసరం కదా! నేను చచ్చేంతవరకు ఒకరి మోచేతి కింద నీటిని త్రాగదలచుకోలేదు" నిట్టూర్చి సోఫానుంచి లేచి తనగది వైపునకు నడిచింది అనురాధ. ఆ ముగ్గురూ ఆమెను ఆశ్చర్యంగా చూచారు. దీపక్ లేచి తన గదికి మౌనంగా వెళ్ళిపోయాడు.


"అమ్మా వాణీ! మీ అమ్మ వాళ్ళ అమ్మా నాన్నలకు చివరి సంతతి. వారు ముగ్గురు అక్కాచెల్లెళ్ళు. నీకు తెలుసుగా! నాకు తెలిసినంతవరకు మీ అమ్మ చాలా మంచిది. ఆ విషయం నీకూ తెలుసనుకుంటాను. నిన్ననే రిటైర్ అయ్యానమ్మా. నా తండ్రి నాకు ఇచ్చింది, నేను సంపాదించింది మా తదనంతరం మీ నలుగురుకే కదమ్మా!.... అల్లుడుగారు తన కుటుంబ భవిష్యత్తు బాగుండాలని ఏదో గొప్పగా చేయాలనుకుంటున్నారన్న విషయం నీవు చెప్పిన మాటలను బట్టి నాకు అర్థం అయ్యింది. అది మీ అమ్మకు అర్థం కాలేదు. అందుకే లేచి వెళ్ళిపోయింది. నీమీద ద్వేషంగా కాదు" అనునయంగా చెప్పారు నాయుడుగారు.


"అమ్మ మనసు ఎలాంటిదో నాకు తెలుసు నాన్నా. మావారికి ఆ ఆలోచన ఇచ్చింది ఎవరో తెలుసా. మా అత్తయ్య దుర్గమ్మ" దీనంగా చెప్పింది వాణి. 


"ఏంటమ్మ నీవు అన్నది?" ఆశ్చర్యంతో అడిగాడు నాయుడుగారు.


"నిజంగా నాన్నా పదిరోజులకు ముందు ఆమె హైదరాబాదు వచ్చింది."


"ఆమె వచ్చిన మరుదినం ఆమె అన్నకొడుకు ఫణి మా ఇంటికి వచ్చాడు. ఆ రోజు ఆదివారం. వారు ఇంట్లోనే వున్నారు.


తన రెండవ కూతురును ఫణికి ఇచ్చి పెళ్ళి చేయాలని మా దుర్గమ్మ అత్తగారి ఆశ. ఫణివాళ్ళ నాన్నగారు సివిల్ కాంట్రాక్టర్. తండ్రితో కలిసి ఫణి పనిచేస్తున్నాడు.

కాబోయే అల్లుడనే ప్రీతితో దుర్గమ్మ అత్త ఫణికి గొప్పగా... నా యింట్లో మర్యాదలు చేసింది. నేను మారు మాట్లాడకుండా ఆమె చెప్పిన పనల్లా చేశాను.

భోజనాలు ముగిశాయి. అందరం హాల్లోకి చేరాము. "ఒరేయ్ నవీన్! ఎంతకాలం నీవు ఇలా ఆ పిడబ్ల్యూడిలో ఏఈ గా పనిచేస్తావు. నాతో కలువు. నా బిజినెస్‍లో నీవు ఒక పాట్నర్. ఓ పాతిక లక్షలు పెట్టుబడి పెట్టు. ఆ తర్వాత నీ జీవితం ఎలా వుంటుందో చూడు. రెండేళ్ళలో నిన్ను కోటీశ్వరుడ్ని చేస్తాను" అన్నాడు ఫణి. 


ఆ మాటలు విన్న దుర్గమ్మ ఆశ్చర్యంతో పళ్ళికిలించింది. కొడుకువైపు.... నావైపు చూచింది.

"ఓరేయ్ అబ్బాయ్! ఫణి మన బంధువు. నీ మేనమామ కొడుకు. వాడికన్నా నీమేలు కోరేవారెవరూ వుండరు. వాడిమాట విని చెప్పినట్టు చెయ్యి" ఆదేశించింది దుర్గమ్మ.

మావారు మౌనంగా ఉండిపోయారు.

"పాతిక లక్షలు పెట్టుబడిని గురించి ఆలోచిస్తున్నావా" అడిగింది దుర్గమ్మ.


"అవునమ్మా...."


"ఒరేయ్ పిచ్చి సన్నాసి మీ మామయ్యను అడగరా" అంది.


మావారు నావైపు ఒకసారి చూచి తల్లివైపు తిరిగి తలాడించారు. 

ఫణి వెళ్ళిపోయాడు.


"ఆలస్యం... అమృతం... విషం. రేయ్ విన్నావా. నీవు వాణి నెల్లూరుకు బయలుదేరండి. వెళ్ళి విషయం చెప్పి మామగారి వద్దనుండి పాతిక లక్షలు తీసుకొనిరా" అంది దుర్గమ్మత్త.


ఆ రాత్రి మావారు "వాణీ! నేను రాను. నీవు వెళ్ళీ మీ నాన్నగారితో నీ వాటాను పంచి ఇమ్మని అడుగు. వారు మంచివారు తప్పక ఇస్తారు. నేను ఉద్యోగానికి రాజీనామా చేసి ఫణితో కలిసి కాంట్రాక్ట్ వ్యాపారం ప్రారంభిస్తాను" అన్నారు. 


"బాగా ఆలోచించే ఈ మాట అంటున్నారా" సందేహంతో అడిగాను.


"బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. రేపు సాయంత్రం నిన్ను నెల్లూరికి బస్సు ఎక్కిస్తాను."

ఆ మాట చెప్పి వారు, అమ్మగారు పడుకొని వున్న గదికి వెళ్ళిపోయారు. 

నాకు ఏడుపు వచ్చింది. మిమ్మల్ని తలచుకొని ఏడ్చాను" వాణి కంఠం బొంగురుపోయింది.


"వారు అలా ఉన్నప్పుడు నేను వారిని ఎదిరించలేక మీకు ఫోన్ చేశాను. వచ్చాను" నేరస్థురాలిగా తల దించుకొంది వాణి.


"అమ్మా! బాధపడకు. నీవు అడిగింది అప్పుకాదు. నీ తండ్రిగా నీ అవసరం తీర్చడం నా ధర్మం చేస్తాను" సెల్ చేతికి తీసుకొని ఏవో నెంబర్లు డయల్ చేశారు.


"హలో"

"బావా! నమస్కారం" సీనియర్ అడ్వకేట్ రామశర్మ.


"ఆ.....ఆ.... నమస్కారం. భోజనానికి మన ఇంటికి రా."

"ఏమిటి విశేషం!"

"నేను రిటైర్ అయ్యాను బావా!" నవ్వుతూ చెప్పారు నాయుడుగారు. 


"నువ్వు రిటైర్ అయ్యావని నాకు పార్టీ ఇస్తున్నావా!" నవ్వాడు రామశర్మ.

"అవును వెంటనే బయలుదేరు"

"అలాగే. నీవు పిలవడమూ నేను రాకపోవడమా! నెవర్!! వస్తున్నా. అరగంటలో నీముందుంటా."

"సంతోషం రా!" అన్నారు నాయుడుగారు. 


వాణివైపు చూచి "అమ్మా! నీవు నిశ్చింతగా వుండు. నీ కోరిక తీరుతుంది" అనునయంగా చెప్పారు నాయుడుగారు.

"తలనొప్పిగా వుంది నాన్నా. వెళ్ళి కాసేపు పడుకొంటాను" అంది వాణి.


"రాత్రి బస్ ప్రయాణం కదా!! వెళ్ళి విశ్రాంతి తీసుకో" ప్రీతిగా చెప్పారు నాయుడుగారు.

వాణి లేచి పడకగదిలోనికి వెళ్ళిపోయింది.

అనురాధ హాల్లోకి వచ్చింది. 

చిరునవ్వుతో అనురాధ ముఖంలోకి చూచారు నాయుడుగారు.

"తండ్రీ కూతుళ్ళ చర్చ ముగిసిందా"


"ఆ...."

"సారాంశం?"

"రామశర్మను రమ్మన్నాను."

"వారెందుకు?"

"వీలునామా రాసేదానికి."

"అంటే....!!"

"అనూ! వాణి సమస్యల్లో వుంది. తల్లిదండ్రులుగా మనం ఈ సమయంలో ఆమె సమస్యను తీర్చడం మన ధర్మం కాదా!"


"మీ భార్యనైయుండి కాదని ఎలా అనగలనండీ!!"

"నా నిర్ణయానికి నీకు అభ్యంతరం లేదా!"

"లేదు... కొంతకాలం తర్వాత జరుగవలసింది ఇప్పుడే జరుగబోతుంది." ముక్తసరిగా అంది అనురాధ.


"నాయుడుగారూ!.." బయటనుంచి పిలుపు. 

ఆ ఇరువురూ వరండాలోనికి వచ్చారు.

బలరామశాస్త్రి.... వారి ప్రక్కన మరో వ్యక్తి.... ముకుందరావు..


"వరదరాజుల నాయుడుగారూ నమస్కారం" బలరామశాస్త్రి చేతులు జోడించారు.

వారి ప్రక్కన ఉన్న ముకుందరావు గారు కూడా చిరునవ్వుతో చేతులు జోడించారు.


"నమస్కారమండీ... రండి...." సగౌరవంగా వారిని ఆహ్వానించారు నాయుడుగారు.

ఆ ఇరువురూ కూర్చున్నారు.

వారికి ఎదురుగా వున్న కుర్చీలో నాయుడుగారు కూర్చున్నారు. 

అనురాధ ముఖంలోకి క్షణంసేపు చూచి....

"చెప్పండి సార్! విషయం ఏమిటి" అడిగారు నాయుడుగారు.


అనురాధ ఇంట్లోకి వెళ్ళిపోయింది.

"నాయుడుగారూ! వీరిపేరు ముకుందరావుగారు. నాకు మంచి మిత్రులు వీరు. మన అబ్బాయిని హైదరాబాదులో చూచారట ఏదో సంఘసేవా కార్యక్రమంలో. వీరికి ఒక అమ్మాయి ఉంది. మీతో సంబంధం కలుపుకోవాలని వారి ఆశ" నవ్వుతూ చెప్పారు బలరామ శాస్త్రిగారు. 


"ఓ.... అలాగా" చిరునవ్వుతో అన్నారు నాయుడుగారు.

"అవునండీ" ముకుందరావుగారి మాట.


అనురాధ ట్రేలో రెండు కాఫీ కప్పులతో వరండాలోకి వచ్చింది. వచ్చినవారికి అందించింది.

"అనూ! దీపక్‍ని పిలు"

అనురాధ తలాడించి లోనికి వెళ్ళిపోయింది.

కొద్ది క్షణాల్లో దీపక్ వరండాలోనికి వచ్చాడు.

"పిలిచారా నాన్నా" అడిగాడు.


"అవును..." కొన్ని క్షణాలు దీపక్ ముఖంలోనికి చూచారు. 

అతని ముఖంలో నీరసం.... కనిపించింది నాయుడుగారికి.


"చిన్నా... దీపక్" ముకుందరావును చూపుతూ "తెలుసా" అడిగారు నాయుడుగారు.

"అంకుల్..." నవ్వుతూ చెప్పాడు.


"గుడ్ మార్నింగ్ బాబూ" చిరునవ్వుతో దీపక్‍ని తదేకంగా చూస్తూ అన్నాడు ముకుందరావు గారు.

అనురాధ సింహద్వారం పక్కన నిలబడి వచ్చినవారికి కనబడకుండా వరండాలోని వారి సంభాషణను వింటూ వుంది.


"వీరు నీకు ఎలా పరిచయం దీపక్!" అడిగారు నాయుడుగారు.


"మా ఆఫీసులో పదిమందిమి కలిసి హైదరాబాదులో రోడ్డు ప్రక్కన ఓ వెయ్యిమొక్కలను నాటాము. వీరి ఇల్లు ఆ వీధిలోనే. వారు అప్పుడు నన్ను చూచారు. పలకరించారు. మేము చేస్తున్న పనిని గురించి విని అభినందించారు. ఇంటికి ఆహ్వానించారు. మా అందరికీ కాఫీ, టిఫిన్ ఏర్పాటు చేశారు. ఆవిధంగా వీరు నాకు పరిచయం నాన్నా!!"


"మీ అబ్బాయి నాకు బాగా నచ్చాడండి. వివరాలు అడిగి తెలుసుకొన్నాను. నా మిత్రుడు ఈ బలరామశాస్త్రితో ప్రస్తావించాను. వీరు రమ్మన్నారు. మిమ్మల్ని కలిసేదానికి వచ్చాను. నా అభిప్రాయాన్ని నా మిత్రుడు మీకు తెలియజేశారు. మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే..."

ముకుందరావు గారు ముగించకముందే..... నాయుడుగారు జోక్యం చేసుకుంటూ


"ముకుందరావుగారూ.... నాకు నలుగురు సంతతి. పెద్దవాడు భాస్కర్. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. వాడికి ఇంకా వివాహం కాలేదు. రెండో బిడ్డ వాణి లాయర్. ఆమెకు వివాహం ఐదు నెలల క్రింద జరిగింది. దీపక్ మూడవవాడు. ఉద్యోగంలో చేరి ఆరునెలలు అయింది. సివిల్ ఇంజనీరు. బి.టెక్. నాల్గవ సంతతి ఆడబిడ్డ. పేరు అమృత. ఎం.బి.బి.ఎస్, సూరత్‌కల్‍లో చదువుతోంది. ఆమెకు వివాహం చేసిన తర్వాత పెద్దవాడైన భాస్కర్‍కు పెండ్లి చేయాలని మా దంపతుల నిర్ణయం" చిరునవ్వుతో చెప్పారు నాయుడుగారు. 


"నాయుడూగారూ! ముకుందరావు గారికి ఒకే కుమార్తె. పేరు యామిని. ఆమె బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ వుంది. వీరికి ఓ పాతిక కోట్ల ఆస్థి ఉంది. వుండేది హైదరాబాదులోనే. కాలం కలిసి వచ్చిందిగా! ముందు దీపక్ పెళ్ళి జరిపించి తర్వాత అమృత, భాస్కర్‍ల వివాహం చేయవచ్చు కదా! మీ అబ్బాయి ఉద్యోగం హైదరాబాదులోనే కాబట్టి ఈ వివాహం జరిగితే దీపక్‍కు అన్నివిధాలా బాగుంటుందని నా అభిప్రాయం ఆలోచించండి" మధ్యవర్తిగా బలరామశాస్త్రి చెప్పారు. 


నాయుడుగారు సింహద్వారం వైపు చూశారు. అనురాధ ద్వారం ప్రక్కనే వున్నదని వారికి తెలుసు.

"అనూ!"

అనురాధ వరండాలోనికి వచ్చింది.

"ఏమండీ"


"విన్నావుగా వారి అభిప్రాయం."


"విన్నాను"


"మరి... నీ అభిప్రాయం ఏమిటి?" ప్రశ్నించారు నాయుడుగారు.


"మన ఇరువురి అభిప్రాయం ఒకటే కదండీ. దాన్ని మీరు వారికి చెప్పారుగా!"

ముకుందరావు, బలరామశాస్త్రి అనురాధ ముఖంలోకి ఆశ్చర్యంగా చూశారు.

క్షణంసేపు వారి ముఖాలను చూచిన అనురాధ తలను ప్రక్కకు తిప్పుకొని లోనికి వెళ్ళిపోయింది.

నాయుడుగారు దీపక్ ముఖంలోకి చూచారు.


"దీపక్! నీ అభిప్రాయం" అనునయంగా అడిగారు నాయుడుగారు.

"మీ ఇష్టం నాన్నా!" అని దీపక్ లోనికి వెళ్ళిపోయాడు.


"ముకుందరావుగారూ! విన్నారుగా నా కుటుంబ సభ్యుల అభిప్రాయం" చిరునవ్వుతో చెప్పారు నాయుడుగారు.

వారి ఆ మాటలోని అర్థం.... ఇక మీరు వెళ్ళవచ్చని... 


కాని... ముకుందరావు ఆ విషయాన్ని అంత తేలికగా వదిలే రకం కాదు.

"సార్! మీరు సరే అంటే నా యావదాస్థిని దీపక్ పేరున వ్రాస్తాను. ఇల్లరికం చేసికొంటాను" అన్నాడు సగర్వంగా.


"కుదరదు" అంది అనురాధ లోనుంచి కాస్త హెచ్చుస్వరంతో.

ముకుందరావు, బలరామశాస్త్రి ఆశ్చర్యపోయారు.

"మీరు నా యింటికి వచ్చి మీ నిర్ణయాన్ని నాకు తెలియజేసినందుకు మీకు నా ధన్యవాదములు" కుర్చీనుంచి లేచారు నాయుడుగారు.


లాయర్ రామశర్మ వచ్చారు.

"వరదా! శుభోదయం" నవ్వుతూ చెప్పాడు రామశర్మ.

అతన్ని చూసి ముకుందరావు, బలరామశాస్త్రి గారు కుర్చీల్లోంచి లేచారు.


"పదిరోజుల తర్వాత మీకు ఫోన్ చేస్తాను. మీ నిర్ణయాన్ని మార్చుకొంటే సంతోషిస్తాను. వస్తాను" అన్నాడు ముకుందరావు.


తలాడించారు నాయుడుగారు.

ముందు ముకుందరావు... వెనుక బలరామశాస్త్రి వీధివైపు నడిచారు. 

మిత్రుడు రామశర్మకు వారు వచ్చిన విషయాన్ని గురించి, వాణి ఆకస్మిక రాక, ఆమె భర్తగారి కోరిక గురించి వివరంగా చెప్పారు నాయుడుగారు.


అంతా విన్న రామశర్మ....

"నా చెల్లెలు అనూ అన్నమాట ధర్మం. ఆస్తి ఆరువాటాలుగానే చేయాలి. నా మాట విను వరదా" అన్నాడు. 


"సరే బావా! అలాగే పత్రాలు రెడీ చెయ్యి. వాణికి సంబంధించిన డాక్యుమెంట్లు ఆమెకు ఇచ్చి రేపు వూరికి పంపాలి" అన్నారు నాయుడుగారు.


"అలాగేరా" రామశర్మ వెళ్ళిపోయాడు.

రామశర్మ.... వరదరాజులు నాయుడుగారు ఒకే గ్రామస్థులు. ఆ రెండు కుటుంబాల మధ్యన ఆ రోజుల్లో ఎంతో సన్నిహితం. ఇరువురు కలిసి చదువుకున్నారు. పెరిగారు.... పెద్దవారైనారు. రామశర్మ న్యాయవాదిగా, నాయుడుగారు ఉపాధ్యాయులుగా మనుగడలను ఎంచుకొన్నారు.

స్నేహం పేరున ఎందరో చేరువ అవుతారు. కొంతకాలానికి పరిస్థితుల రీత్యా జీవనోపాధి రీత్యా విడిపోతుంటారు. కాని కొందరు మిత్రులు... వారు ఎక్కడ వున్నా... తన ప్రియ మిత్రుడిగా భావించిన వారితో సంబంధాన్ని కొనసాగిస్తూనే వుంటారు. వారే ప్రాణమిత్రులు. నాయుడుగారు, రామశర్మగారు ఆ కోవకు చెందినవారు. వారి స్నేహం అరవై సంవత్సరాలుగా ఇరువురి మధ్యన ఎంతో ఆత్మీయతా భావనలో కొనసాగుతూ ఉంది. అలాంటి మంచి మిత్రులు ఈ రోజుల్లో వెయ్యికి ఒకరుగా వుంటారో లేదో సందేహమే!!!


మంచి స్నేహానికి కావాలసింది వృత్తి కాదు. భోగభాగ్యాలు కావు. మంచి మనస్సు ఒకరిపట్ల ఒకరికి ఆత్మీయతా, గౌరవం, అభిమానం అవసరం. ఆ లక్షణాలు ఆ ఇద్దరు మధ్యన చాలా గొప్ప స్థాయిలో వున్నాయి.


రామశర్మ నాయుడుగారి ఆస్థిపాస్తులను ఆరు భాగాలుగా నిర్ణయించి వీలునామాలు వ్రాసి... రిజిష్టరు చేయించి... మరుదినం నాయుడుగారికి అందచేశారు.

ఆ మరునాడు ఉదయం...

అనురాధ భర్తకు, కూతురికి, కొడుక్కి కాఫీ కప్పులు అందించింది. అందరూ హాల్లో ఉన్నారు.

కాఫీ తాగిన దీపక్ "నాన్నా! నేను ఈరోజు హైదరాబాద్ వెళుతున్నాను" మెల్లగా చెప్పాడు.


"వారంరోజులు శలవు పెట్టానన్నావు కదరా!" అంది అనురాధ.


"సెలవు పెట్టింది నిజమే! కాని బాస్ ఫోన్ చేసి అర్జెంటు పని వుంది వెంటనే బయలుదేరి రమ్మన్నారమ్మా!!" విచారంగా చెప్పి తండ్రి ముఖంలోకి చూచాడు దీపక్. 


"సరే.... అనూ వెళ్ళాలంటున్నాడుగా వెళ్ళనీ. చూడు... ప్రతి ఒక్కరికి ఉద్యోగం అర్థాంగి లాంటిది. దాన్ని ప్రేమించాలి, అభిమానించాలి, గౌరవించాలి. ఆ ధర్మానికి సదా న్యాయం చేయాలి. అప్పుడే పదిమంది దృష్టిలో గౌరవంగా వుండగలం. గుర్తింపు, అభివృద్ది ప్రతి ఒక్కరికి వాటి మూలంగానే లభిస్తాయి" చిరునవ్వుతో చెప్పి....

మౌనంగా కూర్చుని వున్న వాణి ముఖంలోకి చూచి "అమ్మా వాణీ! నీవు పదిరోజులు వుంటావా లేక...." నాయుడుగారు మాట పూర్తిచేయకముందే....

"లేదు నాన్నా.... నేనూ... దీపక్‍తో వెళ్ళిపోతాను."


"ఏం రెండు మూడు రోజులు వుండొచ్చు కదే" కూతురిని చూస్తూ అంది అనురాధ.


"వెళ్ళాలమ్మా. త్వరలో ఆయన నేను కలిసి వస్తాములే" అనునయంగా చెప్పింది వాణి.


"అనూ! నిర్భందపెట్టకు వెళ్ళనీ" ముక్తసరిగా చెప్పారు నాయుడుగారు.


టీపాయ్ పైన వున్న కవర్‍ను చేతికి తీసుకొని....

"తల్లీ!..... వాణీ!.... ఇది వీలునామా! నీకు సంబంధించిన ఆస్థి వివరాలు ఇందులో వున్నాయి. దాన్ని నీవు వుంచుకోవచ్చు లేదా అమ్ముకోవచ్చు. అది నీ యిష్టం. తీసుకో" అని కవరును వాణికి అందించారు నాయుడుగారు.


మౌనంగా వాణి కవర్ అందుకొంది.

"థాంక్యూ నాన్నా!" మెల్లగా చెప్పింది. 

"థాంక్స్ ఏంటమ్మా నో.. నో నీ వాటా నీకు ఇవ్వడం నా ధర్మం. అదే నేను చేశాను" చిరునవ్వుతో చెప్పారు నాయుడుగారు.


"నాన్నా! వారి మాటను కోర్కెను కాదనలేక వచ్చాను" విచారంగా చెప్పింది వాణి.

"వచ్చినదానికి నీవు ఆశించినది జరిగింది కదా! ఇంకా ఎందుకు ఆ విచార వదనం. వుండబోయే కొద్ది గంటలు ఆనందంగా ఉండు. మేము నిన్ను కన్నవారం. నీ మేలును ఈ ప్రపంచంలో మాకంటే ఎవరూ కోరబోరు. ఇది నిజం గుర్తుపెట్టుకో!" జరిగినదానికి తనలోని ఆవేశాన్ని అణచుకొని ఎంతో సౌమ్యంగా చెప్పింది అనురాధ.


నాయుడుగారు భార్య ముఖంలోకి చిరునవ్వుతో చూచారు. తలను ఆడించారు అంతే!!

"మనలను గురించి మనం చెప్పుకోకూడదు" అని అర్థం ఆ విషయం అనురాధకు అర్థం అయింది. తనూ తలాడించింది.


"మరల ఎప్పుడు వస్తావో! ఏమో! రా వాణి తలంటుతాను. నాతో తలకు నూనె పెట్టించుకోవడం నీకు ఎంతో ఇష్టంగా లేచిరా" అంది ప్రీతిగా అనురాధ.


వాణి ఆశ్చర్యంతో తల్లి ముఖంలోకి చూచింది.

"వెళ్ళు తల్లీ. అమ్మ మాట విను."

"అలాగే నాన్నా"

వాణి లేచింది. తల్లి ముఖంలోకి చూచింది.

"రా....రా!" అంది అనురాధ.


ఆమె ముందు, వెనుక వాణి నడిచి డైనింగ్ హాల్లోకి వచ్చారు.

"కూర్చో నూనె తెస్తాను" అంది అనురాధ.

వాణీ కుర్చీలో కూర్చుంది.


అనురాధ అలమరలో వున్న నూనె బాటిల్‍ను చేతికి తీసుకొని వాణిని సమీపించింది. బాటిల్‍ను టేబుల్‍పై వుంచి వాణి జడను విప్పింది. శిరోజాలకు నూనె రాసి తలకు మాలిష్ చేయసాగింది.

"వాణీ!"

"ఏమ్మా!"

"ఓ మాట అడుగుతాను. నిజం చెప్పాలి!"

"నేను ఎప్పుడూ అబద్ధం చెప్పనమ్మా. అబద్ధం చెప్పకూడదని నాన్నా నీవు నాకు నేర్పారుగా!"

"ఆ...ఆ.... అవుననుకో... నేను అడగబోయేది...."

"అడుగమ్మా! నాకు తెలిసినంతవరకు నిజం చెబుతాను."


"సంతానం విషయంలో మీ దంపతులు... ఏదైనా ప్రణాళికను వేసుకొన్నారా వాణీ!" మెల్లగా అడిగింది అనురాధ.

"అవునమ్మా"

"ఏమిటీ!!" ఆశ్చర్యంగా అడిగింది అనురాధ.

"మరో రెండు సంవత్సరాలు పిల్లలు బాదరాబంధి వద్దని అనుకున్నామమ్మా!"

"ఈ ఆలోచన నీదా... మీవారిదా!"

"వారిదే"


"అతను మంచివాడేనా! నిన్ను ప్రేమగా చూచుకొంటున్నాడా."

"బాగానే చూచుకొంటున్నాడమ్మా! కానీ...."

"ఏంటా కానీ...."

"తాను గొప్పవాడు కావాలని, పెద్ద పెద్ద బంగళాలు, కార్లు, పనివారు ఇంట్లో ఉండాలని వారి ఆశ. ఆ ఆశ తీరేదానికి వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు."


"ఇంతవరకు నీకు మీవారికి ఏ విషయంలోనూ బేదాభిప్రాయాలు కలుగలేదా"

"లేదమ్మా! ఆయన మంచివాడే!"


"తల్లి వాణీ! తల్లిదండ్రులు తాను కన్నబిడ్డలను తమ జీవితకాలంలో వారి సుఖ సంతోషాలనే కోరుకుంటారు. వారి శక్తిమేరకు బిడ్డలకు కావలసిన సాయం తప్పక చేస్తారు. ఈనాడు నేను, మీ నాన్న నీ విషయంలో చేసింది అదే. మా బిడ్డలైన మీ నలుగురి పట్ల మా అభిమానం మా జీవితాంతం వరకూ ఇలాగే వుంటుంది" ప్రీతిగా చెప్పింది అనురాధ.


"ఆ విషయం నాకూ తెలుసమ్మా. నేను ఎవరు? మీ కూతురినే కదా!!"


"సరే... ఓ అరగంట నాననీ!!! ఆ తర్వాత వేన్నీళ్ళతో హాయిగా స్నానం చేద్దువుగాని" అంది అనురాధ.

"అలాగే అమ్మా"


తల వెంట్రుకలను ముడివేసుకొని వాణి హాల్లోకి వచ్చి టీవీని ఆన్ చేసి సోఫాలో కూర్చుంది.

అనురాధ వంటగది వైపునకు నడిచింది. 

వరండాలో ఎవరితోనో మాట్లాడుతున్న నాయుడుగారు వారిని సాగనంపి హాల్లోకి వచ్చారు.

"వాణీ! దీపక్ ఎక్కడ?"


"వాడు తన గదిలో నిద్రపోతున్నాడు నాన్నా!"


"ఈ టైములో నిద్ర ఏమిటమ్మా" ఆశ్చర్యంతో అడిగారు నాయుడుగారు.


"నాకేం తెలుసు నాన్నా."


"అవునవును నీకు ఎలా తెలుస్తుంది? అది వాడికి సంబంధించిన విషయం కదా!!" నవ్వుతూ వంటగదివైపునకు నడిచారు నాయుడుగారు.


అను వంకాయలు తరుగుతూ వుంది.

"అనూ!" పిలిచారు నాయుడుగారు.

తలెత్తి నాయుడుగారి ముఖంలోకి చూచింది అనురాధ.

"ఏమిటండీ?" అడిగింది.


"దీపక్ నీతో ఏమైనా చెప్పాడా?"

"ఏ విషయాన్ని గురించి? వాడు నాతో ఏమీ చెప్పలేదండీ..."


సాలోచనగా నాయుడుగారు కిటికీ గుండా శూన్యంలోకి చూచారు.

"దేన్ని గురించో ఆలోచిస్తున్నట్టు ఉన్నారు?" అడిగింది అనురాధ.

చిరునవ్వుతో ఏమీలేదన్నట్టు తలాడించారు నాయుడుగారు. గదినుంచి బయటకు వచ్చి వరండాలో ప్రవేశించారు.


పాత విద్యార్థులు ఇరువురు వచ్చి ఇంజనీరింగులో చేరబోతున్నామని చెప్పి వారి ఆశీస్సులను తీసుకొని వెళ్ళిపోయారు.

ఆ రాత్రి భోజనానంతరం బస్సులో దీపక్, వాణిలు హైదరాబాద్ పయనమై వెళ్ళిపోయారు. 

దీపక్, వాణిలు ఎక్కిన బస్సు హైవేలో హైదరాబాదుకు సాగిపోతుంది.

బస్సు బయలుదేరిన గంటకల్లా వాణి నిద్రలోనికి జారుకుంది.

కాని దీపక్ నిద్రకు నోచుకోలేదు. కారణం... గత జ్ఞాపకాలు, ప్రస్తుత పరిస్థితులు. 

దీపక్ ఎం.టెక్ గోల్డ్ మెడలిస్ట్. ఎం.టెక్ పూర్తయిన మూడునెలలకే అతనికి హైదరాబాదులో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. చార్మినార్ ఎక్స్ ప్రెస్‍లో నెల్లూరు నుంచి తన అక్క వాణితో కలిసి హైదరాబాదు బయలుదేరాడు. రైలు విజయవాడలో ఆగింది. దీపక్

మేలుకున్నాడు. ఒక యువతి అతని కంపార్టుమెంటులోనికి ఎక్కింది. అతనిది క్రింది బెర్త్. ఆ యువతిది పై బెర్త్. ఆ కంపార్ట్ మెంట్ ఎ.సి టూ టైర్. ఎదురుగా వున్న రెండు బెర్తుల్లో వృద్ధ దంపతులు. భర్త పై బెర్త్ లో. భార్య క్రింది బెర్త్ లో నిద్రపోతున్నారు.


బోగీలో ప్రవేశించిన యువతి మేల్కొని వున్న దీపక్‍ను చూచింది. చిరునవ్వుతో.....

"సార్!... మీది క్రింది బెర్తా" అడిగింది.


"అవును" అన్నాడు దీపక్.

"మీరు నాకు సాయం చేయగలరా" ప్రశ్నించింది ఆ యువతి.

"అడగండి"

"మీకు అభ్యంతరం లేకపోతే నాది పై బెర్త్ మీరు అక్కడ పడుకోగలరా!... నేను..."


"క్రింది బెర్త్ లో అంటే నా బెర్త్ లో పడుకొంటారు అంతేనా. ఇదే కదా మీరు అడగాలనుకున్నది" నవ్వుతూ అడిగాడు దీపక్ ఆమె పూర్తిగా చెప్పకముందే....

"అవునండీ!!"

"ఓ.కే... అలాగే!!"

"థాంక్యూ"

దీపక్ క్రింది బెర్త్ పై కూర్చున్నాడు. 


ఆమె సూట్‍కేసును సీట్ క్రిందకు నెట్టి అతని ప్రక్కన ద్వారం వైపున కూర్చుంది.

అతని ముఖంలోకి కృతజ్ఞతా పూర్వకంగా చూచింది.

దీపక్ చిరునవ్వుతో జవాబు ఇచ్చాడు.

"నాకు పై బెర్ అంటే భయం" మెల్లగా చెప్పింది ఆమె.

"అవునా! నా పేరు దీపక్. మీ పేరు?" అడిగాడు.

"యామినీ"


దీపక్ కొన్నిక్షణాలు యామిని ముఖంలోనికి పరీక్షగా చూచాడు. 

"ఏమిటీ అలా చూస్తున్నారు!" చిరునవ్వుతో అడిగింది యామిని.

"నిజం చెప్పమంటారా.... అబద్ధం చెప్పమంటారా? నాకు మాటలు చెప్పడం అంటే అసహ్యం" మెల్లగా చెప్పాడు దీపక్.

"అయితే... నిజమే చెప్పండి" సొగకనులతో చిలిపిగా దీపక్ ముఖంలోనికి చూచింది యామిని.


"మీరు చాలా అందంగా ఉన్నారు."

"ఓ... థాంక్యూ" నవ్వింది యామిని.

"మీది ఏ ఊరు?"

"హైదరాబాదు"

"మరి.... విజయవాడ!"

"మా నాన్నగారి జన్మస్థలం. మా తాతయ్య, నానమ్మ ఇక్కడే వుంటారు. మూడురోజుల క్రిందట వచ్చాను ఓ మ్యారేజ్ ప్రపోజల్ కోసం."


"ఎవరికి?"

"నాకే... మా తాతయ్యగారికి తెలిసిన సంబంధం."


"అబ్బాయిని చూచారా?"

"వారే మా ఇంటికి వచ్చి నన్ను చూచారు"


"అహ!" కొన్ని క్షణాల తర్వాత

"అబ్బాయి మీకు నచ్చాడా?"


"లేదు.. చేసుకోను. నాకు నచ్చలేదని తాతయ్య, నానీలకు చెప్పి బండెక్కేశాను" హుందాగా నవ్వుతూ నిర్లక్ష్యంగా చెప్పింది యామిని.


"మీరేం చేస్తుంటారు?" మెల్లగా అడిగాడు దీపక్.

"మీకు వివాహం అయిందా?" ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేసింది యామిని.

దీపక ఆశ్చర్యపోయాడు.

"ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదేమో!"

"బి.టెక్ ఫైనలియర్"


"ఐయాం ఎం.టెక్, సివిల్ ఇంజనీర్. మాది పల్లెటూరు" ఆమె అడగబోయే ప్రశ్న అదే అని ముందుగానే నవ్వుతూ జవాబు చెప్పాడు దీపక్.

"మీ సంస్కారం నాకు నచ్చింది" చిరునవ్వుతో చెప్పింది యామిని.

"ఏ విషయంలో.."

"నా విషయంలో."

"థాంక్యూ!!"

"గుడ్‍నైట్ ఇక పడుకుందాం" అంది యామిని.

"గుడ్‍నైట్" అని చెప్పి దీపక్ పై బెర్త్ ఎక్కాడు. యామిని పడుకొంది.

========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


79 views0 comments
bottom of page