top of page

లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 3



'Life Is Love - Episode 3'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 29/01/2024

'లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 3' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ: 


ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అవుతారు వరదరాజుల నాయుడుగారు. మూడు మాసాల క్రితం పెళ్ళైన కూతురు వాణి, భర్తతో కాక ఒంటరిగా ఇంటికి వస్తుంది. ఆమె మనసులో ఉన్నది చెప్పమని తరచి తరచి అడుగుతారు.


తన వాటా ఆస్తి అడగమని భర్త పంపినట్లు చెబుతుంది వాణి. అడ్వకేట్ రామశర్మని పిలిపించి ఆ ఏర్పాట్లు చూడమంటారు నాయుడుగారు.


ముకుందరావు అనే కోటీశ్వరుడు వరదరాజులు నాయుడుగారి కొడుకు దీపక్ కి తన కూతురు యామినిని ఇస్తానని అడుగుతాడు. పెద్ద కొడుకు, రెండవ కూతురు పెళ్లిళ్లు అయ్యాకే దీపక్ వివాహమని చెబుతారు నాయుడుగారు.


యామినితో తన పరిచయం గుర్తుకు తెచ్చుకుంటాడు దీపక్. 


ఇక లైఫ్ ఈజ్ లవ్ ఎపిసోడ్ 3 చదవండి.


రైలు సికింద్రాబాదు స్టేషనులో ఆగింది. ప్రక్కభోగీలో ఉన్న వాణి దీపక్ భోగిలోకి వచ్చింది. యామిని గాఢనిద్రలో ఉంది.

దీపక్ లేచాడు.

"ఏమండీ!! సికింద్రాబాద్ స్టేషన్ మనం దిగాలి" అన్నాడు. యామిని ఉలిక్కిపడి లేచింది. దీపక్‍ను చూచింది.

అదే సమయానికి వాణి భోగీలోనికి వచ్చింది. దీపక్ మాట, యామినీ చర్యను గమనించింది.

ముగ్గురూ కంపార్టుమెంటు నుంచి దిగారు. ముందు వాణి, ప్రక్కన దీపక్, వెనుక యామిని ప్లాట్‍ఫారం మీద నడుస్తున్నారు. 


"దీపక్! ఎవర్రా ఆ అమ్మాయి" మెల్లగా అడిగింది వాణి.


"రైల్లోనే పరిచయం. విజయవాడలోనే ఎక్కింది. తనకు కింది బెర్త్ కావాలని అడిగింది ఇచ్చాను" నవ్వుతూ చెప్పాడు.


దీపక్ వెనుతిరిగి యామిని ముఖంలోనికి చూచాడు. ఆగి....

"ఆ..... యామినిగారూ! వీరు మా అక్కయ్య వాణి. లాయర్. వీరి అత్తగారి వూరు ఈ వూరే."


"అలాగా!"


"అవునండి చెప్పాడు దీపక్."


"యామినీ! మావాడు మీకు ఏమైనా ఇబ్బందిని కలిగించాడా!" నవ్వుతూ అడిగింది వాణి.


"నో.... నో... హి ఈజ్ హ్యావింగ్ హై హోస్పిటాలిటీ" 

చిరునవ్వుతో దీపక్ ముఖంలోనికి చూస్తూ చెప్పింది యామిని.

ముగ్గురూ స్టేషన్ బయటికి వచ్చారు.

"మీ ఇల్లు ఎక్కడండి?" యామినిని అడిగాడు దీపక్. 


"బంజారాహిల్ రోడ్ నెంబర్ సిక్స్"


"మాది సెవెన్ టీన్ రండి ఒకే టాక్సీలో వెళదాం. మిమ్మల్ని మీ ఇంటిదగ్గర దించి నేను మా ఇంటికి వెళతాను" అంది వాణి.


"అమ్మ నాకోసం కారును పంపించారండీ. మిమ్మల్ని మీ ఇంటిదగ్గర దించి నేను వెళ్తాను" ప్రీతిగా చెప్పింది యామిని.

"మేము ఆటోలో వెళతాము. మీరు వెళ్ళండి" అంది వాణి.


"ఎందుకండి మీకు శ్రమ" అన్నాడు దీపక్ యామిని ముఖంలోకి చూస్తూ…


"ఇందులో నాకు శ్రమ ఏముందండీ... డ్రైవర్ కదా కారు నడిపేది. ప్లీజ్ కమ్" అప్యాయంగా చెప్పింది యామిని.

ముగ్గురూ కలిసి కారును సమీపించారు. డ్రైవర్ సూట్‍కేసును డిక్కీలో పెట్టాడు. ముందు సీట్‍లో దీపక్, వనుక సీట్‍లో వాణి, యామిని కూర్చున్నారు.


డ్రైవర్ కారును స్టార్ట్ చేశాడు.


ప్రక్కనే కూర్చుని వున్న యామినీని పరిశీలనగా చూచింది వాణి.

"యామిని మంచి అందగత్తె. చూచిన మగాడికి కళ్ళు తప్పక తిరుగుతాయి. మరి మా దీపుగాడి పరిస్థితి ఏమిటో" 

అనుకుంది వాణి.


"మీరూ!" ఆగిపోయింది వాణి.


"మేమూ....! ఓ... అదా.... నాయుళ్ళం. మరి మీరు?"


"మేమూ... అదే...." సంతోషంగా నవ్వింది వాణి.


"నాకు మా నాన్నగారికి కుల మతాలంటే పట్టింపు లేదు" అంది యామిని.


"మీ నాన్నగారు ఏమి చేస్తుంటారు?"


"బిజినెస్!"


"ఏమిటో"


"కన్స్ స్ట్రక్షన్స్, యామినీ కన్సస్టక్షన్స్ కంపెనీ లిమిటెడ్ సి.ఎం.డి మా నాన్నగారు."


"అమ్మగారు"


"డాక్టర్. పేరు వసంత"


"మరి మీరు..."


"బి.టెక్ ఫైనలియర్ చదువుతున్నాను."


వాణి ప్రసంగం దీపక్‍కు నచ్చలేదు.

"అక్కా!..."


"ఏందిరా?"


"వారి వివరాలు మనకెందుకు?"


"తెలుసుకోవడంలో తప్పులేదుగా సార్" నవ్వుతూ అంది యామిని క్షణం తర్వాత.


"మీ ఇరువురూ అక్కాతమ్ములు నాకు బాగా నచ్చారు. నా నెంబర్ నోట్ చేసుకోండి ----- మరి మీ నెంబరు ఏమిటి దీపక్ గారూ" అంది యామిని.


"-----" చెప్పాడు దీపక్.


వాణి ఇరువురివైపు చూచింది. జోడీ బాగానే ఉంటుంది. అయితే ముందు అమెరికాలో ఉన్న అన్నగారు భాస్కర్ పెండ్లి కావాలిగా అనుకొంది.


"మీకు సినిమాలు అంటే ఇష్టమా" అడిగింది యామిని.

"థియేటర్‍కి వెళ్ళి చూడడం చాలా తక్కువ. టీవీలో చూస్తుంటాను."


"మీవారు ఏం చేస్తుంటారు?" అడిగింది యామిని.


"మీరు కాబోయే జూనియర్ ఇంజనీరు! వారు ప్రస్తుతం అసిస్టెంటు ఇంజనీర్" నవ్వుతూ చెప్పాడు దీపక్.


"వాణీ గారు... మీరు" యామినీ మాట పూర్తిచేయకముందే....

"లాయర్"


"ప్రాక్టీసు చేస్తున్నారా!"


"సీనియర్ లాయరు ధర్మారావు గారి వద్ద పని నేర్చుకుంటున్నాను."


"ఓ... అలాగా!!"


"అవును. మీరు నాకు బాగా నచ్చారు యామినీ" ప్రీతిగా చెప్పింది వాణి.


యామిని అందంగా నవ్వుతూ "థాంక్యూ.... థాంక్యూ" అంది. 

తర్వాత వారి సంభాషణ సినిమాలు గురించి సాగింది. కారు వాణి ఇంటిని సమీపించింది. యామిని చెప్పినచోట డ్రైవర్ కారును ఆపాడు.


వాణి, దీపక్‍లు కారు దిగారు. "థాంక్యూ... యామినీ" ఏకకంఠంతో చెప్పారు.


"బై వన్స్ ఎగైన్ థాంక్యూ... బోత్" నవ్వుతూ చెప్పింది యామిని. 


డ్రైవర్ కారును స్టార్ట్ చేశాడు. 

గత జ్ఞాపకాలతో దీపక్ రాత్రి గడిచేవరకు ప్రశాంతంగా నిద్రపోలేదు. మూడుగంటల ప్రాంతంలో ఆలోచనలతో అలసి సొమ్మసిల్లి నిద్రపోయాడు. వారి బస్సు ఉదయం ఏడుగంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్ స్టాప్‍కు చేరింది. ఆరుగంటలకే మేలుకొన్న వాణి దీపక్‍ను తట్టి లేపింది. దీపక్ తొట్రుపాటుతో కళ్ళు తెరిచాడు. ఇరువురూ బస్సు దిగారు. ఆటోలో వాణిని వారి ఇంటివద్ద దింపి కుకట్‍పల్లిలోని తన రూమ్‍కు వెళ్ళిపోయాడు దీపక్.

వాణి అత్తవారి ఇంట్లో ప్రవేశించింది. అత్త దుర్గమ్మగారు వాణిని చూసింది.


"ఏం వాణీ! పోయిన పని ఏమైంది. కాయా, పండా" వాణి ముఖంలోకి నిశితంగా చూస్తూ అడిగింది.


"పండే అత్తయ్యా" వినయంగా జవాబు చెప్పింది వాణి.


"మీ నాన్న వీలునామా వ్రాసి ఇచ్చారా?"


"రిజిస్టరు కూడా చేసి యిచ్చారు."


"ఏవీ ఆ కాగితాలు"

సూట్‍కేసు తెరిచి వీలునామా కాగితాలున్న కవరును వాణి అత్తగారికి అందించింది.


"నాన్నగారు లాయర్ గారి సమక్షంలో యావదాస్థిని ఆరు భాగాలుగా చేసి వీలునామా వ్రాయించి ఇచ్చారు అత్తయ్యా."


"ఆరు భాగాలా!"


"అవును. అమ్మా.... నాన్నలతో కలిపి..."


"ఓహో.... సరే!.... వెళ్ళి పనిచూసుకో."


దుర్గ కవర్‍లోని కాగితాలను బయటకు తీసుకొని చదవసాగింది.


వాణి తన గది దగ్గరికి వెళ్ళి తలుపును తోసింది.

గడియపెట్టనందున అది తెరుచుకొంది. లోన ప్రవేశించింది.

అదే సమయానికి భర్త నవీన్ రెస్ట్ రూం నుండి బయటకు వచ్చాడు. వాణిని చూచి....

"ఎప్పుడు వచ్చావు?"


"పది నిమిషాలయింది."


"పోయిన పని???" ప్రశ్నార్థకంగా వాణి ముఖంలోకి చూచారు నవీన్.


"సానుకూలం.... పత్రాలు అత్తయ్యగారికి ఇచ్చాను."

నవీన్ నవ్వుతూ వాణి భుజాలు పట్టుకొని "నాకు తెలుసు కార్యాన్ని సాధించి గాని తిరిగి రావని."


తలాడించి "అలసటగా ఉంది. నేను రెండు గంటలు నిద్రపోతానండి ప్లీజ్! డోంట్ డిస్ట్రబ్!!"


"అలాగే..... అలాగే!! రెస్టు తీసుకో" ఆనందంగా చెప్పాడు నవీన్.


’నేను వీలునామా కాగితాలతో రాకుంటే నాకు ఈ ఆదరణ, అభిమానం వీరి నుంచి లభించేదా? అంతా డబ్బు మహిమ!!’ అనుకుంది వాణి.


డ్రస్ చేసుకొని నవీన్ కిందికి వెళ్ళిపోయాడు. వాణి రెస్టురూంకు వెళ్ళింది. 


నవీన్‍ను చూచిన తల్లి దుర్గమ్మ "ఒరేయ్! నా కోడలు గట్టి పిండమేరా.... మనం కోరినదాన్ని సాధించుకొచ్చింది" నవ్వుతూ వీలునామా కాగితాలను నవీన్‍కు అందించింది.

నవీన్ అందుకొని చూడసాగాడు.


"ఒరేయ్! నేను సాయంత్రం ఫణిని ఇంటికి రమ్మని ఫోన్ చేస్తాను. నీవూ త్వరగా ఇంటికి రా సరేనా" అంది దుర్గమ్మ.

"అలాగే అమ్మా!"


టిఫిన్ చేసి నవీన్ ఆఫీసుకు వెళ్ళిపోయాడు. దుర్గమ్మ ఫణికి ఫోన్ చేసి సాయంత్రం ఇంటికి రావాలని చెప్పింది. ఫణి ’సరే’ అన్నాడు.


రెస్ట్ రూం నుంచి బయటకు వచ్చిన వాణి డ్రెస్ మార్చుకొని పడకపై వాలిపోయింది.


ఇప్పట్లో మా అత్త దుర్గమ్మ మా యింటినుంచి వెళ్ళేలా లేదు. లాయర్ గారి దగ్గర వారి ఆఫీసులోనే ఎక్కువ సమయం గడపడంలోనే నాకు శాంతి. వృత్తిరీత్యా అనుభవం సంపాదించుకోవచ్చు. పాపం... అమ్మా నాన్నలు నా గురించి ఏమనుకొంటున్నారో.... పాతిక లక్షల కట్నం, పదిహేను లక్షలు పెండ్లి ఖర్చు, నగలు, వస్త్రాలు, ఆడపడుచుల కట్నాల క్రింద మరో పదిలక్షలు ఖర్చు పెట్టి తన వివాహాన్ని నవీన్‍తో ఎంతో ఘనంగా జరిపించారు. 


వివాహం అయ్యేంతవరకూ ఎంతో వినయం, విధేయత, గౌరవం, అమ్మానాన్నల పట్ల చూపించిన అత్త దుర్గమ్మ, వివాహానంతరం ’ఏం చేస్తాం..... అంతా మా ఖర్మ.... పోయిపోయి కడకు బడిపంతులు కూతుర్ని కోడలిగా చేసుకోవలసి వచ్చింది’ అని ఇరుగు పొరుగు వారితో దుర్గమ్మ వాడిన ఈ మాటలను వాణి అనేక పర్యాయాలు విన్నది. మనస్సుకు ఎంతో బాధ.... భరించక తప్పదని... తన్ను...తాను సమాళించుకొంది.


వాణి కళ్ళు మూసుకొందే కానీ నిద్రరాలేదు. మనస్సున గత జ్ఞాపకాలు.

సెల్ మ్రోగింది. చెవికి చేర్చుకొని....

"హలో!..."


"అమ్మా! జాగ్రత్తగా చేరావా" వరదరాజ నాయుడుగారి తియ్యని పలకరింపు.

"చేరాను నాన్నా! దీపక్ నన్ను ఇంటిదగ్గర దింపాడు."


"మీవారు... అత్తగారు ఏమన్నారమ్మా"

"ఏమీ అనలేదు నాన్నా! ఆనందించారు."


"సంతోషం తల్లీ! జాగ్రత్త"

"అమ్మ ఎక్కడ వుంది నాన్న!"


"నా ప్రక్కనే వుందమ్మా... ఇదిగో అమ్మకిస్తున్నాను. మాట్లాడు తల్లీ" ఫోను అనురాధకు అందించారు నాయుడుగారు.

"చిన్నా!"

"అమ్మా!"


"నామీద నీకు కోపమా?"

"నీమీద... నాకు కోపం ఎందుకుంటుందమ్మా! దైవాన్ని నేను చూడలేదు. కానీ నాకు తెలిసిన దైవం నా తల్లిదండ్రులైన మీరేనమ్మా! నాకు మరోజన్మ అంటూ వుంటే తల్లితండ్రిగా మీ ఉభయులే నాకు కావాలని ఆ దేవుని నేను సదా కోరుకుంటానమ్మా!" గద్గద స్వరంతో చెప్పింది వాణి.


"సరే.... సరే.... బాధపడకు.... అత్తగారి ముందు జాగ్రత్తగా మసలుకో. కోడలికి, అత్తకు మనస్సులు కలియకపోతే ఎవరినీ కాదనలేక నచ్చచెప్పలేక మగవాడు మధ్యలో నలిగిపోతాడు. వ్యసనాల పాలవుతాడు. మీవారిని జాగ్రత్తగా చూచుకో... మీ అత్తగారు చెప్పిన మాటను పాటించు తల్లీ!" దీనంగా చెప్పింది అనురాధ.


"అలాగే అమ్మ"

"వారానికి ఒకసారైనా ఫోన్ చెయ్యమ్మా"


"తప్పకుండా అమ్మా!"

"జాగ్రత్త తల్లీ జాగ్రత్త" అనురాధ ఫోన్ కట్ చేసింది.


అప్పటికి రెండుసార్లు మరో కాల్ సిగ్నల్ వచ్చింది. ఫోన్ చేసింది దీపక్.


కాల్ కట్ కావటంతోనే దీపక్ లైన్....

"అక్కా"


"ఆ....."

"ఎవరితో చాలాసేపు మాట్లాడావు?"

"మన అమ్మానాన్నలతో"

"ఏం చెప్పావ్? ఆ... మీ అత్తయ్య, మీవారు ఏమన్నారు?"


"పత్రాలను చూచి చాలా సంతోషించారు."

"వారికి కావాల్సింది అదేగా!"


"అవున్రా!"

"అక్కా జాగ్రత్త ఏదైనా అవసరం అయితే ఫోన్ చెయ్యి."

"అలాగేరా!"

దీపక్ కట్ చేశాడు.

వాణి కళ్ళు మూసుకుని పడుకుంది.


మ్రోగిన సెల్‍ను చేతికి తీసుకున్నాడు దీపక్.

"హలో!"

"హలో! దీపక్ గారూ! గుడ్ మార్నింగ్!"


"ఎవరూ?" ఆశ్చర్యంతో అడిగాడు దీపక్.

"ఓ... యామినీ!" నవ్వుతూ చెప్పాడు దీపక్.


"యస్... సార్... ఏం చేస్తున్నారు??"

"ఈరోజు ఆదివారం కదా! ఇప్పుడే లేచాను!"


"ఏమిటి ప్రోగ్రాం?"

"ప్రోగ్రామా!" ఆశ్చర్యంతో అడిగాడు దీపక్.


"అవును"

"నాకేం లేదు"

"ఏదైనా ప్లాన్ చేయొచ్చుగా"

"అంటే!?"


"మనమిద్దరం కలిసి వెళ్ళేలా!"

"నిజంగానా!"

"అవును"

"నేను గోల్కొండ చూడలేదు... మీరూ...."

"చూచాను. అయినా మీతో కలిసి మరోసారి చూస్తాను" నవ్వింది యామిని.

"అంటే...."


"త్వరగా తయారవ్వండి. ఎక్కడ కలుద్దామో చెప్పండి."

"జె.ఎన్.టి.యు, బై 8.30కి సరేనా!"


"ఓ.కే"

"ఎలా వెళ్దాం"

"మీరు ఎలా వెళ్దామనుకుంటున్నారు"

"బై క్యాబ్"

"సరే. నేను 8.30కి జె.ఎన్. టి యు బస్టాప్ దగ్గర ఉంటాను." అంది యామిని ఆనందంగా.


"మీకంటే ముందు నేనే అక్కడికి చేరుతాను" చెప్పాడు దీపక్.

"లెటజ్ సీ... ఎవరు ముందో! బై" కిలకిలా నవ్వింది యామిని.

ఫోన్ కట్ చేసింది.

దీపక్ అరగంటలో తయారై జె.ఎన్.టి.యు బస్టాప్ చేరాడు. బస్టాప్ షెల్టరులో చూచాడు. యామిని కనిపించలేదు. నిట్టూర్చి బెంచ్‍పై కూర్చున్నాడు.


యామినీని చూచిన కొన్ని క్షణాల్లోనే దీపక్ హృదయంలో యామిని చోటు చేసుకొంది. మూడుసార్లు షాపింగ్‍లలో కలిశారు. ఈనాడు తన ప్రయత్నం లేకుండానే ఆమె కలిసి తిరగడానికి తనను ఆహ్వానించింది. అంటే తనపట్ల ఆమెకు అలాంటి భావనే ఉండి ఉంటుందని దీపక్ సంతోషపడ్డాడు.

పది నిముషాల తర్వాత ఆటో వచ్చి బస్టాప్ దగ్గర ఆగింది. అందులోనుండి యామిని దిగింది.


దీపక్ ఆమెను చూచి లేచి సమీపించాడు.

"మీరే గెలిచారు! వచ్చి ఎంతసేపైంది?" అడిగింది యామిని.

"పావుగంట అయింది. టాక్సీని బుక్ చేయనా."


"చేయండి."

దీపక్ ఓలా క్యాబ్‍ను బుక్ చేశాడు.


"సారీ ఫర్ ది డిలే" చిరునవ్వుతో చెప్పింది యామిని.

"నో ఫార్మాలిటీస్... నో సారీ!" నవ్వాడు దీపక్.


ఇరువురూ బెంచ్‍పై కూర్చున్నారు.

"మీరు నా కాల్‍ను ఎక్స్ పెక్ట్ చేశారా?"


"లేదు"

"నా గొంతు వినగానే మీకు ఏమనిపించింది?"


"గంధర్వ కన్య పలకరించింది అనుకొన్నాను" నవ్వాడు దీపక్.

యామిని కిలకిలా నవ్వింది.


"ఎందుకు నవ్వుతున్నారు?" ఆశ్చర్యంతో అడిగాడు దీపక్.

"ఆనందంతో మీరు నన్ను గంధర్వ కన్యను చేశారుగా!" చిరునవ్వు.

ఓలా టాక్సీ వచ్చింది. ఇరువురూ టాక్సీ వెనుక సీట్లో కూర్చున్నారు. దీపక్ ఓ.టి.పి నెంబరు చెప్పాడు. ఓలా కదిలింది.

"మీ అభిరుచులేమిటి?" అడిగింది యామిని.


"నవ్వుతూ బ్రతకాలి. ఎదుటివారిని నవ్వించాలి. నా దృష్టిలో మన జీవిత గమనం చాలా చిన్నది."

"మీకు వేదాంతం అంటే ఇష్టమా"

"నేను ఆస్థికుణ్ణి కాబట్టి ఇష్టమే."


"నాకు దైవం మీద నమ్మకం లేదు."

"అదే అద్వైతం."


"అద్వైతం అంటే..." ఆశ్చర్యంగా అడిగింది యామిని.

"ఆ....!"

"అంటే?"

"మీరు ఏదనుకుంటే అది!!"


"నాతో స్నేహం మీకు ఇష్టమేనా."

"కాబట్టే కదా మీ మాటను అంగీకరించాను.... వచ్చాను..."

కళ్ళు పైకెత్తి యామిని ముఖంలోనికి చూస్తూ చిరునవ్వుతో చెప్పాడు దీపక్.


యామిని ప్రక్క అద్దంలో నుండి బయట దాటిపోతున్న దృశ్యాలను చూస్తుంది.

"హల్లో..." వంగి మెల్లగా పిలిచాడు దీపక్.


అతనివైపు తిరిగి "యామినీ... నాపేరు హలో కాదు" అంటూ యామిని అందంగా నవ్వింది.

దీపక్ చిరునవ్వుతో "మీ అభిరుచుల గురించి చెప్పగలరా!"

"ఓ... నో ప్రాబ్లెం మీరన్నట్లు మన జీవితకాలం చాలా చిన్నదే. ఎప్పుడు ఎలా రాలిపోతామో మనకు తెలియదు. 


బ్రతికినన్నాళ్ళు ఆనందంగా మన ఇష్టానుసారంగా బ్రతకడం నాకు ఇష్టం. మిమ్మల్ని చూచాను. మాటలు కలిశాయి. మీతో స్నేహం చేయాలనిపించింది. అందుకే మీకు ఫోన్ చేశాను" కళ్ళు ఎగరేస్తూ చెప్పింది యామిని.

"ఓకే థాంక్యూ!"


"థాంక్యూ ఎందుకు?"

"మీరు...."

"కాదు.... యామినీ" నవ్వుతూ "యామినీ అని పిలవండి" 

అండి.

"యామినీ! స్నేహానికి మీ...."


"కాదు... నీ..." అంటూ కొంటెగా అతని కళ్ళల్లోకి చిరునవ్వుతో చూచింది యామిని. 

క్షణం తర్వాత.... 

"మనం ఆనందంగా ఉంటూ.... మన స్నేహితులను ఆనందపరచాలి" అంది.


"బి.టెక్ అయ్యాక ఏం చేయాలనుకుంటు....."

"వున్నావు" నవ్వింది యామిని దీపక్ తన మాటను పూర్తి చేయకముందే ఆ మాట చెప్పి.

దీపక్.... నవ్వుతూ యామిని ముఖంలోనికి చూచాడు.


"ఎం.టెక్ చేయాలనుకుంటున్నాను" అంది యామిని. 


"మరి వివాహం!" ఆవేశంగా అడిగి ’అరే... అడగకూడని ప్రశ్న అడిగానే!’ అనుకుంటూ నాలుక కొరుక్కున్నాడు దీపక్.

"అలాంటి ఆలోచనలు ప్రస్తుతానికి లేవు సార్...."

"సార్ కాదు...."


"దీపక్..." అంటూ అందంగా నవ్వింది యామిని.


అలా సరదా సంభాషణతో ఇరువురూ గోల్కొండ చేరారు. టాక్సీ దిగి... ప్రక్క ప్రక్కన నడుచుకొంటూ పైనున్న నవాబ్ మహాల్ వరకు వెళ్ళారు. అక్కడినుండి కిటికీల ద్వారా క్రింద కనిపించే పరిసర ప్రాంతాలను చూచారు. ఫోటోస్ తీసుకున్నారు. క్రిందికి వచ్చి గండిపేట చెరువును, ఆ పరిసర ప్రేమికుల ఏకాంత స్థావరాలను చూచారు. కొంతమంది జోడీలను చూచారు. జోక్స్ వేసుకొని నవ్వుకున్నారు.


కలసి హోటల్‍లో భోజనం చేశారు. నాలుగు గంటల ప్రాంతంలో జె.ఎన్.టి.యు బస్టాండ్ చేరారు. ఒకరినొకరు వీడ్కోలు చెప్పుకొని వారి వారి నిలయానికి వారు వెళ్ళిపోయారు. 

అది మొదలు వారానికి రెండురోజులు ఆ ఇరువురూ కలిసేవారు. సరదాగా షాపుల్లో, బజార్లో, పార్కుల్లో ఆనందంగా తిరిగేవారు. తినేవారు... ఆనందించేవారు.


ఆ కారణంగా దీపక్, యామినీని ఎంతగానో ప్రేమించాడు. రోడ్డు ప్రక్కన చెట్లు నాటే సమయంలో యామిని తండ్రి ముకుందరావు పరిచయం కావడం, తను మిత్రులతో వారి ఇంటికి వెళ్ళి టిఫిన్, కాఫీలు తీసుకోవడం, ఆ తర్వాత దీపక్ ముకుందరావుకు నచ్చిన కారణంగా వారు అతనికి ఫోన్ చేసి ఇంటికి రమ్మనడం, కూతుర్ని, భార్యను పరిచయం చేయడం, ముకుందరావు దీపక్‍పై అభిమానాన్ని పెంచుకోవడం జరిగాయి.


కాని వారిరువురి పరిచయం, తిరుగుళ్ళు ముకుందరావుకు తెలియదు. ఆ విషయంలో దీపక్, యామినీ చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. దీపక్ ఆమెను హృదయపూర్వకంగా ప్రేమించడం, తనకు కాబోయే జీవిత భాగస్వామిగా భావించాడు. వారి భావి వైవాహిక జీవితాన్ని గురించి ఎన్నో కలలు కన్నాడు.


నాయుడు గారు తన మాటను కాదన్నందుకు ముకుందరావుకు అతనిపట్ల, ఆ కుటుంబ సభ్యుల పట్ల, దీపక్ పైనా అంతులేని ఆవేశం, అసహ్యం ఏర్పడింది. 

యామిని వివాహాన్ని అమెరికాలో వున్న తన మిత్రుడు ఆదినారాయణరావు గారి కుమారుడు అమెరికాలోనే డాక్టర్‍గా వుంటున్న త్రివిక్రమరావుతో జరిపించాలని నిర్ణయించుకున్నాడు.

అమెరికాలో వుంటున్న తన మిత్రుడు ఆదినారాయణరావుకి ఫోన్ చేసి విషయాన్ని తెలిపి వాట్సప్‍లో తన కూతురి ఫోటోను పంపాడు. త్రివిక్రమరావుకు యామిని నచ్చింది. తండ్రికి ఓకే చెప్పేశాడు.


భావాలు కలియకపోతే.... అయినవారూ.... హితులు కూడా శత్రువులుగా మారిపోతారు. వారిలోని స్వార్థం, పంతం వివేకాన్ని చంపేస్తాయి. అదే జరిగింది ముకుందరావు గారి విషయంలో....


ఎవరి పద్ధతులు, జీవిత విధానాలు వారికే పరిమితం. ఎదుటివారు తమలాగే వుండాలని ఆశించడం, శాసించడం రెండూ నేటి సమాజంలో ఎదుటి వర్గపు (తత్వరీత్యా) వాడి దృష్టిలో నేరాలే!


సమాజం వర్గ, కుల, మత బేధాలతో చీలికలైపోయింది. గాంధీగారు కన్నకలలు కల్లలైనాయి. కులతత్వం, మతత్వం మత మార్పిడులు పెద్దల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. వేదికలపై చేసే ఉపన్యాసాలు వేరు. నీ జీవితాచరణంలో వేరు, కారణం మితిమిరిన స్వార్థం. ఇంకా గడించాలనే ఆరని తీరని ఆశ.... తమ లక్ష్యసిద్ధికి స్వపర బేధాలను కూడా పాటించకుండా వర్తించే ఓ సంప్రదాయం ప్రబలింది. ఆ వర్గీయుడే ముకుందరావు. తాను అనుకున్నది సాధించేవరకూ నిద్రపోడు.


అమెరికా ఫ్రెండ్ ఆది నారాయణతో మాట్లాడి భార్య వసంతను పిలిచాడు ముకుందరావు.

వసంత సౌమ్యురాలు. భర్తయందు ఎంతో భక్తి, గౌరవం కలది. ఆ లక్షణాలు ఆమెకు వారి తల్లిమూలంగా సంక్రమించాయి. 

"ఏమిటండీ పిలిచారు!" అడిగింది వసంత.

"కూర్చో వసూ"


వసంత వారి ఎదుట సోఫాలో కూర్చుంది. 


"దీపక్ నీకు నచ్చాడని, అమ్మాయి అతనికి ఈడు, జోడు బాగుంటుందని నీవు చెప్పిన కారణంగా నేను వారి ఇంటికి వెళ్ళి వారి తండ్రిగారితో మాట్లాడాను. వారు నా అభిప్రాయంతో ఏకీభవించలేదు. కుదరదన్నారు. అమ్మాయి పరీక్షలు ముగిశాయిగా..... ఒకటి రెండు నెలల్లో వివాహం చేయాలని నిర్ణయించుకున్నాను. వరుడు అమెరికాలో వున్న నా మిత్రుడు ఆదినారాయణరావు కుమారుడు డాక్టర్ త్రివిక్రమరావు. అమ్మాయి ఫొటోను వారికి పంపాను. ఆ అబ్బాయికి మన అమ్మాయి బాగా నచ్చింది. వివాహానికి ఏర్పాట్లు చేయండి అని వాళ్ళ నాన్నగారికి చెప్పాడు త్రివిక్రమరావు. 


అమ్మాయికి నచ్చచెప్పి ఈ వివాహానికి ఆమెను ఒప్పించాల్సిన బాధ్యత తల్లిగా నీకుంది. ప్రేమ.... దోమ... అని యామినీ అంటే... ఆ భావాలను ఆమె మనస్సులోనుంచి తుడిచివేయవలసిన దానవు నీవే. నాకు తెలుసు యామిని దీపక్‍ని ప్రేమిస్తుందని. నీకు తెలిసినా కూడా ఆ విషయాన్ని నీవు నాకు చెప్పలేదు. అదే తల్లి ప్రేమ కదూ! అయినా ముందు చెప్పిన కారణంగా దీపక్, యామినిల వివాహం జరుగదు. కారణం... పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ జీవితం సాగించే ఆ నాయుడికి అంత స్వాతిశయం వుంటే, కోటీశ్వరుణ్ణి నాకు ఎంత వుండాలి. చెప్పింది అర్థం అయింది కదా! నీ కూతురికి ఏం చెబుతావో.... ఏం చేస్తావో ఆమెకు త్రివిక్రంతో వివాహానికి ఒప్పించవలసిన బాధ్యత తల్లిగా నీది సరేనా" ప్రసంగం ఆపి వసంత ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూచాడు ముకుందరావు.


వసంత మౌనంగా తలదించుకుంది.


"వసూ! యామినీకి విషయాన్ని ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నావా? నేను నీకు చెప్పిన విషయాన్నంతా చెప్పు. ఈ తండ్రిని, తల్లిని గౌరవించి, మన నిర్ణయానికి అంగీకరిస్తే వివాహం ఇక్కడ మన ఇంట్లో జరుగుతుంది. వ్యతిరేకిస్తే వివాహం అమెరికాలో జరుగుతుంది. దైవనిర్ణయం ఎలా వుందో నాకు తెలియదు. నీ ప్రయత్నం నీవు చేయి. నేను ఆఫీసుకు వెళుతున్నాను" అని ముకుందరావు సోఫాలోనుంచి లేచి బయటికి నడిచి పోర్టికోలో ఉన్న కార్లో కూర్చున్నాడు. 


డ్రైవర్ కారును స్టార్ట్ చేశాడు. వారి వెనకాలే వరండాలోనికి వచ్చిన వసంత దిగాలుపడి కార్లో వెనుక సీట్లో ఠీవీగా కూర్చున్న భర్త ముఖంలోనికి చూచింది. కారు వీధివైపునకు వెళ్ళిపోయింది. నిట్టూర్చి హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుంది వసంత.

========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


42 views0 comments
bottom of page