top of page

లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 4



'Life Is Love - Episode 4'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 03/02/2024

'లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 4' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ: 

ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అవుతారు వరదరాజుల నాయుడుగారు. మూడు మాసాల క్రితం పెళ్ళైన కూతురు వాణి, భర్తతో కాక ఒంటరిగా ఇంటికి వస్తుంది. ఆమె మనసులో ఉన్నది చెప్పమని తరచి తరచి అడుగుతారు.


తన వాటా ఆస్తి అడగమని భర్త పంపినట్లు చెబుతుంది వాణి. అడ్వకేట్ రామశర్మని పిలిపించి ఆ ఏర్పాట్లు చూడమంటారు నాయుడుగారు.


ముకుందరావు అనే కోటీశ్వరుడు వరదరాజులు నాయుడుగారి కొడుకు దీపక్ కి తన కూతురు యామినిని ఇస్తానని అడుగుతాడు. పెద్ద కొడుకు, రెండవ కూతురు పెళ్లిళ్లు అయ్యాకే దీపక్ వివాహమని చెబుతారు నాయుడుగారు.


యామినితో తన పరిచయం గుర్తుకు తెచ్చుకుంటాడు దీపక్. ట్రైన్ లో జరిగిన వారి పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే నాయుడుగారు వెంటనే అంగీకరించక పోవడంతో ముకుందరావుకి కోపం వస్తుంది. యామినికి వేరే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.



ఇక లైఫ్ ఈజ్ లవ్ ఎపిసోడ్ 4 చదవండి.


ఆ రాత్రి యామినికి తనకు మధ్య జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది.

"అమ్మా!.." పిలిచింది యామిని.


"ఏంటమ్మా!!" కూతురు ముఖంలోనికి చూచింది వసంత.


"దీపక్ గురించి నీ అభిప్రాయం ఏమిటమ్మా!" అడిగింది యామిని.


"చాలా మంచివాడు" అంది వసంత.


"నాకు ఆ మంచివాడు నావాడుగా కావాలమ్మా!" ప్రాధేయపూర్వకంగా తల్లిముఖంలోనికి చూచింది యామిని.


"అంటే..!!" ఆశ్చర్యంతో అడిగింది వసంత.


"నా వివాహం దీపక్‍తో జరిపించండమ్మా" దీనంగా అడిగింది యామిని.


"మీ నాన్నగారు.."


"వారికి విషయాన్ని చెప్పి.. నీవే ఒప్పించాలమ్మా!"


"అలాగే తల్లీ.."


"మా అమ్మ బంగారం.." ఆనందంగా యామినీ వసంతను కౌగలించుకుంది.


వసంత కళ్ళల్లో కన్నీళ్ళు. ముకుందరావు మాటలు ఆమె చెవుల్లో మారుమ్రోగాయి. దీర్ఘ నిట్టూర్పుతో కళ్ళు మూసుకొంది. తన ఇష్టదైవం షిర్డీ సాయిబాబాను తలచుకొంది. ’నా బిడ్డ కోర్కె నెరవేరేలా అనుగ్రహించు తండ్రీ’ దీనంగా వేడుకొంది.

తల్లిదండ్రులు.. తమ బిడ్డలు వారు బ్రతికివున్నంత కాలం ఆరోగ్యంగా.. ఆనందంగా వుండాలని సదా ఆ దైవాన్ని కోరుకుంటారు.


అలాంటి ప్రత్యక్ష దైవ సమానులను కొందరి పిల్లలు వివాహం కాగానే అర్థాంగి మాటలు విని వేరు కాపురం పెట్టడం, వారికి దూరంగా ఉండడం, వృద్ధాప్యంలో ఉన్న వారి మనోభావాలను అర్థం చేసుకోకుండా వారి స్వేఛ్ఛాజీవితానికి ప్రతిబంధకాలుగా భావించి తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల పాలు చేయడం ఎంతవరకు సమంజసం!? ఆ వయస్సు ఓనాటికి తమకూ వస్తుందనే భావన వారికి కలుగదా!!


’చేసుకొన్నవారికి చేసికొన్నంత మహదేవా!’ ఈ పెద్దల మాటను వారు వినివుండరా! ఎడమ చేతితో చేసినదాన్ని కుడిచేతితో అనుభవించవలసి వస్తుందన్న ఆర్యోక్తి వారికి తెలియదా. ఆడవారు ’కోడలూ ఒకనాటి అత్త, అత్త ఒకనాడు కోడలే’ అన్న సత్యాన్ని గ్రహించలేరా? తల్లికి ఒక న్యాయం, అత్తకు మరొక న్యాయమా! తండ్రికి ఒక ధర్మం, మామకు మరొక ధర్మమా! చెల్లికి ఒక నీతి.. మరదలుకు మరో రీతియా. స్వార్థం, అహంకారం రెండు నేత్రాలుగా శరీరంలో ఇమిడిపోతే.. ధర్మాధర్మాలు నీతి న్యాయాలు, తనవారికి ఒకటిగా పరాయివారికి వేరుగా అనిపిస్తాయి. విచక్షణా జ్ఞానాన్ని చంపి తప్పులను చేయిస్తాయి.


సాయంత్రం నాలుగు గంటలకు యామిని, దీపక్‍లు శిల్పారామం చేరారు. చెట్టాపట్టాలు వేసుకొని ఆ ప్రేమికులు ఆ ప్రాంతాన్నంతా తిరిగి చూచారు. ఐదున్నర ప్రాంతంలో ఓ మూల ఏకాంత స్థలంలో కూర్చున్నారు.


"దీపక్! మన పెండ్లి ఎప్పుడు?" అడిగింది యామిని.


"మా అన్నయ్య భాస్కర్ వివాహం అయిన తర్వాత" దీపక్ జవాబు.


"ఆయనగారి పెండ్లి ఎప్పుడు?"


"త్వరలో వస్తున్నాడు. నాన్నగారు సంబంధాలు చూచారు. అన్నయ్య రాగానే అతని పెండ్లికి నిశ్చితార్థం జరుగుతుంది."


"ఒకవేళ మీ అన్నయ్య నీలా అమెరికాలో ఎవరినో లవ్ చేసి ఉండి ఉంటే మీ నాన్నగారి ప్రపోజల్ని కాదంటే!!"


"మా అన్నయ్య చాలామంచివాడు. అలాంటి పని వాడు చేయడు."


"మరి తమరు చేశారుగా."


"నీవేగా నన్ను ముగ్గులోనికి దించావ్"


"అంటే.. తమరికి ఏమీ తెలియదా!"


"అలా అని నేను చెప్పలేదే!"


"నేను నిన్ను ముగ్గులోనికి దించానన్నావ్!"


"చప్పట్లనుంచి శబ్దం రావాలంటే రెండూ చేతులు కలవాలిగా" నవ్వాడు దీపక్.


"దీపక్! ఒకవేళ నేను చచ్చిపోతే.. నీవేమైపోతావు?" మెల్లగా అతని ముఖంలోనికి చూస్తూ అడిగింది యామిని.


"నేనూ.. చచ్చిపోతాను" నవ్వుతూ చెప్పాడు దీపక్.


"దీపక్! నీవు నన్ను అంతగా ప్రేమిస్తున్నావా! నేను లేకపోతే బ్రతుకలేవా?"


"నో..నో! నీవు లేకపోతే నాకు భవిష్యత్తు, జీవితం రెండూలేవు" విచారంగా చెప్పాడు దీపక్.


"మన పెండ్లికి మా నాన్న అభ్యంతరం చెబితే!?"


"మనం ఎవ్వరినీ లెక్కచేయకుండా రిజిష్టరు మ్యారేజి చేసుకుందాం. నీకు అభ్యంతరం లేదుగా!" ప్రాధేయపూర్వకంగా అడిగాడు దీపక్.


యామిని మౌనంగా ఉండిపోయింది.


కొన్నిక్షణాల తర్వాత..

"మా అమ్మకు నా వివాహం విషయంలో ఎన్నో ఆశలున్నాయి" మెల్లగా చెప్పింది యామిని.


"అంటే!.."


"తనకు మంచి అల్లుడు రావాలని.. త్వరలోనే మనవడినో.. మనుమరాలినో ఎత్తుకోవాలని మగబిడ్డ అయితే వాళ్ళ నాన్నగారి పేరు శ్రీరామచంద్ర అని, ఆడపిల్ల అయితే వసుధ అనే పేర్లు పెట్టుకోవాలని దినమంతా వారి ఆలనా పాలనలో ఆనందంగా గడపాలనీ.. "


"అయితే కవలలను కను.."


"ఏంటీ?"


"అదే.. ఆడ, మగను ఒకేసారి కనమంటున్నా.."


"అది జరగాలంటే నేను ముందు నీదాన్ని కావాలిగా!"


"అయిపోయావు..":


"ఎప్పుడు?"


"నీవు నాతో.. మీరు నామనిషి అని చెప్పిన రోజునే."


"ఏమో నాకు భయంగా ఉంది" భయం భయంగా చెప్పింది యామిని.


"భయమెందుకు.. నామాట మీద విశ్వాసం లేదా!"


"వుంది.. కానీ..!"


"కానీ.. ఏంటీ?"


"మా నాన్న అహంకారి.. కోపిష్టి.. తాను తలచుకున్నదే జరగాలంటాడు!"


"ఆ మాటకొస్తే.. నేనూ అహంకారినే. కోపిష్టిని కాను. కానీ నా లక్ష్యం నెరవేరేటందుకు నేను ఎవరినీ లెక్కపెట్టను. దేనికీ భయపడను" పౌరుషంతో చెప్పాడు దీపక్.


యామిని కుడిచేతిని తన చేతిలోనికి తీసుకొని తన గుండె భాగాన వుంచి..


"నా గుండె సవ్వడి నీ అరచేతి స్పర్శకు తెలుస్తుందా అది లబ్ డబ్ కాదు ’యామినీ.. యామినీ" ప్రీతిగా ప్రేమాభిమానంతో యామిని ముఖంలోనికి చూచాడు దీపక్.


యామిని పరవశంగా చేతులతో అతన్ని చుట్టేసింది.

కొన్ని నిముషాలు వారు ఆ పరవశలోకంలో వివరిస్తూ.. ఇహాన్ని మరిచిపోయారు.

కొన్ని జంటలు వారి స్థితిని చూచి ఆనందంగా నవ్వుకొంటూ ముందుకు నడిచారు.


"దీపక్.."


"ఇదేనా ప్రేమంటే.."


"కాదు.. బంధం.. యామినీ! మనలను ఎవ్వరూ విడదీయలేరు."


ఆనందంతో ఒకరి ముఖాలు ఒకరు పరవశంతో చూచుకొన్నారు.

"లే.. ఇక వెళదాం" అన్నాడు దీపక్.


ఇరువురూ లేచారు.

వస్త్రాల షాపు వైపునకు నడిచారు.

దీపక్ తనకు నచ్చింది, యామినీ మెచ్చింది చుడీదార్ ఓణీ కొనిచ్చాడు.


ఇరువురూ ఓలాలో బయలుదేరారు. యామినీని వారి ఇంటి ప్రాంగణంలో దించేశాడు. దీపక్ తన గది ప్రాంతానికి బయలుదేరాడు.


యామిని ఇంట్లోకి ప్రవేశించి తన గదికి పోబోయింది.

"యామినీ" అంటూ కూతురిని పిలిచి ఆపి తన భర్త చెప్పిన మాటలను సౌమ్యంగా చెప్పింది వసంత. అంతా విన్న యామిని మౌనంగా తన గదిలోనికి వెళ్ళిపోయింది.


ఏడుగంటలకు ముకుందరావు ఇంటికి వచ్చాడు.

హాల్లో ఉన్న వసంతను చూచి..

"అమ్మాయి ఏది?" అడిగాడు.


"తన గదిలో వుందండి."


"నేను చెప్పమన్న విషయాన్ని ఆమెకు చెప్పావా!"


"చెప్పానండి. మౌనంగా తన గదిలోనికి వెళ్ళిపోయింది"


"ఆహా.." అని ముకుందరావు తన గదికి వెళ్ళిపోయాడు.

రాత్రి ఎనిమిదిన్నరకు భోజనం ముగిసింది. 

తన గదికి వెళ్ళబోతున్న యామినీని చూచి ముకుందరావు..

"అమ్మా యామినీ"


తండ్రి పిలుపు విన్న యామిని వెనుతిరిగి తండ్రి ముఖంలోనికి చూస్తూ.. "చెప్పండి నాన్నా" అంది.


"రా అమ్మా.. వచ్చి కూర్చో" అంది. 


తండ్రి కూతుళ్ళు ఎదురెదురుగా సోఫాల్లో కూర్చున్నారు. వసంత ముకుందరావు వెనుక సోఫా ప్రక్కన నిలబడింది.


"అమ్మా! నీకు ఇప్పుడు ఇరవైమూడు సంవత్సరాలు. ఐదేళ్ళ బాల్యం. తెలిసీ తెలియని వయస్సు. ఇరవైమూడులో ఐదుపోతే పద్దెనిమిది. తల్లీ గత పద్దెనిమిది ఏళ్ళుగా నేను నీవు కోరింది ఏదైనా ఏనాడైనా కాదన్నానా తల్లీ" సౌమ్యంగా అడిగాడు ముకుందరావు.

లేదు అన్నట్లు తలాడించింది యామిని.


"నోరు తెరిచి చెప్పు" అంది వసంత.


"లేదు నాన్నా" మెల్లగా చెప్పింది యామిని.


"నీకు సంబంధించి నా ఉద్దేశ్యం.. నీవు ఎప్పుడూ ఆనందంగా వుండాలన్నది. కన్నబిడ్డల పట్ల తల్లిదండ్రులకు తమ బిడ్డ హాయిగా, సంతోషంగా ఎదగాలనే భావనే వుంటుంది. నీ విషయంలో నాకున్న భావన అదే.. నీ జీవితాంతం నీవు ఆనందంగా ఉండాలన్నదే.. నా ఆశ. అమ్మ చెప్పిన విషయాన్ని గురించి సావధానంగా ఆలోచించు. తర్వాత.."


"ఇందులో ఆలోచించేందుకు ఏముంది నాన్నా" ముకుందరావు ముగించకముందే అంది యామిని.


"అది నీ నూరేళ్ళ జీవితానికి సంబంధించిన విషయం కదా తల్లీ.."


"అవును.. ఆ విషయం నాకూ తెలుసు. నా వివాహ ప్రసక్తి రెండు సంవత్సరాల తర్వాత చేయండి. ఇప్పట్లో నాకు ఇష్టం లేదు. ఎం.టెక్ చేయాలి" అంటూ సోఫాలోంచి లేచి "గుడ్‍నైట్ నాన్నా" అంటూ..

యామిని వేగంగా తన గదివైపు వెళ్ళిపోయింది.


ముకుందరావు ఆశ్చర్యంతో భార్య ముఖంలోకి చూచాడు.

"వారు ఎవరు? వీరి కూతురేగా.." వెటకారంగా చిరునవ్వుతో చెప్పి వసంత వంటగదివైపునకు నడిచింది.


ఇరువురూ వెళ్ళిన దిశలను మార్చి.. మార్చి.. చూచి ముకుందరావు సాలోచనగా తన గదివైపునకు వెళ్ళాడు. 


దుర్గమ్మ పిలుపుతో ఫణి నవీన్ ఇంటికి వచ్చాడు. నవీన్, వాణి వారికి ఇచ్చిన ఆస్తిపత్రాలను ఫణికి అందించింది. ఫణి వాటిని పరిశీలించి..

"ఓ.కే బ్రదర్! ఈ పత్రాలను బ్యాంకులో పెట్టి డబ్బును నేను తీసుకుంటాను. నీవు రేపే ఉద్యోగానికి రాజీనామా చేసెయ్యి. రిలీవ్ అయిన మరుసటిదినం నుంచి నీవు నా పాట్నర్‍వు. నాతో కలిసి పనిచేస్తావు. సంవత్సరంలో చూడు నీ దశ ఎలా మారుతుందో!" నవ్వుతూ చెప్పాడు ఫణి.


అతన్నే పరీక్షగా చూస్తున్న వాణికి అనుమానం. ఏదో మోసం జరుగబోతూ ఉందనే భావన మనస్సున కలిగింది. పత్రాలు తీసుకొని ఫణి అర్జెంట్ పని వుందని దుర్గమ్మకు, వినయ్‍కు చెప్పి వెళ్ళిపోయాడు.


ఆ రాత్రి నవీన్ పడక గదిలో..

"ఏమండీ"


"చెప్పు వాణీ!"


"మీరు రేపు ఉద్యోగానికి రాజీనామా చేస్తారా?"


"అవును.. ఫణి చెప్పాడుగా."


"మీరు ఏమీ అనుకోనంటే నేను ఓమాట చెప్పనా?" 


ప్రాధేయపూర్వకంగా నవీన్ ముఖంలోకి చూచింది వాణి.


"చెప్పు.. ఏమీ అనుకోను. నీ సందేహం ఏమిటో దాన్ని తీరుస్తా.."


"రాజీనామాకు బదులుగా ఓ రెండు మూడునెలలు లీవ్ పెట్టొచ్చుగా"


"అంటే.. నీకు ఫణి మాట మీద నమ్మకం లేదా?"


వాణి వెంటనే జవాబు చెప్పలేకపోయింది. తన ఆలోచనలో తాను మౌనంగా వుండిపోయింది.


కారణం.. అత్త దుర్గమ్మ, భర్త నవీన్ దృష్టిలో ఫణి మహామేధావి. గొప్ప బిజినెస్ మేన్. కానీ ఫణి ప్రతిమాటలో ఏదో కల్తీవుందని తన అనుమానం. 


"జవాబు చెప్పు" కాస్త ఆవేశంగా అన్నాడు నవీన్.


"మీరు నిర్ణయం తీసుకొన్నారు. కాదూ.. కూడదూ.. అని నేను ఎలా అనగలను. దైవనిర్ణయం ఎలా వుందో!.. చూద్దాం.." ముక్తసరిగా అంది వాణి. 


"నీకు నామీద నమ్మకం లేదు."


"అని నేను ఏనాడూ అనలేదు కదండీ" దీనంగా చెప్పింది వాణి.


"నీమాటల సారాంశం.. నా దృష్టిలో అదే.. జీవితంలో పైకి ఎదగాలంటే.. తెగింపు అవసరం.. ఆత్మీయులపైన నమ్మకం అవసరం. ఫణి నా ఆత్మీయుడు. అతని మాటమీద నాకు నమ్మకం వుంది."


"సరే.. మీ ఇష్టప్రకారమే కానివ్వండి!" సాలోచనగా అంది వాణి.

నవీన్ అసహనంగా గదినుండి బయటకు నడిచాడు. విచారంతో వాణి పడకపై వాలిపోయింది.


మనోభావ భేదాలు వారి మధ్యన ఏర్పడినప్పుడు తమ గది నుండి వెళ్ళి తల్లి గదిలో పడుకోవడం ఇప్పటికి ఎన్నోసార్లు జరిగింది.

నాయుడుగారు కొడుకు దీపక్‍ను కలిసి మాట్లాడేందుకు హైదరాబాద్ వచ్చి సికింద్రాబాద్ స్టేషనులో దిగారు.


ఎదురుగా.. దాదాపు అదే వయస్సు వ్యక్తి నాయుడు గారిని పరీక్షగా చూడసాగాడు. వారు ఆ రైలునుండి దిగినవారే.


ఇరువురి చూపులు కలిశాయి. కొన్ని క్షణాల్లో నాయుడు గారికి ఆ వ్యక్తి ఎవరన్నదో గుర్తుకు వచ్చింది. నవ్వుతూ వారిని సమీపించారు.

"సార్! తప్పుగా తలవకండి. మీపేరు జగన్నాధ్ కదండీ!" అభ్యర్థనగా అడిగారు నాయుడుగారు.


ఆ వ్యక్తి నవ్వుతూ.. "నీవు వరదరాజుల నాయుడివి కదూ!" అడిగాడు జగన్నాథ్.


"అవును.." చిరునవ్వుతో జవాబు చెప్పారు నాయుడుగారు.


"ఒరేయ్! నాయుడూ!! నన్ను మరిచిపోయావా?" ఆర్థ్రంగా అడిగాడు జగన్నాథ్.


"అన్నా! నిన్ను నేను ఎలా మరువగలనన్నా!" పరవశంతో పలికాడు నాయుడుగారు.


"నాయుడూ"


"జగ్గన్నా!!"


ఇరువురు మిత్రులు కౌగలించుకొన్నారు.

"ఎంతో కాలం తర్వాత కలిశాం కదరా!" పరవశంతో చెప్పాడు జగన్నాథ్.


"అవునన్నా" ఆనందంతో పలికాడు నాయుడుగారు.


"సరే పద.. మన ఇంటికి వెళదాం"


"అన్నా!" సందేహించారు నాయుడుగారు.


"నీవు నాకన్నా చిన్నవాడివి. నా మాటను కాదనకూడదు" జగన్నాథ్ ఆటోను పిలిచాడు.

"ఎక్కు.."


మారు పలుకలేక నాయుడుగారు ఆటోలో కూర్చున్నారు. జగన్నాథ్ అతని ప్రక్కన కూర్చున్నాడు. నవ్వుతూ "ఇప్పుడు చెప్పు. ఎక్కడ ఉంటున్నావు? ఏం చేస్తున్నావు? పిల్లలెంతమంది?" అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగాడు జగన్నాథ్.


"అన్నా!.."


"జగ్గన్నా అని పిలవరా! నీవు నన్ను ఆ రోజుల్లో అలాగే పిలిచేవాడివిగా" నవ్వుతూ చెప్పాడు జగన్నాథ్.


"అవునన్నా! నలుగురు పిల్లలు. కాలేజీ ప్రిన్సిపాల్‍గా వారం క్రితం రిటైరు అయినాను. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు.

రెండవది పెద్దకూతురు వాణి ఆమెకు వివాహం అయింది. మరి మీకు ఎంతమంది పిలల్లు?”


"మీకూ కాదురా నీకు" అని నవ్వి "నాయుడూ! నాకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు మగ పిల్లలు, చివరన ఆడబిడ్డ. మగపిల్లలకు పెళ్ళిళ్ళు జరిగాయి. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నీవు వుండేది ఎక్కడ?"


"నెల్లూరులోనే"


"అంటే మన వూరిలోనే అన్నమాట."


"అవును జగ్గన్నా!" నవ్వుతూ చెప్పారు నాయుడుగారు.


క్షణం తర్వాత..

"జగ్గన్నా! మా వదిన పార్వతి గారు ఎలా ఉన్నారు?"


"ఈ.. నీ అన్న దగ్గర మీ వదిన పార్వతికి ఏం తక్కువరా! హాయిగా వుంది" నవ్వాడు జగన్నాధ్.


"నాయుడూ! మా పెండ్లి ఎలా జరిగిందో.. నీకు జ్ఞాపకం వుందిగా."


"వుందన్నా" నవ్వారు నాయుడుగారు.


"రేయ్!.. మీ వదిన నేను నిన్ను గురించి అప్పుడప్పుడూ అనుకొంటూ వుంటామురా.. ఆనాడు మా పెళ్ళి జరిగేదానికి కీలకపాత్ర నీదేగా!!!"


"నాదేముందన్నా! మీరిరువురు ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడ్డారు. అది ఆ దేవునికి సమ్మతమైంది. మీ వివాహం గొప్పగా జరిగింది. వివాహం అయిన సంవత్సరం లోపలే మీరు అమెరికా వెళ్ళిపోయారు. ఉద్యోగ రీత్యా మనం విడిపోయాం" విచారంగా చెప్పాడు నాయుడుగారు.


"అవును.. అమెరికాలోనే ముగ్గురు పిల్లలు పుట్టారు. పెద్దవాడు భరత్. రెండవవాడు ఆనంద్. మూడవసారి ఆడపిల్ల దీపిక. ఆరునెలల క్రిందట మనదేశం.. మనవారు.. మనగాలి.. మన నీరు మీద వున్న వ్యామోహంతో నేనూ మీ వదిన అమ్మాయితో వచ్చి హైదరాబాదులో సెటిల్ అయినాము. వచ్చిన దగ్గరనుంచీ నెల్లురు వచ్చి నిన్ను కలవాలనే ఆశ. ఇల్లు కట్టించాను. నెలరోజుల క్రిందటే గృహప్రవేశం జరిగింది. అబ్బాయిలూ, కోడళ్ళు వచ్చి రెండువారాలు ఉండి వెళ్ళిపోయారు. అమ్మాయికి వివాహం చేయడం బాకీ ఉంది.”


"అలాగా!"


"అవును. వైజాగ్ వెళ్ళి వస్తున్నా. ఓ సంబంధం విషయంగా.."


"పిల్లవాడు నచ్చాడా అన్నా"


"ప్చ్.. నచ్చలేదురా!!"


"సరే.. వారు కాకపోతే మరొకరు.. మనం కలిశాంగా మంచి సంబంధం చూచి అమ్మాయి పెళ్ళి దర్జాగా చేద్దాం జగ్గన్నా!!!"


"నీ మనసు మంచిది. నీ నోటి వాక్కు గొప్పది. అది నా స్వానుభవం."


"మంచివారికి ఆ దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడన్నా!"


జగన్నాథ్ ఇంటిముందు ఆటో ఆగింది. మిత్రులిరువురూ దిగి ఇంటివరండాలోనికి ప్రవేశించారు.

జగన్నాథ్ కాలింగ్ బెల్ నొక్కాడు.

కూతురు దీపిక తలుపు తెరిచింది. 

ఆమె వెనుకాలే పార్వతి.

నాయుడుగారిని చూచి సందిగ్ధంలో పడిపోయింది.


"పారూ!.. ఎవరో..గుర్తుందా!?" నవ్వుతూ అడిగాడు జగన్నాథ్.


"వీరు!.. వీరు!!" తడబడింది పార్వతి ఆశ్చర్యంగా.


"మన నాయుడు.. నా ప్రాణమిత్రుడు."


"వదినా.. నమస్కారం" చిరునవ్వుతో చెప్పాడు నాయుడు.


నవ్వుతూ పార్వతి ప్రతి నమస్కారం చేసింది.

"దీపు! వీరు నీకు బాబాయ్ అవుతారు" చెప్పాడు జగన్నాథ్.


"నమస్తే బాబాయ్!" చిరునవ్వుతో చెప్పింది దీపిక.


"మీరంతా బాగున్నారా బాబూ!" ఆప్యాయంగా అడిగింది పార్వతి.


ఆ రోజుల్లో పార్వతి నాయుడుగారిని బాబూ అని పిలిచేది.

నేడు అదే పిలుపు.


నాయుడుగారు నవ్వుతూ "వదినా!.. మీరు నాకు పెట్టిన పేరును మరువలేదు. నాకు ఎంతో ఆనందంగా ఉంది."


"కూర్చో బాబూ"


"కూర్చోవడం కాదు ముందు కాలకృత్యాలు తీర్చుకోవాలి. టిఫిన్ తింటూ మిగతా విషయాలు మాట్లాడుకుందాము."


"దీపూ! బాబాయికి గది చూపించు. గీజర్ ఆన్ చేయి" అన్నాడు జగన్నాథ్. 


"అలాగే నాన్నా" అని నాయుడు గారి వైపు తిరిగి "బాబాయ్! రండి" చిరునవ్వుతో చెప్పింది దీపిక.


నాయుడుగారి చిన్న సూట్ కేసును తన చేతిలోనికి తీసుకొంది దీపిక. ముందు దీపిక, వెనుక నాయుడుగారు మెట్లు ఎక్కి పై అంతస్థుకు చేరారు. గది తలుపు తెరిచి..

"బాబాయ్! ఇది మీ గది. పళ్ళుతోముకోండి. కాఫీ తెస్తాను. ఆ.. మీకు కాఫీ ఇష్టమా? టీ ఇష్టమా?" అడిగింది దీపిక్.


"కాఫీ.. అమ్మా.."


"అలాగా! కాఫీయే తెస్తాను. నాన్నకు, అమ్మకు, నాకు కూడా కాఫీ అంటేనే ఇష్టం" నవ్వుతూ చెప్పింది దీపిక.


వెంటనే మరల "పదిహేను నిముషాల్లో వస్తాను బాబాయ్!" అంది. 


"సరే తల్లీ" క్షణాం తర్వాత "అమ్మా! అమెరికాలో నీవు ఏమి చదివావు తల్లీ?"


"ఎం.ఆర్క్. బాబాయ్"


"ఓ.. కట్టడ శిల్పివన్నమాట" చిరునవ్వుతో చెప్పారు నాయుడుగారు.


దీపిక నవ్వుతూ "క్రిందికి వెళ్ళి వస్తాను బాబాయ్"


"సరే.. అమ్మా.."


దీపిక గది నుంచి బయటకు నడిచింది.

నాయుడుగారు సూట్ కేసును తెరిచి టవల్ బ్రష్ పేస్టు, పంచ, లాల్చీలను బయటికి తీశారు. రెస్ట్ రూమ్‍కు వెళ్ళారు. 

కాలకృత్యాదులు ముగించి పంచను, ధోవతిని కట్టుకొని తెల్లని లాల్చీని ధరించారు.

దీపిక కాఫీ కప్పు సాసర్‍తో గదిలోనికి వచ్చింది.

"బాబాయ్ కాఫీ" ప్రీతిగా అందించింది.


నాయుడుగారు అందుకొన్నారు. సిప్ చేశారు.


"బాబాయ్ కాఫీ ఎలా ఉంది?"


"అమృతంలా ఉంది."


"నేనే కలిపాను బాబాయ్. అమ్మా నాన్నలకిచ్చి మీకు కూడా తీసుకొని వచ్చాను."


"నాన్న ఎక్కడ వున్నారమ్మా?"


"మొక్కలకు నీళ్ళు పెడుతున్నారు."


"అమ్మ"


"పూజగదిలో పూజ చేస్తుంది. మీరు రెడీ అయితే నాన్నగారు మిమ్మల్ని క్రిందకు రమ్మన్నారు."


నాయుడుగారు కాఫీ త్రాగారు.

"పదమ్మా"


దీపిక, నాయుడుగారు క్రిందకు వచ్చారు. 

"బాబాయ్! అమ్మ పూజ అరగంటలో ముగిస్తుంది. ఈలోపల నేను టిఫిన్ రెడీ చేస్తాను."


"సరే తల్లీ"


దీపిక వంటగదివైపునకు నడిచింది.

వరండా ముందు మొక్కలకు పైపుతో నీళ్ళు పెడుతున్న జగన్నాథ్ నాయుడుగారి గొంతు విని చిరునవ్వుతో వారివైపు చూచాడు.

నాయుడుగారు జగన్నాథ్‍ను సమీపించారు.

"కాఫీ త్రాగావురా!"


"తాగానన్నా. మన దీపిక బంగారం!" నవ్వుతూ చెప్పారు నాయుడుగారు.


జగన్నాథ్ చేతిలోని పైపును తన చేతిలోనికి తీసుకొన్నారు.

"అన్నా! అమెరికాలో మగపిల్లలు కలిసి వున్నారా లేక?"


"రెండవ వాడి వివాహం రెండేళ్ళ క్రిందట జరిగింది. అంతవరకూ అందరం కలిసే వున్నాము. రెండవ కోడలు ఇంటికి వచ్చింది. మూడు నెలలలోపే ఇరువురి కోడళ్ళకి అభిప్రాయ భేదాలు, వాదోపవాదాలు వినలేక, భరించలేక, అన్నా తమ్ముడు వేరు వేరు కాపురాలు పెట్టారు. వారికి ఆ సలహాలు ఇచ్చింది నేనే. కలిసివుండి అభిప్రాయ భేదాలతో బ్రతకటం కష్టంరా!.. మీవదిన ఎంతో నచ్చచెప్పినా కోడళ్ళ తీరు మారలేదు. విడిపోక తప్పలేదు. 


ఒరేయ్ నాయుడు, మనస్తత్వాలు గిట్టనప్పుడు కలిసి బ్రతకటం చాలా కష్టంరా! అందుకే మీ వదిన, దీపికల మాట ప్రకారం ఇరువురు కొడుకులకు ఇవ్వవలసింది ఇచ్చేసి.. నేను హైదరాబాదుకు వచ్చేశాను. ఇప్పుడు మాకు ఎంతో ప్రశాంతంగా ఉంది. మీ వదిన ఇప్పుడు పూజ చేస్తూవుంది. ఆ సమయంలో ఆమె ఆ దేవుని కోరేదేమిటో తెలుసా!.. ఎంతో దూరంలో ఉన్న నా బిడ్డలను చల్లగా చూడు తండ్రి అని. నేను మొక్కలకు నీరు పెడుతూ వారిని గురించే ఆలోచిస్తూ బిడ్డలు హాయిగా వుండాలని కోరుకుంటాను. 


ఒరేయ్ నాయుడు! ఈనాటి యువతకు విజ్ఞానంతో పాటు అజ్ఞానం కూడా పెరిగిందిరా.. మనలాగా పరస్పర ప్రేమ, అభిమానం, ఆదరణ వారి హృదయాల్లో లేవురా! రెక్కలు వచ్చిన పక్షులు వారు ఆడింది ఆట, పాడింది పాట, చిన్నా.. పెద్దా.. మంచి చెడ్డల విచక్షణ వారిలో కరువైందిరా. మమత మానవత్వాన్ని విస్మరిస్తున్నారు. మనస్సున అంతా స్వార్థం, స్వాతిశయం" విచారంగా చెప్పాడు జగన్నాథ్.


నాయుడుగారు ఆశ్చర్యంతో జగన్నాథ్ ముఖంలోకి చూచారు.


"ఏమిటిరా.. అలా చూస్తున్నావ్. కని పెంచి చదివించి వ్యక్తిత్వాన్ని కల్పించిన తల్లిదండ్రుల పట్ల నేటి యువతీ యువకులు చాలామంది యుక్తవయస్సు వచ్చేసరికి.. స్వతంత్ర భావాలు.. స్వనిర్ణయాలు.. వారి భావి జీవితంలో ఇకపై తల్లిదండ్రుల ప్రమేయం.. అవసరం లేదని వారి వివాహ విషయంలో ప్రేమ పేరుతో వారే నిర్ణయాలు తీసుకోవటం జరుగుతూ ఉంది. వారి చర్యల వలన అమ్మా నాన్నలు ఎంతగా బాధపడతారన్న భావన లేదు. పెద్దవాడు అమెరికన్ పిల్లను, రెండవవాడు అమెరికాలో స్థిరపడ్డ అన్యమత పిల్లను పెండ్లి చేసుకొన్నారు. 


పెద్దవాడు మతం మారినట్టు కూడా విన్నాను. పెండ్లి పేరుతో మతం మారడం అవసరమా!! మన మతంలో కులం గోత్రం చూచుకొని.. మాకు వాడికి నచ్చిన పిల్లతో వారి వివాహాన్ని వారి తల్లిదండ్రులమైన మనం జరిపించలేమా! ఇరువురు అన్నదమ్ములు మాకు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. మీ వదిన, నేను ఎంతగానో బాధపడ్డాము. ఆత్మీయతలేని వారి మధ్యన వుండలేక పోయాం. స్వదేశానికి తిరిగి వచ్చాము. ఇదీ.. నా కధ" విరక్తితో కూడిన చిరునవ్వుతో నాయుడుగారి ముఖంలోకి చూచాడు జగన్నాథ్.


"నాన్నా! బాబాయ్!! టిఫిన్ రెడీ" వరండాలోకి వచ్చి దీపిక పిలిచింది.


ఇరువురూ ఆమె వైపు చూచారు. మొక్కలకు నీరు పట్టటం ముగిసింది. 

దీపిక వెనకాల పార్వతి చిరునవ్వుతో నిలబడి వుంది.

జగన్నాథ్, నాయుడుగారు వారిని సమీపించారు. 

"అన్నదమ్ములు.. పాతకథలు చెప్పుకుంటున్నారా!" నవ్వుతూ అడిగింది పార్వతి.


"పాత కథ వాడికి తెలిసిందేగా! వాడికి తెలియని మన కథ చెప్పాను పారూ" నవ్వుతూ అన్నాడు జగన్నాథ్.


"సరే! రండి టిఫిన్ చేద్దాం" అంది పార్వతి.


ముందు పార్వతి.. ఆమె వెనుక దీపిక, జగన్నాథ్, నాయుడుగారు డైనింగ్ హాలు వైపు నడిచారు. డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. దీపిక ప్లేట్లలో తాను వండిన ఉప్మా, గారెలను వడ్డించింది.


========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

38 views0 comments
bottom of page