top of page

చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 10'Chejara Nee Kee Jivitham - Episode 10' - New Telugu Web Series Written By C. S. G. Krishnamacharyulu Published In manatelugukathalu.com On 24/02/2024

'చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 10' తెలుగు ధారావాహిక

రచన : C..S.G . కృష్ణమాచార్యులు 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


ఇందిరని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు శేఖర్. పెళ్ళైన వెంటనే తను అర్జెంట్ గా జర్మనీ వెళ్లాల్సి రావడంతో, ఇందిరకు తోడుగా తన పిన్నిని, తమ్ముడు మధుని ఉంచుతాడు. 


వెంకట్ అనే వ్యక్తితో మాట్లాడుతున్న వదిన ఇందిరని వారిస్తాడు మధు. శేఖర్ గురించి మధుతో చెప్పడం ప్రారంభిస్తుంది ఇందిర. 


అతను డిగ్రీ చదివే రోజుల్లో ప్రభ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో ఇందిరను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి రోజే ప్రభకు వివాహం కాలేదని తెలుసుకుంటాడు. ఇద్దరూ జర్మనీ వెళ్లి అక్కడ కలిసి ఉంటారు. 


ఇందిర చెప్పిన మాటలు నమ్మలేక పోతాడు మధు. భర్తతో విడాకులు వచ్చేవరకు మధుతో సహజీవనం చేస్తానంటుంది ఇందిర. అంగీకరించడు మధు. అన్నయ్య శేఖర్ కి కాల్ చేసి ఇండియా వచ్చెయ్యమంటాడు. ఇందిర వూహించినట్లే ఇప్పట్లో రాలేనంటాడు శేఖర్. 


గీతా మేడంని కలిసి సమస్య వివరిస్తాడు మధు. ఇందిరని తనవద్దకు తీసుకొని రమ్మంటుంది మేడం. తన కథను గీతా మేడం కి వివరిస్తుంది ఇందిర. మేడం ఇంటికి దగ్గర్లోని ఒక ఇంటికి షిఫ్ట్ అవుతారు ఇందిర, మధులు.. 


మ్యూజిక్ క్లాసెస్ లో చేరుతుంది ఇందిర. 

స్కూల్ లో టీచర్ గా చేరుతుంది. మంచి పేరు తెచ్చుకుంటుంది. 


ఇక చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 10 చదవండి. 


వేసవి శిబిరాలకు మంచి ప్రతిస్పందన వచ్చింది. ఇందిరకు వేసవి శిబిరంలో సంగీతం, ఇంగ్లీషు సంభాషణ బోధనా బాధ్యతలు అప్పగించారు. గీత అనుమతితో మధు తన రిసెర్చ్ డేటా కోసం బెంగళూరు వెళ్ళాడు. అతను లేని పది రోజులు ఇందిర గీత యింట్లో వుండడానికి నిశ్చయమైంది. ఇందిర వుండడంతో రవికి బాగుంది. ఇందిరతో కబుర్లు చెప్పుకోవడం, సంగీత సాధన చేయడం, గీత వస్తే షికార్లకు, సినిమాలకు వెళ్ళడం.. యిలా సరదాగా గడిచిపోతోంది. 


ఒక రోజు గీత, రవిని డిటెక్టివ్ విషయం అడిగింది. "ఎంతవరకు వచ్చింది డిటెక్టివ్ పరిశోధన?"

" చాలా విషయాలు తెలుసుకున్నాడు. త్వరలోనే శేఖర్ పెళ్ళి ఫోటోలు, పెళ్ళి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, అన్నీ యిస్తానన్నాడు" 


‘ఈలోగా మధు, ఇందిర దగ్గరయ్యే మార్గం చూడాలి’ అనుకుంది గీత. 

 

 @@@

బెంగుళూరు వెళ్ళిన మధు మొదటిరోజే ఇందిర దగ్గరలేని లోటు ఫీలయ్యాడు. ఎలా వుందో ఏం చేస్తోందో అన్న ఆలోచనలతో అతను తన పనిమీద పూర్తి శ్రద్ధ చూపలేక పోయాడు. ఇక లాభం లేదని, రోజూ ఇందిరకు ఫోన్ చేయాలని నిశ్చయించుకున్నాడు. 


మధు ఫోన్ చేయగానే ఇందిర పలికింది. " ఎలా వున్నావు? అక్కడ భోజనం బాగుందా?" అని ఆదుర్దాగా ఇందిర అడుగుతుంటే మధుకి సంతోషమయ్యింది. " నేను బాగానే వున్నాను. నువ్వెలా వున్నావు? "


" నేనుండేది అత్తయ్య ఇంట్లో కదా. హాయిగా వుంది. కానీ నువ్వక్కడ కష్ట పడుతున్నావన్న దిగులు తప్ప”


సంకోచంతో ఫోన్ చేసిన మధు, ఇందిర మాటలకు వుప్పొంగిపోయాడు. త్వరగా పని పూర్తిచేసుకుని, ఇందిర దగ్గరకు వెళ్ళిపోవాలని అనుకున్నాడు. 

పది రోజుల తర్వాత మధు రిసెర్చ్ పని ముగించుకుని వచ్చాడు. మధు రాగానే ఇందిర తన ఇంటికి వచ్చేసింది. ఇందిరను మధు ఆనందంతో స్నేహపూర్వకంగా కౌగలించుకున్నాడు. చాలాకాలం తర్వాత కలిసిన స్నేహితుల్లా యిద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. 

 @@@

ఉదయమే నిద్ర లేచిన మధుకి గీత నుండి ఫోన్. ఆమె రెండు ప్రశ్నలడిగింది. కామర్సు ప్రొఫెసర్ కొడుకు ఇందిరని ఇష్టపడుతున్నాడు. ఆయన పెళ్ళిచూపులకి వస్తాడట.. రేపు రమ్మందామా? ఇంకో మాట. పనిమనిషిని యెందుకు పెట్టుకోలేదు? ఇందిర ఎంత కష్టపడుతోందో గమనించలేదా? అని మరో ప్రశ్న. గీత ప్రశ్నలు విన్న మధుకు చికాకు పుట్టుకొచ్చింది.


 విరుద్ధ భావాలు అతని మదిలో చెలరేగుతున్నాయి. ఒక ప్రక్క, అన్న శేఖర్ తన పెళ్ళిగురించి చెప్పకుండా ఇందిరపైన, హక్కు కలిగి వుండడం అతనికి నచ్చడం లేదు. మరొక ప్రక్క గీత ఇందిరకు సంబంధాలు వస్తున్నాయి త్వరలో నీ సమస్య పరిష్కారమవుతుందని చెప్పడమెంతమాత్రం నచ్చడం లేదు. మొదటి సారి గీతమీద కోపం వచ్చింది. 


 ఎందుకీ చికాకని ఎవరైనా ప్రశ్నిస్తే, అతని దగ్గర సమాధానం లేదు. ఏం చెప్పగలడు?, నేను మంచివాడిని, ఇందిర కు దూరంగా వుంటానని పదే పదే చెప్పుకునే అతనికి మనసు యెదురు తిరిగి ఇందిర సాన్నిహిత్యం కోసం వెంపర్లాడడం అతనికి నచ్చడం లేదు. ఇలా గజిబిజి ఆలోచనలతో అతనుకొద్ది సేపు స్తంభించిపోయాడు. తరువాత చైతన్యం తెచ్చుకుని వంట గదిలో వున్న ఇందిర దగ్గరకు వెళ్ళి కాస్త కోపంగా అడిగాడు. " పనిమనిషి వద్దని చెప్పావా?" 


"అవును. మన ఇద్దరికి పని మనిషి యెందుకు?" 


"ఇంత పెద్ద యిల్లు రోజూ నువ్వొక్క దానివే యెలా శుభ్రం చేస్తావు? నన్ను ఏ పనీ చెయ్యనియ్యవు? దూరంగా, మేడ మీద గదిలోకి తోసావు? క్రింద ఏం జరుగుతుందో, నువ్వేం కష్టపడుతున్నావో అని క్రిందికి వస్తే, నువ్వు చదువుకో అంతా నేను చూసుకుంటానంటావు. నువ్వేమైన నా దాసీవా?"


ఇందిర మధు దగ్గరికి వచ్చి "పనిమనిషి వస్తే కొన్ని సమస్యలొస్తాయి. మనిద్దరం భార్యా భర్తలుగా కనబడాలి, ఒకే గదిలో పడుకోవాలి. లేకుంటే అది ప్రచారం చేసే కథలు వినాల్సివస్తుంది. ఈ కారణంగానే పాత ఇంట్లో కూడా మనిషిని పెట్టుకోలేదు" అంది. 


"నువ్వు కష్ట పడకుండా వుండడం ముఖ్యం. పనిమనిషిని రమ్మంటాను" అని గీతకు ఫోన్ చేసి మనిషిని పంపించమన్నాడు. 


అతని కోపానికి, అతని నిర్ణయానికి ఇందిర ఒక్క నిమిషం ఆశ్చర్య పోయింది. ఆమెకు గీత చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. 


"ఇందూ, మధుకి నువ్వంటే చాలా చాలా ఇష్టం. అతను మెల్ల మెల్లగ నీకు చేరువవుతాడు. నీవు కొంత ప్రోత్సహిస్తే త్వరలో మీరిద్దరూ ఒకటవుతారు. ఇంతలో రవి, నీ విడాకుల సమస్య పరిష్కరిస్తాడు. నన్ను నమ్ము" 


ఇందిర మనసులో క్రొత్త ఆశలు పొడసూపాయి. 

పలహారం తయారు చేసి మధూని పిలిచింది. మధు సోఫాలో వులుకు పలుకు లేకుండా కూర్చుని వున్నాడు. ఆమె అతని దగ్గరకు వెళ్ళి, " రా మధు! టిఫిన్ తిను" అంది. 


మధు లేచి మేడ మీదికి వెళ్ళిపోయాడు. ఇందిరకి అర్ధమైంది అలిగాడని. ఇదో క్రొత్త అనుభవం. ఆమె ప్లేట్లో టిఫిన్ పెట్టుకుని మేడ మీదికి వెళ్ళింది. మధు తను చదువుకునే గది కిటికీ దగ్గర నిలబడి బయటకి చూస్తున్నాడు. ఇందిర టిఫిన్ ప్లేట్ అక్కడ బల్లమీద పెట్టి, అతని దగ్గరగా నిలబడి, "కోపమా?" అంది. 


 మధు ఆమె వైపు చూడలేదు, మాట్లాడలేదు. 

"ఎందుకీ అలక? నీకు నచ్చినట్లే చెయ్యి. రా టిఫిన్ తిను" అంది అనునయంగా. 


అతనిలో చలనం లేకపోవడంతో, అతని చేతులు పట్టుకుని అతడిని బల్ల దగ్గరకు తీసుకు వచ్చే ప్రయత్నం చేసింది. 


మధు ఆమె చేతులు విడిపించుకుని, " నా అవసరం నీకు లేదు. నీ బాగోగులు చూడడానికి అత్త, మామలున్నారు. వాళ్ళు పెళ్ళిసంబధాలు తెస్తున్నారని తెలిసింది. నాకీ విషయం ఫోన్లో చెప్పకుండా వేరే కబుర్లు చెప్పిన గడుసు దానివి నీవు. నేనే వెర్రిపప్పను" వుక్రోషంతో అన్నాడు మధు. 


"అదా, నీకోపానికి కారణం. రాత్రి మబ్బులొస్తాయి, పోతాయి. చందమామ నిలకడగా వుంటాడు, నీలా. " అంది ఆమె అతని చేతులు అందుకుంటూ. 


"నిజమా!.. నువ్వు మాయ మాటలు చెప్తున్నావు " 

అనుమానంగా అడిగాడు మధు. 


"నాకు సంబధాలు వస్తున్నాయి. నిజమే. అవి యెందుకువస్తున్నాయి? గీతా, రవిల దగ్గిర వుంటున్నాను కాబట్టి. ఒక చిన్న వుద్యోగం, సంగీత పరిజ్ణానం వున్నాయి కాబట్టి". 


"నేనడిగేది. సంబంధాలు యెందుకు వస్తున్నాయని కాదు. నువ్వు చూస్తావా అని?" 


"మామయ్య, అత్తయ్య యెలా చెబితే అలా నడుచుకోవాలి కదా"


"నేనంటే ఇష్టమని నాతో వుంటూ, యిలా మాట్లాడడం కరక్టేనా?”

 

"అవును. కాదు. నాకు పెళ్ళిచేసి పంపాలని అత్తయ్య ఆలోచన. నాతో కాపురం, నీకు మనః క్లేశమే గాని సంతోషదాయకం కాదు గదా! ఆ మాటే నువ్వు అత్తయ్యకి చెప్పావు. అందుకే ఆమె ఈ సంబంధాల వేట మొదలు పెట్టారు”. 


"నీతో స్నేహంగా వుంటూ, విడాకులకోసం యెదురు చూడమని చెప్పిన ఆమె, అకస్మాత్తుగా యిలా చేయడం.. ఇది న్యాయమేనా?" మధు గొంతులో బాధ స్పష్టంగా ధ్వనిస్తోంది. 


ఇందిర మౌనంగా వుండిపోయింది. మళ్ళీ మధుయే మాట్లాడుతూ యిలా అన్నాడు. "నాకు రవి చెప్పారు. డిటెక్టివ్ ద్వారా అన్నయ్య పెళ్ళి విషయాలు తెలుసుకున్నారు. విడాకులు త్వరలోనే యిప్పిస్తారు. తనకు నచ్చిన వ్యక్తితో నీ పెళ్ళి జరిపిస్తారు. ఆయనకు మొదటినుంచి నువ్వు నాతో వుండడం యిష్టం లేదు" 


ఇందిర చురుకుగా జవాబిచ్చింది. "రవి మామయ్యని నిందించకు. ఆయనకు నీ మీదేం కోపం లేదు. పైగా నీ తరఫున ఆలోచించి వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకోమని సలహా యిచ్చారు. నువ్వు ఆలోచించి చెప్పు. నీ జీవితంలో నేనూ, నీ అన్నయ్య.. యిద్దరం వుండడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే అప్పుడు నేను కొన్ని రోజులు సహజీవనం చేసి వెళ్ళిపోతానన్నాను. బాగా ఆలోచించి చెప్పు. కరాఖండిగా, నిష్కర్షగా చెప్పు. ఒక మాట అన్న తర్వాత నీలో పశ్చాత్తాపం వుండకూడదు. నీకు ఇందిర కావాలా? అన్నయ్య కావాలా?" 


మధు సమాధానం కోసం ఇందిర వుత్కంఠతో యెదురు చూస్తూ నిలబడింది. 


========================================================================

ఇంకా వుంది..

========================================================================

C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: C..S.G . కృష్ణమాచార్యులు

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. మేనేజ్మెంట్ విద్యకు సంబంధించిన అనేక పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, హిమాలయ  వంటి ప్రముఖ సంస్థల ద్వార ప్రచురించాను.   చిన్నతనం  నుంచి  ఆసక్తివున్న తెలుగు రచనా వ్యాసంగం తిరిగి మొదలుపెట్టి కవితలు, కథలు, నవలలు వ్రాస్తున్నాను. ప్రస్తుత నివాసం పుదుచ్చెరీలో.

57 views0 comments

Comentarios


bottom of page