top of page

చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 7'Chejara Nee Kee Jivitham - Episode 7' - New Telugu Web Series Written By C. S. G. Krishnamacharyulu Published In manatelugukathalu.com On 09/02/2024

'చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 7' తెలుగు ధారావాహిక

రచన : C..S.G . కృష్ణమాచార్యులు 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


ఇందిరని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు శేఖర్. పెళ్ళైన వెంటనే తను అర్జెంట్ గా జర్మనీ వెళ్లాల్సి రావడంతో, ఇందిరకు తోడుగా తన పిన్నిని, తమ్ముడు మధుని ఉంచుతాడు. 


వెంకట్ అనే వ్యక్తితో మాట్లాడుతున్న వదిన ఇందిరని వారిస్తాడు మధు. శేఖర్ గురించి మధుతో చెప్పడం ప్రారంభిస్తుంది ఇందిర. 


అతను డిగ్రీ చదివే రోజుల్లో ప్రభ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో ఇందిరను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి రోజే ప్రభకు వివాహం కాలేదని తెలుసుకుంటాడు. ఇద్దరూ జర్మనీ వెళ్లి అక్కడ కలిసి ఉంటారు. 


ఇందిర చెప్పిన మాటలు నమ్మలేక పోతాడు మధు. భర్తతో విడాకులు వచ్చేవరకు మధుతో సహజీవనం చేస్తానంటుంది ఇందిర. అంగీకరించడు మధు. అన్నయ్య శేఖర్ కి కాల్ చేసి ఇండియా వచ్చెయ్యమంటాడు. ఇందిర వూహించినట్లే ఇప్పట్లో రాలేనంటాడు శేఖర్. 


గీతా మేడంని కలిసి సమస్య వివరిస్తాడు మధు. ఇందిరని తనవద్దకు తీసుకొని రమ్మంటుంది మేడం. తన కథను గీత మేడం కి వివరిస్తుంది ఇందిర.


ఇక చేజార నీ కే జీవితం - ఎపిసోడ్ 7 చదవండి. 


లోనికి వచ్చిన మధుని చూసి గీత" ఇందిర, రవి పై గదిలో వున్నారు. కాసేపట్లో పాడుతా తీయగా మొదలవుతుంది" అంది నవ్వుతూ. ఆమె మాట ముగిసేలోపే రవి పాట, ఆ పాటననుసరిస్తూ ఇందిర పాట వినిపించాయి. 


"సారు బాగా పాడుతున్నారమ్మా" మధు ప్రశంసాపూర్వకంగా అన్నాడు. 


" ఆయనకి సంగీతమంటే ఇష్టం. నాకు గాని మా ఇద్దరమ్మాయిలకు గాని సంగీతం రాకపోవడంతో, ఇన్నాళ్ళూ ఆయన ఒక లోటు ఫీల్ అయ్యేవారు. ఇక ఇందిరను ఆయన వదిలిపెట్టరు. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుని పని చేసుకో" అని చెప్పి గీత తన పడక గదిలోకి వెళ్ళిపోయింది. 


దాదాపు రెండు గంటల తర్వాత, రవి, ఇందిర నవ్వుకుంటూ క్రిందకు వచ్చారు. వంట గదిలో టీ తయారు చేస్తున్న గీత దగ్గరికి వెళ్ళి, రవి ఆనందంగా చెప్పాడు, " మనకు మంచి కోడలే దొరికింది. ప్రతి శని, ఆది వారాలు మేమిద్దరం కలిసి సంగీత సాధన చేస్తాం. మధుకి చెప్పు. మన కాలనీలో ప్రొఫెసర్ రామేశ్వరం ఇల్లుంది. కొత్తగా కట్టుకున్నారు. ఆయన మూడు సంవత్సరాలు ఆస్ట్రేలియాలో పని చేయడానికి వెళ్ళారు. ఇల్లు బాగా చూసుకునే ఒక చిన్న కుటుంబానికి అద్దెకిమ్మన్నారు. ఇక్కడకు వచ్చేస్తే మనకి దగ్గరగా వుంటారు". 


" మంచి ఆలోచనే" అని గీత మధుని పిలిచి ఈ విషయం చెప్పింది. 


ఇందిర తయారయిన టీని కప్పులలో పోసి అందరికి యిచ్చింది. గీత టీ కప్పు తీసుకుని, మధుని రవి, ఇందిరలకు దూరంగా తీసుకెళ్ళింది. 


" మధూ! ఇందిరని ఈ కొత్త యింటికి తీసుకు వస్తేనే మంచిది. ఇంటి పనికి తోట పని తోడవుతుంది. ఇక్కడ ఒక చిన్నపిల్లల స్కూల్ వుంది అందులో టీచరుగా వుద్యోగమిప్పిద్దాం. శెలవు రోజుల్లో రవితో సంగీతం పాడుకుంటుంది. ఇలా బిజీగావుంటే వేరే ఆలోచనలు రావు".

 

" ఈ కాలనీ లో మన యూనివర్సిటీ వాళ్ళు యెక్కువ. నాకు ఇబ్బందవుతుంది కాదా!" మధు అనుమానం వ్యక్త పరిచాడు. 


" ఈ ఇబ్బంది నీకు ఎక్కడున్నా వుండేదే. ఇది కలిగించింది నీ అన్న. ఇందిర కాదు. చూసావుగా! కలిసిన వాళ్ళంతా ఆమెను ఇష్టపడుతున్నారు. జరగబోయేది నువ్వు నీ అన్నకు దూరమై, ఇందిరకు దగ్గరవడమే. అది జరిగేవరకు నీకీ యిబ్బంది తప్పదు”. 


మంచి వాడుగా వుండడం కష్టం. అయినా సులభమని చెడ్డవాడిగా మారలేం కదా! అని మధు అనుకుంటుండగా గీత యిలా అంది. " "నేనిందాక చెప్పినట్ట్లు, యూనివర్సిటీలో సంగీతం కోర్స్ కోసం వచ్చిన నీ బంధువుల అమ్మాయిగా కొన్నాళ్ళు చెలామణీ కానీ. ఆ తరువాత చూద్దాం"


ఇందిర బాధ్యత తననించి కొంతవరకు గీతా మేడం కి బదిలీ అయ్యే అవకాశం వదులుకోవడం కరక్ట్ కాదని గ్రహించిన మధు" సరే! క్రొత్త యింటికి వచ్చేస్తాము" అన్నాడు. 


రహస్య సమాలోచన జరుపుతున్న గీత, మధుల దగ్గరకి వచ్చి, మధు నుద్దేశించి రవి అన్నాడు. " ఇంకేం ఆలోచించకు. నేనిప్పుడే చెప్పేస్తాను రామేశ్వరానికి. ఇంట్లో అన్ని గదులలో ఫర్నిచర్ కూడా క్రొత్తదే. పెట్టుబడి వాళ్ళది, అనుభవం మీది". 


గీతకు నవ్వు వచ్చింది. పెళ్ళి అన్నది, బాధ్యత తమ్ముడిది. మధుది వింత జాతకమని అనుకుంది. 

మధు వినయంగా రవి తో అన్నాడు" సర్! మీ మాట నేనెందుకు కాదంటాను.. " 


"అయితే. ఎల్లుండి పంచమీ గురువారం, వుదయం యెనిమిది గంటలకు పాలు పొంగించండి" అని సలహా యిచ్చాడు. సాయంత్రం అయిదు గంటల వేళ గీతా రవి దంపతుల దగ్గిర శెలవు తీసుకుని మధు, ఇందిరతో ఇంటికి తిరిగి వచ్చాడు. అన్న శేఖర్ కి ఫోన్ చేసి యిల్లు మారడం గురించి చెప్పాడు. మొదట శేఖర్ అంగీకరించలేదు. సొంత ఫ్లాట్ వదిలి వెళ్ళడమేమిటని అభ్యంతరం చెప్పాడు. 


కానీ ఇందిర సంతోషంగా వుండాలంటే, ప్రొఫెసర్ గీతకు దగ్గరగా వుంటే మేలని మధు నొక్కి చెప్పడంతో అంగీకరించాడు. రాత్రి భోజనం చేసేటప్పుడు, ఇందిరకు ఇల్లు మారడం గురించి చెప్పాడు. "మీ అన్న ఏమంటారో కనుక్కున్నావా" అని అడుగుతుందని యెదురుచూసాడు. కానీ ఇందిర ఆ ప్రస్తావనే తేలేదు. 

 @ @@

గురువారం క్రొత్త యింటిలో ఇందిర పాలు పొంగించింది.. ఇల్లు విశాలంగా, అందంగా వుంది. ఇంటి ముందు, వెనుక తోట పెంచుకోవడానికి స్థలముంది. క్రొత్త యిల్లు ఇందిరకు బాగా నచ్చింది. గీత, రవి వచ్చి అభినందనలు తెలిపారు. "మాకు దైవసమానమైన మీరు, భోజనం చేసి మమ్మల్ని అశీర్వదించాలి. వంట చేసి రెడీగా వుంచుతాను" అని ఇందిర రవి, గీతా దంపతులను ఆహ్వానించింది.

 

"ఇవాళ నీకు సర్దుకునే పని వుందిగా. ఇంకో రోజు వస్తాములే" అంది గీత. 


" అలా అనకండి అత్తయ్యా! మామయ్యా మీరైన చెప్పండి. మీరు రాకపోతే నాకు కొత్త ఇంటికి వచ్చిన ఆనందమేముంటుంది" రవిని చూస్తూ. ప్రాధేయపూర్వకంగా అంది ఇందిర. 


“ తప్పకుండా వస్తాంలేరా! నువ్వు ప్రాధేయపడటమేమిటి? ఒంటిగంటకు వచ్చేస్తాం! సరేనా" అని ప్రేమగా ఇందిర భుజం తట్టి చెప్పాడు రవి. 


" ఓకే. నేను వీలయితే కొద్దిగా ముందే వస్తాను. "అని ఇందిరకు చెప్పి, " మధూ, నువ్వు ఈ రోజు సెలవు తీసుకో" అని మధుకు చెప్పి గీత యూనివర్సిటీకి బయలుదేరింది. రవి ఆమెను అనుసరించాడు. 


సామాను సర్దే ప్రయత్నం చేస్తున్న మధు దగ్గరికి వచ్చి ఇందిర, " మధూ, నువ్వు యూనివర్సిటీకి వెళ్ళిపో. నేను, పని అమ్మాయి సహాయంతో అన్నీ సర్దేసి వంట చేస్తా. నువ్వు భోజనం టైం కి వస్తే చాలు" అంది. 


" నీకు కష్టమవుతుందేమో! నేను సహాయం చేస్తాలే. గీతా మేడం కూడా నాకు చెప్పి వెళ్ళింది" అని సర్దే పని కొనసాగించాడు మధు. 


"ఎందుకు మధూ, నన్ను నమ్ము. భోజనాల వేళకి యిల్లు రెడీ గా వుంటుంది. వెళ్ళి త్వరగా రా!" అంటూ ఇందిర చనువుగా మధు చేతిలో వున్న వస్తువులను క్రింద పెట్టింది. మధు యూనివర్సిటీకి వెళ్ళిపోయాడు. 

@ @@

భోజనం తర్వాత, రవి" ఇందూ! వంట రుచిగా చేసావు. పద. ఇల్లెలా సర్దుకున్నావో చూద్దాం" అంటూ ఇందిర చేయిపట్టుకుని వంటగది వైపు నడిచాడు. ఇల్లంతా కలయ తిరిగిన రవి, " మా రామేశ్వరం యిల్లు బ్రహ్మండంగా కట్టాడు" అని " నువ్వు మాస్టర్ బెడ్రూం వదిలి యీ చిన్న పడకగదిలో సర్దుకున్నావేమిటి?" అంటూ ఇందిర గదిలోని అలమరా తెరిచి, " ఇంత తక్కువ బట్టలా? ఏం తల్లీ! చీరలు తప్ప ఇంకేం లేవు. చిన్న పిల్లవి, ఈ వయసులో అమ్మాయిలు యెలా డ్రెస్స్ చేసుకుంటున్నారో! లాభం లేదు. ఇవాళ షాపింగ్ చేయాల్సిందే. సాయంత్రం ఆరింటికి రెడీగా వుండు" అని ఇందిర చెప్పే మాటలు వినకుండా వెళ్ళిపోయాడు. " ఆయన అంతే, నువ్వు రెడీగావుండు. వాదించి లాభం లేదు" అని ఇందిర భుజం తట్టి గీత వెళ్ళిపోయింది. 


సాయంత్రం ఇందిర వంట పూర్తిచేసి రవి రాగానే, మధుకి చెప్పి షాపింగ్ కి వెళ్ళింది.

 

వద్దన్న వినకుండా, రవి చెన్నయ్ సిల్క్స్ లో ఆమెకు సల్వార్ కమీజ్, కుర్తీలు, టాప్స్, జీన్స్, షర్ట్స్, ఇలా భిన్నమైన దుస్తులు కొన్నాడు రవి. " ఇందూ, నా కూతుళ్ళు ఏ డ్రెస్సులు వేసుకుంటారో అలాంటివి నువ్వు వేసుకోవాలి. అంతే! బుద్ధిగా నా మాట విని అన్ని డ్రెస్సులు వేసుకో" అని మృదువుగా ఆజ్ఞాపించాడు. చేసేదిలేక ఇందిర రవి చెప్పినట్లు వినడానికి నిర్ణయించుకుంది. ఇద్దరూ యిల్లు చేరేటప్పటికి తొమ్మిది గంటలయింది. 

@ @@ 

 రాత్రి పడుకునే ముందు భార్యని అడిగాడు రవి. 

" గీతా! నువ్వు నాకు ఇందిర గురించి పూర్తిగా చెప్పలేదు. ఆమె మెడలో మంగళసూత్రం చూసాను" 


" మీకు చెప్పాలనే అనుకున్నాను. కానీ మీరు సెమినార్ హడావుడిలో వున్నారని తర్వాత చెప్దామనుకున్నాను. మీరింత తొందరగా ఇందిరని అభిమానించి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారనుకోలేదు" అని గీత రవిచేతులు తన చేతులలోకి తీసుకుని ఇందిర కధ మొత్తం చెప్పింది. 


అంతా విన్నాక రవి " మరి నీ వ్యూహం యేమిటి?" అని ప్రశ్నించాడు. 


========================================================================

ఇంకా వుంది..

========================================================================

C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: C..S.G . కృష్ణమాచార్యులు

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. మేనేజ్మెంట్ విద్యకు సంబంధించిన అనేక పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, హిమాలయ  వంటి ప్రముఖ సంస్థల ద్వార ప్రచురించాను.   చిన్నతనం  నుంచి  ఆసక్తివున్న తెలుగు రచనా వ్యాసంగం తిరిగి మొదలుపెట్టి కవితలు, కథలు, నవలలు వ్రాస్తున్నాను. ప్రస్తుత నివాసం పుదుచ్చెరీలో.

43 views0 comments

Comments


bottom of page