top of page

నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 19




'Neti Bandhavyalu Episode 19'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 13/02/2024

'నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 19' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


హరికృష్ణ, లావణ్యలకు ముగ్గురు పిల్లలు - వాణి, ఈశ్వర్, శార్వరి. వాణి ప్రేమ వివాహం చేసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అందుకు లావణ్య అన్నయ్య ప్రజాపతి సహకారం ఉంటుంది. 


ప్రజాపతికి ఇద్దరు పిల్లలు - సీతాపతి, దీప్తి. అమెరికానుండి వచ్చిన దీప్తి, తన మేనత్త లావణ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది. 


వాణిని న్యూస్ రీడర్ గా చూసి ఆమె కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. అందరూ ఢిల్లీకి వెళ్లాలనుకుంటారు. దీప్తి కూడా వారితో వస్తానంటుంది. శార్వరికి దూరంగా ఉండమని సీతాపతికి మృదువుగా చెబుతాడు హరికృష్ణ. 


సీతాపతి, లావణ్యను ఇంటివద్ద కలిసి ఆమె ఆశీస్సులు తీసుకుంటాడు. స్వంత ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టాలన్న దీప్తి నిర్ణయానికి మద్దతు తెలుపుతారు ఈశ్వర్, హరికృష్ణలు. 



వాణిని కలవడానికి ఢిల్లీ బయలుదేరుతారు కుటుంబ సభ్యులు. దీప్తి కూడా వారితో వెళ్తుంది. 


తనను క్షమించమని తల్లిదండ్రులను కోరుతుంది వాణి. అల్లుడు కళ్యాణ్ మంచివాడని గ్రహిస్తారు హరికృష్ణ, లావణ్య. 


దీప్తి, ఈశ్వర్ లు ప్రేమలో పడతారు. ఉంగరాలు మార్చుకుంటారు. దీప్తికి వేరొకరితో వివాహం తలపెడుతాడు ప్రజాపతి. 

ప్రజాపతి ఇంటికి వెళ్లి దీప్తిని తీసుకొని వస్తాడు ఈశ్వర్. 


ఇక నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 19 చదవండి.. 


ప్రజాపతి సెల్ మ్రోగింది. చేతికి తీసుకొని చూచాడు. ఫోన్ చేసింది పరంజ్యోతి. అతని గుండె వేగం పెరిగింది. 


"ప్రజా!.. రేపు వుదయం పదిన్నరకల్లా మేము మీ ఇంటికి వస్తున్నాము. నా కోడలిని చూచేదానికి" నవ్వుతూ చెప్పాడు పరంజ్యోతి. 


ప్రజాపతి తలపై పిడుగు పడినట్లయింది. వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. బిత్తర చూపులతో గదినంతా కలయచూచాడు. పరంజ్యోతికి విషయం తెలిస్తే ఏమంటాడో అనే భయం. 

’వీడికి నిజం చెప్పినా సమస్యే.. అబద్ధం చెప్పినా సమస్యే ఏం చేయాలి! ఏం చేయాలి!’ అనుకొన్నాడు. 


"ఏరా మాట్లాడవు?" పరంజ్యోతి పలకరింపు. 


"ఆఁ.. " ఆందోళనతో అప్రయత్నంగా అన్నాడు ప్రజాపతి. "ఏరా!.. మందు మైకంలో వున్నావా!.. నేను చెప్పింది అర్థం అయిందా లేదా!"


"అయిందిరా!.. " ఆవేదనగా చెప్పాడు ప్రజాపతి. 


"దీప్తి లేచిపోయిందిరా!" గద్గద స్వరంతో చెప్పాడు ప్రజాపతి. 


"లేచిపోయిందా!" ఆశ్చర్యపోయాడు పరంజ్యోతి. 


"ఎవరితో?"


"ఆ ఈశ్వర్ గాడితో!"


"ఎప్పుడు?"


"గంటముందు"


"నీవు ఆపలేదా?"


పరంజ్యోతి ప్రశ్నకు జవాబు చెప్పలేక ప్రజాపతి మౌనంగా వుండిపోయాడు. 

"నీవు ఇంత పనికిమాలిన వాడివని నేను వూహించలేదురా!.. కన్నకూతుర్ని కంట్రోల్లో పెట్టుకోలేని నీవు మనిషివారా!.. ఛీ.. నీదీ ఒక బ్రతుకేనా!" సెల్ కట్ చేశాడు పరంజ్యోతి. 


ఆవేశం, కోపం, అవమానాలతో వణికిపోతున్న ప్రజాపతి విస్కీ బాటిల్‍ను చేతికి తీసుకొని త్రాగసాగాడు. 


ఆ రాత్రి ఎనిమిదిన్నర నుండి పదిగంటల వరకూ ప్రణవి కాలుకాలిన పిల్లిలా మిద్దె మెట్లు ఎక్కి దిగి.. ఎక్కి దిగి భర్తతో మాట్లాడాలని ప్రయత్నించింది. గదిలో తాగిపడి ఉన్న ప్రజాపతికి ఆమె హృదయ వేదన ఎలా అర్థం అవుతుంది?


తొమ్మిది గంటల ప్రాంతంలో లావణ్యకు ఫోన్ చేసి దీప్తిని జాగ్రత్తగా చూచుకొనవలసిందిగా వేడుకొంది. 


"వదినా!.. నీవు నిర్భయంగా వుండు. ఏ క్షణంలో దీపు ఈశ్వర్‍తో నా ఇంట కాలు పెట్టిందో.. ఆ క్షణం నుంచి అది నా బిడ్డ" ఎంతో అభిమానంతో చెప్పింది లావణ్య. 


పదిగంటల ప్రాంతంలో కొడుకు సీతాపతికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. అతను "అమ్మా! బాధపడకు. అక్కను ఆ ఇంటివారంతా బాగా చూచుకొంటారు. అక్కడ ఆమె ఆనందంగా ఉంటుంది. వేరే కాల్ ఏదో వస్తూ వుందమ్మా. నీవు ఇక పడుకో!" ప్రీతిగా చెప్పి సీతాపతి కాల్ కట్ చేశాడు. 

మనోవేదనతో ఏడ్చి ఏడ్చి రాత్రి ఒంటిగంట ప్రాంతంలో నిద్రపోయింది ప్రణవి. 


మరుదినం ఉదయం ఆరుగంటలకు లేచి స్నానం చేసి.. తాను నిత్యం చేసే పూజను చేసి ’తండ్రి జగత్ రక్షకా! నా బిడ్డను చల్లగా చూచి కాపాడు. ఆమెకు నా భర్త వలన ఎలాంటి కష్టాలు కలుగనివ్వకు’ దీనంగా వేడుకొంది. 


పదిగంటలకు క్రిందికి వచ్చిన ప్రజాపతి. 

"ప్రణవీ!.. " పిలిచాడు. 

భయంతో అతన్ని సమీపించింది. 


"నీవు.. నీ కూతుర్ని సరిగ్గా పెంచలేదు. కన్నతండ్రిని నన్నే ధిక్కరించి ఆ ఈశ్వర్ గాడితో వెళ్ళిపోయింది. నాకు తెలుసు.. అది చేసిన పని నీకూ ఇష్టమేనని.. జరుగనివ్వను. దాని వివాహం ఆ బికారి నల్లకోటు వాడితో జరుగనివ్వను" ఆవేశంగా చెప్పి కార్లో కూర్చుని వెళ్ళిపోయాడు ప్రజాపతి. 

ప్రణవి బిక్కముఖంతో వెళుతున్న భర్తను చూస్తూ నిలబడిపోయింది. 

మరుదినం.. ఉదయం పదిగంటలకు శివరామకృష్ణ.. ఊర్మిళ.. విష్ణు వచ్చారు. ఇంట్లో వున్న దీప్తిని చూచి ఆశ్చర్యపోయారు. 

హరికృష్ణ, లావణ్యలు జరిగిన విషయాన్నంతా వారికి వివరంగా చెప్పారు. 

ప్రక్కనే వున్న భవంతి రంగులతో క్రొత్త అందాలను సంతరించుకొని వున్న దానికి కారణం అడిగాడు శివరామకృష్ణ. 

"మన దీపు హాస్పిటల్‍ను ఓపెన్ చేయబోతూ వుందిరా!" చెప్పాడు హరికృష్ణ. 


"చాలా మంచి పనిరా!" నవ్వుతూ నిలబడి వున్న దీప్తిని చూచి. 


"అమ్మా!.. నీది ఎంతో గొప్ప మనస్సు. ఈ కాలపు పిల్లల్లా నగరాల్లో డ్యూటీ టైమ్ ప్రకారం ధర్మాన్ని నిర్వహించకుండా పల్లెటూళ్ళో హాస్పిటల్ నడుపుతూ, పేదలకు సాయం చేయాలనే నీ నిర్ణయం ఎంతో గొప్పదమ్మా!.. నాకు ఎంతో ఆనందంగా వుంది" చిరునవ్వుతో చెప్పాడు శివరామకృష్ణ. 

"బాబాయ్! ఇందులో నా గొప్పతనం ఏమీలేదు. అంతా మా మామయ్య అత్తయ్య మీ అల్లుడిగారి ప్రోత్సాహం" వినయంగా చెప్పింది దీప్తి. 


ప్రజాపతి ఇరవైమంది గుంపుతో హరికృష్ణ ఇంటిముందుకు వచ్చాడు. 

"రేయ్!.. హరీ!.. ఈశ్వర్!.. బయటికి రండిరా!" పోలికేకపెట్టాడు ఆగ్రహావేశాలతో. 

హాల్లో వున్న అందరూ వరండాలోకి వచ్చారు. వాకిట్లో వున్న ప్రజాపతిని అతని అనుచరులను చూచారు. 


హరికృష్ణ, శివరామకృష్ణ, ఈశ్వర్ వీధిగేటును సమీపించారు. 

"బావా! లోనికిరా!.. కూర్చుని మాట్లాడుకొందాం!" అనునయంగా చెప్పాడు హరికృష్ణ. 


"నేను నీ కొంపలో కాలు పెడతాననుకున్నావురా!.. ఛీ.. ఛీ.. మర్యాదగా నా కూతురును నాకు అప్పగించు.. లేకపోతే!.. "


"చేయకపోతే ఏం చేస్తారు!" అడిగాడు ఈశ్వర్. 


వారిని లావణ్య, ఊర్మిళా సమీపించారు. 

"అన్నయ్యా! లోపలికిరా! వీధిలో ఆ అరుపులేంటి!"


"అవునే నేను అలాగే అరుస్తాను. నీ కొడుకు నా కూతుర్ని లాక్కునివచ్చాడు. మాటలు అనవసరం. దీపును పిలు!"


"ప్రజా! ఆవేశపడకు. వీళ్ళనందరినీ వెళ్ళిపొమ్మను. లోపలికిరా స్థిమితంగా కూర్చొని మాట్లాడుకొందాం. ఇది మన సొంత విషయం. ఊరి విషయం కాదుగా!" అభ్యర్థనగా చెప్పాడు శివరామకృష్ణ. 


"రేయ్!.. నీవు నాకు నీతులు చెప్పేవాడివా!.. విషయం నాకు వాడికి సంబంధించింది నీవు నోరుమూసుకో"


"మామయ్యా! దీపు మీతో రాదు.. పంపను. "


"నీవు ఎవడివిరా పంపేదానికి? పంపకుండా వుండేదానికి? ఇంట్లో జొరబడి లాక్కొని వెళతా!"


"ఇంట్లోకి రానన్నావుగా మామయ్యా!.. " వెటకారంగా చెప్పాడు ఈశ్వర్. 


"అన్నయ్యా!.. వాడు చెప్పింది అక్షర సత్యం. మేమంతా పిలుస్తున్నాము కదా!.. ఆవేశాన్ని అణచుకొని గౌరవంగా లోనికిరా! ప్రశాంతంగా మాట్లాడుకొందాం!" అనునయంగా చెప్పింది లావణ్య. 


"పోవే!.. మీతో నాకు మాటలేంటి?" ప్రక్కన వున్నవారిని చూచి.. 

"రేయ్! లోనికి వెళ్ళి దీప్తిని లాక్కొని రండిరా!" శాసించాడు. 


వారు అతని ముఖంలోకి.. ఎదుట నిలబడి వున్న హరికృష్ణ, శివరామకృష్ణ, ఊర్మిళ, లావణ్య, ఈశ్వర్ ముఖాల్లోకి బిక్కముఖాలతో చూచారు. 


"పోండ్రా!" గర్జించాడు ప్రజాపతి. 


పదిమంది ముందుకు జరిగారు. 

"అన్నయ్యలారా! ఆగండి. మీరు శ్రమ పడవనవసరం లేదు. దీపూను నేనే పిలిస్తాను" నవ్వుతూ చెప్పాడు ఈశ్వర్. 


వాకిట్లో జరుగుతున్న వాదప్రతివాదాలను వరండాలో నిలబడి భయంతో చూస్తూ.. వింటూ వుంది దీప్తి. 


"దీపూ! ఇలారా!" బిగ్గరగా పిలిచాడు ఈశ్వర్. 

దీప్తి ఆ పిలుపు విని పరుగున వచ్చి ఈశ్వర్ ప్రక్కన నిలబడింది. 

"దీపూ.. ! నీవు మీ నాన్నతో వెళతావా?" అడిగాడు ఈశ్వర్. 


"వెళ్ళను"


"ఏయ్!.. నీవు వచ్చేదేంటే!.. " ఆమె చేతిని పట్టుకోవాలని ప్రజాపతి ముందుకు అడుగువేశాడు. ప్రజాపతి చేతిని విదిలించి తన చేతిని వెనక్కు తీసుకొంది దీప్తి. 


"నాన్నా!.. నేను మీతో రాను. మీరు నాకు చేయాలనుకొనే సంబంధం నాకు ఇష్టం లేదు. బావంటే నాకు ప్రాణం. నా వివాహం నా బావతోనే జరుగుతుంది. దాన్ని నీవు.. నీ చుట్టూ వుండే ఈ కూలి గుంపు ఆపలేరు. మిస్టర్ ప్రజాపతీ!.. జాగ్రత్తగా విను. నేను మేజర్!.. నాకు నచ్చిన.. నాకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు నాకుంది. నా మనోభావాలను అర్థం చేసుకోలేని నీవు, నన్ను ఎలా శాసించగలవు? వీళ్ళంతా చెప్పిన మాటలు నీ చెవికి ఎక్కలేదు ఎక్కబోవు అని కూడా నాకు తెలుసు. 

అయ్యా!.. మీరంతా పెద్ద మనుషులా.. లేక రౌడీలా!.. నా మేనత్త కొడుకును.. నా బావను నేను పెళ్ళి చేసుకోవాలనుకోవడం తప్పా! నేరమా!.. మరోసారి చెబుతున్నాను. నా పెళ్ళి జరుగబోయేది నా బావతోనే. మీ ఈ ప్రజాపతి చూచిన సంబంధంతో కాదు. నాకంటే మీరంతా పెద్దవారు నా నిర్ణయాన్ని చెప్పాను. గౌరవంగా మీ మీ ఇళ్ళకు వెళ్ళిపొండి. "


దీప్తి సాహసానికీ, ధైర్యానికీ హరికృష్ణ, లావణ్య, శివరామకృష్ణ, ఊర్మిళ, ఈశ్వర్ ఆశ్చర్యపోయారు. సంతోషించారు. 


ఎంతో ఆవేశంతో చెప్పుకొచ్చిన దీప్తి.. చివరిమాటలను ఎంతో వందనంగా చెప్పింది. వెనుతిరిగి ఇంటివైపుకు నడిచింది. 


వారంతా ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు. వెనుతిరిగి మెల్లగా వెళ్ళిపోయారు. వెళుతున్న వారిని ఆశ్చర్యంతో చూస్తూ నిలబడ్డాడు ప్రజాపతి. 


"అన్నయ్యా!.. అందరూ వెళ్ళిపోయారు లోనికిరా!" ప్రీతిగా పిలిచింది లావణ్య. 


"హు!.. " బుసకొట్టి ప్రజాపతి వేగంగా తన ఇంటివైపుకు బయలుదేరాడు. అందరూ ఇంట్లోకి నడిచారు. 

హాల్లోకి రాగానే హరికృష్ణ.. 

"ఈశ్వర్!" పిలిచాడు. 


అందరూ హరికృష్ణ ముఖంలోకి చూచారు ప్రశ్నార్థకంగా. 

"ఏం నాన్నా!.. "


"మనం వెంటనే నెల్లూరికి బయలుదేరాలి!"


"ఎందుకండి!.. " ఆత్రంగా అడిగింది లావణ్య. 


"ఈశ్వర్‍కు, దీప్తికి రిజిష్టర్ మ్యారేజ్ జరిపించాలి". 


"రిజిష్టర్ మ్యారేజా!" ఆశ్చర్యంతో అడిగింది లావణ్య. 


"అవును లావణ్యా!"


"రిజిస్టర్ మ్యారేజ్ ఏమిట్రా.. లక్షణంగా పెళ్ళి జరిపించకుండా!" అడిగాడు శివరామకృష్ణ. 


"బావా!.. ప్రజాపతి ఎంతటి ఆవేశంతో వచ్చాడో.. వెళ్లాడో.. నీవూ చూచావుగా!.. పై ఎత్తుగా వాడు ఏం చేయబోతాడో మనకు తెలియదు. వీళ్ళిద్దరికీ రిజిష్టరు మ్యారేజ్ అయిపోయిందనుకో!.. వాడు గాని ఎవరు కానీ ఏమీ చేయలేరు. కానిచ్చి త్వరగా బయలుదేరండి" లావణ్య వైపు చూచి "లావణ్యా!.. నా.. " హరికృష్ణ ముగించకముందే.. 

"మీ అభిప్రాయం నాకు అర్థం అయిందండీ. అలాగే వెళదాం" అంది. 


ఈశ్వర్ సెల్ మ్రోగింది. 

"హలో!.. "


"బావా!.. గుడ్ మార్నింగ్. నేను రాత్రి నెల్లూరికి వచ్చాను. మీరు చెప్పినట్లుగా అన్ని ఏర్పాట్లు చేశాను. మీరు బయలుదేరారా!" అడిగాడు సీతాపతి. 


"ఈశ్వర్!.. ఫోన్‍లో ఎవరు?"


"అమ్మా!.. మన సీతాపతి. వివరంగా చెబుతాను. ఆఁ.. సీతా! మేము పదినిముషాల్లో బయలుదేరుతున్నాము. పదిన్నరకల్లా అక్కడికి వచ్చేస్తాం" చెప్పి తల్లి వైపుకు తిరిగి.. 

"అమ్మా!.. నాన్నా!.. మామయ్య ప్రస్తుత తత్వం నాకు తెలిసినందున.. నిన్న సీతాపతికి ఫోన్ చేసి నెల్లూరికి వచ్చి రిజిష్టార్‍తో మాట్లాడమన్నాను. ఆ పని ముగించానని మనం ఎప్పుడు నెల్లూరు చేరుతామని అడిగాడు. వాడికి నే చెప్పిన సమాధానాన్ని మీరు విన్నారుగా!.. " చెప్పాడు ఈశ్వర్. 


"అవును ఈశ్వర్! హరి అన్నట్లుగా ఆ ప్రజాపతి ప్రస్తుతంలో అన్నింటికీ తెగించి వున్నాడు. మీ ఇరువురికీ రిజిష్టర్ మ్యారేజ్ జరగడం ఎంతో మంచిది" దీప్తి వైపు చూచి.. "అమ్మా!.. దీపూ!.. త్వరగా రెడీగా!" చిరునవ్వుతో చెప్పాడు శివరామకృష్ణ. 


దీప్తి క్షణంసేపు ఈశ్వర్ ముఖంలోకి చూచింది. అతని కళ్ళు ఆమెకు చెప్పవలసిన మాటలను చెప్పాయి. వారిరువురినీ గమనించిన లావణ్య.. 

"దీపూ పద" ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని తన గదిలోనికి వెళ్ళింది. 


పావుగంటలో దీప్తిని తన స్వహస్తాలతో పెండ్లి కూతురిగా మార్చింది. 

మాధవయ్య టాక్సీలో వచ్చి వాకిట ముందు దిగాడు. అతన్ని చూచిన శివరామకృష్ణ.. 

"మాధవన్నా రా!" చిరునవ్వుతో పిలిచాడు. 


"బావా!.. రా లోపలికి" అన్నాడు హరికృష్ణ. 


"మా చెల్లి లావణ్య ఎక్కడరా? ఆమె వచ్చి పిలిస్తేనే కాని నేను లోనికి రాను" బుంగమూతితో చెప్పాడు మాధవయ్య. 


దీప్తితో హాల్లోకి వచ్చిన లావణ్య మాధవయ్యను చూచింది. 

"లావణ్యా!.. మీ మాధవన్నయ్య!" వాకిటి వైపు చూపుడు వ్రేలిని చూపించాడు హరికృష్ణ. 


లావణ్యకు గతం గుర్తుకు వచ్చింది. నాటి తన తొందరపాటు.. అన్నమాటలు.. గుర్తుకువచ్చాయి. పశ్చాత్తాపంతో వరండాలోకి వచ్చి మాధవయ్యను సమీపించింది. 


"అన్నయ్యా!.. నన్ను క్షమించండి. లోనికి రండి" ప్రాధేయపూర్వకంగా చెప్పింది లావణ్య. 


"అమ్మా!.. నిన్ను నేను క్షమించడమా! నీవేం తప్పు చేశావు తల్లీ. ఆ రోజు నీ స్థానంలో నేను వున్నా నీలాగే మాట్లాడేవాణ్ణి. నాకు నీమీద కోపం లేదమ్మా!.. వున్నది కేవలం మాట పట్టింపు మాత్రమే!.. అది ఇప్పుడు లేదు పద!" అన్నాడు మాధవయ్య. 


ఇరువురూ హాల్లోకి ప్రవేశించారు. ఈశ్వర్ తన గది నుండి బయటికి వచ్చాడు. దీప్తి అతన్ని సమీపించింది. 


"పెద్దల పాదాలు తాకి నమస్కరిద్దాం బావా!" మెల్లగా అతని చెవి దగ్గర నోటిని చేర్చి చెప్పింది దీప్తి. 

"అలాగే!" ప్రీతిగా దీప్తి ముఖంలోకి చూస్తూ అన్నాడు ఈశ్వర్. 


"ఏమిటా మీ గుసగుసలు!" అడిగింది లావణ్య. 


"ఏం లేదమ్మా! నీవు నాన్న ప్రక్కకు రా!.. ఊర్మిళత్తయ్యా!.. మీరు మామయ్య ప్రక్కకు రండి. " నవ్వుతూ చెప్పాడు ఈశ్వర్. 


వారు అలాగే నిలబడ్డారు. ముందు తల్లితండ్రి తర్వాత శివరామకృష్ణ, ఊర్మిళ పాదాలను తాకి వారి ఆశీస్సులను, చివరగా మాధవయ్య పాదాలను తాకి ఆ పెద్దలందరి ఆశీర్వచనాలను స్వీకరించారు దీప్తి, ఈశ్వర్‍లు. 


విష్ణు, ఈశ్వర్‍తో కరచాలనం చేసి "బావా! అక్కా! విష్ యు బోత్ ఆల్ ది బెస్ట్" ఆనందంగా చెప్పాడు. 

"విష్ణు! రేపు ఉదయం మనం చెన్నై వెళుతున్నాము. నా ఫ్రెండ్ సాయంతో డాక్టర్ బ్రౌన్‍తో మాట్లాడాను. నిన్ను తీసుకొని రమ్మన్నారు" చిరునవ్వుతో చెప్పాడు ఈశ్వర్. 


"ఓకే బావా! థాంక్యూ" నవ్వుతూ చెప్పాడు విష్ణు. మాధవయ్య వచ్చిన అంబాసిడర్ కార్లో ఈశ్వర్, దీప్తి కూర్చున్నారు. 


వారి సొంతకారు వ్యాగనార్‍లో హరికృష్ణ, లావణ్య, శివరామకృష్ణ, ఊర్మిళ, మాధవయ్య కూర్చున్నారు. రెండు కార్లు నెల్లూరివైపు బయలుదేరాయి. విష్ణు ఇంట్లోనే వుండిపోయాడు. 

వెనుక సీట్లో ముడుచుకొని కూర్చుని వున్న దీప్తిని చూచి ఈశ్వర్ "ఏమిటా కూర్చోడం ఫ్రీగా హ్యాపీగా కూర్చో. నీ ఆశయం నెరవేరబోతూ వుందిగా!" నవ్వుతూ చెప్పాడు ఈశ్వర్. 


దీప్తి ఈశ్వర్ ముఖంలోకి వాల్గంట చూచింది. 

"కేవలం నా ఆశయమేనా!"


"కాదు మన ఆశయం"


"ముందే ఆ మాట అని వుండవచ్చుగా!"


"అలా అని వుంటే.. ఈ అందాల ముఖంలో క్షణాల్లో మెరిసి మాయమైన అతి సుందరమైన మెరుపులను చూడలేను కదా!" కళ్ళు ఎగరేస్తూ చెప్పాడు ఈశ్వర్.

 

"ఇది వెక్కిరింపా!.. అభిమానమా!" బుంగమూతి పెట్టి అడిగింది దీప్తి. 


ఈశ్వర్ షర్టు బటన్స్ విప్పి రెండు చేతులను ఛాతికి తాకించి.. 

"ఈ గుండె నిండా వున్న పిచ్చిప్రేమ.. అభిమానం" అందంగా నవ్వాడు ఈశ్వర్. తెల్లని అతని పళ్ళ వరసలో మెరుపు. పరవశంతో అతని ఛాతిపై వాలిపోయింది దీప్తి. 


నలభై నిముషాల్లో రెండుకార్లు రిజిష్టార్ ఆఫీసు ముందు ఆగాయి. అందరూ కార్ల నుండి దిగారు. 

ఆ గతరాత్రే అక్కడికి వచ్చి ఉదయాన్నే అన్ని ఏర్పాట్లు చేసిన సీతాపతి నవ్వుతూ వారిని సమీపించాడు. పెద్దలకు వినయంగా నమస్కరించాడు. 


తన అక్కను సమీపించి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని.. 

"అక్కా! కంగ్రాచ్యులేషన్స్. నాకు చాలా ఆనందంగా ఉంది" ముసిముసి నవ్వులతో దీప్తి తన కుడిచేతిని అతని తలపై వుంచి వేళ్ళతో జుట్టు కదిలించింది. దీప్తికి చిన్నతనం నుంచి తన తమ్ముడు ఏదైనా మంచిమాట మాట్లాడినా.. తనకు సాయం చేసినా అలా అతని తలను నిమరడం అలవాటు. 


ఆ అక్క స్పర్శకు సీతాపతి ఎంతగానో ఆనందించేవాడు. ఈనాడూ అంతే.. 

"సీతా! నేను నీకు ట్రబుల్ ఇచ్చానుగా!.. "


"ఏంది బావా ఆమాట. ఇది నా డ్యూటీ బావా!"


అటెండర్ వచ్చి సీతాపతిని సమీపించి.. 

"సార్!.. మీ వాళ్ళంతా వచ్చారా!.. అయ్యగారు మిమ్మల్ని పిలిస్తున్నారు రండి" వెనుతిరిగాడు అటెండర్. 


అందరూ అతన్ని అనుసరించి రిజిష్టార్ గారి ముందుకు హాజరైనారు. రిజిష్టార్ గారు పేరు వినోద్ శర్మ. 


హరికృష్ణ సాయంతో చదివి.. ఎదిగి.. పట్టభద్రుడై ఆ ఉద్యోగాన్ని ప్రతిభతో సంపాదించాడు. ఎనిమిది సంవత్సరాల సర్వీస్ కూడా ముగిసింది. 


హరికృష్ణను చూడగానే కుర్చీ దిగి.. వారిని సమీపించి వినయంగా చేతులు జోడించి.. 

"సార్!.. నేను గుర్తున్నాన్నా! వినోద్ శర్మను సార్.. మీ సాయంతో చదువుకొనిపైకి వచ్చిన వాణ్ణి" కృతజ్ఞతా పూర్వకంగా చెప్పాడు. 


"నాకు వయస్సు అవుతుందిగా.. చూడడంతోనే గుర్తు పట్టలేకపోయాను. ఇప్పుడు గుర్తుకు వచ్చావు. ఆఁ.. వీడు నా కొడుకు ఈశ్వర్.. ఆమె నా మేనకోడలు దీప్తి.. కొన్ని కారణాల వల్ల వీరి వివాహం మీ రిజిష్టార్ కార్యానిలయంలో జరిపించవలసి వచ్చింది. ఈమె నా భార్య లావణ్య. ఆయన మా బావగారు శివరామకృష్ణ. ఆమె నా చెల్లెలు ఊర్మిళ. వీరు మా మరో బావగారు మాధవయ్య. వాడు నా.. " హరికృష్ణ పూర్తిచేయకముందే.. 

"వారు నాకు తెలుసు సార్!.. రాత్రి నన్ను కలిసి అన్ని విషయాలు చెప్పి.. కావలసిన ఏర్పాట్లను చేసింది వారే కదా సార్. సీతాపతి వెరీ గుడ్ బాయ్. వీరి స్నేహితులు ఇద్దరు కూడా చాలా మంచివారు" నవ్వుతూ చెప్పాడు వినోద్‍శర్మ. 


సీతాపతి క్షణంసేపు హరికృష్ణ ముఖంలోకి చూచి తర్వాత "చిన్నానా! పిన్నీ విష్ణు అన్నయ్యా బాగున్నారా!" శివరామకృష్ణను, ఊర్మిళను ప్రీతిగా పలకరించాడు. 


"అందరమూ బాగున్నాము నాన్నా!" చెప్పాడు శివరామకృష్ణ. 


"సరే వినోద్ శర్మగారూ! మీ పనిని మీరు ప్రారంభించండి" అన్నాడు హరికృష్ణ. 


"అలాగే సార్!"


తన స్థానంలో కూర్చొని రిజిష్టర్‍లో ఈశ్వర్, దీప్తీల పేర్లను, సాక్షిల పేర్లు వ్రాసి సంతకం చేయమన్నాడు వినోద్ శర్మ. 


"సార్!.. ఒక్కక్షణం.. " వేగంగా జేబు నుండి రెండు బంగారు ఉంగరాలను తీసి ఒకదాన్ని ఈశ్వర్ చేతికి, రెండవదాన్ని అక్క దీప్తి చేతికి ఇచ్చాడు సీతాపతి. 


"మార్చుకోండి బావా!" అన్నాడు చిరునవ్వుతో. 


ఈశ్వర్ నవ్వుతూ తన చేతిలోని వుంగరాన్ని దీప్తి వేలికి తొడిగాడు. 

దీప్తి తన చేతిలోని వుంగరాన్ని ఈశ్వర్ చేతికి తొడిగిండి నవ్వుతూ. 

ఇరువురూ రిజిష్టార్ సంతకాలు చేశారు. 


సాక్షి సంతకాలు.. శివరామకృష్ణ, మాధవయ్య, సీతపతి, అతని స్నేహితుడు ఆనందరావు చేశారు. 

పన్నీరు, పూలదండలను ఇరువురికీ అందించాడు సీతాపతి. ఈశ్వర్, దీప్తిలు దండలు మార్చుకొన్నారు. పెద్దలకు నమస్కరించారు. 


పెద్దలు వారిని హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. 


సీతాపతి అందరికీ స్వీట్స్ పంచాడు. అందరూ ఆనందంగా ఆరగించారు. కూల్‍డ్రింక్స్ అందించాడు త్రాగారు. 


హరికృష్ణ!.. "మీ సహకారానికి నా ధన్యవాదాలు" వినోద్ శర్మ తనకన్నా చిన్నవాడైనా హరికృష్ణ కృతజ్ఞతా భావంతో చేతులు జోడించాడు. 


ఆ చేతులు విడదీసి.. "ఈ చేతులు నన్ను ఆశీర్వదించవలసినవి సార్!" వినయంగా చెప్పాడు వినోద్ శర్మ. 


"సార్! ఈశ్వర్ గారూ! మీ వివాహం అభిజిత్ లగ్నంలో శుక్రవారం నాడు ఎంతో శుభంగా జరిగింది. మీ భావిజీవితం.. మూడుపువ్వులు, ఆరుకాయలుగా ఎంతో ఆనందంగా సాగుతుంది. నేను మీకంటే పెద్దవాణ్ణి. మీకు ఇవే నా శుభాశీస్సులు" హృదయపూర్వకంగా చెప్పాడు వినోద్ శర్మ. 


పరీక్షల కారణంగా శార్వరి నెల్లూరుకి రాలేకపోయింది. 

అందరూ రమణ విలాస్‍కు వెళ్ళి భోజనం చేశారు. శ్రీరంగనాయక స్వామి ఆలయాన్ని, ధర్మరాజుల ఆలయాన్ని, జొన్నవాడ శ్రీ కామాక్షమ్మ ఆలయాన్ని దర్శించి, కానుకలు అర్పించి, తీర్దప్రసాదాలను స్వీకరించి తిరిగి నెల్లూరుకు చేరారు. 


========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

35 views0 comments

Comments


bottom of page