top of page

నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 7
'Neti Bandhavyalu Episode 7'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 11/12/2023

'నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 7' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


హరికృష్ణ, లావణ్యల కుమారుడు ఈశ్వర్, కూతురు శార్వరి. లావణ్య అన్నయ్య ప్రజాపతి. 

అతని కొడుకు సీతాపతి, కూతురు దీప్తి.


అమెరికానుండి వచ్చిన దీప్తి, తన మేనత్త లావణ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది. మిగతా అందరూ తనతో మాములుగా ఉన్నా ఈశ్వర్ కి మాత్రం కోపం ఉన్నట్లు గ్రహిస్తుంది. ఈశ్వర్ కుటుంబంతో గొడవలకు కారణం తండ్రేనని తెలుసుకుంటుంది. మేనత్త కూతురు, ఇంటినుండి వెళ్లిపోవడానికి, తండ్రి సహకారం ఉన్నట్లు తల్లి, దీప్తితో చెబుతుంది.


హరికృష్ణ దగ్గరకి శివరామకృష్ణ కుటుంబంతో వస్తాడు.

గతంలో శివరామకృష్ణ తల్లి శాంభవి మరణించిన కొద్ది రోజులకే అతని తండ్రి మహేశ్వర్ మరణిస్తాడు.


ఇక నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 7 చదవండి. 


మహేశ్వర్ మరణానంతరం... శివరామకృష్ణ, ఊర్మిళలు ఒంటరివారుగా మిగిలిపోయారు.

ఈ జగమే మంచిచెడ్డల కలయిక. కొందరు స్వార్థపరులు మహేశ్వర్ తమకు బాకీ అంటూ శివరామకృష్ణకు ఋణ వివరాలను వివరించారు. వారి మాటలను వేధింపులను భరించలేక... శివరామకృష్ణ మిగిలివున్న పొలాన్ని అమ్మి ఋణబాధల నుండి విముక్తి పొందాడు.

ఆ సమయంలో ఊర్మిళ గర్భవతి.


ఆ కుటుంబ స్థితి గమనించిన కైలాసపతి శివరామకృష్ణను తనవద్దకు పిలిపించుకొని తన నూనె ఫ్యాక్టరీలో పనిచేయవలసిందిగా చెప్పాడు.

"మీరు ఇప్పించిన ఉద్యోగం వుందికదా పెదనాన్నా! నా బ్రతుకు తెరువుకు అది చాలుగా!" అన్నాడు శివరామకృష్ణ.


"ఒరేయ్! నాకు ప్రజాపతి ఎంతో నీవూ అంతేరా!... దిగజారిన కుటుంబాన్ని నిలబెట్టాలనేది నా ప్రయత్నం. ఆ ఉద్యోగాన్ని వదలి ఫ్యాక్టరీలో భాగస్వామిగా చేరు. నా మాట విను" అనునయంగా చెప్పాడు కైలాసపతి.


"పెదనాన్నా! మీరు పెద్దమ్మా ఎంతో మంచివారు. మీకు బంధుత్వం, బాంధవ్యాల మీద ఎంతో గౌరవాభిమానాలు వున్నాయి. మీ మనస్సు చాలా మంచిది పెదనాన్నా!.... కానీ... నాకే... ఈ మన వూర్లో వుండాలని లేదు. మద్రాస్‍కు వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఊర్మిళ తాతగారూ అదేమాట చెప్పారు. ఊర్మిళకూ వెళ్ళాలని ఉంది" చెప్పాడు శివరామకృష్ణ.


"నీవు నా మాటను ఎందుకు కాదంటున్నావో నాకు తెలుసురా!.... ప్రజాపతి తత్త్వానికి, నీ తత్త్వానికి వున్న భేదమే కదరా కారణం!... నా ఆస్థిని నేను నా కష్టంతో సంపాదించాను. దానిమీద సర్వహక్కులు నాకే ఉన్నాయి. వాడు నిన్ను ఏమీ అనబోడు. నేనున్నానుగా!... నా మాట విను."

"పెదనాన్నా! నన్ను మన్నించండి. నేను మీ సలహాను పాటించలేను. నేను ఓ నిర్ణయానికి వచ్చాను పెదనాన్నా!"


"అలాగే!... సరే!... నీ ఇష్టప్రకారమే జరగనీ!... కానీ ఒక్కమాటను మాత్రం గుర్తుంచుకో, నా జీవితాంతం వరకూ నీకు ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సంకోచం లేకుండా నన్ను అడుగుతానని నాకు మాట ఇవ్వు."


"అలాగే పెదనాన్నా!..."


"చూడు శివా!.... నా కోడలు మామూలు మనిషి కాదు. ఆమెను జాగ్రత్తగా చూచుకో!... మన చర్యల వలన మన ఇంటి ఆడవారు కన్నీరు కార్చరాదు. మీ నాన్న విషయంలో ఆ తప్పే జరిగింది. మహాతల్లి మా వదిన వెళ్ళిపోయింది. ఈ ఇంటికి కారుచీకట్లు క్రమ్ముకొన్నాయి" విచారంగా చెప్పాడు కైలాసపతి.


"అమ్మా!.... ఊర్మిళా!... దీన్ని నీ దగ్గర వుంచమ్మా!" లక్ష రూపాయల నోట్ల కట్టలను ఊర్మిళకు అందించాడు కైలాసపతి.


ఊర్మిళ భర్త ముఖంలోకి చూచింది. చిరునవ్వుతో శివరామకృష్ణ తలాడించాడు.


"అమ్మా!... నిండు నూరేళ్ళు మీరిరువురూ ఇలాంటి కనుసన్నలతోనే... ఏకాభిప్రాయంతో... సంసారాన్ని సాగించి...మంచి బిడ్డలకు జన్మనిచ్చి అన్యోన్యంగా ఆనందంగా వర్దిల్లాలి తల్లీ!...." హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు కైలాసపతి.


"ఎప్పుడురా మీ ప్రయాణం!..."


"ఈ ఇంటికి అమ్మేసి..."


"ఏమిటి!... ఇంటికి అమ్ముతావా!..."


"అన్నీ పోయాక... ఇది మాత్రం వుండి ఏం ప్రయోజనం పెదనాన్నా!" విరక్తిగా చెప్పాడు శివరామకృష్ణ.


"ఒరే!.... ఇది మీ అమ్మానాన్నల తీపిగురుతు. దీన్ని అమ్మకురా! రానున్న రోజుల్లో ఎవరికి ఎవరు ఏమౌతారో... బంధుత్వాలు, బాంధవ్యాలు, రక్తసంబంధాలు ఎలా పరిణమించబోతాయో!... ఎక్కడెక్కడో తిరిగినా... ఏం చేసినా... నీవు పుట్టిన గడ్డ (ఇల్లు) మీద కాలు మోపితే... ఆ క్షణంలో నీకు కలగబోయే అనుభూతి... ఆనందం వేరుగా వుంటుందిరా!.... దీన్ని నీవు అమ్మేదానికి వీల్లేదు. వుంచుకో!... నీకేమైనా డబ్బు అవసరం అయితే ఎంతకావాలో చెప్పు... నేను, నీ పెదతండ్రిగా ఇస్తానురా!..." అనునయంగా చెప్పాడు కైలాసపతి.


"పెదనాన్నా!.... మీ కోడలి చేతికి డబ్బు ఇచ్చారుగా!.... ఇక వద్దు. మీ మాట ప్రకారమే ఈ ఇంటికి అమ్మను. మీరు దీన్ని చూచుకోండి. సంతోషమా పెదనాన్నా!..."


"నా మాటను విన్నందుకు చాలా సంతోషంరా!.... వెళ్ళబోయే రోజు నన్ను మీ పెద్దమ్మను కలవండి..."


"అలాగే పెదనాన్నా!..."


నిట్టూర్చి... వారివురి ముఖాల్లోకి క్షణంసేపు చూచి కైలాసపతి వెళ్ళిపోయాడు.

హరికృష్ణ... లావణ్యలు వచ్చారు.

"ఐదు నిముషాల ముందు పెదనాన్న వెళ్ళిపోయారురా!..."


"దూరాన్నుంచి చూచామురా!...." చిరునవ్వుతో చెప్పాడు హరికృష్ణ.


లావణ్య, ఊర్మిళ దగ్గరకు వెళ్ళింది.


"వదినా!,.... ఎలా వున్నావ్!" ఉదరాన్ని చూచి చిరునవ్వుతో అడిగింది లావణ్య.


"నా సంగతి నీకు తెలిసిందేగా!... మరి నీ సంగతి?" అడిగింది ఊర్మిళ.


సిగ్గుతో తల దించుకొంది చిరునవ్వుతో లావణ్య.

"అంటే!..."


అవునన్నట్లు తలాడించింది లావణ్య.

"కంగ్రాచ్యులేషన్ లావణ్యా!..." నవ్వుతూ చెప్పింది ఊర్మిళ.


శివరామకృష్ణ తన నిర్ణయాన్ని కైలాసపతికి తనకు క్రిందటి గంటలో జరిగిన సంభాషణను హరికృష్ణకు వివరించాడు.


తొలుత.. హరికృష్ణ ప్రియ బంధువు దూరం అవుతున్నందుకు బాధపడ్డాడు. కానీ పరిస్థితుల రీత్యా వారిరువురూ ఊర్మిళ అమ్మగారింటికి మద్రాసు వెళ్ళడమే మంచిదని తోచింది హరికృష్ణకు.


"బావా!... నీ నిర్ణయాన్ని నేను... దైవ నిర్ణయంగా భావిస్తున్నాను. పూలు అమ్మిన చోట వూరకట్టెలు అమ్మలేంగా!... నీ ఇష్టప్రకారమే జరగనీ!... అంతా పైవాడు చూచుకొంటాడు. అక్కడ నీకు తప్పక మంచిజరుగుతుంది" చిరునవ్వుతో చెప్పాడూ హరికృష్ణ.


మిత్రులు... శివరామకృష్ణ తల్లి శాంభవీ మరణాన్ని గురించి తర్వాత మూడునెలల లోపే గతించిన తండ్రి మహేశ్వర్‍ను గురించి మాట్లాడుకొన్నారు. ’వారిరువురి జీవితాల్లో... మంచీ చెడూ ఉన్నాయి. అవి మనకు మన భావి జీవితాన్ని గడిపేటందుకు మార్గదర్శకాలవుతాయి. మనుషులు పోయారు. చరిత్ర మాత్రం మిగిలింది’ అనుకొన్నారు.


ఒక ఆగంతకుడు పరుగున వచ్చి... ’రుక్మిణమ్మగారు పడిపోయారు’ అనే వార్తను వారికిచెప్పి వెళ్ళిపోయాడు.


నలుగురూ కైలాసపతి ఇంటికి పరుగుతీశారు. ఆ వూరిలో శాంభవి తర్వాత రుక్మిణమ్మకు అంతే మంచిపేరు వుంది. వాకిట నిలబడి వున్న ప్రజాపతి వీరిని చూచి ముఖం చిట్లించి వేరే దిశకు తిరిగాడు.


ప్రణవి.... వారి సాదరంగా లోనికి ఆహ్వానించింది. స్థానిక వైద్యుడు రుక్మిణమ్మగారికి కాలు విరిగిందని తేల్చి చెప్పాడు. ఆ మాట కైలాసపతికి సమ్మెటదెబ్బలా తగిలింది. ఎంతో ఆవేదనకు గురి అయ్యారు.


శివరామకృష్ణ, హరికృష్ణ వారిని ఓదార్చారు.


"చీమకు కూడా కీడు చేయని రుక్మిణికి ఈ శిక్ష ఏమిటిరా!..." ఆవేదనతో కన్నీరు కార్చాడు కైలాసపతి.

"నాయనా!.... శివా.... హరీ!... నాకు అనిపిస్తూ వుంది. సమయం ఆసన్నమయింది. కాలు విరగడం అనేది ఒక మిష. వాడు... ఆ ప్రజాపతి మా కడుపున చెడబుట్టాడు. లావణ్యను తన మిత్రుడు పరంజ్యోతికి ఇచ్చి పెళ్ళిచేయలేదని వాడికి మామీద కక్ష, ద్వేషం. ఎక్కడ హరికృష్ణ!... ఎక్కడ పరంజ్యోతి!... రౌడీ వెధవ. వీడూ అదే... ప్రజాపతి అలాంటివాడే, కాబట్టి మా నిర్ణయం వాడికి నచ్చలేదు. లావణ్యకు హరికృష్ణకు ఆ దేవుడు వ్రాసిపెట్టాడు. వారి వివాహం జరిగింది. పడ్డ తర్వాత శివా... మీ పెదనాన్న... ఒరేయ్ హరి... మీ మామయ్యగారు... తల్లడిల్లిపోయారు. ప్రజాపతి వచ్చి చూచి ’మెట్లమీద జాగ్రత్తగా దిగాలని తెలియదా!... ఎక్కడో చూస్తూ ఎవరితోనో మాట్లాడుతూ దిగితే యిలాగే అవుతుందని అన్నాడు’ నా నడతను ఆక్షేపించాడే కానీ... ’అమ్మా!.... పడ్డావు కదే... దెబ్బ తగిలింది కదే అని బాధతో కూడిన మంచిమాటను వాడు పలకలేకపోయాడు.


నేను వారూ... వాడిని, లావణ్యనూ ఒకేలాగ పెంచామురా!.... కానీ వాడి బయటి సహవాసం మంచిదికాని కారణంగా మానవత్వాన్ని వదలి... పెడసరంగా తయారైనాడు. మొక్కై వంగనిది మానై వంగుతుందా!... ఈ కష్టకాలంలో నాకు ఆనందాన్ని ఇచ్చే అంశం ఏమిటో తెలుసారా!... నా కోడలు నెల తప్పింది. శివరామకృష్ణా... నీ భార్యా నా పెద్దకోడలు ఊర్మిళ... ఈ హరికృష్ణ ఇల్లాలు... నా కూతురు లావణ్య గర్భవతులైనారు. మన వంశాలకు వారసులను ఇవ్వబోతున్నారు. ఆ పుట్టేది ఆడో... మగో.... వారిని చూడాలనే ఆశ తప్ప ఇక నాకు ఏ ఆశా లేదురా!..." ఎంతో దీనంగా బాధతో చెప్పింది రుక్మిణి.


"అమ్మా!.... నీకేం కాదమ్మా!.... భయపడకు బాధపడకు. నీవు నీ మనవళ్ళను, మనుమరాళ్ళను తప్పక చూస్తావు. మాట్లాడకుండా విశ్రాంతి తీసుకో అమ్మా!" తల్లి ప్రక్కన కూర్చొని ఆమె నుదిటిపై రేగిన తలవెంట్రుకలను సవరిస్తూ చెప్పింది లావణ్య. ఎప్పుడూ పార్వతీమాతలా నవ్వుతూ ఇంట్లో తిరుగుతూ కుటుంబ సభ్యుల అవసరాలను తీరుస్తూ... వీధిలో నడిచేటప్పుడు ఇరుగు పొరుగు వారి క్షేమ సమాచారాలను విచారిస్తూ... వారికి కావలసిన సాయం చేస్తూ మరో శాంభవిగా (శివరామకృష్ణ తల్లి) పేరు తెచ్చుకొన్న రుక్మిణమ్మ... కదలలేని స్థితిలో మంచం పట్టింది.


"పెదనాన్నా!... పెద్దమ్మను పుత్తూరు తీసుకుని వెళ్ళి కట్టు కట్టించుకొని వద్దాం. ఏమంటావు!..." అన్నాడు శివరామకృష్ణ.


"అవును మామయ్యా!.... శివ చెప్పింది మంచి సలహా వెళ్ళివద్దాం" అన్నాడు హరికృష్ణ.

"సరేరా!... మీ ఇష్టం వచ్చినట్లు చేయండి" అన్నాడు కైలాసపతి.


శివరామకృష్ణ... హరికృష్ణ... లావణ్యలు రుక్మిణమ్మను పుత్తూరుకు తీసుకొని వెళ్ళారు. కట్టు కట్టించారు. మూడువారాల తర్వాత రావాలని వారు చెప్పారు.


"అయ్యా!... వీరు మా అత్తయ్యగారు. వయస్సులో పెద్దవారు... అంత దూరాన్నుంచి మరోసారి ఇక్కడికి ఆమెను మేము తీసుకొని రావడం కష్టతరం. మీరు చెప్పిన సమయానికి మేము మీ వద్దకు వస్తాము. మాయందు దయ వుంచి మీరు మాతో మా వూరికి వచ్చి వారికి కట్టుకట్టండి. మీకు ఇవ్వవలసిన సొమ్మును మీకు చెల్లిస్తాము. ఇప్పుడు వచ్చేటప్పుడే వారు ఎంతగానో కష్టపడ్డారు. రక్తసంబంధం కదా!.... ఆమె బాధను మేము చూడలేకపోతున్నాము. మాయందు దయ వుంచి మా విన్నపాన్ని చిత్తగించండి" ఎంతో వినయంతో రామకృష్ణ చెప్పిన మాటలను వారు సమ్మతించారు. రుక్మిణి... లావణ్య... హరికృష్ణ... శివరామకృష్ణ వూరికి తిరిగి వచ్చారు.


అనుకొన్న మాట ప్రకారం హరికృష్ణ పుత్తూరు వెళ్ళి వైద్యులతో తిరిగి వచ్చారు. మూడునెలల్లో... మరో రెండు కట్లు వారు రుక్మిణీకి కట్టారు. ఆమె బాధ తీరి... మెల్లగా చేతికర్ర సాయంతో రుక్మిణమ్మ నడవసాగింది. ఆమె కాలు విరిగిన నాటినుండి ఆమెకు స్థిమితం కలిగే వరకూ... లావణ్య, ప్రణవి ఆమెకు ఎంతో సాయం ఒకరు మారితే ఒకరు ఆమె ప్రక్కనే వుండేవారు.


అత్తగారి సేవలో అతిగా శ్రమించిన కారణంగా ప్రణవికి మూడవనెల ప్రారంభంలో గర్భస్రావం జరిగింది. ఆ వార్త రుక్మిణమ్మను కృంగదీసింది. కైలాసపతి, హరికృష్ణ, లావణ్య, శివరామకృష్ణ, ఊర్మిళకు బాధపడ్డారు. తన వదిన ప్రణవికి లావణ్య అండగా నిలబడింది.


నెలరోజుల తర్వాత శివరామకృష్ణ, ఊర్మిళలు మద్రాస్‍కు వెళ్ళిపోయారు. వారు అక్కడికి చేరిన ఆరుమాసాలకు ఊర్మిళ కవల పిల్లలను కన్నది. ఆడ, మగ.


ఆ పిల్లలు నామకరణ మహోత్సవానికి కైలాసపతి, రుక్మిణమ్మ, హరికృష్ణ, లావణ్యలు మద్రాసుకు వెళ్ళారు. వారిని చూచి శివరామకృష్ణ, ఊర్మిళలు ఎంతగానో సంతోషించారు. ఆ బిడ్డలకు వారు వైశాలి, చంద్రశేఖర్ అని నామకరణం చేశారు. ఊర్మిళ తాతగారు వెంకటరమణ అందరి బంధువుల విషయంలో ఎంతో ఆదరాభిమానాలతో వర్తించారు.


కైలాసపతి మద్రాసుకు బయలుదేరే ముందు ప్రజాపతిని రమ్మని పిలిచాడు. ప్రజాపతి ’నేను రాను మీరు వెళ్ళిరండి’ అన్నాడు. ఊర్మిళ ప్రసవించిన మూడునెలలకు లావణ్య మొగ శిశువుకు జన్మనిచ్చింది. వారు ఆ బిడ్డకు దినకర్ అనే పేరు పెట్టారు.


ఐదు సంవత్సరాలు ఆ కుటుంబాల మధ్యన ఎంతో ప్రశాంతంగా సాగిపోయాయి.

అప్పటికి లావణ్య ముగ్గురు బిడ్డల తల్లి. దినకర్, వాణి, ఈశ్వర్. విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగబోతున్నదనే విషయాన్ని విని.... విశాఖకు వెళ్ళి పరిసరాలను చూచి వచ్చిన శివరామకృష్ణ తన భార్యా బిడ్డలతో... వ్యాపారరీత్యా మద్రాస్ నుండి విశాఖపట్నం వెళ్ళిపోయాడు.

అప్పటికి వారికి నలుగురు సంతానం... చంద్రశేఖర్... రాఘవ... వైశాలి... శారద.


వారు వైజాగ్ వెళ్ళిన మరు సంవత్సరంలో చివరి ప్రసవంగా ఊర్మిళ విష్ణుకు జన్మనిచ్చింది. అతడు పుట్టుకతోనే గుడ్డివాడు.


ప్రజాపతికి తనకు ప్రణవి మూలంగా సంతానం కలుగనందుకు మరో వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చి తల్లిదండ్రులతో ప్రస్తావించాడు. కైలాసపతి, రుక్మిణమ్మలు అతని నిర్ణయాన్ని అంగీకరించలేదు.


ఆ కారణంగా ప్రజాపతి అడ్డదారుల్లో నడిచేవాడు. విషయాన్ని విన్న కైలాసపతి....


"సంతానప్రాప్తం అనేది దైవ నిర్ణయానుసారంగా జరిగేది. నా కోడలికి ఏం తక్కువరా! ఆమె వయస్సు ఎంత?... ఇకపై సంతానం కలుగబోదని నీవెలా నిర్ణయించగలవు. చెడు తిరుగుళ్ళు మాని ప్రణవితో సంసారం చెయ్యి. దైవాన్ని నమ్ము, ఆరాధించు. త్వరలో మీకు సంతానం కలుగుతుంది.

చెబుతున్న విషయాన్ని జాగ్రత్తగా విను. నీకు ఇద్దరు సంతానం కలిగే యోగం ఉంది. నా మాటను నమ్ము" అనునయంగా చెప్పాడు కైలాసపతి.


తన ప్రవర్తన... తండ్రి చెవికి సోకినందుకు తాత్కాలికంగా ప్రజాపతి తన అలవాట్లను మానుకొన్నాడు. ప్రణవి దరికి చేరాడు. దాదాపు తన వయస్సు వారే అయిన లావణ్యకు ముగ్గురు బిడ్డలు. ఊర్మిళకు నలుగురు సంతానం కలగడం, తనకు ఆ గర్భస్రావం తర్వాత మరో గర్భం రాకపోవడంతో... ఎక్కువ సమయం దైవ చింతనతో.... అత్తామామల సేవలతో కాలం గడిపేది ప్రణవి. ఆమె ఆవేదనను గమనించిన రుక్మిణమ్మ ’తల్లీ!... బాధపడకు. నీ పూజలు, వ్రతాలు, దీక్షలు తప్పక ఫలిస్తాయి’ అని ఎంతో ఆదరాభిమానాలతో చెప్పి ప్రణవిని ఓదార్చేది. ఆమె మొర ఆ దేవుడు ఆలకించాడు. ఊర్మిళకు ఐదవ గర్భం నిలబడిన మరుసటి నెలలో ప్రణవి గర్భం దాల్చింది. విష్ణు ఊర్మిళకు ఐదవ సంతతి. దీప్తి ప్రణవి మొదటి సంతతి. వారిరువురికి వయస్సులో తేడా మూడునెలలు. 


తొలిసారి తమ ఇంట ఆడబిడ్డ పుట్టినందుకు కైలాసపతి, రుక్మిణి, ప్రణవి, ప్రజాపతి ఎంతగానో సంతోషించారు. దీప్తి పుట్టిన పదిహేను నెలలకే ప్రణవి మగబిడ్డను ప్రసవించింది వాడి పేరే సీతాపతి.


సీతాపతి... పుట్టిన సంవత్సరం తర్వాత... లావణ్య నాల్గవ ప్రసవాన ఆడపిల్లను ప్రసవించింది. ఆమే శార్వరి.


రెండు సంవత్సరాల లోపలే ఆడ, మగ యిరువురు బిడ్డలు జన్మించినందుకు పెద్దవారు కైలాసపతి, రుక్మిణమ్మ, హరికృష్ణ, లావణ్యలు ఎంతగానో సంతోషించారు. వ్యాపారాభివృద్ధిలో మునిగిపోయిన శివరామకృష్ణ కైలాసపతికి శుభాకాంక్షలతో జవాబు వ్రాశాడే కాని... ఆ కార్యాలకు రాలేకపోయాడు.

తనని నిర్లక్ష్యం చేశాడని ప్రజాపతి శివరామకృష్ణ మీద పంతం పెంచుకొన్నాడు. ’అనివార్య కారణాల వలన రాలేకపోయి వుండవచ్చు. వుత్తరం వ్రాశాడుగా!’ అన్న హరికృష్ణ మాటలు ప్రజాపతి చెవులకు ఈటెలవలె సోకాయి.


’చిన్నప్పటి నుంచీ చూస్తూనే వున్నాను. వీడు వాడి అభిమాని... అందుకే వాడిని సమర్థించి మాట్లాడుతున్నాడు. వీడికి నేనంటే గిట్టనట్లే. పైకి నటిస్తూ నవ్వుతూ నటిస్తాడు. నా చెల్లెలిని వీడికి కట్టబెట్టినందు వలన పెద్దవాళ్ళు బాధపడతారని వీడితో మాట్లాడవలసి వస్తూ వుంది. వాళ్ళు... అమ్మానాన్నలు, లేకుంటే... నాకు వీడితో మాట్లాడవలసిన అవసరం ఏముంది?’ అనుకొన్నాడు ప్రజాపతి.


పిల్లలు ఎదిగారు. స్కూళ్ళకు పోసాగారు. ఆ తరం పెద్దలుగా మిగిలిన కైలాసపతి, రుక్మిణమ్మలకు వయోభారం పెరిగింది. ఎంతో జ్ఞాని అయిన రుక్మిణమ్మ ఒకరోజు రాత్రి తన భర్తతో "ఏమండీ!... మనం వచ్చిన పనులన్నీ పూర్తయినాయి. నా ప్రస్తుతపు కోరిక ఏమిటో తెలుసా!"

"ఏమిటి రుక్మిణీ!..."


"మీ చేతుల్లో.... పైకి వెళ్ళిపోవాలనేది!..." విరక్తిగా నవ్వింది రుక్మిణమ్మ.


"అది నీ నిర్ణయం. కానీ ఆ సర్వేశ్వరుని నిర్ణయం ఎలా వుందో!.."


"నా కోర్కెను ఆ తండ్రి మన్నిస్తాడని నాకు నమ్మకం..."


"నీవు వెళ్ళిపోతే... నేనూ నీ వెనకాలే వస్తాను రుక్మిణీ!"


చిరునవ్వు... అందులో వైరాగ్యం... గోచరించాయి రుక్మిణమ్మకు. 

"నేను మీకో మాట చెప్పాలి!"


"చెప్పు..."


"మీ శరీరతత్వం సవ్యంగా వున్నప్పుడే ఆస్థిని ప్రజాపతికి, లావణ్యకు సమానంగా పంచి వీలునామా వ్రాసి రిజిస్టర్ చేయించి ఎవరి పత్రాలను వారికి ఇవ్వండి. మన తదనంతరం ప్రజాపతి అమ్మాయిని అల్లుణ్ణి గౌరవంగా చూచుకుంటాడనే నమ్మకం నాకు లేదు" విచారంగా చెప్పింది రుక్మిణమ్మ.

"ఆ ఏర్పాటన్నీ సవ్యంగా చేశాను" చిరునవ్వుతో చెప్పాడూ కైలాసపతి.


"అలాగా! మంచిపని చేశారు. ఈ రోజు నేను మీ మంచం మీదనే పడుకొంటానండి"


ప్రాధేయపూర్వకంగా అడిగింది రుక్మిణమ్మ.

"అమ్మాయిని పిలిపించనా!..."


"ఈ నిశిరాత్రిలో ఎందుకండీ!.... తెల్లవారి తనే వస్తుందిలే!....." వాలిపోతున్న కనురెప్పలను బలవంతంగా పైకి లేపి చెప్పింది రుక్మిణమ్మ.


తన చేతిలో రుక్మిణమ్మ చేతిని... నొసటిని తాకి చూచాడు కైలాసపతి.


బలవంతంగా కనురెప్పలను మరోమారు పైకెత్తి... తన చేత్తో కైలాసపతి చేతిని పట్టుకొని "ఏమండీ!... నా కథ ముగియబోతూ వుంది. మీరు... మీ...రు...జా...గ్ర...త్త!" పైకి లేచిన కళ్ళు క్రిందికి వాలిపోయాయి. ఆమె శరీరం చల్లగా మారిపోయింది. రుక్మిణమ్మ ఆశయం నెరవేరింది. తలను... చేతులను... కాళ్ళను మరోసారి ఆత్రంగా తాకి... విషయాన్ని గ్రహించిన కైలాసపతి...


"రుక్మిణీ!.... నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావా!" భోరున ఏడుస్తూ తన తలను ఆమె తలకు చేర్చాడు కైలాసపతి.


సమయం... రాత్రి పన్నెండు గంటలు... ప్రజాపతి మద్రాస్ వెళ్ళి వున్నాడు.


తనలో తాను అరగంట ఏడ్చుకొని... మెల్లగా గదినుంచి లేచి బయటికి వచ్చి మిద్దెమీద ప్రణవి గది తలుపును తట్టాడు. తలుపు తెరిచిన.... ఆమెతో కన్నీటితో విషయాన్ని చెప్పాడు. ఇరువురూ... క్రింద రుక్మిణమ్మ (శవం) వున్న గదిలోకి ఏడుస్తూ వచ్చారు. ఆకస్మాత్తుగా... వూహించని దృశ్యాన్ని చూచిన ప్రణవి... తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఆ ఇంట తాను కాలుపెట్టిన నాటినుంచీ రుక్మిణమ్మ ఆమెను కూతురుగా చూచుకొందే కాని.. కోడలుగా ఏనాడూ చూడలేదు.


’అమ్మా ప్రణవీ!.... అమ్మా!...’అంటూ ఎంతో ప్రేమాభిమానాలతో పలకరించేది. ప్రణవి చేస్తున్న పనులకు సాయంగా నిలచి తల్లిలా మంచి సలహాలను... తన జీవిత ఆశయాలను... ఒక స్త్రీ... కుటుంబాభివృద్ధికి ఎంత ముఖ్యమనే పలు విషయాలను కన్నతల్లిలా ప్రణవికి ఆమె చెప్పేది. ఆ విషయాలనన్నింటినీ గుర్తు చేసుకొని ప్రణవి భోరున ఏడ్వసాగింది.


లావణ్యకు ఒక దుస్వప్నం వచ్చింది. అందులో ఆమెకు రుక్మిణీ నిర్యాణమే గోచరించింది. ఉలిక్కిపడి నిద్రలేచింది. భర్తను తట్టింది. హరికృష్ణ గాబరాగా లేచి కూర్చున్నాడు.

"ఏం లావణ్యా!...."


"వెంటనే అమ్మను చూడాలండి. చెడ్డ కల వచ్చింది పదండి." ఆందోళనగా చెప్పింది లావణ్య.

తన భార్యతత్వం బాగా ఎరిగిన హరికృష్ణ ఏ విషయానికి ఏనాడు ఆమె ముఖంలో తను చూడని వేదనను చూచి మారుమాట్లాడకుండా మంచం దిగి....


"పద లావణ్యా!...." అన్నాడు. అతని మనస్సు ఏదో కీడును శంకిస్తూ వుంది.


పది నిముషాల్లో ఆ దంపతులు కైలాసపతి ఇంటికి రాత్రి రెండు గంటల ప్రాంతంలో చేరారు.

ఆత్రంగా తండ్రి కైలాసపతి.... ప్రణవి వున్న గదిని సమీపించారు. ఏడ్చి ఏడ్చి వారిరువురూ సొమ్మసిల్లి పోయారు.


"అమ్మా!....." అంటూ గదిలో ప్రవేశించింది లావణ్య.


ఆమె గొంతును విని... తలను పైకెత్తి కైలాసపతి, ప్రణవి... గదిలోనికి వచ్చిన లావణ్యను, హరికృష్ణను చూచారు.


విషయం అర్థమైన లావణ్య కన్నీటితో భోరున ఏడుస్తూ తల్లి తల చెంత చేరింది. హరికృష్ణ తనను అల్లుడిలా కాకుండా సొంత కొడుకులా ఎంతో ఆదరాభిమానాలతో చూచుకొనే తన అత్త రుక్మిణమ్మ... అచేతనంగా పడి వుండడాన్ని చూచి.. కన్నీరు కార్చాడు.


ఆ ముగ్గురికీ తాను ఏమి చెప్పినా వినిపించుకొనే స్థితిలో లేరని..మామగారి ప్రక్కన కూర్చున్నాడు. ఎంతో ఆవేదనను... వారికి పంచి... అతి భారంగా ఆ రాత్రి గడిచింది.


సమయం ఉదయం ఐదు గంటల ప్రాంతం... హరికృష్ణ లేచి ప్రజాపతికి, శివరామకృష్ణకు ఫోన్ చేసి మాట్లాడేదానికి ప్రయత్నించాడు. ఇరువురూ ల్యాండ్‍లైన్ను ఎత్తలేదు.


నట్టింట చాపపరిచి... లావణ్య, ప్రణవీల సాయంతో రుక్మిణమ్మను పడుకోబెట్టారు.


పనిమనిషి.. చల్లమ్మ వచ్చి చూచింది. పరుగున వెళ్ళి ఇరుగు పొరుగు వారికి విషయాన్ని చెప్పింది.

అరగంటలోపల అందరూ ఆ ఇంట్లో ప్రవేశించారు. రుక్మిణమ్మను ఆ స్థితిలో చూచి కన్నీరు కార్చారు.

వర్తమానం పంపవలసిన వారికందరికీ మనుషులను పంపించి విషయాన్ని తెలియపరిచాడు హరికృష్ణ.


మధ్యాహ్నం... పన్నెండుగంటలకు కొందరు... రెండూ మూడు గంటల మధ్యన మరికొందరు... రావలసిన వారంతా వచ్చారు. గొప్ప పేరున్న ఇల్లాలు రుక్మిణమ్మ మరణం అందరికీ ఆవేదనను కలిగించింది. సాయంత్రం... అయిదు గంటలకు ఆమె అంతిమ యాత్రకు అన్ని సిద్ధం అయినాయి.

ఈ మధ్యన.... నాలుగు పర్యాయాలు... హరికృష్ణ ప్రజాపతికి, శివరామకృష్ణకు ఫోన్ చేశాడు. కానీ... వారు అతని కాల్స్ ను ఎత్తలేదు. ప్రజాపతి రాకకోసం అందరూ ఎదురు చూస్తున్నారు వస్తాడని.

శ్రీరంగంలో సానె ఇంట్లో ఆనందలహరిలో మునిగి తేలియాడుతున్న ప్రజాపతికి... తన తల్లి గతించిందనే వార్త తెలియలేదు. కారణం అతను అక్కడికి వెళ్ళిన విషయం అతనికి తప్ప వేరెవరికీ తెలియదు.


ప్రజాపతి రాని కారణంగా... హరికృష్ణ ఆ స్థానంలో వుండి... రుక్మిణమ్మకు చేయవలసిన అంతిమ సంస్కారాలను ఆవేదనతో... ఎంతో శ్రద్ధతో నిర్వర్తించాడు. అతనికి సాయంగా మాధవయ్య నిలిచాడు.


ఎవరికి తోడు ఎవరు ఎంతవరకో!... కన్నకొడుకు వున్నా అంతిమ సమయానికి... అతను ఆ తల్లికి ఏమికాని... ఏమీ చేయలేని వాడుగా ప్రజాపతి తన లోకంలో వుండిపోయాడు. హరికృష్ణ చేతుల మీదుగా ఆ పండు ముత్తయిదువు బండెడు పూలు... పసుపు కుంకులమతో స్మశానపు వైపుకు బంధుమిత్రులతో హరి జనంతో బయలుదేరింది.

========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


52 views0 comments

Comments


bottom of page