top of page

మనుషులు మారాలి ఎపిసోడ్ - 8




'Manushulu' Marali Episode 8'  - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 11/12/2023

'మనుషులు మారాలి ఎపిసోడ్ - 8' తెలుగు ధారావాహిక 

రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


సుప్రజ, మాధవి, నీరజ ఒకే ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటారు. ఒకరి కష్టసుఖాలు మరొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు.


సుప్రజ ఆడపడుచు సరళ, భర్త మీద అలిగి వచ్చేస్తుంది. సుప్రజ భర్త మోహన్, తన బావతో అక్క సరళ గురించి మాట్లాడతాడు. 


నీరజ వంటను ఇంట్లో అందరూ మెచ్చుకున్నా అత్తగారు మాత్రం మెచ్చుకోరు. భర్త వేణుకు ఆ విషయం చెబుతుంది నీరజ.


సుప్రజ అత్తగారు ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. మాధవి మరిది రమేష్ తలిదండ్రులని తనతో తీసుకొని వెళతాడు. వెళ్ళినప్పటినుండి డబ్బులు చాలడం లేదని మాధవి భర్త శేఖర్ ని సహాయం అడుగుతూ ఉంటాడు. కొద్ది రోజులకే మాధవి విలువ తెలిసివచ్చింది ఆమె అత్తగారు ప్రసూనాంబకి.


జరుగుతున్న విషయాల గురించి కొడుకు రమేష్ తో ఆవేశంగా మాట్లాడుతాడు ప్రసాదరావు.

తిరిగి మాధవి దగ్గరకే వస్తారు వాళ్ళు.


ఇక మనుషులు మారాలి - ఎపిసోడ్ 8 చదవండి.. 


ఆ రోజు సుప్రజ ఆఫీస్ లో పని ఎక్కువ ఉన్న మూలాన సాయంత్రం ఇంటికొచ్చేసరికి బాగా లేట్ అయింది. సుప్రజ ను చూడగానే అత్తగారు “వచ్చావా సుప్రజా, తల పగిలిపోతోందమ్మా, కాస్త కాఫీ పెట్టి ఇస్తావా” అనే సరికి తెల్లబోయి చూసింది. మరో మాట మాట్లాడకుండా అత్తగారికి వేడి వేడి కాఫీ తో బాటు రెండు బిస్కట్లు కూడా ఇచ్చింది. అసలు కే సుగర్ పేషెంట్, నీరసంగా ఉన్న మూలాన గబ గబా బిస్కట్లు తిని కాఫీ తాగింది. 


“ఆ రాక్షసి..” అంటూ అటూ ఇటూ చూస్తూ, “కాస్త కాఫీ పెట్టివ్వవే సరళా అంటే ‘ఇవాళ కాఫీ అంటావు, రేపు వంట చేయమంటావు. ఇంక నీ కోడలు మొత్తం పని నామీద అంటగట్టేసి టింగురంగ మంటూ ఆఫీసుకి వెళ్లిపోతుంది. వచ్చాక తన చేతే పెట్టించుకో’మంటూ పక్క వాళ్లింటికి పెత్తనానికి వెళ్లిపోయింది. చిన్న పిల్లవు, ఇంటి పనంతా చేసుకుంటూ అన్నీరెడీ చేసి ఆఫీసుకు వెళ్లి వస్తున్నావు. నిన్ను చూసైనా దానికి బుధ్దివస్తుందేమో అనుకుంటే ఆ ఆశ కూడా పోతోంది. భర్తతో హాయిగా సంసారం చేసుకోకుండా ఇదేమైనా బాగుందా సుప్రజా? నేను ఏదైనా గట్టిగా కోప్పడితే ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనన్న భయం ఒకటి”. 


“పోనీలెండి అత్తయ్యా, మీరేమీ అనద్దు. ఏదో ఒకనాటికి సరళ వదినలో మార్పు వస్తుంది లెండి. మీరు దిగులు పడితే బి. పి, సుగర్ ఎక్కువ అవుతుంది. అసలుకే గుండె వీక్ గా ఉందని సంతోషంగా ఉండమని డాక్టర్ చెప్పలేదా? వంట చేసేస్తాను, లేట్ అయిం”దంటూ చీర మార్చుకోడానికి తన గదిలోకి వెళ్లిపోయింది సుప్రజ. 


అంతక మునుపే పక్కింటి నుండి వచ్చిన సరళ వారిరువురి మాటలూ వింది. ఏమీ తెలియనట్లు, అప్పుడే వచ్చినట్లుగా లోపలికి వచ్చింది. 


రెండు రోజుల నుండి సరళ ఎందుకో ముభావంగా ఉంటోంది. సుప్రజతో ఎప్పుడూ మాటలు తక్కువే అయినా తల్లితో వసపిట్టలా ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది. సుప్రజ తెల్ల వారుఝామునే లేచి ఇంటి పనులన్నీ చేసుకుంటూ అత్తగారికి కావలసినవన్నీ చేసిపెట్టడం, భర్తకు లంచ్ బాక్స్ కట్టివ్వడం, పిల్లలను ఓపికా తయారుచేసి వాళ్ల చేత తినిపించడం అవీ చూస్తూనే ఉంది. ముఖ్యంగా సుప్రజ అత్తగారిపట్ల చూపించే గౌరవం, ప్రేమ సరళ మనస్సులో ఏదో తెలియని ఒకలాంటి అపరాధ భావం ఏర్పడ సాగింది. 


చుట్టు పక్కల ఇళ్ల వాళ్లు తనను చూస్తూనే మాటలు ఆపేయడం, ఆ మధ్య సుప్రజ తల్లీ తండ్రీ సుప్రజను చూడడానికి వచ్చారు. తనను చూడగానే ‘ఏం సరళా బాగున్నావామ్మా, మీ ఆయన ఎలా ఉన్నారు, పిల్లలు పెద్దవాళ్లు అయ్యారే’ అంటూ అభిమానంగా పలకరించేసరికి ఊ.. ఆ.. అంటూ తలూపిందేగానీ సరిగా మాట్లాడలేకపోయింది. 


తనకు పిల్లలను తీసుకుని భర్త దగ్గరకు వెళ్లిపోవాలనే ఉంది. కాని భర్త తనని ఇంటిలో కాలు పెట్టనీయడు. సహజంగా ఎంతో శాంతంగా ఉండే రాఘవ్ ఏదైనా తనకు నచ్చనది జరిగితే మాత్రం చాలా పట్టుదలగా ఉంటాడు. ప్రేమకు అభిమానానికి ప్రాణం పెట్టే వ్యక్తి, అలాగే ముక్కు సూటిగా ఉంటాడు. ఏవో ఆలోచనలు తన మెదడు చుట్టూ ఆవరిస్తుంటే అన్యమనస్కంగా గడుపుతోంది ఒకటి రెండురోజుల నుండి. 


ఆ రోజు ఉదయం సుప్రజా, మోహన్ ఆఫీసులకు పిల్లలు స్కూల్లకూ వెళ్లిపోయారు. సరళ స్నానం చేసి తయారయ్యింది. తల్లి దగ్గరకు వచ్చింది. 


“అమ్మా” అన్న పిలుపుకు తలెత్తి చూసిన వరలక్ష్మి కూతురు ఎక్కడికో వెళ్లడానికి తయారవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. 


“ఏంటి సరళా” అనేసరికి కళ్లమ్మట నీళ్లు పెట్టేసుకుంది. 

“నేను వనస్తలిపురం వెడుతున్నాను. ఒకసారి మా అత్తగారు ఎవరితోనూ ఫోన్ లో చెబుతుండగా విన్నాను. ఆవిడ ఆప్తమిత్రురాలు శాంతమ్మ గారు వనస్తలిపురం లో శిరిడి సాయి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నారని అక్కడ బాగుందట అని చెప్పగా విన్నాను”. ఒక వేళ మా అత్తగారు అక్కడ ఉన్నారేమోనన్న అనుమానంగా ఉంది. ప్రయత్నిస్తాను అక్కడ. అదృష్టవశాత్తూ అక్కడే ఉంటే కాళ్లమీద పడి క్షమార్పణ చెప్పి తీసుకొస్తాను”. సరళ దుఖంతో మాటలాడలేకపోతోంది. 


“మరి మరి ఈ విషయం మీ ఆయనకు అప్పుడే ఎందుకు చెప్పలేకపోయావే పిచ్చిదానా”?


“నాకు నిన్న రాత్రి నిద్ర పట్టక ఆలోచిస్తుంటే సడన్ గా గుర్తొచ్చిందమ్మా”.

 

“వెంటనే కేబ్ లో వెళ్లవే సరళా”. 


“అమ్మా! అప్పుడే ఈ విషయం ఎవరికీ చెప్పకు. ఆవిడ అక్కడ ఉండాలి కదా. ఏదో నా ప్రయత్నం నేను చేస్తాను”. 


 ##


సరళ ఊహించినట్లుగా వరలక్ష్మి గారు అక్కడే ఉన్నారు. సరళను చూస్తూనే ఆశ్చర్యపోయారు.

 

“ఏంటి సరళా, ఇలా వచ్చావ్, నేను ఇక్కడ ఉన్నానని ఎలా తెలిసింది? రాఘవ పిల్లలు బాగున్నారా?” ఆవిడ ముఖంలో కంగారు, ఆత్రుత ద్యోత్యమౌతోంది. 


“అందరూ బాగానే ఉన్నాం అత్తయ్యా. మీరు ఇంటికి వచ్చేయాలి. మీరు రానంటే నా మీద ఒట్టు”. సరళ దుఖంతో ఆవిడ చేతులు పట్టేసుకుంది. 


“మీ అబ్బాయి మీ కోసం ఎంత వెతుకుతున్నారో తెలుసా? ఇంకా నయం, మీ ఉత్తరం ఆయనలో ఒక ధైర్యాన్ని కలిగించింది కాబట్టి తట్టుకుంటున్నారు. 


నన్ను క్షమించండి అత్తయ్యా, మీరు రానంటే మీ అబ్బాయి నన్ను శాశ్వతంగా వదిలేస్తారు. నేనూ పిల్లలూ దిక్కులేని వాళ్లం అయిపోతాం”. 


“రాలేను సరళా, నా మూలాన తిరిగి సమస్యలు తలెత్తితే నేను భరించలేనమ్మా. నా శేష జీవితం ఇలాగే ఇక్కడే ముగిస్తే చాలనుకుంటున్నాను”. 


“అత్తయ్యా, ఇప్పటికే సగం చచ్చి పోయి ఉన్నాను. మీరు నాతో రాందే నేను తిరిగి వెళ్లలేను. పిల్లలను తల్లిలేని దాన్ని చేయమంటారా? నేను మీయందు ఎంత అనుచితంగా ప్రవర్తించానో తలచుకుంటే నా మీద నాకే విరక్తి కలుగుతోంది. మీ కాళ్లు పట్టుకుంటాను. మీరు రానంటే నేను.... నేను సజీవంగా ఇంటికి వెళ్లలేను”. 


సరళ మాటలు శరాఘాతంలా తగిలాయి వరలక్ష్మికి. ఒక్క క్షణం ఒణికి పోయింది. సరళ ఎంత మొండి మనిషో తనకు తెలియనిది కాదు. ఆవేశంలో ఎంతటి నిర్ణయానైనా తీసుకుంటుంది. ఇంక సరళతో వాదించి ప్రయోజనం లేదు. సరళతో వెళ్లడానికే నిశ్చయించుకుంది. 


సరళతో తల్లిని చూసిన రాఘవ సంభ్రమాశ్చార్యాలకు లోనైనాడు. ఇది కలా నిజమా అనే డోలాయమానం లో ఉండిపోయాడో క్షణం. 


“లోపలకు రండత్తయ్యా, ఏమండీ మీరు కూడా ఇలా రండి. ఇది కల కాదు నిజమే మహాశయా!”


రాఘవ చూస్తుండగానే అత్తగారి పాదాలను స్పృశిస్తూ నన్ను “క్షమించండి అత్తయ్యా. మీ పట్ల ఇంకెన్నడూ అనుచితంగా ప్రవర్తించను. ఏమండీ! మీరూ నన్ను క్షమించాలి. ఎంతో సంకుచితంగా ప్రవర్తించాను. నేను గతంలో చేసిన ఎన్నో పొరపాట్లను క్షమించి నన్ను దగ్గరకు తీసుకుని అభిమానించారు. నేను పూర్తిగా మారిపోయాను. నమ్మండి. ఇంక నుండి మీరు ఒక కొత్త సరళను చూస్తా”రంటూ భర్తను కన్నీళ్లతో చుట్టేసింది. 


“లే సరళా, నీచేత క్షమార్పణ చెప్పించుకోవాలని కాదు. నీ తప్పు తెలుసుకోవాలని. ఒక్క మాట చెపుతాను విను. మీ అమ్మను మీ తమ్ముడు మరదలు చాలా గౌరవంగా చూసుకుంటున్నారు కాబట్టే ఆవిడ ప్రశాంతంగా కొడుకు దగ్గర ఉండగలుగుతోంది. మీ అమ్మకు చిన్న కష్టం వచ్చినా సహించలేని నువ్వు, పదే పదే మీ మరదలికి మీ అమ్మను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో పాఠాలు నేర్పే నీవు నీ అత్తగారి విషయం వచ్చేసరికి మాత్రం నీ ప్రవర్తన ఎంతో సంకుచితంగా ఉంటుంది. 


మనం మన కన్నవారిపై చూపించే ప్రేమా గౌరాభిమానాలు పిల్లల మనస్సులపై ఎప్పటికీ అలా నిలిచిపోతాయి. మనం వాళ్లను ప్రేమగా చూస్తే రేపు మన పిలల్లూ మనయందు ప్రేమ చూపిస్తారు. హీనంగా చూస్తే వాళ్లూ మనలనే అనుసరిస్తారని మరచిపోకు”. 

భర్త మాటలకు సరళ పశ్చాతాప భావనతో తలొంచుకుంది. 


ఆ రోజు ఆదివారం. సుప్రజా మోహన్ ల ఇల్లు కళ కళ లాడిపోతోంది. పండగ వాతావరణం కనిపిస్తోంది ఇంట్లో. రాఘవ్ తల్లితో కలసి వచ్చాడు వారింటికి. భోజనాలు అవీ అయ్యాకా అందరూ హాలు లో సమావేశమయ్యారు. 

========================================================================

ఇంకా వుంది..


========================================================================

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :  

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.








40 views0 comments
bottom of page