'Manushulu' Marali Episode 3' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 07/11/2023
'మనుషులు మారాలి ఎపిసోడ్ - 3' తెలుగు ధారావాహిక
రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
సుప్రజ, మాధవి, నీరజ ఒకే ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటారు. మాధవి తప్ప మిగతా ఇద్దరు అత్తగారి ఇంట్లో తమ కష్టాల గురించి చెబుతారు.
మాధవి తన కష్టాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
సుప్రజ ఆడపడుచు సరళ భర్త మీద అలిగి వచ్చేస్తుంది.
సుప్రజ భర్త మోహన్ తన బావతో అక్క సరళ గురించి మాట్లాడతాడు. సరళ మొండితనం గురించి చెబుతాడు అతని బావ.. తన అక్క సరళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు మోహన్.
ఇక మనుషులు మారాలి - ఎపిసోడ్ 3 చదవండి.
ఆ పరిస్తితిలో ఉన్న ఏ మగాడు మాత్రం ఏ నిర్ణయం తీసుకోగడు? కన్న తల్లిని ఎక్కడకు పంపేయగలడు? ఉన్న ఒక్క చెల్లెలు భర్తతో సింగ్ పూర్ లో ఉంది. అక్కకు ఆర్ధికపరంగా ఏలోటూ లేదు. బావగారు మంచి ఉద్యోగంలో ఉన్నారు. సొంత ఇల్లు. బాధ్యతలు లేవు. డభై అయిదేళ్లు దాటిన అత్తగారితో తగువులు పెట్టుకుంటుంది.
భర్త ఏదో ఆలోచిస్తూ మౌనంగా బట్టలు మార్చుకుంటుంటే ఏమిటీ రోజులా లేరు, అదోలా ఉన్నారేంటంటూ సుప్రజ ప్రశ్నించింది.
“మా అక్క గురించే సుప్రజా. సాయంత్రం బావగారిని కలిసాను. అక్క పోట్లాట పెట్టుకుని ఇక్కడకు వచ్చేసిందని చాలా బాధపడుతున్నాడు. మీ అమ్మగాని నేను గాని ఎవరో ఒకరే ఉండాలి మీతో. ఆలోచించుకోండంటూ వచ్చేసిందిట.
ప్రతీసారీ బ్రతిమాలి నచ్చ చెప్పి ఇంటికి తీసుకువెళ్లడంతో నన్ను లెక్క చేయడంలేదు మీ అక్క. ఈసారి ఏదో నిర్ణయం తీసుకున్న తరువాతే మీ అక్కను కలుస్తానన్నాడు బావ”.
“అవునండీ పాపం అన్నయ్యగారి తప్పేమీ లేదు”.
“అవును సుప్రజా. నాకూ అదే అనిపించింది. ఈ లోగా అక్కతో అనవసరంగా మాట్లాడి నోరు జారకు. నీవు ఎప్పుడూ ఎలా ఉంటావో అక్కతో అలాగే ఉండు”.
“అయ్యో మీరు చెప్పాలా మోహన్? నాకు తెలియదా? వదినగారిలో మార్పు వచ్చి చక్కగా సంసారం చేసుకుంటుంటే సంతోషించేది అందరికంటే నేనే”.
“నాకు తెలుసు సుప్రజా. నీ స్వభావం, సంస్కారం తెలియని వాడిని కాను. నిన్ను భార్యగా పొందిన నేను అదృష్టవంతుడిని సుమా” అంటూ సుప్రజను దగ్గరకు తీసుకున్నాడు.
----
ఆరోజు నీరజ ఆఫీస్ నుండి వస్తూ దారిలో అరటిపువ్వులు కనిపిస్తే కూర చేసుకోవచ్చని రెండు అరటిపువ్వులు కొంది. నీరజ వంటలు బాగా చేస్తుంది. ఇటు సాంప్రదాయ వంటలూ అటు నార్త్ ఇండియన్ వంటలూ అవీనూ. తన పుట్టింట్లో ఎక్కువ సాంప్రదాయ వంటలకు ప్రాధాన్యమిస్తారు. ఇప్పటికీ బామ్మ మడి గట్టుకుని చక చకా వంటలు చేసేస్తుంది. ఎనభై అయిదేళ్ల బామ్మ కూర పోపులూ, పులుసు పోపులన్నీ తనే పెడ్తుంది. అమ్మ కూరలు కోసిచ్చి కుక్కర్ లో అన్నం పప్పు పెడుతుంది. ఆవ పెట్టిన పులుసులు, కూరలు, రోటిపచ్చళ్లూ అవీ బామ్మ చాలా చులాగ్గా చేసి పడేస్తుంది.
అత్తా కోడళ్లిద్దరూ ఎంతో అన్యోన్యంగా కబుర్లాడుకుంటూ వంట చేసేస్తారు. అమ్మ వంట చేసినప్పుడు బామ్మ “ ఏమే పూర్ణా అల్లం పెట్టి చేసిన ఈ వంకాయ ముద్దకూరలో చిట్టి వడియాలు బాగున్నాయే అంటూ అభిమానంగా చెపుతుంది”. మొన్న అమ్మ ఫోన్ చేసినప్పుడు “ఏమే నీరజా, ఈరోజు బామ్మ రోట్లో కంది పచ్చడి చేసింది. అరకిలో కంది పప్పు వేయించి కమ్మగా చేస్తే అంత పచ్చడీ హుళక్కి అయిపోయింది. దానిలోకి తెల్లటి మెట్టవంకాయలు పెద్దవి కాల్చి పచ్చిపులుసు చేసిందే”..
అమ్మ అలా చెపుతుంటే తనకి నోట్లోంచి నీళ్లు కారిపోయాయి. అమ్మ వాళ్లది గోదావరి జిల్లా. రాజమండ్రీ లో ఉంటారు.
ఇక్కడ అత్తవారింటో వీళ్ల వంటలన్నీ వేరు. అమ్మా వాళ్లింట్లోలాగ రక రకాలుగా వండుకోరు. ఎప్పుడూ ఒకే రకం వంటలు. తనకు ఎన్నో చేయాలని, అత్తగారూ వాళ్లూ తన వంటని మెచ్చుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో అత్తగారు తనకు పూర్తి స్వతంత్రం ఇవ్వరు. ఏదైనా కూర ఇలా చేద్దాం అనుకునేంతలో అత్తగారు వచ్చేసి అందుకునేసరికి తన ఆశ అడుగంటుతుంది.
అరటి పువ్వులను చూడగానే నీరజ అత్తగారు సరోజిని "అబ్బా ఇవా, ఇహ అయినట్లే, ఈ చచ్చు కూర ఎవరు తింటారు? ఇంక మార్కెట్ లో కూరలే దొరకలేదా మేడమ్ గారికి” కాస్త వ్యంగం జోడిస్తూ మాట్లాడుతున్న మాటలకు నీరజ ముఖం మాడిపోయింది.
అయినా తమాయించుకుంటూ “ఇటువంటి కూరలు చాలా మంచివి అత్తయ్యగారూ, ముఖ్యంగా మీలా డయాబెటిస్ ఉన్నవాళ్లకు. ఎప్పుడూ తినే కూరలే కాకుండా అప్పుడప్పుడు ఇటువంటివి కూడా తినమని డాక్టర్లు చెపుతున్నారు కదా”.
నీరజ మాటలకు వెంటనే ఆవిడ “వీటితో కూర వండుకుంటారని తెలుసుగానీ నేనెప్పుడూ చేయలేదు”.
“ఫరవాలేదు అత్తయ్యగారూ, నేను చేస్తాను కదా, మీరు చూస్తూ ఉండండి. మరోసారి మీరే చేసేయగలరు’.
ఏ కళనుందో సరోజిని సరేనంది. నీరజకు ఆ ఇంట్లో పూర్తి స్వేఛ్చను ఇవ్వకపోవడానికి ముఖ్యకారణం నీరజ వచ్చాకా తన ప్రాపకం ఎక్కడ తగ్గి పోతుందోనన్న ఒక లాంటి భయం ఆవిడకు. ఎందుకంటే నీరజ చాలా చురుకైనది. వంటలే కాదు, అన్ని పనులూ చాలా నీట్ గా చేస్తుంది. పదిమందికి సునాయసంగా ఒక్కర్తీ వంట చేసి పెట్టేయగలదు.
చక చకా అరటి పువ్వు ఒలిచి శుభ్రం చేసింది. అవ పెట్టి కూర చేసింది. కంది పప్పు దోరగా వేయించి కమ్మని పచ్చడి చేసింది. అందులోకి వంకాయలు కాల్చి పచ్చి పులుసు చేసి, అప్పడాలు వేయించి అందరినీ భోజనాలకు పిలిచింది.
నీరజ వంట అమోఘంగా ఉందని ఇంట్లో అందరూ ఒక్క మెతుకు కూడా మిగలకుండా తినేసారు. అత్తగారి ముఖం మాత్రం ముడుచుకు పోయి ఉంది.
"ఎలా ఉంది అత్తయ్యా కూర” అనగానే ఆవిడలోని ఒక లాంటి అసూయ బైటకు వచ్చేసింది.
“ఏమో నాకంత రుచిగా అనిపించలేదు. వగరుగా ఉంది కూర. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా మీ మామగారికీ, మీ ఆయనకూ నచ్చి ఉండచ్చు’.
అత్తగారి మాటలు శరాఘాతంలా తాకాయి నీరజ మనసుకి.
‘ఛ ఏమిటి ఈవిడ? చాలా మంది తమ కోడళ్లు ఏమీ చేయరని తామే అంత చాకిరీ చేస్తున్నామని ఈ వయస్సులో కూడా అని చెపుతూ బాధపడ్తారు. కానీ తాను అత్తగారిని కూర్చోపెట్టి చేస్తానన్నా ఈవిడ తనను చేయనీయదు. అది ప్రేమా అనుకుంటే పొరపాటే. ప్రేమ కాదు, ఈ ఇంట్లో ఆవిడ ప్రాముఖ్యం తగ్గిపోతుందేమోనన్న భయం. మనుషులలో ఎన్ని రకాల మనస్తత్వాలు? తన పుట్టింట్లో వదిన అస్సలు పూచిక పుల్ల కూడా అటు తీసి ఇటు పెట్టదు.
పైగా తను ఉద్యోగస్తురాలినన్న అహం ఒకవైపు. అయినా అమ్మ ఎంత శాంతంగా ఇంట్లో పనులన్నీ ఒక్కర్తీ చేసుకుంటుంది? అది చూసే తను వదినలా ఉండకూడదని నిశ్చయించుకుంది. అత్తగారికి కుడి భుజంలా ఉంటూ తను ఆఫీస్ కు వెడుతున్నా ఇంట్లో తన బాధ్యతలను నెరవేర్చాలని అత్తగారికి శ్రమ కలగనీయకూడదనుకుంటే ఇక్కడ ఈవిడ తను చేస్తుంటే కొంపలు ములిగిపోయేటట్లు వాలిపోతుంది. పైగా ఎప్పుడూ అవే వంటలు. నోటికి రుచీపచీ ఉండవు’.
ఒక రోజు రాత్రి భర్త వేణు కు భోజనం వడ్డిస్తూ ప్రశ్నించింది. అత్తగారూ మామగారూ విజయవాడ లో ఎవరిదో బంధువుల ఇంట్లో పెళ్లి ఉంటే వెళ్లారు. మరిది తన రూమ్ లో చదువుకుంటున్నాడు.
“అరటికాయ వేపుడు సాంబారు ఎలా ఉన్నాయి వేణూ?”
“బాగానే ఉన్నాయి నీరూ. అయినా వంటల్లో స్పెషలిస్ట్ వి. ఎందుకు బాగుండవు? ఎందుకొచ్చింది సందేహం?”
“సందేహం కాదు. నాకు మీకందరికీ రక రకాల వంటలు చేసి పెట్టాలనిపిస్తుంది. కానీ నాకు ఆ అవకాశం రావడంలేదు”. ముఖం చిన్నబుచ్చుకుంటూ మాట్లాడుతున్న నీరజ వైపు చూసాడు.
నిజమే, నీరజ వంటే కాదు. ఇంట్లో ప్రతీ పనీ ఎంతో శ్రధ్దగా చేస్తుంది. ఓపిక ఎక్కువ.
కానీ తల్లి ప్రవర్తన తనకు తెలియనిది కాదు. కానీ ఏమనగలడు?
అమ్మా నీరజ చేస్తుందిలే అంటే తల్లికి బుస్సుమని కోపం వచ్చేస్తుంది. ఏరా భార్య వచ్చాకా నా తిండి వచ్చడంలేదా అనేస్తుంది ముఖం ఎదురుగానే. ఇలా చాలా సార్లు జరిగింది కూడా. ఇంత సిల్లీ విషయానికి మాటా మాటా పెంచడం తనకు ఇష్టం ఉండదు. నిజానికి నీరజకు బాధ్యతలు అప్పగించి అమ్మ విశ్రాంతి తీసుకోవచ్చు. నీరజ ఉద్యోగం చేస్తున్నా అన్నీ నిర్వహించుకోగలిగే సమర్ధత ఉంది. అమ్మ నీరజ పట్ల ఎందుకలా ప్రవర్తిస్తుందో అర్ధం కాదు.
వేణు మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
コメント