top of page

మనుషులు మారాలి ఎపిసోడ్ - 4


'Manushulu' Marali Episode 4' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 13/11/2023

'మనుషులు మారాలి ఎపిసోడ్ - 4' తెలుగు ధారావాహిక

రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


సుప్రజ, మాధవి, నీరజ ఒకే ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటారు. మాధవి తప్ప మిగతా ఇద్దరు అత్తగారి ఇంట్లో తమ కష్టాల గురించి చెబుతారు. మాధవి తన కష్టాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది.


సుప్రజ ఆడపడుచు సరళ భర్త మీద అలిగి వచ్చేస్తుంది. సుప్రజ భర్త మోహన్ తన బావతో అక్క సరళ గురించి మాట్లాడతాడు. సరళ మొండితనం గురించి చెబుతాడు అతని బావ.. తన అక్క సరళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు మోహన్. నీరజ వంటను ఇంట్లో అందరూ మెచ్చుకున్నా అత్తగారు మాత్రం మెచ్చుకోరు. భర్త వేణుకు ఆ విషయం చెబుతుంది నీరజ.


ఇక మనుషులు మారాలి - ఎపిసోడ్ 4 చదవండి.


మాధవి మరిది రమేశ్ చాలా తెలివైనవాడు, లౌక్యం బాగా తెలుసున్నవాడు.


“అన్నయ్య ఇంట్లో ఎన్నాళ్లు చాకిరీ చేస్తూ కూర్చుంటావమ్మా, ప్రీతి కూడా మరీ మరీ చెప్పి పంపించింది, అత్తయ్యగారిని మామయ్యగారిని మన దగ్గర పెట్టుకుందాం, వాళ్లకు ఏ కష్టమూ రాకుండా చూసుకుందామని చెపితే వచ్చాను. మీ బట్టలూ అవీ సర్దుకోండి. అన్నయ్యకూ వదినకూ నేను నచ్చ చెపుతా”నని వాళ్లతో చెప్పి అన్నగారితో మాట్లాడదామని హాల్ లోకి వచ్చాడు.


“ఏరా రమేశ్, ప్రీతి, బాబు ఎలా ఉన్నా”రంటూ శేఖర్ తమ్ముడిని ఆప్యాయంగా పలకరించాడు.


“బాగానే ఉన్నారన్నయ్యా. అమ్మా నాన్నగారిని నా దగ్గరకు తీసుకువెడదామని వచ్చాను. వాళ్లకి ఎన్నాళ్లు నా దగ్గర ఉండాలనిపిస్తే అన్నాళ్లూ ఉంటారు. పాపం ఇంతకాలం నీవు వదినా వాళ్లను బాధ్యతగా చూస్తూ వచ్చారు. నాకు కూడా వాళ్లను దగ్గర పెట్టుకుని చూసుకోవాలనిపిస్తుంది కదా”.


“అదేమిటి రమేశ్? ఎందుకనిపించదు? అసలు నీవు ప్రీతీ, బాబూ మనం అందరం ఒకే చోట కలసి ఉందామని నీతో ఎన్నో సార్లు చెప్పాను. ప్రీతి ఆఫీస్ కు ఇక్కడ నుండి వెళ్లడం కష్టం అవుతుందనేసరికి అదీ నిజమే అనుకున్నాను. అమ్మా నాన్నగారు ఎక్కడ ఉంటేనేమి? నీవు ప్రీతి బాబుతో కలసి ఎప్పుడు చూడాలని పించినా ఇక్కడకు రావచ్చు ఉండచ్చు”.


ఈ లోగా ప్రసూనాంబ అక్కడకు వచ్చి శేఖర్ వైపు చూస్తూ “కొన్నాళ్లు వెళ్లి రమేశ్ దహ్గర ఉంటామురా. వాడూ పాపం మా కోసం అల్లాడిపోతున్నాడు. ప్రీతి కూడా పదే పదే చెప్పి పంపించిందిట. మేము కొన్నాళ్లు రమేష్ దగ్గర ఉంటే పాపం మాధవి కి కూడా రెస్ట్ గా ఉంటుంది కదా”.


ఆ మాటలలో ఉన్న వ్యంగం ఒక్క మాధవికి తప్ప మరెవరికీ అర్థంకాదు. పెళ్లై నాలుగు సంవత్సరాలైనా ఏనాడూ తల్లి తండ్రిని ఒక్కరోజు కూడా తన దగ్గరకు సరదాగా పిలిపించుకోని మరిది కి హఠాత్తుగా తల్లీ తండ్రిని తన దగ్గరకు ఎందుకు పిలిపించుకుంటున్నాడో అర్ధం కాని అమాయకు రాలు కాదు మాధవి. అందుకే తను ఏమీ జవాబివ్వక మౌనం గా వంటిట్లో తన పని చేసుకోసాగింది. తను అన్న మాటకు కోడలు ఏమైనా జవాబిస్తుందేమోనని ఎదురు చూసిన ప్రసూనాంబకి నిరాశ ఎదురైంది.


వెళ్లనీ కొన్నాళ్లు. దూరపు కొండలెప్పుడూ నునుపుగానే ఉంటాయి. రెండో కోడలు ప్రీతి అంటే ఇష్టం ఉండదు అత్తగారికి తమ కులంకాదని. అటువంటప్పుడు సడన్ గా అక్కడకు వెడ్తామనేసరికి ఆశ్చర్యం కలిగింది. మనుషులలో మార్పు రావడం మంచిదే కానీ ఆ మార్పు నలుగురూ మెచ్చుకునే లా ఉంటే అంతకంటే కావలసిఉంది ఏముంటుంది?


అత్తగారు మామగారూ మరిది దగ్గరకు వెళ్లడంతో పిల్లలకు స్కూల్ అయిపోయిన తరువాత పిల్లలను తను ఆఫీస్ నుండి వచ్చేదాకా చూసుకోడానికి ఒక అమ్మాయిని పెట్టుకుని మేనేజ్ చేసుకుంటోంది మాధవి.

మరునాడు ఆఫీస్ లో లంచ్ టైమ్ లో సుప్రజ, మాధవి నీరజ ముగ్గురూ కలసి లంచ్ చేస్తున్నారు. ఏమిటే విశేషాలంటూ సుప్రజ మాధవి, నీరజ వైపు చూసింది.


నీరజ మొదలు పెట్టింది. “మా అత్తగారు మామగారు బంధువుల పెళ్లి ఉంటే విజయవాడ వెళ్లారు. పెళ్లి చూసుకుని అక్కడే ఉన్న వాళ్ల బంధువుల ఇళ్ల్లో తలా ఒకరోజు గడిపి, గుళ్లూ గోపురాలు దర్శించుకుని మరో వారానికి గానీ తిరిగిరారు. వంటిల్లంతా నాదే ప్రస్తుతం. నాకు ఇష్చమైన వంటలు చేసేస్తున్నాను బోల్డన్ని. ఇదిగో ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడి రుచి చూడండే, తోట కూర ఆవపులుసు కూడా మీకోసం ఎక్కువ చేసి తెచ్చాను”.


“హమ్మయ్య, మా నీరజమ్మ ముఖం కళ కళ లాడిపోతోంది, ఎందుకో అనుకున్నాను. ఇదా సంగతీ” అంటూ సుప్రజ ఆటపట్టించింది.


“లేకపోతే ఏమిటే సుప్రజా, ఏ అత్తగారైనా కోడలు చక్కగా చేసిపెడ్తుంటే హాయిగా సుఖం అనుభవిస్తారు. కానీ మా అత్తగారు మాత్రం ఆవిడ ప్రాపకం ఎక్కడ తగ్గిపోతుందోననుకుంటూ నన్ను అంత దూరాన పెడతారు. పైగా ఎవరైనా ఇంటికి వచ్చినపుడు చూడాలి ఆవిడ ప్రవర్తన. నేను ఏమీ చేయనని అంతా ఆవిడే చేసుకుంటున్నట్లు బోల్డంత బిల్డప్ ఇస్తారు. వచ్చిన వాళ్లు నా వైపు అదోలా చూస్తారు. పాపం ఉద్యోగస్తురాలు కదా అన్న పుల్లవిరుపు మాటలు కూడాను. మా అత్తగారు, మామగారూ మా మరిది దగ్గరకు వెళ్లారు. అక్కడ కొన్నాళ్లు ఉంటారుట”.


మాధవి మాటలకు సుప్రజ నీరజా ఒకేసారి “అదేమిటీ బంగారు తల్లి లాంటి కోడలు ని వదిలి వెళ్లడమే?”


“ఏమో లే ఈ బంగారం విసుగొచ్చిందేమో, కాస్త వాళ్లకూ కొత్త ప్రదేశమూ, కొత్త మనుషులతో సరదాగా ఉంటుందేమో, మాకూ ఆటవిడుపు”.


“అసలు నాకు ఒకటి అనిపిస్తోంది. మన అత్తగార్ల లో జ్నానోదయం ఎప్పుడు అవుతుందా అని”.

సుప్రజ మాటలకు నీరజ ఫక్కుమంటూ నవ్వింది.


“నిజం నీరూ, నీకు నవ్వు వస్తోందేమో గానీ నాకు మనసు మండిపోతోంది. మనిషి చంద్ర మండంలోకి వెళ్లి రాగలిగాడు అంటే సైన్స్ ఎంత అభివృధ్ది చెందిందో మనం గమనిస్తున్నాం. అలాగే టెక్నాలజీ ముందంజ వేస్తూ దేశం ఎంతో ప్రగతి సాధిస్తోంది. స్మార్ట్ ఫోన్ లనూ, వాట్సాప్ లనూ తెగ వాడేస్తున్న అత్తగార్లు మాత్రం కోడళ్ల విషయంలో అలాగే ఉంటున్నారు. అందరూ అలా ఉంటున్నారని చెప్పను కానీ, కొంతమంది ఇంకా కోడళ్లను పలురకాలుగా హింసిస్తున్నారు. అందరూ మారగలిగినపుడే మనదేశం ప్రగతి సాధించినట్లంటాను”.


“ఉపన్యాసాలకు మార్పు రాదు మనుషులలో డియర్ సుప్రజా అండ్ నీరజా. అత్తగార్లలో మార్పు రావాలంటే వాళ్లకే ఏదో బలీయమైన అనుభవం ఎదురవ్వాలి. ఆ అనుభవం నుండి వారెన్నో తెలుసుకోగలగా”లంటూ మాధవి గంభీరంగా అంటున్న మాటలకు సుప్రజా, నీరజా ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు.


“జాగ్రత్త మన మాటలు ఎవరైనా వింటే అత్తగార్లను హింసిస్తున్న కోడళ్లు అనుకునే ప్రమాదం ఉంది. మనం మన అత్తగార్లతో ఎంత మంచిగా ప్రవర్తించినా వాళ్లకి మనం నచ్చడం లేదు. ఏం చేస్తాం. ఇంటి కంటే గుడి పదిలం అన్నట్లు మనకు మన ఇళ్ల కంటే ఈ ఆఫీసే హాయిగా ఉంది. ఓ అన్నట్లు ఈ రోజే కదే మన మనకు దసరా పండుగ బోనస్ ఇచ్చేది” అని నీరజ అనగానే అవునంటూ సుప్రజా మాధవీ తలూపారు.


బోనస్ తో మీ ప్లేన్ ఏమిటే అని నీరజ అడగ్గానే సుప్రజ “ఇంట్లో అందరికీ పండక్కి బట్టలు కొనాలనుకుంటున్నాను. ఈ సారి మా ఆడపడుచు పిల్లలు కూడా ఉన్నారు కదా. అందరికీ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఎల్లుండి ఆదివారం నేనూ మోహన్ షాపింగ్ చేయాలనుకున్నాం.

మరి నీవూ నీరజా?”

“మా అత్తగారు వారం క్రితమే అడిగారు నన్ను. దసరాకు బోనస్ వస్తుంది కదా అని. వస్తుందన్నాను. మీ మామగారూ నేనూ కాశీ యాత్ర చేసి వస్తామన్నారు. అంటే ఆ బోనస్ ను ఆవిడకు ఇవ్వమని చెప్పడం. గత రెండు సంవత్సరాలనుండి కాశీ యాత్ర చేసి వస్తాం అంటూన్నా ఏవో అనుకోని ఖర్చులు తగలడంతో వాళ్లను యాత్రలకు పంపలేకపోతున్నాం”.


నీరజ మాటలకు సుప్రజ “ఇంకనేం అత్తగారిని మామగారినీ కాశీ పంపుతున్నావన్నమాట. ఎంత పుణ్యం వస్తుందే తల్లీ నీకు”.


“ఆ అవునే మా అత్తగారూ మామగారూ గంగానదిలో స్నానం చేసి పాప ప్రక్షాళన చేసుకుని పునీతులు అయి తిరిగి వచ్చి మళ్లీ ఫ్రెష్ గా కోడలిని సాధిస్తారు. నన్ను అలా మాటలతో దెప్పుతున్నా మా మామగారు కనీసం ‘అయ్యో ఆ అమ్మాయిని అలా అంటావేమిటే’ అని కనీసం ఒక్క మాట కూడా అనరు. భార్యా విధేయులు మరి”.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.






51 views0 comments
bottom of page