top of page

నిద్రా భాగ్యం

వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)

Think good - Sleep well

'Nidrabhagyam' - New Telugu Story Written By NDSV Nageswararao

Published In manatelugukathalu.com On 13/11/2023

'నిద్రా భాగ్యం' తెలుగు కథ

రచన: NDSV నాగేశ్వరరావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్సూర్య నారాయణ మంచి నిద్రలో ఉండగా సెల్ ఫోన్, సైలెంట్ లో ఉన్నా కూడా వైబ్రేషన్ తో మోగుతూ, అతని నిద్రకి మంగళం పాడింది. అదాటుగా లేచి ఫోన్ వైపు చూసాడు, నారాయణ పేరు కనపడింది. ఈ సమయంలో ఎందుకు చేసాడా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసాడు.


"ఏరా సూరిగా, పడుకున్నావా?" చిన్ననాటి మిత్రులవడంతో అలా పిలుచుకోవడం అలవాటే.


"లేదురా నారిగా, నిద్ర పోతున్నాను".


"నాకు నిద్ర పట్టలేదురా, అందుకే ఫోన్ చేసాను."


"ఇది మరీ అన్యాయంరా, నీకు నిద్ర పట్టకపోతే, నా నిద్ర చెడగొట్టాలా?"


"ఒరేయ్, మొన్న మొన్ననే స్నేహితుల దినోత్సవమని ఫోన్ చేస్తే, స్నేహితులకు ఒక రోజేంటి, సంవత్సరమంతా స్నేహితులకే అని పెద్ద కబుర్లు చెప్పావ్. ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే నీలుగుతున్నావ్."


నారాయణ మాటలకు సూర్య నారాయణ నిద్ర మత్తు వదిలిపోయింది.


"సరేలే నారిగా, ఆ రోజు ఏదో అన్నాను. అయినా నా మాట మీద నేను నిలబడతాను, ఇంతకీ విషయం చెప్పు, ఎందుకు పడుకోలేదు."


"సూరిగా, పడుకోవాలని రెండు గంటల నుంచి ప్రయత్నం చేస్తున్నాను, కానీ నిద్ర రావడం లేదురా. అయినా నీకు అంత బాగా నిద్ర ఎలా వస్తుందిరా?"


"నారీ, నాకు నీలా సవాలక్ష వ్యవహారాలు లేవు. ఆఫీసు పనీ, ఇల్లూ, తప్పితే మన మిత్రులతో ప్రత్యక్షంగానో, ఫోన్ లోనో బాతాఖానీ అంతే. ఇక ఆఫీసుకి రానూ పోనూ ఐదారు కిలోమీటర్ల నడక. దానితో ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది. అందుకే సమయానికి నిద్ర వచ్చేస్తుంది."


"నువ్వు ఎలాగైనా సర్దుకుపోతావ్. కానీ, ఆ సుబ్బిగాణ్ణి చూస్తేనే, వాడి గురించి ఆలోచిస్తేనే, కడుపు రగిలిపోతుంది. నాకు నిద్ర రాకపోవడానికి వాడు కూడా ఒక కారణం".


"నారీ, మళ్లీ పాత గోల లోకి దిగిపోయావా? నీతో వచ్చిన చిక్కే ఇదిరా?"


"అది కాదురా, ఇద్దరం కలిసి వ్యాపారం పెడదామని నేను సలహా ఇచ్చాను. వాడేమో నాకు జాయింట్ వ్యాపారాలు కుదరవని చెప్పి సొంతంగా మొదలెట్టాడు, ఈ రోజు కోట్లు సంపాదిస్తున్నాడు. నాకూ అప్పట్లో వాటా ఇచ్చి ఉంటే, ఆ సంపాదనలో సగం నాకు వచ్చేది."


"నారీ, సుబ్బిగాడి తాతగారు మంచి వ్యాపారం చేసేవారట. వాళ్ళ నాన్నగారు ఉద్యోగంలో ఉండిపోయినా, సుబ్బిగాడు వాళ్ళ తాతగారి దగ్గర పెరగడం వల్ల చదువు పెద్దగా రాకున్నా, వ్యాపార మెళకువలు నేర్చుకున్నాడు. మన స్నేహితుడు సంపాదించుకుంటే మనకి ఆనందమే కదరా! అయినా, నీకు మాత్రం ఏం తక్కువ? పెద్ద కంపెనీని మేనేజ్ చేస్తున్నావ్, నెల జీతం లక్షల్లో సంపాదిస్తున్నావ్, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్, ఎక్కడంటే అక్కడ ఇన్వెస్ట్ చేసావ్. ఇంకేం కావాలిరా?"


"ఏం సంపాదనరా? రియల్ ఎస్టేట్ పెరగడం లేదు, షేర్ మార్కెట్ వోలటైల్ గా ఉంది. సంపాదనకి తగినట్లు ఖర్చులూ ఎక్కువే. జీవితంలో ఆనందం లేదురా సూరీ."


"నారీ, ఆనందం ఎక్కడ నుంచో రాదురా. మనమే సృష్టించుకోవాలి. పెద్ద కంపెనీని మేనేజ్ చేస్తున్నావ్, టార్గెట్ కోసం మీ సిబ్బందిని సాధిస్తూనే ఉంటావ్. వాళ్ళు మంచి పని చేసినప్పుడు నువ్వు ప్రోత్సాహంగా ఒక్కసారి పొగిడితే, వాళ్ళ మొహంలో కనిపించే మెరుపు నీకు ఆనందం కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడిలో నష్టం వచ్చిన రోజులు గుర్తు పెట్టుకొని బాధ పడతావ్.


లాభం వచ్చిన రోజులలో ఆనందంగా ఉన్నావా, లేదే. ఇంకా పెరుగుతుందా, పెరగదా అని టెన్షన్ పడుతూ ఉంటావ్. షేర్ మార్కెట్ కూడా అంతే. డెయిలీ ట్రేడింగ్ లో ఎత్తు పల్లాలని చూసి, ఆదుర్దా పడుతుంటావ్. దాని బదులు మంచి స్టాకుల్లో లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయి. కొన్ని సంవత్సరాల తరువాత చూసుకుంటే ఆనందంగా ఉంటుంది."


"సూరీ, నువ్వు చెప్పినది పాటించడం అంత సులువు కాదురా. కానీ, ఆలోచిస్తే నువ్వు చెప్పేదీ నిజమే అనిపిస్తోంది. మంచి స్నేహితుడు ఎప్పుడూ మన మేలు కోరుతాడు అంటారు. నా విషయంలో నువ్వు ఎప్పుడూ అలాంటి స్నేహితుడివే. అందుకే, నీకు ఫోన్ చేసాను. నాకూ నిద్ర వస్తోందిరా. గుడ్ నైట్ సూరీ!"


"గుడ్ నైట్ నారీ, హాయిగా పడుకుని, ఆనందంగా కొత్త ఆలోచనలతో రేపు ఉదయం లే...."

************

NDSV నాగేశ్వరరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు NDSV నాగేశ్వరరావు.

వృత్తి రీత్యా ప్రభుత్వ రంగ బ్యాంకులో జనరల్ మేనేజర్ గా ముంబై లో పనిచేస్తున్నాను.

పదిహేనేళ్ల వయస్సు నుంచి రచనా వ్యాసంగం ప్రారంభించాను.

కథలు, కవితలు, పద్యాలు, నాటికలు వ్రాసాను, వ్రాస్తున్నాను. కంద పద్యం అంటే ఇష్టం. వారానికో వాట్సాప్ కథలుగా అరవైకి పైగా కథలు వ్రాసాను. తెలుగులోనే కాకుండా ఇంగ్లీషు, హిందీ, తమిళంలో కథలు వ్రాసాను.

సాహితీ బృందావన జాతీయ వేదిక మరియు 'నేను సైతం' యూ ట్యూబ్ ఛానల్ వారు నిర్వహించిన జనవరి 2022 సంక్రాంతి కథల పోటీ లో ప్రోత్సాహక బహుమతి మరియు 'సంక్రాంతి సాహిత్య కథా రత్న' పురస్కారం లభించింది. స్టోరీ మిర్రర్ వారి ఇంగ్లీషు కథల పోటీల్లో పలు బహుమతులు లభించాయి. గత ముప్పై ఏళ్లుగా అడపా దడపా ఏదో ఒక బహుమతి వచ్చింది.

నటన నా మరో ప్రవృత్తి. ఆల్ ఇండియా రేడియో నాటకాలలో, స్టేజి మీద మరియు టివీ ఛానళ్లలో నటించాను.

మీ

NDSV నాగేశ్వర రావు


246 views0 comments

Yorumlar


bottom of page