top of page

మనుషులు మారాలి ఎపిసోడ్ - 5


'Manushulu' Marali Episode 5' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha Published In manatelugukathalu.com On 19/11/2023

'మనుషులు మారాలి ఎపిసోడ్ - 5' తెలుగు ధారావాహిక

రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

సుప్రజ, మాధవి, నీరజ ఒకే ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటారు. మాధవి తప్ప మిగతా ఇద్దరు అత్తగారి ఇంట్లో తమ కష్టాల గురించి చెబుతారు. మాధవి తన కష్టాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది.


సుప్రజ ఆడపడుచు సరళ భర్త మీద అలిగి వచ్చేస్తుంది. సుప్రజ భర్త మోహన్ తన బావతో అక్క సరళ గురించి మాట్లాడతాడు. సరళ మొండితనం గురించి చెబుతాడు అతని బావ.. తన అక్క సరళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు మోహన్. నీరజ వంటను ఇంట్లో అందరూ మెచ్చుకున్నా అత్తగారు మాత్రం మెచ్చుకోరు. భర్త వేణుకు ఆ విషయం చెబుతుంది నీరజ.


మాధవి మరిది రమేష్ తలిదండ్రులని తనతో తీసుకొని వెళతాడు.


ఇక మనుషులు మారాలి - ఎపిసోడ్ 5 చదవండి.


“మరి నీవే మాధవీ”?


“ఏముందే సుప్రజా చెప్పడానికి. నాలుగు రోజుల క్రితమే మా మరిది ఫోన్ చేసాడుట మా వారికి. ‘వాళ్ల జీతాల్లో సగం భాగం అంతా ఇంటి లోన్ కే పోతోంది. అమ్మా నాన్న మందులకి ఖర్చులకు ప్రతీ నెల డబ్బు పంపించు అన్నయ్యా’ అంటూ. ఈ సారి ఒక పదివేలు ట్రాన్స్ ఫర్ చేయమన్నాడు. తల్లీ తండ్రినీ తను చూసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మరి వాళ్లను తన దగ్గరే ఉంచుకుంటానని తీసుకు వెళ్లడం ఎందుకో నాకూ మా వారికి అర్ధం కాలేదు. మా అత్తగారూ మామగారూ మా దగ్గర ఉన్నప్పుడు వారిరువురి బాధ్యత మాదే అనుకుంటూ ఎంతో ప్రేమగా గౌరవంగా చూసుకున్నాం. మా మరిది ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు తల్లీ తండ్రిని చూడడానికి.


ఏనాడూ కనీసం పండ్లు కూడా తెచ్చేవాడు కాదు. ఒక్క వంద రూపాయలు కూడా ఉంచుకోండంటూ చేతిలో పెట్టేవాడు కాదు. ఇప్పుడు వాళ్ల పోషణకు మా నుండి డబ్బు అడగడం ఏమంత బాగుందే? భార్యా భర్తలిరువురూ బాగానే సంపాదించుకుంటున్నారు. కన్న తల్లీ తండ్రిని ఆ మాత్రం చూసుకోలేని దుస్థితి కాదు. మేమేదో లక్షలు సంపాందించుకుంటూ వెనకేసుకుంటున్నామన్న దుగ్ధ కూడా మా మరిది మాటల్లో ప్రస్ఫుటమౌతుంది. ఇంటికి పెద్దవాడిని, ఇవ్వలేనంటే ఏం బాగుంటుందంటారు మా వారు. ముందు మా మరిదికి పంపించాకా తరువాత మిగిలిన డబ్బుతో పిల్లలకు బట్టలు కొనాలని అనుకుంటున్నాం”.


“మన మధ్య తరగతి జీవితాలు అంతేనే మాధవీ. ఒకరి కష్టాలు మరొకరం పంచుకోడానికే భగవంతుడు మన ముగ్గురినీ కలిపాడనుకుంటూ ఉంటాను ఎప్పుడూ. మీకు ఏ విషయంలో సహాయం కావలసి వచ్చినా నేను ఉన్నానే”.

సుప్రజ మాటలకు నీరజా మాధవీ ముఖాలు వికసించాయి. “మా కంటే కాస్త వయస్సులో పెద్ద దానివైన నిన్ను ఎప్పుడూ ఒక అక్కలా భావిస్తామే సుప్రజా. తప్పకుండా నీలాంటి మంచి మిత్రురాలిని పొందినందుకు మేము అదృష్టవంతులమే” అంటూ నీరజా మాధవీ సుప్రజ చేతులను మృదువుగా నొక్కారు.


ఒక నాలుగు రోజుల నుండి సుప్రజ ఎందుకో ఆఫీస్ కు రావడం లేదు. ఏదో పనుండో లేక పిల్లలెవరి కైనా అస్వస్థత చేసి రాలేదేమో అనుకుని ఊరుకున్నారు నీరజా, మాధవీ.

ఉన్నట్టుండి నీరజ హడావుడిగా మాధవి సీట్ దగ్గరకు వచ్చింది.


“మధూ, ఈ మాట విన్నావా? సుప్రజ వాళ్ల ఆడపడుచు సరళ భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చేసిందని సుప్రజ అప్పుడు మనతో చెప్పింది కదా. అది ఆఫీస్ కు రావడం లేదని మనసుండబట్టలేక దానికి ఫోన్ చేసానే. అది చెప్పిన విషయం విని కంగారు పడ్డాను. నీకు చెప్పాలని ఇలా వచ్చాను”.


“ఏమైందే, నీరూ, సుప్రజ ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కదా”?


“ఆహా అందరూ బాగానే ఉన్నారుట”.


“మరి ఏమైందో చెప్పవే బాబూ, సస్పెన్సుని భరించలేకపోతున్నాను”.


“సరళ అత్తగారు ఇంట్లో నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారుట. ఏదో ఒక చిన్న ఉత్తరం లాంటిది వ్రాసి పెట్టి వెళ్లిపోయారుట. ఇంట్లో అంతా గోల గోల గా ఉందని చెప్పింది. ఆ పెద్దావిడ పాపం పోలీస్ కంప్లైంట్ లాంటివేమీ ఇవ్లద్దని లెటర్ లో వ్రాసారుట. మిగతా వివరాలన్నీ అది రెండురోజుల తరువాత ఆఫీస్ కు వచ్చినపుడు చెబుతానంది”.


“ఓ మైగాడ్, ఏమిటే పాపం, ఆ పెద్దావిడ ఇంట్లో నుండి వెళ్లిపోవడం ఎంత ఘోరమూ కదా”?


“అవునే మధూ, నేనూ అలాగే అనుకున్నాను. అసలు ఆ సరళ మనిషా, పశువా? మీరైనా ఉండాలి ఇక్కడ, లేక నైనైనా ఉండాలనడం ఎంత అనుచితంగా ఉందో కదా? పాపం ఆ పెద్దావిడ మనసు ఎంతలా విల విల్లాడిందో కదా? ఆ బాధలోనే ఆవిడ వెళ్లిపోయి ఉండచ్చు”.


“పాపం ఆవిడ ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని కోరుకుందాం. తొందరపాటు నిర్ణయం తీసుకుని ప్రాణం తీసుకోకుండా. ఆవిడకు జరగరానిది ఏదైనా జరిగితే ఆ సరళకు పుట్టగతులుండవు. ఆవిడకు ఏదైనా జరిగితే మాత్రం నేనే వెళ్లి ఆ సరళ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను”. మాధవి ముఖం ఆవేశంతో ఎర్రపడింది.


మరో రెండు రోజుల తరువాత సుప్రజ ఆఫీస్ కు వచ్చింది. చాలా అలసిపోయినట్లు కనపడుతోంది.

లంచ్ టైమ్ లో కలుసుకున్నారు మిత్రురాళ్లు ముగ్గురూ.


“ఏమైందే సుప్రజా. విషయం విని షాక్ అయ్యాం తెలుసా”.


“అవునే, మాకూ అలాగే ఉంది. ఏమిటో నాకూ మోహన్ కూ దిక్కు తోచడం లేదు. ఏ పనీ చేయబుధ్ది కావడం లేదు. మా ఆడపడుచు భర్త రాఘవ్ అయితే పాపం ఎంత డల్ అయిపోయాడో తెలుసా.


అదృష్టవశాత్తూ కొడుకు తన కోసం ఎక్కడ కంగారు పడతాడో అనుకుంటూ ఒక ఉత్తరం వ్రాసి పెట్టి వెళ్లిపోయింది. పోలీస్ కంప్లైంట్లూ గట్రా ఇచ్చి హడావుడి చేయకంటూ సూచించిందిట. ఆవిడ వ్రాసిన ఉత్తరం మాకు చూపించాడే, నిజంగా కళ్లమ్మట నీళ్లొచ్చాయి.


‘నా మూలానే కదా సరళ పుట్టింటికి వెళ్లిపోయింది. పచ్చని నీ జీవితం నా మూలాన ఎండిపోకూడదరా అబ్బాయి. పిల్లలు నీకోసం ఎంత అల్లాడిపోతున్నారో ఊహించుకోగలనురా. నేనంటే అస్సలు ఇష్టంలేని సరళ దగ్గర ఎలా ఉండగలనురా రాఘవా. నీకు ఎప్పటికీ చెప్పకూడ దనుకున్నాను. కానీ ఆ అవసరం వచ్చింది కాబట్టి చెపుతున్నాను. ఒక సారి ఫోన్ లో వాళ్ల అమ్మతో చెబుతోంది.


ఈ రోజు లేస్తూనే మా అత్త ముఖం చూసాను. ఏ దరిద్రం చుట్టుకుంటుందోనంటూ. ఏమి చేయగలను చెప్పు రాఘవా, నాకు దరిద్రపు ముఖాన్నిచ్చిన ఆ దేవుడిని నిందించనా? నేనెంత సర్దుకు పోదామనుకున్నా నా వల్ల కావడం లేదు. నా కొడుకూ నా కోడలు నా మూలాన విడిపోయారనుకుంటే ఎంత అప్రదిష్ట రాఘవా? నీకు నీ తల్లి పట్ల వల్లమాలిన ప్రేమ ఉండచ్చు. కానీ కోడలికి నేనంటే ఇష్టం లేదుకనుకనే తను నిన్నూ ఇంటినీ వదిలేసి వెళ్లిపోయింది.


పుట్టింట్లో సరళ ఎన్నాళ్లు ఉంటుందిరా? నా జీవితం చాలా వరకు ముగిసింది. ఇంక ఎన్నాళ్లు జీవిస్తానో నాకే తెలియదు. నిండు నూరేళ్లూ నీవు ఆనందంగా నీ భార్యా పిల్లలతో జీవించాలనే ఉద్దేశ్యంతో నేను వెళ్లిపోతున్నాను. నేను క్షేమంగానే ఉంటాను ఎక్కడున్నా. నా గురించి కంగారు పడి పోలీస్ కంప్లైంట్లూ అవీ ఇవ్వబోకు. వెంటనే సరళను పిల్లలనూ తీసుకొచ్చేయి. హాయిగా సంతోషంగా ఉండండి. నీ ప్రియమైన అమ్మ’.


ఇవే ఆవిడ ఉత్తరంలోని సంగతులు. పాపం రాఘవ్ కళ్లనీళ్లు పెట్టుకుంటున్నాడు. చాలా చోట్ల వెతుకుతున్నాడు ఆవిడకోసం. వృధ్దాశ్రమాల దగ్గరకు వెళ్లి వాకబు చేస్తున్నాడు. ఆవిడ ఎక్కడకు వెళ్లిందో ఇంతవరకూ ఆచూకీ లేదు”.


“మరి మీ ఆడపడుచు ఏమంటోంది?” నీరజ మాధవి ఒకేసారి ప్రశ్నించారు.


“చూడు ఇంత జరిగినా సరళలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. పైగా తనను తాను సమర్ధించుకుంటూ ‘నేను ఆవిడను ఇంట్లోనుండి వెళ్లిపొమ్మనలేదే, నేనే కదా బయటకు వచ్చేసాను. లోకం నాకు అత్తగారిని ఇంటినుండి తరిమివేసిందన్న అపఖ్యాతి తెచ్చిపెట్టాలిగా. ఆవిడకేం, ఆవిడ ఎక్కడో సుఖంగానే ఉంటుంది, తెలివైనది పైగా లౌక్యం తెలిసిన మనిషి. నాలా కాదు, పుట్టింటికి వచ్చేసి ఇక్కడ అందరితో నానా మాటలు పడడానికి’.


“మరి సరళ ఆమె భర్త దగ్గరకు వెళ్లిపోతుందా ఇప్పుడు?”


“రాఘవ్ అన్నయ్య మా ఆడపడుచు భర్త, సరళ వదినను ససేమిరా ఇంటికి తీసుకువెళ్లనంటున్నాడు. మా అమ్మను ఎలాగైనా వెదికి తెస్తాను. అమ్మకు క్షమార్పణ చెప్పిన రోజునే సరళను ఇంటికి తీసుకువెడతానంటున్నాడు. కావాలంటే పిల్లలు నాతోనే ఉంటారంటూ ఖరాఖండీగా చెప్పేసాడు”.


“మీ సరళ రియాక్షన్ ఏమిటో” మాధవి ప్రశ్నించిన దానికి సమాధానంగా, “చూడు మధూ, మా సరళ వదిన చాలా మొండిది. తెగేదాకా తాడు లాగద్దంటారు కదా, కాని ఈవిడ తాడు ఎప్పుడు తెగుతుందా అని చూసే రకం. పైగా ఏమంటోందో తెలుసా, మా అత్తగారు వస్తేనే కదా నేను క్షమార్పణ చెప్పేది. ఆవిడ తిరిగి వస్తుందని నేను అనుకోడం లేదు. మా ఆయనే కాళ్ల బేరానికి వచ్చి నన్ను తీసుకెడతాడని ధీమాగా చెపుతోంది”.


“అబ్బ ఏమి మనిషే మీ ఆడపడుచు? ఎలా భరిస్తున్నారో ఏమో” అని నీరజ అన్నదానికి సుప్రజ నవ్వుతూ “ పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిపోయి స్వతంత్రంగా బ్రతుకుతానంటోంది మా సరళ వదిన. మా వారికి కి కోపం వచ్చింది. ‘నీవు వెడితే మీ ఇంటికి వెళ్లాలి, లేకపోతే ఇక్కడ ఉండాలి అక్కా. బయటకు వెళ్లి ఎలా బ్రతుకుతా ననుకుంటున్నావు? ఉద్యోగం అయినా ఉందా’ అంటూ కోప్పడ్డారు. మా అత్తగారికి కూడా గట్టిగా చెప్పాడు. అక్కకు అర్ధం అయ్యేలా చెప్పమ్మా అంటూ”.

========================================================================

ఇంకా వుంది..


మనుషులు మారాలి ఎపిసోడ్ - 6 త్వరలో..

========================================================================

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.






54 views0 comments
bottom of page