వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)
'People Must Be Crazy' - New Telugu Story Written By P. Gopalakrishna
Published In manatelugukathalu.com On 05/11/2023
'పీపుల్ మస్ట్ బి క్రేజీ' తెలుగు కథ
రచన: P. గోపాలకృష్ణ
కథా పఠనం: A. సురేఖ
"ఏవండోయ్, మిమ్మల్నే" కిచెన్ లోంచి గావుకేకలు పెట్టుకుంటూ భారీకాయంతో ఆపసోపాలు పడుతూ వస్తున్న భార్యామణి లత కేసి కంగారుగా చూసాడు, అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికొచ్చి హాల్లో సోఫాలో కాళ్ళు బార్లా జాపుకుని కూర్చున్న కనకారావు. ఆమె కేకలకు అదిరిపాటుతోసోఫా మీంచి కిందపడిపోయి, ఎలాగో లేచి, నడుం పట్టుక్కూర్చున్నాడు బేలగా మొహం పెట్టి.
"ఇవాళ్టి నుండి ఒక నెలపాటు మీరు నా స్వాధీనంలో ఉండాలి", అది డిమాండో, కమాండో అర్థం కాలేదు కనకారావు కి.
"అయినా మన పెళ్ళయ్యాకా నువ్వు నన్ను పూర్తిగా నీ స్వాధీనంలోకి తీసుకున్నావు కదే" కిందపడ్డంతో నడుం పట్టుకొని మూలుగుతూ లేచాడు.
"ఎలా ఉండేవాడివిరా కనకా ఒకప్పుడు. ఇప్పుడేంటిరా ఇలా అయిపోయావు చీకేసిన మామిడిటెంకలా", ఎప్పటిలా తనలో తానే అనుకున్నాడు. నిజమే మరి ఒకప్పుడు అంటే పెళ్ళికి ముందు కనకారావు కొత్త కరెన్సీ నోటులా, వాళ్ళూరులో రాజారావు కాకా హోటల్ లో పూరీ లాగా ఫెళఫెళ లాడుతూ, పిఠాపురం నూర్జహాన్ సెంట్ రాసుకొని, మంచి కులాసా పురుషుడిలా తయారై మరీ ఆఫీస్ కి వెళ్ళేవాడు.
ఆఫీస్ లో ఎందరో ఆడవాళ్లు, రంభ, మేనకల్ని తలదన్నేలా ఉన్న అమ్మాయిలు కనకారావు దర్జాకి ఫ్లాట్ అయిపోయి పడిపోతే వాళ్ళని కాదని, ఒకింత ఏపుగా పెరిగినా, ఒక ఛాయ రంగు తక్కువైనా, పళ్ళు కొంచెం ముందుకు తోసుకు వచ్చినా అవేమీ సంసారానికి అడ్డుకాదని లక్షలు కట్నం తెచ్చిన లతని ఎంతో సంతోషంగా పెళ్ళాడాడు.
పెళ్ళాయ్యాకా, అరటిపండు తొక్కలా, చీకి పారేసిన మామిడి టెంకలా, చిరిగిపోయిన కరెన్సీ నోటులా, చల్లారిపోయి చప్పగా వేలాడిపోయిన పూరీలా వదులుగా అయిపోయాడు కనకారావు. ఇదంతా తన అర్థాంగి లత మహాత్యమని వేరేగా చెప్పక్కర్లేదు మరి.
నెలపూర్తయ్యి జీతం బ్యాంకు లో పడే సమయానికి చెక్ బుక్ లో భర్తచేత బలవంతంగా సంతకం చేయించి, మర్నాడు బ్యాంకు లో ప్రత్యక్షమై లైన్లో ముందు నిలబడేవాళ్ళతో పోట్లాట వేసుకొని అయినా సరే, కొత్త నోట్లని దొరకపుచ్చుకొని ఇంటికి వచ్చేది లత.
సాయంత్రం అయ్యేసరికి తొక్కలో కనకారావు.... సారీ.. తొక్కలా అయిపోయిన కనకారావు దీనంగా వచ్చి హాల్లో సోఫాలో కూలబడితే, భర్తకి ప్రేమగా గ్లాసుడు మంచి తీర్థం అదే చేత్తో తేనీరు అందించి, శ్రద్ధగా షూస్ విప్పి, స్నానం కి నీళ్లు పెడుతుంది.
మళ్ళీ అసలు కథలోకి వచ్చేద్దాం. "మరే మా క్లబ్ లో ఆడవాళ్ళం అంతా కలిసి ఈ నెలలో ఒక కాంపిటీషన్ పెడదామని తీర్మానం చేశామండీ" అంది.
గుండెలు గుబగుబ లాడుతూ ఉంటే గట్టిగా పైనుండే గుండెను పట్టుకొని.... "హవునా.. హింతకీ... హేమ్... కాంపిటీషన్" నీరసంగా అడిగాడు, గుండెపోటు తో అల్లాడిపోతున్న వాడిలా.
"కిందటి నెలలోనే కదే పోటీలంటూ ఐదువేలు తగలేసావు. ఇలా ప్రతినెలా పోటీలకు అంటూ డబ్బులు తగలేస్తే ఎలా"? నీరసంగా మాడిపోయిన పెసరట్టులా మొహం పెట్టుకొని, బట్టలు మార్చుకొని స్నానం చెయ్యడానికి రెడీ అవుతూ అడిగాడు.
"చాల్లే సంబడం, పోయిన నెలలో పోటీల్లో మీరు చివరిదాకా నిలబడలేకపోయారు. నా పరువు గంగలో కలిసిపోయింది. అసలు మీకేమైనా బరువులు ఎత్తమన్నమా? రాళ్లు పగలగొట్టమన్నామా? ఏసీ రూంలో కూర్చొని, మాడిపోయిన గిన్నె ఒక్కటంటే ఒక్కదాన్ని, తెల్లగా తళతళ లాడేలా తోమమని పోటీ పెడితే, ఓడిపోయింది చాలక, మా ఇంట్లో వంటలైనా తోమడం అయినా మా లత చేస్తుందని ఊరూవాడా వినిపించేలా డప్పుకొట్టారు. అందరిలో తలకొట్టేసినట్లయింది. అసలు పోటీలో లేకపోతే పోయింది. పరువు కూడా తీసేసారు" కోపంగా చూసింది కనకారావు వైపు.
"అయినా ఇప్పుడేమీ పెద్ద పోటీ కాదులే వచ్చి ఇలా కూర్చోండి. వివరంగా చెప్తాను. అటూ ఇటూ తిరగలేక చచ్చిపోతున్నా అంటూ విసుక్కుంటూ వచ్చి సోఫా లో కూలబడింది.
"ఒసేయ్.. ఒసేయ్.. సోఫా లో నెమ్మదిగా కూర్చోవాలే, ఒక్కసారే దభీ మని కూర్చుంటే అది చచ్చూరుకుంటుంది. ఇంతకీ విషయం ఏంటో చెప్పు" అన్నాడు. భర్తవైపు కోపంగా చూసింది లత.
"సరేలే, ఈసారి సరిగా పోటీ చేసి, ప్రైజ్ తెస్తానులేవే" అన్నాడు కనకారావు భరోసాగా.
"గుడ్. అలా ధైర్యంగా మీరు చెప్తే నేను దూసుకుపోతానుగా", ఆనందంగా చెప్పింది ఆయాసపడుతూనే.
“ఇంతకీ పోటీ ఏంటి?” అడిగాడు ఉత్సాహం ఆపుకోలేక.
"బాడీ బిల్డింగ్ పోటీలు" చెప్పింది లత ముసిముసి నవ్వులతో.
కనకారావు కి ఒక్కసారి ఒళ్ళంతా జలదరించి, ఒంటిమీద వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి. "ఒసేయ్... ఒసేయ్.. అసలు నీకు ఏమైనా బుద్ధి ఉందిటే. మీ మహిళా మండలి లో బాడీ బిల్డింగ్ పోటీలా? బాడీ బిల్డింగ్ నీవలన అవుతుందా"?.... ఏదో చెప్పబోయాడు కనకారావు.
"ఎహె, పోటీలు మాకు కాదు. మీకే. ఆ క్లబ్ లో ఉన్న ఆడవాళ్ళ భర్తలకు బాడీ బిల్డింగ్ పోటీలు జరుపుతాం. ఎవరు నెగ్గితే వాళ్ళకి ఏభైవేలు క్యాష్ ప్రైజ్, ఒకరాత్రి మా క్లబ్ లోని ఆడవాళ్ళతో కలిసి పార్టీలో పాల్గొనే అవకాశం ఇస్తాం" చెప్పింది లత.
"మీకిదేం పొయ్యేకాలమే? మీతో పార్టీ కి ఎవరు గెలిస్తే వాళ్ళని పిలుస్తారా. హవ్వా!!" బుగ్గలు నొక్కుకున్నాడు కనకారావు.
"మా మహిళామండలి లో కొత్తగా వచ్చింది ఒకావిడ హర్ష అని హిందీ ఆవిడ. ఆవిడని ఈ పోటీలకు అధ్యక్షత వహించమని చెప్పాము. వాళ్ళాయన బాడీ బిల్డర్ అట. గొప్పలు పోతోంది. మా మగాళ్లు ఉన్నారు పోటీలకు అంటూ మీరు ఒప్పుకుంటారని మీ తరుఫున మేమే మాట ఇచ్చేసాము", చెప్పింది లత.
"నేను బాడీబిల్డర్ని ఏంటే బాబూ. ఒంటిమీద కొవ్వు తప్ప కండ ఏమైనా ఉందా? పొట్ట చూడు ఎలా పెరిగిపోయిందో. నిండు గర్భిణీ లాగా ఉంది" కుండ బోర్లించినట్లున్న పొట్టని తడుముతూ చెప్పాడు కనకారావు.
"మీరేం చేస్తారో నాకనవసరం. మీరు చక్కగా బాడీని షేప్ లోకి తెచ్చుకొని, పోటీల్లో పాల్గొని, ఫస్ట్ ప్రైజ్ తీసుకొస్తున్నారు అంతే" కుండబద్దలు కొట్టేసింది లతా.
"ఇది నావలన అవ్వదే లతా" ఏడుపుమొహంతో చెప్పాడు కనకారావు.
"మీవలనే అవుతుంది. మా ఆయన బాడీ బిల్డర్ అని బిల్డప్ ఇచ్చాను నేను" కూల్ గా చెప్పింది. కనకారావు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ట్రిమ్ గా తయారై పదండీ అంటూ బండి వెనకాల ఎక్కి కూర్చుంది. భార్య కూర్చోగా మిగిలిన సీట్ మీద పడిపోకుండా కూర్చొని ఆమె చెప్పిన వైపు పోనిచ్చాడు. "ట్రిపుల్ ఎక్స్ జిమ్" అని కనిపించిన ఒక బోర్డు దగ్గర బండి ఆపించింది.
కనకారావు ని తీసుకొని జిమ్ లోనికి వెళ్ళింది ఆమె. అక్కడ రిసెప్షన్ బయట సోఫా లో కనకారావు ని కూర్చోమని, తాను రిసెప్షన్ లో ఉన్న అమ్మాయితో మాట్లాడింది. పోతే పోయింది, లత ఇన్నాళ్ళకి నాకు తగిన చోటికి తీసుకొచ్చింది అనుకుంటూ, చొంగ కారుస్తూ ఆ అమ్మాయి వైపు చూస్తూ కూర్చున్నాడు. పదినిమిషాల తరువాత మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు అంటూ ఆ అమ్మాయి, కనకారావు చొక్కవైపు చూసింది. అప్పటికే అది చొంగతో సగం తడిసిపోయింది. ఆమె దగ్గరుండి ఒక పెద్ద హాల్లోంచి అతణ్ణి నడిపిస్తూ ఇంకో చిన్న రూమ్ లోకి తీసుకెళ్లింది.
లతా దర్జాగా ఒక చైర్ లో కూర్చుంది. లావుగా ఉన్న ఒకమ్మాయికి పరిచయం చేసింది కనకారావు ని. కనకారావు చుట్టూ తిరిగి చూసి ఆ అమ్మాయి, "మేడం మీరు నిశ్చింతగా ఉండండి. సరిగ్గా నెలరోజుల్లో మీవారిని అద్భుతంగా తీర్చిదిద్దకపోతే అడగండి" అంది.
"మీరు ఇలా రండి సార్" అంటూ పిలిచింది కనకారావు ని.
"ఆ షర్ట్ ప్యాంటు తీసి పక్కన పెట్టండి" అంది. భార్య ఎదురుగ, అదీ మరో అమ్మాయి ముందు అలా బట్టలు ఎలా విప్పగలడు.
"ఒసేయ్, రాక్షసీ ఏంటే ఇదంతా" అంటూ లత వైపు చూసాడు.
"మీరు పక్కగదిలో కూర్చోండి మేడం. సర్ సిగ్గుపడుతున్నారు" అంది ఆ అమ్మాయి.
లత పక్కగదిలోకి వెళ్ళాకా ఆ అమ్మాయే కనకారావు చొక్కా బనీను ప్యాంటు ఊడదీసి, "ఆ టేబుల్ మీద పడుకోండి సర్" అంది.
ఆమెను చూసి వంకర్లు తిరిగిపోతున్న అతన్ని అమాంతంగా ఎత్తి బల్లమీద పడుకో పెట్టింది. ఆమె బలానికి కనకారావు నోరు వెళ్ళబెట్టాడు. అతణ్ణి పడుకోమని చెప్పి, ఆమె ఏవేవో ఆయిల్స్ ఒక గిన్నెలో వేసి బాగా కలిపి, కనకారావు ఒంటికి పట్టించింది. ఆహా ఎంత సమ్మగా ఉందో అనుకున్నాడు అతను.
తరువాత మెత్తగా చపాతీ పిండి పిసికినట్లు కనకారావు ని ఒక్క అంగుళం కూడా ఖాళీ ఇవ్వకుండా, పిసికేసి, ఆ బల్లకేసి బట్టలుతికినట్లు ఉతికి చివరిగా కాళ్ళూ చేతులూ నాలుగైదుసార్లు మెలి తిప్పి, "ఇంక బట్టలు వేసుకోండి సర్, రేపటినుండి ఇలా సిట్టింగ్ ఉంది" అంటూ చెప్పింది.
కనకారావు కి లేచి నిలబడితే కాళ్ళు గజగజ వణికిపోతూ ఉంటే, పాక్కుంటూ తన బట్టలు తీసుకొని అలాగే పాక్కుంటూ పక్కగదిలోకి వెళ్ళాడు. పాక్కుంటూ వస్తున్న వింతజీవిలా ఉన్న భర్తని చూసి కెవ్వున కేకపెట్టింది లత. ఒళ్ళు హూనమైన కనకారావు ఆ అరుపులకు మరింత కంగారుపడిపోయాడు.
"నేను చచ్చిపోతాను. నాకు అవేమీ ఒద్దు" అంటున్నా, లత వినకుండా నలభై వేలు కట్టేసింది. రోజూ ఆఫీస్ అయిపోయాక నేరుగా జిమ్ కి రావడం, అమ్మాయి చేత సమ్మగా మసాజ్ చేయించుకుంటూ, సరిగ్గా నెల తిరిగేసరికి, కనకారావు బొజ్జ గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయింది. కనకారావు కూడా బాగా రంగుతేలిన మామిడిపండులా తయారయ్యాడు. "పోతే డబ్బులు పోయాయి కానీ ఎందుకో ప్రైజ్ మనదే అనిపిస్తోంది లతా" అన్నాడు పోటీలకు ముందురోజు రాత్రి.
"మధ్యాహ్నం మూడు గంటలకు మనం క్లబ్ కి వెళ్తున్నాం" అంటూ కనకారావుని హెచ్చరించింది లత. సరిగా నాలుగు గంటలకు కార్యక్రమం మొద లైంది. సభకి అధ్యక్షత వహించిన వర్ష బాడీబిల్డింగ్ ఆవశ్యకతని అనర్గళంగా ఒకగంటసేపు ప్రసంగించింది. అందరూ ఆసక్తిగా ఆమె మాటలు విన్నారు. తరువాత ప్రదర్శనలు మొదలయ్యాయి.
ముందు గా వచ్చిన ఒకరిద్దరు పెద్ద పెద్ద పొట్టలు, బట్టతలలతో వస్తే, తరువాత వచ్చినవారు సన్నగా పుల్లల్లాగా ఉండి ఎవరినీ ఆకట్టుకోలేకపోయారు. తరువాత హర్ష ఎంతో గొప్పగా చెప్పుకున్న వాళ్ళాయ న వచ్చి పరవాలేదన్పించి వెళ్ళాడు. చివర్లో మొత్తం కార్యక్రమానికే హై లైట్ అంటూ పొగుడుతూ ఉంటే స్టైల్ గా ప్యాంటు షర్ట్ తో నీట్ గా వచ్చాడు కనకారావు.
కనకారావు స్టైల్ కి అందరూ నోళ్లు తెరుచుకొని చొంగకార్చుకుంటూ చూస్తూ ఉన్నారు. కనకారావు ఒక్కొక్కటే విప్పుతూ కండలు ప్రదర్శించసాగాడు. ముందుగా షర్ట్ తీసి, గాల్లోకి తిప్పుతూ, ఒకపక్కగా పడేసాడు. "ఏమో అనుకున్నాను కానీ మీ ఆయన చాల సెక్సీ" అంటూ హర్ష లత చెవిలో గుసగుస లాడింది, కన్ను గీటుతూ. తరువాత పాంట్స్ కూడా తీసి అలాగే చాల సేపు డయాస్ మీద అటూ ఇటూ తిరుగుతూ ఒడుపుగా బనియన్ కూడా తీసి పడేసాడు.
ఆడవాళ్ళంతా ఈలలు వేస్తూ, చప్పట్లు కొడుతూ అతణ్ణి ఉత్సాహపరుస్తూ ఉంటే, తన భర్త పెర్ఫార్మన్స్ కి లత ఉబ్బితబ్బిబ్బైపోతోంది.
ఈ ప్రపంచానికి మహారాణి అయిపోయినట్లు ఆమె గాల్లో తేలిపోతోంది. సరిగ్గా అప్పుడే ఎక్కడినుండి ఊడిపడ్డారో అరడజన్ మంది పోలీస్ లు వచ్చి, కనకారావు చేతులు వెనక్కి విరిచి పట్టుకొని, "స్ట్రిప్ టీసింగ్ చేస్తున్నావు పదా" అంటూ, అలాగే తీసుకెళ్లి జీప్ లో పడేసారు.
"నేను బాడీ బిల్డింగ్ పోటీలకు వచ్చాను" అని చెప్పినా వినకుండా "ఆడవాళ్ళ క్లబ్ లో నీకు బాడీ బిల్డింగ్ పోటీలేంటి" అంటూ రెండు తగిలించి జీప్ లో కూర్చోపెట్టారు.
పోలీస్ లని చూడగానే చాలామంది అక్కడి నుండి జారుకున్నారు. పాపం లత ఇదంతా తమ ఏర్పాటు అంటూ ఏదో చెప్పబోతే ఆమె ఏమైనా చెప్పాలనుకుంటే, స్టేషన్ కి వచ్చి చెప్పమని చెప్పాడు ఎస్సై. పోనీ బట్టలన్నా వేసుకోనివ్వండి ఎస్సై గారూ అంటూ కనకారావు ప్రాధేయపడినా వినిపించుకోలేదు పోలీసులు. స్టేషన్ కి తీసుకెళ్ళి రెండు కోటింగ్స్ ఇచ్చి, ఒక మూల నిలబెట్టారు కనకారావు ని. గజగజా వణుకుతూ, తనని ఎవరు విడిపిస్తారా అని ఎదురుచూడసాగాడు.
ఏదో పనిమీద స్టేషన్ కి వచ్చినవాళ్లు కనకారావు ని చూసి జాలిపడుతూ, తమలో తామే నవ్వుకుంటూ వెళ్ళసాగారు. కొంతసేపటికి లత అక్కడికి చేరుకొని, ఎస్సై గారికి అంతా వివరించి, ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని రాసి ఇచ్చాక కనకారావు ని విడిచిపెట్టాడు ఎస్సై. బతుకు జీవుడా అనుకుంటూ భార్య తెచ్చి ఇచ్చిన బట్టలు వేసుకొని ఇంటిముఖం పట్టాడు కనకారావు.
***
P. గోపాలకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కి text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
ప్రొఫైల్ లింక్: https://www.manatelugukathalu.com/profile/gopalakrishna
యూట్యూబ్ ప్లే లిస్ట్ లింక్:
నా పేరు గోపాలకృష్ణ. పుట్టింది, పెరిగింది శ్రీకాకుళం జిల్లా లో. చిన్నప్పటినుండి కథలూ,కవితలూ, రాయడం చదవడం ఇష్టం. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. నా తల్లిదండ్రులు చిన్నప్పటినుండి ఇచ్చిన ప్రోత్సాహమే రచనావ్యాసంగాన్ని అంటిపెట్టుకొనేలా చేసింది. 'ఆ అమ్మాయి..' కథ ఈ సైట్ లో నేను రాస్తున్న ఆరవ కథ. నా కథలను తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
Comments